ఆసరా - అచ్చంగా తెలుగు

   ఆసరా 

డా:బల్లూరి.ఉమాదేవి.


తన రక్త మాంసాలనే స్తన్యంగా చేసి బిడ్డ కడుపు నింపేది తల్లి 
రెక్కలు ముక్కలు చేసుకొని బిడ్డలను ప్రయోజకులను చేసేది తండ్రి 
పసితనంలో రొమ్ముపై గుద్దినా తప్పటడుగులతో జిలిబిలి నడకలు నడిచినా
మురిసి మైమరచి పోయేది అమ్మా నాన్నలే
పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని 
తాము పస్తులుండి పిల్లల కడుపునింపి ఉన్న ఆస్తి పాస్తులనెల్ల హారతికర్పూరంలా కరిగించి
 ఉన్నతచదువులు చదివించి ఆబిడ్డలు సంపాదనా పరులై సంసారులై 
ఆనందంగా జీవించాలని వారి చల్లని నీడలో చరమాంకంలో విశ్రాంతిగా జీవితం వెళ్ళబుచ్చాలనుకొంటే...
 అదిగో----అప్పుడే --ప్రేమగా పెంచిన ఆ పిల్లల్లో 
స్వార్థమనే భూతం వికృతంగా కోరలు చాచుకొంటూ వికటాట్టహాసం చేస్తూ 
వడివడిగా వస్తోంది, మనం మనది అనేభావన అంతమై 
నేను నాది అనే చట్రంలో ఇమిడిపోయి స్వార్థం పెరిగి
 కుటుంబం అంటే నేను-నాభార్య నా పిల్లలు మాత్రమే అంటూ 
గిరి గీచుకొని ప్రాణానికి ప్రాణంలా పెంచిన బిడ్డలే 
కసాయివారిలా ప్రవర్తిస్తూ కన్నవారిని కసిరికొడితే పాలు తాగిన ఱొమ్మునే
 కసిగా గుద్దితే ఏది దారి ఆ వృద్ధులకు? ఏది ఆశ ఆ నిస్పృహులకు?
ఇదిగో____ ఇప్పుడే ____ నే నున్నానంటూ అమ్మలా ఆదరిస్తానంటూ
నాన్నలా ఆసరాగా వుంటానంటూ ఆత్మీయతను పంచుతానంటూ
కలతలకు కన్నీళ్ళకు వీడ్కోలు చెప్పమంటూ 
అన్నింటికీ నేనున్నాను నాచెంత నిరాటంకంగా వుండొచ్చు అంటూ        
అభయ హస్తమిస్తూ ఆలయంలా వెలసింది
ఇక్కడ అందరూ బాధా తప్తులే ఒకరికొకరు బాసట ఒకరికొకరు ఊరట
కక్షలు కార్పణ్యలు లేవిట పేదా గొప్ప తేడా లుండవు 
భేషజాలు లేవు బిడియాలు లేవు అందరూ ఒకే కుటుంబంలోని వ్యక్తులే 
ఒకే ఛత్రం క్రింద నివసించే ఆప్తులే 
విరిగిన మనసుకు సాంత్వన అలసిన తనువుకు ఆలంబన దేవాలయంలా పవిత్రమైన ఆశ్రమం
వృద్ధాశ్రమం 
అందుకే గుర్తుంచుకోండి కన్నవారిని నిరాదరించే పిల్లల్లారా 
చరిత్ర చర్విత చర్వణమవుతుందని మరవకండి
భవిష్యత్తులో మీ స్థానం ఇదేనని 
మీ పిల్లలు మీకు ఇక్కడే "సీటు " "రిజర్వు"చేయిస్తారని 
మరువకండి మారండి మానవులుగా జీవించండి 
మానవత్వాన్ని నిలబెట్టండి కలకాలం కన్నవారికి సుఖ సంతోషాలందివ్వండి
(బిడ్డలంతా ఇలా వుంటారనికాదు .కన్నవారిని నిరాదరించే  వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. )

No comments:

Post a Comment

Pages