రుద్రాణి రహస్యం
వేద సూర్య
అది ఒక పున్నమి రోజు.... తలకోన దగ్గర ఒక గ్రామంలో సంతను ముగించుకున్న కోయ గుంపు, తమ గూడేనికి ఎర్రబస్సులో తిరుగు ప్రయాణం అవుతున్నారు.... దారిలో ఇద్దరు విదేశీయులు బస్ ఎక్కి, రుద్రాణి కోనకు టికెట్లు ఇమ్మని అడిగారు. “రుద్రాణి కోన”, పేరు వినగానే బస్ లో ఉన్న అందరూ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూసారు. ఆశ్చర్యం కంటే భయం ఎక్కువగా కనిపించటంతో, విదేశీయులు ఇద్దరూ “మీ భయానికి కారణం ఏంటి ?” అని అడిగారు. “ఆ కోన అమ్మ చోటు, ఆ చోటుకి చీకటి వేళ , అది కూడా పున్నమి వేళ వెళ్తే అమ్మ కోపం చూపిస్తుంది , కోన చుట్టూ పెద్దసింహం , అయిదు తలల కాల సర్పం కాపు కాస్తూ ఉంటాయి. ఇప్పటివరకూ రాత్రిళ్ళు అక్కడికి వెళ్ళినవాళ్ళు తిరిగి రాలేదు,” అన్నారు వాళ్ళు. అది విన్న ఇద్దరూ, అవన్నీ కట్టు కధలని కొట్టి పారేసి, రుద్రాణి కోన అని కనిపిస్తున్న రాయి దగ్గర దిగారు. వారి వెంట తెచ్చుకున్న ఐ ప్యాడ్ లాంటి సాధనం లో GPS ఆన్ చేసుకుని , చేతిలో ఉన్న మ్యాప్లో ప్రదేశాన్ని పరీక్షించుకుని, వెళ్ళాల్సిన దారిని నిర్ధారించుకుని పదునైన ఆయుధాలతో గుబురుగా ఉన్న పొదలను దారి చేసుకుంటూ వెళుతున్నారు. వారు పొదల నుండి లోపలికి వెళ్ళగానే, పెద్ద కాల సర్పం రుద్రాణి కోన రాయిని చుట్టుకుంది. వారు దారి చేసుకున్న పొదలు, తిరిగి ఆ దారిని వారి వెనకగా మూసి వేస్తున్నాయని తెలియని ఇద్దరూ, కోన లోపలికి వెళుతున్నారు... అప్పటివరకు ఆకాశంలో మేఘాల చాటుగా నున్న పున్నమి చంద్రుడు, మేఘాలు తెరలిపోవటంతో వెలుగులు చిమ్ముతున్నాడు. గాలి ఉదృతంగా వీచటం మొదలయింది. ఒక్కసారిగా కోన అంతటా ప్రకాశ వంతమైన వెలుగు ప్రసరించసాగింది. గజ్జెల చప్పుడు, ఘంటానాదం శబ్దాలు చిన్నగా మొదలయ్యి, కోన అంతటా ప్రతిధ్వనిస్తూ ఉంది. సింహం గాండ్రింపులతో కోన అంతా దద్దరిల్లిపోతోంది. గూడెం నుండి కోనలో వెలుగును చూసిన కోయ వాళ్ళు నమస్కారం చేసుకుని, సింహం గాండ్రింపుకి భయంతో ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. ఆ మార్పులు అర్ధం కాని విదేశీయులు, వెంట తెచ్చుకున్న ఆయుధాలను చేతుల్లోకి తీసుకుని ముందుకు వెళుతున్నారు. మెరుపులా ఒక వెలుగు ఇద్దరిపై దాడి చేయటంతో క్షణంలో ఇద్దరూ బూడిదయిపోయారు. విదేశీయులు ఒక చోట పార్క్ చేసిన వ్యాన్ ను కాలసర్పం బూడిద చేసేసింది. కోనలో జరిగిన బీభత్సానికి గుర్తుగా పడి ఉన్న ట్యాబ్ ని చూసిన కోయ గుంపు, ఆ సాధనాన్ని వారు ‘అయ్యోరు’గా పిలిచే యోగి ముందర పెడతారు. యోగముద్రలో ధ్యానం చేసుకుంటున్న అయ్యోరు కళ్ళు తెరచి అమ్మ వారిని ప్రార్ధించి , ఆ కోన నియమాన్ని చెదరగోట్టేది సాధనమైనా, మనిషైనా మసి అయిపోవలిసిందే, అంటూ సాధనాన్ని మసి చేసేస్తాడు . కోయగుంపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్న అయ్యోరికి మొక్కి వెళ్ళిపోయారు. *********** జరుగుతున్నదంతా ఒక ఖరీదయిన కాన్ఫరెన్స్ రూంలో ప్రొజెక్టర్ స్క్రీన్ లో చూస్తున్న ఫ్రెడ్రిక్ , ప్రొజెక్టర్ పై బ్లాంక్ స్క్రీన్ రావటంతో, ఆశ్చర్యపోతాడు. అప్పటికి అది పదవ సారని, తర తరాలుగా ఆ కోన లో దాగి ఉన్న సంపదను సొంతం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమవుతున్నారని విసుక్కుంటూ, స్క్రీన్ పైకి చేతిలోని వైన్ గ్లాస్ ను విసిరి కొడతాడు. అతని బాధను అర్ధం చేసుకున్న ,అతని బిజినెస్ పార్టనర్ విలియమ్స్, ఫ్రెడ్రిక్ వద్దకు వచ్చాడు. మనుషుల మేధకు అందని ఇటువంటి విషయాలు క్షుద్రపూజలు చేసేవారు అవలీలగా చెప్పగలరు, అంటాడు. ఫ్రెడ్రిక్ కు ఇష్టం లేకపోయినా బ్లాక్ మ్యాజిక్ చేసే అత్రిక దగ్గరకి వెళదామని సలహా ఇచ్చాడు విలియమ్స్. మరొక మార్గం కనిపించని ఫ్రెడ్రిక్ అత్రిక దగ్గరకి వెళ్ళాడు. నడివయసులో ఉన్న అత్రిక మామూలు స్త్రీలాగే ఆహార్యం ధరించి ఉంది, ఆమెలో మంత్రగత్తె ఛాయలు ఎంతమాత్రం లేవు. అతిసాధారణంగా కనిపించే అత్రిక అసలు తమకు సాయం చెయ్యగలదా అని సందేహించాడు ఫ్రెడ్రిక్. వాళ్ళనుంచి విషయం తెలుసుకున్న అత్రిక, తన గదిలో ఒక బల్లపై అమర్చి ఉన్న నీలి రంగు క్రిస్టల్ బాల్పై, చేతులు తిప్పి, మంత్రాలు జపిస్తూ, ఆ రహస్యాన్ని చూసేందుకు ప్రయత్నిస్తుంది. కాని, ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆమెకు ఎటువంటి సమాచారం దొరక లేదు. రుద్రాణి కోన రహస్యం గురించి, అక్కడి శక్తిని తెలుసుకోవటం అంత సులువు కాదని ఆమెకు అర్ధమవుతుంది. “నా వల్ల కావట్లేదు, ఆ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నా శక్తిని, ఏదో దివ్యశక్తి అడ్డుకుంటోంది. “ అంది అత్రిక. “పోనీ, ఆ రహస్యం తెలుసుకోవడం ఎవరికి సాధ్యం అవుతుందో చెప్పగలవా ?” అడిగాడు విలియమ్స్. మళ్ళీ నీలి రంగు క్రిస్టల్ బాల్ వద్ద మంత్రజపం చేస్తూ, ప్రయత్నిస్తుంది. ఎవరి వల్ల సాధ్యమవుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా నిర్వీర్యం అయిపోతుంది. దానితో ఆమె, “ నా శక్తి వల్ల కావట్లేదు, ఇండియాలో ఉన్న నా గురువు తంత్రిణిని కలవండి,” అని చెపుతుంది. దానితో ఆమెను కలిసేందుకు భారత్ కు బయలుదేరతారు వారంతా... ***** ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ .. హైదారాబాద్ .. కమిషనర్ రవీంద్రనాథ్ మౌనంగా అతని గది కిటికీ నుండి కనిపిస్తున్న సిటీని చూస్తుంటాడు. ‘సార్ .. పిలిచారట,’ అంటూ అసిస్టెంట్ కమిషనర్ ప్రవల్లిక ఆ గదికి వెళ్ళింది . “ అవును, ఒక ముఖ్యమైన విషయం చెబుదామని పిలిచాను. ఒకరు మొదలు పెట్టినది మరొకరు పూర్తి చేయటమే విధి నిర్ణయించిన రాత అనుకుంటాను ప్రవల్లిక...” అంటూ ఆమెవంక చూసారు రవీంద్రనాథ్. ప్రవల్లిక అయోమయంగా చూస్తూ, ‘అర్ధం కాలేదు సార్’ అంది. “మీ నాన్న నాకు కొలీగ్ మాత్రమే కాదు, మంచి మిత్రుడు కూడా ! ఆయన రుద్రాణి కోన అస్సైన్మెంట్ ని టేక్ అప్ చేసినపుడు, అందరితో పాటు నేను కూడా అభ్యంతరం తెలియచేసాను. మీ నాన్న ఎవరి మాటా వినలేదు. ఆ రహస్యంతో పాటు తను కూడా ఒక రహస్యం గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని చేధించే బాధ్యతని నీకు అప్పగించారు . జరిగినవన్నీ తెలిసి కూడా, నిన్ను అక్కడికి పంపించటం అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు...” ఆయన తన సంభాషణ పూర్తి చేయకుండానే, “నేను రేపే చార్జ్ తీసుకుంటాను సర్” అంది ప్రవల్లిక ధృడంగా! “ కానీ అన్నీతెలిసి కూడా....” “ఇది నేను సాహసం అనో రిస్క్ అనో ఒప్పుకోవట్లేదు సర్ , నా బాధ్యతని పూర్తి చేసుకోవడానికి అంది వచ్చిన అవకాశం నమ్ముతున్నాను,” అని ప్రవల్లిక స్పష్టంగా చెప్పటంతో రవీంద్రనాథ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ***** ఫ్రెడ్రిక్ , విలియమ్స్ , అత్రికలు వారి బృందంతో హైదరాబాద్ లో ఉన్న తంత్రిణిని కలిసారు. ఆశీస్సుల కోసం వందనం చేసిన అత్రిక తలపై చేయి వేసిన తంత్రిణి , అత్రిక మనసులో ఉన్నది వారు చెప్పకుండానే పసికట్టింది. వారు ఆమెను ఎందుకు కలవాలని వచ్చారో, తంత్రిణి చెప్పటంతో ఆమె శక్తికి ఫ్రెడ్రిక్ , విలియమ్స్ ఆశ్చర్యానికి లోనవుతారు. తంత్రిణి తన తంత్ర శక్తితో మంత్రం చదువుతూ రంగులద్దిన ముగ్గు మధ్య ఉన్న చక్రం పై గవ్వలను విసిరింది. యక్షిణిని ఆవాహన చేసి, రుద్రాణి కోన రహస్యాన్ని చెప్పమని అడుగుతుంది. ముగ్గు మధ్యనుంచి, తెల్లటి పొగ లేచింది. అందులోంచి, యక్షిణి ప్రత్యక్షమై “తంత్రిణి ! రుద్రాణి కోనలో నిద్రాణంగా ఉన్న శక్తిని సొంతం చేసుకోవాలంటే, మానవ మాత్రులైన వారివల్లనో, వారు చేస్తున్న ప్రయత్నాల వల్లనో పూర్తి కాదు. 