అంకెలు---ఐశ్వర్యము - అచ్చంగా తెలుగు

అంకెలు---ఐశ్వర్యము

Share This

అంకెలు---ఐశ్వర్యము 

- చెరుకు రామమోహనరావు 


అంకెలకు ఆది పునాది ఈ వేద భూమి .వేదములు ఐశ్వర్య నిధులు. ఐశ్వర్యమంటే సిరి సంపద మాత్రమేకాదు . ఈశ్వరీయ మైనదంతా ఐశ్వర్యమే. నిర్గుణ పరబ్రహ్మ మొదలు సగుణాత్మకమైన పరమాత్ముని పది ప్రధాన అవతారములు 0 నుండి 10 వరకు ఉన్న అంకెలలో ఇమిడివున్నాయి. ముక్తసరిగా ముచ్చటిస్తున్న ఈ వ్యాసములో అంకెల ఔన్నత్యాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నము చేస్తాము.
0:పూర్ణము:నేటికి కూడా ఏ గణిత పుస్తకములో చూసినా సున్న ,శూన్యము,పూజ్యము పూర్ణము అని ఎపేరుతో పిలిచినా భారతీయులు కనుగోన్నారనే వ్రాయబడి వుంటుంది. కానీ మిగతావి అరబ్బులు కనుగొన్నారని చెబుతారు కానీ అది నిజము కాదు. పేరు పొందిన బాగ్దాద్ ఖలీఫా హారున్ -అల్-రషీద్ కన్నా పూర్వము నుండి కూడా అరేబియా దేశాలకు మనదేశముతో స్నేహపూర్వకమైన నౌకా వర్తక వాణిజ్య సంబంధాలుండేవి. అటువంటి తరుణములో మన గణిత సంపద తో కూడా ఖగోళ విజ్ఞాన సంపద మరియు వివిధములైన విజ్ఞానసంపదను తమ దేశములకు తరలించుకొన్నారు. మన వారు కూడా విద్య పంచడమంటే విద్య పెంచడమని తలంచి వారికి ఈ జ్ఞానాన్ని పంచి ఇచ్చినారు. అందుకే వారు గణితమును ఇప్పటికి 'హింద్స' అనే అంటారు . కావున సున్నా తో కూడిన అంకెల ఆవిష్కరణ మన వారిదే కానీ అన్యులది కాదు. ఇవే కాక బీజగణితము అంక గణితము త్రికోణమితి (trigonametry),జ్యామితి(geometry)మొదలగు ఎన్నో ఆవిష్కరణలను ఆపోశనము పట్టిన, పేరుకు ప్రాకులాడని, మహనీయులగు  బోధాయన,ఆపస్తంభ ,మానవ, కాత్యాయనాదులు శుల్బ సూత్రములలో గ్రంధించగా ఆ సూత్ర సహాయములతోనే యజ్ఞ వాటిక తతంగమంతా నేటికినీ నిర్వహించుచున్నారు. అరేబియనుల నుండి ఈ విజ్ఞానమును తమ స్వంతము చేసుకొన్న అప్రాచ్యులు ఈ అంకెలను కనిపెట్టిన గౌరవము వారికంటగట్టి మనకు 'శూన్యము' మిగిలించినారు. 'సోమ్మొకరిది సోకొకరిది'అని గానీ 'అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు' అని గానీ దీనిని అనవచ్చునో అనకూడదో నాకు తెలియదు. 
ఇక అసలు విషయము లోనికి వత్తము. '0' ను పూర్ణమని అంటారని ముందే మనవి చేసుకొన్నాను.అనంతము (infinity)కూడా ఒక విధంగా పూర్ణమే. 
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవావశిశ్యతే 
ఈశావాస్యోపనిషత్తు, శాంతిపాఠము లోని ఈ శ్లోకముతో ప్రారంభమౌతుంది. స్థూలముగా దీని అర్థమేమన 'అది పూర్ణము ;ఇది పూర్ణము;ఆ పూర్ణమునుండి  ఈ పూర్ణము వచ్చినది; ఆ పూర్ణము నుండి ఈ పూర్ణము తీసివేయబడినది. మిగిలినది ఏమిటి అంటే పూర్ణమే.
