ప్రేమతో నీ ఋషి – 2 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 2

Share This

ప్రేమతో నీ ఋషి – 2

ఆంగ్ల మూలం - యనమండ్ర శ్రీనివాస్

తెలుగు అనువాదం : భావరాజు పద్మిని


(జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... స్వయంకృషితో ప్రపంచస్థాయిలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న, మైసూరు మహారాజు కొలువులో పనిచేస్తుంటాడు.‘ ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం మహారాజు ప్రద్యుమ్నను ఒక గొప్ప చిత్రాన్ని రూపొందించమని కోరతాడు. రాజు సమ్మతితో, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తాడు ప్రద్యుమ్న. ఈ క్రమంలో ప్రేమలో పడ్డ సుచిత్ర- ప్రద్యుమ్నలు గుప్తంగా రాజ్యం వదిలి పారిపోవడంతో, కలతచెందిన రాజు, ఆ అద్భుత చిత్రాన్ని తునాతునకలు చెయ్యమని మంత్రికి ఆజ్ఞాపిస్తాడు. కళారాధకుడైన మంత్రి ఆ పని చెయ్యలేక, దాన్ని అడవిలో వదిలివెయ్యమని భటులకు చెప్పగా, వారు దాన్ని అమ్మి సోమ్ముచేసుకుంటారు. అది అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కార్పొరేట్ ప్రపంచాన్ని కొన్నేళ్ళపాటు కుదిపెయ్యగల ఆ సందేశం గురించి తెలియాలంటే... మనం కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో ఏమి జరిగిందో తెలుసుకోవాలి... ఇక చదవండి...) మాంచెస్టర్ – బూత్ స్ట్రీట్ వెస్ట్ – నవంబర్ 13, 2009 – ఉదయం 3 గం. ట్రింగ్ గ్ గ్ గ్ గ్ .... అంత పొద్దున్నే అలారం బెల్ మ్రోగింది. స్నిగ్ధ నిద్ర నుంచి లేచింది. ఆమె గడియారం వంక చూసి, తాను కేవలం మూడు గంటలే పడుకున్నాననీ, అదీ నిద్రలో అలజడి రేపే కలల తాకిడి వల్ల, చాలా మగతగా నిద్రించాననీ తెలుసుకుంది. అది ఆమెకొక భయానకమైన ఉదయం. ఆమె అసలు నిద్ర లేచే స్థితిలో లేదు, అవకాశముంటే, ఆమె రాబోయే 24 గంటలు ఏమీ చెయ్యకుండా, అలాగే పక్కపై పడుకుని ఉండేందుకు ఇష్టపడేది. ఆమె మానసికంగా బడలి ఉంది, శారీరకంగా పూర్తిగా అలసి ఉంది. కాని, ఆమె ముంబై కి వెళ్ళే అంతర్జాతీయ విమానం అందుకోవాలి. విమానం ఉదయం 6 గంటలకి, ఆమె విమానాశ్రయానికి 2 గం.ముందుగానే వెళ్ళాలి. ఆమె బెడ్ లాంప్ వద్దకు వెళ్లి, దాన్ని ఆర్పింది. గదినంతా హఠాత్తుగా చీకటి ఆవరించింది. అది ఆమె మానసిక స్థితిని ప్రతిబింబించింది, చీకటిగా, శూన్యంగా, వ్యాకులంగా...  దిగులుతో కూడిన బాధ ఆమెను ఆక్రమించింది. ఆమె అయిష్టంగా పక్క పై నుంచి లేచి, తయారయ్యేందుకు స్నానాలగదికి వెళ్ళింది. ఆమె తలుపు మూసి, లైట్ వేసి, అద్దంలో తన ముఖం చూసుకుంది. ఆమె వదనం కళావిహీనమై ఉందని, ఆమె గుర్తించింది. చీకటికి కూడా తనదైన అందముందని, ఆమె భావించింది – అది నిన్ను నువ్వు చూసుకోకుండా చేస్తుంది. ఆమె తిరిగి ఋషి గురించి ఆలోచించేందుకు