శ్రీనివాసువాచ
// గోడయే చాలును //
హరుని సైతము మరుగొల్పు మన్మధ బాణమెందుకు గాని
గోడ మీద చిన్ని కోణము చాలు, నా మది Like నీకు తెల్పుటకు
శంకరుని వలె పంచుటకు శరీరములో అర్ధభాగమేమొ గాని
గోడ మీద బోల్డు విషయాలు కలవు నీతో Share చేస్కొనుటకు
ఈశ్వరుని రీతి గంగ పరవళ్ళు ఆపు జూటమంత చోటులేదు గాని
గోడ మీద చిన్న వెసులు కలదు నీ వాక్ప్రవాహపు Comment పెట్టుటకు
హర హరా !! ఈ యుగమున గోడయే సకల కార్యములు నెరవేర్చ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
************
హక్కుల చట్టములతో మము మురిపించు రాజమాత
వాక్కుల బాణములతో మము అలరించు యువనేత
సిరులొలుకు తెలుగు నాట చిచ్చుపెట్టునపుడు “షిండె”ధైర్యము
అంతుచిక్కని ఆర్ధికమాంద్యమేమనిన “చిదంబర” రహస్యము
కోటికి పడగలెత్త్తిన ట్రింగ్ ట్రింగ్, గనుల ఘనులెందరో మనకెరుక
శిక్ష పడును ఎంతమందికనిన పచ్చని పంటలో “గడ్డి”పరక
“మౌనమోహనమె” కాదె ఈ సర్కారు, నాయకుని మదిని తరచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
****************
బాలనగమ్మలోని మాయల ఫకీరు వేషాలు మాకొద్దు
చిన్ని భీముని లడ్డు విన్యాసాలే మాకు మహా ముద్దు
భేతాళ మాంత్రికుణ్ణి చెట్టు మీదే సుఖంగా వుండనిమ్ము
మూషిక మార్జాల పరుగుల కథలే మాకు కాలక్షేపమ్ము
కొండ్డెక్కి చందమామ రావద్దు, గోగిపూలను జాబిల్లి తేవద్దు
ఆకశాన విహరించు అందాలరాణి మా బార్బినే చూడనిద్దు
TV ఠీవి ముందు నానమ్మ, తాతయ్యలిట్లు తమ తలలువంచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, నేటి పిల్లల మదిని ఎరుకపరచ
*****************
కట్టుకొనుటపుడు ఖంగారుపడు పని లేదు
విప్పుకొనుటకు వివరం తెలియనక్కరలేదు
దేకినంతనె దుమ్ముపట్టు వస్త్రమ్ము కాదులే
దూకినంతనె ఊడిపోవు భయమ్ము లేదులే
మాసిపోయినదని మొహమాటపడునేలనే
చిరిగిపోయినదని చింతలేదు, అది చెల్లునే
ఆడవారు కాని, మొగవారు కాని
చిన్నవారు కాని, ముసలివారు కాని
స్థూలకాయులు కాని, సూక్ష్మదేహులుకాని
కార్యమేదైననేమి, కార్యాలయమునకు కాని
మాన, సమ్మోహనావసరములిట్లు “జీన్సు”లో పదిలపరచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*****************************
టింగు టింగుమని బండి గంట వీధిలో మోగంగ
జిల్లు జిల్లుమని చిరు గుండె సవ్వడి చేయంగ
బిక్కు బిక్కుమని పోపుడబ్బా దొంగవలె వెతకంగ
దబ్బు దబ్బుమని గోడ దూకి బండి చెంత చేరంగ
వర్షా కాలపు ఇంధ్రధనస్సు రంగులెన్నొ తెలియంగ
హర్షా కాలపు సమయానికి ఆహ్వానము పలకంగ
శీతా కాలపు చల్లదనము నాలుకకు తగలంగ
గీతా కాలపు గమకాలు గొంతు వెంబడి వెడలంగ
నన్ను మరపించెడిదే బండిలోని ఆ పుల్ల సొగసు
కళ్ళు మూసి చీకినపుడె ఆ రుచి మదికి తెలుసు
ఎంత పెరిగిన కాని యేయేటికాయేడు నా వయసు
సిగ్గు విడిచి బయట పడకుండునే నాలోని పసి మనసు
పుల్ల అయిసు కాదె మన నోటిని నర్తింప చేయించ
చీకించ, నాకించ, చుంబించ, కొరికించ, చప్పరించ
పలు విధములుగ మన జిహ్వచాపల్యమును మెప్పించ
జీవితపు చీకు చింతలన్నీ క్షణకాలము మైమరపించ
ఆ రుచి మెచ్చని పుణ్యమూర్తి లేడనే పందేనికి నే జబ్బ చరచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**********************
ఢామ్మని పేలినంతనే అది దీపావళి పటాసు కాదులె
కీచుమని అరచినా అక్కడ అఘాయిత్యమేమి లేదులె
బుస్సని పొంగినంతనే అది భయపెట్టు పాము కాదులె
చిటపట సవ్వడి చేసినా అక్కడ కోపమేమి లేదులే
ఆ హడావుడి….
ఎండ దెబ్బ కొట్టిన ఎంకయ్య దాహార్తి చల్లార్చ
రిక్షాలాగు ముసలయ్య ముఖశాంతి నెరవేర్చ
కళ్ళు తిరిగి కింద పడ్డ కనకయ్యను ఓదార్చ
పైసల్లేని పైడయ్యకు చల్లదనమును చేకూర్చ
ఎట్లెట్లనిన…..
ఐసు సోడాతో ఎండిన నాలుక పొందు చిరచిదర
నిమ్మ సోడాని తాగరా చనుబాలువలె గడగడ
ఆరంజి సోడా శొభిల్లును నాలుకపై తళతళ
సుగంధి సోడా సొగసులు నోటికిచ్చు కళకళ
సినిమాలో తాప్సిలా పరాయి ప్రాంతపు పెప్సి మాకు వద్దు
అచ్చ తెలుగు సావిత్రి మాదిరి గోలి సోడానే మాకు ముద్దు
చిరంజీవి, రాజశేఖరు ఫైటింగులకు శక్తి ఈ సోడాది కాదా
ఎన్టీయార్ విజిలేస్తె ఎగిరే ఆంధ్రా సోడాబుడ్డీ చూడలేదా
అందుకే, జనులార…
తాగి కొట్టుకొనుట మానరాదె, కొట్టి తాగుటకు ద్రావకమొకటి ఏడ్చ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
***************************
తన కనుకొలను దాటుకొని అశ్రువొకటి రాలిన, ఓ మగధీరా !!!
నూట యాభై భస్మమ్ము Lakme kajal వలన కనుల చివర
జారిన ఆ బిందువుకు తోడు ఇంకొక బిందువు ఒలికించితివేమి
ఏడువందల యాభై నాశనమ్ము Loreal Eye Liner వల్ల సుమీ
బిందువులు ఒకదానివెంట ధారలుగ చెక్కిలిపై జారునట్టు చేయకురా
అవి మట్టుపెట్టును తళుకులిచ్చు ఏడువందల Revlon Mascara
ఆ ధారాపాతము అటు పిమ్మట వరదలై అధరములపై ఒలికించిన
అయిదు వందలకు రెక్కలొచ్చు Chambor Lip Gloss రూపమున
ఈ అర్థశాస్త్ర మర్మమ్ము నీవెరింగితివేమి….
ఇకమీదెన్నడు ధైర్యముసేయువే కలకంఠి కంట కన్నీరొలికించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*********************
నన్ను కాదె మీరు…
నిలిపితిరి నండూరి వారి ఎంకి నడుమొంపుల సింహాసనమున
పదహారణాల తెలుగు వాల్జెడ పల్లె పూబోణి పరువాల సరసన
నన్ను కాదె మీరు…
చిట్టి రాయితో కొట్టి హింసిచితిరి ప్రియురాలిని పిలుచు నెపమున
ఆయుధముగ మార్చితిరి నారీ లొకపు వీధిపంపు సమరమున
నన్ను కాదె మీరు…
మొదట పంపించినది ఆడపడుచుకు తోడుగా మీ గృహప్రవేశమున
మిఠాయిలతో పంపించితిరి ఆడకూతిరి అప్పగింతల ముహూర్తమున
‘8నన్ను కాదె మీరు…
చూచినది బంగారు నాణేల నిండుగ విఠలాచార్య జానపద చిత్రమున,
రాఘవేంద్రుని చిత్రాన నాయకి నాభీ సౌందర్య ప్రదర్శనా సమయమున
ఈనాడు, ఆట్టి అచ్చ తెలుగు బిందెనైన నన్ను కాదె మీరు….