కావున 0+0 =0;0-0=0, 0x0=0, 0\0=0 అదెవిధముగా అనంతముకూడా (Infinity) అంతే. వ్యాసార్ధము (radius) అంటే అందరకూ తెలిసినదే. స్థిర బిందువైన కేంద్రమునుండి వృత్త పరిధిపై కల బిందువు యొక్క దూరము వ్యాసార్థము. ప్రయాణము పరిధి పై సాగుచున్నంతవరకు ఆ వ్యాసర్ధము తిరిగి మొదటి బిందువును చేరవలసిందే. అంటే పూర్ణము (point) నుండి బయలుదేరి తిరిగీ పూర్ణమును చేరి తన ప్రయాణమును సంపూర్ణము చేసుకొన్నది. అందుకే మన ఋషులు పై రెంటినీ పూర్ణము లేక పూజ్యము అన్నారు. విశ్వాంతరాళములోని ప్రతి పదార్థము భ్రమణము చెందేదే. దేని ప్రయాణము సరళరెఖ లో జరగదు. అది తిరిగి మొదటికి చేరవలసినదే . ఎంత సాగినా విలయము, ప్రళయము వచ్చి లయము కావలసిందే . అందుకే భగవానుని పూర్ణుడు మరియు అనంతుడు అంటారు. 
1. సగుణ బ్రహ్మ సంకేతము: ఈ సగుణ బ్రహ్మనే వేదాలు హిరణ్య గర్భుడు అని మనకు తెలుపుతాయి. బ్రహ్మవిష్ణుమహేశ్వర తత్వ మూలకుడితడు . ఈయనది సమాధి స్థితి. 1 అనంతమైన సంఖ్యలను ఉత్పన్నముచేస్తుంది. 1 కి 1 కలిపితే 2 , 2 కు 1 కలిపితే 3.  ఇట్లు కలుపుకొంటూ పొతే అది అనంతాన్నే చేరుకొంటుంది. తగ్గించుకొంటూ వస్తే మిగిలేది ఒకటే. అంటే మనము ఎన్ని రూపాలలో చూసినా  ఎన్ని రూపాలలో పూజించినా అవియన్నీ ఆ హిరణ్యగర్భుని విభూతి మాత్రమే. అద్వైతమునకు ఇదియే ఆదిమూలము. భూమిపై పగలు 10 అద్దపు ముక్కల నుంచితే ఆ పదింటి లోనూ సూర్యుడు అగుపించుతాడు. ఒక ముక్క తీసివేస్తే సూర్యుడు కనిపించేది 9 ముక్కలలోనే. అంటే బింబము సూర్యుడైతే అద్దపు ముక్కలలోనివి ప్రతిబింబములు. భగవంతుడు (పరమాత్మ) సూర్యుడు అయితే ప్రతిబింబములు ఆత్మలు. ఆద్దపు ముక్కలు ప్రాణులు. అద్దపు ముక్క తీసివేస్తే ఆత్మ పరమాత్మలో కలిసినట్లేకదా. అంటే పరమాత్మ ఒక్కడే అని అది తెలుపుట లేదా. ఇంకొక చిన్న మాట. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి . 
ఆకాశాత్ పతితం తోయం యథాగచ్ఛతి సాగరం 
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి 
ఏ విధముగా వర్షపు చినుకులు విడివిడిగా భూమిపై బడి వాగులై ప్రవాహములై నదులై వరదలై సముద్రములై మహాసాగరములై చివరకు ఒకటౌచున్నవి. . అదేమాట 
ఉపనిష త్తులు కూడ 'ఎకమేవాద్వితీయం బ్రహ్మ' అని అన్నవి. అన్నమయ్య దీనినే 'బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే' అన్నాడు. అది ఒకటి యొక్క గోప్పదనము క్లుప్తముగా. 
2. ద్వంద్వము: చరాచర సృష్టిలో ప్రతిదీ ద్వంద్వమే. 
