రుద్రాణి రహస్యం
సూర్య. పి .కుకునూర్
అది ఒక పున్నమి రోజు....
తలకోన దగ్గర ఒక గ్రామంలో సంతను ముగించుకున్న కోయ గుంపు, తమ గూడేనికి ఎర్రబస్సులో తిరుగు ప్రయాణం అవుతున్నారు....
దారిలో ఇద్దరు విదేశీయులు బస్ ఎక్కి, రుద్రాణి కోనకు టికెట్లు ఇమ్మని అడిగారు.
“రుద్రాణి కోన”, పేరు వినగానే బస్ లో ఉన్న అందరూ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూసారు. ఆశ్చర్యం కంటే భయం ఎక్కువగా కనిపించటంతో, విదేశీయులు ఇద్దరూ “మీ భయానికి కారణం ఏంటి ?” అని అడిగారు.
“ఆ కోన అమ్మ చోటు, ఆ చోటుకి చీకటి వేళ , అది కూడా పున్నమి వేళ వెళ్తే అమ్మ కోపం చూపిస్తుంది , కోన చుట్టూ పెద్దసింహం , అయిదు తలల కాల సర్పం కాపు కాస్తూ ఉంటాయి. ఇప్పటివరకూ రాత్రిళ్ళు అక్కడికి వెళ్ళినవాళ్ళు తిరిగి రాలేదు,” అన్నారు వాళ్ళు.
అది విన్న ఇద్దరూ, అవన్నీ కట్టు కధలని కొట్టి పారేసి, రుద్రాణి కోన అని కనిపిస్తున్న రాయి దగ్గర దిగారు. వారి వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లాంటి సాధనం లో GPS ఆన్ చేసుకుని , చేతిలో ఉన్న మ్యాప్లో ప్రదేశాన్ని పరీక్షించుకుని, వెళ్ళాల్సిన దారిని నిర్ధారించుకుని పదునైన ఆయుధాలతో గుబురుగా ఉన్న పొదలను దారి చేసుకుంటూ వెళుతున్నారు. వారు పొదల నుండి లోపలికి వెళ్ళగానే, పెద్ద కాల సర్పం రుద్రాణి కోన రాయిని చుట్టుకుంది. వారు దారి చేసుకున్న పొదలు, తిరిగి ఆ దారిని వారి వెనకగా మూసి వేస్తున్నాయని తెలియని ఇద్దరూ, కోన లోపలికి వెళుతున్నారు...
అప్పటివరకు ఆకాశంలో మేఘాల చాటుగా నున్న పున్నమి చంద్రుడు, మేఘాలు తెరలిపోవటంతో వెలుగులు చిమ్ముతున్నాడు. గాలి ఉదృతంగా వీచటం మొదలయింది. ఒక్కసారిగా కోన అంతటా ప్రకాశ వంతమైన వెలుగు ప్రసరించసాగింది. గజ్జెల చప్పుడు, ఘంటానాదం శబ్దాలు చిన్నగా మొదలయ్యి, కోన అంతటా ప్రతిధ్వనిస్తూ ఉంది. సింహం గాండ్రింపులతో కోన అంతా దద్దరిల్లిపోతోంది. గూడెం నుండి కోనలో వెలుగును చూసిన కోయ వాళ్ళు నమస్కారం చేసుకుని, సింహం గాండ్రింపుకి భయంతో ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. ఆ మార్పులు అర్ధం కాని విదేశీయులు, వెంట తెచ్చుకున్న ఆయుధాలను చేతుల్లోకి తీసుకుని ముందుకు వెళుతున్నారు. మెరుపులా ఒక వెలుగు ఇద్దరిపై దాడి చేయటంతో క్షణంలో ఇద్దరూ బూడిదయిపోయారు. విదేశీయులు ఒక చోట పార్క్ చేసిన వ్యాన్ ను కాలసర్పం బూడిద చేసేసింది.
కోనలో జరిగిన బీభత్సానికి గుర్తుగా పడి ఉన్న ట్యాబ్ ని చూసిన కోయ గుంపు, ఆ సాధనాన్ని వారు ‘అయ్యోరు’గా పిలిచే యోగి ముందర పెడతారు. యోగముద్రలో ధ్యానం చేసుకుంటున్న అయ్యోరు కళ్ళు తెరచి అమ్మ వారిని ప్రార్ధించి , ఆ కోన నియమాన్ని చెదరగోట్టేది సాధనమైనా, మనిషైనా మసి అయిపోవలిసిందే, అంటూ సాధనాన్ని మసి చేసేస్తాడు . కోయగుంపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్న అయ్యోరికి మొక్కి వెళ్ళిపోయారు.
