చిరాయువు - అచ్చంగా తెలుగు

చిరాయువు

Share This
చిరాయువు

పెయ్యేటి శ్రీదేవి

         
టి.వి.ఛానెల్ ' సమీర ' లో నూట తొంభయి తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెండువందల సంవత్సరం లోకి అడుగు పెట్టిన హనుమంతరావుని యాంకరు ఇంటర్వ్యూ చేస్తోంది.' నమస్కారం హనుమంతరావు గారూ!''నమస్కారం అమ్మా.' ' మీరు ఈ రెందువందల పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు.  మీ స్పందనేంటి?' ' స్పందనేం లేదమ్మా.  స్పందించడానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు.  నా స్నేహితులు గాని, బంధువులు, భార్య, పిల్లలు, ఇరుగు పొరుగువారు.......అసలా నాటి మనుషులెవ్వరూ లేరు.  ఈనాటి వారికి నేనెవరో తెలీక వింతగా చూస్తారు.  ఒంటరిగా బతుకుతున్నాను.  ఇప్పటికే నేను రెండు టీనేజ్ లు దాటాను.  ఆ దేముడింకా ఆయుర్దాయం ఎంత రాసాడో నా నుదుటి మీద.' ' మీరలా నిరుత్సాహ పడకండి హనుమంతరావుగారూ!  మా ' సమీర ' ఛానెల్ ఎప్పుడూ మీకు అండగా వుంటుంది.  మరి, మీరిన్నాళ్ళూ ఆరోగ్యంగా జీవించడానికి గల కారణాలు, మీ ఆరోగ్యసూత్రాలు మా ' సమీర ' ఛానెల్ ప్రేక్షకులకి చెబుతే అందరూ అలా ఆచరిస్తారు.' ' అలాగేనమ్మా చెబుతాను.'
                                                                                            ****************************
          ' ఎలా ఐనా ఆనాటి రోజులే వేరు.  మాది చాలా పెద్ద కుటుంబం.  అందరం చాలా సరదాగా, సంతోషంగా వుండేవాళ్ళం.  నాకు ఒక తమ్ముడు, ఇద్దరు అక్కయ్యలు, ఒక చెల్లెలు వున్నారు.  మా నాన్నగారు స్కూల్లో తెలుగు మాస్టారు.  ఆయన గొప్ప తెలుగు పండితులు.  మా అమ్మ, నాన్న చేలా ప్రేమగా, అన్యోన్యంగా వుండేవారు.  అందరు దంపతుల్లా వాళ్ళు పోట్లాడుకోవడం నేనెప్పుడూ చూడలేదు.  అలాగే వాళ్ళ పిల్లలకి, అంటే మాకు చాలా ఆప్యాయతలు, ప్రేమలు నేర్పారు.  మంచి చదువులు చెప్పించారు.  ఆయన కళ్ళెదురుగా వుండాలని, ఫారిన్ సంబంధాలు వచ్చినా, మా అక్కలకి, చెల్లెలికి దగ్గర ఊళ్ళో సంబంధాలే చేసారు.  మాకూ మంచి సంబంధాలే వచ్చాయి.  నాన్న పదిహేను రోజుల కన్నా అక్కల్ని, మనవరాళ్ళని, మనవల్ని చూడందే వుండలేక, తరచు అక్కల ఇళ్ళకి వెళ్ళేవారు.పండగలకి అందరం కలిసి దేముడి పూజలు చేసి, పిండివంటలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి, ఆ తర్వాతే అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేసే వాళ్ళం.  ఇలా వుండగా ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.  మేం సంతోషంగా వుండడం దేముడికే నచ్చలేదేమో!  హఠాత్తుగా నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు.  డాక్టరు వద్దకు తీసికెళితే హై బి.