వెన్నెల యానం-2 - అచ్చంగా తెలుగు

వెన్నెల యానం-2

Share This

వెన్నెల యానం-2 

భావరాజు పద్మిని


( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... చంద్రికను తను రెండవసారి ఎప్పుడు కలిసానో చెబుతుంటాడు శరత్... ఇక చదవండి...)
నర్సాపురం గోదావరి ఒడ్డున ఉన్న వై.ఎన్ కాలేజీకి 75 ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రతిష్టాత్మకమైన ఆ కళాశాలకు చుట్టుప్రక్కల ఊర్ల నుంచి ఎర్ర బస్సులో వస్తుంటారు చాలామంది! నర్సాపురం వద్దకల సీతారామపురంలో మా దూరపు చుట్టాలు ఉండడంతో, వారి ఇంటి డాబా పైగది నాకు ఇప్పించి,  నన్ను వారి పర్యవేక్షణలో ఉంచింది మా అమ్మ. చాలా మంది విద్యార్ధులు అక్కడే ఉంటూ ఉండడంతో, దారి పొడుగునా, ఎంతో మంది సీనియర్లు బస్సు ఎక్కుతూనే ఉంటారు...
మన హాబీ లు అన్నీ చెప్పేస్తే, సీనియర్ లు ఆడించి, పాడించి, తాటాకులు కట్టేస్తారని, ఏమీ రావని చెప్పమంది మా అమ్మ. నేనూ అలాగే అమాయకుడిలా నటిస్తూ నెట్టుకు వస్తున్నా అంతవరకూ.
అప్పటికి క్లాసులు మొదలై నెల రోజులైనా, సీనియర్ల రాగింగ్ తగ్గలేదు. అద్దెకు ఉండే గది దగ్గరినుంచి, కాలేజీ గుమ్మం దాకా, ఎక్కడ కనిపిస్తే, అక్కడ రాగింగ్ పేరుతో వాయించేస్తున్నారు. ఈ రోజు ఎవడికి ఆహారమౌతానో, అనుకుంటూ బెదురుగా నిల్చుని, చూస్తుండగానే వచ్చాడు, జిగురు జోగారావు. పట్టుకుంటే చాలు, తుమ్మ జిగురులా వదలని అతనికి, మేం తగిలించిన ఇంటిపేరు అది. ఇంతలోనే బస్సు వచ్చింది. వెనుక కిక్కిరిసి ఉండడంతో, ముందు వైపునుంచి మేమిద్దరం ఎక్కి, డ్రైవర్ ప్రక్కనే నిలబడ్డాము.
‘గుడ్ మార్నింగ్ సర్...’ అన్నాను.
‘ఆ, ఏం ఈ పొద్దు హుశారున్నవ్ తీయ్. మంచి పాట గిట్ల పాడు,’ అన్నాడు జోగి. అతనికి వత్తాసుగా బస్సు డ్రైవర్ కూడా, ‘ బాబ్బాబూ, ఈ స్టీరింగ్ ముందు కూర్చుని, గంట పైనయ్యింది. నాకు పాటలంటే చచ్చేంత ఇష్టం, పాడు బాబూ, పాడు,’ అన్నాడు.
‘నాకు పాటలు పాడడం రాదు సర్...’ అన్నాను వినయంగా.
‘ఓయ్, ఏం మాట్లాడుతున్నవ్, పాట పాడకుంటే మంచిగుండదు బిడ్డా ! ఎట్లోస్తే అట్ల పాడు...’ అన్నాడు దబాయింపుగా.
‘అనుకున్నా, వీడేదో మెలిక పెడతాడని, పాట కావాలా, ఉండు నీ పని చెప్తా, ‘ అనుకుని... ముక్కు పట్టుకుని, హిమేష్ రేషమ్య ను తల్చుకుని మొదలుపెట్టాను...
“ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు... వేదన శ్రుతిగా రోదన లయగా సాగే గానమిది...” పాపం డ్రైవర్ కన్నీళ్లు కార్చసాగాడు.
జోగికి తిక్కరేగింది. ‘ఏం పాట బై ఇది... పాటంటే ఎట్లుండాలి, ఒంట్లోంచి ముళ్ళు లేవాలి... వేరే పాట పాడు...’