***********
జరుగుతున్నదంతా ఒక ఖరీదయిన కాన్ఫరెన్స్ రూంలో ప్రొజెక్టర్ స్క్రీన్ లో చూస్తున్న ఫ్రెడ్రిక్ , ప్రొజెక్టర్ పై బ్లాంక్ స్క్రీన్ రావటంతో, ఆశ్చర్యపోతాడు. అప్పటికి అది పదవ సారని, తర తరాలుగా ఆ కోన లో దాగి ఉన్న సంపదను సొంతం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమవుతున్నారని విసుక్కుంటూ, స్క్రీన్ పైకి చేతిలోని వైన్ గ్లాస్ ను విసిరి కొడతాడు. అతని బాధను అర్ధం చేసుకున్న ,అతని బిజినెస్ పార్టనర్ విలియమ్స్, ఫ్రెడ్రిక్ వద్దకు వచ్చాడు. మనుషుల మేధకు అందని ఇటువంటి విషయాలు క్షుద్రపూజలు చేసేవారు అవలీలగా చెప్పగలరు, అంటాడు. ఫ్రెడ్రిక్ కు ఇష్టం లేకపోయినా బ్లాక్ మ్యాజిక్ చేసే అత్రిక దగ్గరకి వెళదామని సలహా ఇచ్చాడు విలియమ్స్. మరొక మార్గం కనిపించని ఫ్రెడ్రిక్ అత్రిక దగ్గరకి వెళ్ళాడు.
నడివయసులో ఉన్న అత్రిక మామూలు స్త్రీలాగే ఆహార్యం ధరించి ఉంది, ఆమెలో మంత్రగత్తె ఛాయలు ఎంతమాత్రం లేవు. అతిసాధారణంగా కనిపించే అత్రిక అసలు తమకు సాయం చెయ్యగలదా అని సందేహించాడు ఫ్రెడ్రిక్. వాళ్ళనుంచి విషయం తెలుసుకున్న అత్రిక, తన గదిలో ఒక బల్లపై అమర్చి ఉన్న నీలి రంగు క్రిస్టల్ బాల్పై, చేతులు తిప్పి, మంత్రాలు జపిస్తూ, ఆ రహస్యాన్ని చూసేందుకు ప్రయత్నిస్తుంది. కాని, ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆమెకు ఎటువంటి సమాచారం దొరక లేదు. రుద్రాణి కోన రహస్యం గురించి, అక్కడి శక్తిని తెలుసుకోవటం అంత సులువు కాదని ఆమెకు అర్ధమవుతుంది.
“నా వల్ల కావట్లేదు, ఆ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నా శక్తిని, ఏదో దివ్యశక్తి అడ్డుకుంటోంది. “ అంది అత్రిక.
“పోనీ, ఆ రహస్యం తెలుసుకోవడం ఎవరికి సాధ్యం అవుతుందో చెప్పగలవా ?” అడిగాడు విలియమ్స్.
మళ్ళీ నీలి రంగు క్రిస్టల్ బాల్ వద్ద మంత్రజపం చేస్తూ, ప్రయత్నిస్తుంది. ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా నిర్వీర్యం అయిపోతుంది.
దానితో ఆమె, “ నా శక్తి వల్ల కావట్లేదు, ఇండియాలో ఉన్న నా గురువు తంత్రిణిని కలవండి,” అని చెపుతుంది. దానితో ఆమెను కలిసేందుకు భారత్ కు బయలుదేరతారు వారంతా...
*****
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ .. హైదారాబాద్ ..
కమిషనర్ రవీంద్రనాథ్ మౌనంగా అతని గది కిటికీ నుండి కనిపిస్తున్న సిటీని చూస్తుంటాడు. ‘సార్ .. పిలిచారట,’ అంటూ అసిస్టెంట్ కమిషనర్ ప్రవల్లిక ఆ గదికి వెళ్ళింది .
“ అవును, ఒక ముఖ్యమైన విషయం చెబుదామని పిలిచాను. ఒకరు మొదలు పెట్టినది మరొకరు పూర్తి చేయటమే విధి నిర్ణయించిన రాత అనుకుంటాను ప్రవల్లిక...” అంటూ ఆమెవంక చూసారు రవీంద్రనాథ్.
ప్రవల్లిక అయోమయంగా చూస్తూ, ‘అర్ధం కాలేదు సార్’ అంది.
“మీ నాన్న నాకు కొలీగ్ మాత్రమే కాదు, మంచి మిత్రుడు కూడా ! ఆయన రుద్రాణి కోన అస్సైన్మెంట్ ని టేక్ అప్ చేసినపుడు, అందరితో పాటు నేను కూడా అభ్యంతరం తెలియచేసాను. మీ నాన్న ఎవరి మాటా వినలేదు. ఆ రహస్యంతో పాటు తను కూడా ఒక రహస్యం గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని చేధించే బాధ్యతని నీకు అప్పగించారు . జరిగినవన్నీ తెలిసి కూడా, నిన్ను అక్కడికి పంపించటం అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు...”
ఆయన తన సంభాషణ పూర్తి చేయకుండానే, “నేను రేపే చార్జ్ తీసుకుంటాను సర్” అంది ప్రవల్లిక ధృడంగా!
“ కానీ అన్నీతెలిసి కూడా....”
“ఇది నేను సాహసం అనో రిస్క్ అనో ఒప్పుకోవట్లేదు సర్ , నా బాధ్యతని పూర్తి చేసుకోవడానికి అంది వచ్చిన అవకాశం నమ్ముతున్నాను,” అని ప్రవల్లిక స్పష్టంగా చెప్పటంతో రవీంద్రనాథ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.