పి. అని చెప్పి మందులు రాసారు.  ఉప్పు, కారం, నూనె సరుకులు వాడద్దు అని చెప్పారు.  నాన్న రోజూ బాగానే ఆహార నియమాలు పాటించారు.  అమ్మకీ సుగరు, కీళ్ళ నెప్పులు పట్టుకున్నాయి.  టి.వి.లో వచ్చే ఆయుర్వేద వైద్య విధానం, ఆరోగ్యానికి అరవై సూత్రాలు, రోగాలు తెచ్చే రుచులు, రోగాలు రాని రుచులు...... ఇలా అన్నీ చూస్తూ పాటించారు.  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ నాన్న అందర్నీ పాటించమన్నారు.  అమ్మకి సరే.....బి.పి., సుగరు, మోకాళ్ళ నెప్పులు, దానికి తగ్గట్టు స్థూలకాయం అవడం వల్ల, మా అక్కయ్యలు కూడా ఇంచుమించు స్థూలకాయాల్లోకి వచ్చే ప్రమాదం వుందని, మా అందరికీ జాగ్రత్తలు చెప్పి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ, ఉప్పు, కారాలు లేకుండా చప్పిడిగా తినమన్నారు.  పండగలకి, పబ్బాలకి అమ్మని స్వీట్లు చెయ్యొద్దని, అంతగా తినాలనిపిస్తే టి.వి.లో చూపించినట్లే బెల్లం, పంచదార లేకుండా ఖర్జూరంతో బొబ్బట్లు, నాన్ స్టిక్ పొంగడాల పెనం మీద బెల్లం లేకుండా నూనెలో వేయించని బూరెలు, ఉప్పు, నూనె లేని బజ్జీలు......ఇలా మామూలుగా చేసుకు తినే రకరకాల పిండివంటలు, వంటలు, కూరలు, ఉప్పు, కారం, నూనె, తీపి లేకుండా చెయ్యమన్నారు.  అమ్మ అలాగే నాన్న చెప్పినట్లు, టి.వి.లో చెప్పిన విధంగా చెయ్యసాగింది.  అన్నం మానేసి మూడు పూటలా పుల్కావులు, తరవాత గ్లాసెడు మజ్జిగ, పళ్ళ ముక్కలు, సలాడ్ లు, అన్ని రకాల మొలకలు...... ఇదీ రోజువారీ ఫుడ్.  వారం రోజులదాకా అందరూ ఎలాగో తిన్నారు.  తరవాత్తరవాత ' ఇక మేమీ చప్పిడి కూడు తినలేం నాన్నా.  మేం బతకడం కోసం తినక్కర లేదు.  తినడం కోసమే బతుకుతాం.  వంద సంవత్సరాలు బతికి ఏం సాధించాలి నాన్నా?  మరీ వార్ధక్యం వచ్చేదాకా బతకాలని ఆశేం లేదు.  హాయిగా బతికిన నాల్రోజులూ మంచిగా తిని బతకాలి.' అంటూ తిండి వేదాంతం మాట్లాడారు.ఇలా ఎవరూ తిండి విషయంలో జాగ్రత్తలు పాటించలేదు.  నాన్న పాటించినా నీరసానికి తట్టుకోలేక మామూలుగానే భోజనం చేసేవారు.  అమ్మకసలే ఓపిక లేదు.  ఆవిడ భోజనమే చేసేది. ' కొత్త ఆవకాయ, మాగాయ, గోంగూర పచ్చడి, కందిపొడి రుచి తెలియాలంటే వేడి వేడి అన్నంలో శుభ్భరంగా కలుపుకుని ఇంత నెయ్యో, నూనో వేసుకుని తింటే, అందులో మీగడో, వెన్నో నంచుకుంటే అబ్బ.....!  దాని రుచే వేరు!  ఆ ఎండు చపాతీలతో ఏం తెలుస్తుందీ/  ఎలాగైనా స్వీట్లు గాని, పచ్చళ్ళు, ఊరగాయలు, కూరలు......ఏం చేసినా మన ఆంధ్రావంటలకి ప్రపంచంలో ఏ వంటలూ సాటి రావు.  అందువల్ల మమ్మల్ని శుభ్భరంగా తిండి తిననీరా తమ్ముడూ!  కావలిస్తే అన్నం మానేసి ఆ ఎండు రొట్టెలు, చప్పిడి కూరలు, పచ్చి కూరముక్కలు, పచ్చి ఆకులు నువ్వు తిని వెయ్యేళ్ళు హాయిగా బతుకు!  నాయనా!  