ఇల్లే కదా నరకం! స్వర్గం!! - అచ్చంగా తెలుగు

ఇల్లే కదా నరకం! స్వర్గం!!

Share This

ఇల్లే కదా నరకం!  స్వర్గం!!

పెయ్యేటి రంగారావు

' మళ్ళీ వుత్తిచేతుల్తో అఘోరించారా?  పొద్దున్న ఆఫీసుకెళ్తున్నప్పుడు చిలక్కి చెప్పినట్టు చెప్పాను.  బియ్యం నిండుకున్నాయి, వచ్చేటప్పుడు తీసుకు రండీ, అని.  మతిమరుపు మహాలింగం.  మళ్ళీ తిండికి తిమ్మరాజులా వేళకి డైనింగ్ టేబులు దగ్గిరకి హాజరవుతారు.  అనుభవించండి.  ఈ పూటకి మీకు జొన్నరొట్టెలే గతి.'
' నోరు మూస్తావా?  ఎప్పుడూ మొగుడు మీద ఎగిరిపడడమే గాని నువ్వు వెలగబెట్టేదేమిటి?  నేనిలా ఆఫీసుకెళ్ళగానే టి.వి.లో వంటలు, మహిళలు మహారాణులు, సీరియల్సు చూసుకుంటూ వైభవం వెలగబెట్టడమేగా?  ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టలేదు, అప్పుడే దండకం మొదలెట్టావు.' ' బియ్యం తేకుండా వచ్చి, మళ్ళీ ఎదురు నా మీదకి దండయాత్ర చేస్తారా?  మీరు ఆఫీసులో ఏడ్చి చచ్చేదేముంటుంది?  వెళ్ళగానే హాయిగా ఫేనేసుకుని కునుకు తియ్యడమేగా?  మళ్ళి రెండు కొట్టగానే గుటుక్కు గుటుక్కు మంటూ టిఫిను బాక్సు ఖాళీ చెయ్యడం.  ఛీ చీ, మీతో కాపరం కన్నా గాడిద కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవడం పుణ్యం.' ' ఔనౌను, నీ చేతి దరిద్రపు కూడు తినడం కన్నా రోడ్డు పక్కన కూర్చుని ఎంగిలాకులు ఏరుకోవడం నయం.'
                                                                                             ***********************
మహప్రభో!  ఇంక వాళ్ళ భాగవతం మనం వినలేం.  అనవసరంగా వాళ్ళ ఇంట్లోకి నేను తొంగి చూడడమే కాక, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాను.  ఇప్పుడు చెవులు డెట్టాలు తోను, ఫినాయిలు తోను కడుక్కోవాలి కామోసు.  ఏమనుకోకండి.  దీనికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు మిమ్మల్ని మరో ఇంటికి తీసికెళ్తాను.  రండి, రండి.
మళ్ళీ అదే దృశ్యం!  భర్తగారు ఆఫీసుకెళ్తూంటే, భార్య గారు గుర్తు చేసింది, ' ఏమండీ, బియ్యం ఇంట్లో పూర్తిగా నిండుకున్నాయి.  మీరు వచ్చేటప్పుడు మర్చిపోకుండా బియ్యం తీసుకురండి.  అల్లాగే ఏమన్నా కూరలు కూడా తెస్తే మంచిది.' ' చిత్తం గృహలక్ష్మిగారూ!  మీ ఆజ్ఞ శిరోధార్యం.' ' బాగానే వుంది సంబడం.  రోడ్డు మీదకంటా వచ్చేసి ఏమిటా మాటలు?  ఎవరన్నా వింటే ఏమనుకుంటారు?  నేనేదో గయ్యాళిననీ, మీరు పరమ భార్యావిధేయులనీ ప్రపంచమంతా ప్రచారమై పోదూ?' ' అనుకుంటే అనుకోనీ.  మహాకవి జయదేవుడు పద్మావతీ  చరణ చారణ చక్రవర్తిట.  అల్లాగే నేనూ వాసంతీ చరణ చారణ చక్రవర్తిని.' ' ఇంక ఆపండి పతిదేవా, ఇంక చాలు.  మీకు ఆఫీసుకి టైమవుతోంది.  ఇంక బయలుదేరండి.' ' చిత్తం.' ********************** ఇది పొద్దున్న జరిగిన దృశ్యం.  మొదట మనం ఇంటికెళ్ళిన జంట పేరు కాళింది, కనకరాజు.  ఇప్పుడు చూసిన జంట పేరు వాసంతి, రాజారావు.  కనకరాజు బియ్యం తేకుండా తగలడ్డట్టే, రాజారావు కూడా బియ్యం తేకుండా అఘోరించాడు.  ఇప్పుడు రాజారావు ఇంటికెళ్ళగానే అక్కడ ఏ మూడో మహా ప్రపంచ యుధ్ధం జరుగుతుందో గమనిద్దాం రండి.  కంగారు పడకండి,  వాళ్ళిద్దరూ మరీ ఘోరమైన పదజాలాన్ని వాడుతుంటే వెంటనే పరిగెట్టుకు వచ్చేద్దాం లెండి. రాజారావు  కూడా కనకరాజు లాగే ఆఫీసులో వాళ్ళ ఆఫీసరు చేత నానా చీవాట్లూ తిన్నాడు.  మనసంతా గజేంద్రుడు ఇష్టం వచ్చినట్లు పాడు చేసిన కొలనులా అల్లకల్లోలమై పోయింది.  '  హు, గృహలక్ష్ములకి ఈ బాధ వుండదు కదా.  హాయిగా మహారాణుల్లా ఇంటో వైభవం వెలగబెడతారు! ' అని అక్కసుగా కనకరాజు అనుకుంటే, రాజారావు మాత్రం ఒక జీవం లేని నవ్వొకటి నవ్వుకుని ' It's O.K.  It does happen at times.' అనుకుంటూ, సమాధాన పడుతూ ఇంటి దారి పట్టాడు.  కనకరాజు లాగే వికలమనస్కుడై వుండడం వల్ల బియ్యం సంగతి మర్చిపోయాడు. ఇంటికెళ్ళే సరికి, వాసంతి కడిగిన మంచి ముత్యంలా చక్కగా తెల్లచీర కట్టుకుని, ముస్తాబై చిరునవ్వుతో ఎదురొచ్చింది.  రాజారావు అలసటగా కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకుని ఆఫీసులో బాస్ చేత తిన్న తిట్లు గంగిగోవులా నెమరేసుకుంటున్నాడు.  మల్లెపూల వాసన గుప్పున నాసికాపుటాలకి సోకేసరికి కళ్ళు తెరిచాడు.  వాసంతి ఫ్రిజ్ లోంచి చల్లటి నీళ్ళు కాసిని గ్లాసులో ఒంపి, మరికాసిని మామూలు నీళ్ళు కలిపి, నీళ్ళు మరీ చల్లగా లేకుండా చూసి రాజారావుకిచ్చింది. అలసిపోయి ఇంటికి రాగానే ఎదురొచ్చి చల్లటి మంచినీళ్ళు ఇచ్చే భార్య దొరకడం పూర్వజన్మ సుకృతం అనిపించింది రాజారావుకి.  అతడు ఆత్రంగా గ్లాసు తీసుకుని మంచినీళ్ళు గడగడా తాగేసాడు.  చల్లటి నీళ్ళు కొద్ది కొద్దిగా గొంతులోంచి లోపలికి జారుతోంటే ప్రాణం లేచొచ్చింది.  అప్పుడు గుర్తుకు వచ్చింది, వాసంతి పొద్దున్న చెప్పిన విషయం.  కంగారుగా కుర్చీలోంచి లేచాడు. ' వాసంతీ!  నువ్వు నన్ను క్షమించాలోయ్!  నువ్వు బియ్యం తెమ్మన్న సంగతి మర్చిపోయి,దేభ్యంలా ఇంటికి వచ్చేసాను.  ఉండు, ఇప్పుడే బజారుకెళ్ళి బియ్యం, కూరలు తెస్తాను.  ఇంకా ఏమేం కావాలో చెప్పు, అవి కూడా తెచ్చేస్తాను.' ' తమరు ప్రశాంతంగా కూర్చోండి పతిదేవా!  ఇప్పుడేమంత కొంప మునిగిపోయిందని?  కాఫీ వేడి చేస్తున్నాను.  ముందు కాఫీ తాగుదురు గాని.  ఆఫీసులో ఏ పని వత్తిడి వల్లో మర్చిపోయుంటారు.  ఈ మాత్రం దానికి సారీ ఎందుకు?' ' పని వత్తిడి కాదోయ్.  ఇవాళ మా ఆఫీసరు ఉత్తిపుణ్యానికి నన్ను నానా మాటలూ అన్నాడు.  దాంతో మనసంతా పాడైపోయింది.' ' వాడికేం పోయేకాలం, ఒళ్ళు వంచి పనిచేసే మిమ్మల్ని నానామాటలు అనడానికి? వాసంతి ఓదార్పు మాటలు వినగానే రాజారావుకి పూలకారులో, యమునాతటిపై, మాధవుని వేణుగానం వింటూ, మలయానిల స్పర్శను పొందుతున్న్నంత హాయి కలిగి మనసులో గ్లాని, శరీరానికి కలిగిన అలసట ఒక్క క్షణంలొ తొలగిపోయాయి.  భార్య కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ గ్లాసుతో ఆమె తెచ్చిన వెచ్చని అనురాగాన్ని ఆత్రంగా జుర్రుకోసాగాడు. కాఫీ తాగేసి, గ్లాసు సింక్ లో పడెయ్యడానికి వెళ్ళబోతుంటే వాసంతి చటుక్కున అతడి చేతిలోంచి గ్లాసు తీసుకుంది, ' మీరుండండి.  గ్లాసు నేను సింక్ లో పడేసి వస్తాను' అంటూ. రాజారావు ఆమె వెనకాలే వెడుతూ, రాయంచలా అడుగులేస్తున్న ఆమె చరణసోయగాన్ని నేత్రాలతోనే ఆస్వాదిస్తూ అన్నాడు, ' వాసంతీ!  పోనీ, ఒక పని చేద్దామోయ్!  ఇంక ఇవాళ నువ్వు వంట కార్యక్రమాన్ని అత్యవసరపరిస్థితి ప్రకటించి రద్దు చేసెయ్.  మనిద్దరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ బజారుకెడదాం.  నేను బియ్యం, కూరలు కొంటాను.  అక్కడినించి ఫ్యాన్సీషాపుకెడదాం.  అక్కడ నువ్వు, నా చొక్కాకి అంటించడానికి కాటుక, బుగ్గకి అంటించడానికి లిప్ స్టిక్ కొనుక్కుందూ గాని.' అంటూంటే వాసంతి కళ్ళతోనే అతడిని మందలించి, బుగ్గ గిల్లింది.
