//ఎత్తరుగుల ఇల్లు..// - అచ్చంగా తెలుగు

//ఎత్తరుగుల ఇల్లు..//

Share This
//ఎత్తరుగుల ఇల్లు..// 
 - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్. 
 14.05.2015 


ఆ రోజు కృష్ణ జీవితంలో రోజు అనుకోని సంఘటన జరిగింది.. పెద్దకొత్తపల్లి అనే ఊరిలో ఎన్నికల డ్యూటీ పడింది.. కందుకూరులో జిల్లాపరిషత్ హైస్కూల్ లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాడు కృష్ణ . ఎన్నికల డ్యూటీ ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాక.. , “ఒంగోలు బస్సులెక్కడాగుతాయ్" అని అడిగాడు, అక్కడే ఉన్న ఓ కుర్రాడిని.. " ఈ వీధి చివరకు వెళితే ఉత్తరం చూస్తున్న ఓ ఎత్తరుగుల ఇల్లుంటుంది.... అక్కడికి వచ్చి ఆగుతాయి ఒంగోలు వెళ్లే బస్సులు.. “ అని చెప్పాడు ఆ కుర్రాడు. ఎత్తరుగుల ఇల్లని వినబడటంతో కృష్ణలో ఏదో అద్వితీయానుభూతి కలిగింది. ఆ కుర్రాడు చెప్పిన ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చేసరికి .. ఎన్నికల్లో ఓట్లేసేందుకు వచ్చిన వలస ఓటర్లతో కిటకిటలాడుతోంది ఆ వీథంతా..! ఎదురుగా ఠీవిగా కనిపించింది ఎత్తరుగుల ఇల్లు.. ఎవరు పెట్టారో గానీ దశాబ్దాలు గడుస్తున్నా ఆ ఇంటికా పేరు మారలేదు.. అక్కడికి చేరుకోగానే ఆప్యాయపూరిత కరస్పర్శ కృష్ణను నిమిరినట్లనిపించింది.. నుదురును ముద్దాడిన ప్రేమ స్ఫురించింది.. అవును.. ఆ ఇంటికీ అతనికి అవినాభావ సంబంధం ఉంది.. అది ఈనాటిది కాదు.. .. ఏళ్ల నాటి బంధం.. అప్పట్లో అది అందమైన పెంకుటిల్లు.. ఊరిలో జమిందారీ ఇల్లుని తలపించే ప్రత్యేకమైన ఇల్లు.. తుఫాన్లు, వరదలు, ఉప్పెనలెన్నింటినో ఎదురొడ్డి కులమతాలకతీతంగా నీడనిచ్చి, ఎందరినో కాపాడిన ఇల్లు....ఆ "ఎత్తరుగుల ఇల్లు". ఆ ఇల్లు చూస్తుండగానే ఇరవై ఏళ్లనాటి రోజులు అతని కళ్ళ ముందు మెదిలాయి..
**********  
 ఒక ఆదివారం ప్రసాద్ వచ్చి “ కృష్ణా ఎక్కడికైనా వెళ్దాం రా ..” అన్నాడు. అందమైన పల్లెటూరు.. పెద్ద చెరువు.. పచ్చటి పొలాలు.. తెల్లని ఆవులు, సూడి గేదెలు, ఎడ్ల బండ్లు, గుర్రం బండ్లు అన్నీ తలుచుకుంటూ.. "పెద్దకొత్తపల్లి" వెళ్దాం అన్నాడు కృష్ణ. ఫ్రసాద్ కూడా తలూపాడు. ప్రసాద్ అంటే ఎవరో కాదు కృష్ణ అన్నయ్యే! బాబాయి కొడుకు.. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు... . ఎక్కడికెళ్ళాలన్నా. ఇద్దరూ ప్లాన్ చేసుకుని మరీ వెళ్తుండేవారు... కృష్ణ పదో తరగతి చదువుతుంటే, ప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు.. అయినా వారి మధ్య స్నేహం... వయస్సు, క్లాసు తో సంబంధం లేకుండా..