“ సినిమా సూపర్‌ హిట్‌ “ - అచ్చంగా తెలుగు

“ సినిమా సూపర్‌ హిట్‌ “

Share This
“ సినిమా సూపర్‌ హిట్‌ “
   -వెంపరాల.వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి.

' సంతలో చింత కాయ ' సినిమా సూపర్‌ హిట్టవడంతో రచయిత రాంబాబు పట్టపగ్గాల్లేని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవతున్నాడు.ఇక చెప్పేదేముంది రోజంతా ఫ్రెండ్స్‌, తో మందు,విందులతో తూలుతున్నాడు.ఇలా వుండగా హటాత్తుగా ఓ రోజు ఓ రిజిస్టర్‌ కవర్‌ వచ్చిపడింది రాంబాబుకి.అందులో సారాంశం అర్ధమయ్యేసరికి రాంబాబుకి వారం రోజుల నించి తాగినదంతా ఒక్కసారిగా దిగిపోయినట్టయింది.ఏం చేయాలో తోచక కాలుకాలిన పిల్లిలా గది చుట్టూ ప్రదక్షిణలు చేసి,ఎవరి,ఎవరికో ఫో న్లు చేసి నానా  యాగీ చేసాడు.చివరికి సినీ మిత్రుడు,ఆ చిత్ర నిర్మాత ఉంగరాల.లింగరాజు దగ్గరకి పరిగెట్టాడు.
లింగరాజు దగ్గరకెళ్ళి ఆ కవర్‌ చూపించాడు.అది చదివి లింగరాజు కి చిర్రెత్తుకొచ్చింది.
" అందుకేనయ్యా..ఈ సినిమా ఫీల్డ్లో ఎవడ్నీ నమ్మడానికి లేదనేది.నానా కష్టాలు పడి సినిమా తీస్తే,అది రిలీజవుతుందో లేదో తెలియక,రిలీజ్‌ చెయ్యడానికి దియేటర్లు దొరుకుతాయో లేదోనని,చివరికి ఎలాగోలా రిలీజ్‌ చేస్తే దాని ఫలితం తెలిసేలోగా పైరసీ ప్రత్యక్షం.నిర్మాతకి చెంగు,డిస్త్రిబ్యూటర్‌ కి బొంగు మిగులుతోంది ఇక్కడ.ఈ భాదలు పడలేక చస్తుంటే సందట్లో సడేమియా అని ఇది మరొకటా...?
ఇంతకీ ఈ గునపాల.గోవర్ధనం గాడు ఎవడయ్యా.?వీడి పేరు ఎక్కడా వినలేదే.అయినా ఎందుకొచ్చిన తలనొప్పయ్యా ఇది.ఓ సారి పిలువు.మాట్లాడదాం.." అంటూ రంకెలేసాడు లింగరాజు.
ఇంతలో ఆ చిత్ర దర్శకుడు గుండు.గజానన్‌ అక్కడికి వచ్చాడు.
" ఏంటి సార్‌..! చిత్ర విజయాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టున్నారు." అన్నాడు.
మళ్ళీ చిర్రెత్తుకొచ్చింది లింగరాజుకి.
" తీసేవ్‌ లేవోయ్‌..బోడి సినిమా ఒకటి.సినిమా హిట్టో,హిట్టో అని మనం డప్పేసుకోవడం తప్ప,చిల్లి గవ్వ చేతికొచ్చేలా కనబడ్డం లేదు." అని రుస రుసలాడేడు.
" ఇంతకీ ఏమైంది సార్‌..అలా వున్నారు " అన్నాడు.
ఆ కవర్‌ చిరాగ్గా గజానన్‌ వైపు విసిరాడు లింగరాజు.
" ఇప్పుడు ఇదంతా ఎవడు చదువుతాడు గాని,అందులో ఎముందో మీరైనా చెప్పండి రాంబాబు గారు " అన్నాడు.                                                                    -
" ఏమీ లేదండి..గజానన్‌ గారు.ఎవడో గునపాల.గోవర్ధనం అట.వాడెప్పుడో నాలుగేళ్ళ కిందట ఏదో ఎత్తేసిన పత్రికలో అదీ ఆఖరి పేజీలో ' సొరకాయలో బీరకాయ ' అనే కథ రాసాడట.ఆ కథ నే మనం కొంచెం అటూ.ఇటూ మార్చి కాపీ కొట్టి ఈ ' సంతలో చింతకాయ ' సినిమా తీసామని,వాడి పర్మిషన్‌ లేకుండా వాడి కాపీరైట్స్‌, తస్కరించినందుకు , వాడి పేరు ఎక్కడా చూపనందుకు సదరు నిర్మాత,రచయిత తక్షణం ఏభై లక్షలు చెల్లించాలని లేదంటే కోర్టు ద్వారా అందరిమీదా కేసులు వేస్తానని బెదిరిస్తూ నోటీసు ఇచ్చాడయ్యా." అదీ సారాంశం అన్నాడు రొప్పుతూ రాంబాబు.
" ఓస్‌..అంతేకదా..! దానికేం పెద్ద కంగారు పడకండి సార్‌.నేనున్నాగా..చూసుకుంటాను." అన్నాడు ధీమాగా గజానన్‌.
"  ఏమిటోయ..అంత ధీమా " అన్నాడు లింగరాజు.
