‘శ్రీరమణీ’ యం - అచ్చంగా తెలుగు

‘శ్రీరమణీ’ యం

Share This

‘శ్రీరమణీ’ యం


‘మిథునం కధల’ ద్వారా తెలుగు జీవనశైలిని ప్రతిబింబిస్తూ, మన మనసులోతుల్ని తట్టిన , ప్రముఖ హాస్యరచయిత, పత్రికా సంపాదకులు శ్రీరమణ గారి గురించి తెలియనివారు ఉండరేమో ! వారితో ‘అచ్చంగా తెలుగు’ పత్రిక తరఫున భావరాజు పద్మిని జరిపిన ముఖాముఖి...
నమస్కారం రమణ గారు, మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించిన సంగతులు చెప్తారా ?
నమస్కారమండి. మాది తెనాలి సమీపంలోని వేమూరు వద్దనున్న వరాహపురం అగ్రహారం. మా నాన్నగారు స్కూల్ టీచర్ గా పని చేసేవారు. నేను చిన్నతనంలో వేమూరు హై స్కూల్ లో చదువుకున్నాను. అమ్మ గృహిణి. మా తాతగారిది బాపట్ల. అక్కడే ఆర్ట్స్ కళాశాలలో నేను B.Sc వరకు చదువుకున్నాను.
సాహిత్యం పట్ల మీ అభిరుచికి బీజాలు ఎలా పడ్డాయి ?
నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, సాహిత్యం అంటే ఇష్టం ఉండేది. నాన్నగారు ఎయిడెడ్ స్కూల్ లలో పనిచేయ్యడంతో బాల, భారతి వంటి అనేక పత్రికలు ఇంటికి వచ్చేవి. నాన్న చాలా క్రమశిక్షణ కల టీచర్. అప్పట్లో ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న పుస్తకాల లైబ్రరీ ఉండేది. అందులో భారతం, రామాయణం, భాగవతం, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు , మంచి మంచి నిఘంటువులు ఉండేవి. అవన్నీ చదువుతూ ఉండేవాడిని.
అచ్చైన మీ తొలికధ ఏది ?
ఆంధ్రపత్రికలో నా మొదటి కధ అచ్చయ్యింది. నేను రాసిన కధలు తిరిగి రావడం అనేది ఉండేది కాదు, నాకధలన్నిటికీ ‘సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకునేవాడిని. నా మొదటి రెండు కధలు ఆంధ్రపత్రిక వీక్లీ లో వచ్చాయి. ఆ తర్వాత ఆదివారం ఆంధ్రజ్యోతి లో పేరడీలు రాసాను.
విజయవాడలోని ఆంధ్రజ్యోతి సంపాదక వర్గంలో ఉన్న నార్ల వేంకటేశ్వర రావు గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు వంటివారు నన్ను ఆంధ్రజ్యోతిలో చేరమని పిలిచారు. వీరంతా ఎంతో పేరున్న గొప్పవారు. అందుకే అక్కడ ఉద్యోగంలో చేరి, వీక్లీ కాలమ్స్ రాసేవాడిని. వారంవారం వచ్చే నా రచనలకు బాపు గారు దాదాపు 100- 120 బొమ్మలు వేసారు. అంతేకాక, నాకు తెలియకుండా నా ఫోటో సంపాదించి, నా బొమ్మ వేసి ఇచ్చారు. అప్పుడు నా వయసు 24, 25 ఉండచ్చేమో ! ఇదే బొమ్మని నా పుస్తకాలు అన్నింటిమీదా చూడవచ్చు. ఇది నాకు దక్కిన ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను.
రంగులరాట్నం చిన్న కధల సంపుటికి నేపధ్యం ఏది ?
నేను ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ గా ఉన్నప్పుడు రాసిన వీక్లీ కాలమ్స్ అన్నీ కలిపి, ‘రంగులరాట్నం’ అనే కధల సంపుటిగా వచ్చాయి. వీటికి బాపు గారు బొమ్మలు వేసారు.