మరచితిరి - ఉన్నాయని ప్యురిఫైయర్, ఫ్రిజ్జు నీరు భద్రపరచ,
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాస పరచ
************************
హరిత వర్ణ గుభాళించు పత్రములను
ఇంటి రుబ్బురోటియందు నుజ్జు నుజ్జు ఆడించరె
ధవళ వర్ణ అరచేతియందు ఆప్యాయముగ
ముగ్గువలె కంటికింపుగ ముద్దు ముద్దుగ అలంకరించరె
కృష్ణ వర్ణ చందముగ అది ఎండునంతవరకు
పప్పు, నేయి గోరుముద్దలు కొసరి కొసరి పెట్టించుకుందురె
రుధిర వర్ణ తళుకులకు నూనె రాయు సమయాన
రాబోవు మొగుడెంత ఘనుడని తలచి తలచి సంతసింతురె
ఇంటియందు సిరులొలుకు ఆడపిల్లల్లున్న…..
ఇట్లు కాదె తెలుగు సంప్రదాయరీతి ఇనుమడించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*************************
దినరాత్రులు అలసి సొలసిన పతిదేవునికి
వీణానాదము ఆలపించు నిబంధన బ్రహ్మలోకమునకె చెల్లు
చుట్టపుచూపుగ పుట్టింటికి వెళ్ళివచ్చునది
మొగునికి ధీటుగ నర్తించినపుడనే నియమము కైలాసమునకె చెల్లు
ముచ్చటపడి పద్మాసనముపై కూర్చొనుటకు
భర్త పాదములు పట్టి బుజ్జగించు సంప్రదాయము వైకుంఠమునకె చెల్లు
కట కటా….
ఇలవేల్పులైన కాని ఏమి ఈ దుస్థితి మీకిది అమ్మలార
పురుష జాతి మీ హక్కులను హరించుటలేదె పూబొమ్మలార
ఇలలోకమున రౌద్రరూప గ్రుహలక్ష్మిని చూచి కన్నులార
గ్రహింపగలరె మీరు ఒక సూక్ష్మ విషయ సూత్రము తల్లులార
“అప్పడాలకర్ర” ఆయుధమొక్కటి కాదె భూలోక స్త్రీజాతి కవచ
మొగుడెంతటి గండభేరుండుడైనా ఒక్కదెబ్బతో వాడి పీచమణఛ
వజ్రాయుధమ్ముకంటె వాడి కాదె అది స్త్రీహక్కులు పరిరక్షించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*********************
పక్షుల కిలకిలరావాల శుభోదయారంభమునకు పూర్వమె
లగ్నము చేయ మదిని ధ్యానము పేరిట ప్రాణాయామమున
క్రమము తప్పక, సమయపాలనము వీడక, అలుపన్నది ఎరుగక
కష్టపడునె తన ఇష్ట కొలువందు కఠోర ప్రదక్షణ, ఆసనమున
నిత్యము ఉరుకులు పరుగులెత్తు ఉద్యోగము చేయునైననేమి
నియమము ఉల్లఘించుటెరుగనిదాయె కటిక ఉపవాసమున
జిహ్వచాపల్యమునకు లొంగక, లవణ మధురములకు తలవొంచక
శుచికి వెరువదీయక, ప్రసాదమంతటి నైవేద్యమె రాత్రి ఫలహారమున
జనులార….
ఇవి ఒక శూన్యజీవితమునుండి మోక్షసాధనకు పడుపాట్లు కాదె
వృత్తమంటి నడుముకొలతను శూన్యస్థాయినందుంచు అగచాట్లు కావె
నేటి వనిత సావిత్రికంటె ఇలియానాను ఇష్టపడదె, దృష్టి సారించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**********************
గువ్వలు గూటికిచేరు ఉషాంతపు వేళలోన
గవ్వలు గుప్పిట గమకంగా ఆడించుచు నేర్పుగ ఒదలంగ
మొవ్వలు వోలె గలగలలు చేయుచు నేలపై
నివ్వగనొక ఫలితము గడులలోన పావులకు దారిచూపుచు
ఎవ్వడు ఆ ఫలితమును నేర్పుగ రాబట్టి ఇం
కెవ్వని పావుల కోరల పాలిట తన పావులు పడనీయక
రివ్వున గడులన్ని ఓర్పుగ ఒకపరి కలయతిరిగి
చివ్వున నడిమధ్య పంటగడి చేరునో వానిదె జయము
ఇవ్విధముగు ఈ ఆటను జంటగనే గాక రా
నివ్వవచ్చునె ఆడుటకు తోడుగ ఇంకొకరిద్దరిని మురిపెముమీర
ఎవ్విధంబైన నైపుణ్యము అవసరము లేని
సువ్విధంబైన ఆట “అష్టాచెమ్మ” కదరాయని ముదమునొందన్
భళి భళీ,
ఇదియె గదా ఆటయనిన తెలుగింటి లోగిళ్ళలో చాపపరచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
********************
అలనాటి రామచంద్రుడికన్నా సాటి
అనిపించుకున్న నూనూగు మీసాల ‘మురారి’వే
అలుపెరుగని పోరులో సాహసమె శ్వాసగ
అలసిన ప్రియురాలిని ఆదుకొనేదీ నీ’వొక్కడి’వె
అక్క మీద ఆప్యాయతను రంగరించుచు
అరివీర భయంకరులతో పోరుసల్పు ‘అర్జునుడ’వే
అల్లరి చిల్లరగా వీధులెంబడి తిరుగాడుతు
అధములైనవారిని చీల్చిచెండాడు ‘పోకిరి’ పోలీసువే
అని కుర్రతనమున యెగిరియుంటిని కాని…..
నీ లేతనగము పున్నమినాటి చంద్రబింబమని, ఓ ‘నానీ’
నీ తేనెలొలుకు చిరునవ్వు మరువజాలనిదని, ఓ ‘బాబీ’
నీ ‘దూకుడి’కి సాటిరారెవ్వరని, ఓ ‘రాజకుమారా’
నీ గుండె ‘ఖలేజా’కు పోటీ లేదని, ఓ ‘సైనికుడా’
తెలుగు ఆడపిల్లల మదినిట్లు చెదరగొట్టు ‘టక్కరిదొంగ’వి నీవెయని
జనులాడిపోసుకున్న నమ్మని వాడనె ఇన్నాళ్ళు, అది నిజమని
అట్టి నేను, గుండె పగిలి ఢామ్మని కింద పడతిని నాసతి గోప్యముగ తెలుపంగ
రెండవ తరగతి చదువు నా చిట్టితల్లి పుస్తకమున ‘అతడి’ ఫొటొనే దొరకంగ
చాలు చాలు చాలు చాలింక నీ భజనలు నాకింక చాలు
నీ చిత్రపటములు తన కళ్ళపడకుండుట మేలింక మేలు
లాభమ్ము లేదు, ‘సీతమ్మవాకిట్లో’ నీ చాకిరేవు పెట్టదలిచా
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*********************
సరస రసమయ సమయమున
సునిశిత నిశాజనిత సుఖమయ మయికములో
సకల సరళ కళా భోగమునాసక్తుడు
సువాసినుల సమున్నతవాసమును వశమెట్లుచేసుకొనునో
తత్సమాన ఉత్సాహమునిండుగ
తత్ప్రమాణ ఫలమును తనివితీర తడుముతు
తత్ప్రయోగమును బహిరంగముగ
తత్ జనులు తన్మయత్వముతో ప్రదర్శించురేని
భాగవతముకన్న మధురము
బంగినిపల్లి మామిడియేనని పోతన గారితోను
సరస శృంగార నైషధికి ధీటు ఈ
రసఫలమ్మేనని శ్రీనాధునితోను వాదులెట్టుకుని
పెరుగన్నమున మామిడిపండు భుజించుటకు నేనుపక్రమించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**********************
ఉరుకులు, పరుగులు, ఉషోదయపు వేళలు
సర్దుళ్ళు, సణుగుళ్ళూ, పిల్లల హడావుళ్ళు
అరుపులు, కేకలు, జనసంద్రపు హోరులు
అలజడులు, ఒత్తిళ్ళు, అదనపు బాధ్యతలు
తిండిగింజలు తినుటకు వీలులేని పరుగులు
తీపికబుర్లకు తావులేని జనజీవన స్రవంతులు
తప్పించుకొనుటకు ఒక వెసులుబాటు ఈ ఆదివారము
తల్లడిల్లు తనువులు చెందును ఊరట ఈ ఆదివారము
అయినకాని…..
