మానస్ ప్లే స్కూల్
ఆండ్ర లలిత
ఆ రోజుతెల్లవారుఝామున 5:00గంటలు అయ్యింది. పక్షులు కిలకిలలాడుతున్నాయి. పక్షుల కిల కిలనాదాలకి పద్మకి మెలుకువవచ్చి,“కరాగ్రే వసతేలక్ష్మీ,కరమూలే సరస్వతి”అనే లక్ష్మీదేవీ ప్రార్థనతో రోజు మొదలు పెట్టింది. మదిలో క్రొత్త ఆశలుతో, ఆ భగవంతుడి ప్రార్థనతో, సేవా భావనతో రోజు మొదలుపెట్టింది. అప్పుడే ఉదయిస్తు మబ్బులతో దోబూచులాడుతున్న సూర్యనారాయణమూర్తి ప్రకాశవంతమైన కిరణాలు కిటికిలోనుంచి గ్యాస్ స్టవ్ పైన కాగుతున్న పాల మీద పడినప్పుడు ఇంధ్ర ధనుస్సు లాగ అనిపించిది.
ఆఘమేఘాలలో పరుగు పరుగున వచ్చేసూర్యనారాయణమూర్తికి పొంగుపొంగున పొంగే ఆ పాలు మొదటినైవేద్యము.
“మానస్ లేస్తావా, చూడు రామచిలుకలు, మానస్ , మానస్ దా ! మాతో ఆడుకో అని పిలుస్తున్నాయి” అని అంది పద్మ.
“ అమ్మా….“అని పిలిచాడు మానస్.
“నువ్వు,నా చిన్ని చిన్ని కృష్ణుడివి యిటురామ్మ....” అని అంది పద్మ.
“ఉహు …నువ్వు దా ...” అన్నాడు మానస్.
అమ్మ మానస్ దగ్గరకు గబగబా వచ్చి మానస్ను ఎత్తుకుంది.
కళ్ళు రెండుచేతులతో నలుపుకుంటు, అమ్మ చెంగుతో ఆడుకోసాగాడు మానస్. అమ్మ మానస్ని,ముద్దుచేసి, మోహము కడిగింది
“ మానస్ పాలు త్రాగుతావా,” అని అంది పద్మ.
“నాకు వొద్దు!” అన్నాడు మానస్.
“మరి పాలు త్రాగి , బొబ్బ పోసుకుని ,ముస్తాబైయి,బడికి వెళ్ళాలి కదా. గబగబా గుడ్ బొయ్లా తయారైపోవాలి , సరేనా” అని అంది పద్మ.
“వెళ్ళను...” అని దిగాలుగ అమ్మకేసి చుసాడు.
“పాలుత్రాగు” అని అంది పద్మ.
“నాకు వొద్దు. నాకు అది కావాలి ” అని అమ్మ వండుతున్న పిండి పులిహార కేసి చూపించాడు .
“ పెట్టూ..” అని అడిగాడు మానస్.
“పిండి పులిహారా...”అని అంది పద్మ.
“ మానస్, కొంచముసేపు తరువాత తిందువుగాని సరేనా” అని అంది పద్మ.
పిండి పులిహార వాసనతో ఘుమ ఘుమలాడి పోయింది ఇల్లు అంతా...
“ఉహు నాకు అదే కావాలి” అని అడిగాడు మానస్.
“సరేగాని, మానస్ బడికి వెళ్ళాలి ,సరేనా, అల్లరి పెట్టకునాన్న”అంది పద్మ.
మానస్ బుంగమూతితో అమ్మకేసి రుసరుస చూస్తూ,సావిట్లో ఒక మూల కూర్చున్నాడు.
అమ్మ హడావిడిగా బొప్పాయి పండు కొయ్యసాగింది.
అమ్మకేసి చూస్తూ, అప్పుడే నేర్చుకుంటున్న ఇంగ్లీష్ పదాలతో,“మీ నో లైక్ పపీత...మానస్ లైక్స్ ఐస్క్రీం అని అంటూ నోరు చప్పరిస్తూ” అమ్మకేసి చూసాడు.
ఇంతలో ఎక్స్ప్రెస్ ట్రైన్లా గుడ్డ పెట్టి గదులు తుడుస్తున్న ప్రమీల, “మానస్ జాగ్రత్తగా నడు తడి గుడ్డతో తుడుస్తున్నాను ,నేలతడిగా ఉంది”అని మాటముగించే లోపల మానస్ దడ్ అని పడ్డాడు.
