రుద్రదండం -12 - అచ్చంగా తెలుగు

రుద్రదండం -12

Share This

రుద్రదండం -12

రాజ కార్తీక్

9290523901


(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతుండగా ఆమె పరాకును గమనించిన శివుడు, కోపించి, తన చేతిలో ఉన్న రుద్ర దండాన్ని విసిరివేస్తాడు. అది ముక్కలై జంబూద్వీపంలో అనేకచోట్ల పడుతుంది. అవన్నీ దక్కించుకుని, జోడించిన వాడు శివుడే అవుతాడు. రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కపాలుడు. కాశీ నగరంలోని శివాలయంలో  రుద్రదండాన్ని సాధించబోయే కారణ జన్ముడు పుడతాడు… ఆ సమయంలో అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు ఒక ఒంటి కన్ను రాక్షసుడు… ఆ రాక్షసుడిని బారి నుంచి రాజకుటుంబాన్ని, ప్రజల్ని రక్షిస్తాడు విష్ణునంది అనే ముని. బాలుడికి రుద్రసేన కార్తికేయుడు అని పేరు పెడతారు. అతడు శివపాద మహర్షి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తూ, పెరిగి పెద్దై, ఒక మదమెక్కిన గుర్రాన్ని నిరోధిస్తూ, ఒక జలపాతం వద్దకు చేరతాడు. అక్కడ ఒక యువతిని రాక్షసుడి బారినుంచి రక్షిస్తాడు.ఇక చదవండి...)
“ఏమి ఆ సందేహం ? “అంది రాకుమారి.
 “మీ రాజ్యంలో పరిచయం అయిన వెంటనే పేరు చెప్పరా?” అడిగాడు రుద్రుడు.
రాకుమారి నవ్వుతూ “వీరుడా! అందరికీ పేరు చెప్పము, కానీ నా మాన,ప్రాణాలు కాపాడిన మీకు చెప్పుట సమంజసమే, నా నామధేయం  “భావనాదేవి” అంది.
రుద్ర “ మిమ్ము చూస్తే ఎన్నో భావనలు కలుగుతాయి రాకుమారి, అందుకేనేమో మీకు “భావన” అని పేరు పెట్టారు,” అన్నాడు.
రాకుమారి “అది సరే, ఈ వస్త్రములు నాకు బాగా నచ్చినవి, దయచేసి ఇటువంటివి కొన్ని నాకు చేసి ఇవ్వు వీరుడా!......  అంతియే కాదు రుద్రా.. మా తండ్రిగారితో నీవు చేసిన సహాయము చెప్పి, మా రాజ్యంలో నీకొక మంచి కొలువు ఇప్పించగలము,” అంది.
రుద్రుడు “నేను రాకుమారుడను” అన్న మాట అనబోయి, చలాకీగా, “నేను వస్త్రములు ఇచ్చినంత మాత్రానికే మీరు నాకు జీవనాధారం కల్పించడం, ఎంతైనా మీరు దయార్ద్రులు రాకుమారి” అన్నాడు.
“పరోపకారం మా రాజవంశంలోనే ఉంది !” అన్నది రాకుమారి.
సూర్యకాంతి రాకుమారి మోముపై పడుతుండగా, వీచిన చిరుగాలికి అటుగా ఉన్న చిలుకలు రాకుమారి భుజాల మీద వాలగా,  రాలిన పూలు ఆకులు రాకుమారిపై పడి, చిరునవ్వుతో ఉన్న భావనాదేవి రూపం చూసి రుద్రుడు ముగ్దుడు అయ్యాడు.
రుద్రుడు “రాకుమారి ! మీరు మీ అంతరంగిక మందిరంలో పక్షులను పంజరంలో పెడతారా”, అయినా మీరు అటువంటి పని చేయకండి, పంజరంలో లేకపోయినా అవి మీ చుట్టే తిరుగుతాయి. మీ నవ్వు,  మనసు అనే పంజరాన్ని కూడా చేధిస్తుంది.” అన్నాడు.
 రాకుమారి రుద్రుడి మాటలకు సిగ్గుపడి , “అటులనే, ఇక మీ పొగడ్తలు ఆపి మా రాజ్యమునకు ఎటుల పోవలయునో చెప్పుము” అన్నది.
రుద్ర “తప్పకుండా రాకుమారి, కానీ మీరు మీ రాజ్యమునకు వెళ్ళిన తర్వాత, ఇక మిమ్మల్ని కలవలేము అని తలచుకుంటే కొంచెం బాధగా ఉంది.” అంటూ తన నుదుటిపై పడిన జుట్టుని సవరించుకున్నాడు.
రుద్రుడి  నుదుటిపై విభూది రేఖలవలె ఉండడం చూసి రాకుమారి ఆశ్చర్యపడి, రుద్రా, “ఏమి ఈ విభూది రేఖలు, నీవు శివవరప్రసాదివా? అందుకే అంత శౌర్యం ఉన్నదా ?” అన్నది.