హెలికాప్టరులో వరదబాధితులకిచ్చు పులిహోర పొట్లమువలె
వడ్డించిన విస్తరినందు దిట్టముగ కనపడు అప్పడమువలె
రెండు గంటలు సాగు చిత్రమునందు రెండు నిమిషాల
అయిటము సాంగులో ముమైత్ ఖాన్ తళుకుల వలె
ఎదురు చూసినంతసేపది ఉండిచావదు మనసుపెట్టి ఆలోచించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**********************
దూరాలు కలుపు దారాలగు ఉత్తరాలను
సుదూరపు తీరాలు దాటినవని జాగ్రత్తగ పేర్చుకొని
బహుదూరపు బాటసారివోలె సైకిలుపై
ఉదారముగ చేతికప్పగించిన ఓ తపాల మహాశయ
తక్షణ అవసరములు వివరముగ కార్డుపైన పేర్కొనుంటి
అక్షర కుసుమాలు మనసుపెట్టి కాగితముపై పేర్చుకుంటి
తీక్షణ ఎండవేడిని శ్రామికునివోలె లెక్కచేయనట్టి
దీక్షగ వాటిని మనసుపడిన వారి దరికి చేర్చినట్టి
నీ…
రాకకె ఎదురు చూచెనొక జవ్వని - ప్రియుని కబురుకై
కేకకె చెవిని పరికించెనొక ముదుసలి - కొడుకు జాబుకై
చేతికె ఆశగ చూసెనొక విద్యార్ధి - తండ్రిపంపు పైసలకై
ఊసుకె వేచిచూచెనొక నిరుద్యోగి - కొలువు పత్రముకై
అట్టి నిన్ను మమ్ము దూరము చేసినవి యంత్రములొకప్పుడు
నీకు మాకు పునరనుసంధానము ఉన్నదని శుభవార్తలిప్పుడు
ప్రభుత్వమే మీ కార్యాలయమును బ్యాంకుగ మార్చదలచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
***********************
అల్లు అర్జునుడి అల్లరి చేష్టలకన్న
ఎన్టిఆర్ వేయు ఏకబిగి వైవిధ్య నృత్యములకన్న
నాగార్జునుడి మన్మధ లీలలకన్న
రామచరణుడి మగధీర విన్యాస పోరాటములకన్న
అదిరే బొమ్మాళి హొయలకన్న
అందాల సీతమ్మ అచ్చతెలుగు అంజలి కన్న
కొరకొర చూపుల సమంతకన్న
తిరుతిరు గణనాధ భక్తురాలు తమన్న కన్న
‘
పంచి డయిలాగుల త్రివిక్రముడికన్న
మంచి కధనాల బొమ్మరిల్లు భాస్కరుడికన్న
మాఫియ ప్రియుడు జగన్నాధుడికన్న
మలుపుల వీరుడు శ్రీనువైట్ల ముగింపుకన్న
పసిడివర్ణ జొన్నకంకిలను
పదిలముగ చిరువేడిసెగలనాడించి
ముచ్చటైన పెద్ద పొట్లాములొ
మురిపెముగ నిండుగ పోసిచ్చిన
పాప్ కార్న్ కాదె పాప మనసు రంజించు కారణము నీవెంచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**************************
లక్షణమగు లక్ష్మీవారమునాడు
విలక్షణమైన ముఖచిత్రముతో ముస్తాబయ్యి
లక్షల తెలుగింటి ఆడపదుచుల ని
రీక్షణమును వృధాపోనీయక అలరించు మా స్వాతి
జిగిబిగి చిత్రాల సమీక్షలతో
ముసిముసి నవ్వుతెప్పించు బాపు బొమ్మలతో
గుసగుస సరస కధనముతో
చెటపట చెణుకుల మా శీర్షికతొ పలకరించు నీ రీతి
మధుబాబు పరిగెత్తించిన షాడొ
మధించిన జీవనసారమగు మాలతి చందూరు వ్యాఖ్యలు
మధుర సమర సందేశాలవంటి
మాధుర్యభరిత వివరణలతొ పెరిగిన నీ ఖండాతర ఖ్యాతి
యువకులకు నయనానందం
యువతులకు గృహసీమనె ప్రపంచ పర్యటనానందం
నడివయస్కులకు కాలక్షేపానందం
వెరసి సకుంటుంబ సపరివార పత్రిక పఠనాత్ భవతి
నీవు కాదె….
తెలుగు కుటుంబ ప్రియనేస్తమని నే ఢంకా బంజాయించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
********************
దిమ్మతిరిగెడి సమీకరణాల
తిమ్మన మాస్టారి లెక్కల క్లాసులెగ్గొట్టి
బొమ్మను తెరపై చూచుటకు
అమ్మ పోపుడబ్బా కాదె శ్రీరామరక్ష
కమ్మని ఇంటిభోజనంకాక
ఘుమ్మను హోటలు బిర్యాని తినుదు
లెమ్మని ఒకపరి పోవుటకు
అమ్మ పోపుడబ్బా కాదె శ్రీరామరక్ష
తెమ్మని నెలవారి ఫీజు
గమ్మున అని ట్యూషన్ సారు కసరిన
జుమ్మున ఇచ్చుటకు
అమ్మ పోపుడబ్బా కాదె శ్రీరామరక్ష
దొంగిలించుటకు కాని
దాచి మరల వాడుకొందులకు కాని
అవసరాన చిల్లరకు కాని
అమ్మ పోపుడబ్బా కాదె శ్రీరామరక్ష
అందుకె….
అమ్మ బ్యాంకు ఖాతా తెరిచి కార్డునిచ్చిన నాన్నపై నేనరిచా
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**********************
దేశభాషలందు తెలుగులెస్సయని
ఛందో వ్యాకరణ సొబగులు చూచి సంతసింతురె
వేషభాషలందు వేణి సొగస్సులేల
అంద, అలంకరణల పర్వమున తలవకుందురె
పొడవాటి కురులను పాయలుగ
విడదీసి, నిగనిగలాడు నూనెను నిండుగ దట్టించి,
పడిలేచు ముంగురులను ఓర్పుగ
ముడివేసి, సరిచేసి, అదిమేసి, సుందరముగ అలంకరించిన
జడకాదుటె జవ్వనిని మురిపించ
జడకాదుటె నడుమొంపులను నిత్యము దర్శించ
జడకాదుటె కోపమున విదిలించ
జడకాదుటె సువాసినుల లతాంగములను తాడించ
జడకాదుటె కవులను కవ్వించ
జడకాదుటె యువ్వని చిత్తరవులను ఇనుమడించ
జడకాదుటె పూలచె అలంకరించ
జడకాదుటె ముడిదీసినది సరసమునకు అరుదెంచ
అట్టి జడనేలనోయి…..
ఆధునికత పేరున అతివల తలనుండి రకరకాలుగ కత్తిరించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
********************
కలం కదలనన్నది కదిలించినా
కలలు కల్లలు కాబోవు వేళ కాదా ఇదియని ప్రశ్నించ
మెదడు మొండికెత్తింది మొదలెట్టినా
మెడ మీద కత్తిలాంటి నిర్ణయం మనపై ప్రభుత్వం సంధించ
ఆలోచనలు అటకెక్కినవి అరచి గీపెట్టినా
ఆ పాత రోజులు చరిత్ర పుటలకేననే నిజమును గుర్తించ
ఊత్సాహం ఉస్సురుమనింది ఉడికించినా
ఊహకందని ఉత్పాతం ఆపెదెవ్వరని ఉద్రేకముగా ఘోషించ
అవతరణ దినమని సంబరాలేలనే, ఆంధ్ర రాష్ట్రమే ఇక అంతరించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని నిరుత్సాహపరచ
**********************
భోజనమునకు హోటలుకెళ్ళి, ద
ద్ధోజనమొకటియె కాక బోలెడు ఆర్డరిచ్చి, తీరికగా
ఓ జనులార, కవితను రాయు
సజ్జోగమునకు తగు పరికరము పరికించు సమయాన....
అల్లరి చేయు మా చిట్టి తల్లి
ఉల్లసించదలచి, బొమ్మనొకటి చేయమని నన్నడగ
మెల్లగ పేపరుని మడతలేసి
బుల్లి పడవ బొమ్మ తన చేతికిచ్చు సందర్భమున....
గరిటెడు సాంబారు వాడిచ్చిన
పిడికెడు మెతుకులతో తినినంతనె వాష్రూముకు పరిగెత్తి
గడబిడు ప్రయాస పిదపక్కడ
గుడిసెడు నీళ్ళు బక్కెట్టున లేని నిరర్ధక క్షణమున....
