అంతరాత్మ
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
నా అంతరాత్మ అంతర్ధానమైపోయింది
ఇంతకుముందు...
అన్యాయానికి కొమ్ము కాయబోతున్నపుడు ప్రశ్నిస్తూ
తప్పు చేస్తున్నప్పుడు నిలదీస్తూ
చీటికి మాటికి నన్ను అసహనానికి గురిచేసేది.
ప్రతిసారీ దాని నోరు నొక్కుతూ
పట్టించుకోవడం మానేశానని
మౌనం వహించిందనుకున్నాను.
కానీ,
మానవుడిగా ఉనికిని కోల్పోయి
క్రమంగా దానవత్వం వైపు మొగ్గుతున్నప్పుడు
మనో వికృతత్వం విశృంఖలత్వమవుతున్నప్పుడు కూడా
నన్ను ఎదురించకపోయేసరికి అనుమానమొచ్చింది
ఒక్క నాదే కాదు అందరి అంతరాత్మలు సామూహికంగా
ఎక్కడికో ఎగిరిపోయినట్టున్నాయి
లేకపోతే.... లోకంలో
ఇంత అన్యాయం, ఇన్ని దారుణాలా?
హవ్వ!
***
No comments:
Post a Comment