బలిమి సేయకురే పట్టి పెనఁగకురే
(అన్నమయ్య కీర్తనకు వివరణ )
డా. తాడేపల్లి పతంజలి
రేకు: 0326-4 సంపుటం: 11-154
బలిమి సేయకురే పట్టి పెనఁగకురే
ఒక భక్తుడు భగవంతుని రాకకోసం తల్లడిల్లుతున్నాడు. ఆయన ఎప్పుడూ తన దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు. కాని పరమాత్మ జీవునికి నిరంతర సాన్నిధ్యాన్ని అనుగ్రహించటంలేదు.కొంత కాలం స్వామి భక్తుని హృదయములోనే ఉన్నాడు.భక్తునితో ఆట లాడుకొన్నాడు. మెరిపించాడు. మురిపించాడు. కాని ఏమి జరిగిందో .. ఏమో ! జీవుని హృదయములోనుంచి దేవుడు తప్పుకొన్నాడు. ఇంద్రియాలనే జీవుని చెలికత్తెలు వేరే చోటికి వెళ్ళిన స్వామిని భక్తుడి దగ్గరకు తీసుకొచ్చారు.
సున్నలో సగభాగము జీవుడు. సగభాగము పరమాత్మ. కనుక పూర్ణత్వం సిద్ధించాలంటే తన అవసరం కూడా దేవునికి కూడా ఉందని భక్తుడు- స్వామిని చూసి అలిగాడు.దేవుడిని బలవంతంగా తీసుకొచ్చినఇంద్రియాలతో మాట్లాడుతూ ఆయన దోవన అయన్ని పోనివ్వండే అంటూ నిష్ఠూరాలతో స్వామివారిపై ప్రేమను వ్యంగ్యంగా తెలుపుతున్నాడు. జీవున్ని నాయికగా మార్చి అన్నమయ్య వలపుల
ఊయెలలో- ఆధ్యాత్మికతను - ఈ కీర్తనలో మన మనస్సుల దగ్గరికి చేరేటట్లు మలిచాడు.
పల్లవి
బలిమి సేయకురే పట్టి పెనఁగకురే పొలసి పో వచ్చినాఁడు పోనియ్యఁ గదరే
1. కొసరే మా మాటలు కూరిములో తేటలు నసలు నేఁ డిం పౌనా నాడే కాక వస మైనాఁ డెవ్వతెకో వలసీ నొల్లము లీడఁ బొసఁగీనా వాని కట్టె పోనియ్యఁ గదరే
2. రవ్వల మా పిలుపులు రాయిడించే సొలపులు నవ్వులు నేఁ డిం పౌనా నాఁడే కాక యెవ్వ తాస యిచ్చినదో యింతకు నేరఁడు తొల్లి పువ్వువంటిది వలపు పోనియ్యఁ గదరే
3.తనివోనిరతులును తలపోఁతమతులును ననుపు నే డిం పౌనా నాఁడే కాక యెనసెను శ్రీవెంకటేశుఁడింత సేసి నన్ను పొనిగి పోయినసుద్ది పోనియ్యఁ గదరే
పల్లవి
ఆ వేంకటేశుడు నాదగ్గరికి రానంటుంటే – ఎందుకు – ఊరికే బలవంత పెడతారు?! బలవంత పెట్టకండి. ఆయన చేతులు కాళ్లు పట్టుకొని నా దగ్గరకు వచ్చేటట్లు గుంజకండి. అక్కడక్కడా తిరుగుతూ(=పొలసిపోవు) ఏదో తప్పనిసరియైనట్లు ఆ మహాను భావుడు వచ్చాడు. ఆయన మనస్సులో ప్రేమ లేనప్పుడు బలవంతం దేనికి? ఆయన ఇష్టం వచ్చిన చోటికి పోనివ్వండి.
1. మా మాటలు ఒకనాడు వారికి ముద్దులొలికేవి. మా ప్రేమలో నిర్మలత్వాలు, ప్రసన్నత్వాలు కనిపించేవి.ఒకనాడు నేను పదే పదే మాట్లాడితే ముద్దులు. నేడు నా మాటలు నసలు. ఆనాడు నాచేష్టలు, మాటలు ఇష్టముగా ఉండేవి కాని, నేడు ఇష్ట మౌతాయా?ఎవతెకో ఆ వేంకటేశుడు స్వాధీనమయ్యాడు. నేనన్నా , ఈ ప్రదేశము పేరు చెప్పినా అయిష్టాలు.(= వలసీ నొల్లములు)మీరెంత చెప్పినా వాడికి నాకు అనుకూలిస్తుందటే! వాడిని అలాగే (= అట్టె) పోనివ్వండే. 2. మాపిలుపులలోని వజ్రాలు, అల్లరి చేసే (=రాయిడించే )సొగసులు, నవ్వులు ఒకనాడు ఇష్టముగా ఉండేవి కాని, నేడు ఇష్ట మౌతాయా?ఏ మహా తల్లి ఏమి ఆశ పెట్టిందో కాని- ఇలా నా దగ్గరకు రాకపోవడమనే చేష్టలు ఇంతకుముందు లేవు. సరేకాని- వలపు - పువ్వు లాంటిది అంటారు కదా ! నా మీద ఉండే ప్రేమ అనే పువ్వు వాడిపోయిందేమో ! ఎంతకని బతిమిలాడతారు? పోనియ్యండే.( జీవ నాయిక తనని తాను నా అనకుండా రాజ హోదాలో మా అంటోంది.అల్లరి చేసే సొగసులగురించి వివరణ చేస్తే అన్నమయ్య కవిత్వంలోని మాధుర్యము అనుభవించలేము. ఆ అల్లరి చేసే సొగసులు ఏమిటో, వాటి కార్యక్రమమేమిటో ఎవరికి వారు ఊహించుకొంటే ఆ అనందంలొ కవికి జోహార్ అంటారు. )
- పద్మాసన, నాగపాశ, లతావేష్ట, నరసింహ, విపరీత, క్షుబ్ధ, ధేనుక, ఉత్కంఠ, సింహాసన, రతి నాగ, విద్యాధర - ఇలా ఒకనాడు ఎన్నో తృప్తి పడని రతులు - సంభోగ బంధాలు మా మధ్యఉండేవి! ఒకరి మనస్సులో ఇంకొకరి గురించి ఎన్నో ఆలోచనలు ఉండేవి. ఆ ప్రేమ( = ననుపు) ఒకనాడు ఇష్టముగా ఉండేదికాని,నేడుఇష్టమౌతుందా? ఇంతచేసి ఆ వేంకటేశుడు నా వల్ల ప్రకాశించాడు. అయినా ఇప్పుడు ఈ మాట ఎవరు నమ్ముతారే. అదంతా శూన్యమయిన మాట. పోనివ్వండే.
ఉపశ్రుతి
నావల్లే నీకు కీర్తి వచ్చిందని , నేను లేకపోతే నీకు కీర్తి ఎక్కడుందని స్వామిని దబాయించిన అన్నమయ్య తనవల్లనే స్వామికి ప్రకాశము వచ్చిందని ఈ కీర్తనలో చెబుతున్నాడు. అస్తు.
--------
No comments:
Post a Comment