వచ్చెనది గోవసంతం!
- ఆర్.దమయంతి.
కుటుంబజీవనంలోమనవైన
తెలుగుసాంప్రదాయలనుసొంతంచేసుకోవడమే - అసలైనఆస్తులు.'
‘బ్రోవభారమా.. రఘురామా.. “ రాగం తీసుకుంటూ తులసికోటకి పసుపుకుంకుమలద్దుతోంది శాంత .
ఇంతలో - బయట కారాగిన చప్పుడికి, 'మనింటికా?' అన్నట్టు వాకిట్లోకి తొంగి చూసింది.
ఔవును. తమింటికే. అందుకు కాదు ఆమె ఆశ్చర్యపోతోంది. మరి ఎందుకంటే, కారుదిగి, లోపలకొస్తున్న వియ్యాలవారిని చూస్తూ, కొన్నిక్షణాలపాటు తనకళ్ళని తనే నమ్మలేనిదానిలా అయిపోయింది . తలమునకలైపోయెంత ఆశ్చర్యంతో..
గబగబా చేతులు కడుక్కుని, నాప్కిన్తో తుడుచుకుంటూ.. "రండి..రండి " అంటూ నవ్వుతూ ఆహ్వానించింది.
ముందుగదిలో కూర్చున్న శాంతభర్త, మాధవరావు కూడా చదువుతున్న పేపర్ని పక్కకిపెట్టి, వియ్యాలవారిని నవ్వుతూ పలకరించాడు. ' ఓ! వాటేసర్ప్రైజ్ " అంటూ.
పలకరింపుకి బదులుగా నవ్వేస్తూ.."ఎలా వున్నారండీ బావగారూ?" అంటూ కుశలమడిగాడు వీరేశం.
"బావున్నాం... మీరెలా వున్నారు?" అంటూనే, కూర్చోండంటూ సోఫా చూపించాడు మాధవరావ్.
ఎప్పుడూ లేనిది, వియ్యాలవారిలా పొద్దునే తమింటికి రావడం.. కనీసం ముందస్తుగా ఒక్కఫోన్కాలైనా చేయకుండా, హఠాత్తుగా ఊడిపడటం ...పైపెచ్చు నవ్వుతూ కుశలాలు అడగడం...అంతా- వింతైన ఆశ్చర్యంగా వుంది ఆ దంపతులకి!
వాళ్ళనింకా…ఇంకా తికమకపెట్టడం సమంజసం కాదనుకున్నాడో, ఏమో, వీరేశం సోఫాలో కూర్చుంటూ, నవ్విచెప్పాడు.
"మా ఆవిడ రెండ్రోజుల్నించి తెగపోరు పెడ్తోంది బావగారు! అన్నయ్యగారినీ, వదినగార్నీచూడాలనుందండీ, తీసుకెళ్ళండీ అంటూ..! నాకే- వీలుకుదరక ‘ రేపురేపు ‘ అంటూ దాటేస్తూ వస్తున్నా. ఆ ఎఫెక్టో ఏమోకానీండీ..నిన్నట్నించి కాఫీ కూడా పుట్టట్లేదు ఇంట్లో! ఇక ఆలస్యం చేస్తే.. మంచినీళ్ళు కూడా దొరకవని ఇదిగో ఇలా పొద్దునే, వెంటపెట్టుకుని తీసుకొచ్చేసా.." అంటూ గొల్లున నవ్వాడు వీరేశం.
“చాల్లేండి పెద్ద ‘ అన్నట్టుగా మొగుడి వైపు చిరుకోపాన్నిప్రదర్శించింది కాని..లోపల మాత్రం సంతోషంగానే వుంది. ఎందుకంటే..వియ్యాలవారింటికి రావడంలో ప్రమేయమంతా తనదేనని, ఆయన కేవలం నిమిత్తమాత్రుణ్ని మాత్రమేనని చెప్పక చెప్పిన తీరుకి, మొగుణ్ని లోలోనే మెచ్చేసుకుంది ఉమాదేవి. ఆ క్రెడిటంతా తనకే దక్కేలా మాట్లాడినందుకు, మెచ్చుకుంటూ మొగుడివైపొక మురిపెపు చూపొకటి విసిరేసింది కూడా.
ఆయనకు కావాలసింది కూడా అదే కాబట్టి వీరేశం ముఖం విప్పారింది.
వానచుక్కెరగని వీధిలో వడగళ్ళవానొస్తే ఎలా వుంటుందో, వీళ్ళ వరసా అలానే తోస్తోంది మాధవరావ్దంపతులకి. అసలు వీళ్ళ రాకే అర్ధంకాకుండా వుంటే, మరోపక్క వీళ్ళ వరసలాటల అర్ధమేమిటిరా ఈశ్వరా! అనుకుంటున్నారు.
మనసులో వున్నది అడిగితే బాగోదన్నట్టు ఓ నవ్వునవ్వి, .."మీరు మాట్లాడుతూ వుండండి. నేనినిప్పుడే కాఫీ తీసుకొస్తా.." అంటూ లోపలకొచ్చింది శాంత. - డికాషన్కోసమని, స్టవ్వెలిగించి, నీళ్ళగిన్నె పెట్టింది.
గిన్నెలో నీళ్ళు మరగడంకోసం చూస్తోందే కానీ, ఆలోచనలన్నీ - ఒక్కసారిగా వేడిసెగలకు మల్లే ముసురుకున్నాయి - మనసుని.
వియ్యాలవారంటే - తన కొడుక్కి పిల్లనిచ్చిన వాళ్ళు. 'కేవలం తన కోడలి పుట్టింటోళ్ళు. అంతే, … అంతేకదూ?' మరి అంతేగా! అంతకు మించి దగ్గరతనం మీతో మాకవసరం లేదు అన్నట్టే ప్రవర్తించలేదు ఈ ఉమాదేవి?