          రాజారావు ఆగలేదు, ' భార్య భర్తని మనసారా, బిగియారా కౌగలించుకుంటుంది.  అందులో తప్పేముంటుందోయ్?  అప్పుడు కాస్త మొగుడి చొక్కాకి కాటుక అంటుకుంటుంది.  అందులో అపసవ్యమేముంటుందోయ్?  ఏరియల్!  టట్టడాయ్!  మొండి మరకల్ని కూడా పోగొడుతుంది!  అప్పుడు నేను, ప్లీజ్, ప్లీజ్, వాసంతీ!  ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి, పోనీ, నీకు సిగ్గుగా వుంటే నేను కళ్ళు మూసుకుంటానులే అంటూంటే, నువ్వే నా రెండు కళ్ళూ మూసేసి, అధరాభిసారం చేస్తావుట!  అప్పుడు, ఏయ్!  సెన్సారువాళ్ళూ!  భార్యాభర్తల జీవితాల్లోకి తొంగిచూడడానికి మీకూ, మీ కత్తెరలకూ సిగ్గులేదూ? అని నేను కేకలేస్తూంటే, అప్పుడు నువ్వు మళ్ళీ నా బుగ్గ గిల్లి, నేను నెప్పి పుట్టి, అమ్మో అని అరుస్తే, ఇప్పుడు మీ అమ్మగారెందుకండీ,  ఆలీ అని అరవక..... ? అంటూ మళ్ళీ నా కందిపోయిన బుగ్గమీద నీ పెదాలతో మంత్రం వేస్తే, అప్పుడు నా బుగ్గ్గ మీద నీ లిప్ స్టిక్ ముద్ర పడితే, నా వాసంతి సామి రాజా!  అప్పుడుంటుందీ, అది శృంగారానికి పరాకాష్ట కాదూ?  అప్పుడు నేను మాత్రం మరో గీతగోవిందం గీకలేకపోదునా?'
వాసంతి ఈ సారి నిజంగానే అతడి వాచాలతకి కళ్ళెం వెయ్యడానికి అతడి పెదవులని తన పెదాలతో మూసేసింది.
ఇద్దరూ పదినిముషాల్లో ఇంటికి తాళం వేసి బైట పడ్డారు.  ఒకళ్ళ చేతిలో మరొకళ్ళు చెయ్యి వేసుకుని, స్వీట్ నథింగులు మాట్లాడుకుంటూ బజారుకి వెళ్ళారు.  అక్కడ కొనవలసినవి కొనుక్కుని, పక్కనే వున్న హోటలుకి వెళ్ళి, తియ్యటి  కబుర్లు చెప్పుకుంటూ, తింటూ, సర్వరు సప్లై చేసిన పదార్థాలని ఆ కబుర్లలోకి నంచుకుని, ఆటోలో ఇంటికి చేరుకున్నారు.                                                                     ************************ కనకరాజుకి పెళ్ళాం దండకం వింటూంటే ఆవేశం ఆగలేదు.  చేతికి దొరికిన టి.వి.రిమోట్ తీసుకుని ఆమె నెత్తిన ఒక్క దెబ్బ వెయ్యబోయాడు. కాళింది గట్టిగా అరిచింది, ' కొడతావా?  కొట్టరా మొగుడూ.  నీకు చేతనైంది అదేగా?  బైటికెడితే పిల్లిలా అందరికీ అణిగిమణిగి వుండడం, ఇంట్లోకొస్తే మృగరాజులా, జంతువులా మారిపోయి పెళ్ళాం మీద చెయ్యి చేసుకోవడం.  మీ మగాళ్ళందరికీ చేతనయింది ఇదేగా?  కొట్టు, చంపెయ్.  పీడ వదిలిపోతుంది.' కనకరాజు ఆ రిమోట్ తో ఒక్క దెబ్బ తన నెత్తిమీద కొట్టుకున్నాడు.  తల బొప్పి కట్టింది.  రిమోట్ పగిలిపోయింది.  ' ఛీ, ఛీ!  ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపం, నువ్వు నాకు పెళ్ళాం లాగ దాపురించావు.' అంటూ తరచుగా తను వెళ్ళే బార్ కేసి నడిచాడు. కాళింది మొగుడ్ని నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ, రిమోట్ కి ప్లేస్టిక్ టేపుతో బ్యాండేజి చుట్టి, ' ఛీ టి.వి.' ఛానెల్లో ' ఏందిరో, నా మొగడా?' అనే సీరియల్ యొక్క మూడువేల నాలుగు వందల నలభై ఆరో భాగం చూడసాగింది.  అందులో మొగుడూ పెళ్ళాలకి అసలు పడటల్లేదు.  