సత్యమహిమ - అచ్చంగా తెలుగు

సత్యమహిమ

Share This

సత్యమహిమ.

ఆదూరి హైమవతి


పూర్వం ' ‘సత్యావాసం’ ' అనే ఊరిలో అంతా సత్యమే చెప్పేవారు. సత్యం చెప్పేవారంతా ఉండే ఊరుగనుక ఆ ఊరికి ’‘సత్యావాసం’‘ అనే పేరు వచ్చిందిట!  ఆ ఊర్లో సాంబయ్య అనే ఒక పాతికేళ్ళధనికుడు ఉండేవాడు. అతడికింకా పెళ్ళీపేరంటం కాలేదు. అతడితో పాటుగా ఆ ఊర్లో మరికొందరు తనలాంటి ధనికులు ఉండటం అతడికి గిట్టేది కాదు. అసూయతో అల్లాడిపోసాగాడు. తానే అందరికంటే అధిక ధనవంతుడిగా ఉండాలనే కోరిక రోజురోజుకూ పెరగసాగింది. దాంతో ముందుగా పొదుపు పాటించసాగాడు. ఆ పొదుపు రానురానూ ఖర్చులపై అదుపుపెరిగి పీనాసితనంగా మారిపోయింది. తినేతిండీ, కట్టేబట్టలకూ, పొదుపుపేర నియమాలు పెట్టుకుని రోజుకోరొట్టె తింటూ ఉన్నబట్టలనే వాడుకుంటూ ‘మహాపీనాసి ‘గా పేరుతెచ్చుకున్నాడు. ఎవరైనా" సాంబయ్యా! ఎన్నాళ్ళిలా చేయి కాల్చుకుంటావ్! పెళ్ళిచేసుకోవయ్యా కమ్మగా వండిపెట్టి, నిన్ను బాగా చూసే మనిషివస్తుంది. చూడూ ఎలా చిక్కిపోతున్నావో! ముప్పైలో అరవైవచ్చినట్లున్నావ్ !! ఆ బట్టలేంటి మురికిగా, ఇంత ధనవంతుడివి ఇలా ఉండకూడదయ్యా!" అంటే,
"పెళ్ళెందుకండీ! అదో దండగఖర్చు. పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టుకొస్తారు, దాంతో ఉన్నసొమ్మంతా మాయమవుతుంది."అనేవాడు.
" మీ నాయనా ఇలానుకుంటే నీవెక్కడ ఉండేవాడివయ్యా!" అంటే,
" ఆయనోపిచ్చోడు.." అంటూ ముఖం చాటేసిపోయేవాడు.  ఏనాడూ ఎంగిలిచేత్తో కాకినికూడా అదిలించేవాడు కాదు. తానుతినక, కట్టక ,  ఎవ్వరికీ పెట్టక ధనంకూడేసి దాన్ని ఒకపెద్ద భోషాణంపెట్టెలో దాచి ప్రతిరాత్రీ మేలుకుని కట్టలు లెక్కించుకుని అన్నీభద్రంగా ఉన్నాయనుకున్నాక, తృప్తిగా ఏతెల్లారుఝాముకో నిద్రపోయేవాడు. ఒకరోజున అతగాడు మిట్టమధ్యాహ్నం మూడురోజులనాడు చేసిఉంచుకున్న ముక్కిపోయిన రొట్టెముక్క తింటుండగా అతడి ఇంటిముందునుంచీ "అయ్యా! ఆకలిగా ఉంది ఏదైనా పెట్టండి పుణ్యముంటుంది" అనే పిలుపువినిపించింది. మూడుమార్లు అరిచాక రొట్టెముక్కను ఆరగించడం పూర్తిచేసివచ్చి, "ఏంటీనీగోల! వెళ్ళు ఏమీలేదు ఇంట్లో, మరో ఇంటికెళ్ళు" అని అరుస్తూ బయటికొచ్చాడు. అక్కడ ఒకముసలివ్యక్తి నిలిచి ఉన్నాడు."నీవద్ద ఏమీలేదా! ఇంత పెద్దమేడ! ధనికునివని పేరు ఏమీలేదా!"అని అడిగాడు." ఔను ఏమీలేదు. వెళ్ళు"అన్నాడు ఆ పిసినారి సాంబయ్య ,అసత్యవాదిగా మారి.
"నీ భోషాణంలో కూడా ఏమీలేదా!" అన్నాడా ముదుసలి.
"ఔను ఏమీలేదు ఉత్తిచిత్తుకాగితాలున్నై చాలా? ఇహ వెళ్ళు." అంటూ ఆ ముదుసలిపై కోపంగా ఎగిరాడు.
ఆ ముసలివ్యక్తి “తధాస్తూ" అంటూ వెనక్కుతిరిగి వెళ్ళిపోయాడు.