చిరకాలంగా కొనసాగుతూనే ఉంది. పెద్దకొత్తపల్లి వెళ్తున్నాం.. అనుకోగానే భలే థ్రిల్ గా అనిపించసాగింది ఇద్దరికీ..... ఒంగోలు నుంచి 14 కిలో మీటర్ల దూరం లో ఉన్న పెదకొత్తపల్లికి చెరో సైకిల్ పై ప్రయాణం మొదలెట్టారు. ... దొడ్డవరప్పాడు డొంక రోడ్డు లోంచి వెళ్లాలి పెద్దకొత్తపల్లికి. .. అక్కడే అప్పుడప్పుడూ దొంగలు దారిదోపిడీకి పాల్పడేవాళ్ళు. ఆ విషయం చిన్నప్పటి నుంచి విని వుండటం చేత అక్కడకు రాగానే గుండెలు చిక్కబట్టుకుని వెళ్ళసాగారు. దొడ్డవరప్పాడు డొంక దగ్గరకు రాగానే, కనుచూపు దూరంలో పెద్దకొత్తపల్లి లోని చెన్నకేశ్వరస్వామి వారి దేవస్థానం గాలిగోపురం దూరం నుంచి చేతులు చాచి ప్రేమతో పిలుస్తూంటోంది.. దొడ్డవరప్పాడు నుంచి చాలా దూరం ఉన్నా గానీ , ఆ గోపురం కనిపించగానే పెద్దకొత్తపల్లి వచ్చేశాం అనే ఫీలింగ్ కలుగుతుంది ఎవరికైనా.! పెద్దకొత్తపల్లి వచ్చేస్తోందన్న సంతోషం తో స్పీడుగా సైకిల్స్ తొక్కుతున్నారిద్దరూ.... ! గుడి దగ్గర పడుతోంది..పచ్చని పంటపొలాల పైరగాలి మధ్య మధ్య ఒడలు తాకి ఇద్దరినీ చక్కిలిగింతలు పెడుతోంది.. ఇక్కడే చిన్నపాటి చప్టా ఉంది.. .. ఈ చప్టాదాటి కొద్ది దూరం వెళ్ళి ఎడమ వైపుకు తిరగ్గానే పెద్దకొత్తపల్లి లోని చెన్నకేశ్వరస్వామి దేవస్థానం ఎదురుగ్గా కనిపిస్తోంటోంది. పావురాల పదనిసలతో అలరారటమే గాక దైవత్వాన్ని తన చుట్టూ నింపుకున్న అయస్కాంత క్షేత్రం లా ఉంటుందా దివ్య క్షేత్రం.. గుడి గోపురం మూడు అంతస్తులుంటుంది.. అందమైన ఆకృతుల్లో బొమ్మల తొ అలరారుతుంటుంది., అప్పటి ఆ శిల్పకళానైపుణ్యాన్ని చూసి ఎంతవారైనా మంత్ర ముగ్ధులవ్వాల్సిందే.! చెన్నకేశ్వరస్వామి దేవస్థానం ఎదురుగ మరో చిన్న గుడి ..అది శివాలయం. పురాతన విగ్రహాలు .. విరిగిపోయిన విగ్రహాలు ఆ గుడి దగ్గర పలకరిస్తుంటాయ్. చిన్నప్పుడు ఈ ఊరొచ్చినప్పుడు ఈ గుళ్ళలోనే తోటి వారితో ఆడుకునే వాళ్ళు కృష్ణ , ప్రసాద్ వాళ్ళు. కమ్యూనిస్టు ఖిల్లా గా పేరొందిన పెద్దకొత్తపల్లిలోకి … అత్యంత పెద్ద దర్గా ఉండి, కులమతాలకతీతంగా ఉరుసు ఉత్సవం జరుపుతూ పరమత సహనాన్ని బోధించిన నేల పైకి , కుల మత వర్గ రహిత సమ సమాజం ఉన్న నేలకి కృష్ణ, ప్రసాద్ ల సైకిల్ యాత్ర అడుగుపెట్టబోతోంది...! వాటన్నింటికన్నా మరో ముఖ్య విషయం దాగుంది వారి ప్రయాణం వెనుక.!! చప్టాదాటి గుడి దగ్గరకు వచ్చి.. అక్కడ నుంచి మరలా కుడి వైపు తిరగ్గానే మరికొద్దిదూరంలో కనిపిస్తోంది ఎత్తరుగుల ఇల్లు.. ఆ ఇంట్లో నివాసం ఉండే ఓ పెద్ద మనిషిని అతి త్వరగా చూడాలన్నదే వారి తపన. రొప్పుతూ సైకిళ్లు తొక్కుతున్నారిద్దరూ. ఊరి లోకి అడుగు పెట్టారో లేదో "ఎవరి పిల్లలూ మీరూ..? ఎవరింటికొచ్చారూ..? " అంటూ ప్రశ్నల పరంపర.. మొదలైంది. పల్లెటూర్లకి ఎవరొచ్చినా సంబరమే.. ఎవరింటికి చుట్టాలొచ్చినా తమ ఇంటికి చుట్టాలొచ్చినంతగా ఆనందపడే అల్పసంతోషులు వాళ్ళు.. అలాంటి వారికి పెద్దకొత్తపల్లి పెట్టింది పేరు.. "అరే మీ బండబడ.. ఎవుర్రా..! ఎవురి పిల్లలూ.. ఎవరింటికొచ్చారంటే సైకిళ్లాపరే..?? " అన్న మాటలు , వారిని దాటి వెళ్ళాక, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కృష్ణ, ప్రసాద్ లకి వినిపించింది.. అయినా వారిది ఒకటే లక్ష్యం.. ఎత్తరుగుల ఇల్లే వారి కళ్ళ ముందుంది. మరే విషయము పట్టించుకునే ఆసక్తి, ఆ నిముషం వారికి లేదు. పచ్చని చెట్లు తమతో పాటు పరిగెత్తుతున్న ఆ దారిలోనే ఆర్.ఎం.పి రాధయ్య ఉండేవాడు.. ఆయనే ఈ ఊరి దేవుడు.. వైద్యుడే హరి కదా..! అట్లా ఆ ఆర్.ఎం.పీ నే ఆ వూరికి దేవుడులాంటోడయ్యాడు. రాధయ్య ఇంటెదురుగా గ్రామ ముదాములు శిలారు, ఇబ్రహీం లు ఉండేవారు.. వారిద్దరూ మూడడుగుల మరుగుజ్జులు. చిన్నప్పుడు వాళ్లని ఆటపట్టించేవాళ్ళు కృష్ణ తోటి పిల్లలు. అటు ఇటూ.. ఆ ఇల్లు ఈ ఇల్లు గుర్తు చూసుకుంటూ నెమ్మదిగా సైకిల్ తొక్కుతూ ఎత్తరుగుల ఇంటి ముందు ఆగారిద్దరూ...! ఆ ఇంటి ముందు అటు-ఇటు వున్న చిన్న అరుగులు ఊరిపెద్దల పిచ్చాపాటి కేంద్రం. అప్పుడు సరిగ్గా సమయం మిట్టమద్యాహ్నం 1.30 నిముషాలు కావస్తోంది.. అందుకే ఎవ్వరూ అరుగుల మీద లేరు. ఎత్తరుగుల ఇంటి దగ్గర సైకిళ్ళు స్టాండ్ వేసి కాంపౌండ్ వాల్ మధ్యలో ఉన్న పెద్ద పెద్ద తలుపులను నెమ్మదిగా నెట్టారు..! వీథి తలుపు కిర్రు మని తెలుచుకోగానే.. కాంపౌండ్ వాల్ లోపల నుంచి... "కౌన్ బేటా" అంటూ బీబీ అనే మహిళ వచ్చింది. బక్కప్రాణి బీబీ. అదే ఇంటి ప్రాంగణంలో కుడివైపు ఉన్న అవుట్ హౌస్ లాంటి చిన్నగదిలోనే ఉంటుంది.. పెద్ద పెంకుటిల్లు అది...రోడ్డు మీద చిన్న అరుగులు.. లోపలికెళ్ళింతర్వాత ఎత్తైన అరుగులు.. అవే అరుగులు ఎందరినో ఆదుకున్న అరుగులు.. ఎందరికో రామాయణ, మహాభారతాలు వల్లె వేయించిన అరుగులు.. ప్రతి రోజూ సజ్జన సాంగత్యం.. భజనలు చేనన ఆడవారి భక్తి పొంగిన అరుగులు. స్వాతంత్ర్య పోరాటంలో నాయకుల రహస్య సమావేశాలు నిర్వహించిన అరుగులు. అవే కష్టకాలంలో స్థానికుల ను హత్తుకున్న ఎత్తైన అరుగులు. "ఎవరదీ..." “ఎవర్రా..?? అదీ..?” అంటూ తిరునామంతో ఓ తొంబై ఏళ్ళ పండు ముసలి బయటికి వచ్చింది.. అమెను చూచేందుకే ఆ నాలుగు ‘కళ్ళు’ ...