తనకొడుక్కి పెళ్ళి చేసి రెండేళ్ళైంది. ఈ రెండేళ్ళల్లో వీళ్ళు తమ ఇంటికి రావడం ఇది కేవలం మూడోసారో, నాలుగోసారో. అంతే!
ఒక్కసారిగా పెళ్ళినాటి సంగతులు ఆమె మదిలో మెదిలాయి.
అమ్మాయిలకంటే అబ్బాయిలకి పెళ్ళిళ్ళవడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో, ఆఫీస్కి శలవుపెట్టుకుని మరీ, సంబంధాల వేటలో పడింది- శాంత.
-అమెరికా నించి వస్తున్నకొడుక్కి, ఆరునూరైనా సరే ఆ యేడాది పెళ్ళిచేసి జంటగా పంపాలనే ధృఢసంకల్పంతో వుంది. ఎలాగైతేనేం, అష్టకష్టాలు పడి మొత్తానికి ఒక అమ్మాయిని మెచ్చింది. చదువుతోబాటు చక్కని రూపురేఖలుగల పిల్ల. అని ఒకటికి పదిసార్లు మురుసుకుంది. ఇద్దరి ఫోటోలు పక్కపక్కన పెట్టుకుని సరైనజోడని ఆనందపడింది.
రవి వచ్చాడు. పెళ్లి చూపులయ్యాయి. అవ్వగానే పిల్లనచ్చిందంటూ పెళ్లికిగ్రీన్సిగ్నెల్ ఇచ్చాడు.
పెళ్ళిమాటలు మొదలయ్యాయి.
కట్నం ప్రసక్తే లేదు అని ముందుగానే చెప్పేసింది శాంత.
పెళ్లికయ్యే ఖర్చులుకూడా సగంసగం అని మాధవరావు అనౌన్స్చేసాడు.
ఎటొచ్చీ..పెళ్ళిని ఒకవేడుకగా చేసుకోవాలని కోరింది శాంత.
పెళ్లంటే నూరేళ్ళ పండగ. పెళ్ళిముచ్చట్లు, మురిపాలు తీర్చుకోవాలనుకుంది.
స్నాతకం దగ్గర్నుంచి, అప్పగింతల వరకు పందిట్లో అన్నీ వేడుకలూ జరపుకోవాలని ఉవ్విళ్ళూరింది.
అవును మరి. తెలుగువారింట్లో పెళ్ళంటే ఎంతకళగా వుంటుంది. సరసాలు, సరదాలు, చిలిపితనాల ఆటలు, వరసలాడుకోవడాలూ, వరసైనవాదాలు, వాదనలు..పాటలు, పద్యాలు, ఇవన్నీ చూసేవారికి ఎంతముచ్చట గొలుపుతాయి!
తలంబ్రాలపాటలు, వియ్యపురాలికి పళ్ళుతోమిస్తూ ఓపాట..మేజువాణి పాట, అప్పగింతల పాట..ఇవన్నీ వేడుక చేసుకోవాలి తను అని ఆశపడింది. మనదైన సాంప్రదాయ శాస్త్రీయపధ్ధతిలో కొడుకుపెళ్ళి జరగాలని కోరుకుంది.
ఆమె ఆశలకి ఊపిరొచ్చినట్టుగా...తన స్నేహితురాలి కొడుకు వివాహం ఆమెకొక గొప్పస్ఫూర్తిగా మారింది. జానకి కొడుకు రష్యాపిల్లని ప్రేమించి పెళ్ళిచేసుకుంటానని చెబితే, విని బాధపడుతూ కూర్చుందా? లేదు. వెంఠనే వాళ్ళిదర్నీ పిలిచి, కల్యాణమంటపంలో ఘనంగా వివాహం జరిపించింది. ప్రెస్వాళ్ళు కూడా వచ్చి, చక్కని కథనం రాసుకెళ్ళారు. అదొక ప్రత్యేక కార్యక్రమంగా రూపుదిద్ది ప్రేక్షకులకి కనువిందు చేసారు టీవీ చానెల్వారు. ఐతే, - తన వివాహం హిందూ సాంప్రదాయబధ్ధంగా వివాహం జరగాలాని కోరుకున్నది కొడుకు కాదుట. కోడలట. ఎక్కడో రష్యాలో పుట్టిపెరిగిన ఆ స్త్రీకి మనవివాహ సాంప్రదాయాలపట్ల, విధానాలపట్ల ఎంత మక్కువ? మరెంత గౌరవం!!
ఆశ్చర్యంతోబాటు ఆనందమూ కలుగుతుంది కదూ? - మనవాళ్ళు వద్దనుకుంటూ, బోరంటూ, ఇవన్నీ ట్రాష్ అంటూ వుంగరాలు తొడుక్కుని, సంతకాలతో సరిపెట్టుకుని, ఆపైన అందరూ నించునితినే భోజనాలుపెట్టి పంపేసి చేతులుదులుపుకుంటుంటె.. రేపు తనకొడుకి పెళ్ళీ ఇంతేనా.. అనేదిగులుతో తనున్నప్పుడు జానకింట్లో జరిగిన పెళ్ళి శాంతకి ఎంతో మనో ఆనందాన్నిచ్చింది.
అప్పట్నించీ ఆమెలో ఉత్సాహం మరింతగా పెరిగింది.