తిరిగి లైట్లు ఆర్పింది. ఋషి తన స్నేహితుడు, అతనితో ఉండడాన్ని బాగా ఇష్టపడేది. పనిచేసేటప్పుడు - ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం లో చెప్పినట్లుగా, అతని సమక్షంలో గంటలు నిముషాల్లా, నిముషాలు సెకండ్ల లా గడిచిపోయినట్లు అనిపించేది. నిన్నటిదాకా, వాళ్ళజీవితాల్లో ఆ నిర్ణీత సంఘటన జరిగేదాకా ఇదంతా నిజమే ! ఆమె నిన్నటి దెబ్బ నుండి ఇంకా కోలుకోలేదు. ఆమె మనసు ఆమెను ఫ్లైట్ కాన్సిల్ చేసి, ప్రయాణం మానుకోమంది,  కాని ముంబైకు ఆఫీస్ పనిమీద వెళ్లాలని ఆమెకు తెలుసు, వెళ్ళకపోతే ఆమె బాస్ మహేంద్ర కలతచెందుతారు. ఆమెకు వ్యక్తిగత విషయాల్ని ఆఫీస్ పనితో కలపడం ఇష్టం లేదు. బీప్... బీప్... ఋషి ఫోటో ఫ్లాష్ అవుతూ ఆమె మొబైల్ ఫోన్ మ్రోగసాగింది... అతను ఉదయమే ఆమెను ఫ్లాట్ వద్దనుంచి తీసుకువెళ్ళాలి, అతను కూడా ఆమెతో ముంబై వెళ్తున్నాడు. ఆమెకు అతనితో మాట్లాడడం ఇష్టం లేదు. అందుకే తిరిగి రాబోయే ఫోన్ కాల్ ను తప్పించుకునేందుకు, ఆమె ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది. ఆమె మహేంద్ర దసపల్లా వద్ద పనిచేస్తోంది. ఆయన దక్షిణ భారత దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త. ఆయన హైదరాబాద్ లో ‘నిర్వాణ ప్లస్’ అనే పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పరిచారు. అది 250 మంది ఉద్యోగుల నుంచి, 45,000 మంది దాకా ఎదిగి, ఒక దశాబ్దం లోపలే విశ్వమంతా విస్తరించి, ఆఫీస్ లను ఏర్పరచుకుంది. మహేంద్రకు వృత్తిపరంగా, సాంఘికంగా, రాజకీయపరంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రాజకీయ సంబంధాలే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆయన సాంకేతికపరంగా, స్థిరాస్థి నిర్మాణపరంగా ఆయన అనేక ప్రాజెక్ట్లు పొందేలా చేసాయి. స్థిరాస్థి నిర్మాణ ప్రాజెక్ట్ లను అతను తన తమ్ముడి కంపెనీ ద్వారా నిర్వహించేవాడు. మహేంద్ర స్వీకరించిన ఒకానొక ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టుల ద్వారా వయోజన విద్యా ప్రాజెక్టు. ఇది రాష్ట్రంలో అక్షరాస్యత సంఖ్యను పెంచినందుకు అనేక ప్రశంసల్ని అందుకుంది. రాష్ట్రమంతా తన కొత్త ‘సాఫ్ట్వేర్ మినీ టౌన్షిప్’ ల ఏర్పాటు ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మార్చివేసినందుకు ఆయనకు విశిష్టమైన ప్రశంసలు లభించాయి. వయోజనవిద్యా ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా, అతని రాజకీయ సంబంధాలు బాగా పెరిగి, రాష్ట్ర పర్యాటక మంత్రితో సంప్రదింపులు జరిపి, ఆయన సూచనతో, రాష్ట పర్యాటక ప్రతిష్టను పునరుద్ధరించే కొత్త ప్రాజెక్టును ప్రారంభించేలా చేసాయి. భారత ప్రభుత్వ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా ‘, కేరళ ప్రభుత్వ ‘గాడ్స్ ఓన్ కంట్రీ కాంపైన్ ‘ అనే వాటి పంధాలో ఆంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితం ఒక ప్రతిపాదన చేసింది – పట్టణాన్ని దక్షిణాది సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్ లో కీలకమైనది, రూ. 