ఇట్టి
ఇష్యూలేమైన కాని టిష్యూ పేపరొక్కటి కాదె నా మొరాలకించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
***********************
ఆరుబయట మంచమేసుకున్నది
అటలాడి, కధలు విని అలసి పడుకునేందుకుంటిని
అయిదుదాటక ముందె అమ్మవేసిన
అరచెయ్యి చెవినిలాగి నదికి నడువమన్నంతవరకు
నిద్రమత్తులో అడుగులు నెమ్మదాయె
మంద్రస్వరములో మంత్రములు వినుపించునంతవరకు
పూజలు, అమ్మల హడావుడి చూస్తినాయె
జాగు చేయక అమ్మ నన్ను కూడ నదిని మునగమన్నంతవరకు
పుణ్యమో, పాపమో ఆ పైవాడికెరుక
నిండా మునిగిన నాకు తెలియలేదె చలియన్నదింక
చేతులు జోడించాను నదిలో దీపమువంక
తెలవారుజామున అరటిదొప్పల వరుసలో అది బాగుంది కనుక
దీపాల రవళి పిదప దీపాల సరళి కార్తీక మాసమిట్లు అరుదెంచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని కొద్దిగ తేలికపరచ
***********************
అత్తారింటికి దారేదని అడిగిన
అమాయకుడిని చూసి మోసపోకుమా
మేడిన్ ఆంధ్రా స్టూడెంటనిన
అతనేనని తెలుగు ప్రజలకెరుకే సుమా
ఏ స్వప్న లోకాల సౌందర్యరాశి
అతనిముందు కొచ్చి కనువిందు చేసినా
బంగాళాఖాతంలో నీరంటే నీవనే
అతని ఖుషీ కబుర్ల పంజా పాలే సుమా
నందాయే కాదు, బైర్రెడ్డే కాదు
హుందాగ నడచు సునందా దేవి కూడ కాదు
తననెదిరించు స్వరమెవరిదని
జల్సా చేయు కిలాడి బద్రి అతనే సుమా
గబ్బరుసింగు అని పేరుచూసి
విలనేమో అని మోసపోయెదవేమొ కాని, అతను
తొలిప్రేమపలుకులుతో పడగొట్టి
గోకులములోకి సీతను తెచ్చి ఆడించు రకమె సుమా
పవనసుతుడు మాదిరి
కోతి చేష్టలు చూసి కిసుక్కున నవ్వుకోకుమా
పవన కళ్యాణుడితను జాగ్రత్త
చెయ్యి కాలరెంబడతని మెడ మీదకు చేరనీకు సుమా
అరె సాంబా, మర్చిపోతివా ఏమి....సారుకున్నది….
తిక్క మాత్రమే కాదు, తోడుంకోటి కూడ వున్నదిలే లెక్కించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
**************************
భానోదయపు సందిగ్దత
ఆదివారం ఉదయం కావడంతో ఇలా కూనిరాగం తీస్తూ (గంధము పూయరుగా, పన్నీటి గంధము పూయరుగా పాట స్టైలులో) గడ్డము గీయడానికి ఉపక్రమించానుః
గడ్డము గీకెదగా, గుబురు గడ్డము గీకెదగా
వారము మొత్తము అల్లుకుపోయి
గరుకుగ చేతిని తాకుతు, గుచ్చిన
గడ్డము గీకెదగా, గుబురు గడ్డము గీకెదగా
అప్పుడు ఒక అశరీర వాణి “ఓయీ మానవా” అని పిలిచినట్టు అనిపించింది. తెలుగు సినిమాలు చూసే మీకు ఈ పాటికి అర్ధమయ్యి వుండాలి ఇలాంటి అశరీరవాణులు కళ్ళకి మామూలుగా కనపడకపోయినా, అద్దంలో దర్శనం చక్కగా ఇస్తాయి. సో ఆ వాణి ఎవరిదా అని చూస్తె అది నా గడ్డముది. తనని గీకద్దని వేడుకుంటు ఈ విధంగా అది విన్నవించుకుంది.
ఏలనయ్యా నీవు గడ్డమునిట్లు గీకెదవు
తెలుసునటయ్యా నీకు గడ్డపు నిఘంటువు?
గుబురు గడ్డమున్నచో బ్రహ్మర్షియటంచున్
ధవళ వర్ణమునది వన్నెలీన వశిష్ఠ గురువగున్
పౌరుషానికి ప్రతీకగా చెప్పు పరశురామున్
ఏనాడయినా తలచితివేని గడ్డము లేకుండగన్
అమెరికాలో అబ్రహం లింకన్ గడ్డముతొ వర్దిల్లెన్
శాంతాక్లాజు ఈయడె దర్శనము గడ్డముతోడన్
భారతదేశమును అనేక వర్షములెట్లు పాలించెన్
గడ్డముతోడిదె కాదె మహమ్మదీయల సుల్తాన్
ఆంగ్ల చిత్రాల దర్శక నాయకుడు స్పీల్ బర్గ్ కి గాని
దర్శకత్వ పర్యవేక్షణ నిపుణుడు రాఘవేంద్రునికి కాని
పంచు మాటల ఇంద్రజాలికుడు త్రివిక్రమునికి కాని
గడ్డముగాదె తోడుంది, తట్టిలేపినది వారి అలోచనలని
మామనెదిరించి పదవినొందిన చంద్రన్న పవరు
పదవినందుండిన మౌనమోహనముల క్లవరు
పదవినొందుటకు నరేంద్ర మోడి వాడు లీవరు
పరీక్షగ చూచిన గడ్డముగాదని చెప్పెదనెవ్వరు
అట్టి గడ్డమునేల చులకనగా తీసిపారివేయుదవు
నీ గుండెన కనికరమన్నపదమునే కొట్టివేయుదవు
అని గడ్డము భోరున విలపించింది. నాకు ఏమి చేయాలన్నది తెలియక, నా ముద్దుల కూతుళ్ళను కూర్చుండపెట్టి వారి సలహా అడిగాను. అపుడు, వారిట్లు ఒక్కముక్కలో సర్వకాల, సర్వావస్థలయందు వారు పటించి, స్మరించు దేవుని నామ స్మరణ ద్వార ధర్మసంకట విమోచనా మార్గమును తెల్పినారు”
అన్యుల అభిప్రాయము తుచ్చము జనకా
నీ బుర్ర్రన మన్ను కొద్దిగనున్నది కనుక
నీకు విశదీకరించెదము మగువల కోరిక
మహేష్ బాబు చిత్రపటమును నీవు చూడిక
దొరకదె సమాధానము, ఆలోచనెందుకు వేరిక
బర బర బర బర బర బర గడ్డమును గీకిక
అని ఒక్క ముక్కలో తేల్చినయడల, అశరీరవాణికి కాఫీ ఇచ్చి పంపేసి, నేను గీకుడు కార్యక్రమమునకు.....
ఉష్ణద్రవము, ధవళఫోము, వాడిబ్లేడులను తీసి ఉపక్రమించ
ఇది భవదీయ శ్రీనివాసువాఛ, జనుల మదిని ఉల్లాసపరచ
***************************
కనుచుంటిమి...
పుణ్యవదన ప్రశాంత దర్శనము ప్రతిదినమున
పుణ్యవచన శ్రవణభాగ్యము శుభోదయమున
పుణ్యక్షేత్ర దర్శన సౌభాగ్యము మనోనేత్రమున
పుణ్యకార్యముల విశిష్టత జీవన విధానమున
వినుచుంటిమి...
పుణ్యనదుల మూలకధలు మనసార
పుణ్యమంత్రముల అర్ధసారము తనివితీర
పుణ్యాత్ముల ధన్య జీవిత చరిత చెవులార
పుణ్యవీరుల అపార శక్తియుక్తులు భక్తిమీర
తెలుసుకొనుచుంటిమి....
పుణ్యమార్గము చేరు నైపుణ్యము జిజ్గ్యాసతొ
పుణ్యపాపములనబడు విచక్షన శ్రధ్ధతో
పుణ్యవ్రతముల ఫల వివరణము భక్తితో
పుణ్యప్రసాదముల శక్తి, మహిమలు ఆసక్తితో
ఆహా,
ఏమి పుణ్యమె మాది, బ్రహ్మశ్రీ చాగంటి వెంకటేశ్వరా, మిమ్ము నిత్యమాలకించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, అఖిలాంధ్రుల హృదయమోదము ప్రతిధ్వనించ
**************************
ముంగిలియందున్నది ఆ నాపరాయి వరండా
నింగిని ఉన్న ఆ భానుడి ప్రతాపం పడకుండా
వొంగి, లేచు, పరిగెత్తు, ప్రయాసలు లెకుండ,
భంగిమ మార్చక ఆడు ఓ ఆట విసుగురాకుండ
సూటు రాళ్ళు కాదు, సూదంటు రాళ్ళు కాదు
నీటు రాళ్ళు నున్నంగనున్నవి చాలునయిదు
చోటు చిన్నది అయిన నీవు చింతిగచవలదు
లోటు లేని ఆట ఇది నిన్ను మురిపించగలదు
ఎగురవేయుము చేతితో ఒక రాయిని పైకి చలాకీగా
దిగువచ్చునంతలొనె పట్టు, కిందిరాళ్ళు సులువుగా
మిగులు ఆట రాళ్ళతోనె రకరములగా ఆడెదగవుగా
దిగులు చెందకు, వేళ్ళుతోనె గెలవవచ్చు ఒడుపుగా
గచ్చకాయలు కాదె ఇట్లు....