ఆమె మనసు కనిపెట్టిన ఉమాదేవి ముందుగానే కాళ్ళకి బంధం వేసింది. తనిలాటి వాటికి బధ్ధవిరుధ్ధమంటూ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
శాంత నిశ్చేష్టురాలైంది. అసలు తనునోరైనా విప్పకముందే ఇలా మాట్లాడటంతో ఖిన్నురాలైంది. వియ్యపురాలి మాటతీరుకి. ఆవిడకి కుదరకపోతే, ఆ విషయాన్ని సున్నితంగా చెప్పొచ్చు. తన చెప్పింది విన్నాక తిరస్కరించనూవచ్చు. తప్పులేదు. కానీ, ఈ ఖరాఖండి వైఖరేమిటీ? ఆదిలోనే అపసృతి అన్నట్టుంది..
శాంతకెక్కడ్లేని నీరసం ఆవహించినట్టైంది.
ఉమాదేవి - ధోరణ్ని మొదట్నుంచి తను గమనిస్తూనే వుంది. ఎంతైనా ఆవిడ అదోతీరు మనిషి. ఆమె ఆలోచనా సరళి ఏ పాటిదో, పెళ్ళిచూపుల మర్నాడే తెలిసింది. ఫోన్చేసి మాట్లాడిన ఆ మాటతీరులోనే తను కనిపెట్టేసింది.
ఇదే మాట భర్తతో చెప్పింది.
మాధవరావు ఆమెతో ఒకటేమాట అన్నాడు.
"నువ్వేరే ఆలోచన్లేవీ పెట్టుకోకుండా, వాళ్ళెలా పెళ్ళిచేస్తామంటే అలానే అని తలూపు. సరేనా? " అని ముందుగానే సున్నితమైన హెచ్చరికను కూడా జోడిస్తూ.. సర్దిచెప్పాడు భార్యకి.
చూస్తూ, చూస్తూ..తూతూ మంత్రపుపెళ్ళికి మనసొప్పుకోవడం లేదు.
ఏంచేయాలి, తనిప్పుడు.
పెళ్ళంటే, నూరేళ్ళపంట. మళ్ళీ షష్టిపూర్తికి గానీ, ఈ వేడుకలు జరగవు. ఇప్పుడు తను పూనుకుని చేస్తే తప్ప, పెళ్లిలో ఇన్ని సుమధురఘట్టాలుంటాయని కానీ..అవి జీవితమంతా, తీపి గుర్తులౌతాయని కానీ ఈ జంటకెలా తెలీదు.
తల్లికి ఫోన్చేసి, తన దిగులంతా చెప్పుకుంది - శాంత.
"అయ్యో ! అదేంమాటే, శాంత? ఆ మాత్రం పెళ్ళి ఆచారాలు, సాంప్రదాయాలూ, తెలీకుండా ఎలా వుంటాయీ? బడాయి కాకుంటే. సర్లే! ఇక ఆవిడ సంగతి వొదిలేయ్. నువ్వు - నీ కొడుకు పెళ్ళిని నీకు కావల్సిన పధ్ధతిలో – నువ్వే జరిపించుకో! అటుఇటూ ఖర్చులన్నీ కూడా నువ్వే భరించు. ఏం ఫర్వాలేదు. మరో కూతురిపెళ్ళి చేస్తున్నాననుకో, ఏం పోయింది?” – తల్లి మాటలకి శాంతకి గుప్ఫున తన కూతురు సుధ పెళ్ళి గుర్తుకొచ్చింది.
సుధ నచ్చిందని, వెంటనే వచ్చి కలవమని వాళ్ళు చెప్పగానే, తనూ భర్తా కలసి వియ్యాలవారింటికెళ్ళారు సంతోషంగా. కట్నం ప్రసక్తేలేదు. అలా అని, కట్నాలు పేరిట గొంతెమ్మ కోర్కెలూ వాళ్ళు కోరలేదు.
వాళ్ళడిగింది, వున్నంతలో పెళ్ళిబాగా జరగాలని కోరారు.
పెళ్ళిలో వారి ఆచారవ్యవహారలన్నీ తనే స్వయంగా వియ్యపురాల్ని అడిగి తెలుసుకుంది.
ఆవిడ కూడా చాలా ఉత్సాహంగా సహకరించడంతో.. మూడుపూటల పెళ్ళివిందుతో రెండు కుంటుంబాలు మరింత దగ్గరకి జరిగాయి.
పెళ్ళై ఐదేళ్ళౌతోంది.
సుధ అత్తగారు తనవైపు బంధువులతో సంతోషంగా చెప్పుకుంటూనే వుంది. ‘కోడలి పుట్టింటివారు మర్యాదస్తులు. నన్ను గౌరవిస్తారు’ అంటూ.
ఆ విషయాన్ని కూతురు తనకి చెప్పి ఆనందపడుతుంటే..తను పడిన కష్టానికి ఫలితం దక్కిందని తలచుకున్నప్పుడల్లా తృప్తిపడుతూ వుంటుంది.
జీవితంలో పెళ్ళిఅనేది ఒక్కసారే జరుగుతుంది. కానీ, ఆ సుమధురజ్ఞాపకాలే వందేళ్ళుంటాయి.
తల్లి చెబుతున్న మాటల్ని వింటోంది శాంత.
“శాంతమ్మా! ఒక్కమాట చెబుతా విను. వివాహ వేడుకని రెండుకుటుంబాల వారు కలసి, ఒక ఉత్సవంలా జరుపుకోవాలి. చూసేవారికి కనులపండువలా వుండాలి. అందుకు మనకుండాల్సింది ధనం కాదు. మన వివాహసంప్రదాయలపట్ల, ఆచారాలపట్ల మనకు గౌరవం వుండటం ప్రధానం. తెలుగు సాంప్రదాయ వివాహవిధానలలో అడుగడుగునా అందముంది. ఆ అందం వెనక ఒక అర్ధమూ వుంది. ప్రతిమంత్రానికి ఒకజీవనవేదం వుంది. ఆచరించి అనుభూతించేందుకైనా ఒక యోగం వుండాలి. అది అందరికీ వుండదు. మళ్ళీమళ్ళీ రమ్మంటే మాత్రం వస్తుందా ఈ మహదవకాశం?