21 సంవత్సరాల ముందు వచ్చిన బ్రహ్మ ముహూర్తం లో తెలుగు గడ్డ పై ఒకే నక్షత్రంలో, ఒకే రోజు, ఒకే సమయంలో, కారణ జన్ములుగా పుట్టిన ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది,” అని చెప్పింది. “అంతే కాదు తంత్రిణి ! వారిలో ఒకరి భుజం పై చంద్రుడుమచ్చ , మరొకరి భుజం పై సూర్యుడి మచ్చ ఉంటాయి. ఒకరి ప్రమాదం మరొకరి వల్ల తప్పిపోతుంది . వారి కలయికకు ప్రకృతే పులకిస్తుంది,” అంది యక్షిణి. “వారి వివరాలు ఏమిటి ?” అని అడుగుతూ ఇండియా మ్యాప్ పై పాచికలా ఉన్న పుర్రె ను విసిరింది, తంత్రిణి. ఆ పుర్రె తిరుగుతూ తిరుగుతూ వేగం పెరిగి, పేలిపోయింది. యక్షిణి వెంటనే, “వారిద్దరి వివరాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మహిమ గల శక్తి ఏదో అడ్డుకుంటున్నది. అది తెలుసుకోవాలంటే హోమం చేసి యంత్రిణి ని ప్రసన్నం చేసుకోవాలి,” అని చెప్పి అంతర్ధానమవుతుంది. వారి వివరాలు తెలుసుకోవడం ఎలా అని మధనపడుతున్న ఫ్రెడ్రిక్ మనసులోని భావం తెలుసుకున్న తంత్రిణి ,”ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంటుంది. ముందుగా, 21సంవత్సరాల ముందు వచ్చిన వైశాఖ పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఆంధ్ర దేశంలో పుట్టిన వారి వివరాలు తెలుసుకోగలిగితే మొదటి మజిలీ సొంతమవుతుంది,” అంటూ అతడి కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ఫ్రెడ్రిక్ వెంటనే అతడి ట్యాబ్ తీసి , తన టీం కి ఇలా సందేశం పంపాడు. “1992 సంవత్సరం మే 21 న అన్ని ఊర్లలో , అన్ని హాస్పటల్ రికార్డులు , జనాభా లెక్కల్లో చేర్చిన వివరాలు , బర్త్ సర్టిఫికేట్ లు, లైసెన్స్ లు, వోటర్ ఐడెంటిటీ లు ఏది వదలకుండా వెతకండి,” అని చెప్పాడు. ***** శ్రీని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇంజినీరింగ్ .. కాలేజ్ గడియారం పై పది గంటలు కొడుతుంటే , ఎం.బి.బి.ఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నసృష్టి, కాలేజ్ టైం అయిపోవటంతో గేటు మూసేస్తుండటం చూసి, కంగారుగా స్కూటీ క్లచ్ ని రేజ్ చేసింది . క్లచ్ వైర్ తెగిపోవటం తో అదుపుతప్పి పడబోతుండగా, ఆమెకు ఎడమ పక్కగా బైక్ పైవెళుతున్న అద్భుత్, సృష్టిని, బైక్ ని పడకుండా ఆపి, జాగ్రత్తగా తీసుకెళుతూ భయంతో కళ్ళు మూసుకుని ఉన్న సృష్టిని చూస్తూ ఉన్నాడు.... అద్భుత్ కుడి భుజం పై ఉన్న సూర్యుడి మచ్చ, సృష్టి ఎడమ భుజం పై చంద్రుడి మచ్చ, ఒకదానికొకటి తగలటంతో అక్కడి గాలి వేగంలో మార్పులు మొదలయ్యాయి. గాలికి కాలేజ్ కాంపౌండ్ లో ఉన్న చెట్లు నుండి పూలు రాలి ఇద్దరి పై పడ్డాయి. సృష్టి అద్భుత్ ని చూసి దూరం జరగటంతో, వాతావరణం మామూలుగా మారింది. రాలిన పూలలో, పువ్వులో ముద్దమందారంలా కలిసిపోయి ఉన్న సృష్టిని చూస్తున్న అద్భుత్ గుండెను పట్టుకుని పడబోతూ ఆపుకున్నాడు. అద్భుత్ ని చూస్తూ నవ్వుకుని , థాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చింది సృష్టి. ఇద్దరి చేతులు కలవటంతో ఆకాశంలో రెండు మేఘాలు ఒకదానికొకటి డీ కొని భారీ శబ్దంతో ఉద్భవించిన శక్తి, కాలేజ్ కాంపౌండ్ లోని ట్రాన్స్ఫర్ పై పడి నిప్పులు విరజిమ్మాయి. ********** రుద్రాణి కోనకు వెళ్ళాలని నిర్ణయించుకున్న ప్రవల్లికను ఆమె తల్లి సుమిత్ర తాను ఆరాధించే ‘అవ్యక్ బాబా’ దగ్గరకి తీసుకు వెళ్ళింది. సుమిత్ర మనసులో కలవరాన్ని గమనించిన అవ్యక్ బాబా, ప్రవల్లిక వైపు చూసి, “ ఒకరి వల్ల అసంపూర్తిగా మిగిలిపోయినది ,సంపూర్ణం అయ్యే సమయం ఆసన్నమయ్యింది, చిక్కు ప్రశ్నలా మిగిలిపోయిన సుమిత్ర మాంగల్యం జాడను ప్రవల్లిక వెతికి పట్టుకుంటుంది”, అని ధైర్యం చెప్పి, అవసరానికి అక్కర కొస్తుందని ప్రవల్లికకు అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చారు. ************ తంత్రిణి యంత్రిణి హోమం చేస్తూ ఉంటుంది.... కాల దర్శినిలో మార్పులుమొదలవుతాయి. వారిద్దరూ హైదరాబాద్ లో ఉన్నట్లుగా సంకేతాలు కనిపించటంతో ఫ్రెడ్రిక్ హైదరాబాద్ లో అతని సెర్చ్ ని ముమ్మరం చేస్తాడు. తంత్ర ముద్రలో ఉన్న తంత్రిణి , “కింకాసురా .. నా శక్తినే ఎదిరిస్తున్న శక్తి మూలం ఎక్కడా ?” అంటూ అరిచింది . *********** వర్షం పడుతోంది …. అద్భుత్ బైక్ పై వెళుతూ బస్ స్టాప్ లో కనిపించిన సృష్టి ని చూసి బైక్ ని ఆపి , “ఏంటిక్కడ?” అని అడిగాడు. “స్కూటీ అక్కడుంది ,” అంటూ ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్ వైపు చూపించింది సృష్టి. అద్భుత్ షెడ్ వైపు చూసి “అక్కడే వెయిట్ చేయొచ్చుగా” అని అడిగాడు. “అక్కడ ఉంటే దిష్టి ఎక్కువ తగులుతుంది ..” అంది సృష్టి. అద్భుత్ నవ్వుకుని, కనిపించిన పాని పూరి బండి వైపు చూపిస్తూ, “పానీ పూరి తిందామా ?” అని అన్నాడు. “ఊ ... “ అంటూ ఎక్స్ప్రెషన్ పెట్టి వర్షం వైపు చూస్తున్న సృష్టిని చూసి , అద్భుత్ తన జర్కిన్ ని తీసి సృష్టి కి ఇచ్చాడు. సృష్టి జర్కిన్ ను తలపైకి గొడుగులా పెట్టుకుని షెల్టర్ నుండి బయటకి వస్తూ, అడుగు జారి, పడబోయింది. అప్పుడు ఇద్దరి భుజాలపై ఉన్న సూరీడు- జాబిల్లి మచ్చలు దగ్గరయ్యాయి. ఆకాశంలో పెద్ద శబ్దంతో ఉరుము ఉరుమింది. కోనలో మార్పులు మొదలయ్యి కొడిగట్టిన దివ్వె వెలిగింది. మోడు వారిన చెట్టుచిగురించింది. **************** అయ్యోరు యోగ ముద్ర నుండి కళ్ళు తెరచి కింగరా అని పిలిచాడు. కోయ దొర పరుగున అయ్యోరు ముంగిలికి వెళ్ళి మొక్కాడు . “సూరీడు, జాబిల్లి ఒక్కటైనారు రా.. దివ్వె చెప్పింది .. చిగురు మొలిచింది .. కోన పులకరించబోతుంది రా ..”, అంటూ కూర్చున్న చోటునుండి లేచి మంత్రాలు చల్లుతూ దండంతో నేల మీద గీతలు గీసాడు.. గీసిన గీతలు వెలుగుగా మారి గాలిలో మాయమయ్యి ,తంత్రిణి దర్శినిలో వెలుగుగా వచ్చి దర్శిని పగిలిపోయింది. *************** బస్ స్టాప్ కి పక్కగా బైక్ పై కూర్చున్న సృష్టి , అద్భుత్ చెప్పింది విని నవ్వుతుంటుంది . అటుగా కారు లో వెళుతున్న ప్రవల్లిక, సృష్టి ని చూసి కార్ ని ఆపి పిలిచింది. సృష్టి ప్రవల్లికని చూసి, సంతోషంగా దగ్గరకి వెళ్ళి మాట్లాడి , మెకానిక్ కు స్కూటీని ఇంటికి పంపించమని చెప్పి, అద్భుత్ కి బై చెప్పి కారులో వెళ్ళిపోతుంది. సృష్టి వెళ్ళిపోతూ బైక్ పై వదిలేసిన స్టోల్ ని చూసి నవ్వుకుంటూ మెడలో వేసుకుని బైక్ ని స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు అద్భుత్. అద్భుత్ ఇల్లు .. అద్భుత్ ఇంటికి వెళ్ళడం తోనే అతని తల్లి రాధిక అద్భుత్ చేతికి తాడు కట్టింది. “ఇదేం దేవుడి దారం” అంటుండగా , ఇది దారం కాదు ఆధారం అంటూ చెప్పింది ఆమె. “చాదస్తం !!!” అని అన్నాడు విసుక్కుంటూ అద్భుత్ . “ఇది చాదస్తం కాదురా, నమ్మకం” అంటూ అద్భుత్ తండ్రి కృష్ణ రాజ్ అటుగా వెళుతూ అన్నాడు. తండ్రిని చూడగానే అద్భుత్ ఆప్యాయంగా కౌగలించుకుని , “ఎప్పుడొచ్చారు?” అని అడిగాడు. “నువ్ బస్ స్టాప్ లో ఒకమ్మాయితో కలిసి పానీ పూరి తింటున్నావే , అపుడు” అని తండ్రి అనటంతో, “అవునా, మరి పిలవాల్సిందిగా” అన్నాడు ఆశ్చర్యంగా అద్భుత్ . “నువ్వేదో నీ గర్ల్ ఫ్రెండ్ తో బిజీగా ఉంటే , ఎందుకులే డిస్టర్బ్ చేయటం?” అని పిలవలేదు. “డాడ్! తను సృష్టి, ఈ రోజే ఫ్రెండ్ అయింది”. అది విన్నతండ్రి, “ మొదటి పరిచయమే పానీ పూరిలు షేర్ చేసుకునేంత వరకు వెళ్ళిందంటే, ఆ సృష్టి అధ్భుతమైనదన్నమాట”. “వాడిని ఆటపట్టించింది చాలు గాని, మీరు తినటానికి రండి”, అని రాధిక పిలవటంతో , “అటులనే ఇంటి మంత్రి గారు “ అంటూ తండ్రి ,తల్లి వెనకే వెలుతుండటం చూసి, “డాడ్, మీకు అమ్మ అంటే ఎందుకు అంత భయం?” అని కొంటెగా అడిగాడు అద్భుత్. “ అదేమిటో అర్ధం కావాలంటే నీకో తోడు రావాలి లేరా !” అని కన్నుగీటాడు అతని తండ్రి. అద్భుత్ ,సృష్టి తన దగ్గర వదిలేసిన స్టోల్ ని చూసుకుని, “మమ్మీ నేను తరువాత తింటాను,” అని చెప్పి తన గదికి వెళతాడు. సృష్టి ఇల్లు .. “నీకు మీ నాన్న పోలికలే కాదు... పంతం ,పట్టుదల కూడా వచ్చాయి . నువ్వు రుద్రాణి కోనకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను . జరిగింది తెలుసుకోవాలనేది నీ ఆశయం , నీకేమీ కాకూడదనేది మా ఆశ “, అని అంటూ సృష్టి తండ్రి శ్రీధర్ వర్మ ఒక పుస్తకాన్ని తెచ్చి ప్రవల్లికకు ఇచ్చాడు. “రుద్రాణి రహస్యం” అని మొదటి పేజి పై రాసి ఉన్న ఆ పుస్తకాన్ని చూస్తున్న ప్రవల్లికతో... “ ఇది మీ నాన్న రుద్రాణి కోన పై స్టూడెంట్ గా రిసెర్చ్ చేసినపుడు రాసిన పుస్తకం , జాబ్ లో చేరి అసైన్మెంట్ ను టేకప్ చేయటానికి ముందు ఇక్కడికివచ్చినపుడు దీనిని ఇక్కడే వదిలి వెళ్ళాడు. చదవటానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు”, అన్నాడు సృష్టి తండ్రి. అక్కడికి వెళ్ళి పుస్తకాన్ని చూసిన సృష్టి ,” ఏంటిది నాకెపుడూ చూపించలేదు,” అంటూ పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకుంది. పాత బడిన పుస్తకం లో ఒక్కసారిగా ఒక జీవం ఏర్పడింది. ఆ మార్పుని అందరూ గమనించే లోపు బయట నుండి పెద్ద శబ్దం వినిపించటంతో అందరూ గది నుండి బయటకి వెళ్ళి పోర్టికోలో చూసారు. సృష్టి పుస్తకాన్ని పక్కన పెట్టేయటం తో శబ్దాలు ఆగిపోయాయి. ఆకాశంలో మెరుపులు మెరుస్తుండటం చూస్తుండగా దూరంగా ఒక నక్షత్రం నేల రాలుతూ కనిపించింది వాళ్లకు. “ ప్రకృతి కూడా మంచి శకునాలనే చూపిస్తుంది, ఆ సర్వేశ్వరుడి ఆశీర్వాదంతో అంతా మంచే జరుగుతుంది,” అని సృష్టి తల్లి కళావతి అనటం విని ,”అమ్మా! మన డ్యూటీని మనం శ్రద్ధ గా చేస్తే పంచ భూతాలు మన వెంటే ఉంటాయి,” అంటూ సృష్టి , ప్రవల్లిక మెడ చుట్టూ ఆత్మీయంగా చేతులు వేస్తూ అంది . ************** తంత్రిణి జరిపిన హోమం వల్ల ప్రత్యక్షమైన యంత్రిణిని ,”కారణ జన్ముల జాడ తెలుసుకొని రా !” అని ఆదేశిస్తుంది ఆమె. యంత్రిణి వాయురూపంలో వారి జాడను వెతికి పట్టుకోవడానికి ఉన్న చోటు నుండి తూర్పు వైపుకి ప్రయాణం మొదలుపెట్టింది. యోగ ముద్రలో ఉన్న అయ్యోరు ధ్యానం నుండి బయటకి వచ్చి, “ నమో రుద్రాణియే నమః” అంటూ చేతులు జోడించి, చేతిలోకి విభూది తీసుకుని, గాలి లోకి వదులాడు అద్భుత్ ఇంటి ముందు ముగ్గు చల్లుతున్న మున్సిపాలిటీ బండిలో ఉన్న ముగ్గులో ఆ విభూతి కలుస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి చుట్టూ ముగ్గు చల్లి వెళ్ళారు. వాయు రూపంలో వెళ్ళిన యంత్రిణికి, ఆ ముగ్గు రక్ష కవచంలా అడ్డుపడటం వల్ల నిర్విర్యమయిపోతుంది. “తంత్రిణి చేస్తున్న హోమం వల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు, అసలు తంత్రిణి కి అంతటి శక్తి ఉందా?” అనే సందేహాన్ని ఫ్రెడ్రిక్ లేవదీసాడు. ఆ సందేహాన్ని అవమానంగా తీసుకున్న తంత్రిణి, తన శక్తితో ఫ్రెడ్రిక్ బ్యాంక్ అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో డబ్బుని మరొక అకౌంట్ కిట్రాన్స్ఫర్ చేస్తుంది. విస్మయానికి గురౌతూ, “ఆమె కను సన్నలతోనే అది సాధ్యం చేయగలిగిన ఆమెకు రుద్రాణి కోన విషయంపై పరిష్కారం ఎందుకు చిక్కట్లేదని”, అడిగాడు ఫ్రెడ్రిక్. “యంత్ర తంత్రాలకు అందని శక్తులు, ఆ కోనను, కావలిసిన ఆ ఇద్దరినీ రక్షిస్తున్నాయి. ఆ శక్తులకు ఎదురు వెళ్ళడం సుసాధ్యమైనదికాదు, అలా అని అసాధ్యమైనది కూడా కాదు. ఈ సృష్టి లో ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది.ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క గండరుడు మాత్రమే!” అంది సాలోచనగా తంత్రిణి . “అయితే గండరుడిని వెంటనే పిలిపించమని,” ఫ్రెడ్రిక్ ఆత్రంగా అన్నాడు. “పిలవగానే రావడానికి కింకరుడు కాదురా, సృష్టి గమన గతులు మార్చగల గండర గండరుడు. కాలకేతు ముహూర్తం లో రాక్షస ఘడియలలో నెత్తురు నైవేద్యంతో తీతువుల స్వాగతంతో గండరుడ్ని ప్రసన్నం చేసుకోవాలి, “ అని చెప్పింది తంత్రిణి. తంత్రిణి , “నువ్వేం చేస్తావో చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లో అయినా రుద్రాణి కోనలో నిగూఢమై ఉన్నశక్తిని నాకు సొంతం చెయ్యి, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా” అని ఆవేశం వాగ్దానం చేసాడు ఫ్రెడ్రిక్. ఆ మాటలు విన్న తంత్రిణి, “నీ వాగ్దానం వల్ల నాకు ప్రయోజనం లేదు, నా శక్తికి సవాలుగా నిలుస్తున్న రహస్యం ఏమిటో నేను తెలుసుకోలేక పోతే నా ఉపాసన నిరర్ధకం, తెలుసుకోలేని పక్షంలో నా జన్మని త్యాగం చేస్తా,” అంటూ శపథం చేసింది. ************* కాలేజ్ లో అద్భుత్ కి అప్పోనెంట్ అయిన సందీప్ అద్భుత్ ని దెబ్బతీయాలని పధకం వేసాడు . ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రాక్టిస్ చేసే ఫ్లోర్ పై జెల్ లిక్విడ్ ని స్ప్రే చేయించాడు. విషయం తెలియని అద్భుత్, డ్యాన్స్ ఫ్లోర్ కి వెళ్లి మ్యూజిక్ ఆన్ చేసుకుని స్కేట్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆడిటోరియం ముందుగా కారిడార్ నుండి వెళుతున్న సృష్టి , వినిపిస్తున్న మ్యూజిక్ ని విని ఆడిటోరియంకి వస్తుంది. డ్యాన్స్ చేస్తున్న అద్భుత్ ని చూస్తూ డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరకి వస్తుంది. అద్భుత్ డ్యాన్స్ చేస్తూ, తననే చూస్తున్న సృష్టిని చూసి, దగ్గరకి రమ్మనిసైగ చేసాడు. సృష్టి రానని తల ఊపటంతో, అద్భుత్ నవ్వుకుని, స్కేట్ చేస్తూ సృష్టి దగ్గరకి వెళ్లి, చేయి చాపి రమ్మని సైగ చేసాడు. సృష్టి స్కేట్స్ వేసుకుని అద్భుత్ చేతిలో చేయి కలిపి ఫ్లోర్ పైకి వచ్చింది. ఇద్దరి చేతులు కలవటంతో ప్రకృతిలో మార్పులు.... మేఘాల సంఘర్షణలు.... చిరు జల్లులుగా మొదలైన చినుకులు జోరు పెరిగి, అప్పటి వరకు వేడితో వేగిన నేలకి జలాభిషేకం జరిగింది. ఆ మార్పులతో వారికేం సంబంధం లేదన్నట్లుగా ఇద్దరూ కళ్ళతో మాట్లాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. ఫ్లోర్ పై కనిపించకుండా ఉన్న లిక్విడ్ వల్ల స్కేట్ స్కిప్ అవటంతో అద్భుత్ పడబోతుంటే , సృష్టి తన కుడి చేతి వైపుకి తిరిగి అద్భుత్ ని తన ఎడమ భుజం పై బ్యాలెన్స్ చేసింది. ఇద్దరి భుజాలపై ఉన్న సూరీడు , జాబిల్లి మచ్చలు కలవటంతో, ఉద్భవించిన శక్తి వల్ల ఫ్లోర్ లో మార్పు కలిగి ఇద్దరూ మరింత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తారు. మ్యూజిక్ ఆగిపోయి నిశ్శబ్దంగా ఉన్న ఆడిటోరియంలో అలసిన ఇద్దరూ దగ్గరై ఒకరికొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఒక్కసారిగా ఉరుము ఉరిమిన శబ్దం ప్రతిధ్వనించటంతో ఉలిక్కిపడ్డారు ఇద్దరూ. అద్భుత్ చేతుల్లో ఉన్న సృష్టి , అద్భుత్ కి దూరంగా జరిగి, పరుగున వెళుతుంటే , “నేనంటే నాకు చాలాఇష్టం. నన్ను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఏమంటావ్?” అని అరిచాడు అద్భుత్. సృష్టి ఆగి,” నిన్ను నేనేం చేసుకోను?” అని అడిగింది. “అంటే ఏం చేద్దామనుకుంటున్నావ్?” అన్నాడు కొంటెగా నవ్వుతూ అద్భుత్ . సృష్టి నవ్వి, ఏం మాట్లాడకుండా వెళుతుంటే, “చెప్పు ఏదో ఒకటి అనుకుంటావ్ గా,” అని వెనకే వెళుతూ గట్టిగా అన్నాడు అద్భుత్. “ఇంకా ఏమి అనుకోలేదు” అంది సృష్టి సిగ్గుపడుతూ.... “పోనీ ఇప్పుడు అనుకోవచ్చు కదా ?” “ఏమో .. “అని అరిచి వెళుతున్న సృష్టిని చూస్తూ,” నేను ఆల్రెడీ అనేసుకున్నా” అని అరిచాడు. అద్భుత్ కి ఏమి కాకుండా ఉండటం చూసిన సందీప్ తట్టుకోలేక డ్యాన్స్ ఫ్లోర్ కి వెళ్లి లిక్విడ్ ఎందుకు పనిచేయలేదని అనుకుంటూ ఫ్లోర్ పై అడుగువేసాడు... అద్భుత్ కి ఏమి కాకుండా ఉండటం చూసిన అతని అప్పోనెంట్ తట్టుకోలేక, డ్యాన్స్ ఫ్లోర్ కి వెళ్లి, లిక్విడ్ ఎందుకు పనిచేయలేదని అనుకుంటూ, ఫ్లోర్ పై అడుగు వేసాడు. అంతే, బ్యాలన్స్ కుదరక జర్రున జారి పడ్డాడు. ********** రుద్రాణి కోన 10 కి. మీ ల మైలు రాయి దాటుతుండగా, ఆర్కియాలజీ టీం వెళుతున్న కారు టైర్ పంక్చర్ అయ్యింది. ప్రవల్లిక కారు నుండి దిగి ,కంకరతో ఉన్న ఆ రోడ్డును చూస్తూ, ఎటువంటి సందడి కనిపించని ఆ వాతావరణాన్ని చూడసాగింది. “పంక్చర్ కిట్ లేదు “ అన్నాడు డ్రైవర్. “బయలుదేరే ముందు ఏం చేసావ్, చూసుకోవద్దా ?” అంటూ కసురుకుని మిగిలిన సిబ్బంది ఏమీ మాట్లాడకపోవటంతో, “ఇపుడేం చేద్దాం?” అసహనంగా అరిచింది ప్రవల్లిక. అసలే ఎప్పుడూ కోపంగా ఉండే ప్రవల్లిక ఏం మాట్లాడితే ఏమంటుందో అని సైలెంట్ గా ఉండిపోయారు అంతా. ప్రవల్లిక సబార్డినేట్ తేజ, దగ్గరలో ఏదైనా ఉంటుందేమో చూస్తానని అంటుండగా ... “మే ఐ హెల్ప్ యు?” అంటూ ఒకతను అక్కడికి వచ్చాడు. ట్రావెల్ బ్యాగ్ తగిలించుకుని ,ఒంటిపై కార్గో షార్ట్ , టీ షర్టు పై స్లీవ్ లెస్ జాకెట్ తో సైకిల్ పై ఉన్న అతన్ని చూసి “ఎవరు నువ్వు?” అని ప్రవల్లిక జూనియర్ యామిని అడిగింది. “ఈ దారిలో గమ్యం వెతుక్కుంటూ వెళుతున్న ఒక బాటసారిని” , అన్నాడు అతను. “ వియ్ ఆర్ ఫ్రం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ , ఈ అడవిలో ఒక అస్సైన్మెంట్ చేయటానికి వచ్చాం , ఆదిలోనే హంసపాదు అన్నట్లు వెళ్ళకుండానే టైర్ పంక్చర్ అయింది”, అంది ప్రవల్లిక. “ఇక్కడేమన్నాదగ్గరలో పంక్చర్ షాప్ ఉందా?” అని తేజ అతన్ని అడిగాడు. “ఉంటే బాగుండేది కాని, ఈ అడవి అలాంటి బంపర్ ఆఫర్స్ ఇవ్వట్లేదు...” అన్నాడతను నవ్వుతూ. “మరిపుడెలా? ఇంకా 10 కిలోమీటర్లు ఉంది, నడిచి వెళ్ళాలా ?” అని ప్రవల్లిక అనటం విని , “అవసరం లేదు ఒక పది నిముషాలు వెయిట్ చేస్తే, కార్లోనే వెళ్ళొచ్చు” అంటూ... అతను తన బ్యాగ్ లో నుండి పంక్చర్ కిట్ ని తీసి, రిపేర్ మొదలుపెట్టడంతో అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. “ఈ రోడ్డు పై సైకిల్ మీద తిరగాలంటే మనకు పంక్చర్ వేసుకోడం కూడా తెలియాలి” అంటూ డ్రైవర్ హెల్ప్ చేయటంతో టైరు కి పంక్చర్ వెయ్యసాగాడు. “ఇంత ప్రిపేర్ గా ఉన్నావ్ , ఈ అడవిలో ఏం చేస్తున్నావ్ ? “ తేజ అడిగాడు. “ఏం చెప్పమంటావ్ భయ్యా , ఆయుర్వేదం మీద రీసెర్చ్ చేసేద్దామని పది మందొచ్చాం ,ఆ రోజు కార్లో పెట్రోల్ అయిపోయింది, అడవిలో కారు ఆగిపోయింది . చుట్టూ చీకటి .. సడన్ గా పెద్ద ఆకారం ఏదో వచ్చి కారుకు తగిలింది అంతే భయ్యా పొద్దున్న లేచి చూస్తే నేను,ఈ సైకిల్ మిగిలాం.” “ మరి మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు?” అని యామిని అడిగింది. “అది అర్ధం కాకే ఆళ్ళని వెతుకుతూ నేను ఇలా ఈ సైకిలు తొక్కుకుంటూ,ప్యాచీలు వేసుకుంటూ, ఈ దారిలో వెళుతున్నాను, “ అని చెప్పాడు అతను. “ఏం ఆకారం అది ? నువ్వు చూసావా? “ అడిగింది ప్రవల్లిక. “ ప్చ్ .. వచ్చింది .. గుద్దింది .. వెళ్ళింది .. అంతే అంతా బ్లాంక్ అయిపోయింది, అన్నాడతను. “సరే ఇక్కడ నీకేదన్నాఅనుమానంగా కాని , ఆసక్తిగా అనిపిస్తే ఈ నంబర్ కి కాల్ చెయ్” అంటూ ప్రవల్లిక తన కార్డ్ ను ఇచ్చింది. అతను ఆ కార్డ్ ని చూస్తూ “మిస్ ప్రవల్లిక.. అసిస్టెంట్ కమిషనర్.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ..” అని చదివి, “ నైస్ టు మీట్ యు మిస్ పజిల్ .. దిస్ ఈజ్ దేవ్” అంటూ షేక్ హ్యాండ్ ఆఫర్ చేసాడు. “తన చేతికి ఉన్నమట్టిని చూస్తున్న ప్రవల్లిక ని చూసి,” ఇట్స్ ఓకే సమ్ అదర్ టైం” అన్నాడు దేవ్ చేతిని వెనక్కితీసుకుంటూ.... “ఎనీ వే థాంక్స్ ఫర్ ది హెల్ప్” అంటూ ప్రవల్లిక కారులో కూర్చోవటంతో కార్లు బయలుదేరాయి. కార్లో వెళుతూ ,”మేడం అతన్ని చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది”, అన్నాడు తేజ . “అది తెలుసుకోవాలనే కార్డ్ ఇచ్చాను” అని అంది ప్రవల్లిక. “ కార్డిస్తే ఎలా తెలుస్తుంది?” యామిని అడిగింది. “అనుమానస్తుడైతే దొరికిందే అవకాశం అనుకుంటూ దగ్గరవ్వాలని ట్రై చేస్తాడు..చూద్దాం ఇపుడేగా ప్రయాణం మొదలైంది”, అంది ప్రవల్లిక దీర్ఘంగా ఆలోచిస్తూ... రుద్రాణి కోన కు వెళ్ళే దారిని చూపిస్తున్నరాయిని దాటి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కార్లు కోనకు వెళ్ళే దారిలో వెళ్తున్నాయి. దారిని రెండు వైపుల నుండి గొడుగులా అల్లిన గుబురు పొదలను చూస్తున్న ప్రవల్లిక ఆ వైపే చూస్తుండటం గమనించిన యామిని, “ఏమైంది “ అని అడిగింది. “ ఏంటో, ఈ అడివి వాతావరణమే వింతగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తుంటే ఏదో తెలిసీ తెలియని అనుభూతి “ అంటూ చుట్టూ చూస్తూ తన ల్యాప్ టాప్ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి కనిపిస్తున్న రుద్రాణి రహస్యం పుస్తకం పై చేయి వేసి అడవిలోకి గ్లాస్ నుండి చూస్తూ ఉండిపోతుంది ప్రవల్లిక. “ లచ్చిమీ పొద్దుగూకింది . అమ్మ ఒచ్చే ఏల అయినాది .. సద్ది కుండలో పెట్టినావా .. అని అరుపులు వినిపిస్తూ కార్ పక్క నుండి కొన్ని రూపాలు కనిపించినట్లు అనిపించటంతో ఉలిక్కి పడి, “ఆపండి “ అంటూ అరిచింది. డ్రైవర్ కారు ఆపాకా, ప్రవల్లిక గ్లాస్ దించి చూస్తే ఏమి కనిపించలేదు . “ఏమైంది మేడం,అలా అరిచారు” అడిగాడు తేజ. ఏం చెప్పాలో తెలియక , “ఏం లేదు” అని అంది. డ్రైవర్ కారుని కదిలించాడు. ప్రవల్లిక పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని తడుముతుంది. ఆ కారుకి కొన్ని పర్లాంగుల దూరం లో ధ్యానం లో ఉన్న అయ్యోరు నవ్వుకుని కళ్ళు తెరచి, రెండు చేతులు దగ్గరచేసి “ అమ్మా నీ ఆట మొదలు పెట్టావా?” అని అనుకున్నాడు. “కాలూ .. కోన కడుపు పంట వచ్చింది , కాపు కాయి” అని అనటంతో దారిని గొడుగులా కప్పిన పొదలు, కాల సర్పంగా మారి , వెళుతున్న కార్లు ని మెరుపు కంటే వేగంగా దాటుకుని ఒక చోట మహా వృక్షం లా అయ్యాయి. కారునుండి కనిపిస్తున్న వృక్షాన్ని చూసి,” ఆ చెట్టు కిందకు అసలు ఎండే రావట్లేదు , టెంట్ లు అక్కడ వేసుకుందాం” అంది ప్రవల్లిక. “గుడ్ ఛాయిస్ మేడం” అంటూ చెట్టు కి దగ్గరలో కార్లు పార్క్ చేసి, బస ఏర్పాటు చేసుకునే పనిలో మునిగిపోయారు అంతా. ప్రవల్లిక ఆమెకు కనిపించివినిపించిన వాటి గురించే ఆలోచిస్తుంటుంది. ఆమెలో ఆమెకే తెలియని ఒక కొత్త మార్పు,అదేమిటో ఆమెకు అర్ధం కాకపోవటానికి కారణం, ఆమె అక్కడికి ఒక రహస్యాన్ని తెలుసుకోడానికి రావటమే అనుకుంది... కానీ ఆ రహస్యం ఆమె తోనే ముడి పడి ఉందని ఆమెకు తెలీదు. ************ కాల కేతు ముహూర్తం లో తంత్రిణి చేసిన ఆవాహన హోమానికి ప్రసన్నుడైన గండరుడు ప్రత్యక్షమయ్యాడు. తంత్రిణి , “నా శక్తికి సవాలుగా నిలిచిన రుద్రాణి కోనలో రహస్యం గుట్టుని విప్పు “ అని అడుగుతుంది. గండరుడు నుండి ఎటువంటి స్పందన లేకపోవటంతో , తంత్రిణి తనకు ఓటమి కలుగుతుంది అంటే గండరుడి ముందే ఆత్మ త్యాగం చేస్తానని, ప్రత్యక్షం చేసుకున్నఖడ్గంతో పొడుచుకుంది. చూస్తున్న ఫ్రెడ్రిక్ ,అత్రిక ,విలియమ్స్ లు షాకింగ్ గా చూస్తుంటారు. తంత్రిణి త్యాగానికి ప్రసన్నుడైన గండరుడు తన శక్తి తో తంత్రిణి ని మామూలుగా చేసాడు. తంత్రిణి గండరుడ్ని ,” నీ నిశ్శబ్దానికి కారణం ఏమిటి ?” అని అడిగింది. “కొన్నితరాల ముందు రుద్రాణి తో తలపడిన కింకాసురుడు ఆమె ఆగ్రహానికి ఉద్భవించిన కాలాగ్నికి ఆహుతయ్యి బూడిద రూపంలో చిందర వందరగా ఆమె పాదాల చెంతనే బందీగా ఉండిపోయాడు, ఇదే నా నిశ్శబ్దానికి కారణం ” అని చెప్పాడు గండరుడు. “కింకాసురుడు బందీగా ఉన్నాడా?” తంత్రిణి ఆశ్చర్యంగా అడిగింది. “అసలు అక్కడ ఏముంది?” మళ్ళీ సందేహం వెలిబుచ్చింది... “ఒకనాటి కాలం లో రుద్రాణి కోన, రుద్రకోట అనే వాడుకతో ఉండేది. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు పరమేశ్వరీ అంశ అయిన రుద్రాణి ని కొలిచేవాడు. ప్రద్యుమ్నుడి దగ్గర ఉన్న శమంతకమణి రోజుకు 12 బారువుల బంగారాన్ని ఇచ్చేది , ఆ మణి కున్న మహిమ వల్ల ఆ రాజ్యం ఎప్పుడూ సుసంపన్నంగా ఉండేది. మహిమ గల మణిని రుద్రకోటలో గల రుద్రాణి ఆలయం లోనే ఉంచి పాలన సాగించేవాడు. రుద్రకోట, అడవి తెగకు చెందిన వీర రుద్రుడు అనే సామంతుడి పరిపాలనలో సుభిక్షంగా ఉండేది. యుగాలు మారాయి,తరాలు మారాయి.. వారసత్వం గా సింహాసనం అధిష్టించిన అతిరోధుడు వ్యసనపరుడు . అతని బలహీనతను తెలుసుకున్న ఆంగ్లేయులు, రాజ్యం పై దాడి చేసి, మైకంలో ఉన్న అతిరోదుడ్ని అంతంచేసి, రాజ్యాన్ని అదుపులోకి తీసుకుని , మణి ని సొంతం చేసుకోడానికి రుద్రకోటకు వెళ్ళారు. ఆ సమయం లో రుద్రకోటను పాలిస్తున్నవీర రుద్రుడి మనుమడు వీర సింగడు అనారోగ్యం తో ఉన్నాడు. అమ్మ శక్తిని కాపాడుకోవటానికి ఏమైనా చేస్తామని ప్రతిన పూనిన సింగడి కూతురు జాబిల్లి ఆంగ్లేయుల తో యుద్ధానికి సిద్ధ పడింది. జాబిల్లితో ప్రేమ లో ఉన్న సేనాని సూరీడు, జాబిల్లి నిర్ణయానికి తల ఒడ్డి సింగం లా ముందుకు ఉరికాడు. ఆడ, మగ అనే భేదం లేకుండా ఆంగ్లేయులతో ప్రతిఘటించారు వాళ్ళంతా. రుద్రాణి శక్తి అండగా నిలవటంతో ఆంగ్లేయులు కోయ సైన్యాన్ని ఏమి చేయలేకపోయారు. రుద్ర కోటను దైవశక్తి కాపు కాస్తున్నదని తెలుసుకుని క్షుద్ర ఉపాసకుడైన కింకాసురుడిని సాయం అడిగారు ఆంగ్లేయులు. ఆ మణిని సొంతం చేసుకుంటే అతనికి ఎదురే ఉండదని పధకం వేసిన కింకాసురుడు , జాబిల్లి మీద కన్నేసిన సిద్ద అనే కోయవాడిని లొంగదీసుకున్నాడు. జాబిల్లి , సూరీడుల ప్రేమను అంగీకరించిన సింగడు , రుద్రాణి ఆలయంలో పూజలు నిర్వహించే పూజారి ఆశీస్సులతో శ్రావణ పౌర్ణమి రోజున వివాహం నిర్ణయించాడు .వివాహ సమయానికి కుతంత్రంతో సూరీడుని అంతం చేసి మణిని దొంగిలించాలని సిద్ధ వేసిన పధకం తెలిసిన లచ్చిమి, హెచ్చరించే లోపు దాడి చేసిన ఆంగ్లేయులు సూరీడు, జాబిల్లిలను హతమార్చారు .