అచ్చతెలుగు సినీ దుష్ట దుర్మార్గుడు – రావుగోపాలరావు
పరవస్తు నాగసాయి సూరి ( చాణక్య )
తెరపై కనిపించేది కాసేపైనా.. ఆ పాత్రలోని గాంభీర్యం, ఔచిత్యం దెబ్బతినకుండా.... ఎప్పటికీ జనహృదయాల్లో నిలిచిపోయే కొద్దిమంది కళాకారుల్లో రావుగోపాలరావు ఒకరు. విలనిజాన్ని .... ఉదాత్తత, వైవిధ్యం నిండిన పాత్రల్ని అలవోకగా పండించగల వెండితెర దిగ్గజమాయన. గుణచిత్ర నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ నటవిరాట్ జయంతి జనవరి 14న.
జనవరి 14 1937లో తూర్పుగోదావరి జిల్లా గంగనపర్రు గ్రామంలో రావుగోపాలరావు జన్మించారు. చదువుకునే రోజుల్లోనే స్నేహితుల ప్రోత్సాహంతో ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. చదువుకునే రోజుల్లో నటన పట్ల ఆసక్తితో తానే స్వయంగా " అసోసియేటెడ్ ఆమెట్యూడ్ డ్రామా కంపెనీ' స్థాపించాడు రావుగోపాలరావు. ఆ నాటకాలు చూసిన ఎస్వీ రంగారావు మెచ్చుకుని... గుత్తా రామినీడు నిర్మిస్తున్న భక్తపోతన చిత్రంలో... మామిడి సింగనామాత్య పాత్రకు రావుగోపాలరావుని సిఫార్స్ చేశారు. ఆ పాత్రలో నటిస్తూ... ఆ సినిమాకి సహాయ దర్శకుడిగానూ పనిచేశారు. భమిడిపాటి రాథాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో రావుగోపాలరావు నటన చూసిన నిర్మాత మురారి... తన తర్వాతి చిత్రం జగత్ కిలాడీల్లో అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమాలో ఆయన కంఠస్వరం బాగోలేదని మురారి ఆయకు డబ్బింగ్ చెప్పారు. చిత్రమేమింటే... ఆ తర్వాతికాలంలో రావుగోపాలరావు తన కంఠంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన వాయిస్ కు ఎలాంటి ఛాయిస్ లేదని చాటిచెప్పారు. జగత్ కిలాడీలు తర్వాత మరికొన్ని చిత్రాల్లో రావుగోపాలరావు నటించినా... ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం " ముత్యాలముగ్గు'. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రావుగోపాలరావుకు అఖండ ఖ్యాతిని సంపాదించి పెట్టింది. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ఎప్పటికీ నిత్యనూతనమే. కొత్తవారికి మార్గదర్శకమే. SPOT
ఎప్పుడైనా నాయకుడి విలువ పెరిగేది ప్రతినాయకుడి విలనిజం వల్లే. 70, 80 దశకాల్లో హీరో ఎవరైనా విలన్ మాత్రం రావుగోపాలరావే. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాల్లో ప్రధాన విలన్గా ఆయన నటన ఎప్పటికీ చిరస్మరణీయమే. యమగోల, వేటగాడు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం తదితర చిత్రాలు ఈ కోవకు చెందినవే. శోభన్ బాబుతో జగత్ జెట్టీలు, శారద, స్వయంవరం, దేవత వంటి విజయవంతమైన చిత్రాల్లోనూ... చిరంజీవితో ఖైదీ, హీరో, ఛాలెంజ్, దొంగ, రాక్షసుడు, కొండవీటి దొంగ వంటి జయకేతనం ఎగురవేసిన సినిమాల్లోనూ రావుగోపాలరావు తన సత్తాను చాటుకున్నాడు. చింరజీవి, రావుగోపాలరావు కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్, మగ మహారాజు చిత్రాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
రావుగోపాలరావు పేరు వినగానే మన కళ్లముందు అన్ని రకాల పాత్రలు దర్శనమిస్తాయి. ఏ పాత్ర చేసినా ఏ వేషమేసినా, ఏ మాట చెప్పినా అందులో వైవిధ్యం చూపడం ఆయనే చెల్లింది. తన నటనతో ప్రతినాయకుడిగా ప్రేక్షకులను మెప్పించారు రావుగోపాలరావు. విలక్షమైన డైలాగ్స్ తో నటనకే విరాట్ గా నిలిచారు. అంతేకాదు కామెడీతో కడుపుబ్బా నటించారు కూడా. 1987లో నాగయ్య అవార్డును, 1990 ఏడాదిలో కళాప్రపూర్ణ పురస్కారాన్ని అందుకున్న రావుగోపాలరావు మంచి నిర్మాతకూడా. స్టేషన్ మాస్టర్, లారీ డ్రైవర్, భార్గవరాముడు, వింత దొంగలు వంటి చిత్రాలను నిర్మించారు. 1994 ఆగస్ట్ 13న రావుగోపాలరావు... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన లేకున్నా... రావుగోపాలరావు జీవం పోసిన పాత్రలు మాత్రం మనకళ్లముందే కదలాడుతూ... చిరయశస్సుతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. తర్వాతి తరాల నటులకు దిక్సూచిగా మారుతాయి.
No comments:
Post a Comment