నువ్వేం చేస్తావంటే, మన వెంకటావధానిశాస్త్రులు గారికి మన పధ్ధతులన్నీ ముందే చెప్పి వుంచు. ఆయన్నడిగి జరగాల్సిన శుభకార్యాలకి ఏమేం కావాలో ఒక చిట్టారాసుకో.
అల్లుడిగారి వైపు, నీవైపు ..అటు ఇటూ - రక్తసంబంధీకులకు పెద్దపీట వేయాలి. ఇళ్ళకెళ్ళి శుభలేఖలు పంచి, స్వయంగా ఆహ్వానించండి. సరేనా!
ఆ తర్వాత - దగ్గరవాళ్ళు, ఆ వెనక దూరపుచుట్టాలు. ఆ వెనకే స్నేహితులు, ఆఫీసు వాళ్ళు, చుట్టుపక్కలవారు. ఆ పిదప, పనివాళ్ళు.. ఇలా లిస్ట్చేసుకుని ఎవరెవరికి - ఏమేం బట్టలు పెట్టాలీ, ఎప్పెడెప్పుడు అందించాలి అన్నీ జాగ్రత్తగా నోట్చేసుకో. మీ అత్తగారికొకటి, నాకొకటి ముత్తవ్వ చీరలు కొనడం మరచిపోకు.
అలాగే ఉమాదేవి వైపువారూ కూడా పెద్దవాళ్ళెవరున్నరో కనుక్కో.
శుభలేఖలు మీ మావగారి పేరుమీద వేయించాలి. తెలిసిందా? ' మా మనవడు చిరంజీవి నాగరాజరవీంద్ర.. అని పూర్తిపేరు వుండాలి.
మర్చిపోయా చెప్పడం! ఇదిగో చూడు, మన జిల్లావారికి, తలంబ్రాలు పసుపు బియ్యమే!" అంటూ అమ్మపెళ్ళి మాటలతో - ఆమెలో అణగారిన ఉత్సాహం రివ్వుమంటూ పైకెగసింది. ఇక వెనకాముందు ఆలోచించలేదు. వెంటనే తోడుకోడలతో కలసి.. ఇక చకచకా పెళ్ళిపనులకు శ్రీకారం చుట్టింది.
బుల్లి రోలుకి, చినరోకలికి పసుపుకొమ్ములు కట్టి, ముత్తైదువులతో కలసి పసుపుదంచుతూ 'సీతాకల్యాణవైభోగమే.. రామాకల్యాణవైభోగమే" అని పాడుతున్న ఆ శుభక్షణాన కలిగిన పులకింతకి ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
నిన్నమొన్నటిదాకా - వాడు తనకళ్ళకి పసివాడిలానే కనిపించేవాడు. అలాంటి రవి - కళ్యాణరాముడై, సీతతోకూడి, ఒక ఇంటివాడౌతున్నాడు!
ఈముంగిట్లోకి - కొత్తముగ్గులా - కోడలొస్తోంది. తన కుటుంబంతో కలుస్తోంది.. పారుతున్న ఒకనదిలోకి మరోకొత్తనదొచ్చి చేరుతున్నప్పటి.. కొత్తఅలల కళకళల సందడిలా వుంది ఆమె హృదయం సంతోషంతో!
ఇక ఈ ఇల్లు - సరికొత్త మమతల నిలయంగా మారుతుంది. ' ఆ భావనే గొప్ప ఆనందాన్నిస్తోంది. మమతల మాధుర్యం అంతా సంసారజీవనయానంలోనే వుంటుంది. అడుగడుగునా జీవితమంతా చిత్రమైనపులకింత అని వూరికే అన్నారామరి!
గోడలకి - రంగుసున్నాలు, గడపలకిలక్కలు, గచ్చుమీద మెరుస్తూ మెలికల ముగ్గులు.. గుమ్మాలకి మావిడితోరణాలు, రెయిలింగ్ని చుట్టుకుని నక్షత్రాల్ల మెరుస్తూ కలర్బల్బులతో.. ఇల్లంతా కళకళలాడిపోయింది.
కట్నాల బట్టలనీ, పెళ్ళికొడుకుబట్టలనీ, పందిట్లో పంచాల్సినగిఫ్ట్స్ అనీ..ఎన్నేసిసార్లు, ఎన్నెన్ని బజార్లు వెతికెతికి, షాపింగ్పూర్తి చేసిందనీ?
మరో చిత్రమేమిటంటే.. అప్పుడు కూతురి పెళ్ళికి చేసిన షాపింగ్ అంతాకూడా ఇప్పుడు కోడలికోసం చేసింది.
కొన్నవవన్నీ, జాగ్రత్తగా ఉమాదేవికి అప్పగించి, తను పందిట్లో అడిగినప్పుడు నలుగురిముందూ అందించాల్సిందిగా కోరింది.
ఆ క్షణంలో చూడాలి, ఊమాదేవి ఎంతదాచాలనుకున్నా దాగనివెలుగు- మొహంలో ఒక్కసారిగా అలా వెలిగిమాయమైంది.
రిసెప్షన్ హాల్ మాట్లాడుకుంది. మెనూ డిసైడ్చేసింది. తన స్నేహితురాలు కల్యాణిరాఘవన్తో వీణకచేరి ఏర్పాటు చేసింది. అంతా సిధ్ధం.
అప్పటికి - తాంబూలాలు పుచ్చుకుని, పదిరోజులౌతోంది.
అమ్మాయి తరఫువారినుంచి ఒక్కఫోనూ లేదు.
