శ్రీశ్రీ సినీ కవిత్వం - అచ్చంగా తెలుగు

శ్రీశ్రీ సినీ కవిత్వం

Share This

శ్రీశ్రీ సినీ కవిత్వం

– ఆచార్య చాణక్య


తెలుగు కవిత్వాన్నే కాదు... సినిమా సాహిత్యాన్ని సైతం ప్రభావితం చేసిన మహాకవి శ్రీశ్రీ.   ఎక్కడో ఆకాశంలో ఊరేగుతున్న తెలుగు కవిత్వాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన మానవతా వాది శ్రీశ్రీ. ఆయన రాసిన సినీ గీతాల్లోనూ ఈ తత్వాన్ని ఏర్చికూర్చాడు. శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహాకవి సినీకవిత్వాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.

శ్రీశ్రీ పాటలనగానే ముందుగా మనకు గుర్తొచ్చే చిత్రం పల్లెటూరు. ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన రచించిన ప్రతిజ్ఞ కవితను నేరుగా తెరకెక్కించారు. కార్మికుడి కష్టానికి ఏ షరాబూ ఖరీదు కట్టలేడని సాగే ఈ గీతం... నవశకానికి మార్గదర్శకం. గనిలో... పనిలో... కార్ఖానాలో... ధనిక స్వామ్యానికి దాస్యం చేసే కార్మికులు విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదుకట్టే షరాబు లేడోయ్ అంటూ కార్మికులు నివాళి అర్పించారు శ్రీశ్రీ.

శ్రీశ్రీ కవితను నేరుగా తెరకెక్కించిన మరో చిత్రం... ఆకలిరాజ్యం. ఆయన బాటసారి కవితను ఈ సినిమాలో తెరకెక్కించారు. కమల్ హాసన్ నటన, బాలచందర్ దర్శకత్వ ప్రతిభ... సినిమా సందర్భం ఈ పాటకు ప్రాణం పోసింది.
శ్రీశ్రీ సినిమా పాటలనగానే ముందుగా గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు సినిమా. ఇందులో తెలుగువీర లేవరా గీతం వింటుంటే ప్రతి మనిషికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రతిమనిషి తొడలు కొట్టి... శృంఖలాలు పగుల గొట్టి... సమరాన్ని సాగించాలి అంటూ గీతాచార్యుడై దిశానిర్దేశం చేశాడు శ్రీశ్రీ. జాతీయ అవార్డు సైతం ఈ పాటకు దాసోహమైంది.
స్వతంత్రం వచ్చిందని సంబరపడి పండుగ చేసుకుంటే సరిపోదనే సందేశాన్ని నింపుకున్న
పాట వెలుగునీడలు సినిమాలో ఉంది. మన ముందున్న సమస్యలను అధిగమిస్తేనే స్వతంత్రానికి సార్థకతని ఈ పాటలో తెలియజేశారు శ్రీశ్రీ. ఆకాశాన్నంటే ధరలు, అంతులేని నిరుద్యోగం, అవినీతి, బంధుప్రీతి, నల్లబజారు లాంటి సాంఘిక సమస్యల్ని ఆ నాడే ప్రస్తావించారు శ్రీశ్రీ. నేటికి దేశ ప్రగతికి అవే అవరోదాలుగా తయారయ్యాయి.

భూమికోసం సినిమాలో శ్రీశ్రీ రాసిన ఎవరో వస్తారని గీతం... నేటి తరానికి స్ఫూర్తి మంత్రం. మన భవిష్యత్ కు మనమే మార్గనిర్దేశకులమంటూ... ఎవరి మీదో ఆధారపడి నిదరపోకండంటూ స్ఫూర్తిని రగిలిస్తారాయన.

భగవంతుడు మనిషిని సృష్టించాడని మన పూర్వీకులు పదే పదే చెబుతున్నా మాట. కాదు మనిషే దేవుణ్ని సృష్టించాడనేది మరికొందరి ఉవాచ. మరి ఈ రెండు సంఘర్షణల వల్ల వచ్చే ప్రయోజనమేదన్నా ఉందా. అందుకే మనుషుల గోల వింటూ... దేవుడి లీలలు కనండంటారు శ్రీశ్రీ. దేవుడు చేసిన మనుషులు సినిమా కోసం ఆయన రాసిన ఈ పాట... ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గీతం.

ప్రజల్లో శ్రీశ్రీ పాటలనగానే ఒక ముద్ర పడిపోయింది కొన్ని పాటలు ఆయనవంటే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి పాటే డాక్టర్ చక్రవర్తిలోని మనసున మనసై గీతం. మనిషికి తోడు ఉంటే... అదే స్వర్గమంటారాయన. పేరుకు ప్రేమ పాటే అయినా ఇది సైతం మనిషిని, మనసుని తట్టిలేపే గీతమే.

వెలుగు నీడలు సినిమాలోని హాయి హాయిగా జాబిల్లి గీతం... శ్రీశ్రీ కవితా ధోరణికి పూర్తి విరుద్ధమైనది. ఆయన ఇలాంటి పాటలు కూడా రాశారా అనే అనుమానమూ కలగక మానదు. నిజమండీ... ఈ పాట శ్రీశ్రీ కలం నుంచి వెలువడిందే.