అప్పటివరకు కింకాసురుడి క్షుద్ర స్తంభనలో ఉన్న రుద్రాణి లచ్చిమి, గన్నడు చేసిన ఆత్మ త్యాగం వల్ల విముక్తురాలై ఆగ్రహించి కింకాసురుడిని, ఆంగ్లేయులను దహించి వేసింది. సూరీడు , జాబిల్లిల మరణంతో ఆ నేల మలినమైందని ఆగ్రహించిన రుద్రాణి ప్రతి రాత్రి వెలుగు రూపంలో అక్కడేనాట్యం చేస్తుంది. ఆమె ఆగ్రహం సూరీడు, జాబిల్లి మళ్లీ పుట్టిన తరువాతే తీరుతుందని , వారిద్దరూ కొన్ని వందల సంవత్సరాల తరువాత రాబోయే బ్రహ్మ ముహూర్తం లో పుడతారని , వారి కలయిక వారికి తెలియకుండా జరుగుతుందని వారి రాక ను కొడిగట్టిన ఆలయ దీపమేచెపుతుందని , వారి రాకతోనే మైల పడిన ఆ నేల పులకిస్తుందని చెప్పింది రుద్రాణి. అప్పటివరకు ఆ నేలకు సంబంధం లేని వారు ఎవరు అడుగు పెట్టాలని చూసినా రుద్రాణి ఆగ్రహానికి బలైపోతారు. కింకాసురుడిని పూర్తిగా చంపకుండా శక్తి హీనుడిని చేసి బూడిదగా మార్చి, తిరిగి బ్రతికించి, ఆమె జ్వాలలకుఇప్పటికీ బలి చేస్తూనే ఉంది. “ అంటూ రుద్రాణి కోన కధ చెప్పాడు గండరుడు. గండరుడు చెప్పింది విన్న తంత్రిణి “వారిద్దరి ని పట్టేదెలా?” అని అడిగింది . “వారిద్దరూ కలిసారు, త్వరలోనే వారు కోనకు చేరబోతున్నారు. వారు మానవమాత్రులైనా వారిని ఎదిరించటం సులభం కాదు , వారిద్దరూ కోనలోకి అడుగు పెట్టిన మరుక్షణమే వారికి తెలియకుండా వారు శక్తివంతులవుతారు. ఆ శక్తిని ఎదిరించాలంటే మన శక్తి సరిపోదు. రుద్రాణి శక్తినే స్థంభింపచెయ్యగల కింకాసురుడి సాయం కావాలి. బందీగా ఉన్న కింకాసురుడిని పునః శక్తి వంతుడిని చేయటానికి 48 రోజులు నగ్నంగా ద్వాదశ వక్ర హోమం చేయాలి. వక్రుడు ప్రసన్నం కావాలంటే నిన్ను నువ్వు పూర్తిగా వక్రుడికి అర్పించుకోవాలి. వక్రుడుని మెప్పించగలిగితే నీ పని సగం పూర్తి అయినట్లే .. దుష్ట గ్రహ యోగ చక్రంలో పుట్టిన పునర్వసు నక్షత్ర జాతకుడు అతనికి తెలియకుండానే నీకు సాయమవుతాడు.” అని చెప్పి అంతర్దానమయ్యాడు గండరుడు. తంత్రిని అత్రికను అష్టాదశ శక్తులను సంపన్నం చేసుకునే హోమాన్ని మొదలుపెట్టమని ఆజ్ఞాపించింది. ఆమె వక్రుడిని ప్రసన్నం చేసుకునే ద్వాదశ వక్ర హోమం చేసేందుకు ఉపక్రమించి, ఫ్రెడ్రిక్ బృందాన్ని కోనకు దగ్గరలో మకాం ఏర్పాటు చేసుకొమ్మని చెప్పి, హోమానికి కింకరుడ్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించింది. ****** మెడికల్ కాలేజ్ కాంపౌండ్ లో క్లీనింగ్ చేస్తున్న హౌస్ కీపింగ్ అమ్మాయికి షాక్ తగిలి పడిపోవటంతో, ట్రీట్మెంట్ కు హాస్పిటల్ కాంపౌండ్ కు తరలించారు. ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్ , పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పటంతో ఇంటర్న్ గా చేస్తున్న సృష్టి తట్టుకోలేకపొయింది. ఐ. సి. యులో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న ఆమె పరిస్థితి తెలిసి విలవిల్లాడి పోతున్న ఆమె పిల్లలను చూసి, హాస్పిటల్ కాంపౌండ్ లో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకి వెళ్ళి, ‘ప్లీజ్ ఇలా చేయొద్దు .. నువ్వున్నావనే వారి నమ్మకాన్ని వమ్ము చేయకు’ అని మొక్కింది. అటుగా వెళుతున్న అద్భుత్ సృష్టిని చూస్తుండగా , ఐ.సి.యు లో ఉన్న ఆమె పిల్లలు , అద్భుత్ ని చూడగానే దగ్గరకు చేరి ‘అన్నా! అమ్మకు బాలేదంట ?’ అని చెప్పటం విని, ఐ .సి. యు కి వెళుతుంటే సృష్టి అద్భుత్ వెనకే వెళ్ళింది. సిస్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూసి, ఆమె నాడిని పరిశీలించి , కనిపిస్తున్న కరెంటు వైరు నిగట్టిగా లాగాడు, అద్భుత్. “ఏం చేస్తున్నావ్?” అని సృష్టి అడిగింది. “నా చేతుల్ని పట్టుకో,” అని అద్భుత్ అనటంతో సృష్టి , అద్భుత్ చేతుల్ని పట్టుకుంది. “విషానికి విషమే విరుగుడు,” అంటూ కరెంటు పాస్ అవుతున్న ఆ వైరుని ఆమె నాడికి తగిలించాడు అద్భుత్. దగ్గరైన ఇద్దరి భుజాలపై ఉన్నసూరీడు, జాబిల్లి మచ్చలు నుండి ఉద్భవించిన శక్తి వల్ల ఐ.సి.యు మానిటర్ లో మార్పు మొదలై క్రిటికల్ గా ఉన్న అమ్మాయిలో చలనం మొదలయ్యింది. ఆ విషయం తెలిసి, అంతకు ముందు చేతులు ఎత్తేసిన డాక్టర్ , ఐ.సి.యు నుండి వెళుతున్న అద్భుత్ తో, ‘ నువ్వెందుకు లోపలికి వెళ్ళావు ?దీనికి డీన్ముందు ఎక్స్ప్లనేషణ్ చెప్పాలి’ అన్నాడు కోపంగా. ఏ సమాధానం చెప్పని అద్భుత్ నవ్వుకుని, “ఇప్పుడు నీకేమైనా పనుందా?” అని సృష్టి ని అడిగాడు. సృష్టి ఏం సమాధానం చెప్పకుండా అద్భుత్ వెనకే నడవసాగింది. ఇద్దరు పక్క పక్కనే నడుస్తూ కాంపౌండ్ లోకి రావటంతో అక్కడి దేవుడి విగ్రహానికి వెలుగొచ్చి, విగ్రహానికి ఉన్న పువ్వు రాలి పడింది. పిల్లలు ఆ పువ్వును తెచ్చి అద్భుత్ కి ఇచ్చారు. అద్భుత్ పిల్లలని లోపలికి వెళ్ళమని చెప్పి, ఆ పువ్వుని సృష్టి కి ఇచ్చాడు. సృష్టి ఆ పువ్వుని తలలో తురుముకుంది. “అవును, ఇంతకుముందు కళ్ళు మూసుకుని ఆ బొమ్మని ఏంటి అడుగుతున్నావ్?” అని అడిగిన అద్భుత్ ప్రశ్నని విని, “బొమ్మని కాదు దేవుడిని అడుగుతున్నా,” అని చెప్పింది సృష్టి . అది విని అద్భుత్ గట్టిగా నవ్వాడు. “ఎందుకు నవ్వుతున్నావ్?” అడిగింది సృష్టి. “ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియని వాడిని అడుగుతున్నావ్ అంటే, నవ్వు కాక ఏమొస్తుంది?” “నీకు దేవుడంటే నమ్మకం లేదా?” “ఉనికి లేని వాడు ఉన్నాడంటే ఎలా నమ్మాలి?” “మన ఉనికిని నిర్ణయించే వాడి ఉనికి మనకి ఎలా తెలుస్తుంది? “ “మరి ఉన్నాడని ఎలా తెలుస్తుంది?” “దేవుడు ఉన్నాడు అనటానికి ఋజువులు, సాక్ష్యాలు ఉండవు. నిండు మనసుతో కొలిస్తే కళ్ళ ముందు అన్నీఅద్భుతాలే !” అంది సృష్టి. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఒకరి పక్కన ఒకరు నడుస్తూ గ్రౌండ్ లోకి వెళ్ళారు. “ఇదంతా ఆ దేవుడి వల్ల జరిగిందంటే నమ్మాలా”? అడిగాడు అద్భుత్ మళ్ళీ. “మన మనుషుల్తో ప్రాబ్లెమ్ ఏంటో తెలుసా? మనకు తెలియకుండా జరిగితే ఆహా.. ఓహో.. అద్భుతం అంటాం, కళ్ళ ముందు కనిపిస్తుంటే మాత్రం ఒప్పుకోం.” “అలా అయితే ప్రాణం మీదకు వచ్చినపుడు డైరెక్ట్ గా గుడికే తీసుకెళ్ళి పోవచ్చుగా, హాస్పిటల్ కెందుకు తీసుకురావటం?” “బహుశా అక్కడ నీలాంటి దేవుడు డాక్టర్ లా ఉంటాడేమో...” “ఇప్పుడు నన్ను దేవుడిని చేస్తున్నావా?” “నా వరకు దేవుడంటే నమ్మకం, నిజం! అది మన గురించి ఆలోచించకుండాఎదుటి మనిషి కి సాయం చేసే ప్రతి ఒక్కరిలోను కనిపిస్తుంది. భక్తి అంటే నైవేద్యాలు, ఫలహారాలు పెట్టడమో, హారతులు ఇవ్వడమో కాదు పూర్తి మనసుతో కొలుస్తూ నీకు నువ్వుగా పొందే భరోసా!” “ఇప్పుడు చేసిన పనికి నేను దేవుడిని అంటే, ఆ దైవత్వంలో నీకూ పార్ట్ ఉంది” “అదెలా?” ఆశ్చర్యపోతూ అడిగింది సృష్టి. “ఆ వైరు నుండి వచ్చే పవర్ ని నా ఒక్కడి బాడీ తట్టుకోలేదు. నువ్వు వేసుకున్న యాంటిక్ జ్యువెలరీలో ఉన్న కార్బన్... ఎలక్ట్రిసిటి ని డిఫెండ్ చేస్తుంది, అందుకే ఇందులో నీకూ భాగం ఉంది అంటున్నాను.” “మరి షాకే ఎందుకు వాడావు?” “ఒక్కొక్కసారి షాక్వల్ల బ్రెయిన్ ఒకలాంటి ట్రాన్స్ కి వెళ్ళిపోతుంది, కొంత టైంలో మరలా అలాంటి షాక్ తగిలితే బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి పడిపోయిన పల్స్ పరుగెడుతుంది. చదివింది అప్లై చేసాను, అంతే.. అనుకోకుండా వర్క్ అవుట్ అయింది.” అంటూ నవ్వాడు అద్భుత్. సృష్టి కి కాల్ రావటం తో, మొబైల్ వైపు చూసి ,”సరే మరి నేను వెళ్తాను”, అంది. వెళుతున్న సృష్టిని, “మరి నేను చెప్పింది ఏం చేసావ్?” అని అడిగాడు అద్భుత్. “ఇంకా ఏం అనుకోలేదు”, చిరునవ్వును మునిపంట నొక్కిపెట్టి అంది సృష్టి. “మరెప్పుడు అనుకుంటావో చెప్పు, నన్నొక అమ్మాయి డేట్ కి రమ్మని అడుగుతుంది, ఆ అమ్మాయికి ఏం చెప్పను?” “చంపేస్తానని చెప్పు!!” కసిగా అంది సృష్టి. అది విని నవ్వుకుని, “ఎందుకు?”