రొప్పుతూ ఆ ఇంటి ముందాగాయ్.. "బామ్మా.. మేమే..." అన్నారు అన్నదమ్ములిద్దరూ.. నడుం ఒంగిపోయిన ఆమె ముఖంలో ఆనందం.. ఒడలు ముడతలు పడిన కళ్ళల్లో సంతోషం.. కృష్ణ, ప్రసాద్ ఇద్దరిలో ఎక్కడలేని సంతోషం.. "బామ్మా.. బామ్మా" అంటూ.. పరిగెత్తుకెళ్ళి వాటేసుకున్నారు... కాళ్లకు మ్రొక్కారు... బుగ్గలు ముద్దులతో ముంచెత్తారు. "నాకోసం అంతదూరం నుంచి సైకిళ్ళేసుకుని వచ్చార్రా.. " అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం.. నీరై ఉబుకుతోంది.. ముడతల ముఖంతో ముద్దులు కురిపిస్తోంది..."నాయన్లారా.. మీరా.. నాకోసం వచ్చారా.. ఈ ముసలిదాన్ని చూడటానికి వచ్చారా..?" అంటూ ఇద్దరినీ పొదివి పట్టుకుంది.. మనుమలు వచ్చింది నిజమా అన్న భ్రమలో ఉన్న ఆమె.. "మాబంగారాలే..!" అంటూ పిల్లలిద్దరి మెటికలిరిచింది.. "బీబీ.. ఇలారా..పిల్లలకి దిష్టతీ " అంటూ ఎర్రనీళ్ళు తెప్పించి దిష్టి తీయించింది. ఆమె , లచ్చుమమ్మ అని గ్రామస్తులంతా ప్రేమగా పిలుచుకునే శ్రీలక్ష్మమ్మ. చూడటానికి పొట్టిగా, ఎర్రగా ఉంటుంది. ఆమె స్వరం మాత్రం గంభీరం గా ఉంటుంది. .. మధురమైన ఆ కంఠంతో ఆమె పాడే పాటలు వినడానికి ఆ గ్రామస్తులు పోటీలు పడేవారు. వారి వంశంలో ఆమెను లతామంగేష్కర్ అంటుంటారు.. లతామంగేష్కర్ అని ఎవరైనా అంటే చచ్చేంత సిగ్గు లచ్చుమమ్మకి. అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ రావడం వల్ల ఇద్దరికీ ఆకలి కేకలేస్తోంది.. . అయినా పెద్దామెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బయట పడటానికి వెనుకడుగేశారు అన్నదమ్ములిద్దరూ.. "ఏరా.. ఎండనపడి వచ్చారేరా..! పొద్దుననగా ఏమి తిన్నారో ఏమో పిచ్చి సన్నాసులూ .. నాన్నా వాళ్ళు ఎలా ఉన్నారూ..? చెప్పే వచ్చారా..?" అని మాటలు ఆపకుండా అడుగుతూనే లోపలికి తీసుకెళ్ళింది.. మాట్లాడుతూ నే బొగ్గుల కుంపటి పెట్టింది.. విసనకర్రతో విసురుతూ ఊదుగొట్టాం మధ్యమధ్య ఊదుతూనే ప్రశ్నలు కురిపిస్తోంది.. .... కుశల ప్రశ్నలేస్తూనే.. క్షణాల్లో వంట పూర్తి చేసి, “వేడుకుందామా వెంకటగిరి వేంకటేశ్వరుని వేడుకుందామా..”అంటూ .. అన్నమయ్య కిర్త ఆలాపిస్తూ ..సంబరంతో మురిసిపోతూ.. కందిపచ్చడి.. వేడి అన్నం తో నెయ్యిలో ముంచి ముద్దలు వారి నోటికందించింది లచ్చువమ్మ..! అంత వయసున్నా.. ఇప్పటికీ ఆమె పనులు, ఆమే జెట్ స్పీడ్ తో చేసుకోవడం.. చూసి వారికి ఆశ్చర్యం కలిగింది.. భోజనం పెట్టిన కాసేపటికి, శనక్కాయలు ఉడికించి.. నోటితో తొక్కలు ఒలిచి, గింజలు తీసి ఇద్దరి నోటికందిస్తుంటే.. తింటున్న వారిని .. కిటికీ దగ్గరకొచ్చిన బీబీ చూసింది.. ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది వారి ముగ్గురి వంక. “ రామలక్ష్మణులకి ఎంగిలి పండ్లు తినిపించిన శబరి” ని చూస్తున్నట్లనిపించింది ఆ నిముషం బీబీకి.. అప్రతిహతంగానే ఆమె చేతులు ఒకదాని కొకటి దగ్గరికి చేరాయ్. వెంటనే తేరుకుని .. "పంతులమ్మగోరూ.. మనవళ్ళు వచ్చేసరికి హుషారొచ్చిందే..!" అంటూ నవ్వులు పూయించింది. "ఆ..అవునే బీబీ.. ఇలాంటి మనవళ్ళు నీకుంటే తెలుస్తుంది,.." కాస్త గర్వం తొణికిసలాడింది లచ్చుమమ్మ గొంతులో.. " ఇదిగో వీడు పెద్దాడి కొడుకు.. వీడు చిన్నాడి కొడుకు .. పెద్దాడి కొడుకు అచ్చు మీ పంతులుగారే..! అంటూ ఇద్దర్నీ చూపించింది.. " నాకు తెలుసులే అమ్మగోరూ.. కిలావ్.. కిలావ్ పల్లీ కిలావ్ "అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది బీబీ. అప్పటికి అలసిన లచ్చుమమ్మ కాసేపు నిద్రపోతుంటే .. కృష్ణ, ప్రసాద్ లు ఇద్దరూ అరుగుల మీద ఒక వైపు పేర్చిన పత్తి కట్టె తీసి ఆడుకున్నారు... . సందులో మందారపు చెట్లు, చూస్తూ ఆ ప్రక్కనే ఉన్న జామ చెట్టు కాయలు కోసుకు తిన్నారు. తోటంతా కరివేపాకు సువాసనలు వేదజల్లుతుండగా ఆస్వాదించారు. ఆ ప్రక్కనే కొష్టం లో కట్టేసిన ఆవుల దగ్గరికి వెళ్ళి వాటిని, నిమిరి అవి ఒళ్ళు కదిలించగానే అవి వాళ్ళని గుర్తుపటినట్లు భావించి సంబరపడ్డారు. అంతలో బీబీ వాళ్ళ దగ్గరకొచ్చింది.. "అయ్యగోరూ అచ్చా హైనా..? అయ్యా మరే..ఈ మద్దె బామ్మ కి బాగోట్లేదు. మొన్నీ మధ్య నోట్లోంచి రగతం పడింది.. రాధయ్య డాట్టరు వచ్చి సూసేడు.. బామ్మగోరిని మీతో తీసుకెళ్ళొచ్చుకదా.. ! పాపం ఒక్కతే ఇబ్బంది పడుతుంటే సూసేందుకు ఇబ్బందవుతాంది.. నేనిట్టా సెప్పినను గద్దా అని బామ్మకి సెప్పవాకండి.. మళ్ళి ఆమె బాధపడుద్ది " అని గుసగుసలాడింది... "అవును.. బామ్మ మా ఇంటికి ఎందుకు రాదూ.. ?" బీబీ చెప్పిన దగ్గర నుంచి అనుమానం మొదలైంది కృష్ణ కి. కాసేపట్లో బయలుదేరతారనగా ఆ వూరి చెరువు దగ్గరకి కాళ్ళు తడుపుకునేందుకు వెళ్లారు. . చల్లటి గాలి... పచ్చని చింతచెట్లు.. ఆహా సౌందర్యానికి అడ్డా పెద్దకొత్తపల్లి అనిపించింది వారికి.. చెరువుకు కొద్ది దూరంలోనే ఉన్న వాళ్ళ మిరపచేను చూడాలనిపించింది.. కానీ తిరుగు ప్రయాణం అవ్వాలని వాయిదావేసుకున్నారు. అక్కడే ఉన్న .. మంచినీటి బావి నుంచి చేదలతో ఆడాళ్ళు నీళ్ళు