“అమ్మా, నొప్పి…డామ్ పప్పొయాను” అని గట్టిగా కేక పెడ్తూ , నేలగట్టిగ ఉంది అని ఏడ్వసాగాడు.
ఇటు బాత్రూంలో అద్దం దగ్గర గడ్డం గీసుకుంటున్న నాన్న,వంటగదిలో వంట చేసుకుంటున్న అమ్మ ,కళ్ళజోడు సద్దుకుంటు పేపర్ చదువుతున్న తాతగారు , పంచాంగము చూసుకుంటున్న బామ్మ ఆఘమేఘాలలో మానస్ ముందు హజరైయారు. వాళ్ళందరు మానస్ని బుజ్జగించి ,టివిలో మానస్కి ఇష్టమైన కార్టూన్ షో చూస్తున్నారు.
ఇంతలో ప్రమీల“చింతపండు ఉప్పు కొంచంవెయ్యమ్మ, ఈ యిత్తడి పాత్రకి”అని పద్మతో అంది.
“తళతళమెరిసేల తోముతాను...” అంది ప్రమీల.
“సరేగాని, నువ్వు నీళ్ళు గట్టిగా పిండితుడవచ్చుగా,”అంది పద్మ.
“గట్టిగ పిండానమ్మ, లైజొల్ ఎక్కువేసాను” అంది ప్రమీల.
“ఐతే తక్కువెయ్య” అంది పద్మ.
“అలా చేస్తే యిలాగ అంటావ్, యిలా చేస్తే అలా అంటావ్. అలా ఐతే ఎలా అమ్మ...” అంది ప్రమీల
టీవి చూస్తున్న మానస్ కి పద్మ, హడావిడిగా బాదంపాల గ్లాస్ అందించింది... మానస్ రెండు సిప్స్ బాదంపాలు చప్పరిస్తూ, టీవి ప్రొగ్రాం ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో మానస్కి యిష్టమైన 'పోపాయ్ ది సైలర్' సమాప్తమయింది. పాలు గబగబా తాగేసి కుర్చిలోంచి ఒక్కసారి ఎగిరి దూకి, పాల గ్లాసు ఒక చేతిలో ,ఒక చేతితో మూతి తుడుచుకుంటూ జెట్ విమానం భంగిమలో అమ్మ దగ్గర వాలాడు….
గాలి బిల్డింగ్ బ్లోక్స్ కేసి మళ్ళింది…అంతే మరి….
“బామ్మా నీకు ఒక కార్ కట్టనా…” అన్నాడు మానస్. “కట్టు నాన్నా, అప్పుడు మనమిద్దరము ఆచ్చ్ వెళ్ళ్దాము..” అంది బామ్మ.
బిల్డింగ్ బ్లోక్స్ ముందు వేసుకుని గాలిమేడలు కట్టసాగాడు.
“నాన్నా దా……. ఆడుకుందాము” అన్నాడు మానస్.
“ఇప్పుడా!” అన్నాడు వేణు.
“దా .... … ఇప్పుడే” అన్నాడు మానస్.
“ఇప్పుడు స్కూల్కి వెళ్లి , అక్కడ కొంచము సేపు ఆడుకునిరా ,సరేనా” అన్నాడు వేణు.
“ లేదు” అన్నాడు మానస్.
“ ఎందుకు ? అక్కడ బోళ్ళు బొమ్మలూ ఉంటాయి కదా..” అన్నాడు వేణు.
“ఉహు…నేనువెళ్ళను” అన్నాడు మానస్.
“ ఎందుకు వెళ్ళవూ” అని అడిగాడు వేణూ ముద్దుగా…
“దీప్ నాకు ట్రైన్ ఇంజిన్యివ్వటంలేదు…వాడే ఆడుకుంటుంన్నాడు. నాకూ కావాలి..” అన్నాడు మానస్.
“మనము సాయంత్రం కొనుక్కుందాము, కాని యిప్పుడు మరి స్కూల్కి వెళ్ళు సరేన…” అన్నాడు వేణు.
వేణు హడావిడిగ సమయము అయిపోతోందని గమనించి తను ఆఫ్ఫీస్కితయారైయ్యే పనిలో పడ్డాడు. తయారైయి టిఫిను తిని, పరుగు పరుగున వేణు హడావిడిగా గడియారము చూసుకుంటూ ఆఫ్ఫీస్బస్సు ఎక్కాడు.