కొన్ని వేల భాగాలనించీ కొట్టుకు చస్తున్నారు.  ఇంక లాభం లేదని, పెళ్ళాం మొగుడికి విషం ఇచ్చి చంపేద్దామని నిశ్చయించుకుంటుంది.  మొగుడు కూడా విచిత్రంగా అప్పుడే పెళ్ళానికి విషం ఇచ్చి చంపేద్దామని నిశ్చయించుకుంటాడు.  మొగుడు ఆఫీసు నించి ఇంటికి వస్తాడు.  పెళ్ళాం లోపల కాఫీలో విషం కలిపి తీసుకు వచ్చి టేబులు మీద పెడ్తుంది.  ఇంకో కాఫీకప్పు తను తెచ్చుకుంటుంది.   ప్రేమగా మొగుడ్ని కాఫీ తాగమని చెబుతూ ఆ విషం కలిపిన కాఫీ కప్పు వాడి చేతికి ఇస్తుంది.  మొగుడుకి అనుమానం వస్తుంది.  ఏమిటి, ఎప్పుడూ లేనిది, ఇవాళ పెళ్ళాం తనమీద ఇంత ప్రేమ ఒలకబోస్తోంది?  ఇందులో ఏదో మతలబు వుందని, పెళ్ళాం ఎదురుగా వుండగానే, మ్యూజిక్ బద్దలైపోతుండగా గట్టిగా స్వగతంలో అనేసుకుంటూ, పెళ్ళాం మీద ఎప్పుడూ లేనంత ప్రేమని ఒంపేస్తూ, తలనెప్పిగా వుందని, టాబ్లెట్ వేసుకోవాలని, కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టమనీ అడుగుతాడు.  పెళ్ళాం లోపలికి వెళ్ళగానే, ఆవిడ కాఫీకప్పులో విషం కలిపేస్తాడు.  ఇప్పుడు ఇద్దరి కాఫీకప్పుల్లోనూ విషం వుంది.  ఇవాళ తరవాతి భాగం నడుస్తోంది.  పెళ్ళాం ఆ విషం కలిపిన కాఫీ తాగుతుందా?  లేక పెళ్ళాం తనకి విషం కలిపి ఇచ్చిన కాఫీని మొగుడు తాగేస్తాడా?  లేక ఆ విషం కలిపిన కాఫీలు ఇద్దరూ తెలీకుండా తాగేస్తారా?  ఏమవుతుంది?.............ఏమవుతుంది? సీరియల్ మధ్యలో చిన్న బ్రేక్ వస్తే, కాళింది లోపలికి వెళ్ళి వంటింట్లో నాలుగు అరటిపళ్ళు వుంటే, రెండు వలుచుకుని తిని, కాస్త మజ్జిగ తాగి, హడావిడిగా బాత్ రూముకి వెళ్ళి వచ్చి, మళ్ళీ సీరియల్ చూడడంలో మునిగిపోయింది.  ఆ సీరియల్ అవగానే, చిన్నపిల్లలు చేసే బూతు డ్యాన్సుల ప్రోగ్రాం, ' కసి కసి కసి ' చూస్తూ వుండిపోయింది.  దాని తర్వాత ఛీ ఛానెల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ వేషాలు వేసి, థూ ఛానెల్లో మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసి, ద్వంద్వార్థాలతో వున్న, పిచ్చి వాగుళ్ళు వాగుతూ చేసే వెకిలి చేష్టల కార్యక్రమాలు ' మస్త్ మస్త్ ' ' ఖుషీ ఖుషీ ' మార్చి మార్చి చూడసాగింది.  కనకరాజు చిత్తుగా తాగేసి వచ్చి ఏమీ తినకుండా అలాగే పడకగదిలోకి వెళ్ళి బట్టలన్నా మార్చుకోకుండా పడుకుండి పోయాడు.                                                                  ***************************** ఆటోలో ఇంటికి వచ్చిన వాసంతి, రాజారావులకి ఎప్పటిలాగే ఆ రోజు కూడా తొలిరాత్రే అయింది.                                                                    ************************** ఆ రోజు ఆదివారం.  కనకరాజుకి మామూలురోజుల కన్నా ఆరోజు చాలా పనులు వుంటాయి.  హడావిడిగా లేచి గంటలో తయారైపోయి, పెళ్ళాం పెట్టిన మాడిపోయిన మినపరొట్టె బలవంతంగా మింగి బయలుదేర బోయాడు. ' మామూలు రోజుల్లో ఎటూ తప్పదు.  కనీసం ఆదివారం నాడన్నా ఇంట్లో పడి ఏడుద్దామని వుండదు ఈ మగాడికి.  ఛీ, ఛీ, ఎప్పుడూ ఆ లత్తుకోరు స్నేహాలూ, బలాదూరు తిరుగుళ్ళూనే.  గమ్మున తగలడండి.' అంటూ కనకరాజు బైటకెళ్ళగానే భళ్ళున తలుపు వేసుకుని స్నానానికి పెరట్లోకి వెళ్ళింది కాళింది. ప్రతిఆదివారం కనకరాజు, అతడి జులాయి మిత్రులు అందరూ పొద్దునే పేకాట మొదలెడతారు.  సాయంత్రం దాకా కసితీరేలా పేకాడేస్తారు.  ఆటకింతని డబ్బులు తీసి పక్కన పెడతారు.  సాయంత్రం అయ్యేసరికి దాదాపు వెయ్యి రూపాయలు పోగవుతుంది.  ఆ డబ్బుతో అందరూ బారుకి పోయి రాత్రి పదిన్నర దాకా జల్సా చేసుకుని అప్పుడు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి పెళ్ళాలు తిట్టే తిట్లు ఈ చెవితో వింటూ, ఆ చెవితో వదిలేస్తూ మంచాలమీదకి చేరుకుని గుర్రు పెట్టి నిద్దర్లు పోతారు. యధావిధిగా పదకొండింటికి ఇంటికి చేరుకున్నాడు కనకరాజు.  వస్తూనే తలుపులు దబదబ బాదేసాడు.  తలుపులు తీస్తూనే తిట్ల పురాణం లంకించుకుంది కాళింది.  ' ఛీ ఛీ, ఇటువంటి మగాడికి పెళ్ళాం కావడం కన్న, ఊరకుక్కకి ఒకపూట తిండి కావడం నయం.  వారానికి ఏడురోజులూ ఇంట్లోనే పడి ఏడుస్తూనే వుంటుందే, కనీసం ఆదివారం నాడన్నా పెళ్ళాన్ని ఏ సినిమాకో తీసికెడదాం అన్న ఇంగిత జ్ఞానం కూడా వుండదు ఈ కర్కోటకుడికి.  తనేమిటో, తన సరదాలేమిటో.  అంతే తప్ప పెళ్ళాం పిచ్చిది ఏం చావు చస్తోందో అన్న ధ్యాస కూడా వుండదు.' కనకరాజు తాగినప్పుడు పెళ్ళాం ముందు పిల్లిలా అయిపోతాడు.  ఆవిడ ఎన్ని తిట్టినా తనని కాదన్నట్లు, దులుపుకుని, మాట్లాడకుండా మంచం ఎక్కేసి దుప్పటి ముసుగు తన్నేసాడు.                                                                        ****************************** రాజారావు ఇంట్లో కూడా ఆరోజు ఆదివారమే.  అంతకు ముందురోజు రాత్రి ఆలస్యంగా పడుకున్నందు వల్లనో ఏమో, వాసంతికి గమ్మున మెలకువ రాలేదు.  పైగా ఒళ్ళంతా పచ్చినెప్పులుగా వుంది.  లేద్దాం, లేద్దాం అనుకుంటూనే మగతగా పడుకుండిపోయింది.  ఎవరో వచ్చి, మెల్లిగా తట్టిలేపుతున్నట్లుంటే కొద్ది కొద్దిగా కళ్ళు తెరిచి చూసింది వాసంతి.  ఎదురుగా పతిదేవులు చిరునవ్వుతో 'శుభోదయం వసంతమా!' అంటూ నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.  దిగ్గున లేవబోయింది వాసంతి.  ' అబ్బబ్బ, నెమ్మది, నెమ్మది.  ఇవాళ ఆదివారం.  నువ్వంత అర్జంటుగా లేచి చెయ్యవలసిన రాచకార్యాలేమీ లేవులే.  నెమ్మదిగా లేచి మొహం కడుక్కో.' అంటూ చెయ్యి అందించాడు.  వాసంతి సిగ్గు పడుతూ బాత్ రూమ్ లోకి వెళ్ళింది.  మొహం కడుక్కుంటోందన్న మాటే గాని, ' ఛి, ఛి, ఇవాళ చాలా ఆలస్యం అయిపోయింది.  అంతా ఆయన మూలానే.  పెందరాడే పడుకోనిస్తేనా?' అని మనసులోనే విసుక్కుంటూ, ఇవాళేం టిఫిను చేయాలబ్బా? అని ఆలోచించసాగింది.  పెసరపప్పు రాత్రే నానబోసింది కనక పెసరట్లు వేసి, ఉప్మా చేస్తే ఆయన సంతోషంగా తింటారు అనుకుంటూ గబగబా స్నానం ముగించుకుని, దేవుడి దగ్గరకెళ్ళి దీపం వెలిగించి దణ్ణం పెట్టుకుని వంటింట్లోకెళ్ళింది.  