ఉగాది కవి సమ్మేళనం
- కంచర్ల మాధవి
మా పెరడు వేదికగ కవుల సమ్మేళనము
చిరుగారి నీరెండ పుష్పాల పరిమళము
తలవూచి చెట్లన్ని స్వాగతం పలుకగా
కవులు వచ్చారండి కువకువాలాడుతూ...
గోరింక తనకవిత గానమ్ము చేయగా
కొబ్బరి చెట్టుపై కొలువు దీరింది
మానవులు పక్షులు మామంచి మిత్రులని
మనసులో మమతను మధురముగ పాడింది
మా పెరడు వేదికగ కవుల సమ్మేళనము
కవులు వచ్చారండి కువకువాలాడుతూ...
జామ చెట్టు మీద చిలుక కవిగారు
ఆడపిల్లా చదువు అవనికే వెలుగనీ
అలతలతి మాటలతో అలవోకగా తన
గేయమును హాయిగా గానమే చేసింది
మా పెరడు వేదికగ కవుల సమ్మేళనము
కవులు వచ్చారండి కువకువాలాడుతూ...
పరిసరాలన్ని పచ్చపచ్చగ ఉంటె
కాలుష్య రాక్షసీ కోర చాపక ఉంటె
చీకు చింతా లేక జీవించనా అంటు
పంచమ స్వరములో పాడింది కోయిల
మా పెరడు వేదికగ కవుల సమ్మేళనము
కవులు వచ్చారండి కువకువాలాడుతూ...
కళ్లు తెరిచీ చూడ కలకరిగిపోయె
దొంతరల ఇంటిలో నేను బందిగ నేడు
చిననాటి గురుతూ చిగురించదా అంటు
ఎంతగానో నేను ఎదురు చూస్తున్నాను
మా పెరడు వేదికగ కవుల సమ్మేళనము
కవులు వచ్చారండి కువకువాలాడుతూ...
No comments:
Post a Comment