**********************
“ అమ్మా,ఆకలీ….,పులిహార పెట్టు ”అని మానస్ అడిగాడు
అమ్మ మానస్కి మమ్మం పెట్టి,” మానస్ బొబ్బ పోసుకుందువుగాని రా అని పిలిచింది”.
“ఉహు …రాను” అన్నాడు మానస్.
“మానస్ నువ్వు నా చిన్ని కృష్ణుడివియిటురామ్మ … అని ఎత్తుకుని ముద్దాడి, బొబ్బపోసి ముస్తాబుచేసి, పరీస్ ప్లే స్కూల్కి ఇద్దరు బయలుదేరారు .మానస్, దీప్ కొంచము సేపు ఆడుకున్నాక నువ్వు ఆడుకో ,నువ్వు ఆడుకున్నాక దీప్ ఆడుకుంటాడు సరేనా .కలసి మెలసి ఆడుకోవాలి”… అని పద్మ అంది.
దారి పొడుగునా టచ్ మీ నాట్ మొక్కలను, తన షూతో తొక్కుతూ, అవి ముడుచుకుంటే ఆనందిస్తూ , తెరుచుకుంటే ఉత్సాహం వ్యక్తముచేస్తూ, ఆడుతు పాడుతూ అలుపుసలుపు లేకుండా స్కూల్కి చేరారు.
మానస్ని అమ్మ 'పారీస్ ప్లే హోం' లో దింపి టాట చెప్పి, వెన్నక్కి తిరిగి వచ్చేయబోతుంటె, “అమ్మా….” అని ఏడుపు మొదులుపెట్టాడు మానస్ .
“ నాకు డోకు వస్తోంది . ఇంటికి వెళ్లి పోదామమ్మా, రేపు వస్తాను”. అన్నాడు మానస్.
అమ్మ ఎత్తుకుని ఛాతీ,పొట్ట వ్రాసి ,ఇంటికి వెళ్లి పోదాము ఏడవకు ,అని సముదాయించింది . పద్మ మానస్ని యెత్తుకుని గబ గబా నడుస్తోంది .
మానస్ అమ్మకేసి చూస్తు , “అమ్మా నవ్వవా ” అన్నాడు.
“ నువ్వుబడిలో యెందుకు ఏడ్చావు” ? అంది పద్మ.
“అమ్మా,బోళ్ళు కార్లు , బోళ్ళు బస్సులు చూడు....” అన్నాడు మానస్.
“మరి బడికి యెప్పుడు వెళ్తావో చెప్పు . అసలు వెళ్తావా”? అంది పద్మ.
“ ఊ... వెళ్తా” అన్నాడు మానస్.
“ ఎప్పుడు ”? అంది పద్మ.
“అపెప్పో . అమ్మా కధ చెప్పు”అన్నాడు మానస్.
కాకమ్మ బుల్లమ్మ కధలు చెప్పుకుంటు ఇంటికి వచ్చారు . అమ్మ మానస్కి మంచి మాటలు చెప్తూ, మమ్మం పెట్టి తలనిమురుతూ బుజ్జగించి , పడుకో పెట్టింది.
పద్మ సావిట్లోకి వచ్చి నెత్తిన చేతులు పెట్టుకుని దిగాలుగా కుర్చీలో చతికిల పడింది .
“ నెత్తిన చేతులు తియ్యి . చంటాడు బడికి వెళ్ళలేదనా , నీ ఆందోళన . కంగారు పడకు, వాడి వయస్సెంత ? ఆ భగవంతుడు కనికరిస్తేవాడే గొప్పవాడౌతాడు . బెంగపెట్టుకోకు అమ్మడు . మనస్సు కలత చెన్దనీయకు . పిల్లలికి చదువు , మనసంస్కారము మీద ఆసక్తి యెర్పరిచే బదులు వొత్తిడి పెట్టి విరక్తి తేకూడదు .ఏమంటావు ,నా అనుభవముతో చెప్తున్నాను . వాడు వాడి తోటి వయస్సువాళ్ళ లాగసంఖ్యలు,అక్షరాలు ,పద్యాలు యందు ఆసక్తి చూపుతున్నాడుకదా . కంగారు పడకు .ఆ లేతమనస్సు యేదోనొచ్చుకుంది . వాళ్ళటీచరు గారితో మాట్లాడి కనుక్కో . వాడి మనస్సులో ఉన్న ఆందోళన తీసేస్తేవాడే వెళ్తాడు. పిల్లలి మనస్సు మైనపు ముద్దలాంటిది . మనము ఎలా మలుస్తే , అలా అవుతుంది . మనము వొత్తిడి పెడితే, సరిగ్గా వికసించదు. వయస్సుకు మించిన వొత్తిడి తేకూడదు . చూస్తువుండు వాడు గొప్పవాడౌతాడు” అన్నారు అత్తగారు
పద్మకి అత్తగారి మాటలు మనస్సుకి అత్తుకుపోయాయి . పెద్దల మాట చద్ది మూట. పెద్దవాళ్ళ అనుభవపూర్వకమైన మాట ఒక్కటి చాలు, అని అనుకుని మళ్లి పనిలో పడింది పద్మ.
