ఒంటరి ప్రయాణం - అచ్చంగా తెలుగు

ఒంటరి ప్రయాణం

Share This

 ఒంటరి ప్రయాణం 

  - వెంపరాల.వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి.


గదిలో సీలింగ్‌ మీదున్న తిరగలేక తిరుగుతున్న ఫేన్‌ వంకే తదేకంగా చూస్తున్నాడు మంచం మీద పడుకొన్న రఘురాం.
ఇలా ఒక రోజు,రెండు రోజుల నుంచి కాదు..నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూనే వున్నాడు.ఆ ఫేన్‌ లోనూ ఏ మార్పు లేదు..తన లోని ఏ మార్పూ లేదు.
నాలుగు సంవత్సరాలయింది తను మంచం పట్టి.పక్షవాతం వచ్చి కాళ్ళు,చేతులూ రెండూ చచ్చు పడిపోయాయి.మాట కొంచెం బొంగురు పోయింది.
అప్పటి నుంచి ఈ యాంత్రిక జీవనం తో బంధం తెగి పోయింది.నిశ్శబ్ధ నిశీధి లాంటి ఈ గదే తన ఆవాసం గా మారింది.
ఇలా ఎన్నాళ్ళు..ఎన్నేళ్ళు..ఈ జీవితం తో ఒంటరి పోరాటం ఇంకెన్నాళ్ళు..రోజూ ఇదే ప్రశ్న రఘురాం ని వేదిస్తూనే వుంది.
ఆ ప్రశ్న తో  తన జీవితం కళ్ళముందు కనబడింది.తన మనోవేదన ఎవరికి చెప్పగలడు..తిరిగీ తిరగని ఆ ఫేన్‌ కి తప్ప.
                                                                                 ***
ఉదయాన్నే మనవరాలు నెమ్మదిగా తన గదిలోకి వస్తుంది.దూరంగా వున్న బెంచి మీద కూర్చుంటుంది.ఆ చిన్న దానికి  ఎన్నో కబుర్లు చెప్పాలని వుంటుంది.ఈ లోగా వాళ్ళమ్మ ఓ కేకేస్తుంది. నీకు స్కూలు కి టైమవుతుంది.ఎక్కడికి పోయావ్‌.త్వరగా రా.ఆ పిలుపు తో చిన్నబుచ్చు కుంటూ తను వెళ్ళి పోతుంది.
నాకు నా మనవరాలి తో తనివితీరా ఆడుకోవాలని..బోలెడన్ని కబుర్లు చెప్పాలని మదినిండా ఎన్నో ఆశలు.
ప్చ్‌,..ఏం లాభం..
నా దగ్గరకు వస్తేనే మా కోడలికి..ఏ భూతం దగ్గరకో వెళుతుందని భయం.
ఇంతలో పని మనిషి ఓ గ్లాసు తో పాలు తీసుకు వస్తుంది. తన అసహ్యాన్ని బయటికి  చెప్పలేక తనలో తనే తిట్టుకుంటూ అసలు సిసలు టీ.వీ నటన ప్రదర్శిస్తుంది.
బల్ల మీద కూర్చొని చెంచా తో నెమ్మదిగా పాలు నోట్లో పోస్తుంది.ఆ క్రమం లో తన కి విసుగు వచ్చిందా.. నేను చచ్చినట్టే లెక్క.ఎందుకంటే..ఆ బాబు ..పాలు తాగారమ్మా అని చెబుతూనే అక్కడికి దగ్గరున్న సింక్‌ లో పోసి గ్లాసు కడిగేస్తుంది. నా కడుపు మాడితే మాత్రం ఎవడికి తెలుస్తుంది.
ఈ లోగా మా అబ్బాయి ఆఫీసు కి వెళ్ళడానికి రడీ అయి ఓ సారి మేడ మీదున్న  గదిలోకి ఓ సారి చూడ్డానికి అనుకోని అతిధి వచ్చినట్టు వస్తాడు.అప్పుడు వాడి అవతరాం చూస్తుంటే ఓ పక్క నాకు నవ్వు,మరో పక్క ఏడుపు వస్తాయి.
కాలి కి బూటు,నోటికి ఓ మూతలాంటి గుడ్డొకటి కట్టుకుంటాడు.చేతులకి గ్లౌజ్‌ లాంటివి వేసుకుంటాడు.ఇంతకీ వాడు నాకు చేసేది ఏమైనా వుందా..లేదే.
"ఏం ..నాన్నా..మందులు వేసుకుంటున్నావా.." అని అడుగుతాడు.
నేను  సమాధానం చెప్పేవరకు కూడా వేచి వుండే ఓపిక వాడికుండదు.
ఆ..సరేలే ..అయితే..నేను వస్తాను అని నడుచుకుంటూ వెళిపోతాడు.
 నా మనస్సు ఒక్కసారి చివుక్కు మంటుంది.
చిన్నప్పుడు వాడికి తెలిసీ,తెలియని వయసులో విరోచనాలొచ్చి ఇల్లంతా పాడుచేస్తే..వాళ్ళమ్మ బయటికెళ్ళినప్పుడు ఇల్లంతా శుభ్రం చేసినప్పుడు నా ముక్కు కి గుడ్డా కట్టుకోలేదు,చేతికి గ్లౌజ్‌ లు వేసుకోలేదు.వాడికి తెలియదు కదా..అలాగే పెరిగి పెద్దవాడయిపోయాననుకుంటాడు.
వాడు ఎదుగుతూనే వున్నాడు..నేను చితికి పోతూనే వున్నాను.
వాడి కళ్ళలో ఆనందం చూడ్డం కోసం ..నా కన్నీటిని బయటికి రానీయలేదు.