రుద్రుడు తన వివరణ పెద్దగా ఏమి తెలపకుండా “పుట్టుకతో వచ్చాయి” అని మాత్రమే చెప్పాడు. ఎందుకంటే పద్మ పట్టణ రాకుమారిని కనిపెట్టడం రుద్రయువరాజుకి పెద్ద విషయం కాదుగా.
భావనాదేవి “రుద్రా, నా జాతకమును గుణించి, నాకు శివవరప్రసాదితో కల్యాణం జరుగుతుంది అని చెప్పారు”, అని రుద్రునికి తెలపాలని మనసులో ఉన్నా, ఆ విషయం ప్రస్తావించలేదు.
 రుద్రుడు ,”మీతో పరిచయం నాకెంతో ఆనందంగా ఉంది రాకుమారి. ఈ చిన్ని వీరుణ్ణి గుర్తుపెట్టుకుంటారుగా” అన్నాడు. ఆ.. ఆ.. అన్నది రాకుమారి.
ఇంతలో వచ్చారు కొంత మంది భటులు, వారితో పాటు శివపాదమహర్షి. యువరాణిని చూసిన భటులు ఒక ఉదుటున వెళ్ళి రుద్రుడి మీద కత్తులు పెట్టారు. యువరాణి “ఆగండి భటులారా, అతను నా ప్రాణాలను కాపాడి, రాక్షసుణ్ణి సంహరించిన వీరుడు “ అంది. ఆ భటులు రాకుమారుడు రుద్రుడికి ధన్యవాదాలు తెలిపారు.
అటుగా చూసిన రుద్రుడు,” గురుదేవా ప్రణామాలు !” అని గుర్రం దిగి, రాకుమారి కథ అంతా శివపాదుడికి చెప్పాడు, అందరూ ఆశ్రమానికి వెళ్ళారు . అక్కడ భటులు, కొంత మంది చెలికత్తెలు వచ్చారు. శివపాదుడు అందరికి విందు ఇచ్చాడు. ఇక రాకుమారి బయలుదేరే సమయం వచ్చింది. శివపాదుడు “ రుద్రా , నీ విద్యాబ్యాసం పూర్తి అయింది, ఇక నువ్వు దేనికోసం జన్మించావో, ఆ పని చేయవలసి ఉంది. నీ తల్లిదండ్రులకు కబురు పెడతాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు నాయనా” అన్నారు బాధతో.
          రుద్ర “గురుదేవా నా తల్లిదండ్రులకన్నా నాకు మీరంటే ఇష్టం, మిమ్ము వదిలి పోతున్నందుకు నాకు బాధగా ఉంది. మనసులో మీరంటే ఇష్టం ఉన్నా, ప్రత్యక్షంగా మీరు ఉండరు కదా ! అందుకే,  నా దగ్గరికి వచ్చేయండి గురుదేవా, అక్కడ మారాజ్యంలో ఆశ్రమం స్థాపించుకొని, అక్కడే శిక్షణ ఇద్దురుగాని”, అన్నాడు కన్నీటితో.
శివపాదుడు  “సమయం వచ్చినప్పుడు అలాగే వస్తాను ... మీ తల్లిదండ్రులకు కబురుపెట్టనా” అన్నారు.
రుద్ర “లేదు స్వామి, నేను వెళ్ళి వాళ్ళని ఆశ్చర్యచకితులను చేస్తాను” అన్నాడు.
రాకుమారి వచ్చి “రుద్రా, గురుదేవా, నన్ను కాపాడినందుకు కృతఙ్ఞతలు , మా రాజ్యమునకు రండు, ఇదే మా ఆహ్వానము అన్నది....
రుద్ర “రాకుమారి భావనాదేవి, తప్పకుండా ! “అని రాకుమారి ఇష్టపడిన వస్త్రములు ఇచ్చాడు.
రాకుమారి “ఇక సెలవు” అన్నది చిరునవ్వుతో .
రుద్ర “పద్మపట్టణ యువరాణి సెలవు”....
రుద్రుడు కూడా గురుదేవుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరబోయాడు. గురుదేవులు రుద్రున్ని పిలిచి “నాయనా! ఈ ఉంగరం ధరించు, ఎప్పుడూ తీయకు, దీని మహాత్యం నీకు నిజమైన అవసరం వచ్చినపుడు అర్ధం అవుతుంది .”అంటూ...
“న్యాయాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని, నిజాయితిని, భక్తిని, సంకల్పాన్ని, పట్టుదలను, ఆశయాన్ని వదలవద్దు. మునుముందు నీకు ఎదురుకాబోయే సంఘటనలు, సాహసాలు, అనితరసాధ్యమైనవి... ఈ ఉంగరం జాగ్రత్త, నీవు విజయుడవై రా..” అని ఆశీర్వదించాడు. రుద్రుడు, అతని స్నేహితుడు భట్టు, ఇద్దరూ ప్రథమ శివ పట్టణానికి బయలుదేరారు.. ఇక అసలు కథ మొదలు కాబోతోంది...
(సశేషం...)

No comments:

Post a Comment

Pages