మాంగల్య బలంలోని ఆకాశవీధిలో, అందాల జాబిలి పాట సైతం ఇలాంటిదే. ఇది కూడా శ్రీశ్రీ గీతమంటే నమ్మలేని వారు ఎందరో ఉన్నారు. రెండు సంఘర్షణల్ని ఒకే గీతంలో ఇమిడ్చి అద్భుతమైన విజయం సాధించారు శ్రీశ్రీ.

శ్రమైక సౌందర్యం గురించి శ్రీశ్రీకి తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో. అందుకే శ్రమజీవుల కష్టాలే కాదు... వారి భావావేశాలన్నింటీ ఒడిసి పట్టారాయన. వెలుగునీడలు సినిమాలోని ఓ రంగయో... పాట సరిగ్గా ఇలాంటిదే.

ఆరాధన సినిమాలోని నా హృదయంలో నిదురించే చెలి గీతం... నేటికీ ప్రజల నాల్కలపై నానుతూనే ఉంది. ప్రేమకు ప్రతి రూపంగా చెప్పే ఇందులోని పదాలు శ్రీశ్రీని కలం నుంచి వెలువడ్డం విశేషం. బాధలు, నిట్టూర్పులే కాదు... విరహాన్ని సైతం అంతే అద్భుతంగా రాయగలగడం బహుశా శ్రీశ్రీకి మాత్రమే సాధ్యమైన విద్యేమో.
  
గతం, వర్తమానం, భవిష్యత్్.. జీవితమంటే ఇదే కదా. జీవితం కల కాదు మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి. అందుకే అదెంతో విలువైందంటారు శ్రీశ్రీ. ప్రకృతికి, జీవితానికి పెద్ద తేడా ఏం లేదు. అందుకే ఈ రెండింటికీ ముడిపెట్టి జీవిత ప్రాధాన్యాన్ని వివరించారు శ్రీశ్రీ. వెలుగు నీడలులోని కలకానిది, విలువైనది అనే ఈ పాటను శ్రీశ్రీ అల్లిన తీరు నభూతో.

యమగోల సినిమాలో ఓ పోరాటగీతాన్ని సైతం శ్రీశ్రీ రాశారు. యమడి మీదకు యమభటులు దండెత్తితే ఎలా ఉంటుందనే విషయాన్ని ఊహించి అద్భుతమైన పదాలతో అక్షర లక్షల విలువైన సాహిత్యాన్ని అందించారాయన. సమరానికి నేడే ఆరంభం... యమరాజుకు మూడెను ప్రారబ్ధం అంటూ శ్రీశ్రీకి మాత్రమే సాధ్యమైన పదాలతో యమహో అనిపించారు.

సంకల్ప బలముంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. ఇది మన పెద్దల కాలం నుంచి చెబుతున్న మాటే. దాన్ని కాస్త కొత్తగా చెప్పాలనుకున్న శ్రీశ్రీ... రాసిన పాటే శభాష్ రాముడు సినిమాలోని జయమ్ము నిశ్చయమ్మరా గీతం. భయపడకుండా ముందుకు సాగితే విజయం దానంతటే అదే వరించి వస్తుందన్న ఆయన మాటలు స్ఫూర్తి వచనాలు.

విప్లవాలే కాదు రాథాకృష్ణుల ప్రణయాలు సైతం శ్రీశ్రీ కలంలో చక్కగా ఒదిగిపోయాయి. ఇద్దరు మిత్రులు సినిమాలో పాడవేల రాధిక అంటూ ఆయన రాసిన పాట ఏ మనసును తాకదు చెప్పండి. తన కవితల్లో భారీతనాన్ని చూపించే శ్రీశ్రీ... అందుకు భిన్నంగా అలతి అలతి పదాలను ఈ పాటలో వాడారు.

జయభేరి సినిమాలోనూ నందుని చరితము గనుమా అనే గీతం శ్రీశ్రీ కవితా ప్రతిభకు మచ్చుతునక. ఎందు కంటే భగవంతుడి గురించి, భక్తుని గురించి వర్ణిస్తూనే అందులో ఆవేదనా పూరితమైన మాటల్ని జొప్పించి అద్భుతమైన పదబంధాలతో ఆకట్టుకున్నారాయన.

దేవత సినిమాలోని బొమ్మను చేసి, ప్రాణం పోసి గీతం కూడా ఇలాంటిదే. భగవంతుడు
మనిషితో ఆడుకుంటూ ఉంటాడనే ఈ పాట బహుశా శ్రీశ్రీ కలం నుంచి వెలువడిందంటే ఎవరూ నమ్మరు. కానీ రచయితగా పూర్తి న్యాయం చేయగల శ్రీశ్రీ కలం నుంచి వెలువడని పదాలు, ఆయనకు సాధ్యం కాని భావాలు ఏముంటాయి చెప్పండి.

చెప్పుకుంటూ పోతే... ఇలాంటి పాటలు ఎన్నో. ఎక్కడికక్కడ పాట యూ ట్యూబ్ లింక్ లు ఇద్దామనుకున్నా. కానీ మీరే వెతికి చూసుకుంటే... ఆ మజానే వేరు కదా. కాబట్టి... కాసేపు ఈపాటలు వింటూ... కొత్త లోకాల్లో విహరించండి.

No comments:

Post a Comment

Pages