మాకు మాత్రం తిండి విషయంలో ఆంక్షలు పెట్టకు.' ' అవునురా అన్నయ్యా!  అక్కలు చెప్పినట్లు అవన్నీ నువ్వే తిను.  మేం కూడా తినలేం.' అంటూ ఎవరూ తిండి విషయంలో జాగ్రత్తలు పాటించలేదు ఒక్క నేను తప్ప.  నెలకోసారి మాత్రం అన్నీ వేసుకుని సుష్టుగా భోంచెయ్యడం, మిగిలిన అన్ని రోజులు నూనె లేని పుల్కావులు, పచ్చి కూరముక్కలు, మొలకలు తిని, వ్యాయామం చెయ్యడం...ఇలా క్రమబధ్ధంగా జీవితాన్ని అలవాటు చేసుకున్నాను.' ' ఇంకా మీరు ఎన్నేళ్ళు బతకొచ్చు అనుకుంటున్నారు?  మీకు అనారోగ్యం లాంటివి ఎప్పుడూ కలగలేదా?' ' భగవంతుడు ఎన్నేళ్ళు రాసి పెట్టుంటే అన్నేళ్ళు బతుకుతాను.  పైగా మా అమ్మమ్మ ప్రతి పుట్టిన రోజుకి నా నెత్తిన నూనె పెట్టి ' వెయ్యేళ్ళు చిరంజీవిగా వర్ధిల్లు.' అంటూ దీవించేది.  నిండు నూరేళ్ళకి బదులు కరువో కాలమో అని ఆబగా వెయ్యేళ్ళు వర్థిల్లమని దీవించేసేది.  ఇహ ఆవిడ దీవించిందంటే తిరుగుండదు.  అందులో బాగా పూజలు చేస్తుందేమో, ఆవిడ వాక్శుధ్ధి కూడా చాలా బలంగా వుండేది.  ఇక ఆరోగ్యం విషయానికొస్తే మనిషన్నాక రోగాలు రాకుండా ఎలా వుంటాయి?  మరీ కే్న్సరు, సుగరు, బి.పి.లాంటివి కాకుండా అడపా దడపా దగ్గు, జ్వరాలు వస్తుండేవి.  ఐనా ఏం బతుకు?  నా వాళ్ళంటూ ఎవరూ లేరు.  అందరూ పోయారు.  స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు, నా పిల్లలు........ ఒక్కళ్ళు కూడా లేరు.  ఎక్కడో మునిమనమల పిల్లలున్నారు.  కాని వాళ్ళంతగా పట్టించుకోరు.' ' అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి తేడా ఏమన్నా వుందా?  ఆ రోజులు బాగున్నాయా, ఇప్పటి రోజులు బాగున్నాయా?  అప్పట్నించి ఇప్పటి దాకా మీకు ఏ రోజులు బాగున్నాయి?' ' 1950 నించి 1970 వరకు చాలా బాగుంది.  గుప్తుల కాలం స్వర్ణయుగం అనేవారు.  అది నేను చూడ లేదు.  అప్పటికి దేశం అభివృధ్ధి చెందలేదు.  1950 నించి చూసుకుంటే సినిమాల పరంగా కూడా ఎంతో బాగుంది.  1970 నించి 1990 వరకు కూడా ఫరవాలేదు.  టి.వి.లో అనేక ఛానెళ్ళు ఎప్పుడైతే వచ్చాయో, క్రమేపి సమాజంలో అనేక రకాల దుర్మార్గాలు చోటు చేసుకున్నాయి.  ఇది చాలదన్నట్లు సెల్ ఫోన్ల ప్రభావం వల్ల మరింత ఎక్కువయాయి.  సినిమాల్లోను, టి.వి. సీరియల్సు లోను విపరీతమైన హింస ఎక్కువై పోయింది.  కత్తులతో పొడవడాలు, తుపాకులతో కాల్చడాలు, విషం పెట్టి చంపడాలు, ఉరి వేసుకోవడాలు, నిద్రిస్తుంటే మొహం మీద దిండు పెట్టి నొక్కి చంపెయ్యడాలు..........ఇలా అనేక రకాలుగా భయంకరంగా, అతి జుగుప్సాకరంగా, పరమ నీచంగా సీరియల్సు, వార్తా ఛానెల్స్ లో దెబ్బలాటలతో కూడిన చర్చలు, ఉరి వేసుకుని చావడాలు, కొట్టి చంపెయ్యడాలు వంటి వార్తలు...........