ఆవిడ పెళ్ళికూతురు తల్లికదా! ఎంత ఆత్రపడాలి? ' పెళ్ళెలా చేయమంటారు? ఏమేం వంటలు చేయించమంటారు? విడిదిలో మీ తరఫున వారికోసం ఎన్నివసతిగదులు ఏర్పాట్లు కావాలంటారు ' అంటూ తనని సంప్రదించాలని.. తమముందు చేతులు కట్టుకుని నుంచోవాలనే అనాగరికపు ఆలోచన్లేవీ తనకు లేవు.
కనీసం.. ఇలా చేద్దామనుకుంటున్నాం, మీకీ పధ్ధతి నచ్చిందా అని మాటవరసకైనా ఏదోఒకటి మాట్లడొచ్చుకదా? ఊహు.
ఆమె ధోరణి ఎలా వుందంటే.. నా కూతురూ ఇన్జినీర్చదివింది. నా కూతురు నీకు నచ్చిచేసుకుంటున్నావ్ కాబట్టి చేసుకో. ఈ ట్రాన్సాక్షన్ ఆంతవరకే’ అన్నట్టు నోటితో చెప్పకపోయినా ప్రవర్తనలో స్పష్టమౌతూనే వుంది.
అదేవిటో, ఆడవాళ్ళ మనసు భాషలు ఆడవాళ్లకే అర్ధమౌతాయి.
పోనీ, ఆవిడ సంగతి వొదిలేద్దాం. కనీసం కాబోయే కోడలైనా...కాసేపొచ్చి తనతో కలసిమెలసి మాట్లాడొచ్చు కదా..ఊహు. కబురుచేసినా రాలేదు.
తామందరూ ' కొత్త' అని బిడియపడుతోందంటే.. అదేమీ లేదె?..కొడుక్కి ఫోన్చేస్తునే వుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూనే వున్నారు. బయటకెళ్తూనే వున్నారు.
ఒక్కసారంటే ఒక్కసారైనా ఆమె ఇంటికి రాలేదు. 'అత్తయ్యా అని పిలవ్నూలేదు. పెళ్ళికాకముందే బాంధవ్యాలిలా వుంటే..ఇక అయ్యాక మాటేలా వుంటుంది?
తలచుకుంటే అన్నీ అసంతృప్తులే. భర్తతో ఎప్పుడైనా ఒకమాట అంటే... ఆయన పేపర్లోంచి తలతిప్పైనా చూసేవాడు కాదు. పైపెచ్చు, ఓనవ్వు నవ్వేవారు. ఆమెకు ఒళ్ళుమండేది, ఆ చిదానందస్వామిని అలా చూసేసరికి.ఇంకేమీ అన్లేనిదాన్లా ఓనిట్టూర్పు విడిచి వూర్కునేది.
మొత్తానికి పెళ్ళి జరిగిపోయింది. స్నాతకం నుంచి - అమ్మాయిని అప్పగించుకుని, గృహప్రవేశం చేయించి, ఆ మర్నాడు సత్యనారాయణవ్రతం అయ్యేదాకా. .ఊపిరిసలపని పనులతో శుభకార్యాన్ని సంతృప్తిగా విజయవంతంగా పూర్తిచేసుకుంది.
పెళ్ళికార్యక్రమాలన్నిట్లోనూ చురుకుగా, చొరవగా అన్నిముచ్చట్లు తీర్చుకోవడంలో.. వరునితల్లిగా కాకుండా... ఒక వియ్యపురాలిగా కాకుండా... ఆంధ్రుల తెలుగింటిఆ డపడుచులా.. మన వివాహసాంప్రదాయాలను ఆచరించడంలో గల ఆ కళావైభవాన్ని, చవి చూసింది. ఆ దివ్యానుభూతిని గుండెలనిండా నింపుకుంటూ, తృప్తి చెందింది.
తను చేయించిన నగలతో, ధగధగా మెరిసేపట్టు చీరలతో మెరిసిపోతున్న కోడల్ని తనివి దీరా చూసుకుంటూ వుంటే.. కోడలిమీద పుత్రికా వాత్సల్యం పెల్లుబికింది.
ఆ తర్వాత, పదహారు రోజుల పండగలోపే కొడుకూ కోడలూ అమెరికాకెళ్ళి పోయారు. ఆనాట్నుంచే పలకరింపులు లేవు. మీరెవరో మేమెవరమో అన్నట్టు వుండేది ఆవిడ తీరు.
పిల్లనిచ్చుకున్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తమకి అణిగిమణిగి వుండాలనేంత తక్కువ మనస్తత్వం కాదు. అందుకే, తనే ఒకటికి నాలుగుసార్లు ఫోన్చేసింది. "వదినగారూ! అమ్మాయి దూరం వెళ్ళిందని దిగులుపడకండి. మీకు బాధగా అనిపించినప్పుడల్లా ఇక్కడికిరండి. మేమంతా మీకు వున్నాం .." అంటూ నాలుగు ఊరడింపు మాటలు మాట్లాడింది. కలుపుకోవాలని!
లాభంలేదు. అవతల్నుంచి ఎలాటి ప్రతిస్పందనా లేదు.
శ్రావణమాసం.. కొత్తకోడలికి ముచ్చట తీర్చుకోకుంటే మన సూరుకోనంది. తెలిసినవాళ్ళు అమెరికా కెళ్తూవుంటే - కోడలికి ఓ డిజైనర్సారీ, మెడలోకి నల్లపూసల గొలుసు..కానుకగా పంపింది.
కొడుకెప్పుడు ఫోన్చేసినా..కోడలు కూడా తనతో మాట్లాడాలని ఉవ్విళ్ళురేది.
ఊహు. అలా జరిగేది కాదు. అది జరిగేపని కూడా కాదనీ తేలిపోయింది. "అమ్మాయికివ్వరా, ఫోన్" అని అంటే, ..వాడు ఒక్కక్షణం ఆలోచించి.."నిద్రపోతోందమ్మా" అనో, బాత్రూంలో వుందనో చెప్పడంతో!
