కిటికీలో కపోతం - అచ్చంగా తెలుగు

కిటికీలో కపోతం

Share This

కిటికీలో కపోతం

పోడూరి శ్రీనివాసరావు

9849422239


రెండ్రోజులుగా పావురం
కిటికీలో హడావుడి చేస్తూనే ఉంది
ఏమిటా! అని పరిశీలించాను.
 
గూడు కట్టుకునే ప్రయత్నం
పుల్లలూ, పీచూ వగయిరా
చేరవేస్తోంది.
 
మెట్రో పనులతోనూ
రోడ్డు విస్తరణతోనూ
ఉన్న చెట్లను నరికి వేస్తున్నాం కదా!
 
మరి అవెక్కడ ఉండాలి?
పక్షులన్నిటికీ ఇదే బెంగ.
వాటికి గూడా సంసారం ఉందిగా!
పిల్లా పీచూ ఉంటాయిగా!!
 
అందుకని మాఇంటి
కిటికీని ఎన్నుకున్నాయన్నమాట.
వాటికి మనలాగ
ప్లాన్లూ, ప్లాట్లూ, హౌసింగు లోన్లు
అవసరం లేదు కదా!
 
సిమెంటు, స్టీలు ధరవరలు పెరిగినా
ఇసుక స్కాములు జరిగినా
వాటికేం పట్టదు కదా!
 
కాసింత పుల్లలు
కొద్దిగా పీచేగా
‘గృహనిర్మాణానికి’
 
నా వంతు సహాయం
చేయాలని నాకూ
అనిపించింది.
 
కిటికీలోనికి చేయిచాపి
బయటకు తడిమాను.
కొన్నిపుల్లలు, దూది
కిటికీలో ఉంచాను.
 
చేయి లోపలకు తీసుకోగానే
మళ్లా పావురం గూటికోసం
కిటికీ దగ్గర వాలింది.
 
ముక్కుతో పట్టుకున్న పుల్లతో....
నా మనసెంతో ఆనందంగా
గంతులు వేసింది...
నా వంతు సహకారం
నేనందించానని!

No comments:

Post a Comment

Pages