అక్కడ తను పెసరపప్పు నానబోసిన గిన్నె ఖాళీగా కనిపించింది.  ఇదేమిటి, ఈ గిన్నెలో కాదా నానబోస్తా అనుకుంటూ గిన్నెలు వెతుకుతూంటే వెనకాలనించి రాజారావు పెసరట్టు, ఉప్మా వున్న ప్లేటు ఆమె కళ్ళముందు పెట్టాడు.  వాసంతి తెల్లబోయింది. ' ఏమిటండీ, ఈ ఆడంగి పనులు?  అసలే లేవడం లేటయిందని నేను సిగ్గుపడుతూంటే, ఇంకా బాధ పడేలా ఏమిటి మీరు చేసిన పని?' అంది కోపంగా. ' ఏముంది?  రోజూ నువ్వు నాకు అడ్డమైన చాకిరీ చేస్తున్నావు.  ఇవాళ ఆదివారం కదా, నీకు కొంచెం రిలీఫ్ నేను ఇస్తే ఎల్లా వుంటుంది అనిపించింది.  అందుకే నువ్వు చెయ్యాలనుకున్న పెసరట్టు, ఉప్మా నేనే చేసేసాను.  దా, ఆకలేస్తోంది.  ఇద్దరం కలిసి తినేద్దాం.' అన్నాడు రాజారావు. వాసంతికి ఏమనాలో తోచలేదు.  మనసులో చాలా పశ్చాత్తాప పడుతూంటే, రాజారావు ఒక పెసరట్టు ముక్క తుంపి, ఉప్మాలో నంచి ఆమె నోట్లో కుక్కాడు.  '  అబ్బ, ఎంత రుచిగా వండారండీ!  నేను కూడా మీ ముందు బలాదూర్! ' అంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్లు తినడం పూర్తి చేసి కాఫీలు తాగారు. వాసంతి, ' ఏమండీ, ఇవాళ ఆదివారం కదా, ఏం చేద్దామంటారు?' అని అడిగింది. ఇద్దరూ టి.వి. ఎక్కువగా చూడరు.  అందులో వచ్చే తెలుగు సీరియల్సు, సినిమాలు అంటే వాళ్ళకి ఇష్టం వుండదు.  విపరీతమైన హింస, ఆడవాళ్ళు కౄరంగా ప్రవర్తించడం, చిన్నపిల్లలను దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపడానికి ప్రయత్నించడం లాంటి కథావస్తువులతో వుండే తెలుగు సీరియల్సంటే ఇద్దరికీ పరమ అసహ్యం.  ఇక సినిమాల జోలికొస్తే, సంభాషణలు పలకడం చేతకాని, నటనంటే ఏమిటో తెలియని, పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చే వికారంగా వుండే శాల్తీలు, అది తమ వంశపారంపర్యపు హక్కు అన్నట్లుగా హీరోలుగా చలామణీ అయిపోతుండడం, ఇక తెలుగు రాని ఇతర రాష్ట్రాల పిల్లలు ఒంటిమీద సరిగ్గా బట్టలు లేకుండా, పైజమాలో గండుచీమలు దూరాయేమో అన్నట్లు అష్టవంకరలు తిరిగిపోతూ, హోరు సంగీతానికి కుప్పిగంతులెయ్యడం, ఒక హీరో వందమందిని అవలీలగా చితక్కొట్టడం - ఇలాంటి అంశాలతో వున్న సినిమాలంటే వాళ్ళకి అస్సలు పడదు.  అందుకని ఆదివారాలు వాళ్ళకిష్టమైన పధ్ధతిలో గడిపేస్తూ వుంటారు. రాజారావు అన్నాడు, ' ఇద్దరం హాయిగా కూర్చుని కేరంబోర్డు ఆడదాం.  ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ పూట వంట చెయ్యాలి.' వాసంతి నవ్వేసి అంది, ' అమ్మా!  ఈ పప్పులు నా దగ్గిరేం ఉడకవు.  మీరు కావాలని ఓడిపోయి చేతులు కాల్చుకోడానికి తయారవుతారు.  చూడండి, వంటిల్లు నా సామ్రాజ్యం.  అందులోకి ఎవ్వరూ, ఆఖరికి స్వంత మొగుడైనా సరే, జొరబడ్డానికి నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను.' ' ఐతే సరేలే.  వంట నువ్వే చేద్దూగాని.  ఈలోపున నేను బట్టలన్నీ వాషింగ్ మెషీన్లో వేసేసి ఆరేస్తాను.  తరవాత ఇల్లు సర్దేస్తాను.  