తోడుతుంటే. మగాళ్ళు కావడిలో మోసుకెళ్తూ.. ఒకరికొకరు అన్నట్లు భార్యాభర్తలు చేదోడు వాదోడుగా ఉండటం చూసి వారికి ముచ్చటేసింది. అంతలో అటు నుంచి వెళ్తున్న గేదెల మంద.. గొర్రెల మందలతో ట్రాఫిక్ జాం.. "భలే భలే అందాలు సృష్టించావూ.." అన్న పాట కృష్ణ మదిలో మెదిలింది.. పట్టణాల్లో ఇలాంటి దృశ్యాలు అరుదుగా అయినా కనిపిస్తాయా అన్న అనుమానం వచ్చింది కృష్ణకి. " బామ్మ ని ఏదో విధంగా మన ఇంటి కి వచ్చేందుకు ఒప్పించాలన్నయ్యా" అన్నాడు కృష్ణ.. "సరే ప్రయత్నిద్దాం" అన్నాడు ప్రసాద్. చెరువు దగ్గరి నుంచి తిరిగి ఇంటికి వస్తుంటే.. " ఎవరదీ.. శీనయ్య పంతులు మనవళ్లా.. ఎట్టున్నారయ్యా నాయనోళ్ళు.. " అంటూ దారి పొడవునా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా.. ఎడ్లబండ్లు ఆపి, గుర్రపు బగ్గీలు ఆపి, కావడి మోసుకెళ్తూ రొప్పుతూ కూడా ప్రతి ఒక్కరూ తెలిసిన వాళ్ళలా పలకరిస్తుంటే.. ఆ అనుభూతి కి పరవశించి పోయారిద్దరూ. ఊరి వారి ప్రేమపలకరింపులు పూర్తిచేసుకుని ఇంటికి చేరారు.... అక్కడ కూర్చుని భగవద్గీతను కళ్ళజోడులోంచి చూస్తున్న లచ్చుమమ్మ దగ్గర చేరి మెడచుట్టూ చేతులేసి..ఒకరు , ఒడిలో వాలి ఒకరు ఆమెని ముద్దాడుతున్నారు. "బామ్మా.. నువ్ మా ఇంటికి రావచ్చుకదా..! ఎందుకు రావూ.." అని ధైర్యం చేసి అడిగేశాడు కృష్ణ.. " ఒరేయ్ సన్నాసులూ.. ఇది మీ తాత తిరిగిన ఇల్లురా..! ఆయన జ్ఞాపకాలు నన్ను వీడాలంటే నేను లోకం వీడాల్సిందే.. అదిగో ఉయ్యాల బల్ల మీదా.. ఊగుతూ.., దొడ్లో ఆవుల దగ్గర సీతాలుతో, అదే మన ఆవు తో ముచ్చాట్లాడుతూ.. అదిగో అక్కడ చూరుకు తగిలించిన కావడితో నీళ్ళు తెస్తూ.. గుడ్డలు కట్టిన చెప్పులు చూపించి.. కరవకుండా ఉండేందుకు వాటిని చూసుకుంటూ,.. మీ తాత బ్రతికే ఉన్నాడన్న భ్రాంతి నన్ను బ్రతికిస్తోందిరా..! ఇదిగో ఈ నులక మంచం రోజుకో సారి ఇప్పుతూ పేనుతూ ఉండేవాడురా.. మీ తాత! కాస్త గాలి పీల్చుకుని .. వదిలి మరలా కొనసాగించింది బామ్మ లచ్చుమమ్మ. "ఆ ఆనందం చెబితే మీకెవ్వరికీ అర్ధం కాదురా, మనవళ్ళు. మీ నాన్న వాళ్ళకే అర్ధం కాలేదు.. నాకూ ఈ ఇంటికీ 80 ఏళ్ల అనుబంధం.. నాకు పదేళ్ళప్పుడు మీ తాతతో పెళ్ళి చేసి, బుట్టలో తెచ్చి ఇక్కడ వదిలారు.. అంతే.. నేను పెరిగే సరికి నాకు తెలిసిన ఇల్లు ఇదే.. ఇదే నా ప్రపంచం.. ఇంటి దగ్గరకి వచ్చే వారికి నాకొచ్చిన రెండు ముక్కల్లో.. రామాయణం, మహాభారతం వినేవారికి చెప్పడం.. పనులు చేసుకునేందుకు పంచాంగం చూసి మంచి రోజులు చెప్పడం.. అలాంటివే వ్యాపకాలు.. చుట్టూ నీడ నిచ్చే పచ్చని చెట్లూ.. పెద్ద కమ్మీల పెంకుటిల్లు..