క్రమక్రమంగా ఆమెలో దిగులు అధికమౌతూ వచ్చింది.
తనకి పెళ్ళైనప్పట్నుంచి జీవితం పరుగే అయింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు. ఇద్దరి పిల్లల స్కూల్ఫీజులు దగ్గర్నుంచి, కాలేజి ఫీజులు వరకూ అన్ని లెక్కలే. ఎన్ని తెల్లకాగితాలు చిరిగిపోయాయో లెక్కల పట్టీలతో. ఎన్ని నెలజీతాలు ఖాళీ అయిపోయాయో.. ఆర్ధికంగా అరమెట్టు చొప్పున పైకెదగడానికి.
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, ఇల్లు, ఇంటిముందు చెట్లు.. పెరటితోట అంటూ.. ఒక అనుబంధాన్ని పెంచుకున్నట్టె.. నాఇల్లు.. నావాళ్ళు అనే ఆత్మీయతానుబంధాల్ని కూడా మనసారా అనుభూతించాలనుకుంది. కానీ.. ఇదేమిటీ ఇలా జరుగుతోంది. కళ్లెంట నీళ్ళొచ్చాయి. కోడలి నిరాదరణా వైఖరి అత్తగార్లు భరించలేరనుకుంటా!సున్నితమనస్కులకి అదొక లోటుగానే వుంటుంది. పైకి చెప్పుకునేంత పెద్దకష్టంగా అనిపించకపోయిన.. లోలోనించి బయటకి పోలేని ఒక చింత అలానే వుంటుంది. అది ప్రతి అత్తగారికీ అనుభవైద్యకమే.
ఎప్పుడైనా దిగులుగా వున్నప్పుడు భుజంమీద చేతిస్పర్శకి తిరిగిచూసేది. ఆయన - పిచ్చిదానా అన్నట్టు చూసే జాలిచూపుకు, - చల్లగాలి తాకి నల్లమేఘం వర్షించినట్టు కన్నీళ్ళు పొంగుకొచ్చేవి.
ప్రేమతో కోప్పడేవాడు.
"శాంతా! నీ బాధ్యతని నువు సక్రమంగా నిర్వర్తించావు. అందుకు సంతోషించాలి. అంతేకానీ, ప్రతిఫలాన్ని ఆశిస్తే ఇదిగో ఇలానే నిరాశపడాల్సొస్తుంది. నువ్విలా రోజురోజుకీ కుంగిపోతూవుంటే, ఆపైన..నీకేదైనా ఐతే..ఈ ముసలివాణ్ని ఎవరు చూసుకుంటారు చెప్పు!" అని వోదారుస్తూనే, కళ్ళంట నీళ్లతో నవ్వుతున్న భర్తనిచూసి, తనూ నవ్వింది, కళ్ళు తుడుచుకుంటూ.
ఆ రోజునించీ..తను నవ్వడం నేర్చుకుంది. లోపలిబాధ లోపాలబాధగానే వుండిపోయింది.
ఎంత అణచుంచినా, అప్పుడప్పుడు నిప్పులా రగులుతూ..
వియ్యాల వారి సంగతి, కోడలి విషయం అన్నీమరుగునపడిపోయాయి. కాలక్రమేణా! తనదైన ప్రశాంత జీవనవిధానాన్ని అలవరచుకుంది.
ఆర్నెల్లక్రితం అనుకుంటా ఈ దంపతులొచ్చారు. వచ్చి, - కొడుకుపెళ్ళి కుదిరిందని శుభలేఖ ఇచ్చి వెళ్ళారు.
అమెరికానించి కోడలు వచ్చింది. నేరుగా తల్లిగారింట్లోనే దిగింది. అట్నుంచి అటే వెళ్ళిపోయింది. ఓసారి చుట్టంచూపుగా - తల్లితో కలసివచ్చి, ఓ అరగంట కూర్చుని వెళ్ళింది అంతే.
అది కూడా తను పట్టించుకోలేదు. ఆరోగ్యానికి మంచిదికాదని!
అదికాదు తను ఆలోచిస్తోంది. అలాటి వియ్యలవారికి ఇప్పుడింత హఠాత్తుగా తమని చూడాలనే ఆపేక్ష ఎలా కలిగిందిట? అంతకంటే విడ్డూరమేమిటంటే - వరసలాడుతూ, సరసంగా మాట్లాడటం కూడా ఎనిమిదో వింతగానే వుంది.
"వదినగారూ! సాయం చేయమంటారా?" అంటూ డ్రాయింగ్రూంలోంచి, వంటింట్లోకొచ్చి, కాఫీ ట్రే అందుకుంటూ.."నేను తీసుకొస్తాలేండి. పదండి" అంటూ మర్యాదపోయింది. చొరవగా వంటింటి తలుపులు మూసివస్తున్న ఉమాదేవిని చూస్తుంటే కళ్ళింతితయ్యాయి. .
వియ్యాలవారితో సత్సంబంధాలుండాలని, స్నేహితుల్లా కలసిమెలసిపోవాలని…అలాటి సత్సంబంధాలవల్ల పిల్లలకాపురాలు కూడా ఆనందంగా వుంటాయనీ, తల్లితర్వాత తల్లినని కోడలు తనగురించి అనుకునేలా ఆమెని ప్రేమించాలని.. ఒకప్పుడు తను కన్నకల.. ఇదిగో ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తోంది..
ముందుగదిలో మగాళ్ళిద్దరూ రాజకీయాలు మాట్లాడుకుంటూ..గోడలు దూకుతున్న నాయకుల గుణగణాలు చెప్పుకుంటూ..ఇంటికప్పెగిరిపోయేలా నవ్వుకుంటున్నారు.