ఇక సినిమాల విషయానికొస్తే, నిండుగా కట్టుకునే అందమైన చీర సింగారాలు మానేసి, ఇతర దేశాల ఫేషన్ల మోజులో పడి, మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గాలికొదిలేసి, పీలికల డ్రస్సులేయడం మొదలుపెట్టారు.  సీరియల్సులో ఆడవాళ్ళే భయంకరమైన విలన్లుగా కనిపించసాగారు.  వాళ్ళు చేసేది నటనే కావచ్చు.  కాని చూసేవాళ్ళు నటనగా చూడరు.  కథాపరంగా చూస్తారు.  ఆ ప్రభావం సమాజం మీద పడి, సమాజంలో హింసాప్రవృత్తి పెరిగిపోతుంది.  దీనిమీద అనేక చర్చలు జరిగినా, మీరు చూస్తున్నారు కాబట్టే మేం తీస్తున్నాం అంటారు.  వాళ్ళు తీస్తుంటే చూడక చస్తారా?  నీతులు చెప్పేదీ వాళ్ళే, అవినీతి, అక్రమాలు నేర్పేదీ వాళ్ళే.  రామ, రామ!  ప్రజల్లో కూడా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మోసాలు, ఎదుటివాడిని చంపైనా సరే, బాగుపడాలనుకోవడం, అక్రమార్జన...........ఇలా అన్ని రకాలుగా దుర్మార్గాలు పెరిగిపోయాయి.  రాజకీయనాయకులు, మంత్రులు, బాబాలు ఐతే చెప్పక్కర్లేదు.  కోట్లకి కోట్లు సంపాదించారు.  ఆ డబ్బుతో దేశాన్ని ఎన్నో రకాలుగా అభివృధ్ధి చెయ్యచ్చు.  కాని చెయ్యలేదు.  ఈ దేశపు ప్రజల వద్ద పన్నుల రూపంగాను, లంచాల వల్లను దోచుకున్న సొమ్ము ఇరవై అయిదు లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు.  తరవాత ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు, బురద జల్లుకోవడాలు, వాళ్ళు కోట్లు సంపాదించారని వీళ్ళు, వీళ్ళు అన్యాయంగా సంపాదించారని వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కారు.  వాళ్ళమీద ప్రజలు కోర్టుల్లో కేసులు వేసారు.  ఆ కేసులు చాలా ఏళ్ళు నడిచాయి.  సి.బి.ఐ. ఎంక్వైరీల్లో మంత్రులందరూ దోషులుగా నిరూపించ బడ్డారు.  అందరూ జైళ్ళలో మ్రగ్గారు.  జైళ్ళన్నీ రాజకీయ నాయకులతో కిక్కిరిసి పోయాయి.  వాళ్ళకి కఠిన శిక్షలు విధించారు.  దేముడి పేరు చెప్పి భక్తుల దగ్గర పాదపూజల పేరుతోనో, ఇంకో రకంగానో లక్షలకి లక్షలు వసూలు చేసి కోట్లకి పడగలెత్తిన బాబాల ఆటలూ కట్టడి చేసారు.  ప్రజలు వాళ్ళని నమ్మడం మానేసారు.  రాను రాను వాగ్దానాల పేరుతో ఓట్లు అడుక్కునే నాయకులకు ప్రజలు ఓట్లు వెయ్యడం మానేసారు.  ప్రజల్ని కాపాడి దేశాన్ని పరిపాలించే మంచి నాయకులు కరువయ్యారు. ఎలక్ట్రానిక్ పరంగా ప్రపంచ దేశాలతో పాటు మన దేశం కూడా అభివృధ్ధి చెందుతోంది.  అందుకే దేశం రోబోల హస్తగతమై, రోబోల ప్రభుత్వం వచ్చింది.  రోబోల ధర్మమా అని అవినీతి, అక్రమార్జన, మోసాలకి తెర పడింది.  అదివరకు వైద్యం సరిగా చేయక అనేకమంది రోగులు మరణించేవారు.  ఇప్పుడు ఆపరేషన్లు రోబోలే చేస్తున్నాయి. దేశాన్ని దోచి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని కోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ.వారు పేద ప్రజలకి పంచారు.  