500 కోట్లతో, ‘ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం ‘ ను ఏర్పరిచి , చరిత్రలో మరుగునపడ్డ 500 ల అత్యుత్తమ భారతీయచిత్రాలను సేకరించి, అందులో ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టిని ఆకర్షించే మెగాప్రోజెక్టు. స్నిగ్ధ ఈ ప్రాజెక్టులో గత రెండేళ్లుగా పనిచేస్తోంది. మాంచెస్టర్ లో నివసిస్తూ, యూరోప్ లోని అన్ని ప్రాంతాల్లో పనిచేస్తూ, ఆమె ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియంకై కొనదగ్గ  భారతీయ చిత్రాలను అన్వేషిస్తోంది. తనకు అభిరుచి ఉన్న సరైన ఉద్యోగంలో ఉన్నందుకు– విశేషించి, అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే, భారతీయ సంస్థలో, అదీ తన మనసుకు నచ్చిన క్షేత్రంలో పనిచేస్తున్నందుకు, ఆమె ఆనందిస్తూ ఉంటుంది. ఆమె ఆఫీస్ లో సమర్ధురాలైన ఉద్యోగినిగా ఉంటూ, తన సమర్ధతకు గానూ, అనేకమార్లు మహేంద్ర నుంచి ప్రశంసలను అందుకుంది. ఆమెకు పనంటే మక్కువ, ప్రేమ, ప్రాణం – ఆమె ఋషి ని కలిసేదాకా. అనతికాలంలోనే ఋషి ఆమెకు తొలి ప్రాధాన్యతగా మారాడు. కాని, దానివల్ల పనిలో తేడా రాకుండా, ఆమె ఋషితో గడిపేందుకు తన వ్యక్తిగత సమయాన్ని తగ్గించుకుని, కేటాయించేది. చిత్రకళ, చిత్రాలు చిన్నతనం నుంచి ఆమె జీవితంలో అంతర్భాగమై పోగా, లండన్ లోని ‘సోత్ బై ఇన్స్టిట్యూట్’ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకోవడం ఆమెకు ఇష్టమైన అభిరుచికి, వృత్తిపరంగా ఉపయుక్తమయ్యింది. ఆమె చిత్రాల మధ్య, తననుతాను సులభంగా మిళితం చేసుకోగలదు, ఇక అవి భారతీయ చిత్రాలైతే, ఆమె  కొన్ని రోజులు ఆహారం లేకపోయినా పట్టించుకోదు. మహేంద్ర కోసం ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా ఆమె ఋషిని కలిసింది. అతను మాంచెస్టర్ లో ఉన్న స్విస్ బ్యాంకు శాఖైన ‘బ్యాంక్ ప్రైమ్ సూఇస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్. కొద్దికాలంలోనే వారు మంచి స్నేహితులు అయ్యారు, ఇంకా చెప్పాలంటే చాలా దగ్గరయ్యారు. నిజానికి, అన్నీ సవ్యంగా జరిగి ఉంటే వారు త్వరలోనే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు. అప్సర పండిట్ తమ మధ్యకు వచ్చేదాకా, మొదట్లో అన్నీ సవ్యంగానే జరిగాయి. ఆమె నగరంలో పేరున్న ఆర్ట్ వ్యాపారి, చిత్రాలపై ఆమెకున్న వైవిధ్యమైన జ్ఞానానికి, అనతికాలంలోనే ఆమె ఋషి ధ్యాసను పూర్తిగా ఆకట్టుకోగలిగింది. వాస్తవానికి, అప్సర స్నిగ్ధకు వృత్తిపరంగా సహోద్యోగిని