ఎదురుగా ఉన్న చిన్నపూరిపాకలో నివసించే ఆనందుడు అంతా చూస్తూ బయటికివచ్చి" తాతా! ఇలారండి మా ఇంట్లోకి" అంటూ ఆ ముసలివ్యక్తి చేయి పట్టుకుని తన గుడిసెలోకి తీసుకెళ్ళాడు.  ఆ ముసలివానికి కాళ్ళుకడుక్కోను నీళ్ళిచ్చి ,పీటమీద కూర్చోబెట్టి తానుతినేందుకై ఉంచుకున్న వేడివేడి నూకలఅన్నం ,ఉప్పునిమ్మకాయ ఊరగాయముక్క వేసి, ఒక ప్లేటోపెట్టి ఇచ్చి, ఒకగ్లాసులో ఉప్పువేసిన గంజిపోసి ఇచ్చాడు.
"తాతా! నా వద్ద ఇదే ఉంది ఎలాగో కడుపునింపుకో ఈ పూటకు" అన్నాడు ఆనందుడు.
 “ బాబూ నీదెంత మంచిమనసు! ఐనా ఉన్నదంతా నాకే ఇచ్చావు, నీవేం తింటావు మంచి ఆకలి మీదున్నట్లున్నావ్!" అన్నాడా ముదుసలి.
"తాతా! నేను యువకుడ్ని,  ఒక్కరోజు తినకపోతే ఏమీకాదు,, నీవో పెద్దవాడివి ఆకలికి ఆగలేవు. తినుతాతా!, నాకెవ్వరూ లేరు నీవే మాతాతవనుకుంటున్నాను." అంటూ ఆప్యాయంగా చెప్పాడు.
తాత నవ్వి ఆ నూకల అన్నం తిని, వేడివేడి గంజిత్రాగి" వస్తాన్రామనవడా! సుఖంగా జీవించు." అంటూ లేచి వెళ్ళబోగా ,ఆనందుడు కూడా ఆ తాతను బయటివరకూ సాగనంపివచ్చి చూసేసరికి ,ఆ తాతకూర్చున్నపీట, తిన్నకంచం, గంజి త్రాగినగ్లాసు, కాళ్ళుకడుక్కున్న ముంత అన్నీ బంగారుగా మారిపోయాయి. అమితఆశ్చర్యంగా వాటిని పట్టుకుని చూస్తూఉండగా ఎదుటి సోమయ్య ఇంట్లోంచీ ఏడ్పువినిపించసాగింది. వాటినలా వదిలేసి ,సోమయ్యకేమైనా ఆపద సంభవించిందేమో సాయంచేద్దామని వెళ్ళాడు ఆనందుడు. అక్కడ భోషాణం తెరిచి కూర్చుని పెద్దగా ఏడుస్తున్నాడు సాంబయ్య.  "సాంబయ్యా!ఎందుకేడుస్తున్నావ్!"అని అడిగాడు ఆనందుడు.
"ఆనందా! ఆ ముసిలోడికి నా భోషాణంలో చిత్తుకాగితాలున్నాయని చెప్పాను. నా రూపాయలన్నీ చిత్తుకాగితాలుగా మారిపోయినై.."అంటూ తలకొట్టుకుని , కొట్టుకుని ఏడ్వసాగాడు సాంబయ్య.
"సాంబయ్యా! మన ఊరిపేరు‘సత్యావాసం’ , నిజమే చెప్పాలి, నీవు అసత్యం చెప్పావు. మన గ్రామదేవత సత్యమ్మ నీ అసత్యపుమాటలు వినికోపించింది. అందుకే ఇలాగైంది. సత్యమే చెప్తాననీ ,పీనాసితనం మానేసి లేనివారికింత సాయంచేస్తాననీ ఆ ముదుసలిని, మన గ్రామదేవతని తల్చుకుని ముమ్మారు చెప్పు. ఏమన్నా సాయం జరుగుతుందేమో చూడు. పశ్చాత్తాపాన్నిమించినది లేదుకదా!" అన్నాడు ఆనందు.
సాంబయ్య అలా చెప్పగానే అతడికళ్ళను అతడేనమ్మలేనట్లుగా చిత్తుకాగితాలన్నీ మళ్ళీరూపాయలకట్టలుగా పూర్వంలాగా మారిపోయాయి. సాంబయ్య చెంపలేసుకుని "ఇహ అసత్యంచెప్పను, లేనివారికింత సాయంచేస్తాను " అని అలాగే మారిపోయి, అప్పటినుంచీ లేనివారికింతపెడుతూ ,వివాహంచేసుకుని చక్కనిబట్టలు ధరిస్తూ, దర్జాగా నిజాయితీగా జీవించసాగాడు. తన అసూయే తనకుకష్టాన్ని తెచ్చిందని తెల్సుకున్నాడు. ఆనందూ  తనకు దైవంప్రసాదించిన బంగారాన్ని అమ్మి ఆ సొమ్ముతో అనాధులకూ, పేదవారికీ సాయంచేస్తూ తానుమాత్రం కూలిపనితో వచ్చిన సొమ్మునే తింటూ హాయిగా జీవించసాగాడు.

No comments:

Post a Comment

Pages