తెలుగింటి లోగిలిలో గలగల నవ్వుల పువ్వులు పూయించ
మగువలకు ముచ్చట్లు చెప్పుకొనువేళ మనసు మెప్పించ
బావమరదళ్ళ ఆట కూడ కాదె పెద్దలు తమను గమనించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
పౌరాణికమున నాయకుడి వర్ణన
నీలమేఘశ్యాముడని కీర్తింతురే విగ్రహమును
వక్షస్థల కౌస్తుభమని వర్ణించరె అలంకరణలను
రాధతోని గీతికలు భజియింతురె రాసలీలలుగను
పర్వతమెత్తిన చిట్టి వేలు చూపరె విజయముగను
జానపదమున నాయకుడి వర్ణన
ఆరడగుల ఆజానుబాహుడైనాడు నాయకుడు
బాలచంద్రునివలె పొడుగు వస్త్రము ధరించినాడు
తోటలొని తన ప్రియురాలితో సరసమాడినాడు
కత్తి దూసి పెట్టి ఓ విజయగీతిక మోగించినాడు
సాంఘికమున నాయకుడి వర్ణన
నీటైన క్రాఫువాడు, సన్నమీసమున్నవాడు
నిండుచంద్రునివలె సూటుబూటువేయువాడు
స్టెప్పులన్నొ వేసి తన ప్రేయసిని చేరువాడు
దుష్టులను ఓడగొట్టి గర్వముగ తొడగొట్టువాడు
కటకటా, మరిదేలరా ఈ ఆధునిక చిత్రములన
బనియను బయటపెట్టు కండలజబ్బలవాడు
బనియను తప్ప పైన వేరొక బట్టకట్టజాలడు
బనియను తడిసినచో శృంగార పురుషుడు
బనియను బ్రాండుదయినచో విజయధీరుడు
జనులార, కాలక్రమమున
పీతాంబర నాయకుడిట్లు బనియనుబద్ధుడాయనె తిలకించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
************************
నవంబరు మాసమది నడి సంద్రపు ఒడ్డు అది
నవభారత రాచరికపు ఆతిధ్యమునకు వేదికది
నవీన హంగుల ముంబయి ప్రాచీన కట్టడమది
నవతరపు వ్యాపార వాణిజ్య కులాసా చిహ్నమది
బిల బిలమని ముష్కరులు దానివేపు పరిగెత్తగ
చక చకమని సుందర భవనమును చుట్టుముట్టగ
ధడ ధడమని మారణాయుధమ్ములకు పనిపెట్టగ
ధన ధనమని దారుణ మారణహోమము తలపెట్టగ
ఏపాపమెరుగని చిట్టితల్లి ఏ మనిషికి హాని తలపెట్టే?
ఏమతమో తెలియని పసితనముకు ఎవరి దిష్టికొట్టె?
ఏమాత్రము కరుణించని కసాయి గుళ్ళకి తలవంచె
ఏరులై పారిన ఆ రక్తముతో ఎవరి దాహమో చల్లార్చె
చిట్టి తల్లి మోముపై ఓ చిరునగవును చిందింపచేయించలేని
నీ దేవుడు నా దేవుడను వాదము తీవ్రమని నే నిరసించనీ
మతమన్నది చెప్పదు మరియొక ప్రాణమును తీయమని
హితమన్నది తెల్పును తన సాటి జీవిని ప్రేమించమని
మతతత్వముకు తగురూపము మానవత్వమని ఏనాటికో మనిషి గుర్తించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదికి ఒక సద్భావమ్మును పంచ
********************
జబ్బలు చరచి విర్రవీగిన జరాసంధుని
దెబ్బగొట్ట, నిట్టనిలువుగ చీల్చు ద్వాపరయుగమిది కాదె
దిమ్మదిరుగు దెబ్బొకటి గూబకి తగిలించి
అమ్మతోడు అడ్డముగా నరుకు కలియుగము నేడు చూడె
ప్రేమను పంచు తల్లిదండ్రులని బాధించిన
మామను పిడిగుద్దులతో చంపుటకు ద్వాపరయుగమిది కాదె
దడపుట్టు పల్కుల ఘీంకారము సేయుచు
తొడగొట్టి సులువుగ చంపదగిన కలియుగము నేడు చూడె
విశ్వహితముకోరి రాజనీతి నెరపువేళ
విశ్వరూపము దాల్చి క్రోధము తెల్పుటకు ద్వాపరయుగమిది కాదె
విశ్వామిత్రునికైనా లేని శక్తుల ద్వార
విశ్వాసఘాతకుని కంటిచూపునే చంపు కలియుగము నేడు చూడె
అభినవ చిత్రమున చంపుట నరుకుటెంత సులువో మీరెంచ
మొక్కపీకితె చాలు పీకతెగకోసెడి హింసను మీ ముందుంచ
ప్రతినాయకుని చంపు తీరు మారిన పద్ధతినిట్లు నే వివరించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*********************
ధూళిరేణువులు సూర్యకిరణ సాక్షిగ ఎగిరెనాయె
ఇంటనున్న యజమాని ముఖమంత వాలినాయె
పెను భారమయిన నాసిక దురదభరితమాయె
ఓపక మూతపడు కన్నులు నీటిమూటలాయె
కంగారున శిరము పైకిలేచి చివ్వున దిగినదాయె
దుమ్ము సెగ రేపిన తంటాలిట్లు తుమ్ములాయె
బారెడు పొద్దెక్కి లేచి, కాళ్ళు బార్ల చాపి, పళ్ళు ఇకిలించ
పేపరు చదువుచు విసురుగ కాఫీ ఇమ్మని హుంకరించ
విసుగుచెంది గృహలక్ష్మి తన చేతి చీపురును దులపరించ
గృహధీరుడిట్లు ఉలికిపడి చిరంజీవుడయ్యి పునర్జన్మించ
ఈరీతిగ ఆదివారమున
ఉషోదయము కాదె తెలుగింట ఒకపరి తొంగి చూడదలచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
************************
(తుమ్మినపుడు “చిరంజీవ” అనటము మీద సరదాగా రాసిన పద్యమిది. కాకపొతే ఒక విషయము చెప్పదలచాను. తుమ్మినపుడు ఇలా శుభాశీస్సులు తెల్పుట ఒక తెలుగింట సంప్రదాయమే కాదండోయి. ఒకపరి చూడండి ప్రపంచములో రకరకాల దేశముల వారు తుమ్మినపుడు పల్కు మాటలుః
రోమనులు – దేవుడు నీకు శుభము చేయుగాక (Sănătate)
జర్మనులు – ఆరోగ్యమస్తు (gesundheit)
అరబ్బులు – దేవునిని ప్రస్తుతించుము (Alhamdulillah)
రష్యన్లు – ఆరోగ్యమస్తు, వృద్దిరస్తు (bud zdorov, rosti Bolshoi)
చైనీయులు – శతమానం భవతి (bai sui)
ఫ్రెంచివారు – మనోవాంఛాఫలసిద్ధిరస్తు (à tes / vos souhaits)
ఐరిష్ వారు – దేవుడు మనతోడుండుగాక (Dia linn)
మంగోలియన్లు – దేవుడు నిన్ను శమించుగాక (Burkhan örshöö)
దేశములు వేరయినా కొన్ని కొన్ని విషయములలో మనుషుల భావములు ఒక్కటే కదా)
*********************
తొలుత
ధవళకాంతులీను అన్నపూర్ణరూపు బాసుమతి
పసిడికాంతుల మసాలా సాక్షిగా కలియతిప్పితి
మదిని దోచు కాయగూరలు మనసారా తరిగితి
కొసరు రుచులకై కొత్తిమీర, దినుసులు కల్పితి
అటుపిమ్మట
వుల్లిముక్కలు దోరగా తరిగితి కంటనీరురాగా
మిరప, దోసముక్కలు చేర్చితి మమకారముగా
టమోటాను తమ దరికి చేర్చమనెనవి గారాబంగా
అన్ని కలిసి ఓలలాడెను పెరుగు కప్పునిండుగా
వెరసి తయారయ్యిన
వెజిటబుల్ బిరియాని వెల్లడించు తన ఉనికిని
పన్నీరు బిరియాని వెదజల్లును పరిమళాలని
చోళె బిరియాని హేళీ పెంచు రుచి రంగరింపుని
దమ్ము బిరియాని దుమ్మురేపదా చప్పదనాన్ని
అటువంటి
బిరియాని కాదె భిన్నరీతులలో జిహ్యచాపల్యమును పెంచ
హైదరాబాదు భవనమందు ఇట్టి నిత్యకృత్యమును వీక్షించ
మనసు వశముతప్పి ఇంటికొచ్చి వంటగదిన నే ప్రయోగించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*******************
మది తొలుచు మధుగ్లాసు నిం
పాదిగ ఎత్తి తొంగి చూడవలయును ప్రప్రధముగ
అదిమిపట్టి దానిని చేతి మధ్య
కిందికి ఒలకకుండ తిప్పవలయను అటుపిమ్మట
మధురమగు దాని సువాసన
వదలకుండ ఆస్వాదించు నాసికాగ్రమున తదుపరి
అధరములకు అంటీ అంటనట్టి
అదుపు తప్పని ఒక చిన్ని చప్పరింత చేయుమరి
గోళాకార సూరీడు గొంతును
హాలాహలమువలే మండించిన అనుభవాల
కోలాహలమును తనివితీరగ
చాలాసేపు ఆస్వాదించిరేని నైపుణ్యము మీదె
యని
మధుపానాస్వాదనా మర్మము శిక్షకుడు బృందసభ్యులకు ఉద్బోధించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనులందరికి విషయమొకటి ఎరుకపరచ
(తాగి తందనాలాడుట చెడు అలవాటు అనే విషయము తెలిసినదే. “అతి సర్వత్ర వర్జయేత్” అని గుర్తెరిగి, అంత తప్పతాగక కేవలము మధువును ఆస్వాదించు అనుభవమునకు కూడా శిక్షణ రూపములో తరగతులు (Wine Tasting Sessions) నిర్వహిస్తారని నాకు 2007లో మాంచెస్టర్ యూనివర్శిటీ పార్టీయందు తెలిసినది. తాగుట అలవాటు లేకపోయినా ఉత్సాహము మీర గంటసేపు వీక్షించిన నాకు శిక్షకుడు ఆ తరగతిని నిర్వహించిన పద్ధతి నచ్చింది. సోషల్ పార్టీలలో ఇలాంటి శిక్షణా తరగతులు నిర్వహించుటకు కూడా Training/certification కోర్సులను ఒక సరదా వ్యాపకములాగా చాలామంది నేర్చుకుంటారని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాను.