పురుషుడు -- ప్రకృతి 
ఆత్మ------ పరమాత్మ 
మంచి-----చెడు 
కష్టం-------సుఖం 
జననం== మరణం 
శమ,దమ ఇవి ద్వంద్వములే కానీ పరస్పర వ్యతిరిక్తములు కావు. మనసు వాసనా రహితము చేసుకొనుట శమము. ఇంద్రియ నిగ్రహము దమము. ఒక చిన్న ఉదాహరణతో ఈ రెంటినీ విపులీకరించే ప్రయత్నము చేస్తాను. మామిడి పళ్ళు అంటే మీకిష్టం. ఎందుకో అవి ఇక పై తినకూడదనుకొన్నారు. మామిడి పళ్ళ పై ఆలోచనను మనసునుండి చేరిపేస్తే అది శమము. మీకాళ్ళను కళ్ళను కట్టివేసి మీ బాహ్యేంద్రియములను నియంత్రించుకొంటే పండు పై కోరిక రాను రానూ మాసిపోతుంది.అది దమము.ఈ శమదమాల సాన్నిహిత్యము మిమ్ము ద్వంద్వాతీతులను చేయగలదు . ఈ ద్వంద్వాతీతమే ఆత్మ దర్శనము. ఆత్మ దర్శనమే పరమాత్మ సాక్షాత్కారము(ఒకటి). దాన్ని చేరితే నిర్వాణము(శూన్యము). 
3. త్రిగుణాత్మకము : ప్రకృతి పురుషుల సంయోగమే విశ్వము.అంటే 1.సృష్ఠి 2. స్థితి 3. లయము. ఈ మూడింటికి 1. బ్రహ్మ2. విష్ణు 3. మహేశ్వరులు అధిపతులు. లయము జరిగిందంటే తురీయమే. ఇందుకు సంబంధించిన ఋగ్వేదవాక్యము ఈ విధంగా వుంది : 'సత్యం బృహద్రతం అగ్రం విశ్వాన్ ధారయంతి.' 
బృహత్ = మిక్కిలి పెద్దది; ఋతం = అత్యంత సక్రమ నియమానుసరణ ; అగ్రం =అన్నింటికన్నా ఉన్నతము  అయిన ఈ లక్షణాలు ఈ విశ్వమును ధరించి వున్నాయి. ఇవి ఆ పరబ్రహ్మ లక్షణములు. 
ఇక ప్రణవమును గూర్చి మూడు ముక్కలు మాట్లాడుకొందాము. ఈ శ్లోకాన్ని ఒక సారి పరికించండి. 
ప్రణవోధనుః శరీరోహ్యాత్మా బ్రహ్మా తల్లక్ష్యముచ్యతే 
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్ 
ఇచట పరబ్రహ్మ లక్ష్యమైతే ఆత్మ బాణము . ఓంకారమే విల్లు. లక్ష్యమైన పరబ్రహ్మపై ఆత్మ అనే బాణాన్ని ఏకాగ్రతతో గురిపెట్ట డానికి వలసిన విల్లే ఓంకారము. ఇది 'అ'కార 'ఉ'కార 'మ'కార సంగమము . 'అ'కారము కడుపు నుండి ఉత్పన్నమైతే 'ఉ'కారము హృదయమునుండి, 'మ'కారము కంఠము నుండి ఉత్పత్తి అవుతాయి. 'మ'కార ఉచ్ఛారణ తో నోరు మూత పడుతుంది. దానిని తురీయమంటారు. సాధకుడు సఫలీకృతుడౌతే అతడు శూన్యము లోనికి లయమైనట్లే కదా. మరియొక ముఖ్యమైన విషయము ఓంకారము నాదబిందుకళాధారము. ఈ విషయమును వివరించిన ఓక మహా జ్ఞ్యాని ఉదాహరణ ఈ విధంగా వుంది. 
ఒక అబ్బాయి ఇంట్లో వున్నాడు. బయట, ఇంటిలోనుండి తనకు కనబడని, ఒక ప్రదేశము నుండి అతనికి ఒక కేక వినిపించింది .వెంటనే ఆ బాలుని నోట 'నాన్న' అన్న మాట వెలువడింది. అతని మనో ఫలకము పై తన తండ్రి చిత్రము ఆవిష్కృతమైంది. ఇక్కడ కేక 'నాదము'. నాన్న అన్న తక్షణ భావము 'బిందువు'. మనోఫలకముపై ప్రస్ఫుటమైన ఆకారము 'కళ'(లేక కల). ఈ మూడింటినీ తనలో ఇముడ్చుకొని ఆత్మను పరమాత్మతో అనుసంధించునదే 'ప్రణవము'. 