మోసాలు, అక్రమాలు జరగకుండా కట్టడి చేసారు.  మంత్రుల వద్ద, బాబాల వద్ద మూలుగుతున్న కోట్లాది రూపాయలు సి.బి.ఐ.వాళ్ళు దేశాభివృధ్ధికి, రోడ్లు వెయ్యడానికి, ఇంకా ఎన్నో ఆధునిక సౌకర్యాలకి వినియోగించారు.  మొక్కలు, చెట్ట్లు నాటారు.  పరిశుభ్రమైన మంచినీటి వసతి, విద్య, వైద్యం అన్నీ సక్రమంగా ఏర్పాటు చేసారు.  ఏక్సిడెంట్లు జరగకుండా ట్రాఫిక్ కంట్రోలు చేసారు.  ఎక్కడా మురికివాడలు, మురికి, చెత్తకుప్పలు లేకుండా దేశాన్ని హరితదేశంగా మార్చారు.  అందుకే ఇప్పుడెవరూ ఇతర దేశాలలో స్థిరపడటల్లేదు.  అందరూ భారతదేశంలోనే నివసిస్తున్నారు.  అందరికీ అన్ని రకల సౌఖ్యాలు అందుతు్న్నాయి.  నేడు ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. అందుకే ఇప్పుడు అందరూ సమానం.  పేదప్రజలంటూ ఎవరూ లేరు.  ఇళ్ళలో పనిచేసే పనివాళ్ళూ లేరు.  మరీ చేసుకోలేకపోతే బాగా డబ్బున్నవాళ్ళు రోబోలని పనిమనుషులుగా పెట్టుకుంటున్నారు.  సాధారణంగా హ్యూమనాయిడ్స్ నే పెట్టుకుంటారు.  హ్యూమనాయిడ్స్ అంటే ఆడరోబోలు. అన్నట్లు ఇప్పటి రోజుల్లో మగవాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం చాలా కష్టంగా వుంది.  ఎందుకంటే ఆడవాళ్ళ జనాభా బాగా తగ్గిపోయింది.  ఒకప్పుడు మొదట ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మీప్రదం అనేవారు.  రానురాను ఆడపిల్లల పరిస్థితి దారుణంగా తయారయింది.  ఆడపిల్ల పుట్టిందని తల్లులు నిర్దయగా చంపేయడాలు, రౌడీ మృగరాయుళ్ళు కాలేజి అమ్మాయిలపై యాసిడ్లు పోయడం, గొడ్డళ్ళతో నరకడం, అత్తవారిళ్ళలో ఇంకా అదనపు కట్నం కోసం కోడళ్ళని బాధలు పెట్టి చంపడాలు.......ఇలా అనేక రకాలుగా హత్యలకి గురి కావడంతో స్త్రీల జనాభా బాగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు ఎక్కడన్నా స్త్రీలు కనిపీస్తే అమిత మర్యాదలు చేస్తారు.  వాళ్ళని దేవతల్లా చూస్తారు.  ఎలా ఐనా ఆడపిల్లలు లేని ఇల్లు దీపం పెట్టని ఇంటిలా, బొట్టు పెట్టుకోని మొహంలా వుంటుంది. అందుకే ఇప్పటివాళ్ళు ఉప్పులేని పప్పులా సారం లేకుండా నిస్సారంగా జీవితాలు గడుపుతున్నారు.  ఈ ఎలక్ట్రానిక్ యుగంలో జీవితంలో వసంతం లేదు.  జీవం లేని బతుకులు.  ఎక్కడన్నా ఆడపిల్ల పుడితే వాళ్ళకి కోటి రూపాయలు ఇస్తారు.' ' హనుమంతరావుగారూ!  మాకు చాలా విషయాలు మీనుంచి తెలుసుకోవాలని వుంది.  అప్పుడు ధరలు ఎలా వుండేవి, ఇప్పుడు ఎలా వుంటున్నాయి?' ' ధరలనేవి ఎప్పుడూ పెరుగుతూనే వుంటాయి కాని తరగవు.  వాటికి స్థిరత్వం వుండదు.  కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ధరలు పెంచేసేవారు.  ప్రతిపక్ష పార్టీవారు ధరలు పెరిగాయని, అన్యాయాలు జరిగాయని గొడవ చేసేవారు.  