శిక్షకుడు చెప్పినదానిననుసరించి, మధుపానాస్వాదనము చేయుటకు Five S Steps వుంటాయిట (See, Swirl, Smell, Sip, Savor). వాటిని అచ్చంగా తెలుగులో వివరించు ప్రయత్నమే ఈ పద్యము. ఆ శిక్షణలో - మధువు సేవించుటకు వీలైన గ్లాసుగురించిన వివరము దగ్గరనుండీ, దానిని పట్టుకును నేర్పు, మధువును నాలుక మీద తేలియాడించు విధానము, మధువును రుచిచూసి దాని తయారీగురించి చెప్పు నైపుణ్యము – ఇవన్నీ తెల్పినారు. మీకు ఆసక్తి వుంటే ఈ వీడియో లింకు చూడండి: http://www.youtube.com/watch?v=RpAdejLlN24)
***********************
నండూరివారి ఎంకి నడుమొంపులని
అల్లసాని వరూధిని హరిణాక్షువులని
అందాల బాపు బొమ్మ ఒయ్యారాలని
కలగలపిన ఆంగ్ల చిట్టితల్లివి నీవేయని
నా గృహసీమకు నిను స్వాగతించనీ
నా గారాలపట్టీకి తోడుగ ఉండెదవని
నా కంటిపాప కంటి మెరుపువి నీవని
నా బంగారుతల్లికి సింగారము నీవని
తన సరదా ఆటపాటల నెలవుకమ్మని
తన అలకలకు, అల్లర్లకు ఆలంబనిమ్మని
తన ఊహలకు, ఊసులకు ఊపిరినివ్వమని
తన బొమ్మల ప్రపంచానికి రాణివి నీవని
పేస్టులు, బ్రష్హులు, సోపులు, షాంపూలు
రిబ్బన్లు, హెయిరుబాండ్లు, బాండెయిడ్లు
టవల్సు, కర్ఛీఫులు, పిల్లోలు, బ్లాంకెట్సు
మంచాలు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు
స్టిక్కర్లు, పోస్టర్లు, కర్టెన్లు, వాలుపేపర్లు
బాక్సులు, బ్యాగులు, డస్టు బిన్నులు
ఇందుగలవందులేవని సందేహము వలదు
లావణ్యమగు నీ రూపు నా ఇంటినిండా కలదు
ఓ అందాలరాణి బార్బీ, నమ్మవు కాని నువ్వు
నిత్యము నీ నామస్మరణము నేకావించ
నీ గులాబీరంగు నా మనసు తేలికపరచ
నిను కనని కనులు, తలవని పెదవులెంచ
అవి ఆడపిల్ల తండ్రిని కావని నే విశ్లేషించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ
జనుల మదిని ఉల్లాసపరచ
(అందాల బొమ్మ బార్బీ ఉండని ఆడపిల్లల ఇల్లు ఈరోజుల్లో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కవితాధోరణి పక్కన పెడితే, ప్రామాణిక’ బార్బీ బొమ్మ ఎత్తు అయిదడుగుల పదకొడు అంగుళాలు వుంటుంది. ఆ ఎత్తుకు అనుసరించిన ప్రామాణిక శరీర కొలత 36-18-33 ప్రకారము చూస్తే అలాంటి బొమ్మ నిజంగా ఆడపిల్ల అయివుంటే ఆరోగ్యముగా వుండదని చాలా వాదోపవాదాలు వున్నాయి. ఆ నడుముకొలత నిజముగా సాధ్యముకాదని, అంత సన్నటి నడుము అనారోగ్య హేతువని వైద్య శాస్త్రము చెప్పుతుంది. అది తెలియని ఆడపిల్లలు ఆత్మన్యూనతాభావానికి గురవుతారని మరో విమర్శ. కాకపోతే, కవితను కవితగా, బొమ్మను బొమ్మగా చూచినప్పుడే అందమూ ఆనందమూ అని నాతో అందరూ ఏకీభవిస్తారు కదా)
****************
భోగి రోజైననేమి లోకలు ట్రైను బోగీల ప్రయాణము తప్పదాయె
కనుమ పూటైనకాని ఇసుమంత వెసులుబాటు కానరానిదాయె
ముగ్గుముచ్చట్లు లేని ఫ్లాటు – రగ్గుదుప్పట్లుపై పూలు చాలునాయె
గొబ్బెమ్మ మాటెత్త నన్ను సుబ్బయ్య మాదిరి వింతగ చూస్తిరాయె
హరిదాసు కీర్తనలు దేవుడెరగు ఆదిదాసు షూలేసు కనపడదాయె
డూడూ బసవన్నమేళాలు ఢంఢం ఎఫ్ ఎమ్ మోతలో కలసిపోయె
గారెలు, పులిహోరకు టైమెక్కడ బారెడు పని అఘోరించినదాయె
పళ్ళు మాత్రమే తిని సరిపెట్టి భోగిపళ్ళ ఊసులు మరిచితిమాయె
అచ్చంగా తెలుగు సభ్యులకు
ముంబయి బ్యాంకు వాసుల సంకురాతిరి తీరిట్లు వివరించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*****************
సిరికిన్ చెప్పక వడివడిగ నీ
దరికిన్ రాడోయి వైకుంఠంబును దాటి చక్రధరుడు
హరి “నిన్ తప్ప నే తలవనె
వ్వరినిన్” అన్నగాని దర్శనమీయడు నరశింహుడు
ప్రాణముపైకొచ్చె, నీవె దిక్కు ప్ర
మాణ పూర్తిగ అన్నా కనికరించడు భోళాశంకరుడు
ప్రణమిల్లి నీవు మొక్కినగాని క
రుణతొ ఛేధించు మర్మము తెల్పడు కృష్ణభగవానుడు
ఓ భారతీయుడా
పిలిచితివా నీవు దేవుళ్ళను ఏరికోరి రైలు టిక్కెట్టు కొరకుగాని
అలసితివా వారెవ్వరూ ఈ విషయమున నీకు తోడు రాలేదని
మరచితివా నీవు పఠించిన వారిలీలలు పురాణ కాలమునవని
గమనించితివా ఏ ఒక్క దేవుడూ రైలుప్రయాణము చేయలేదని
నమ్మబోతివేని నీవు, మచ్చుకకి గమనింపుము…
మూషికధారి అయిన గణపతి
నెమలివాహనమెక్కిన సోదరుడు సుబ్రహ్మణ్యము
నందిని వదలని తండ్రి శివుడు
సాగించుతురేని తమ ప్రయణములు జంతువులపైనన్
అందువలన
ఆనులైను బుకింగు ఈ దేవుళ్ళకు తెల్సునని నీవెట్లు పరిగణించ?