‘నిను వీడని నీడను నేనే, కలగా మిగిలే కధ నేనే...’ అంటూ రెండు మూడు దెయ్యం కూతలు కూసాను.
‘హమ్మో, నాకసలే దెయ్యాలంటే భయం, నేను బస్సు దిగి పోతా ! ‘ అన్నాడు డ్రైవర్.
‘నువ్వుండు భాయ్, మంచి ఐటెం సాంగ్ గిట్ల పాడిస్తా...’ అని డ్రైవర్ ని ఓదార్చాడు జోగి. నా వంక తిరిగి, బ్రహ్మానందం లాగా కళ్ళు ఎగరేసాడు.
‘ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా... అందుకేగా నీవు చేసే పూజలన్నీ తపోధనా...’అని విప్రనారాయణ సినిమా పాట పాడసాగాను. ఎక్కడా శృతి, లయ లేకుండా జాగ్రత్త పడ్డాను.
‘ఇది ఐటెం సాంగ్ రా బై ! కనీసం రాసినోడికి తెల్సంటావా ! ఏం పరేషాన్ జెయ్యబట్టినావ్... మంచి ఊపున్న పాట పాడరా...’
‘మాయమర్మం ఎరగనోళ్లం, మట్టిపిసికి బతికేటోళ్లం... ఊరిదేవతైన నిన్నే ఊపిరిగా కొలిచేటోళ్లం ... గండవరం నెయ్యి పోసి గారెలొండి తెచ్చినాము... బుజ్జిముండ కల్లుకుండ వెంటబెట్టుకొచ్చినాము... దండాలు దండాలు అమ్మోరు తల్లో... శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో... పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో’
“ఆపు, ఏంటా పాట !”
“సర్... ఇందులో అంతా పూనకంతో ఊగుతూ పాట పాడతారు... మీకు ఊపున్న పాట కావాలి, అన్నారుగా... అలా చూడండి, పాట నచ్చి, డ్రైవర్ కూడా ఊగుతున్నారు... “ అన్నాను.
అంతలో అప్పటివరకూ ఉగ్గబట్టి ఆపుకున్న నవ్వుకి అడ్డుగోడ తీసేసినట్టు, బస్సులో ఎక్కడి నుంచో తెరలు తెరలుగా నవ్వు... అలలు అలలుగా నవ్వు... మండువేసవిలో తొలకరి జల్లులా ఇంపుగా ఉంది... గుప్పెడు మల్లెలు దోసిలితో గుమ్మరించినట్టు సమ్మోహనంగా ఉంది... నన్ను చుట్టేస్తున్నట్టు ఉంది... బస్సు లో అంతా ఆ నవ్వు వినవచ్చిన వైపుకు చూడసాగారు. నేనూ వెనక్కి తిరిగి చూసాను ... అంతే, ఒక్క క్షణం నా గుండాగిపోయినట్లు అనిపించింది.
“హమ్మయ్యోయ్, కరణం మల్లేశ్వరీ, ప్రక్కన ఉన్నావిడ కూడా ఈమె లాగే ఉంది, ఆ కోమలి తల్లే అయ్యుంటుంది... ” అనుకున్నాను మనసులో.
అప్పటికి మధ్యలో దిగిన వాళ్ళతో రద్దీ కాస్త తగ్గడంతో, వెనుకనుంచి ఎలాగో దూరి వచ్చిన కండక్టర్ ‘టికెట్...’ అన్నాడు.
‘ నర్సాపురం కాలేజి కి ‘ రెండు టికెట్ లు ఇవ్వండి, అన్నాను, జోగి గాడిది కూడా కలిపి.
‘బాబూ, ఇదిగో బాబూ... ‘ పిల్చింది సీనియర్ మల్లేశ్వరీ.
నన్ను కానట్టు ఎక్కడో చూడసాగాను నేను. అందమైన అమ్మాయి తల్లి పిలవడంతో ‘చెప్పుండ్రి...’ అంటూ వెళ్ళాడు జోగి.