అప్పుడు ఇద్దరం కలిసి భోంచేసి హాయిగా కాసేపు కునుకు తీద్దాం.  తరవాత సాయంత్రం కాసేపు పార్కులో తిరిగి వద్దాం.  ఏమంటావ్?' అన్నాడు. వాసంతి ఆ మాటలకి ఒప్పుకుంది.  ఆమె బియ్యం కడుగుతూంటే, రాజారావు అరటికాయలు ముందేసుకుని తరగడం మొదలుపెట్టాడు.  ఆ సమయంలో అతడి మిత్రుడు నరసింహం వచ్చాడు.  కూర తరుగుతున్న రాజారావుని చూసి నిర్ఘాంతపోయి అన్నాడు, ' ఒరేయ్ రాజారావ్!  ఏమిట్రా ఇది?  నువ్వు...........నువ్వు కూర తరుగుతున్నావా?' వాసంతి సిగ్గుపడిపోతూ, ' నేను అక్కడికీ చెబుతూనే వుంటాను అన్నయ్యగారూ.  ఆయనకదో సరదా.  నా మాట వినరు.' అంది దోషిలా. రాజారావు అన్నాడు, ' రారా నరసింహా.  కూర్చో.  ఏమిటీ విశేషాలు.  ఏమే, ఇంక ఈ అరటికాయలు నువ్వే తరుక్కో.  ఈ లోపున నాకూ వీడికీ కాస్త కాఫీ తీసుకురా.' నరసింహ కూర్చుంటూ మళ్ళీ అన్నాడు, ' అది కాదురా రాజా, నువ్వు కూరలు తరగడం.........ఇదేం సరదారా?' రాజారావు అన్నాడు, ' ఒరేయ్ నరసింహా!  మన రాజ్యాంగంలో గాని, మనుధర్మశాస్త్రంలో గాని కూరలు తరుగుట, అన్నము వండుట ఆడువారే చెయ్యవలెను, మగవారు చెయ్యరాదు అని ఏమన్నా రాసివుందేమిటిరా?  మొగుడూ, పెళ్ళాలన్నాక కాస్త ఒకరికొకరు చేదోడు వాదోడుగా వుండకూడదా?  పొద్దుట్నించీ, రాత్రి పడుకునేదాకా యంత్రంలా ఆడది అన్నిపనులూ తనే చెయ్యాలా?' ' అని కాదనుకో.  కాని మనం కష్టపడి బైటికెళ్ళి నాలుగు రాళ్ళు సంపాదించి ఇంట్లో ఇవ్వటల్లేదూ?  మన డ్యూటీలు మనకుంటాయి.' ' ఏడిశావులే.  మనం ఆఫీసుల్లో అంత దారుణంగా ఏమీ కష్టపడిపోవటల్లేదు.  ఆడవాళ్ళ శ్రమతో పోలిస్తే మనం పడే శ్రమ నథింగ్.  ఐనా ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా బైటికెళ్ళి సంపాదించుకొస్తున్నారుగా?  ఐనప్పటికీ ఇంటిపని, వంటపని చచ్చినట్లు వాళ్ళే చేస్తున్నారుగా?' నరసింహ అన్నాడు, ' అది నిజమేననుకో.  కాని..........' ' నీ కానీలు తీసి అవతల పడెయ్యి.  కానీ, అర్ధణాల రోజులు ఎప్పుడో వెళిపోయాయి.  A wife and husband are two complementary halves of a unit.  వాళ్ళు ఇద్దరూ సమానమే.  ఒకరికి ఒకరు పరిపూరకాలు.  అంటే ఒకరి అభిరుచులని రెండవ వారు గౌరవిస్తూ, ఒకరి లోటుపాట్లను రెండవవారు కమ్ముకుంటూ, కలిసిమెలిసి ఆనందంగా హాయిగా జీవితాలు గడపాలిరా.  అంతేగాని, ఒకరు ఎక్కువ అని, వేరొకరు తక్కువ అనే భావనలో వుంటూ, ఎదుటివారిని గౌరవించకుండా, కించపరుస్తూ ప్రవర్తిస్తే దాని వల్ల సంసారంలో పొరపొచ్చాలు చెలరేగి, సంసారజీవితం ఒడిదుడుకల మయమై పోతుందిరా.  ఇది గ్రహించకనే ఎందరో తమ సంసారజీవితాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.  రెండు అరటికాయలు తరిగితే నా కండలు కరిగిపోతాయా?  ఆ మాత్రం సాయం నేను నా పెళ్ళానికి చేసుకోకూడదా?' నరసింహానికి సిగ్గేసింది.  రాజారావు అన్నది నిజమేగా?  తను ఎంత సంకుచితంగా ఆలోచించాడు? అనిపించింది.  ఇంకేం మాట్లాడలేక పోయాడు.  కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి వెళిపోయాడు. వాసంతికి తన భర్తని చూస్తే చాలా ముచ్చటేసింది.  మేరా భారత్ మహాన్.  మేరా భర్తా భీ మహాన్!' అనుకుంటూ బియ్యం పొయ్యిమీద పడెయ్యడానికి వెళ్ళింది.                                                              *************************** కాళిందికి కనకరాజుకి ఒక్క క్షణం పడటల్లేదు.  నిప్పు, ఉప్పులా వుంది పరిస్థితి. ఒకసారి కనకరాజు స్నేహితుడు శర్మ అన్నాడు, ' ఒరేయ్ కనకరాజూ!  ఇల్లా రోజూ మీరిద్దరూ దొమ్ములాడుకుంటూంటే, ఇంక జీవితంలో మీకు సుఖమేముంటుందిరా?  కొంచెం నువ్వే తగ్గచ్చుగా?  రోజూ ఆ వెధవ పేకాటలు, తాగుళ్ళు మానేసి నీ పెళ్ళాంతోనే కాలం గడపచ్చుగా?' కనకరాజు విషాదంగా అన్నాడు, ' నీకు తెలీదురా.  నా భార్య ఏ విషయంలోనూ రాజీ పడదు.  ఎప్పుడూ తనదే పైచెయ్యిగా వుండాలనుకుంటుంది.  భార్యతో సరదాగా గడపాలని నాకు మాత్రం వుండదా?  ఒరేయి శర్మా, భోజ్యేషు మాతా, శయనేషు రంభా అన్నారు కదా?  ఏరోజూ నేను ఇంట్లో సుఖంగా నాలుగు మెతుకులు తిన్నది లేదురా.  కూరలో ఉప్పుంటే కారం వుండదు, కారముంటే ఉప్పుండదు.  అన్నం ఉడికీ ఉడక్క ఏడుస్తుంది.  ఇదేమిటి అని అడిగాననుకో, ఇంక కురుక్షేత్ర సంగ్రామమే.  ఇంక పైశ్లోకంలో రెండవ చరణం అంటావా, ఆ విషయం నేను మాట్లాడకపోవడమే మంచిది.  భార్య సరిగ్గా వుంటే భర్త రోడ్డెందుకు ఎక్కుతాడురా?' శర్మ ఆ మాటలు విని ఇంకేం అనలేకపోయాడు. సరిగ్గా అదే సమయంలో పక్కింటి తాయారుతో కాళింది ఈ విధంగా అంటోంది, ' మీకు తెలీదు వదినగారూ.  నాకు ఆయనతో దెబ్బలాడడం ఏం సరదానా?  ఆయనకున్నంత అహంకారం ఈ ప్రపంచంలో ఏ మగాడికీ వుండదు.  ఎప్పుడన్నా కూరలో కాస్త ఉప్పెక్కువ అయిందనుకోండి, అన్నం కంచం విసిరి కొడతాడు.  రోజూ అద్భుతంగా వండి వార్చడం ఏ ఆడదాని వల్లనైనా అవుతుందాండి?  ఒక్కొక్కసారి కూర గాని పచ్చడి గాని సరిగ్గా కుదరకపోవచ్చు.  ఇంక ఆరోజు ఆ మగమహారాజు ఇల్లు పీకి పందిరేసేస్తాడు.  భర్తగా కూడా ఆయన ఎప్పుడూ నా అవసరాలు కనిపెట్టడండి.  నాకు చీరలు వున్నాయో, లేకపోతే కొనాలో ఆయనకి తెలీదు.  సబ్బు అయిపోయిందని చెబుతే ఇంకో వారంరోజుల తర్వాత సబ్బు తీసుకు వస్తే గొప్పమాట.  అంతవరకూ కొబ్బరిపీచుతో ఒళ్ళు తోముకోవాల్సిందే.  ఇలాంటివి ఇంకా చాలా వున్నాయిలెండి.  ఎన్నని చెప్పను?  కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది.  ఈ జీవితం ఇంక ఇల్లా గడిచిపోవల్సిందే.  ఉంటాను వదినగారూ.'                                                       ****************************** అమ్మలూ!  అయ్యలూ!  అదీ సంగతి.  రెండు కాపురాల్లోకీ మనం తొంగి చూసాం కదా?  ఎలా బతికితే బాగుంటుందీ, ఎలా నడుచుకుంటే జీవితాలు సుఖమయమౌతాయీ అన్నది ఎవరికి వాళ్ళం ఆలోచించుకుంటేనే బాగుంటుందేమో కదూ?
                                                                                   ********************************

No comments:

Post a Comment

Pages