దర్శకుడు – దార్శనికుడు- దాసరి నారాయణరావు - అచ్చంగా తెలుగు

దర్శకుడు – దార్శనికుడు- దాసరి నారాయణరావు

Share This
దర్శకుడు – దార్శనికుడు- దాసరి నారాయణరావు
 - ఆచార్య చాణక్య 

తెలుగు చిత్రసీమకు ఆయన గురువులాంటివారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానం... 150 సినిమాలు... అవార్డులు, రివార్డులు, రికార్డులు.... ఏవీ ఆయనకు కొత్త కాదు. పాత అని ఆయన సైతం అనుకోరు. చలన చిత్ర వైకుంఠ పాళిలో ఎన్నో నిచ్చెనలు అధిరోహించిన దర్శకుడు... పాములకు మింగుడు పడని దార్శనికుడు. ఎంతో మంది నూతన నటుల్ని పరిచయం చేసి, భవిష్యత్ తరాలకు నిఘంటువుల్లాంటి సినిమాలను అందించిన ఆ దర్శకరత్నం దాసరి నారాయణరావు. దర్శకుడికి పాఠాలు చెప్పిన కథానాయకుడు... హీరోతో సమానంగా ప్రేక్షకాభిమానం పొందిన దర్శకుడు.... ఇవేవో పత్రికల శీర్షికలు కాదు. సాక్షాత్తు దర్శకరత్న దాసరికి సంబంధించిన కొన్ని నిజాలు. సినిమా అవకాశం వరించి వచ్చిందనే ఆశతో మద్రాసు రైలెక్కారాయన. తొలి అడుగే తడబడింది. అయినా కుంగిపోకుండా... కృషి, పట్టుదలనే మెట్లుగా చేసుకుని విజయం వాకిట ముందు గర్వంగా తలఎత్తుకు నిలబడ్డాడు. తాతా మనవడుతో దర్శకుడిగా మారారాయన. కెరీర్ తొలి నాళ్లలోనే సంసార సాగరం, స్వర్గం-నరకం, బలిపీఠం వంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు దాసరి. కుటుంబ, మహిళా సమస్యలు, సాంఘికం, దేశభక్తి ఇలా కథాంశం ఏదైనా తన దైనశైలిలో చిత్రాలన్ని తెరకెక్కించి విజయాలందుకున్నారు. దాసరి, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలిపులి లాంటి సినిమాలు ఈ కోవకు చెందినవే. అక్కినేనితోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు దాసరి. ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రేమాభిషేకం.... తెలుగు సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. చాలా కాలం తర్వాత ప్రేమకథతోనే నాగార్జునతో దాసరి తీసిన మజ్ను... మరో సంచలన చిత్రంగా గుర్తుండి పోయింది. ఇలా తండ్రి, కొడుకులిద్దరికీ ఒకే తరహా కథలతో... ఒకే స్థాయి విజయాలను అందించిన ఘనత ఈ దర్శక రత్నానిదే. ప్రజల అభిమానమే తనని నడిపిస్తుందని దాసరి ఎప్పుడూ గర్వంగా చెబుతుంటారు. తొలి జీతంతో చేయించుకున్న ఉంగరాన్ని నేటికీ ధరిస్తున్నారంటేనే... దాసరి కష్టానికి ఎంత విలువిస్తారో అర్థంచేసుకోవచ్చు. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా అవార్డుకోసం నిర్మించిన చిత్రం మేఘసందేశం. ఈ సినిమా విషయంలో అనుకున్నది సాధించామని గర్వంగా చెబుతుంటారాయన. కేవలం ఒక మూసకు పరిమితం కాకుండా... అన్ని రకాల నిర్మించిన ఘనత దాసరికే దక్కుతుంది. ముఖ్యంగా దేశభక్తుల సినిమాలు తీసేటప్పడు ఆయన దర్శకత్వ ప్రతిభను గురించి చెప్పడం అద్దంలో ఆకాశాన్ని చూపించినట్లే. ఏ రంగంలో ప్రవేశించినా తనదైన శైలిని ఆవిష్కరించడం దాసరి ప్రత్యేకత. తాను రూపొందించిన అన్ని సినిమాలు తనకిష్టమైనవే అని చెబుతుంటారాయన. సమస్యలే ఇతివృత్తంగా పరిష్కారాలే ముగింపుగా దర్శకరత్న చిత్రాలుంటాయి. మామగారు, అమ్మ... రాజీనామా, సూరిగాడు, బంగారు కుటుంబం లాంటి చిత్రాలతో మధ్యతరగతి కుటుంబాల తీరుతెన్నులు, ఆప్యాయతలు, అనురాగాలు... తదితర అంశాలను స్పృశించారు. దర్శకుడిగా తన అభిప్రాయాల్ని నిర్మాతలపై రుద్దలేకే సొంత బ్యానర్ స్థాపించారు దాసరి నారాయణరావు. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ ఒరవడిని అద్దిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఓసేయ్ రాములమ్మ, ఓరేయ్ రిక్షా లాంటి చిత్రాలతో విఫ్లవాత్మక సినిమాలను కుటుంబ కథల నేపథ్యంతో రూపొందించ వచ్చని పరిశ్రమకు చాటిచెప్పారు దాసరి. దర్శకుడిగానే కాదు... సినిమా రంగంలోని విభిన్న పార్శాల్లో దాసరి మార్కు కనిపిస్తుంది. నటుడిగా, నిర్మాతగా, మాటలు-పాటల రచయితగా... ఇలా ఎన్నో విభాగాల్లో తనదైన ముద్ర వేశారు. మోహన్ బాబు, ఆర్.నారాయణమూర్తి లాంటి ఎందరో సినీప్రముఖులు దాసరి స్కూల్ నుంచి వచ్చిన వారే. రవిరాజ పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకులు ఆయన శిష్యులే. ఇంత మందికి ఇన్ని రకాలుగా స్ఫూర్తిగా నిలిచిన దాసరి... నటుడిగానూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. కాలంతో పోటీ పడుతూ ప్రేక్షాభిరుచి అనుగుణంగా చిత్రాలు రూపొందించారు దాసరి నారాయణరావు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 150 సినిమాలను రూపొందించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ డైరెక్టర్ గా నిలిచారు. పైకి రాలేనేమో అని ఆత్మన్యూనతతో బాధపడే యువతకు తన జీవితం ఆదర్శమైతే అంతే చాలంటారాయన. అప్పటికీ.... ఇప్పటికీ... ఎప్పటికీ... దాసరి అంటే ఓ ట్రెండ్ సెట్టర్ . ఆ పేరే ప్రయోగాలకు మారు పేరు.

No comments:

Post a Comment

Pages