బాపురమణ గార్లతో మీ అనుబంధం గురించి చెబుతారా ?
ఆంధ్రజ్యోతి వారు యువజ్యోతి పేరిట యువత కోసం ఒక పత్రిక తీసుకురావాలని అనుకున్నారు. రమణ గారి శ్రీమతి నండూరి రామమోహనరావు గారి సోదరి. ఈ సన్నిహిత సంబంధం వల్ల  బాపురమణ లు తరచుగా విజయవాడకు వస్తూ ఉండేవారు. వారంటే నాకు వల్లమాలిన అభిమానం, భక్తి. అప్పట్లో బాపు గారి బొమ్మలు ఎమెస్కో వారి పాకెట్ బుక్స్ మీద, గ్రీటింగ్స్, రచనలు, ఎక్కడ చూస్తే అక్కడ కనిపించేవి. ప్రతి ఒక్కరూ బాపురమణ లను ఒక్కసారైనా చూడాలని కలలు కనేవారు. వారు రంగులరాట్నం చదివి, మద్రాస్ నుంచి ‘లైటేనింగ్ కాల్’ బుక్ చేసి మాట్లాడేవారు. వారు ఒకసారి మా ఆఫీస్ కు వచ్చి, ‘రండి, మద్రాస్ వెళ్దాం’ అన్నారు. నాకు సినిమాలంటే మోజు లేదు. కాని, అంతటివారు పిలవడంతో, వాళ్ళతో ఉండాలన్న కోరికతో వెళ్ళిపోయాను.
దాదాపు ఒక 20, 25 సంవత్సరాలు అక్కడే ఉన్నా. వారు మ్యూజిక్ కంపోసింగ్ లో కూర్చుంటే, నేనూ కూర్చునేవాడిని . కధ వినేందుకు కూర్చుంటే, కధ వినేవాడిని. వారి సినిమాలలో నాపేరును ‘ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్’ గా వేసేవారు. వారు ఇద్దరికీ నేనంటే ప్రేమ, అభిమానం, ఆపేక్ష. తర్వాత బాపు గారు కొన్ని హిందీ సినిమాలు, సొంత సినిమాలు తీసారు. ఆపై మా పిల్లలు పెద్ద చదువులకు రావడంతో నేనూ హైదరాబాద్ వచ్చేసాను. మా మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఈ టీవీ కి వారు భాగవతం తీసేటప్పుడు స్టొరీ లైన్ కోసం నన్ను మళ్ళీ పిలిచారు. అప్పటికే నేను ఆంధ్రప్రభ లో పనిచేస్తూ ఉండడంతో వెళ్ళలేకపోయాను. తర్వాత వారు తీసింది ఒక్క రామరాజ్యమే అనుకుంటాను.
నేను ఆంధ్రప్రభ తర్వాత సరసం అనే ఆన్లైన్ పత్రికకు, ఒక హ్యుమర్ పోర్టల్ కు, నిహార్ ఆన్లైన్ అనే పత్రికలకు పనిచేసాను. ఇందులో మోహన్ గారి బొమ్మలు ఉండేవి.
ఆ తర్వాత, ఆంధ్రజ్యోతిని మళ్ళీ పునరుద్ధరించి, నన్ను డైలీ కి రిసోర్స్ ఎడిటర్ గా తీసుకున్నారు. నవ్య వీక్లీ పెట్టాకా, ఎడిటర్ గా పనిచేసాను. ఒక పత్రిక సవ్యంగా నడవాలంటే, రెండు మాంచి సీరియల్స్ పడితే చాలని, అంతా అంటూ ఉండేవారు.
తర్వాత నేను లండన్ లోని సి.పి.బ్రౌన్ అకాడమీ వారు 'సాకి స్రవంతి' పేరుతో భారతీయ స్థాయిలో మంత్లీ వేసారు. ఇందులో 100 మంది భారతీయ ప్రముఖుల జీవిత చరిత్ర వెయ్యాలని సంకల్పించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బాగుండేది, కాని 50 మందివి వేసాకా, స్థాపకులు ఆకస్మికంగా మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అది మంచి కధలతో నడిచిన గొప్ప పత్రిక.
