మొక్కు - అచ్చంగా తెలుగు

మొక్కు

- బి.ఎన్.వి.పార్ధసారధి 


సుబ్బారావు మొక్కుకున్నాడు, మంచి ఉద్యోగం దొరికితే తన మొదటి నెల జీతం తో తిరుపతి వస్తానని. ఉద్యోగం దొరికింది మొక్కుకున్న మరో నాలుగు నెలలకి, కానీ మొదటి నెల జీతం అందుకోగానే మొక్కునున్న ప్రకారం తిరుపతి వెళ్ళలేక పోయాడు సుబ్బారావు. ‘పోనీ నిదానంగా వీలుచూసుకుని వెదడామంటే  మరి మొదటినెల జీతంతోనే వస్తానని మొక్కుకున్నాడే ? ‘ ఎం చెయ్యాలో తోచక తన ఆఫీసు మిత్రుడు హరిబాబుని అడిగాడు. “ అదేంటి గురూ ! అట్టా డీలా పడిపోతావు ఇంత మాత్రానికే . భలేవాడివే . నేనో సలహా చెబుతాను విను. “ అని ఓ క్షణం ఆగి సిరగెట్ వెలిగించుకుని దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు హరిబాబు. ఎంతకీ హరిబాబు మాట్లాడక పోవడంతో సుబ్బారావు అసహనంగా ఫీలయ్యాడు. ఇంతలో హరిబాబు “ గురూ! నువ్వు మొదటి నెల జీతంతో తిరుపతి వస్తానని మొక్కుకున్నావుకదూ!” సిరగెట్ పొగ గుప్పుగుప్పుమని వదుల్తూ అన్నాడు. ఆ ఫోజు లో హరిబాబు అచ్చం ఏ సినీ కవో, రచయతలానో అగుపించాడు సుబ్బారావు కళ్ళకి. ‘అవున’ న్నట్టు తలూపాడు సుబ్బారావు . “అంతేనా?” సుబ్బారావు తల పంకించటాన్ని గమనించని హరిబాబు మళ్ళీ ప్రశ్నించాడు. “ అవును” సమాధానమిచ్చాడు సుబ్బారావు, “ నేన్నీకు ఈ నెల డబ్బు సాయం చేస్తాను. నువ్వు నీ మొదటి నెల జీతం బాంక్ లో వేసి వుంచు. నీకు వీలు పడినప్పుడు బాంక్ లోంచి డబ్బు తేసుకుని తిరుపతెళ్ళు.” అన్నాడు హరిబాబు. క్షణం అయోమయం లో పడ్డాడు సుబ్బారావు. “ అదేమిటోయి అట్టా చూస్తావ్? అర్ధం కాలేదా ? నువ్వు బాంక్ లో వేసే డబ్బు నీ మొదటి నెల జీతం అవునా ? “ అన్నాడు హరిబాబు. అవునన్నట్టు తలూపాడు సుబ్బారావు. “ఆడబ్బు తిరుపతెళ్ళాలను కున్నప్పుడు తీస్తావు అంతే!” హరిబాబు. అప్పటికీ  సుబ్బారావు ‘గట్టి’ బుర్రకి అది ఎక్కలేదు. అరటిపండు వొలిచి పెడితే, తొక్క తిని పండుని పారేసిన వాడ్లా మొహం పెట్టాడు. “ చూడుగురూ ! నువ్వు మొదటి నెల జీతంతో తిరపతి వస్తానన్నావు . కానీ ఫలానా అప్పుడు వస్తానని అనుకోలేదు కదా ! నీ మొదటి నెల జీతం ఇప్పుడు  బాంక్ లో వేసి నీకు వీలైనప్పుడు ఆ డబ్బు తోనే తిరపతి వెళ్తావ్ “. లీగల్ పాయింట్ తీసి ధర్మ సూక్ష్మం వివరించాడు హరిబాబు. సుబ్బారావు బుర్రలో లైట్ వెలిగింది. ఉత్సాహంగా అలవాటు ప్రకారం ఈలైబోయి, ఆఫీసు కావటం మూలాన తమాయించుకున్నాడు సుబ్ర్రావ్ . ఆ తర్వాత మరో నెల రోజులకి ఎలాగైతేనేం సుబ్బారావు తిరపతికి ప్రయాణం కట్టాడు. బాంక్ లో హరిబాబు సలహా ప్రకారం డిపాజిట్ చేసిన డబ్బు తోనే బయల్దేరాడు. ప్రయాణం బాగానే జరిగింది. ఎంతైనా తిరపతి దేముడు కదా డబ్బు బాగానే ఖర్చు చేయాల్సి వచ్చింది  హోటల్, దర్శనం వగైరా లన్నింటికీ . గుండు గీయించుకుని స్వామి దర్శనానికి ‘క్యూ’ లో నాలుగు గంటలు మాత్రమే నిలబడ్డాడు సుబ్బారావు. వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు చివరికి ఎలాగైతేనేం. ఎందుకో దేముడు తనని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది సుబ్బారావు కి. దర్శనం చేసుకుని క్షణం లో వెయ్యోవంతైనా అవందే, ఇంతలో సుబ్బారావు భుజాన్ని ఎవరో అతని శరీరం నుంచి వేరు చేసినట్టు అనిపించింది.  తల తిప్పి చూసేలోపు సుబ్బారావు ఆరడుగుల దూరంలో గెంటి వెయ బడ్డాడు. లడ్డూలు, వడలు కొనుక్కుని బయట పడ్డాడు సుబ్బారావు. బయటికి వచ్చాక హోటల్ కి వెళ్దామని పించింది. జేబులు తడుముకుంటే డబ్బులున్నట్టు అనిపించలేదు. అదిరి పోయాడు. డబ్బు పోయింది. ఎలా పోయింది? ఎవడో క్యూ లో కొట్టేసుంటాడు . మరి ఇంటికి తిరిగి వెళ్లటం ఎలా ?....... దేవుడి చిరునవ్వుకి అర్ధం ఇప్పుడు తెలిసింది సుబ్బారావు కి. ‘ భక్తా! నువ్వు నీ మొదటి నెల జీతం తో నా దర్శనం చేసుకోవటానికి వస్తానన్నావు. వచ్చావు. అంతే. మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళటానికి కూడా ఈ  డబ్బు తోనే అని నువ్వు మొక్కుకోలేదు కదా !’ అని ఎవరో అన్నట్ట నిపించింది సుబ్బారావు కి అదృశ్యంగా . జుట్టు పీక్కోబోయి గుండు చేతికి చల్లగా తగలడంతో  అక్కడే వున్నపళాన చతికిల బడ్డాడు ‘గుండు సుబ్బారావు.’ (  క్రోక్విల్ హాస్యప్రియ, హాస్య సుచిత్ర మాస పత్రిక 1984 , మే సంచిక లో ప్రచురింప బడింది.)

No comments:

Post a Comment

Pages