‘బాబూ, మీరూ వై.ఎన్ కాలేజీ పిల్లలా... మా అమ్మాయి థర్డ్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే, ఇవాళే MCA లో చేరేందుకు వచ్చింది. మొదటి రోజు కదా, కూడా జాగ్రత్తగా తీసుకెళ్తారా ?’
‘ఓహ్, తప్పకుండా ! నేను MCA సెకండ్ ఇయర్ ఆంటి. అట్లైతే మీ పాప నాకు జూనియర్ అన్నట్టు. ఓయ్, పేరేంది ?’ అన్నాడు జోగి దబాయింపుగా.
‘చంద్రిక.. ‘ అన్నావు నువ్వు, కళ్ళ వెంట నిప్పులు కురిపిస్తూ.
‘ఏంది గట్లజూస్తావ్... పక్కన అమ్మ ఉందని పరేషాన్ గాకు. సీనియర్ ను సర్ అని పిలవాలె . మేం జెప్పినట్టు జెయ్యాలి. ఏం మస్తుగున్నవ్. ఇప్పుడోచ్చినవ్ గాని, ఫ్రెషర్స్ పార్టీ ముందు వచ్చుంటే ఆడుకునేటోడిని. ఏదీ, ఒకసారి కోడిలా కూతబెట్టు...’ అన్నాడు జోగి. బిగుస్తున్న నీ పిడికిలి చూసాను నేను.
‘వద్దు సార్... మీరిలా రండి చెప్తా...’ అన్నాను నేను.
‘ఏందిరా ? సీనియర్ నే ఎదిరిస్తావ్ ? చమ్డాల్ దీస్త బిడ్డా...’ అంటూ నా మీదకొచ్చాడు జోగి.
‘కానీ, నీకివాళ దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టింది, ఇక ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు... ‘ అనుకుని, మిన్నకున్నాను.
‘పాపా, కోడిలా కుయ్... తర్వాత నక్కలా ఊళ పెట్టు... గాడిద  లాగా ఓండ్ర పెట్టు...’ అంటూ ముందుకు వచ్చాడు వాడు.
అంతే ! ఫాట్ మని నువ్ కొట్టిన దెబ్బ శబ్దం బస్సు అంతా ప్రతిధ్వనించింది. డ్రైవర్ బస్సు ఆపాడు, నేను బస్సు దిగి పారిపోయాను.... నన్ను తరుముతూ వెనుక మళ్ళీ నీ నవ్వు...
ఆ రోజు క్లాసు లో నిన్ను నువ్వు పరిచయం చేసుకుంటున్నప్పుడు, నువ్వు సీతారామపురం పెద్దరాజు గారి అమ్మాయివని,   బహుముఖప్రజ్ఞాశాలివని తెలుసుకున్నాను. లంచ్ బ్రేక్ లో నలుగురు సీనియర్లు అడగ్గా, నువ్వు పాడిన ‘తరలి రాద తనే వసంతం..’ అనే పాట కుడా నాకు  బాగా ఇష్టమైనదే ! అయినా... ఎక్కడో, నువ్వంటే ఉన్న భయం అలాగే ఉండిపోయింది.
కట్ చేస్తే .....
సీతారామపురం నిండా దట్టమైన మామిడి తోటలు... రూమ్ వద్ద ఉన్న ఒక చక్కటి తోటలో గున్నమావిచెట్టుకింద కూర్చుని, బుద్ధిగా చదువుకుంటున్నాను నేను... ఎక్కడినుంచో కమ్మటి కోకిల గానం, పక్షుల కలరవాలు ఆహ్లాదపరుస్తున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచో ఆర్తనాదాలు...
“పాపగారు, నన్నొగ్గెయ్యండమ్మా... ఏదో బుద్ది తక్కువై, కక్కుర్తి పడి ఈ పని చేసాను... పిల్లలు గలవాడ్ని , పిచ్చుక మీద మీ పిడికిలి ఎత్తకండమ్మా... పచ్చడైపోతా... “
“ఏరా, మా తోటలో కాసిన మామిడికాయలు దొంగతనంగా అమ్ముకుందామని చూస్తావా ? ఈ పెద్దరాజు గారి కూతురు, పది మందినైనా, ఒంటి చేత్తో మట్టి కరిపించేయ్ గలదు రోయ్ ... జాగ్రత్త !” తర్వాత తన్నుల శబ్దం వినవొచ్చాయి...