కాని వాళ్ళు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించవచ్చుగా?  వాళ్ళూ పెంచేసేవారు.  అలాగే అవినీతి, అక్రమాలు కూడా పెరిగిపోయేవి.  వాటిని అరికట్టే ప్రయత్నాలు ఏ ఒక్కరూ చేసేవారు కాదు.' ' 1950 నించీ చూసుకుంటే ధరలు రాను రాను పెరిగిపోయాయి.  ఎంత పాతరోజుల్నించి చూసుకున్నా అప్పటి రాబడికి తగ్గట్టు ధరలు ఎక్కువగానే అనిపిస్తాయి సామాన్య కుటుంబీకుడికి.  పూర్వం నేను పుట్టక ముందర వెండి రూపాయలుండేవట!  మా అమ్మమ్మ చెప్పేది.  ఒకప్పుడు బంగారం ధర పధ్ధెనిమిది రూపాయలే.  తరవాత ఏభయి....తొంభయి......వంద..........రెండు వందలు......ఐదు వందలు.......వెయ్యి.........ఐదు వేలు..........పదివేలు..........పన్నెండు వేలు......పంధొమ్మిది వేలు.......ఇరవై వేలు....ఇరవై ఎనిమిది వేలు.......ఇలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు పది గ్రాములు రెండు లక్షలకి చేరింది.  ఇడ్లి..........ఒకప్పుడు రూపాయికి ఇరవై ఇడ్డెన్లు వచ్చేవి.  అవీ పెరుగుతూ రెండూ ఇరవై నాలుగు రూపాయలై, ఇప్పుడు రెండు ఇడ్లీలు పదివేల రూపాయలు అయింది! ' ఇహ, ఆకు కూరలు!  ఒకప్పుడు కట్టల్లెక్కన ఇచ్చేవారు.  ఇప్పుడు ఆకుల్లెక్కన ఇస్తున్నారు.  తోటకూర ఒక్కొక్క ఆకు ముఫ్ఫయి రూపాయలు!  ఎండు మిర్చి ఒక్కొక్కటి ఏభయి రూపాయలు! ఇలా అన్ని రేట్లూ చాలా చాలా రెట్లు పెరిగిపోయాయి.  ఒకప్పుడు నా చిన్నతనంలో అణాలు, బేడలు, కాణీలు వుండేవి. తరవాత్తరవాత అవి తీసేసారు.  ఇప్పుడైతే ఎక్కువ వెయ్యి నోట్లే.  పది, ఇరవై నోట్లుంటాయి.  వంద నోట్లు లేవు.  ఇతర దేశాల్లో లాగ ప్లాస్టిక్ కరెన్సీ వచ్చిందిప్పుడు.  ఇప్పుడు ప్రజల దగ్గర చాలా డబ్బుంది.  అందుకని ధరలు పెరిగినా ప్రజలు వాళ్ళ అవసరాలకి తగినట్టు కొంటూనే వుంటారు.  ధరలు పెరుగుతూనే వుంటాయి.  అవి ఎప్పటికీ తగ్గడం అంటూ వుండదు.  అప్పుడు అనేక టి.వి.ఛానెల్స్ లో ఎప్పుడూ వంటల కార్యక్రమాలు వస్తుండేవి.  ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో మీ ' సమీర ' ఛానెల్ లా అనేక ఛానెళ్ళు వచ్చాయి.  అప్పుడు ఇళ్ళకొచ్చి వీళ్ళ చేత వంటలుచేయించేవారు.  ఇప్పుడు కొన్ని ఛానెళ్ళవాళ్ళు, వాళ్ళే ఇళ్ళకి పంపి వాళ్ళ చేతే వంటలు చేయించి నేర్పుతున్నారు.  చేసుకోలెని వాళ్ళకి ఈ విధానం చాలా ఉపయోగంగా వుంది.' ' చాలా సంతోషమండీ హనుమంతరావుగారూ!  చివరిగా మా ' సమీర ' ఛానెల్ ప్రేక్షకులకు మీరేమన్నా సందేశం ఇస్తారా?' ' మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది అనవసరంగా తినేస్తూ వుండడం ఎంతో తేలిక.  తినకుండా మనసుని, నోటిని అదుపు చేసుకోవడం చాలా చాలా కష్టం.  అలా క్రమం పాటించక తింటుండడం వల్ల, తీరా తిన్నాక జీర్ణం కాక, ఎందుకు తిన్నాంరా భగవంతుడా అనుకునే పరిస్థితి రాకూడదు.  