పెట్టనికోటిందరికి (అన్నమయ్య కీర్తనకు వివరణ )
-డా.తాడేపల్లి పతంజలి
( దశావతారాలను వ్యంగ్యంగా వేంకటేశునికి అన్వయిస్తూ అన్నమయ్య రచించిన కీర్తన ఇది.ఇందులో కృష్ణావతారము రెండు సార్లు ప్రస్తావించబడినది)
రేకు సంఖ్య 62 సంపుటము 05-186కీర్తన)
పెట్టని కోటిందరికి బెండ్లికొడుకు బొమ్మ బెట్టె నసురులకెల్ల బెండ్లికొడుకు | ఎక్కువ రక్షణగా మత్స్యావతారం లో ఉన్న పెండ్లి కొడుకు వేంకటేశుడు. పెండ్లి కొడుకైన వేంకటేశుడు రామావతారంలో రాక్షసులను యుధ్ధములో జయించి వారిని తిరస్కరించాడు, అవమానపరిచాడు.(శత్రువులను జయించిన సూచనగా వారి బొమ్మలను జయించిన వారు తమ కాలిఅందెలపై చెక్కిస్తారు. ఇదేబొమ్మ పెట్టుట.) |
పెల్లగించి భూమెత్తీ బెండ్లికొడుకు వాడే | వరాహావతారములో భూమిని పెల్లగించి పైకెత్తిన పెండ్లి కొడుకు. వాడే. ఆ వేంకటేశుడే! |
పిల్లగోవి రాగాల పెండ్లికొడుకు | చిన్న గొట్టమైన మురళిలో అనేక రాగాలు కూర్మావతారంలో పలికిన పెండ్లి కొడుకు. |
పెల్లైన యీవుల పెండ్లికొడుకు వాడే | అధికమైన దానములు పరశురామావతారములో ఇచ్చిన పెండ్లి కొడుకు వాడే. ఆవేంకటేశుడే! |
పిల్లదీపు పెన్నుద్ది పెండ్లికొడుకు | బాలక్రీడావిశేషములతో బలరామావతారములో పెద్ద ఆట గాడు ఈ పెండ్లికొడుకు |
పెంచెపుశిరసుపాగ పెండ్లికొడుకు గుం- | పించం తలపాగాగా కృష్ణావతారం లోకలిగిన వాడు ఈ పెండ్లికొడుకు |
పించిన కోపగించీ బెండ్లికొడుకు | నరసింహావతారము లో మంచివారిని బాధించిన హిరణ్య కశిపునిపై కోపగించిన వాడు ఈ పెండ్లికొడుకు |
పించె జక్కని సిరి బెండ్లికొడుకు | చక్కని శోభ కలిగిన స్త్రీల చేత వలపించుకొన్నవాడు ఈ పెండ్లికొడుకు బుద్ధావతారము |
పెంట పెరుగులదొంగ పెండ్లికొడుకు భూమి | చిలిపితగాదాలు(=పెంట) పెడుతూ పెరుగులు దొంగగా కృష్ణావతారంలో ఉన్న వాడు ఈ పెండ్లికొడుకు |
బెంటి పోతుల గూరిచె బెండ్లికొడుకు | పశుపక్ష్యాదులలో నాడుదానిని పెంటి అంటారు. పశుపక్ష్యాదులలో పురుష జాతిని పోతు అంటారు.కల్క్యావతారములోపెంటిని, పోతును కలిపిన వాడు ఈ పెండ్లికొడుకు |
గెంటులేని వేంకటగిరి మీదను వాడె | చలనము లేని వేంకట పర్వతము మీద |
పెంట వెట్టుకున్నవాడు బెండ్లికొడుకు | తిరుమల అను ఒక పేటను (=పెంట) వెంట పెట్టుకొన్న వాడు ఈ పెండ్లికొడుకు. |
విశేషాలు
మత్య్సావతారం :
చైత్ర బహుళ పంచమి- ప్రాత:కాలమున
యుగము అంతమగు సమయములో విచిత్రమైనమత్యావతారమును ధరించి; సమస్త భూమండలమునిండినదిఅగుచుసమస్త ప్రాణులకును ఆశ్రయము అయినవాడు అయ్యాడని పోతన్నగారి వర్ణన.( 2-142-సీ.) దీనినే అన్నమయ్య పెట్టనికోట అన్నారు
కూర్మావతారం : జ్యేష్ఠ బహుళ ద్వాదశి- ప్రాత: కాలమున
(అంతర్జాల సౌజన్యం)
పిల్ల గోవి అంటే సన్నటి గొట్టము. పైన ఉన్న తాబేలు బొమ్మను జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖము భాగంలో ఒక సన్నటి గొట్టం లా అనిపిస్తోంది. ఈ కూర్మావ తారం మనకు స్ఫురింపచేయటానికి అన్నమయ్య పిల్లగోవి రాగాలు అన్నాడని స్ఫురిస్తోంది. విజ్ఞులు ఇంకా మెరుగైన సూచనలు ఇస్తే శిరసావహిస్తాను.
పెల్లగించి భూమెత్తీ బెండ్లికొడుకు వాడే
వరహావతారం : చైత్ర బహుళ త్రయోదశి – మధ్యాహ్నం
నీటిలో మునిగియున్న భూమిని తన కోరలపై తీసికొని పాతాళము నుంచి పైకి వరాహస్వామి వచ్చాడు. హిరణ్యాక్షుడు గదతో వరహ భగవానునితో తలపడ్డాడు. సింహము, ఏనుగును చంపినట్లుగా వరాహ స్వామి హిరణ్యాక్షుని చంపాడు..
