అచ్చంగా తెలుగు (బాలీవుడ్) కథానాయిక – వహీదా రెహ్మాన్
- ఆచార్య చాణక్య
" ఏరువాక సాగారోరన్నో చిన్నన్న" అంటూ ఆమె వేసిన చిందు... ఎన్ని ఏళ్లైనా తెలుగువారి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందానికే అందంగా... అద్భుత నటనాపటిమతో... అఖిలభారత ప్రేక్షక హృదయాల్లో కలకాలం గుర్తుండిపోయే వెండితెర వెన్నెల వహీదా రెహ్మాన్. కంటిచూపుతో కనకవర్షం కురిపించే అభినయ కెరటం. ఎన్నో పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి నటించి బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ అభినయ సామ్రాజ్ఞి వహీదా రెహ్మాన్.
అపురూప అభినయం ఆమె సొంతం. ప్యాసా, కాగజ్ కేపూల్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్, నీల్ కమల్ వంటి చిత్రాల్లో ఆమెనటన అద్వితీయం, అనితర సాధ్యం. ఆడవాళ్లు అసూయ పడే అందంతో, విశిష్ట నటనా పటిమతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన ఆ వెండితెర వెన్నెల... వహీదా రెహ్మాన్. మన తెలుగింటి ఆడపడుచు. హైదరాబాద్ లోని ఓ సంప్రదాయ ముస్లిం కుటుంబంలో 1936 మే 14న వహీదా జన్మించింది. ఆమె తండ్రి జిల్లా మేజిస్ట్రేట్. వృత్తిరీత్యా విజయవాడలో స్థిరపడ్డారు. వహీదా చదువు అక్కడే కొనసాగింది. చాలా మంది తారల్లాగే వహీదా సైతం డాక్టరు కావాలనుకుని యాక్టర్ అయ్యారు.
1955 లో వచ్చిన జయసింహా ద్వారా వహీదారెహ్మాన్ తెరంగేట్రం జరిగింది. " రోజులు మారాయి" చిత్రంలోని ఏరువాక సాగారోరన్నో చిన్నన్న పాటలో ఆమె అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ రెండు సినిమాలతోనే హిందీ నటుడు గురుదత్ దృష్టినాకర్షించింది వహీదా. ఆమెను ముంబాయి పిలిపించి సినిమా అవకాశం ఇప్పించారాయన. అక్కణ్నుంచి వహీదా సినీ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. సీఐడీ చిత్రంలో ఓ సాధారణ పాత్రలో కనిపించిన ఆమె... ప్యాసా చిత్రంతో కథానాయికగా మారింది. ఆతర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కాగజ్ కీపూల్, చౌదవీ కాచాంద్, సాహెబ్ బీబీ ఔర్ గులామ్ లాంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
అందానికే అందం అన్నట్టుండే ఈ అభినయ సామ్రాజ్ఞిని ఎన్నో అవార్డులు వరించాయి. 1994లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుతో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఆమెను వరించాయి. అద్వితీయ నటనతో అఖిలభారత ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వహీదాకు శుభాకాంక్షలు....
No comments:
Post a Comment