లాగిన్ను, కనెక్టివిటి, రిజర్వేషను, పేమెంటు లీలలు అనుభవించ
ఆ దైవము రైలుప్రయాణీకుని రూపేణ ఏనాటికో మరల అవతరించ
అపుడుకదా వాని మనసుమారి మనను IRCTC నుండి రక్షించ
అది ఏనాటికి జరుగునో నాకు తెలియదే మీరెంతైనా ప్రశ్నించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*******************
వస్తున్నానిదిగో వేచియుండమనిన
చేస్తున్న పనిని సైతము మాని యతని ఆలోచన
లిస్తున్న మధురానుభూతులనుభ
విస్తున్న తరుణీమణి మనసు మర్కటమాయెనె
వచ్చెడివాడు తనను నిత్యము మర
పిచ్చెడివాడు, బహుచక్కనివాడు, పెదవులకు
నచ్చెడివాడు, సమయపాలన పా
టిచ్చేడివాడు, వాడొచ్చువరకు గుండెగుబగుబలాడె
వాడొచ్చెడి తలపు మదికి రేపెట్టెను
ఈడొచ్చిన ఒంటి వేడిమి తాలూకు అనుభూతిని
తోడొచ్చెడి వాడి చేతి పరిమళముచే
మూడొచ్చును ఉప్పుకారము తినునెవ్వరికైనన్
వాడెక్కి వచ్చెడి బండి కనపడినంతనె
చెయ్యెత్తి కొట్టెడి డోరుబెల్లు చిరుశభ్దము వినినంతనె
వాడిచ్చు వేడితాయిలం పెదవినంటినంతనె
మోగిచ్చు గుండె వీణానాదము వీనులవిందు కాదా
ఓ జనులార
ఇచటనే మీ ఆలొచనలాపుట నాకెందుకో యుక్తమనిపించ
వర్ణించిన దృశ్యమ్ము సరసమయము కాదని మీరు చిత్తగించ
అతివలిట్లు “పిజ్జాబాయ్” కొరకు మధ్యాహ్నమున నిరీక్షించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాస పరచ
********************
ముర మురలాడు గంజలు గుప్పెడు
జర జర చేతుల మధ్యనుండి వాలుగ జాలువారినెడల
బిర బిర వాటిని పట్టుకొను వీలులేక
గర గర గొంతున నుములుట కొరకు రుచిని కోరినంతనే
చిర చిర తీపి బెల్లపు సొగసు సారము
పెర పెర లాడునంత గట్టిపడు వరకు చల్లపరచి, పాకముచేసి
బర బర గింజలను దానితోడ చుట్టచుట్టి
కర కర నోటిన చేరదీసి, అరగదీసి, సాగతీసి, రుచిచూపిన
మరమరాల ఉండ కాదుటే మన మనసునిట్లు మురిపించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
********************
ఆ యుగమున, నా స్వామి హనుమంతుడు….
ఎగిరెను ఆకసమున ఆరాటముతో
ఎరిగిన పండులా కనపడెనని ఆ సూర్యబింబము
ఎగిరెను ఆకసమున ఆవేశముతో
ఎగిసిన అలల సాక్షిగా సల్పుటకై స్వామికార్యము
ఎగిరెను ఆకసమున ఆనందముతో
ఎగతాళి చేసినవారి పీచము వాలముతో అణచదలచి
ఎగిరెను ఆకసమున ఆందోళనతో
ఎడతెగని ఉత్తేజముతోడ తనవారిని రక్షించుకొనదలచి
ఆ విధముగ ఆకసమున ఆ యుగమున …
ఎగురుటయే ఎరిగిన నా సామి
ఎగురుటకు ఈ యుగాన సంశయించెనెందుకని మనసున
ఎగిరిన ఆలోచనలు పరిశీలించిన
ఎగిరిపడినెదొక ఆలాపన ముఖపుస్తకము చాటింగు సాక్షిగా
ఏల యనిన, అచటినుండియే కదా ఆకాసములోకి….
ఎగరేసెను ఎదురింటి అబ్బాయి పక్కింటి అమ్మాయికి…ఓ ముద్దు
ఎగరేసెను కాలేజీ కుర్రాడు విలేజీ కుర్రదానికి….ఓ ముద్దు
ఎగరేసెను అమలాపురం బుల్లోడు అమెరికా బుల్లెమ్మకు….ఓ ముద్దు
ఎగరేసెను ఆఫీసులో మారాజు ఇంట్లోని మారాణికి…ఒ ముద్దు
ఎగరేసెను హార్డువేరు వీరుడు సాఫ్టువేరు సుందరికి….ఓ ముద్దు
ఈ ఎగరేసిన ముద్దులన్నీ కలగలసి ఆకసమున విహరించ
దినమునొక కోటి రీతిన ఆ గగనమంతయూ అవి ఆక్రమించ
బ్రహ్మచారి నా స్వామి ఎగురటకు ఎక్కడనే అవి వీలు కల్పించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
******************
తెలుపు రంగు తెలిపిన భావముకు
ఎరుపులీను దానిమ్మ మెరుపులు మధ్యన తోడురాగ
తలపుల నిండు జీడిపప్పు పలుకులు
కలపకుండ అలంకరించిన ఒద్దికయిన తీరుచూడగరారె
ఆవురావుమనిన ప్రాణానికి
ఆవులించు నిద్ర తెప్పించునట్టి భోజనమదియె కాదె
ఆవఘాటు దట్టించి తోడుగ
ఆవకాయ ముక్క నంచిన స్వర్గలోకము కానరాదె
కమ్మదనములో దాని సాటి ఏదె
అమ్మదనము మీర కొత్తిమర, కారెట్టులను నింపరాదె
నెమ్మదమున ఊరుమెరప అద్దిన
‘హమ్మ’దనపు భావనలు మన మదిన పెంపునదియె
దద్దోజనమునీ రీతిన తెలుగునాట భుజించి బ్రేవుమని త్రేన్చ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*******************
నేలమీదుండనివ్వని ఊహల తెరతీయు
నెలలు నిరీక్షించిన నాయకుని చిత్రము విడుదలయ్యినంతనె
నేడె చూడండని నిండుగ పెద్ద ప్రింటువేసి
నేర్పుగ దృష్టి తమవైపు తిప్పుకొనరె అభిమానులు పోస్టరేసి
అరచేతి మందమున జిగురు తీసి
అరవీర భయంకర నాయకుని చిత్తరవు వెనక ప్రేమగ రాసి
అరమోడ్పు కనుల సుందరి ధీటుగ
అరవిరిసిన అందాల ముస్తాబు చేయరె పోస్టరుపై పూలు వేసి
ఏ పుట్టలో ఏ పామో ఎవరికెరుక
ఏ పోస్టరులో ఏ కధనము బలమో అభిమానికెరుక
ఏ రీతినైననూ తన విలువ తెలుప
ఏ నాయకుడైనా పాకులాడెడిది పోస్టరు కొరకు కనుక
ఆ సూత్రమును ముఖపుస్తకమునకు అన్వయించ….
పోస్టురాసెడివాడొకడె కాడోయి మొనగాడు
జనులా పోస్టుపై పోస్టరులేయని తరుణాన వాడు నీరుకారు
పోస్టు విలువనిట్లు పోస్టర్లు పైపైకి పెంచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*********************
నీ రూపమంటే పిచ్చి అనగానే
అతిలోక సౌందర్యానికెవరయినా దాసులేగా అని మురిసిపోయా
నీ నవ్వంటే పిచ్చి అనగానే
చల్లని వెన్నెలకి సమానమైన చల్లదనము నా నవ్వుదేననుకున్నా
నీ మాటంటే పిచ్చి అనగానే
గలగల పారే సెలయేటి హోరు కలపోసిన మాటతీరు నాదనుకున్నా
నీ నడకంటే పిచ్చి అనగానే
హొయలలొకే నడక అందం నెమలికే సొంతమని ఎవరన్నారనుకున్నా
నీ కోపమంటే పిచ్చి అనగానే
మనసుకు నచ్చిన మనిషి కోపమయిన మురిపమేకదా అనుకున్నా
పిచ్చిగ నిను ప్రేమించాననగానే
మరుగొల్పె మన్మధ బాణము ధాటికి సరినిలువలేరెవ్వరు అనుకున్నా
ఈ పిచ్చిలన్నీ పిచ్చ పిచ్చగ ప్రతినిమిషము నను మురిపించ
ఆకాశవీధిలో అందాల రాణిని నేనై ప్రతి నిమిషము విహరించా
నా మనసులో భావాలను తనకి పూల రూపమున తెలుపదలిచా
కానీ, నాకెదురైన అనుభవము జన్మజన్మల సాటిదని నేనూహించ
నా గులాబీ పువ్వుని తను నోటిన నమలటం కనులారా నే వీక్షించా
అతని ‘పిచ్చి’కి అసలర్ధము తెలిసి అపుడు మౌనముగ నే రోదించా
ప్రేమికుల రోజునిట్లు….