అయినా, నెమ్మదిగా ఆమె ఋషికి వ్యక్తిగతంగా  స్నేహితురాలు అయ్యింది. ఆమెకు ఋషిపై నమ్మకం ఉన్నా, ఆమె ఋషి, అప్సరలతో ఉన్నప్పుడు, ఎవరు ఎవరిని వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం చేసుకోలేకపోయేది. అప్సర ఋషి కంటే 8 ఏళ్ళు పెద్దదైనా, ఎవరూ ఆమె వయసును ఊహించలేరు. ఆమె రూపం చూపరులను ఇట్టే మోసం చెయ్యగలదు. అప్సర సాంగత్యంలో, ఋషి తనను తాను మరిచేవాడు, ప్రత్యేకించి, ప్రద్యుమ్న చిత్రాల ప్రస్థావన వచ్చినప్పుడు, అతను చూపే ఆసక్తికి ఎల్లలు ఉండేవి కాదు. స్నిగ్ధ కూడా ప్రద్యుమ్న చిత్రాలకు వీరాభిమాని. ఆమె పౌరాణిక పాత్రల్లోని స్త్రీల చిత్రాలను ఇష్టపడేది, వారిలో శృంగారం, అమాయకత్వం, సంప్రదాయాల ఆసక్తికరమైన మేళవింపు కనిపించేది. ప్రద్యుమ్న యొక్క తైలవర్ణ చిత్రాల గురించి ఋషికి వివరించేందుకు అప్సర వద్ద చాలా సమాచారం ఉండేది. చిత్రాలయొక్క అతి సూక్ష్మమైన అంశాల గురించి ఋషికి అనేక సందేహాలు ఉండేవి. స్నిగ్ధ ఒక్కోసారి ఇది చూసి సందిగ్ధానికి గురయ్యేది – వృత్తిరీత్యా అతను బ్యాంకర్ అయినా, ప్రద్యుమ్న చిత్రాల పట్ల చాలా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించేవాడు. డుర్ర్ర్... మంటూ హఠాత్తుగా వినవచ్చిన టాక్సీ శబ్దం ఆమెను ప్రస్తుతంలోకి తీసుకువచ్చింది. ఆమె కిటికీలోంచి ఒక టాక్సీ వీధిలోకి ప్రవేశించడం చూసి, ఋషి తనను తీసుకుని వెళ్లేందుకు వచ్చాడని, తేలిగ్గా ఊహించింది. అతనితో వెళ్ళడం ఆమెకు ఇష్టం లేదు. ఆమె వెంటనే మొబైల్ స్విచ్ ఆన్ చేసి – “ఋషి, దయచేసి నాకు మరింత ఇబ్బందిని కలుగజెయ్యకు. దయుంచి వెళ్ళిపో, నేను నిన్ను నేరుగా ఎయిర్పోర్టువద్ద కలుస్తాను. ఇప్పుడు నా ఇంటి ముందు నువ్వు ఏ తమాషా సృష్టించకు,” అని సందేశం పంపింది. ఋషి తన సందేశాన్ని అందుకున్నాడో లేదోనని, ఆమె కిటికీనుంచి తొంగి చూసింది. టాక్సీ కొద్దిసేపు ఆగగానే, ఋషి దానినుంచి బయటికొచ్చి, కిటికీ వద్ద ఉన్న స్నిగ్ధ వైపు చెయ్యి ఊపి, మళ్ళీ టాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత, ఆమె మొబైల్ లో అతనినుంచి వచ్చిన ఒక సందేశం మెరిసింది – “స్నిగ్ధ, ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు తెలుసు, దయుంచి నన్ను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించు. నా గురించి నీవు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.” అది చదవగానే ఆమె “ఆహ్ !!!” అంటూ నిట్టూర్చగలిగింది, అంతే. నిజమే, తను ఋషి గురించి తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఋషి నమ్మకస్తుడిగా, విశ్వాసపాత్రుడిగా ఉంటాడని అనుకోవడమే చాలా తొందరపాటు నిర్ణయమని ఆమెకు అనిపించింది. నిన్న అప్సరతో సన్నిహితంగా ఉన్న ఒక స్థితిలో ఋషిని చూసినప్పుడు