పుట్టినరోజు వేడుకలు జరుపుకోండి ఇలా !!
- భావరాజు పద్మిని
ముందుగా ఒక మంచి మాట ! ఈ మధ్య పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అన్న అంశంపై చూసిన ఒక వీడియో నాకు చాలా నచ్చింది... అందులో చూసిన విషయాలు మీతో పంచుకుంటాను. పుట్టినరోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి, కొత్తబట్టలు ధరించి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఆపై సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించాలి – సూర్యుడు ఆరోగ్య ప్రదాత. తరువాత ఆవు అందుబాటులో ఉంటే, కాస్తంత గడ్డి, ఇతర పదార్ధాలు తినిపించి నమస్కరించాలి. ఇక అతి ముఖ్యమైనది... మహా మృత్యుంజయ మంత్ర జపం...
"మహా మృత్యుంజయ మంత్రం"
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
ఈ మంత్రం యొక్క విశిష్టత : క్షీర సాగర మథనం లో జనించిన హాలాహలాన్ని రుద్రుడు లేదా పరమ శివుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు.ఇది జీవన ప్రదాత వంటిది. దీర్ఘాయువు, శాంతిసౌఖ్యలు, ధన ధాన్యాలు, సంపద, సంతోషం, ప్రసాదించే పరమ పవిత్రమైన మంత్రరాజం. పాము కాటు, నిప్పు, నీరు, పిడుగుపాటు వంటి ఆకస్మిక దుర్ఘటనల నుంచి రక్షించ గలిగి నటువంటి కవచం ఇది. భక్తి విశ్వాసాలతో ఈ మంత్రం జపిస్తే, అపర ధన్వంతరి వంటి వైద్యులు కూడా 'నయం కావు' అని చెప్పిన మొండి రోగాలు సైతం నయం అయి మృత్యు ముఖానికి చేరువ అవుతున్నవారు కూడా ఆయుష్మంతులు అవుతారు అని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చెయ్యాలి. దీపాలు వెలిగించడమే కాని, దీపాలు ఆర్పే పద్ధతికి స్వస్తి పలకాలి. దీపాలు/కాండిల్స్ ఆర్పడం అనేది అశుభదాయకం అని తెలుసుకోవాలి. మరి ఏ మార్పుకైనా, ఆలోచించి, తెగించి ఒక అడుగు ముందుకు వేసి మరీ శ్రీకారం చుట్టే మీ ‘అచ్చంగా తెలుగు’ మీకు మరో కొత్త అవకాశాన్ని అందిస్తోంది.... మిత్రులు ‘కందుకూరి రాము’ గారు కాంతి ఫౌండేషన్ స్థాపించి, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వారికి అనేక చారిటీ లతో, ఆశ్రమాలతో సంబంధాలు ఉన్నాయి. మీ/ మీ పిల్లల పుట్టినరోజు వేడుకలకి ఎంతో ఖర్చు పెట్టి, ఎన్ని బహుమతులు ఇచ్చినా, కలవారి మొహాలు విడవు. అదే మీరు ఒక చిన్న బడ్జెట్ అనుకుని, ఆ మొత్తంతో ఆహారం తయారుచేసి, అనాధ పిల్లలకు/వృద్ధులకు స్వయానా వడ్డిస్తే... ఆ పుట్టినరోజు మీరు జన్మలో మర్చిపోలేరు. స్వయంగా వెళ్ళలేని వారు కొంత రుసుమును కాంతి ఫౌండేషన్ ఖాతాలో జమ చేస్తే, వారు ఆశ్రమాలకు అందించి, మీకు ఫోటోలు పంపుతారు. ఈ ప్రతిపాదనను రాము గారితో చర్చించినప్పుడు వారు సహృదయంతో అంగీకరించారు. హైదరాబాద్ లో ఉన్నవారు ఎవరైనా, స్వయంగా ఆశ్రమాలకు వెళ్ళాలంటే, ఆయన ఏర్పాటు చేస్తారు. శ్రీ కందుకూరి రాము గారి ఫోన్ నెంబర్ :09959911403. ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాస పత్రిక 14 వ సంచికలో ప్రముఖ రచయత, పత్రికా సంపాదకులు శ్రీరమణ గారితో ముఖాముఖి, ఆర్టిస్ట్ అక్బర్ గారి పరిచయం, బ్నిం గారి శింజారవం, నాట్యావధానం గురించి కళ్యాణ్ గారి వ్యాసం, వేదాల్లో అంకెల ప్రాముఖ్యత గురించి పెద్దలు చెరుకు రామమోహనరావు గారి వ్యాసం వంటి ఎన్నో ప్రత్యేక అంశాలు ఉన్నాయి. షడ్రుచుల వంటి ఆరు కధలు, పలువన్నెల సీతాకోకచిలుకల వంటి కవితలు, మిమ్మల్ని ఊహాలోకంలో విహరింపచేసే వినూత్నమైన సీరియల్స్... మీకోసం ఎదురుచూస్తున్నాయి... ఇంకెందుకు ఆలస్యం... చదవండి, చదివించండి... పత్రిక గురించి మీ ఆప్తులకు, మిత్రులకు చెప్పండి. మీ జేజేలతో ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహమే మాకు, మా రచయతలకు బలం !!
కృతజ్ఞతాభివందనాలతో,
‘అచ్చంగా తెలుగు’ సంపాదక వర్గం తరఫున...
భావరాజు పద్మిని.
No comments:
Post a Comment