చింతయా..నీకు... - అచ్చంగా తెలుగు

చింతయా..నీకు...

Share This

 చింతయా..నీకు...

 - సుజాత తిమ్మన 
బంగారు తొడుగులైననేమి...
స్వామీ...!!
స్వేచ్ఛగా గాలి సోకుటకు
అడ్డంకులే కాదా...!!

ముత్యాలు..రతనాలు..
మణులు..మాణిక్యాల
 ఆభరణాలయితేనేమీ...
స్వామీ..!!
సుతిమెత్తని నీ మేను
 కందిపోవుటయే కాదా...!!

తిరునామమెపుడూ...
తీర్చిదిద్దుండునే...
ఏడుకొండల శేషాద్రి
 తల్పమై యున్ననూ...
స్వామీ..!!
విశ్రాంతి ఎరుగవు
 నీవెపుడూ...


ముగ్ధలగు ముద్దు గుమ్మల
 మురిపాల మగనివైనా...
 .స్వామీ..!!
మూలవిరాట్టువే కాదా...!!

శ్రీమంతుడవైనా...
నీకెపుడూ...
తీరని దాహమే...
స్వామీ...
వడ్డీలకు వడ్డీల
 ముడుపులన్నీ నీవే..
వడ్డీ కాసుల వాడివైనావే....

తల నీలాలర్పించి...
తల భారం దించు కొంటున్న
అభాగ్యులకు  అభయ హస్తమిచ్చి
ఆపదగాచే ఆది దైవమైనావే..
స్వామీ...


వేల వేల భక్తుల
 మెర ఆలకించుటేగానీ...
నీగోడును తెలుపవెపుడూ...
పెదవి విప్పి..
స్వామీ..!!
చిరునగవు చెదరుననీ..
చింతయా..నీకు...
వేగమే వచ్చి నా
మదిని నిదురించు..
హృదయమునే కంచుకోటగా మలిచెద
చిరుసవ్వడైనా కలగనీయక సేద తీర్చెద ..

శ్రీ వేంకటేశ్వరా...!!శ్రీ శ్రీనివాసా....!!
తిరుమల గిరి నిలయా...!!
గోవిందా..గోవిందా...హరి గోవిందా..!!
శిరసా నమామి... !!

No comments:

Post a Comment

Pages