ఉమాదేవి - వియ్యంకుడికి కాఫీకప్ అందిస్తూ.."అన్నయ్యగారూ కాఫీ తీసుకోండి. వంకలు పెట్టకండి. ఎందుకంటే. కాఫీ చేసింది నేనుకాదు. వదినగారు" అంటూ నవ్వింది.
"అది మా అక్కగారు చేసిన కాఫీనే. వేరే చెప్పాలా ఏమిటీ? నువ్వుచేస్తే ఇంత ఘుమఘుమలాడుతూ ఎలా వుంటుంది?" అంటూ ఘొల్లున నవ్వాడు వియ్యంకుడు వీరేశం.
శాంత ముఖం వెలిగిపోయింది ఒక్కసారిగా.
"అదేమిటి, తమ్ముడుగారూ! అలా అంటారు మరదల్ని?" అంది వూరుకోలేక.
మాటల్లొ మధ్యాహ్నమైపోయింది.
భోజనాల సమయమౌతోంది. టిఫిన్చేయమంటేనే టైంలేదని తిరస్కరించేవారు, భోజనానికి వుండమంటే ఏమంటారో ఏమో! అందుకే, ఏమనాలో ఏమో తెలీక మౌనంగా వుండిపోయింది- శాంత.
"ఇకవెళ్దామా?" అని అడిగింది ఉమాదేవి భర్తని.
ఆయన అయిష్టంగా చూస్తున్నాడు..
మీరు కదలకపోతే, మీ అక్కయ్యగారు, వంటచేసేస్తానంటారు మరి మీఇష్టం." అంది ఆమే!
"అయ్యో! ఎంతమాట. వంట ఎంతలోకి చేస్తా! భోజనంచేసి వెళ్ళండి." అన్నారు దంపతులిద్దరూ ఒకేసారి.
"ఐతేపదండి. నేనూ సాయంచేస్తా.." అంటూ ముందుకురికింది ఉమ.
తలమునకలయ్యే ఆశ్చర్యానందాలతో వంటమొదలుపెట్టింది శాంత.
వియ్యపురాలి ప్రవర్తనలో చాలామార్పు కనిపిస్తోంది. మనిషిలో అప్పటికీ ఇప్పటికీ ఎంతతేడా వచ్చిందంటే.. కర్రలా నిఠారుగా వుండేమనిషి, గంజితీసేసిన కాటన్వస్త్రంలా అయిపోయింది. ఔనేం?
ఒకప్పుడు కాలుమీద కాలేసుకుని, చెప్పులకాళ్ళు వూచుకుంటూ కూర్చునే విధానం దగ్గర్నుంచి, నడుస్తున్నప్పటి ప్రతికదలికలోనూ ఒకనెమ్మదితనం కనిపిస్తోంది. ఇదివరకులా హళ్ళూపెళ్ళు తనంలేదు. మాటల్లొ కరకుతనం ఎగిరిపోయింది.
అదీ కాకుండా.. ' తనకు వియ్యపురాలి మంచితనం, సహృదయత తెలిసొచ్చినదానిలా.. తనుచేసిన పొరబాటుని సరిదిద్దుకునేందుకు తనదగ్గర ఒక అవకాశాన్ని తీసుకోవడం కోసం వచ్చినదాన్లా ఆమెధోరణి స్పష్టంగా ద్యోతకమౌతోంది- శాంతకి!
వియ్యపురాళ్ళిద్దరూ కలసి - రెండుస్టవ్వుల మీద రెండుకుక్కర్లు ఎక్కించారు. అవి తెగవిజిల్స్వేసేస్తున్నాయి.
ఉమాదేవి బంగాళదుంపలు తరిగిచ్చేలోపు, శాంత సేమియా వేయించి పాయసం చేసేసింది.
క్షణాల్లో రోటిపచ్చడి - మిక్సీలో నలుగుతూ,సాంబారులో నేతిపోపు ఘుమాయిస్తూ.....వడియాలు, అప్పడాలు టేబులమీద నోరూరిస్తూ వుంటే..
ఆ నలుగురూ..కబుర్లు చెప్పుకుంటూ..నవ్వుకుంటూ..తుళ్ళుకుంటూ..భోజనమారగించారు.
"అక్కగారి చేతి భోజనం.. అమ్మని తలపించింది" అంటున్న వియ్యంకుని మాటలకి శాంతమనసు ఉప్పొంగిపోయింది.
కాసేపు విశ్రమించి, సాయంత్రం నాలుగయ్యక, టీ సేవించి వెళ్ళిపోవడానికి బయల్దేరారు ఇద్దరు.
'ఇంకొంచెంసేపు వుంటే బాగుణ్ను' అనుకుంది శాంత.
ఇంతకీ వీళ్ళెందుకొచ్చారు అనే సందేహానికి సమాధానంగా "మీకసలు విషయం చెప్పనేలేదు కదూ? మనం నలుగురం కలసి అమెరికాకు ప్లాన్చేద్దాం బావగారూ! మా అబ్బాయిదగ్గర కొన్నాళ్ళు, మీఅబ్బాయి దగ్గరకొన్నాళ్ళు, అలాగే మన ఆడపిల్లల దగ్గరకూడా మరికొన్నాళ్ళు సరదాగా గడిపివద్దాం.. ఏమంటారు అక్కయ్యగారూ?" అని అడుగుతున్నాడు వియ్యంకుడు.