తర్వాత నేను ఐ.వెంకట్రావు గారితో కలిసి, 5 రూ. వెల గల చిన్న పత్రికను పదేళ్ళు నడిపాను. ఆ తర్వాత మహా ఛానల్ లో చేరాను.
మిధునం కధకి ప్రేరణ ఏమిటి ? ఈ కధను 'దస్తూరి తిలకం' అనే పేరుతో బాపు గారు తన స్వీయ దస్తూరితో రాసిచ్చారట కదా !
 బాల్యంలో నేను గడిపిన అగ్రహార జీవితమే ఈ కధకు ప్రేరణ. అప్పట్లో SSLC పాస్ అయినవారు ఐతే టీచర్ అయ్యేవారు, లేక రైల్వే లోకి వెళ్ళేవారు. అలా పనిచేసి రిటైర్ అయిన వారు, ఆ చిన్న ఊరిలో, తమకంటూ ఏర్పరచుకున్న చిన్న ప్రపంచంలో చాలా ఆనందంగా గడిపేవారు. పిల్లలు హైదరాబాద్ కు రమ్మని పిలిచినా, 'హమ్మో, అక్కడికి రాలేము...' అనేవారు. అలాంటి జీవితాలు చూసిన అనుభూతి మిథునం కధకు మూలం అయ్యింది. అయితే, మిథునం కధ కంటే ముందు, నా 'బంగారు మురుగు' అనే కధకు చాలా మంచి పేరొచ్చింది. అది చదివిన ఆరుద్ర గారు పెద్ద ఉత్తరం రాసారు. అది ఎప్పటికీ మర్చిపోలేను.
ఇక మిధునం కధలకి బొమ్మలు వేసిన బాపు గారు, తను వేసిన బొమ్మ తనకు అంత తృప్తిని ఇవ్వలేదంటూ, తన స్వంత దస్తూరితో 'దస్తూరి తిలకం' రాసి, నాకు బహుకరించారు. ఇక్కడ విషయం ఏమిటంటే, వారు బొమ్మ బాగా వెయ్యకపోవడం కాదు. గొప్పవారు ఎప్పుడూ, తమకి తామే విమర్శకులుగా ఉంటారు, తమ వీపు తామే తట్టుకుని 'భేష్' అనుకోరు. అంతటి గొప్ప ఔదార్యం బాపు గారిది.
ప్రస్తుతం మీరు ఏమి చేస్తున్నారు ?
ప్రస్తుతం నేను భక్తి టీవీ అనే NTV గ్రూప్ వారు పెట్టబోతున్న ఒక పత్రిక కోసం బేస్ వర్క్ చేస్తున్నాను. అది మరో నెలలోపే ప్రచురణ మొదలవుతుంది.
మీరు పొందిన బహుమతులు/ ప్రశంసల గురించి చెప్తారా ?
ముఖ్యంగా బహుమతుల కంటే, నా జీవితంలో గొప్ప గొప్ప రచయతల నడుమ గడిపే అదృష్టం దక్కింది. అది నేనొక వరంగా భావిస్తాను. 23, 24 ఏళ్ళ వయసులో నండూరి వారు, పురాణం వారు, వంటి గొప్ప వ్యక్తులు, నన్ను ఆదరించి, తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు అంటే, అది నేను అదృష్టంగా భావిస్తాను. బహుమతులపై నాకెందుకో ఒక అనాసక్తత ఉంది.
మా ఆఫీస్ కి విశ్వనాధ సత్యనారాయణ గారు, కాళీపట్నం రామారావు గారు, రావిశాస్త్రి గారు, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు వంటి ప్రముఖులు వచ్చేవారు. వారు వచ్చినప్పుడల్లా, 2,3 గంటలు కూర్చుని, మాట్లాడుకునేవారు. వారి మాటలు వింటూ ఉండేవాడిని. నాకు విజయవాడ AIR లో పనిచేసే బాలాంత్రపు రజనీకాంతరావు గారితో కూడా సన్నిహిత అనుబంధం ఉండేది. అలాగే మద్రాస్ లో మాలతి చందూర్ గారిని కలవడం మరువలేను. ఇటువంటి లివింగ్ లెజెండ్స్ మధ్య, నాకంటే ముందుతరం పెద్దవారితో గడిపిన అనుభూతులు ఎప్పటికీ మరువలేను.