*****
ఫ్రెడ్రిక్ , విలియమ్స్ , అత్రికలు వారి బృందంతో హైదరాబాద్ లో ఉన్న తంత్రిణిని కలిసారు.
ఆశీస్సుల కోసం వందనం చేసిన అత్రిక తలపై చేయి వేసిన తంత్రిణి , అత్రిక మనసులో ఉన్నది వారు చెప్పకుండానే పసికట్టింది. వారు ఆమెను ఎందుకు కలవాలని వచ్చారో, తంత్రిణి చెప్పటంతో ఆమె శక్తికి ఫ్రెడ్రిక్ , విలియమ్స్ ఆశ్చర్యానికి లోనవుతారు.
తంత్రిణి తన తంత్ర శక్తితో మంత్రం చదువుతూ రంగులద్దిన ముగ్గు మధ్య ఉన్న చక్రం పై గవ్వలను విసిరింది. యక్షిణిని ఆవాహన చేసి, రుద్రాణి కోన రహస్యాన్ని చెప్పమని అడుగుతుంది.
ముగ్గు మధ్యనుంచి, తెల్లటి పొగ లేచింది. అందులోంచి, యక్షిణి ప్రత్యక్షమై “తంత్రిణి ! రుద్రాణి కోనలో నిద్రాణంగా ఉన్న శక్తిని సొంతం చేసుకోవాలంటే, మానవ మాత్రులైన వారివల్లనో, వారు చేస్తున్న ప్రయత్నాల వల్లనో పూర్తి కాదు. 21 సంవత్సరాల ముందు వచ్చిన బ్రహ్మ ముహూర్తం లో తెలుగు గడ్డ పై ఒకే నక్షత్రంలో, ఒకే రోజు, ఒకే సమయంలో, కారణ జన్ములుగా పుట్టిన ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది,” అని చెప్పింది.
“అంతే కాదు తంత్రిణి ! వారిలో ఒకరి భుజం పై చంద్రుడుమచ్చ , మరొకరి భుజం పై సూర్యుడి మచ్చ ఉంటాయి. ఒకరి ప్రమాదం మరొకరి వల్ల తప్పిపోతుంది . వారి కలయికకు ప్రకృతే పులకిస్తుంది,” అంది యక్షిణి.
“వారి వివరాలు ఏమిటి ?” అని అడుగుతూ ఇండియా మ్యాప్ పై పాచికలా ఉన్న పుర్రె ను విసిరింది, తంత్రిణి.
ఆ పుర్రె తిరుగుతూ తిరుగుతూ వేగం పెరిగి, పేలిపోయింది. యక్షిణి వెంటనే, “వారిద్దరి వివరాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మహిమ గల శక్తి ఏదో అడ్డుకుంటున్నది. అది తెలుసుకోవాలంటే హోమం చేసి యంత్రిణి ని ప్రసన్నం చేసుకోవాలి,” అని చెప్పి అంతర్ధానమవుతుంది.
వారి వివరాలు తెలుసుకోవడం ఎలా అని మధనపడుతున్న ఫ్రెడ్రిక్ మనసులోని భావం తెలుసుకున్న తంత్రిణి ,”ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంటుంది. ముందుగా, 21సంవత్సరాల ముందు వచ్చిన వైశాఖ పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఆంధ్ర దేశంలో పుట్టిన వారి వివరాలు తెలుసుకోగలిగితే మొదటి మజిలీ సొంతమవుతుంది,” అంటూ అతడి కళ్ళలోకి చూస్తూ చెప్పింది.
ఫ్రెడ్రిక్ వెంటనే అతడి ట్యాబ్ తీసి , తన టీం కి ఇలా సందేశం పంపుతాడు.
“1992 సంవత్సరం మే 21 న అన్ని ఊర్లలో , అన్ని హాస్పటల్ రికార్డులు , జనాభా లెక్కల్లో చేర్చిన వివరాలు , బర్త్ సర్టిఫికేట్ లు, లైసెన్స్ లు, వోటర్ ఐడెంటిటీ లు ఏది వదలకుండా వెతకండి,” అని చెప్పాడు.
*****
శ్రీని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇంజినీరింగ్ ..
కాలేజ్ గడియారం పై పది గంటలు కొడుతుంటే , ఎం.బి.బి.ఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నసృష్టి, కాలేజ్ టైం అయిపోవటంతో గేటు మూసేస్తుండటం చూసి, కంగారుగా స్కూటీ క్లచ్ ని రేజ్ చేసింది . క్లచ్ వైర్ తెగిపోవటం తో అదుపుతప్పి పడబోతుండగా, ఆమెకు ఎడమ పక్కగా బైక్ పైవెళుతున్న అద్భుత్, సృష్టిని, బైక్ ని పడకుండా ఆపి, జాగ్రత్తగా తీసుకెళుతూ భయంతో కళ్ళు మూసుకుని ఉన్న సృష్టిని చూస్తూ ఉంటాడు....
(సశేషం...)
No comments:
Post a Comment