"వదినగారూ. ప్లీజ్కాదనకండి. మన పిల్లలకి కూడా పెద్దవాళ్ళ ప్రేమలు, రాకపోకల విలువలు తెలియాలి. మీదారిన మీరు మాదారిన మేము వెళ్ళిరావొచ్చు. కాని అందులో అందమేముంటుంది? మనబంధం పిల్లలూ అర్ధంచేసుకోవాలంటే వాళ్ళకి – కథలు చెప్పడంకంటే , కలిసి కనిపిస్తేనే మంచింది. కుటుంబ ఐక్యత గురించి స్పీచ్లిఇవ్వడం కంటే…చేసి చూపించడమే సులువైన మార్గంకాదూ?" అంటూ చేయిపుచ్చుకుని అడుగుతున్న ఉమాదేవి వైపు ఆనందంగా చూసింది శాంత.
వాళ్ళు వెళ్ళిపోయాక, . "ఇదేమిటీ వీళ్లిలా హఠాత్తుగా మారిపోయారు?" అని అడిగాడు మాధవరావు - భార్యని.
ఆమెకీ మొదట అర్ధంకాలేదు. కానీ ఆలోచించగ, ఆలోచించగా.. మెల్లమెల్లగా.. ఏదోలీలగా అవగతమవసాగింది.
నిజానికి, జరిగిందేమిటంటే ఉమాదేవికి కోడలివైపు వారితో ఎదురైన చేదుఅనుభవాలే - ఆమెకి గుణపాఠాలు నేర్పాయి.
' తనదాకా వస్తేగానీ తెలీదు ' అనివూరకే అన్నారా పెద్దలు!
'నా కూతురూ చదివింది, నాకూతురూ సంపాదిస్తోంది.. నేను తక్కువేమిటీ? మర్యాదలంటూ, మన్నంటూ నేనువాళ్ళకి వొదిగి వుండటమేమిటీ? నాన్సెన్స్..' అని కొట్టిపడేసిన ఉమాదేవికి - ఆవిడకంటే మరోనాలుగాకులు ఎక్కువే చదివిన వియ్యపురాలు దొరికింది.
దాంతో వులిక్కిపడ్డట్టైంది మనిషి. తను ఎక్కణ్నుంచి తప్పుదిద్దుకుంటే, ఎక్కడపడ్డ చిక్కుముడి విడుతుందో బాగా తెలుసుకుంది
డబ్బు, హోదా, ఆస్థి అంతస్తు – వీటినీడలో మనిషికి ఆర్ధికబలం వస్తుంది. కానీ, కుటుంబంలో పంచుకుని పెంచుకునే ఆత్మీయతానుబంధాలు, మమకారమాధుర్యాలు..ఇచ్చిపుచ్చుకునే గౌరవమర్యాదలవల్ల – హృదయానందం కలుగుతుంది.
ఆ ఆనందం ఆత్మతృప్తిని కలగచేస్తుంది. సంసారంలో మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.
అదే కరువైనప్పుడు..అన్నివైభవాలూ శూన్యంలానే వెల్తిగా, బ్రతుకంతా బాధగా వుంటుంది.
ప్రస్తుతం ఉమాదేవి పరిస్థితి అదే!
భర్తసందేహానికి సమాధానంగా - " అవును మరిఆవిడకీ కోడలొచ్చి, ఆర్నెల్లవ్వలేదూ?" అంది నర్మగర్భంగా నవ్వుతూ!
అర్ధమైందోలేదోకానీ, ఆయనా నవ్వేసి, పేపరందుకున్నాడు.
****
"ఒరేయి, అన్నయ్యా! అమ్మా, నాన్నా, మీ అత్తగారూ, మావగారూ కలసి అమెరికాకొస్తున్నారుట. పనిలోపని, మీ బావమరిదికి కూడా చెప్పు. వాళ్ళఅత్తగార్నీ మావగార్నీ కూడా పిలవమని. అలాగే - మా అత్తగారికీ, మావగారికి కూడా ఆటైంకి అమెరికాకి రమ్మని చెబుతాం. వాళ్ళని ఈ నాలుగురాష్ట్రాలు తిప్పినట్టూ వుంటుంది.. ఆపైన మనమందరమూ అందరిళ్లలోనూ కల్సుకున్నట్టూ వుంటుంది. ఇప్పుడెలాగూ పిల్లలకి సెలవులేకదా..వాళ్ళు ఎంజాయి చేస్తారు. పెద్దవాళ్ళు మనందరిళ్ళల్లో తలారెండునెలలూ వుండి వెళ్తారు. ఇలా అయినా, మనందరం కలసి ' ఫామిలీ రీయూనియన్పార్టీలు ' చేసుకోవచ్చు. ఏమంటావ్?" అంటూ అడిగింది సుధ – తమ్ముణ్ణి.
"హమ్మో! ఇంతమంది వియ్యాలవారు కలుసుకుంటే... ఇక ఇల్లెలా వుంటుందంటావ్?" అల్లరిగా అడిగాడు రవి.
" వియ్యాలవారి విందులతో, సంబరాల చిందులతో కళకళలాడుతూ.. ఈ వసంతం భలే బావుంటుందిలే... రంగులమయం గా ”అంటూ వూరించింది.
"బ్రహ్మాండంగా వుంది. ఈ ఐడియా మన జీవితాలనే మార్చేసేంత అద్భుతంగా వుంది. అంటే, - ఈసారి మనకి వసంతం ఆర్నెల్లన్నమాట! గుడ్..గూడ్! అయాంవెరీ ఎగ్జయిటెడ్... ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నా " " అన్నాడు.
"సేం హియర్.." అంటూ హాయిగా నవ్వేసింది సుధ – శాంతకూతురు.
నిజమే, మరి. ఎవరింట్లో వారం అందరమూ – ఎప్పుడూ వుంటూనేవుంటాం. అందులో ప్రత్యేకతేముంది?
అందరూ కలసి ఒక్కటిగా ఎప్పుడైనా కలుసుకున్నప్పుడే కదూ నిజమైన వసంతం!
******
No comments:
Post a Comment