గుంపించిన కోపగించి
నరసింహావతారం : వైశాఖశుద్ధ చతుర్దశి – ప్రదోష కాలములో
దేవతల సమూహమును బాధించి పైకెత్తిన గదను ధరించినవాడు అయి వచ్చుచున్న రాక్షసునిగా హిరణ్య కశిపుని -రాక్షసుని చూసి తళుక్కుమనే కోరలుభయంకరమైన ముఖము చిట్లించిన కనుబొమలముడి తో నరసింహ స్వామిని భాగవతము పోతన వర్ణించాడు. దేవతల సమూహమును బాధించిన వాడు కనుక అన్నమయ్య గుంపించి (= బాధించి) అను క్రియను వాడాడు.
పెంచకప్పుడే పెరిగె బెండ్లికొడుకు
వామనావతారం : భాద్రపద శుద్ధ ద్వాదశి – మధ్యాహ్నం కాలం
మొదటిలో శరీరము ఎక్కువ పెంచకుండానే – పొట్టి వాడుగా ఉండి- తరువాత - ఉన్నట్టుండి పెరిగిపోయిన వాడు ఈ పెండ్లికొడుకు అనే అర్థాన్ని -పెంచక, అప్పుడే పెరిగి- అనే రెండు పదాల్లో వర్ణించిన కవి ప్రతిభ కొనియాడదగినది.
పెల్లైన యీవుల పెండ్లికొడుకు వాడే
పరశురామావతారం : మార్గశిర బహుళ విదియ – సాయంకాలం
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు అతని తండ్రి జమదగ్ని తల నరుకుతారు. తల్లి రేణుక తండ్రి శవంపై పడి ఏడుస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు కార్తవీర్యార్జునుని కుమారులలను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు.రాజులు తన తండ్రిని చంపారని కోపంతో వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. తరువాత భూమినంతటినీ కశ్యపునకు దానమిస్తాడు. అధికమైన దానములు ఇచ్చిన పెండ్లి కొడుకుగా అన్నమయ్య పరశురాముని వర్ణించాడు.సమస్త భూమండలము దానముగా ఇవ్వటం అధికమైన దానమే కదా!
బొమ్మ బెట్టె నసురులకెల్ల బెండ్లికొడుకు
శ్రీరామావతారం : చైత్రశుద్ధ నవమి – మధ్యాహ్న సమయంలో
శ్రీరాముడు అనేకమంది రాక్షసులను చంపి న విషయం జగద్విదితం.దీనినే అన్నమయ్య తనదైన కవితాశైలిలో బొమ్మ బెట్టె అన్నాడు.
పెంట పెరుగులదొంగ పెండ్లికొడుకు |
శ్రీకృష్ణావతారం : శ్రావణ కృష్ణ అష్టమి – అర్థరాత్రి సమయంలో
పోతన గారి భాగవతంలో బాల కృష్ణుడు చేసిన చిలిపి తగాదాలు, వెన్న దొంగ తనాలు జగత్ప్రసిద్ధాలు.
వలపించె జక్కని సిరి బెండ్లికొడుకు
బుద్ధావతారం : భాద్రపద శుధ్ధ సప్తమి – సాయంకాలము
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు వేరు . గౌతమ బుద్ధుడు వేరు.
మహాపతివ్రతలయిన త్రిపురాసురుల భార్యల పాతివ్రత్య మహిమ వల్ల త్రిపురాసురులను జయించటం కష్టమవుతుంది. అప్పుడు .
అప్పుడు శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. చక్కటి రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలములో తమ కళ్లఎదుట కనబడిన బుద్ధ రూపాన్ని చూసి మోహ పడ్డారు త్రిపురాసురుల భార్యలు. అందువల్ల త్రిపుర రాక్షసుల బలం పోయి శివుని చేత చంపబడ్డారు.దీనినే
వలపించె జక్కని సిరి బెండ్లికొడుకు అని కవి వర్ణించాడు.
పెంటి పోతుల గూరిచె బెండ్లికొడుకు
కల్కి అవతారం : భాద్రపద శుక్ల విదియ – ప్రాత:కాలము
తూర్పు దిక్కునకు ప్రవహించు సరస్వతీ నదీ గట్టున ధర్మదేవతయును(పోతు) భూదేవియును (పెంటి) ఆవు ఎద్దు రూపములతో తమ బాధలను కలబోసుకోవటానికి మూలకారణము కల్కి. (తెలుగు భాగవతము 01-411 వచనము )దీనిని పెంటి పోతుల గూరిచె బెండ్లికొడుకు అని కవి వర్ణించాడు.
పిల్లదీపు పెన్నుద్ది పెండ్లికొడుకు
భాగవతంలో బలరామ కృష్ణుల బాలక్రీడలు ఇలా వర్ణించారు.
మోకాళ్ళపైనుండి చేతులు విడిచివచ్చునట్లుగ చేసి నిక్కుతూ వెళ్ళెదరు; కొంచముదూరము అమ్మల యొక్క పైటకొంగులు అందుకొని ఊగలాడెదరు; ఆవుదూడల తోకలను గట్టిగా పట్టుకొని వదల లేక వాటి వెనకాతలనే జారుతారు; ఆ; బురదలలో దుడుకుతనము అతిశయించగా దూరుదురు; ఈ విధంగా బలరామకృష్ణులు బాల క్రీడలందు ఆసక్తులై ఉన్నారు..(10.1-289-సీ. ) ఇందులో బలరాముడి బాలక్రీడలను పిల్లదీపు పదంతో అన్నమయ్య సూచించాడనిపిస్తోంది.
స్వస్తి.
No comments:
Post a Comment