ఇది మూడు యొక్క ప్రాధాన్యత. 
4. చతుర్వేదములు: ఋగ్యజుస్సామాధర్వణ వేద సారము ఏకేశ్వర సాధనే. ఈ విషయాన్ని నాలుగు వేదములలోని నాలుగు మహావాక్యాలే చెబుతూవున్నాయి. 
1. ప్రజ్ఞ్యానం బ్రహ్మ - వేదజ్ఞాన సారాంశమే బ్రహ్మ --ఐతరేయ ఉపనిషత్తు --- ఋగ్వేదము 
2. అహం బ్రహ్మస్మి -'నేను' ను తెలుసుకొనుటే బ్రహ్మ --బృహదారణ్యకోపనిషత్తు --- యజుర్వేదము 
3. తత్ త్వం ఆసి - 'అది' నీవే - చాందోగ్యోపనిషత్తు --- సామవేదము 
4.  అయమాత్మానం బ్రహ్మ -నా 'అంతరాత్మే'బ్రహ్మ -- మాండూక్యోపనిషత్తు --- అధర్వణ వేదము 
ఈ నాలుగు వాక్యాలలో దేనినిసాధించినా బ్రహ్మ సాక్షాత్కారమే. విశేషమేమిటంటే ఇది చెప్పడము మాత్రమె సులభము. సత్వగుణ సంపన్నులై, సంతత ధ్యాన మగ్నులై, సత్యాన్వేషణా  తత్పరులై,సంసార సరసీరుహ పత్ర గత జలబిందువులై(సంసారమనే తామరాకుపై నీటిబొట్టు వలె ),సంచరించు వారలకు కొన్ని జన్మల తరువాతనైనా తమ తమ ప్రారబ్ధ కర్మలవల్ల పరమాత్మను సాధించ గలరు. మనసు కలిగితే మార్గము దొరుకుతుంది. చతుర్విధ పురుషార్థాలను 
ఇందులకు ఉపకరణములుగా తీసుకొన వచ్చును. ఆ నాలుగూ అందరికీ తెలిసినవే ధర్మార్థకామమోక్షములని. ధర్మముతో కూడిన అర్థము (ధనము) ధర్మ బద్ధమైన కామ్య సాధన కలిగితే మోక్షద్వారాలు వానికవే తెరుచుకొంటాయని పెద్దలంటారు. 
ఈ నాలుగు మాటలను ఈ విధంగా కూడా చెప్పుకొన వచ్చు. ధర్మబద్ధమైన సంపాదన , మోక్షము పైన కోరిక కలిగియుంటే తప్పక జిజ్ఞ్యాసువు పరమాత్మను చెరుతాడు. 
ఇంకొక విషయమేమిటంటే చతుర్వింశతి(24) తత్వములలొ అహంకారము నాలుగవది. అహమన్నది అణగిపోతే అచ్యుతపదమునకు ఆటంకము తొలగిపోయినట్లే కదా! 
నిజానికి ధర్మము ఒక పాదముతో నడిచే ఈ కలియుగములో కృత,త్రేతా,ద్వాపరములలో జరిగిన మంచిచెడ్డల నరసి ,ఋజు ప్రవర్తనను అలవరచుకొని భగావధ్యానము నందు జీవితమును గడిపిన మోక్షము తథ్యము. కలియుగంలో నామస్మరణకు, నామసంకీర్తనకు ఉన్న ప్రాధాన్యత ఎనలేనిది! సాక్షాత్తూ భగవంతుడే తాను కలియుగంలో కేవలం ‘సంకీర్తనం’ చేత సంతుష్టుడనౌతానని ప్రకటించినాడు. అందుకే 'కలౌ సంకీర్త్య కేశవం'అని, 'సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాస్సుఖినోభవంతి' అని పలురకాలుగా పేర్కొన్నారు. అన్నమయ్య గూడా 'ఇహపరసాధన మిది యొకటే  సహజపు మురారి సంకీర్తన నొకటే' అని అన్నాడు. బాల్య యౌవ్వన కౌమార వార్ధక్యావస్థలలో తత్తత్ కార్యాచరణ చేయుచు భగవంతుని మరువని వారు బ్రహ్మ పదమును తప్పక పొందుదురని పెద్దల మాట. 