అనడిగాడు అద్భుత్. అతనికి సృష్టిని ఇంకా ఉడికించాలని ఉంది. “ ఏమో?” అని చెప్పి వెళుతున్న సృష్టి ని చూసి, “చెప్పేదాకా వదలను చూడు,” అంటూ సంతోషంగా ఫీల్ అవుతూ గెంతులేసాడు అద్భుత్. కాలేజ్ స్పీకర్స్ నుండి “మిస్టర్ అద్భుత్, ఫైనల్ ఇయర్, యు ఆర్ సపోజ్డ్ టు బి ఎట్ డీన్స్ ఆఫీస్” అంటూ వినిపించటం తో “ఇప్పుడే కదరా గెంతులేసాను, ఇంతలోనే రంకెలా,” అనుకుంటూ డీన్ ఆఫీస్ వైపుకు కదిలాడు అద్భుత్. ************* కోనలో రుద్రాణి కోనకు సంబంధించిన విషయాలపై ప్రవల్లిక తన టీంతో రీసెర్చ్ ను మొదలు పెడుతుంది. ప్రవల్లిక టీంకు కోయ గుంపు మర్యాదలు చేస్తుండటం చూసిన యామిని, టెంట్ లో భూతద్దంతో అడవిలో దొరికిన ఒక వస్తువుని చూస్తూ... “మేడం ఈ కోన గురించి విన్నంత భయంగా ఇక్కడేం కనిపించటం లేదు కదా !” అంది. “మనకి కనిపించేది అంతా నిజం కాదు, ప్రమాదాన్ని కనిపించనివ్వకుండా ప్రకృతి తన అందంతో మాయ చేస్తుంది” అని చెప్తూ, రుద్రాణి కోన పుస్తకాన్ని చేతులోకి తీసుకుంది ప్రవల్లిక. మొదటి పేజ్ ను తిప్పగానే వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. పేజ్ లో ఏం కనిపించక పోవటం చూసి దానికేసి ఆశ్చర్యంగా చూడసాగింది ప్రవల్లిక. ఇంతలో ఒక్కసారిగా ఎక్కడినుంచో సింహం గర్జన వినిపించింది. యామిని భయంతో ఉలిక్కిపడి, భూతద్దాన్నివదిలేసింది. “అడవి కదా, అరుపులు కామన్” అని ప్రవల్లిక సింపుల్ గా అంది. “అరుస్తుంది సింహం కదా మేడం”, ఒణుకుతూ అంది యామిని. “సరే రేపు చేసుకుందాం, వెళ్లి పడుకో” అని ప్రవల్లిక అనగానే, యామిని పనిని వదిలేసి పరుగున బెడ్ మీద పడుకుని ముసుగు పెట్టేసుకుంది. యామినిని చూసి నవ్వుకుంటూ, ఆమె వదిలేసిన భూతద్దం తన ముందు ఉన్న పుస్తకం మీద పడటంతో, భూతద్దాన్ని చేతుల్లోకి తీసుకుని పక్కన పెట్టబోతూ, ఏదో కనిపించినట్లు అనిపించటంతో భూతద్దం నుండి పేజిని చూసింది ప్రవల్లిక. పేజ్ లో ఎపిగ్రఫితో రాసి ఉన్నది కనిపించటం చూసి అద్దాన్ని తప్పించి పేజ్ వైపు చూసింది. ఖాళీగా ఉన్న పేజ్ ని చూసి అద్దం నుండి మరలా చూసింది. భూతద్దం మీద పడ్డ కాంతి వల్ల ఏర్పడిన వెలుగులో మాత్రమే రాసింది కనిపించేలా రాసిన తండ్రి ప్రతిభను మనసులోనే మెచ్చుకుంది ఆమె. “ఇక్కడ ఉన్నది వెలుగులోకి వస్తే ఎందరికో వెలుతురుని ఇస్తుంది. ఇక్కడి సంపద అమ్మ సొంతం అని కొందరి వాదన... మరి అమ్మనే మొక్కుతున్న అడవి బిడ్దల సంగతేంటి? ఈ అడవిని మింగేయాలని కొన్ని గుంట నక్కలు కాచుకుని కూర్చున్నాయి, ఆ నక్కల అంతు చూసేది ఎవరు?” అని పుస్తకంలో ఉన్నది చదువుతుండగా, ఆమెకు ఉన్నట్టుండి గజ్జెల శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలకు టెంట్ బయటకు వెళ్ళిన ప్రవల్లిక కనిపిస్తున్న అడవిని చూడసాగింది. “లచ్చిమీ... అమ్మొచ్చే ఏల అయినాది... సద్దె సల్లారిపోద్ది రా తల్లీ... “ అని పిలుపులు వినిపించి, ఆమె ఆ పిలుపుల వస్తున్న వైపు వెళ్ళింది. అక్కడి చీకటి అడవిలో కమ్ముకుంటున్న వెలుగు వల్ల మరుగైపోతోంది. ప్రవల్లిక కనిపిస్తున్న వెలుగు వైపుకు వెళ్ళసాగింది. ఆమెను దాటుకుంటూ ఒక పిల్లాడి రూపం వెళ్ళసాగింది, “సిన్నోడా ఆగరా అలుపోత్తాంది”, అంటూ పిల్లాడి వెనకనే వెళుతున్న ఒకామెని చూసి ఆమెనే షాకింగ్ గా చూస్తూ ఉండిపోయింది. కారణం ఆమెకు వేరొక రూపంలో తన ప్రతిబింబమే, కళ్ళ ఎదురుగా కనిపిస్తోంది. హఠాత్తుగా ఒక భయంకర జంతువు వారిపై దాడి చేసింది. అది చూసి ప్రవల్లిక కెవ్వుమని అరిచి మైకంతో పడిపోయింది. **************** ఫ్రెడ్రిక్, తలకోన కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీలేరు దగ్గరలో తన మకాంని ఏర్పాటు చేసుకున్నాడు. 50 కిలోమీటర్ల వరకు సిగ్నల్స్ రిసీవ్ చేసుకోగలిగిన శాటిలైట్ లను ఏర్పాట్లు చేయమని, అడవికి చుట్టుపక్కల ఏమి జరిగినా తనకు తెలియాలని, తన బృందానికి చెప్పాడు. తంత్రిణి, అత్రికలు వారి అనుచరగణాలతో కలిసి గండరుడుని పునః శక్తి వంతుడిని చేయటానికి హోమాలు చేయసాగారు. గండరుడు చెప్పిన పునర్వసు నక్షత్ర జాతకుడు ఎవరా అని ఫ్రెడ్రిక్ ఆలోచనలో పడ్డాడు. ***************** కర్ణాటక సరిహద్దులలో ఎర్ర చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి రాజుగా పిలవబడే సాల్మన్ రాజు దృష్టి తలకోన అడవులఫై పడింది. సాల్మన్ రాజు అతనికి అడ్డు వచ్చిన వారిని రక్తం వాసన తెలియకూడదని, గంధం చెక్కల మధ్యలోనే అంతం చేస్తాడు. అనుమతులు లేకుండా అతను నరికేసిన చెట్లకు, తలలకు లెక్క లేదు. చెట్టైనా, మనిషైనా అతని కత్తికి పెద్దగా తేడా ఉండదు. తలకోనలో పాగా వేయటానికి కోనకు 120 మైళ్ళ దూరంలో బయలుదేరిన పునర్వసు నక్షత్ర జాతకుడు సాల్మన్ రాజు కు రుద్రాణి కోన రహస్యం గురించి ఏమి తెలియదు కాని ఆ రహస్యం ప్రపంచానికి తెలియటానికి అతను కూడా ఒక కారణం అవ్వాలనేది విధి. *********** “మేడం! మేడం!” పిలుస్తున్న యామిని పిలుపులకి మెలకువ వచ్చింది ప్రవల్లికకు. ఆమె కళ్ళు తెరచి చూస్తుంటే, “ఏంటి మేడం అంతలా నిద్రపోయారు?” అని యామిని అడిగింది. ప్రవల్లికకు రాత్రి జరిగింది గుర్తొచ్చి,” నేనిక్కడికి...” అని అడగబోతూ, తనని రాత్రి ఎవరో చేతుల్లో మోసుకొచ్చింది తెలుస్తున్నాకదలలేకపోయినది గుర్తొచ్చి, రుద్రాణి పుస్తకానికి కనిపిస్తున్న ఆకుని చూసి, ఆశ్చర్యంగా చేతుల్లోకి తీసుకుంది. “ఎంచుకున్న చోటులో పొంచి ఉండే ప్రమాదాలు కూడా ఉంటాయి మిస్ పజిల్,” అని రాసి ఉంది దానిమీద. అది చదివి, “ అంటే నన్ను రాత్రి తీసుకొచ్చింది ఆ దేవ్ నా? అసలు అతనెవరు? రాత్రి నాకు కనిపించింది ఎవరు? కారులో వస్తున్నపుడు కనిపించినది ఎవరు? నాకే ఎందుకు కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు?” అని ఆలోచిస్తూ ఉండిపోయింది ప్రవల్లిక. “మేడం! ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు?” అని యామిని అడగటంతో “ఏం లేదు, నేను రెడీ అయి ,వస్తాను. కాసేపట్లో అడవిలోకి వెళదాం”, అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది ఆమె. “సరే మేడం” అని యామిని టెంట్ నుండి బయటకు వెళ్ళింది. ఆకుని పుస్తకంలో ఉంచి, “ఈ దేవ్ ని ఎలా కలవాలి?” అనుకుంటూ బెడ్ పై నుండి లేచింది. టెంట్ బయటకు వచ్చిన యామినిని,” ఏమంటోంది మేడం?” అడిగాడు తేజ. “ఏమంటుంది, ఏదైనా అడిగితే ఏమి లేని ఆ పుస్తకాన్నిఅనుమానంగా చూస్తుంది. మనకి కనిపించనిది ఆవిడకేం కనిపిస్తుందో మరి,” అంది యామిని. “అయినా ఏ అజంతాకో ఎల్లోరాకో వెళ్ళకుండా ఈ ఆకులు అలములు వెతుక్కుంటూ అడవికి రావడమేంటో?” నిరుత్సాహంగా అన్నాడు తేజ. చెట్టు ఆకులు పైకి చేతిలోని కర్రని విసిరాడు. చెట్టు రూపంలో ఉన్న కాలసర్పం, కోపంగా గాలిని ఊదటంతో యెగిరి అవతల పడ్డాడు. అది చూసి అందరూ నవ్వుతుంటే, “ఏమైంది ఇలా పడిపోయాను,” అనుకుంటూ తత్తర పడుతూ లేచాడు. “వెళదామా?”, అంటూ ప్రవల్లిక రావటంతో, అందరూ తమ తమ మెటీరియల్స్ ని తీసుకుని ప్రవల్లికతో అడవిలోకి బయలుదేరారు. ***************** బెంగళూరు ఐ ఐ ఎస్ సి లో జరగబోయే యూత్ మీట్ కు అద్భుత్, సృష్టి లు ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. “నువ్వు కూడా ఆ బస్ లో వెళ్ళడం ఎందుకురా, మన కార్ తీసుకెళ్ళు,” అన్నాడు కృష్ణరాజ్. “డాడ్! నేను వెళ్ళేది యూత్ మీట్ కి, ఫ్రెండ్స్ అందరూ బస్ లో ఎంజాయ్ చేస్తూ వెళుతుంటే నేను ఒక్కడిని కార్ లో వెళితే ఏం బాగుంటుంది?” అడిగాడు అద్భుత్. “ఓహో నీ సృష్టి బస్ లో వస్తుందా?” అర్ధోక్తిలో సాగదీస్తూ అన్నాడు కృష్ణ రాజ్. “డాడ్!!!!” అని అద్భుత్ నవ్వుకోవటం చూసి, “ఆ సృష్టి ని మాకు పరిచయం చేసేదేమైనా ఉందా?” అని అడిగాడు. “మీకేంటో అంత తొందర?” అడుగుతూ రాధిక ఇద్దరి మధ్యకు హారతి తీసుకెళ్ళింది. “అదేమిటోయ్ కాబోయే కోడలుని చూడాలనుకోవటంలో ఆ మాత్రం తొందర లేకపోతే ఎలా?” అన్నాడు కృష్ణ రాజ్, హారతి కళ్ళకు అద్దుకుంటూ. “ఏరా నాన్నా, మీ నాన్న చాలా దూరం వెళ్ళిపోతున్నారు, ఇంతకి నువ్వెంత దూరం వెళ్ళావ్?” అని అద్భుత్ కళ్ళకి హారతి అద్దుతూ అడుగుతుంది రాధిక. “తనతో ఎంత దూరమైనా వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా, “ ఆలోచిస్తూ అన్నాడు అధ్భుట్. “సారూ, త్వరగా మన భాద్యత పూర్తి చేస్తే మాట దక్కుతుంది మరి,” కొంటెగా అంది రాధిక భర్తతో. “చిత్తం శ్రీమతి గారూ, ఇకపై అదే మన కర్తవ్యం,” అన్నాడు కృష్ణరాజ్. ************** హైదరాబాద్ లో ఫ్రెడ్రిక్ , విలియమ్స్ తమ కారవాన్ లో వెళుతుంటారు. ఫ్రెడ్రిక్ దీర్ఘంగా ఆలోచిస్తుంటే గమనించిన విలియమ్స్, చేతిలోని వైన్ గ్లాస్ ను ఫ్రెడ్రిక్ కు అందించి , “డోంట్ వర్రీ ఫ్రెడ్డీ ...అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయి. బిలీవ్ మి” అన్నాడు. “యా హోప్ సో , కానీ ఎందుకో ఇదంత చిన్న విషయంలా అనిపించట్లేదు. ఆర్ యూ ష్యూర్ ఈ విచ్ ల వల్ల అవుతుందంటావా?” ఫ్రెడ్రిక్ నిరుత్సాహంగా అడిగాడు. “ష్యూర్ దే విల్! నువ్వే చూసావుగా, థింగ్స్ హావ్ చేంజడ్, తంత్రిణిని కలిసిన తరువాత వియ్ గాట్ సమ్ బ్రేక్ థ్రూ.. ఆల్మోస్ట్ వియ్ ఆర్ నియర్ టు ద సీక్రెట్ .. “, తాపీగా వైన్ సిప్ చేస్తూ చెప్పాడు విలియమ్స్. “బట్ హూ ఈజ్ దిస్ , వాట్ దే సెడ్ ..ఆ ..పునర్వసు నక్షత్రం వాడు , ఎవడయి ఉంటాడు ?” ఫ్రెడ్రిక్ అడగటం విని, “ఎవడైనా కానీ వచ్చాక మనవాడైపోతాడు” అన్నాడు విలియమ్స్. క్యారవాన్ వెళుతూ ఉంది. అదే రోడ్ కు కొంత దూరంలో ఉన్న శ్రీని మెడికల్ అండ్ ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో .. ఐఐఎస్ సీ మీట్ కు వెళుతున్న స్టూడెంట్స్ బస్ ఎక్కుతున్నారు.... అద్భుత్ గడియారం వైపు చూసుకుని,” సృష్టి రాలేదేంటి ?” అని అనుకుని సృష్టి స్నేహితురాలు వందన దగ్గరకెళ్ళి , “వందనా సృష్టి ఇంకా రాలేదేంటి?” అని అడిగాడు. “అదేంటి నీకు తెలియదా, తను రావట్లేదు కదా,” అని వందన చెప్పింది. “రావట్లేదా ? ఏమయ్యి ఉంటుంది ? తను బానే ఉందా ?”అని అనుకుంటూ ఉండిపోయాడు అద్భుత్. “ వేర్ ఆర్ యూ బోయ్? ఆల్ రెడీ ..గెట్ ఇన్ ..విల్ స్టార్ట్” అంటూ ప్రొఫెసర్ బస్ లో కి ఎక్కాడు. “సార్, ఏమనుకోకండి మీరు బయలుదేరండి , నేను బెంగళూరులో జాయిన్ అవుతాను,” అని అద్భుత్ చెప్పటం విని, “ఆర్ యూ ష్యూర్?” అడిగాడు ప్రొఫెసర్. “యస్ సర్! యూ పీపుల్ క్యారీ ఆన్,” అని ప్రొఫెసర్ కి చెప్పి విండో పక్కన కూర్చున్న వందన దగ్గరకు వెళ్ళి “వందనా, సృష్టి అడ్రస్ ఇస్తావా?” అని అడిగాడు. “ష్యూర్” అని వందన పేపర్ పై రాస్తున్నంతలో, ప్రొఫెసర్ డోర్ లాక్ చేసాడు. “ఓకే ..అద్భుత్ , బై .. డోంట్ బీ లేట్ టు ద మీట్ ..”అని అద్భుత్ కి చెప్తుండగా డ్రైవర్, రైట్ రైట్ అనటంతో బస్ కదిలింది. వందన అడ్రస్ రాసిన పేపర్ ను గాలిలోకి వదలటంతో, అద్భుత్ దానిని పట్టుకోబోతుంటే గాలి ఎక్కువగా వీచటం మొదలయ్యింది. కాగితం గాలిలో ఎగురుతూ వెళుతుంటే అద్భుత్ దాన్ని పట్టుకోడానికి వెళ్తున్నాడు. కాగితం వెళుతూ వెళుతూ, కాలేజ్ గేట్ దాటి రోడ్ మీదకు వెళ్ళిపోవటం చూసి , “ఒసే ఆగవే అది ఒట్టి అడ్రసు కాదే , నా లైఫ్ అడ్రెస్”, అంటూ రోడ్ దాటి వెళుతూ, రోడ్ కి చివర కనిపించిన డ్రైనేజిని చూసి, అక్కడున్న డివైడర్ పై నిలబడి, అటువైపుగా వస్తున్న కారవాన్ ను చూసి, కారవాన్ వెనక గ్రిల్ ను పట్టుకుని ఒక్క ఉదుటున జంప్ చేసి డ్రైనేజ్ లో పడబోతున్న పేపర్ ను పట్టుకున్నాడు. రేర్ వ్యూలో అదంతా చూసిన ఫ్రెడ్రిక్ “వాట్ ద హెల్,” అని ఇరిటేట్ అవుతూ కారవాన్ ఆపమని బెల్ ప్రెస్ చేయటంతో కారవాన్ ఆగింది. కోపంగా కారవాన్ దిగి, కాగితాన్ని చూసి ఆనందపడుతూ పేపర్ లో రాసి ఉన్న మొబైల్ నంబరుకు కాల్ చేస్తున్న అద్భుత్ ను చూసి,” హేయ్ బోయ్ ,ఆర్ యూ క్రేజీ?” అని అడిగాడు ఫ్రెడ్రిక్. “సారీ జెంటిల్ మెన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్” అని అద్భుత్ అనటం విని , “వాట్ !దిస్ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ మోర్ దాన్ యువర్ లైఫ్?” అన్నాడు ఫ్రెడ్రిక్. “బట్ ఫర్ నౌ దిసీజ్ మై లైఫ్ , ఒన్స్ అగైన్ సారీ,” అని చెప్పి అద్భుత్ వెళ్తుండటం చూసి, “హేయ్ యూ ఆర్ బ్లీడింగ్?” అని అధ్బుత్ కాలి నుండి కారుతున్న రక్తాన్ని చూసి అన్నాడు ఫెడ్రిక్. అద్భుత్ అది చూసుకుని జంప్ చేస్తున్నపుడు కాలికి గ్రిల్ అంచు తగలటం గుర్తొచ్చి, ఇట్స్ ఓకే అన్నాడు. “నాట్ ఓకే .. వెయిట్ వెయిట్,” అని అద్భుత్ కు చెప్పి,” ఎక్కడికెళ్ళాలి?” అని అడిగాడు ఫ్రెడ్రిక్. “జుబ్లీహిల్ల్స్” అని అద్భుత్ చెప్పటంతో కమ్ డ్రాప్ చేస్తాను, అని ఫ్రెడ్రిక్ లిఫ్ట్ ఆఫర్ చేసాడు. “థాంక్స్ , బట్ ఐ విల్ టెక్ ఆటో,” అంటూ అద్భుత్ ఆటోను పిలిచాడు. “అటే వెళుతున్నపుడు ఆటో ఎందుకు, ఫర్లేదు రా,” అని ఫ్రెడ్రిక్ అనటం విని “వావ్ , మీరేంటి తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు?” అని అడిగాడు అద్భుత్. “ఒక పని కోసం రెండేళ్లుగా తెలుగు గాలి పీల్చుతున్నాం కదా, ఇక్కడి భాష కూడా మాలో ఒకటై పోయిందని” చెప్తూ ఫ్రెడ్రిక్ అద్భుత్ కి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఇస్తాడు. అధ్భుత్ కాటన్ తో రక్తం తుడుచుకుని బ్యాండ్ ఎయిడ్ వేసుకుంటుండగా, “ఏంటి లవ్వా?” అని అడిగాడు విలియమ్స్. “అంతకంటే ఎక్కువ,” అని అధ్బుత్ చెప్పటం విని నవ్వుకుని,” అందుకేనా రక్తం ఇచ్చి మరీ పట్టుకున్నావ్ ?” అన్నాడు ఫ్రెడ్రిక్. “తన కోసం రక్తమేంటి ప్రాణమైనా ఇచ్చేస్తాను,” అన్నాడు అద్భుత్. “వేడి రక్తం కదా! ఇపుడు అలానే అంటారు,” అని నవ్వుతూ విలియమ్స్ డ్రింక్స్ ప్రిపేర్ చేస్తాడు. “ట్రెజర్ ఆఫ్ లైఫ్ టైం” అని కనిపించిన బుక్ ని , కొన్ని ఫొటోగ్రాఫ్ లను చూసిన అద్భుత్ – “అంటే మీరు ఏదయినా ట్రెజర్ హంట్ చేస్తున్నారా?” అని అడిగాడు. “సింపుల్ గా అలాంటిదే, కానీ దాన్ని ట్రెజర్ అనటం కంటే పవర్ అనాలి ,”చెప్పాడు ఫ్రెడ్రిక్. “ఇండియా కదా అలానే అనాలి , ఆ పవర్ దొరికితే ఏం చేస్తారు?” అడిగాడు అధ్బుత్. “ఆ పవర్ చిక్కితే ప్రపంచానికే ఎనర్జీ వస్తుంది, అది దొరకటం అలా ఉంచితే కనీసం ఒక్కసారయినా చూడాలి,” అని ఫ్రెడ్రిక్ ఎక్సైట్ అవ్వుతూ చెప్పాడు. “వినటానికి బావుంది, దొరికితే ఇంకా బావుంటుంది.” అని చెప్తూ నా ప్లేస్ వచ్చేసింది అన్నాడు అద్భుత్. విలియమ్స్ బెల్ ప్రెస్ చేయటంతో కారవాన్ ఆగింది. “థాంక్యూ అండ్ నైస్ మీటింగ్ యూ,” అని అద్భుత్ ఫ్రెడ్రిక్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. “ఓకే యంగ్ బోయ్! ఆల్ ద బెస్ట్ నీకు, నీ లవ్ కి కూడా !” నవ్వుతూ చెప్పాడు ఫ్రెడ్రిక్. అది విని హ్హ హ్హ అని నవ్వుకుని,” టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, మీ పల్స్ రేట్ చెప్తోంది మీ హార్ట్ అంతా ఆ ట్రెజర్ పైనే ఉందని, డోంట్ వర్రీ మా అమ్మ ఎపుడూ చెపుతుంది.. ఏదయినా మంచి మనసుతో హార్ట్ ఫుల్ గా కోరుకుంటే అది మనకు దక్కుతుందని, ఐ విష్ మీ ట్రెజర్ కూడా మీకు దొరకాలని, అది అందరికీ ఉపయోగపడాలని” అని అద్భుత్ అన్నాడు. “థాంక్యూ సో మచ్”, అని అద్భుత్ ని హగ్ చేసుకున్నాడు ఫెడ్రిక్. “బై బై”, అని అద్భుత్ వెళ్ళటం చూస్తూ ఉన్న ఫ్రెడ్రిక్ ని, “వాట్ ఫ్రెడ్డీ, ఆర్ యూ ఓకే, వేలు టచ్ అయ్యిందని ఒకడి చెయ్యే తీసేసావ్, అలాంటిది నువ్వు వీడిని హగ్ చేసుకున్నావ్, ఏమైంది ?”అడిగాడు విలియమ్స్. అది విని నవ్వుకుని నాకెందుకో వీడిని మరలా కలుస్తాననిపిస్తుంది చెప్పాడు ఫ్రెడ్రిక్.******
ప్రవల్లిక తన టీంతో రీసెర్చ్ చేస్తూ ఉంది. కోన మధ్యలో కనిపించిన సూరీడు, జాబిల్లి విగ్రహాలను చూసి వాటిని చూస్తుండగా, పరిగెత్తుతున్నకాలి గజ్జెల శబ్దం వినిపించటంతో వెనక్కి తిరిగి “ఆగరా సచ్చినోడా .. నన్ను ఒగ్గేత్తనంటవా సచ్చినావ్ నా సేతిలో ..ఆగరా,” అంటూ కోయ యువతి రూపంలో ఉన్న తన రూపం తన పక్కగా పరిగెత్తుతూ అస్పష్టంగా కనిపిస్తున్న ఒక పురుషుడి వెనక వెళుతూ కనిపించింది. తనకు తెలియకుండానే వారి వెనక ప్రవల్లిక ఆదరాగా పరిగెత్తుకుని వెళ్ళసాగింది. ఒక చెట్టు దగ్గర లచ్చిమి కొడుతూ బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. “పిచ్చి లచ్చీ..