"నా వాళ్ళు" పుస్తక పరిచయం
(రచయిత్రి : డా. లక్ష్మీ రాఘవ )
- భావరాజు పద్మిని
నీ - నా భేదాలు సాధారణంగా లోకంలో మనం చూస్తూ ఉంటాము. కాని, 'కవి గాంచని చోట కాంత గాంచును...' అన్నట్లు ఉండే ఒక మంచి రచయిత్రి మనోనేత్రానికి అందరూ 'నా వాళ్ళే...' !! బిచ్చగత్తె అయినా, బెంజ్ కారుల్లో తిరిగే గొప్పవారైనా, జీవితాల్ని చదివే కలానికి ఒక్కటే ! అందుకే, మనకు ఎదురయ్యే ఇటువంటి రోజువారీ వ్యక్తులనే తన కధలకు నేపధ్యంగా తీసుకుని, ఒక కధల సంపుటిని ప్రచురించారు లక్ష్మి రాఘవ గారు. మరో విశేషం ఏమిటంటే, ఈ సంపుటి అట్టపై బొమ్మ కూడా ఆవిడ వేసిన పెయింటింగ్ కావడం. రచయిత్రిగా పేరు పొందక ముందు లక్ష్మి గారు ప్రముఖ చిత్రకారిణిగా అనేక చిత్రాలు గీసి, ప్రదర్శించారట !
ఎన్నో రోజుల తర్వాత వచ్చిన భర్త ప్రేమగా పలకరించలేదని అలిగిన అనసూయమ్మ ; గూడు చెదిరి, ముదిమి మీదపడితే, వంతులకు పోతున్న కొడుకుల్ని చూసి, రోసి, వృద్ధాశ్రమమే నయమని ఎంచుకున్న తల్లి; ఆడబిడ్డకు- మగబిడ్డకు తల్లి వివక్ష చూపుతుంటే, అక్కున చేర్చుకునే తండ్రి ఉన్నట్టుండి మరణిస్తే మానసికంగా క్రుంగిపోయిన గీత; నీతి నిజాయితీలే ఊపిరిగా బ్రతుకుతూ, సమాజంలో జరిగే మోసాలకు కలత చెందే సత్యమూర్తి; అనుకోకుండా వచ్చిన వరదలో, తన భర్తను కోల్పోయి, చివరికి తన కొడుకు గూడా చనిపోయాడని తెలిసి, గుండె పగిలి చనిపోయిన సీతమ్మ; సంఘంలో తాను గొప్పగా బ్రతకాలని అనుకుంటూ, కూతుర్ని నిర్లక్ష్యం చేస్తే, అమ్మంటే ద్వేషం పెంచుకున్న రజని... ఇలా ఎన్నో పాత్రలు ,లక్ష్మి గారి కధల్లో ఇమిడిపోయాయి.
చిన్న గ్రామంలో పుట్టిపెరిగిన లక్ష్మి గారు - నిజ జీవితంలోతాను చూసిన చిన్న చిన్న పాత్రలతో, వాస్తవిక స్థితిగతులను, మనుషుల మనస్తత్వాలను మేళవించి తన రచనల్లో చక్కగా ఆవిష్కరించారు. మార్చ్ లో ఈ పుస్తకం ఆవిష్కరించబడింది. ఈ కధల సంపుటికి 'బెస్ట్ షార్ట్ స్టోరీ సంపుటి' గా చిత్తూర్ జిల్లా లో కుప్పం రెడ్డెమ్మ అవార్డు వచ్చింది.
చక్కటి ఈ కధల సంపుటి వెల : 100 రూ. ప్రతులకు క్రింది నెంబర్లను సంప్రదించండి...
9440124700/ 9247302882
No comments:
Post a Comment