మళ్ళీ కొంచెం ఆకలి వెయ్యగానే అంతకు ముందర తిన్నందుకు, ఎందుకు తిన్నాంరా భగవంతుడా అనుకున్నది మర్చిపోయి, మళ్ళీ తినెయ్యడం, మళ్ళీ బాధ పడడం, రేపట్నించీ ఏమైనా సరే, ఏం తినకుండా కంట్రోల్ చేసుకోవాలి, వీలైతే ఉపవాసం వుండాలి అనుకోవడం, మళ్ళీ ఆ అనుకున్నది పక్కన పెట్టి, రేపట్నించి చూద్దాంలే అని మళ్ళీ తినెయ్యడం, ఇష్టమైనది కనిపిస్తే మళ్ళీ లాగించెయ్యడం, మళ్ళీ బాధ పడడం, మళ్ళీ రేపట్నించీ తినకుండా వుందాం అనుకోవడం, ఇల్లా ప్రతిరోజు 'రేపట్నించీ' ల సంఖ్య పెరిగిందే కాని, తిండి తినడంలో మాత్రం మార్పు రాలేదు సరికదా, ఎలాగూ రేపటినించీ డైటింగ్ చేద్దామనుకుంటున్నాం కదా అనుకుని మరింత ఎక్కువ తినడం రోజువారీ దినచర్యగా మారిపోతుంది.  ఈలోగా శరీర బరువు అధికంగా పెరిగిపోతూ, ఆరోగ్యం దెబ్బ తింటుంది.  చివరకు మందులు వేసుకున్నా పని చెయ్యని పరిస్థితి వస్తుంది.........సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు, ఇలాంటి క్రమబధ్ధత లేని అలవాట్లతో సతమతమవుతూ, మనసుని అదుపులో పెట్టుకోలేక, ఒక పక్క అనుకున్నది పట్టుదలగా సాధించలేక పోయామే అన్న దిగులుతో అనారోగ్యం కొనితెచ్చుకుని, మందులకి, వైద్యులకి చాలా డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నారు. అందుకే తిండి విషయంలో కొన్ని పధ్ధతులు పాటించి తీరాలి.  తినాలన్న ధ్యాస తగ్గించుకోవాలి.  ముఖ్యంగా జంక్ ఫుడ్స్ జోలికి పోకూడదు.  తాజా కూరగాయ ముక్కలు, వాటి రసాలు, పళ్ళు తీసుకోవాలి.  ఒక పూట తక్కువగా భోజనం చెయ్యాలి.  సాయంత్రం రెండు పుల్కావులు తిని మజ్జిగ తాగాలి.  నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతుండాలి.  వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి.  ఉదయం నడక చాలా మంచిది.  ఒక్కోసారి ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకున్నా, తరవాత తగ్గించుకుని, బేలెన్స్ డ్ డైట్, అంటే సమతుల ఆహారం తీసుకోవాలి.  క్రమశిక్షణ చాలా ముఖ్యం.  అది వుంటేనే మన జీవితం క్రమబధ్ధంగా ముందుకు సాగుతుంది.  మనసు కూడా ప్రశాంతంగా వుంచుకోవాలి.  మనసుని ఎప్పుడూ మన అధీనంలో వుంచుకుంటే, మన మీద మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  ఆత్మవిశ్వాసం వుంటే అన్ని విజయాలూ మనవే.' ' మా ' సమీర ' ఛానెల్ ప్రేక్షకులకి ఎన్నో విషయాలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు.  రెండు టీనేజ్ లు దాటిన మిమ్మల్నిఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసినందుకు మా సమీరా ఛానెల్ కి చాలా సంతోషంగా వుంది.' ' ధన్యవాదాలమ్మా.  ఈ ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలు నా చేత చెప్పించిన ' సమీర ' ఛానెల్ వారికి నమస్కారాలు.'