ఈ పానమైన ఒగ్గేత్తా కానీ నిన్ను ఒగ్గనే,” అని అతను చేతిలోని సంపెంగను లచ్చిమి తలలో తురిమాడు. ఇద్దరూ లాలనలో వారి ప్రపంచంలో ఉండగా వెనక నుండి వస్తున్న సింహాన్ని చూసి ప్రవల్లిక “లచ్చిమీ సింహం”, అని గట్టిగా అరిచి, వారేం పట్టించుకోకపోవటం చూసి తనకు తెలియకుండానే కనిపించిన విల్లును చేతిలోకి తీసుకుని సింహానికి గురిపెట్టి బాణాన్ని వదులుతుంది. బాణం తగిలి సింహం బిగ్గరగా గాండ్రించి పడిపోతూనే మాయమయిపోవటం చూసి లచ్చిమి, ఆమెతో ఉన్న పురుషుడు కనిపించకపోకపోవటంతో చెట్టు దగ్గరకి వెళ్లి వెతకసాగింది. అసలేం అవుతుంది నాకు, అంతా అయోమయంగా ఉంది అనుకుంటూ ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ కనిపించిన అయ్యోరును చూసి, ఆయన వద్దకు వెళ్ళసాగింది. అయ్యోరు దగ్గరకి వెళ్ళగానే, ఆయన,” ఈ ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలతో నిండి ఉంది, వాటి సమాధానాలు కాలంలోనే కలిసి ఉన్నాయి. శోధించి సాధించుకోవటమే సృష్టి మనకప్పగించిన కర్తవ్యం” అని అంటూ కళ్ళు తెరిచారు. “ఎవరు మీరు? ఇక్కడేం చేస్తుంటారు?” అడిగింది ప్రవల్లిక. “నీకులానే గమ్యాన్ని వెతుకుతూ కాలంతో ప్రయాణిస్తున్న బాటసారిని.” “నేనేం వెతుకుతున్నానో మీకు తెలుసా?” అడిగింది ప్రవల్లిక ఆపుకోలేక. “ఆగిపోయిన ఒకరి ఆశను వెతుక్కుంటూ వచ్చావ్ , నీకు నువ్వు దొరుకుతున్నావ్”, చెప్పాడు అయ్యోరు. “ఇక్కడికి నేనెందుకు వచ్చానో మీకెలా తెలుసు? నాకు కాదు ఈ కోనకు తెలుసు ఆ అమ్మకు తెలుసు, నీకు కూడా తెలిసే ఘడియలు సమీపంలోనే ఉన్నాయి,” అని అయ్యోరు కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయారు. ప్రవల్లిక ఆలోచనలో ఉండగా,” మేడం ..మేడం...” అనే పిలుపుల్ని విని తన కోసం వెతుకుతున్న తన టీమ్ దగ్గరకి వెళ్ళింది. “నీ మదిలో ప్రశ్నలకు సమాధానాలు నీ చెంతనే ఉన్నాయి , చూసే కళ్ళతో కాదు శోధించే నీ మనసుతో చూడు దారి దొరుకుతుంది,” అని ధ్యానం లో ఉన్న యోగి చెప్పినట్లు అనిపించి యోగి వైపు చూస్తుంది. “మేడం ఇక్కడేం చేస్తున్నారు?” అని యామిని అడగటం విని, “ఆ..” అంటూ తత్తరపడి, “ఆ యోగిని చూస్తున్నాను”, అని చెప్పింది ప్రవల్లిక. “ఏ యోగి మేడం, అక్కడెవరూ లేరు కదా! “ ఆశ్చర్యంగా అంది యామిని. “ వాట్ , ఏం మాట్లాడుతున్నావ్? ఆ చెట్టు కింద ఆ యోగి,” అంటూ చెట్టు వైపు చూడగానే అయ్యోరు తల అడ్డంగా ఉపటం చూసి,” ఏం లేదు పద” అని అంది. “ఏమయింది మీకు అదోలా ఉన్నారు, ఆర్ యూ ఓకే,” అడిగింది యామిని రెట్టించి. “యా ఐ యాం ఓకే .. “అని చెప్పి,” మిగిలిన వాళ్ళెక్కడున్నారు?” అడిగింది ప్రవల్లిక ఒక పక్క ఆలోచనలో ఉంటూనే. “అందరూ మీ గురించే ఎదురు చూస్తున్నారు. వాగు దగ్గర బురదలో ఈ బ్యాగ్ దొరికింది,” అంటూ యామిని చెప్పగానే, అప్పటివరకూ ఆలోచనల్లో ఉన్న ప్రవల్లిక రియాక్ట్ అయ్యి యామిని చూపిస్తున్న బ్యాగ్ ని చూసి షాక్ కొట్టినట్లయ్యి ఇది .... “ఎక్కడ దొరికిందిది, ఇది మా నాన్నది”, అని కంగారుగా అంది. ******* అద్భుత్ సృష్టి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేసాడు. ఒంటిపై శాలువా కప్పుకుని “ఇంతసేపు ఎక్కడి కెళ్ళావ్? రాను రాను కూతురంటే ప్రేమ లేకుండా పోతుంది,” అంటూ తలుపు తెరచి, తలుపుకి ఆవల కనిపించిన అద్భుత్ ని చూసి, “నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావ్? అని అడిగింది సృష్టి. “వెళ్ళిపోనా అయితే ?” అన్నాడు అధ్బుత్. “వెళ్ళిపో అంటే వెళ్ళిపోతావా నువ్వు ?” అంటుంది సృష్టి హాల్లో సోఫాలో కూర్చుంటూ. “అంటే వెళ్ళననుకో,” అంటూ లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ని చూస్తూ...” హూ ..బావుంది” అన్నాడు అద్భుత్. “ఏంటి మనం బెంగుళూరు వెళ్ళకపోవటమా?” అడిగింది సృష్టి. “ఎవరన్నారు వెళ్ళట్లేదని?” అద్భుత్ అనటం విని,” బాబూ నాకు 104 జ్వరం. ఇల్లు కదిలితే మా అమ్మ చంపేస్తాను అంటోంది, “ అంది సృష్టి. అద్భుత్ సృష్టి నాడి పట్టుకుని,” మేడం డాక్టరు గారూ మనిషి జ్వరం వచ్చినప్పుడు ఎందుకు డల్ అయిపోతాడో తెలుసా, తనకు ఏదో అయిపొయింది అనే ఫీలింగ్ ని మైండ్ లో పెట్టేసుకోవటం వల్ల. ముందు ఈ బ్రెయిన్ లో ఉన్న ఆలోచనను వదిలెయ్..ఒంట్లో నుండి జ్వరం అదే వెళ్లిపోతుంది,” అంటాడు అద్భుత్. సృష్టి తననే చూస్తుండటం చూసి, సృష్టి ముఖం దగ్గరగా ముఖం పెట్టి,” ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు , కాసేపు నేనేం చేసినా ఏమనకు”, అన్నాడు. “అయ్యో ఏం చేస్తావ్ ?” అంటూ శాలువాను దగ్గరగా కప్పుకుంటూ బెదురుగా అడిగింది సృష్టి. “ముందు మీ కిచెన్ ను టేక్ ఓవర్ చేసుకుంటాను,” అని చెప్పి అద్భుత్ కిచెన్ కు వెళ్ళటం చూసి ఊపిరి పీల్చుకుంది ఆమె. ***** హోమం చేస్తున్న తంత్రిక ఉచ్చరిస్తున్న మంత్ర శక్తి వల్ల ఉద్భవించిన శక్తి కారణంగా ఆకాశంలో మార్పులు మొదలై ఉన్నట్లుండి పెద్ద శబ్దంతో మెరుపు మెరిసి కోనలో ఒక చోట పిడుగుపడి ఒక చెట్టుకి నిప్పు రాజుకుని మంటలు మొదలయ్యాయి. మంటలను చూసిన కోయ గుంపు బెదురుతూ అటు ఇటు పరుగులు తీస్తుంటే, విషయం తెలుసుకున్న తేజ వాగు దగ్గర రీసెర్చ్ చేస్తున్న ప్రవల్లిక దగ్గరకెళ్ళి ,”మేడం అడవిలో మంటలు రాజుకున్నాయి,” అని చెప్పటంతో ప్రవల్లిక టీం తో కలిసి అకడికి వెళ్ళింది. తంత్రిక హోమం వల్లన మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బెదురుతున్న కోయగుంపును చూసిన కోయదొర “అందరం అయ్యోరు కాడికి పోదాం పాండి”, అనటంతో అందరూ యోగి దగ్గరకి పరుగులు తీసారు. ****** పది నిమిషాల తరువాత కిచెన్ నుండి వినిపిస్తున్న సౌండ్స్ విని,” ఏం చేస్తున్నావ్ ?” అని అడిగింది సృష్టి. “టు మినిట్స్ మిస్ బ్యూటిఫుల్!” అంటూ చేతిలో గ్లాస్ తో సృష్టి దగ్గరికి వెళ్ళి,” కలువల్లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు మూసుకుని, ఈ చెర్రీ లిప్స్ తరచి, చిట్టి నోరుతో ఇది గటా గటా తాగేయ్,” అంటూ సృష్టి ముక్కు మూసి గ్లాసులో ఉన్న ద్రావకాన్ని తాగించేసాడు. “వాక్ ..ఏంటిది మంటగా ఉంది”, అంటుంది సృష్టి. “టెన్ మినిట్స్ ఆగు, అదోలా ఉంటుంది,” అంటూ నవ్వాడు అద్భుత్. అధ్బుత్ నవ్వటం చూసి,” సచ్చినోడా! నన్ను చంపేయటానికి వచ్చావా?” అని అద్భుత్ ని కొడుతుంది. అద్భుత్ అందకుండా పరిగెత్తుతూ మెట్లు ఎక్కి టెర్రస్ కు వెళతాడు. “ఆగుతావా లేదా ఆగరా , అసలెందుకు వచ్చావ్ ?” అంటూ మెట్లు ఎక్కి అద్భుత్ ని కొట్టబోతుంటే ,”స్టాట్యూ” అన్నాడు అద్భుత్. సృష్టి ఆగిపోగానే సృష్టి రెండు చేతులు పట్టుకుని ఆమె మెడకు ఆనించి “పోయే పోచె, ఇట్స్ గాన్”, అన్నాడు. సృష్టి నుదురుపై మెడపై చేతులు పెట్టుకుని “అరే ..ఏం చేసావ్,” అంది సర్ప్రైజ్ అవుతూ. “మ్యాజిక్ !” చెప్పాడు అద్భుత్. “ఓయ్ ! విషయం చెప్పు “అని సృష్టి అనటంతో “ఆయుర్వేద సంహిత రాసిన చరకుడు ఎపుడో చెప్పాడు, మన పెరడులో వంటగదిలోనే ఆరోగ్యాన్ని ఇచ్చే సహజ ఔషధాలు ఉన్నాయని, కానీ మనం వాటిని వద్దనుకుని కెమికల్స్ వెనక పడుతున్నాం,” అన్నాడు అద్భుత్. “నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయసలు ?” అడిగింది సృష్టి. “ప్చ్.. మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా,” చెప్పాడు అద్భుత్. అది విని సృష్టి పక పకా నవ్వింది. అద్భుత్ వెంటనే నేల మీద వెతకటం మొదలుపెట్టటం చూసి,” ఏమయింది ?” అని అడిగింది సృష్టి. “ఇప్పుడే ఇక్కడ నవరత్నాలు రాలి పడ్డాయి కదా,” అనటంతో, “ఏంటి సోపేస్తున్నావ్, ఏం కావాలేంటి ?” నవ్వుకుంటూ అడిగింది సృష్టి టెర్రస్ గ్రిల్ పై చేతులు ఆన్చి కనిపిస్తున్న రోడ్ వైపుకు చూస్తూ. అద్భుత్ సృష్టి పక్కనే నిలబడి, తన భుజాన్ని సృష్టి భుజానికి ఆన్చి,” మరి బెంగుళూరు బయలుదేరదామా?” అడిగాడు. ఇద్దరి భుజాలపై సూర్యుడు, చంద్రుడు మచ్చలు ఒకదానికొకటి తగలటంతో శక్తి ఉద్భవించటం మొదలై ఆకాశంలో నల్ల మబ్బులు ముసురుకోవటం మొదలయ్యింది. ************ కోయ గుంపు అయ్యోరు కూర్చునే చెట్టు దగరకి వెళ్లి మొక్కుతుంటే చూసిన ప్రవల్లిక చెట్టు వైపుకు చూస్తుంటుంది. “అక్కడ ఎవరున్నారు మేడం, వీళ్ళంతా అయ్యోరా అంటూ ఎవరికి మొక్కుతున్నారు?” అడిగింది యామిని. ఒక్కసారిగా వర్షం మొదలవటంతో అయ్యోరు కళ్ళు తెరచి “అమ్మా ..! నీ బిడ్డల్నే కాపలాగా పెట్టావా తల్లీ.. ధన్యోస్మి మాతా! “ అంటాడు చేతులు జోడిస్తూ. కోనలో వర్షం పెద్దదవటంతో మంటలు ఆరిపోవటం చూసి కోయ గుంపు అయ్యోరు కూర్చునే చోటుకి సాష్టాంగ పడి లేచి వెళ్లిపోతుంటారు. ప్రవల్లిక కోయ దొరను ఆపి,” మీకు ఆ యోగి కనిపిస్తున్నారా?” అని అడుగటం విని,” ఆ అయ్య కాన రావాలంటే పుణ్యం సేసుకోవాల,” అని చెప్పి వెళ్ళటం \తో ప్రవల్లిక తనకు కనిపిస్తున్న అయ్యోరు వైపు చూసింది. “మేడం రండి వర్షం పెద్దదయింది అంటూ యామిని హడావిడి పెడుతుండటంతో ప్రవల్లిక వెళుతూ అయ్యోరు వైపు చూసింది. అయ్యోరు నవ్వుకుంటూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తాడు. ***** (సశేషం )
No comments:
Post a Comment