ఆమెకు మోసపు దెబ్బ తగిలింది. అప్సరతో ఋషి ఎలా సంబంధం పెట్టుకోగలడో ఆమెకు అర్ధం కాలేదు. అది ఆమెకు హఠాత్తుగా విశ్వామిత్రుడి కధను గుర్తుకు తెచ్చింది. ఒక స్త్రీ మాంసాన్ని చూసి, మతులు పోగొట్టుకునే పురుషుల మానస్తత్త్వం దేనితో చెయ్యబడిందో అర్ధం చేసుకోవడంలో ఆమె ఎప్పుడూ విఫలమయ్యేది. వేల ఏళ్ళు తపస్సు చేసిన ఒక ఋషి, మనోహరంగా ఉన్న మేనకను చూసి, రెప్పపాటులో తన ఆత్మనిగ్రహాన్ని కోల్పోయినప్పుడు, ఋషి ఇందుకు అతీతుడేమీ కాదు. ఇరవైఒకటవ శతాబ్దపు పురుషుడు, ఇంద్రియాలపై తన సంయమనాన్ని కోల్పోయేందుకు మరిన్ని అవకాశాలున్నాయి. పరిహసించే విధంగా, విశ్వామిత్ర - మేనకల చిత్రాన్ని వేసిన చిత్రకారుడైన ప్రద్యుమ్న కూడా, తన చిత్రానికి నమూనాగా పనిచేసిన యువరాణితో పారిపోయి, చిత్రకారుడిగా తనకున్న కీర్తినీ, ప్రతిష్ట ను కోల్పోయి, చరిత్రలో కనుమరుగు కాలేదూ ? యెంత తెలివితక్కువపని – అతని భవితకు బదులుగా ఒక స్త్రీ ? స్నిగ్ధకు తాను అనుకున్నది నిజమేనేమో అనిపించింది. మగవారు విశ్వాసనీయంగా ఉండలేరు. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నా, ఆమె తనకే స్వంతమైన ఒక ఉదాహరణను పొందింది. ఆ ఆలోచనే ఆమె మనసు కలుక్కుమనేలా చేసింది. ఆమె ఆలోచనలు కొనసాగుతూ ఉండగా, ఆమె తయారయ్యి, ప్రయాణానికి అన్నీ సర్దుకుంది. గతరాత్రి వెనక్కి వస్తూ, ఆమె ఒక కాబ్ ను పిలిచింది. ఆమె మొబైల్ లో టాక్సీ అప్పటికే వచ్చిందన్న సందేశాన్ని ఆమె గమనించింది. ఆమె తన గదికి తాళంవేసి, తన చేతిలోని సామానుతో క్రిందికి దిగింది. టాక్సీ డ్రైవర్ ఆమె చేతిలోని సామానును తీసుకున్నాడు. అతను పాకిస్తాన్ కు చెందినవాడు, స్నిగ్ధకు బాగా తెలిసినవాడు. స్వస్థలమైన లాహోర్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అతను మాంచెస్టర్ కు వచ్చి, కాబ్ డ్రైవర్ గా స్థిరపడ్డాడు. “గుడ్ మార్నింగ్ కరీమ్భాయ్ “ అంటూ నల్లటి కాబ్ లోకి ప్రవేశిస్తూ, ఆమె అతన్ని పలకరించింది.  “ మనం త్వరగా వెళ్ళాలి, మనకు కేవలం అరగంట సమయం మాత్రమే ఉంది”, అంది. ఆమె అద్దంలోకి చూస్తూ తన కురులను సవరించుకుంది. “మీరేమీ చింతించకండి, మీరు ఫ్లైట్ మిస్ కారని నేను హామీ ఇస్తున్నాను. ఒకవేళ మిస్ అయినా, నేను ఇదే టాక్సీ లో మిమ్మల్ని ముంబైకి తీసుకువెళ్తాను. కాస్తంత విశ్రమించండి,” అన్నాడు టాక్సీ డ్రైవర్. కరీం అరబిక్ పాటలు పెట్టుకుని, టాక్సీ నడపడం మొదలుపెట్టి, దారిలో కూనిరాగాలు తీసాడు. ఋషికి కూడా అరబిక్ పాటలంటే ఇష్టం, అనుకుంది ఆమె సాలోచనగా. మళ్ళీ ఋషి ఆమె మనసును ఆక్రమించాడు. ఋషికి ఒక్కరాత్రి మాత్రమే సాగిన బంధం కోసం, ఆమె కాస్త ఎక్కువగానే ఆలోచిస్తోందా ? ఆమె 21 వ శతాబ్దపు పురుషుడి నుంచి మరీ ఎక్కువ నిజాయితీని ఆశిస్తోందా ? లేక ఉద్వేగభరితమైన