ఇక బాపు గారు నాకొక అరుదైన గౌరవం ఇచ్చారు. వారి కార్టూన్ల వాల్యూం కి ముందుమాట నన్ను రాయమన్నారు. నేను 'కాస్త సమయం తీసుకుని, ఒక నెలాగి ఇస్తాను, ' అంటే, వారు సమ్మతించారు. కాని, మిగిలిన వారు, 'అంత పెద్దాయనతో అలా మాట్లాడతావా ?' అని నన్ను కోప్పడ్డారు. కాని అలా, కోప్పడ్డ వారే, నా ముందుమాట చదివి నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇది నాకు దక్కిన మరో గొప్ప వరం.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
పూర్తిగా గ్రామీణ నేపధ్యంతో ఒక నవల రాయాలని ఎప్పట్నుంచో ఒక కోరిక. తెలుగు భాష చాలా గొప్ప భాష. మమకారం ఉన్న భాష. చిన్న డెన్సిటీ మార్పుతో, ఐదారు రకాల వేరియేషన్స్ సృష్టించవచ్చు. అయితే, రచయతకు సమకాలీనత కూడా ఉండాలి. అప్పుడే పాఠకుడి మన్ననలు పొందగలము. మిథునం కధ ఇప్పటికీ పెళ్లిళ్లకు, వేడుకలకు నా అనుమతి తీసుకుని, కాపీలు వేసి, పంచిపెడుతున్నారు. అంటే... ఏదైనా జనం మెచ్చాలి, మెచ్చిందే నిలుస్తుంది.
సాక్షి పత్రికలో హాస్యానికి సంబంధించి వచ్చే మీ కాలమ్ చదివితే, అప్పటి మీ శైలికి, ఇప్పటి శైలికి వ్యత్యాసం ఉన్నట్లు అనిపిస్తుంది...
అవునా... అది చదువరులే చెప్పాలి. అయినా, రచయత ఎప్పటికప్పుడు మారుతూ వైవిధ్యభరితమైన రచనలను అందించాలి. మూస పోసినట్లు... ఇలాగే రాస్తాడు, అన్న బ్రాండ్ నుంచి బయటపడాలి, అని నేను నమ్ముతాను.
ఇదివరలో ప్రముఖ రచయతల నవలలు సినిమాలుగా వచ్చేవి.  ప్రస్తుతం రచనలు ఎన్నో వస్తున్నా ,సినిమాకు సరిపడే కధలు రావట్లేదు... ఎందుకంటారు ?
సినిమాకు కొన్ని దినుసులు కావాలి. అవేమిటో బాపురమణ గార్లతో తిరిగిన అనుభవంతో నాకు తెలుసు. పేపర్ ప్రింట్ కు న్యాయం చెయ్యాలి అంటే, సెల్ల్యులాయిడ్ కు అన్యాయం చెయ్యాలి. మిధునం సినిమా తీసేందుకు కూడా భరణి చాలా సంవత్సరాలు పాకులాడారు. ఎందుకంటే, ఆ రచనలో మనుషుల మనస్తత్వాలు, మాట, భాష అన్నీ ప్రేక్షకులకు హత్తుకునేలా తియ్యాలి, అంటే కొన్ని కలపాలి, కొన్ని తీసివెయ్యాలి. మనం ఏదో తియ్యాలని అనుకుని, అసలు ప్రేక్షకుడికి అర్ధం కాని సినిమాలు తియ్యకూడదు. మంచి భాష, సామాజిక దృక్పధం, కలిగి ఉండి చేసే రచనలకు అవకాశాలు ప్రయత్నిస్తే, తప్పక వస్తాయి. విశ్వనాధ వారి వేయి పడగలు కలకాలం నిలిచిపోయింది అంటే... ఇందుకే కదా ! ఇటువంటి మంచి రచనలు చేసేందుకు, రచయతలు ప్రయత్నించాలి.
ప్రముఖ రచయతగా, అనేక పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించి, ఎంతో మంది ప్రముఖుల నడుమ గడిపిన శ్రీరమణ గారు అందించిన అనుభూతులు... నిజంగా  'శ్రీరమణీ 'యమే !! కదూ...

No comments:

Post a Comment

Pages