ఇంతలో మానస్ నిద్ర లేచి అమ్మా అని పిలిచాడు . పద్మ ఒక్క పరుగున వెళ్లి మానస్ని ఎత్తుకుంది . మనస్కి మోహము కడిగి ముస్తాబు చేసి పాలు పడుతూ ..
" మరి మానస్ పాలు త్రాగాక పార్కు వెళ్దామా " అంది పద్మ.
“మరి రేపు స్కూల్కి వెళ్లి,ఇంటిలో ఉండి బెండకాయి ముచ్చికతో బోళ్ళు పువ్వులు ఉన్న చిత్రం వేసావు కదా, అది మీ టీచెర్కి చూపిస్తావా మరి . మీ టీచెర్ మానస్ పెయింటింగ్ ఎంత బావుందో అంటుంది . మీ టీచెర్ మానస్ చాలా గుడ్ బొయ్ అంటుంది. మానస్, చక్కగా ఎ బి సి డి ,నర్సరి రైమ్స్ ,123, అన్ని చెప్పేసి మీ టీచెర్ దగ్గర గుడ్ బొయ్ అనిపించుకోవాలి సరేనా .బంగారు తండ్రివి” అంది పద్మ
మానస్ అమ్మతో కలసి పార్కుకి వెళ్ళాడు .
మానస్ పార్కులో ఆడుకుని అలసిపోయి మామ్మం తిని, సాయంకాలం వేణు వొళ్ళొ నక్షత్రాలు, చంద్రుడు కార్లు విమానాలు గురించి ఎవో చొప్పదంటు ప్రశ్నలు అడుగుతూ ,తెలుసుకుంటు ఆదమరచి నిద్రపోయాడు.
"పద్మా ! ఒక్కసారి చల్లటి అమ్మ ఒడి నుంచి బడిలో కొత్తవారితో మెలిగేటప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు. అమ్మతోనే ఉండేందుకు ఇష్టపడతారు. పూర్వం ఐదేళ్ళు వచ్చేదాకా బడికి పంపేవారు కాదు. కాని ఇప్పుడు, గుప్పిళ్ళు విప్పని పసిపిల్లలని సైతం 'ప్లే స్కూల్' లో వేస్తున్నారు. ఇటువంటప్పుడు, పిల్లలు స్కూల్ కు అలవాటు పడేదాకా, మనం ఓర్పు వహించాలి. పువ్వు పరిమళించటానికి సరైన సమయము, అనుకూల పరిస్తితులు, పర్యావరణము అవసరము . మన ఆలోచనలు ఒత్తిడిలు పిల్లలి సున్నితమైన మనస్సుమీద మోపకూడదు. ఓపిగ్గా పిల్లల్ని దిద్దుకోవాలి. ఈ ఆధునిక యాంత్రిక యుగంలో, శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగమనాలు శరవేగంతో జరిగే ఈ యుగములో, పిల్లలి దృష్టిని ఆసక్తిని వినూత్న ప్రతిభ పట్ల కేంద్రికరించవలిసిన అవసరము, ఈ సమాజము మీద చాలా ఉంది. ఈ సమాజము పిల్లల మనోవికాసం కోసం పాటు పడాలి . అప్పుడే నేటి బాలలు రేపటి పౌరులు అవుతారు, " అన్నాడు వేణు పద్మతో.
నిద్రిస్తున్న మానస్ నుదుట ముద్దాడుతూ, వేణు మాటలకు సాలోచనగా తలూపింది పద్మ.
No comments:
Post a Comment