ఒక సాన్నిహిత్యం ఋషి, అప్సర పంచుకున్నదానితో పోల్చలేమా ? ఆమె మనసు లోతుల్లో ఆమె అతను తనను మోసం చెయ్యలేదని భావించింది. ఆమె బుద్ధి, ‘నిజమే, నువ్వు మోసగింపబడలేదు,’ అంటోంది, కాని ఆమె హృదయం ‘లేదు, నువ్వు వంచించబడ్డావు,’ అంటోంది. ఆమెను ఇంకా చీకాకు విషయం ఏమిటంటే, మ్యూజియం కోసం కొన్న ఒక పెయింటింగ్ గురించి, ఋషి ఈ ఆటలో చిక్కుకున్నాడు. ఒక ప్రైవేట్ సేకరణకారుడి నుంచి, ఈ చిత్రాన్ని కొన్నప్పటినుంచి, ఋషి ఈ చిత్రాన్ని అధ్యయనం చేసేందుకు పరితపిస్తూ, అది అప్సర వద్ద ఉండడంతో ఆమెను కలిసేందుకు ఆసక్తి చూపసాగాడు. ఆ చిత్రం అనేది కేవలం ఒక వంకేనా, లేక ఋషికి నిజంగానే చిత్రాలపట్ల అంతటి మక్కువ ఉందా ? ఒకవేళ అది చిత్రం కోసమే అయితే, అందులో ఋషిని అప్సరకు దగ్గర చేసేంతటి విశేషం ఏముంది ? స్నిగ్ధ కు ఈ విషయం ఏ మాత్రం అర్ధం కాలేదు. చిత్రాలను అమితంగా ప్రేమించే వారిపై, ఆ చిత్రాలు ఉద్వేగమైన ప్రభావాన్ని చూపుతాయని ఆమెకు తెలుసు. కాని, ఆ చిత్రాలు వారి మనస్సులో భ్రాంతిని  ఎలా కలిగించేలా పనిచేసేవో, ఆమెకు సందిగ్ధంగా ఉండేది. ఆమెకు సంబంధించినంత వరకూ, ఒక చిత్రంలో అత్యంత ప్రభావాన్ని చూపేది వర్ణాల కలయిక. వర్ణాల గురించిన అవగాహన వ్యక్తిగత అనుభవాన్ని బట్టీ మారినా, కొన్ని రంగుల ప్రభావానికి విశ్వవ్యాప్తమైన అర్ధం ఉంది. ఉదాహరణకు, నల్లరంగు కేవలం విచారాన్ని, నిరసనను వ్యక్తం చేసేది మాత్రమే కాదు, అది మేధస్సుతో కూడా ముడిపడి ఉంటుంది – అందుకే డాక్టరేట్ ను నల్లని దుస్తుల్లో ఇస్తారు. నిజానికి, నల్లని దుస్తులు వారిని సన్నగా కనిపించేలా చేస్తాయి. దీనికి విరుద్ధంగా, మనలో చాలామందికి తెలిసినట్లుగా, తెల్లరంగు స్వచ్చత – పెళ్లి బట్టలు, శుభ్రత – డాక్టర్ల బట్టల వంటి వాటితో అనుబంధం కలిగి ఉంటుంది. నీలి రంగు స్థిరత్వానికి, విశ్వసనీయతకు, జ్ఞానానికి, నమ్మకానికి ప్రతీకగా ఉంటుంది – అందుకే దీన్ని చాలావరకు స్కూల్ యూనిఫార్మ్స్ లో వాడతారు. ఇక పసుపు రంగుతో ఆవరించబడ్డ వారు ఆశావహ దృక్పధంతో ఉంటారు, ఎందుకంటే మెదడు ఎక్కువ సెరటోనిన్ ను వెలువరిస్తుంది – ఇది మెదడులో సానుకూల దృక్పధాన్ని కలిగించే రసాయనం.  కాని విపరీతంగా పసుపురంగు వాడడం హానికరం ఎందుకంటే, ఇది మంటల రంగు. పిల్లలు ముదురు పచ్చ రంగు గదిలో ఎక్కువగా ఏడుస్తారు, ఆ రంగు చుట్టూ ఉంటేవ్యక్తి స్వభావం కూడా తీవ్రమవుతుంది. కాని ఆమెకు గులాబి రంగంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అది ప్రేమకు, ప్రణయానికి, సున్నితమైన భావనలకు ప్రతీక. ఆమె దృష్టిలో గులాబి రంగు అన్నింటినీ నెమ్మదించే రంగు – ప్రమాదకరమైన నేరస్తులను తరచుగా ‘పింక్ సెల్ల్స్’ లో ఉంచుతారు. ఈ రంగు శక్తిని పిండేసి, తీవ్రతను తగ్గిస్తుంది. ఆమె