5. పంచాభూతాత్మకము : పంచభూతాత్మకము ఈ ప్రపంచము. అవి ఏవి అన్నది అందరికీ తెలిసినదే,అవి 'పృథివ్యాపస్తేజోవాయురాకాశములు' అని.  
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు పంచ తన్మాత్రలుగా పిలవబడుతున్నాయి.ఆకాశము శబ్దము మాత్రమే కలిగియుంటుంది. వాయువు శబ్దస్పర్శలను కలిగి యుంటుంది. తేజస్సు (సూర్యుని లేక అగ్ని యొక్క వెలుగు)శబ్దస్పర్శరూపములను కలిగియుంటుంది. ఆపస్సు(నీరు) శబ్ద స్పర్శ రూప రసము(రుచి) కలిగియుంటుంది. ఇక పొతే ఐదవదైన భూమి సబ్దస్పర్శరసరూపగంధము(వాసన) లను కలిగి యుంటుంది. మన పూర్వీకుల విశ్లేషణ ఎంత గొప్పదో చూడండి. మానవ శరీరము కూడా పంచ భూతాత్మకమే. పాదములు భూమి, 
కటినీరు,ఉదరహృదయములుతేజస్సుముక్కు ఉపిరితిత్తులు వాయువు,తల(సహస్రారము)ఆకాశము.  సాధకుడు ఊర్ధ్వ రేతస్కుడైతే బ్రహ్మపద సాధనా సమర్థత సమకూర్చుకొన్నట్లే కదా. 
6. షట్చక్రములు : ఆరు యోగ సాధనకు పెట్టింది పేరు. యోగము అంటే కలయిక. ఆత్మ పరమాత్మల కలయికనే యోగమంటారు . కుండలినీ శక్తిని ఉద్దీపింప జేయుటయే యోగము. కుండలినీ శక్తి 1. మూలాధార చక్రమునుండి బయలుదేరి 2.స్వాధిష్టాన 3. మణిపూరక 4. అనాహత 5. విశుద్ధ 6. ఆజ్ఞ చక్రములను అధిగమించి సహస్రారము చేరుటయే యోగము లేక యోగ సిద్ది. 
ఇది చెప్పుట సులభము చేయుట కష్టము.దీనికి విశేషమైన సాధన అవసరము. దీనికి మొదటి ప్రయత్నముగా 1.కామ 2. క్రోధ 3. మద 4.లోభ 5. మోహ 6. మాత్సర్యములను జయింపవలెను. ఇవి మనిషికి నిజమైన అంతః శతృవులు. వీటిని అరిషడ్వర్గములంటారు. వీనిని జయించితే  యోగ దీక్ష చేపట్టి సాధకుడు భగవత్సాయుజ్యము చేరగలుగుతాడు. 
7. సప్త మాతృకలు :1.ఇంద్రాణి  2. కౌమారి , 3. చాముండి,4. బ్రాహ్మి,5. మహేశ్వరి,6. వారాహి, 7. వైష్ణవి 
భగవద్ సాయుజ్యము చేరుటకు శంకరులవారు ప్రతిష్ఠించిన షణ్మతములలో శాక్తేయమొకటి. ఈ జగత్తు శక్తిమయమని నమ్ముతారు. వీరు అమ్మవారిని ఆదిమూలమనినమ్మి ఆమెనారాధించుతారు. వారి అరాధనలోని భాగమే ఈ సప్తమాతృకలు.ఇది 'ఏకంసత్ విప్రాః బహుధా వదంతి' లోనికి  వచ్చేదే కదా. అసలు నాదబ్రహ్మ సప్తస్వర నిలయుడు కదా. సప్త స్వరములు 'స రి గ మ ప ద ని' అని అందరికీ తెలిసినదే. 18 వ శతాబ్దమునకు చెందిన కర్నాటక సంగీత త్రిముర్తులైన శ్యామశాస్త్రి,త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితులవారు మువ్వురు తెలుగువారు కావటమే కాకుండా స్వర బ్రహ్మలై , నాదబ్రహ్మలై , పరబ్రహ్మనందుకొన్నవారు. 