                                                                                    *********************************
          వారం రోజుల తర్వాత...................
          ' హనుమంతరావూ!  హనుమంతూ!  వారం రోజుల క్రితం నువ్వు ' సమీర ' ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాను.  చాలా బాగుంది.  ఆ ' సమీర ' ఛానెల్ వాళ్లకి ఫోన్ చేసి నీ అడ్రస్ తీసుకుని నీకోసం వెతుక్కుంటూ వచ్చాను.  అదిగో..........ఆ మొహం మీద నుదుటనున్న పుట్టుమచ్చ చూసి గుర్తు పట్టాను.'' ఇంతకీ ఎవరు మీరు?'' ఎవరు మీరంటావేమిటి?  గుర్తు పట్టలా?  నేనూ.........కృష్ణవేణిని.  మనిద్దరం కాలేజిలో డిగ్రీ వరకు చదువుకున్నాం కదా!  తరవాత ప్రేమించుకున్నాం.  నీకన్నా ఒక్క రోజు పెద్ద దాన్నని మీ పెద్దవాళ్ళూ, మా పెద్దవాళ్ళూ మన పెళ్ళికి ఒప్పుకోలేదు.  ఐతే మనం పచ్చికూర ముక్కల సలాడ్లు, ఆకులు, అలములు, పళ్ళముక్కలు తింటూ, నూనె, ఉప్పు, పంచదార తినకుండా మన శరీరాగ్యోన్ని కాపాడుకుంటున్నాం అన్న మాట!  నీ కుటుంబం మొత్తానికి నువ్వూ, నా కుటుంబం మొత్తానికి నేనూ మిగిలాం.  ఇప్పుడు నీకూ నీ వారు లేరు, నాకూ నా వారు లేరు.  అందుకే ఇప్పటికైనా నువ్వు, నేను పెళ్ళి చేసుకుని కలకాలం హాయిగా బతుకుదాం.' అలా రెండువందల ఏళ్ళ వయసులో వాళ్ళిద్దరికీ పెళ్లయింది.  వాళ్ళని ఆశీర్వదించి అక్షింతలు వేయడానికి వాళ్ళకి పెద్దలు ఎవరూ లేరు! అందుకే ఈ తరంలోని మనందరం వాళ్ళకి ' హేపీ మేరీడ్ లైఫ్ ' చెబుదాం. టి.వి.ఛానెల్ లో మంతెన సత్యనారాయణ రాజుగారి వంటల కార్యక్రమం వస్తోంది.  పెనం మీద మీగడ రాసి, ఖర్జూరం వేసి, శనగపప్పు పూర్ణంతో బూరెలు చేసారు.  ఉప్పు, చింతపండు లేకుండా మిరప్పళ్ళ పచ్చడి చేసారు. మరో ఛానెల్ లో నాలుగు వందల సంవత్సరాలు బ్రతుకుతానన్న బాబా రామ్ దేవ్ యోగాసనాలు చెబుతున్నారు. ఆ సాయంత్రం కృష్ణవేణి అవే చేద్దామని అనుకుని, మళ్ళీ ఉప్పు లేని తిండి ఎన్నాళ్ళు తినాలి అనుకుంటూ ఉప్పు, కారం దట్టంగా దట్టించి, నూనెలో గారెలు డీప్ ఫ్రై చేసింది.  కాని ఉప్పు, కారాలు తినే అలవాటు తప్పిపోవడం వలన ఇద్దరూ అవి తినలేక పోయారు.  చివరకు పచ్చికూర ముక్కలు, పళ్ళముక్కలు తిని కడుపులు నింపుకున్నారు. దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో ' ఆనందోబ్రహ్మ ' వస్తోంది.  అది చూస్తూ రెండు టీనేజ్ లు దాటి చిరాయువులైన కృష్ణవేణి, హనుమంతరావు హాయిగా నవ్వేసుకుంటున్నారు.
                                                                                           *******************

No comments:

Post a Comment

Pages