టాక్సీ ముందు ఉన్నట్టుండి కనిపించిన ఎర్ర రంగు ట్రాఫిక్ లైట్ తో ఆమె ఆలోచనలు ముగిసి, ఆమె ఎయిర్పోర్ట్ ను చేరుకుందని గుర్తించింది. ఆమె త్వరగా కార్ నుంచి తన సామాను తీసుకుని, టాక్సీ డ్రైవర్ కు డబ్బులు ఇచ్చింది. అతను, “చూసారా ! మనం సమయానికే చేరుకున్నాము,” అన్నాడు. ఆమె అతనికి కృతఙ్ఞతలు చెప్పి, చెక్- ఇన్ కౌంటర్ వద్దకు వెళ్ళింది. ఎయిర్పోర్ట్ వద్దగల ఎర్రరంగు వాహనాలు గమనించగానే, ఆమె ఆలోచనలు మళ్ళీ కొనసాగాయి. ఋషికి నచ్చిన రంగు ఎరుపు. ఎరుపు శక్తికి సంబంధించిన రంగు, ఎవరి దృష్టినైనా ఆకర్షించాలని అనుకుంటే, ఎరుపు వాడడం మంచిది. తరచుగా కన్ను మొదట చూసేది ఈ రంగునే. ఇది కదలికతో, ఉత్సాహంతో కలిసి ఉంటుంది. ఋషి క్లైంట్ మీటింగ్ కు వెళ్ళినప్పుడల్లా, అతను సాధారణంగా ధరించే దుస్తులు ఎర్ర టై, ముదురు నీలి కోటు, తెల్ల చొక్కా అని స్నిగ్ధ గుర్తు చేసుకుంది. అవి కంటిని ఆకర్షించేందుకు తగిన శక్తిని ఇస్తాయి అనేవాడు అతను. ఆమె త్వరగా చెక్- ఇన్ కౌంటర్ లైన్ లోకి వెళ్లి,ఫార్మాలిటీలుపూర్తిచేసి, బోర్డింగ్ పాస్ ను చేతిలోకి తీసుకుంది. ఫ్లైట్ సరైన సమయానికే బయలుదేరనుంది. ఆమె మిగిలిన రివాజులుఅన్నీ పదినిముషాల్లో పూర్తిచేసుకుని, ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధమయ్యింది. ఆమె కళ్ళు ఋషికై అన్వేషిస్తున్నా -  ఆమె మనసు ఈ నిజాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేదు. పరిసరాల్ని పట్టించుకోనట్లు నటిస్తూ, తనకు తాను ఏదో వ్యాపకం కల్పించుకుంటూ, ఆమె ఒక కప్ వేడి కప్పోచినో ను అందుకుని, లాంజి లో ఒక మారుమూల సీట్ వైపు వెళ్ళింది. కొన్ని క్షణాల తర్వాత తన ప్రక్కన మౌనంగా కూర్చున్న వ్యక్తి ,ఆమె ధ్యాసను భగ్నం చేసాడు. ఆమె పుస్తకంలోంచి తలెత్తి, అది ఋషి అని తెలుసుకుంది. “గుడ్ మార్నింగ్ స్నిగ్ధ...” అంటూ మొదట ఋషి మౌనాన్ని వీడి పలకరించాడు. ఆమె తిరిగి అతన్ని పలకరించలేదు, నవ్వుతూ ఉన్న అతని చూపులకి స్పందించలేదు. దాని బదులు, ఆమె వెంటనే లేచి, బోర్డింగ్ గేటు వైపుకు వెళ్ళింది. “గత సాయంత్రం జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను స్నిగ్ధ . కాని, ఇందులో అసాధారణమైన విషయం ఉంది, మనం ఇండియా నుంచి తిరిగి వచ్చాకా, నేను నీకు పూర్తి కధను చెబుతాను. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నీవు తప్పక తెలుసుకోవాలి.