పాశ్చాత్య చోదిత ఆధునిక శాస్త్రము కొన్ని శతాబ్దముల క్రితం శక్తిని ఏడూ భాగములుగా విభజించింది. 
అవి :
1. యాంత్రిక (Mechanical)2. శబ్ద (Sound)3. రసాయన(Chemical) 4. విద్యుత్(Electrical)5. కాంతి(Light) 6. ఉష్ణ (Heat) 7. అణు (Nuclear). కానీ మనవారు వేల సంవత్సరముల క్రితమే శక్తిని ఏడూ విధములుగా విభజించినారు. అవి ఏవన్నది పైన వివరించటము జరిగినది. ఈ 
డుశక్తుల మూలమే పరాశక్తి. ఆ శక్తి ఉపాసన కూడా 'ఎకేశ్వరోపాసనే' కదా. అదియును కైవల్య మార్గమే కదా!
ఇందు ఇంకొక ముఖ్యమైన విషయము ఏమంటే సాధన అన్నది వ్యక్తిగతము. ఎవరికెంత సమయము పడుతుందన్నది వారివారి కృషిని బట్టే వుంటుంది. కావున తమతమ ఆరోగ్యమును కాపాడుకోనుట చాలా ముఖ్యము. ఆరోగ్యమునకు ధాతుపుష్టి చాలా అవసరము. మన ఋషులు ఈ 
ధాతువులను ఏడు విధములుగా విభజించినారు. అవి ఏవన :
1. రస ధాతువు (Chyle,Lymph,Plasma)2. రక్త ధాతువు(Hemoglobinfraction in blood)3. మాంసధాతువు(Muscle tissue) 4. మేధా ధాతువు(Fat or Adipose Tissue)5. ఆస్తి ధాతువు(Bone tissue including Cartilage)  6. మజ్జా ధాతువు ( bone marrow, దీనినే గ్రామ్యములో తస్స అంటారు. రేలంగి ఈ పదాన్ని ఒరేనీ తస్సదియ్య అని సినిమాలలో కూడా వాడినాడు )7. శుక్ర ధాతువు(semen,sperm, ovum). 
ఈ ధాతువుల పౌనఃపున్యములే (Permutations and Combinations) శరీర సౌష్ఠవమునకు, త్రిగుణములగు సత్వరజస్తమస్సుల నిష్పత్తులను(ratios) నియంత్రించి మానవాళిలో మనిషికి మనిషికి పోలిక లేకుండా చేయుచున్నది. తులనాత్మకముగా మన శరీరమున మనస్సును ఆహార విహార  నియమములవల్ల నియంత్రించుకోగలిగితే తమస్సు నుండి రజస్సుకు, రజస్సు నుండి సత్వమునకు చేరి, మారిన మన నడవడితో ధ్యాస ధ్యానము మీద ధ్యానము యోగము మీద కేంద్రీకరించి బ్రహ్మైక్యము పొందవచ్చును. 
8. అష్ట దిక్పాలకులు: ఎనిమిది సంఖ్యతో అష్ట దిక్పాలకులేకాదు అష్ట వసువులు అష్టాంగ యోగములు కూడా వున్నవి. నేను మన కవసరమైనవి మాత్రమే  తీసుకోన్నాను. 
అష్ట దిక్పతులు : 1. ఇంద్ర---తూర్పు;2. వరుణ ---పడమర; 3. కుబేర---ఉత్తరం; 4. యమ--- దక్షిణం 5. ఈశాన---ఈశాన్యం; 6. అగ్ని---ఆగ్నేయం; 7. నిర్రుతి---నైరుతి; 8. వాయు---వాయువ్యం. 
వాస్తు శాస్త్రమునకు అధార భూతులు వీరే.కుటుంబ సుఖ సంతోషాలకు ఆయురారోగ్య ఐశ్వర్యములకు భక్తీ శ్రద్ధ లకు ఆలంబనమిదే. మానవుల బాగుకై నిస్వార్థముగా మన పూర్వులు ఎంత శ్రమించినారో చూడండి. 
అష్ట వసువులు : జగత్తు నందు కల సకల ప్రాణుల నందు పరమాత్ముడు  ఉండుట చేత వసువు అనబడుచున్నాడు ,వసువులు ఎనిమిది మంది వీరినే  అష్ట వసువులంటారు .వీరు ఆ పరంధాముని అంశలు .