" ఇది ఈ రోజుల్లో పెద్ద ఫాషన్‌ కాదు కామన్‌ అయిపోయింది సార్‌ ,ఎప్పుడో,ఎవడో,ఎక్కడో ఏదో రాసానంటాడు.అదే వాళ్ళు సినిమాగా తీసారంటాడు.ఒకడికి వచ్చిన ఆలోచన ఇంకొకడికి రాకూడదని ఎక్కడయినా వుందా? ఒక కథని వంద రకాలుగా తిప్పి,తిప్పి చెప్పి తిప్పలు పెట్టేరకం మనం అని మన ప్రేక్షకులకు తెలియదా.అయినా ఇదంతా ఎందుకండి,మన న్యాయ వ్యవస్త లో లొసుగులు మనకి తెలియనివా చెప్పండి.ఖర్మకాలి రాంబాబు గారు ఆ కథ కాపీ కొట్టారనుకుందాం.వాడు ఆ కథని రిజిస్టర్‌ చేయించాడా? వాడి టైటిల్‌ వేరు,మన టైటిల్‌ వేరు." అని రాంబాబు వైపు తిరిగి
" రాంబాబు గారు,మీరు ఇంతకీ ఆ కథ కాపీ కొట్టారా లేదా కరెక్ట్‌, గా చెప్పండి.దాన్ని బట్టి మనం డిఫెంస్‌ తయారుచేసుకోవాలి.లేదా అఫెండ్‌ అయిపోయి మునిగిపోతాం." చెప్పాడు.
" ఎప్పుడో చదివినట్టు గుర్తు కానీ,అందులో హీరో పేరు అజయ్‌..మన కథలో సుజయ్‌,హీరోయిన్‌ పేరు వాణి..మన కథ లో రాణి,విలన్‌ పేరు వేణు మాధవ్‌..మన దాంట్లో బ్రహ్మానందం..." అంటూ చెప్పుకుంటూ పోతుంటే.
" ఆపండి ..మాకు అర్థమయ్యింది.పేర్లు తప్ప మిగతాదంతా దించేసారని,మా కొంప ముంచేసారని,ఆ గునపాన్ని ఓ సారి పిలిపించండి.మాట్లాడదాం." అన్నాడు గజానన్‌.
                                                                 ***
మర్నాడు టిప్‌ టాప్‌ గా తయారయ్యి ఆ ప్రొడక్షన్‌ ఆఫీస్‌ వెతుక్కుంటూ వచ్చాడు గోవర్ధనం.
ఆయనని లోపల సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి చెప్పడం మొదలెట్టాడు గజానన్‌.
" చూడండి, గోవర్ధనం గారు, మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారు ఈ సమాజంలో.అలాగే కథని పోలిన కథలు ఓ వెయ్యుంటాయి.అలాంటి కథలే మీ సొరకాయలో బీరకాయ్‌,మా సంతలో చింతకాయ్‌.కాబట్టి ఏతా,వాతా చెప్పేదేంటంటే,మా డిస్ట్రిబ్యూటర్‌ కి చెబుతాను..సరదాగా సాయంత్రం మీ ఫ్యామిలీ తో కలిసి సంధ్య దియేటర్‌ లో కాదులెండి,ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌, లో నాలుగు టికెట్లు ఇప్పిస్తాను.హాయిగా వెళ్ళి సినిమా ఎంజాయ్‌ చెయ్యండి." అన్నాడు గజానన్‌.
" నేనేమన్నా టపాకాయల.పాపారావు లా కనబడుతున్నానా మీకు.నా కథ కాపీ కొట్టి సినిమా తీసి,నా చేతిలో సినిమా టికెట్‌ పెడదామనుకుంటున్నారా? ఏబై లక్షలకి అర్థ రూపాయి తగ్గినా ఊరుకొనేది లేదు." అన్నాడు కోపంగా.
" చూడండి గోవర్ధనం గారు.మీరు అనవసరంగా విషయాన్ని పెద్దది చెయ్యడం వల్ల మీకు చిల్లికానీ కూడా రాదు.మీ కథ ప్రచురించిన పత్రిక లేదు.మీ కథ ఎక్కడా రిజిస్టర్‌ చేయలేదు.మీ కథ కి,మా కథ కి బోల్డు తేడాలున్నాయని మేం కోర్టులో చూపించనూగలం.కాబట్టి ఇదంతా ఎందుకొచ్చింది.పైకి సినిమా హిట్టంటాం కాని మీకు తెలియదా అది పెద్ద ఫట్టని.మా ప్రొడ్యూసర్‌ కి ఇప్పటికే చలిజ్వరం వచ్చి ఆ గదిలో పడుకున్నాడు.కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి.అలాగని మీ రుణం ఉంచుకోము లెండి." అని ఏవో కాయితాలు గునపాల ముందు పడేసాడు.
" వీటిలో సంతకం చేయండి.మీకో తృణం అప్పచెబుతాం." అన్నాడు.
ఈ మాటలు విని గుండెల్లో రైళ్ళు పరిగెట్టడంతో కంగారుగా బాత్రూం లో దూరి ఏవో ఫో న్లు చేసుకున్నాడు గోవర్ధనం.
" చచ్చినోడి పెళ్ళికి,వచ్చిందే కట్నం.నువ్వు రాసిన బోడి కథ కి ఎంతొచ్చినా వచ్చినట్టే.అనవసరంగా గొడవ చేసి కోర్టులంట తిరిగితే ఆ వచ్చేదిపోడంతో పాటు మనకి చేతి చమురు వదిలిపోవడం ఖాయం." అన్నాడు ఆ ఫోన్‌ లో ఓ శ్రేయోభిలాషి గోవర్ధనంతో.
సరే..అని చేసేది లేక సంతకాలు పెట్టేసాడు గోవర్ధనం.ఏభై లక్షలు అడిగితే అయిదు వేల చెక్కు చేతి కొచ్చింది.చివరికి ఆ చెక్కయినా చెల్లుతుందో లేదోనని కంగారుగా బ్యాంక్‌ లో వెయ్యడానికి బయలుదేరాడు గోవర్ధనం....

No comments:

Post a Comment

Pages