నేను నీవద్ద ఏదీ దాచను “, ఆమె బోర్డింగ్ గేటు వైపుకు నడుస్తూ ఉండగానే ఋషి ఆమెను బ్రతిమాలడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా క్యూ బోర్డింగ్ కై ప్రవేశించే దిశగా నెమ్మదిగా ముందుకు సాగుతోంది , కాని స్నిగ్ధ ఋషికి బదులివ్వలేదు. అందరిలో మరింత ఇబ్బంది పడడం ఇష్టంలేక, ఋషి ఆమెతో ఇక మాట్లాడలేదు. వారిద్దరూ వారి సీట్లకు చేరి, వారి హ్యాండ్ లగేజ్ ను కాబిన్ లో ఉంచి, సీట్ బెల్ట్ లు పెట్టుకున్నారు. చిరునవ్వు మొహంతో ఎయిర్ హోస్టెస్ వారికి నిమ్మరసం అందించి, వారి ప్రయాణం ఆనందంగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలిపింది. విమానం బయలుదేరగానే, ఎయిర్ హోస్టెస్ భద్రత గురించిన సూచనలు ఇచ్చింది. కాని, నిజానికి, అందరూ భయపడుతూ ఉన్న సమయంలో వారు ఇవన్నీ గుర్తుపెట్టుకోగాలరా అని స్నిగ్ధకు ఆశ్చర్యంగా ఉండేది. నిజమే, జీవితంలో మనం ఎన్నో మంచి విషయాల్ని నేర్చుకుంటాం, అర్ధం చేసుకుంటాం.  కాని, ఇక్కడ అసలు చిక్కేమిటంటే, ఇవి ఆచరించాల్సిన సమయంలో మనం వాటిని పాటించము. ఉదాహరణకి, ఒక బంధంలో, ఆమె నిష్కపటంగా ఉండడం కీలకమని, భాగస్వాముల మధ్య ఏదైనా నిర్మొహమాటంగా వెల్లడించడం బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని, ఆమె నేర్చుకుంది. వారిద్దరి మధ్య ఎటువంటి పరిస్థితులు వచ్చినా, వారు కేవలం చూసిన దాని ఆధారంగా,  మరొకరిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు,  మనసువిప్పి మాట్లాడుకోవాలని, ఋషికి ఆమే చెప్పింది. కాని, ఇప్పుడు ఋషి తనవైపు నుంచి సంజాయిషీని చెప్పుకునే అవకాశాన్ని తనెందుకు ఇవ్వట్లేదు ? దీనికి తగిన సమాధానం ఆమెవద్ద ఉన్నట్లు అనిపించలేదు. విమానం టేక్ ఆఫ్ కు సిద్ధమయ్యింది. స్నిగ్ధ కిటికీలోకి చూసింది, అందమైన మాంచెస్టర్ యొక్క పచ్చని ప్రకృతి దృశ్యం ఆమెను మనసును ఆహ్లాదపరిచింది. లేక ఇదంతా తుఫాను వచ్చేముందు కలిగే నిశ్శబ్దమా, ఆమెకు ఏమీ తెలియలేదు. ఋషి, కళ్ళు మూసుకునే ఉన్నా, నిజానికి నిద్రపోవట్లేదు. అతను కూడా గత కొన్ని రోజులుగా స్నిగ్ధతో జరిగిన విషయాలు ఎలా మలుపు తిరిగాయో, అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్నిగ్ధ భావనలను అతను అర్ధం చేసుకోగలడు, చిత్రాల పట్ల అతనికున్న మోహం పట్ల ఆమెకున్న సందిగ్ధం అర్ధవంతమైనదే అని అతనికి తెలుసు. అతను ఈ అస్పష్టతకు వీలైనంత త్వరగా తెర తియ్యాలని నిశ్చయించుకున్నాడు. అతను తన సీట్ సవరించుకుని, సౌకర్యంగా పడుకునేందుకు ప్రయత్నిస్తూ, నెమ్మదిగా  ఆలోచనల్లో మునిగిపోయాడు. గత రెండేళ్లుగా జరిగిన సంఘటనలు అతని ఆలోచనల్లో వేగంగా కదిలాయి. విమానం ప్రతి క్షణానికి పైపైకి ఎగురుతూ ఉండగా, అతని ఆలోచనలు విమానం వెలుపలి  మేఘాల్లా ఉన్నాయి. క్రింది నుంచి అందమైన ఆకాశంలా కనిపిస్తున్నా, విమానంలో వాటిమధ్య నుంచి వెళ్తున్నప్పుడు దట్టమైన మబ్బుల్లా రూపాంతరం చెందినట్లు, ఆలోచనలు అతని మనసును ముసురుకుంటున్నాయి. అతను కనులు మూసుకుని, తన ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించాడు. (సశేషం...)  

No comments:

Post a Comment

Pages