చిన్నప్పుడు ఒల్లో కూర్చో పెట్టుకొని ఎన్ని కధలు చెప్పేవాడ్ని వాడికి..ఇప్పుడు కనీసం వారానికి ఓ పది నిమషాలైనా నా పక్కన తనివితీరా కూర్చొని కబుర్లు చెపుతాడేమో అని చూస్తాను.అదీ లేదు..పోని తండ్రిని..జ న్మ నిచ్చినవాడ్ని .. ఓ  పరాయి వాడిలా ..ఇంకా చెప్పాలంటే..పురుగు లా చూడ్డం..భరించ లేకపోతున్నాను.
నాకు అనారోగ్యం చేస్తే.. అది నా తప్పా..
చిన్నప్పుడు వాడికి ఎన్ని సార్లు ఒంట్లో బాగోలేకపోతే..ఎన్ని నిద్రలేని రాత్రులు వాడికోసం గడిపానో వాడికి ఇప్పుడు గుర్తు లేదు.
స్కూల్లో చదువుతున్నప్పుడు సైకిల్‌ కావాలన్నాడు..మా..సూపరింటెండెంట్‌ సుబ్బారావు దగ్గర నాలుగొందలు అప్పు తీసుకున్నాను..నా జీవితం లో నేను చేసిన మొదటి అప్పు అది.స్కూల్లో సైకిల్‌ కి,కాలేజీ లో స్కూటర్‌ కి,చదువు కి,వుద్యోగానికి..ఇలా ప్రతీ దానికి వాడి కోసం అప్పులు చేసుకుంటూ పోయి చివరికి రిటైరయ్యాక నా దగ్గరన్నదంతా అప్పులకే పోసాను. మొదట్లో అప్పు చేసినప్పుడు కొంచెం సిగ్గేసింది.తర్వాత అలవాటయిపోయింది.
అపుత్రస్య గతిర్నాస్తి-అన్నారు.అంటే పుత్రులు లేనివాళ్ళకి గతిలేదని అర్ధం.పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ఓ నమ్మకం.
ఇంతకీ పున్నామ నరకం అంటే ఏమిటి-బతికున్నప్పుడు తల్లిని,తండ్రిని చూడనివాడు..పోయిన తర్వాత వున్నాయో,లేవో తెలియని నరకాన్ని తప్పిస్తాడా ?
బతికుండగా బస్తీ చూపించని వాడు,పోయిన తర్వాత బ్రహ్మాండం చూపించినట్టు వుంటుంది.
మొక్క ఎదిగి మహావృక్షం గా మారినా దాని మూలం భూమిలోనే వుంటుంది.ఇది సత్యం.
నా కొడుకు లాంటి వాడికి ఇవి అర్ధమవుతాయా..?
పని మనిషి తాగించే పాలు చొక్కా మీద పడితే చొక్కా వాసనొచ్చిందంటాడు.వాడి కి చిన్నప్పుడు ఎన్ని పాల సీసాలు మార్చాల్సొద్దిందో మరిచిపోయాడు.
వాడు పాడుచేసిన బట్టలు ఉతకలేక వాళ్ళమ్మ వాడిని ఎన్ని సార్లు తిట్టుకుందో వాడికి గుర్తే లేదు.
పూర్వం ఇళ్ళల్లో మూలన ఓ గది వుండేది..దా న్లో పనికిమాలిన సామా న్లు పెట్టేవారు.ప్రస్తుతం అలాంటి గదులన్నీ నాలాంటి ముసిలాళ్ళకి నివాసాలుగా మారిపోతున్నాయి.
పెద్దల మాటలు చాదస్తాలు గా కనపడుతున్నాయి.
బర్గర్ల రుచి మరిగినవాడికి బొబ్బట్ల రుచి తెలుస్తుందా!
ఇక మా కోడలు..ఎంత పాపం చేసుంటే ఇలాంటి బతుకొస్తుంది.ఇలాంటి బతుకు బతికినా ఒకటే..లేకపోయినా ఒకటే..
మనసులో కాదు బహిరంగంగా బయటికే ఎత్తిపొడుస్తుంది.
ఇంతకీ నేను చేసింది పాపమా..?
కోడలంటే..నాకు పరాయి పిల్ల కాదు..నా కూతురు లాంటిదే కదా.నా కూతురుండుంటే మరోలా వుండేదని ఎందుకనుకోవాలి.
చేతి వేళ్ళన్నీ ఒకేలా వుండవని..భగవంతుడు అందరి రాతలు ఒకేలా రాయడని అర్ధం కావాలంటే అనుభవం కావాలి.
చిన్నపిల్ల..కాలం లో వున్న అమ్మాయికి జీవితం రంగుల డేరా లాగే కనబడుతుంది.రంగులు వెలిస్తే అప్పుడు తెల్లగుడ్డే మిగులుతుంది.
ఇది నా కధే కాదు..నా లాంటి చెప్పుకోలేని ఎందరిదో.
జీవితం కూడా అంతే..తెగిన గాలిపటం లాంటిది.ఎడ తెరిపిలేని వాన లాంటిది.
తెగిన గాలిపటానికి తెలీదు ..ఎక్కడ పడుతుందో.
పడుతున్న వాన కి తెలీదు..ఎప్పుడు ఆగుతుందో..
చెబుతున్న రఘురాం కి తెలీదు..ఈ వూపిరి ఎప్పటి వరకో ...
                                                                                                                       ***
“ బతుకంటే బొమ్మలాట అని తెలుసు...కథ అని తెలుసు..కథ లన్నీ కంచికే చేరునని తెలుసు..
తెలుసు తెర తొలుగుతుందని..తెలుసు తెల్లారుతుందని..తెలుసు కో ఈ కట్టె శాస్వతం కాదని..”

No comments:

Post a Comment

Pages