ఓ పిచ్చి ప్రేమ కధను మీ కనుల ముందర సాక్షాత్కరించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
******************
శ్రవణాది నవ విధ భక్తి మార్గమ్ము తెలిపెనే భాగవతము
భగవంతుని చేర్చుటకు మన మదిలోని భక్తి భావము
రాజయోగాది నాలుగు యోగములు చూపెనే గీతాసారము
భగవంతునిలో ఐక్యమగుటకు భక్తులకొక గొప్ప సాధనము
కీర్తన రూపములో నృత్యము చేయించినదే భజగోవిందము
భగవంతుని ధ్యాసలో సదా నిమగ్నమగు అలౌకికత్వము
గడచిన కాలమిట్లు కఠిన భక్తి మార్గములు మనకుద్బోధించ
సులువగు ఈనాటి మార్గము మీరు కాదె చిటికెలో గ్రహించ
“అంబికా దర్బారు బత్తి” చాలదే మనకి ధూపమాఘ్రాణించ
సరాసరి అదియే భగవంతుడిని భక్తునికి అనుసంధానపరచ
ఎక్కడ వెలిగించినంతనే అక్కడ పూర్తిగ పవిత్రతని చేకూర్చ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
*******************
ఇల్లు చేరిన కూడ చేతిన విడువక
సెల్లు ఫోను కాన్ఫరెన్సు కాల్సునందు పకపక నవ్వుచు
ముల్లు దిగిన రీతిన మనసులోని
జల్లుమనిన భావాలను గుచ్చిన పతిని చూచినపుడు
పెరుగు పచ్చడి ప్రేమమీరగ వడ్డించ
పరుగున కంచమున అన్నము కలపి లొట్టలేయుచు తిని
ఎరుగును మా అమ్మయే కదా నీకిది
మరుగున నేర్పించనదియని కూయు పతిని చూచినపుడు
వెన్నెల విరగకాచు పున్నమి వేళ
వన్నెలు చిందించెదను రా రమ్మని సరాగాలు పోవుచు
కన్నులకింపు చీర కట్టుకొనినగానీ
పెన్నులతో ఆఫీసు ఫైలుపై లంఘించెడి పతిని చూచినపుడు
బుంగమూతి పెట్టి కాదె
చాగంటి వారిపై తెలుగింటి ఆడపడుచు తన ధ్యాస మరలించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
******************
శ్వాస పీల్చుకొను టైములేకుండగ
ధ్యాస మొత్తము పని పైన ఉంచి, లంచుబాక్సు తిను వీలులేక
జ్యూసు ఒక్కటి తాగునపుడు ఫోను చేసి
గ్యాసుబిల్లు కట్టలేదెందుకని కేకలేయుచు సతి అరచినపుడు
అర్దరాతిరి గంట ప్రయాణము చేసి
అర్దాకలితో ఇంటికొచ్చి షవరు స్నానమాడుచున్న సమయాన
అర్ధాంతరముగ స్నానగది తల్పు తీసి
అర్దమెకాదు మీయమ్మ సంగతేంటోయన్న సతిని చూచినపుడు
కుందనపు బొమ్మవు నీవెగాయని
చందన బ్రదర్స్ పట్టుచీర కొనెదము రమ్మనిన, షాపువాడిని
అందని పైపైన చీరలేవో చూపమని
వందల వెరైటీలు చూచి, ఒక్కటీ కొనని సతిని చూచినపుడు
భృకుటి ముడిచి కాదె
దీనమ్మ జీవితమని మగడు తన్ని తాను దీవించుకొనదలచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
********************
కలలకు నెలవైన నిద్రావస్థనుండి
కిలకిలరావాల పక్షుల రెక్కల చప్పుడుకు మేల్కొని
గలగల మువ్వలసడినిచేయుచు
జలజల నీటిధారల స్నానమాడు ప్రియసతిని తలచి
తలుపు తెరుచి, తనని ప్రేమగ నిమిరి
వలపుల మధురిమకు నీవెగా తోడుయని ముద్దాడి
వెలుపలి ముడిని నెమ్మదిగ విడదీసి
తలపులు మత్తెక్కించు తన పరిమళమునాస్వదించి
పాల నురగల లాలిత్యము కలగలసిన
పసిడితనపు కాంతులీను చిక్కటి రుచులను ఏరికోరి
పైకెత్తి దించి, గిరగిర తిప్పి, తీపిరుచిలో
కలగలసి కరిగిపోవుచున్న తనను చాల వేడెక్కించి
ప్రేమగ చేతిలోనికి తీసుకుని
గోముగ ఒకపరి నఖశిఖ పర్యంతము పరికించి
హాయిగ కనులు మూసుకుని
మురిపెముగ తన పెదిమలకు దగ్గరగా రానిచ్చి
తాగినపుడె కదా
బ్రూ ఫిల్టరు కాఫీ రుచి తెలిసిచచ్చునదని నే ముక్తాయించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
***************
పోస్టు పడిన వెంటనె జాలువారునట్టి
లోకుల లైకుల పరంపరలు తట్టుకుని
ఎదురొడ్డి ధైర్యమ్ముగ నిలిచె శక్తి కొరకు
మునగ చెట్ట్టు కొమ్మకాదె నాకు పాడి
పిమ్మట పేలునట్టి కామెంటు బాణాల
గాయాల బారిన సులువుగ పడకుండ
హాయినిచ్చు కునుకు తీయుటకొరకు
మునగ చెట్ట్టు కొమ్మకాదె నాకు పాడి
పైకెత్తి తమ భుజముపై మోయుననొకరు
చెయ్యెత్తి మనసార ఆశీర్వదించుననొకరు
పెట్టు మొహమాటము తప్పుకొనుటకు
మునగ చెట్ట్టు కొమ్మకాదె నాకు పాడి
నా పేరు చెప్పివచ్చె భావాల వెల్లువకు
నా మీదకురికెత్తే సూటైన ‘పదములకు
నా మనసు చలించక నిశ్చలమగుటకు
మునగ చెట్ట్టు కొమ్మకాదె నాకు పాడి
చెట్టులెక్కగలవా ఓ నరహరి, పుట్టలెక్కగలవా ఓ నరహరి
అని మునగ చెట్టు మీదకు ముదమార నను ఉసిగొల్పురి
కనుక ఓ “అచ్చంగా తెలుగింటి” ఆడపడుచులారా…..
మీకిటులనే కొమ్మపైనుండి శుభాకాంక్షలు నే తెలియపరచ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదిని ఉల్లాసపరచ
******************
మెలకువ వచ్చినంతనే జారిపోవు తియ్యటి జ్ఞాపకమా
లేచిన వేకువనే నిను చూచు ఆరాటము పెంచకుమా
మనసుకు హాయి పంచు నీ కౌగిలింత నాకు లోకమా
అనిపించేలా కట్టిపడివేసిన నీ లీల నాకు తెలుసుమా
కనులు మూసినంతనే నా కోసమేగా నీవున్నావంటూ
కనులు తెరచినంతనే ఊరికే బుంగమూతి పెడతానంటూ
కనురెప్పల సాక్షిగా నీ ధ్యాసలో నను దాచిపెట్టుకుంటూ
కనుసైగతో నా కంటిపాపలు నీకై వేచియున్నామంటూ
పాడే ఈనాటి ఈ భావాల మధురిమ చూచినంతనే
నా సతికి వేసినదొక చిరు అనుమానం
అంత ప్రేమించే నిన్ను వదిలి నేను ఆఫీసులో ఎలా ఉంటానని
నా చిట్టి తల్లికొచ్చె ఉడుకుమోతుతనం
ప్రతీ వారాంతమూ నీకు తప్పనిసరిగా నా సమయమిస్తానని
నా బాసు కన్నులలో మెరిసెనొ సందేహం
నీ ధ్యాసలో పడి నేను సరిగా పని చేయుట మానేస్తానేమోనని
ఇట్లు కాదా ఆ నిద్రా దేవీ సాంగత్యము నా….
అలసి సొలసిన జీవితానికి మాధుర్య మకరందమందించ
ఇది భవదీయ శ్రీనివాసువాచ, జనుల మదినుల్లాసపరచ
(ఈ రోజు ప్రపంచ నిద్రా దినోత్సవము సందర్బముగా)
No comments:
Post a Comment