“ఓహో, ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ అన్నమాట... అయితే ఇంకెవరు కరణం మల్లేశ్వరే అయ్యుంటుంది...” మనసులో అనుకుంటూ ఉండగానే, నా కాళ్ళ దగ్గర వచ్చి పడ్డాడు సదరు శాల్తీ... అసలే కోపం మీద ఉన్నవేమో, పన్లోపనిగా నాకూ రెండు తగిలిస్తావని భయమేసి, చెట్టెక్కేసాను. అసలే కోపంగా ఉన్న నువ్వు నాతో...
“ఏయ్, చెట్టుదిగు ముందు, నన్ను చూస్తే చాలు పారిపోయి, బెదిరిపోతావే !”
“హమ్మో, నేను దిగను, నువ్ అందర్నీ కొడతావ్ ! నాకు నువ్వంటే భయం. అసలే మా అమ్మకి ఒక్కడే కొడుకుని...”
“నువ్వు చెట్టు దిగుతావా, లేక నన్ను ఈ కొమ్మ పట్టుకు విరవమంటావా ? చెప్పు...”
“వద్దు, నీ ప్రతాపం నాకు తెల్సుగా, అందుకే బుద్ధిగా శరణాగతి వెడుతున్నాను. చెట్టు దిగొస్తా కాని, నన్నేమీ చెయ్యనని నీ మీద ఒట్టేయ్ ...  !”
“ అలాగేలే దిగి రా !” అన్నావు నవ్వుతూ...
“ అమ్రీష్పురి మొగాంబో కుష్ హువా...” అన్నట్లుగా వినిపించి, నెమ్మదిగా ధైర్యం చేసి, దిగి వచ్చి నిల్చున్నా..
అప్పుడు నువ్వు చెప్పిన మాటలు.. నా మనసుమీద చెరగని బలమైన ముద్ర వేసాయి...
“చూడు, నేనేమీ రాక్షసిని కాదు. కాని, ‘ ధైర్యమే జీవనం... పిరికితనమే మరణం...’ అన్న వివేకానందుడి సూక్తిని మనసారా నమ్మిన దాన్ని. చూడు, పుట్టిన ప్రతివాడూ, ఎప్పుడో అప్పుడు చావాల్సిందే ! కాని, ఇలా అనుక్షణం భయంతో చచ్చే కంటే, నాలా ధైర్యంగా బ్రతికి ఒక్కసారే చావటం మేలు కదా, ఆలోచించు ! అణిగే గుణం నీకుంటే, ఈ లోకం నిన్ను అణగద్రొక్కుతూనే ఉంటుంది. భయపడే గుణం నీకుంటే, భయపెడుతుంది. అంటే, జీవితంలో అడుగడుగునా, నీ బలహీనతే ఎదుటి వాడి బలం అవుతుంది. ఇలాగైతే నీకంటూ స్వతంత్ర భావాలు లేకుండా, అందరి మాటలకూ గంగిరెద్దు లాగా తలూపుతూ బ్రతకాల్సిందే ! ఇతరుల మెప్పు కోసం నీ అభిరుచుల్ని, భావాల్ని అణుచుకుని ఉండాల్సిందే ! అలా నేనుండలేను. అందుకే, నేను అన్యాయాన్ని ప్రతిఘటిస్తాను, తిరగబడతాను. ఒక్కసారి తిరగబడి చూడు, లోకం నీకు సలాం కొట్టి, గులాం అవుతుంది. ఒక్కసారి బెదిరి పారిపోయి చూడు, నువ్వు లోకానికి గులాం అవుతావు. నీ జీవితం నువ్వు ఎలా దిద్దుకుంటావో నీ ఇష్టం !”
నేను మౌనంగా అక్కడినుంచీ నిష్క్రమించాను....
అప్పటి నుంచి, నేనెప్పుడూ భయపడలేదు. భయమే నన్ను చూసి భయపడేలా ఉండేవాడిని. అంతేకాదు, నీ మాటలతో ఎంతోమందికి ప్రేరణ కలిగించాను. నువ్వే బ్రతుకు బాటలో నా మార్గదీపికవి....  అంటూ ఆపి చంద్రిక వంక చూసాడు శరత్...
(సశేషం....)

No comments:

Post a Comment

Pages