1)ధృవ    2)ప్రభాస     3)సోమ   4)ధర   5)అనిల   6)ప్రత్యూష     7)అనల   8. అప్పు (నీరు)
                 
వీరు మనకు ప్రత్యక్షముగా పరోక్షముగా కూడా మనకు జీవ, దైవకార్యములలో సహాయ పడుతారు. అష్టాంగ యోగములు : యోగమునకైన ఎనిమిది విధములు, 1యమము 2నియమము 3ఆసనము 4ప్రాణాయామము 5ప్రత్యాహారము 6ధారణ 7ధ్యానము 8సమాధి. ఒక్కొక్కటి సాధించుతూ వస్తే సమాధి స్తితిని జీవుడు చేరుతాడు. సమాధి దాటితే తురీయమే కదా. 
పైన తెలిపిన అష్ట దిక్కులు . వాస్తు, అష్టవసువులు అష్టాంగ యోగమునకు అనుసంధానమైతే ఆత్మ పరమాత్మను చేరవలసినదే కదా !
9. నవ రంధ్రములు: చాలా కాలం క్రితము ఒక సినిమా లో 'తోలుతిత్తి ఇది తోవలు తొమ్మిది తుస్సుమనుట ఖాయం'అన్న పాట కొందరికైనా జ్ఞాపకము వుండి ఉంటుందనుకొంటాను. ఈ శరీరమునకు రంధ్రములు తొమ్మిది. అవి
2చెవులు,2కళ్ళు,2 నాసికా రంధ్రములు,1నోరు 1పురీషము,1గుదము. ప్రాణము వీనిలో ఏదో ఒక దానిగుండా పోతుందని అంటారు. కానీ యోగికి కపాలమోక్షమే. అది అత్యంత శ్రేష్టమైనది. దానిని సాధించుట అత్యంత క్లిష్టము. సాధనమున పనులు సమకూరునన్నది పెద్దల మాట. మనపై తమ ప్రభావమును కల్గిన నవగ్రహములకు ప్రీతి యొనర్చి దైవొన్ముఖులమైతే మనకు మిగిలేది తాదాత్మ్యమే. అందుకే ఈ కట్టె కాలక ముందే నవ విద భక్తీ మార్గములైన శ్రవణ,సంకీర్తన,స్మరణ,పాదసేవన,అర్చన,వందన, దాస్య,సఖ్య,ఆత్మనివేదన అన్న ఈ తొమ్మిది 
మార్గములలో మనకిష్టమైన మార్గమునెంచుకొని పరమాత్మ సాయుజ్యం పొందుటే జీవిత ధ్యేయంగా వుంచుకొందాము. 
10. దశావతారములు : మత్స్య కూర్మ వరాహశ్చ నారశింహశ్చ వామనః               
                                రామో రామశ్చరామశ్చ బుధ్ధః కల్కిరేవచ 
అని దశావతారములను గూర్చి చెప్పినారు. ఇన్ని రూపాలలో మనకిష్టమైన రూపమును మదిలో నిలుపుకొని  భగవత్ ధ్యానము చేసి తరించుదామన్నదే ఈ వ్యాసము వ్రాయుటకు కలిగిన ప్రోద్బలము. 
అజ్ఞుడ నైనా ఆశ చేత వ్రాసిన ఈ పది మాటలలో ఒక్కటైనా పరిగణించతగినదని పాఠకులు భావించితే నాకు ఆ అదృష్టాన్ని కలిగించిన పరమాత్మకు అంజలి ఘటించి నా కృతజ్ఞత ప్రకటించుకొంటాను. 
స్వస్థిః ప్రజాభ్యాం పారిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాం 
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లొక్కః సమస్తా స్సుఖినో భవంతు  
కాలే వర్షతు పర్జన్యః 
పృథివీ సస్య శాలినీ  
దేశోయం క్షోభ రహితః 
బ్రాహ్మణాః సంతు నిర్భయః  

అపుత్రాః పుత్రిణస్సంతు 
పుత్రిణః సంతు పౌత్రిణః  
అధనాః సధనాః సంతు 
జీవంతు శరదాం శతం 
 తత్సత్ 

No comments:

Post a Comment

Pages