వ డ్లు దాచుకునే నెల మాగాణి .. ఇదిగో ఈ ఎత్తరుగులు అన్నీ జ్ఞాపకాలు.. కాదు కాదు.. కళ్ళ ముందరి వాస్తవాలు.. అంటూ పిల్లలిద్దరినీ వదిలించుకుని లేచి ముందుకు కదిలింది.. రంగు వెలిసిన గోడకు శీనయ్య పంతులు ఠీవిగా కుర్చీలో కూర్చున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో.. వేలాడుతూ మల్లె దండతో మెరిసిపోతోంది.. అక్కడ నిలబడి ఆ ఫొటో వంక చూస్తూ.. దీర్ఘాలోచన చేస్తూ..!! " మీ తాత నన్ను, ఈ లోకాన్ని విడిచి ఇప్పటికి ఇరవై ఏళ్ళు.. అయినా నాకు ఆయన లేని లోటును పూడ్చింది ఈ ఇల్లేరా..! ఇవన్నీ వదిలి మీ సిమెంటడవుల్లో సుఖపడతాననుకోవడం మీ భ్రమ..! మీ నాన్న వాళ్ళు చాలా సార్లూ అడిగారు.. కానీ నాకు ఈ ఇల్లు వదిలి రావడం ససేమిరా ఇష్టం లేదు..! " నేను రాను.. రానంటే రాను.. " అంటుండగా ఆమె కళ్లల్లో జ్ఞాపకాలు నీటి దొంతర్లై కనుకొనల చివర వ్రేలాడుతూ, కృష్ణ గుండెను తడిపేశాయ్.. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగుతుండగా "వెళ్ళొస్తాం బామ్మా..! మళ్ళీ చాలాదూరం సైకిల్ తొక్కాలి" అంటూ భారమైన మనసుతో , నమస్కారం చేసుకుని అక్కడ నుంచి నిష్క్రమించారు...! కృష్ణ, ప్రసాద్ లు గుడి మలుపు తిరిగిందాకా లచ్చుమమ్మ వీథి తలుపు దగ్గరే నిలబడి చూస్తూ ఉంది.. బీబీతో పాటూ లచ్చుమమ్మ శిష్యురాళ్ళు ఆమె దగ్గరికి చేరారు .. వారంతా టాటా అంటూ పిల్లలు వీధి మలుపు తిరిగేంతవరకూ చేతులూపుతూనే ఉన్నారు.. ఆ ఊరు వారందరి తో కలిసిన ఆమె మనసు, ఆ ఇంటితో పెనవేసుకు పోయిన ఆమె జీవితం.. ఆ ప్రేమ నిండిన వాతావరణం వదిలి, ఆమె ఎక్కడకూ రాదని కృష్ణ , ప్రసాద్ లకి ఆ రోజే అర్ధమైపోయింది.. ఆ రోజు సాయంత్రం ఏడుగంటలప్పుడు.. తండ్రి ఇంటికి రాగానే ధైర్యం చేసి పెద్దకొత్తపల్లి వెళ్ళిన విషయం చెప్పేశాడు కృష్ణ..! ఆయన మరో ప్రశ్న నన్ను వేయకుండా .. "నాన్నా బామ్మని మన ఇంటికి ఎందుకు తేరూ..?" అని ఆయనను నిలదీశాడు. " బామ్మ ఎవ్వరింటికీ రాదురా..! అక్కడే ఆ ఇంట్లోనే తాతయ్య జ్ఞాపకాల్లో ఆమె బ్రతికేస్తోంది.. " అన్నారాయన. "నాన్నా.. బామ్మకి ఇప్పుడు 90 ఏళ్ళు.. ఇప్పుడుకూడా ఆమె పనులు ఆమే చేసుకోవాలా..? నిలదిసాడు . అదేరామీకు తెలిసింది.. అక్కడ నుంచి వస్తే.. ఆమె బ్రతకలేదురా,,! అన్నాడు కృష్ణ తండ్రి. "బామ్మ ఆరోగ్యం సరిగాలేదని బీబీ చెప్పీంది.." కొద్దిగా గదబాయించినట్లు.. బుంగమూతి పెట్టి అన్నాడు కృష్ణ. " తెలుసురా..! ఆమె ఆరోగ్యం, ఆమె ఒంటరిగా ఉండటానికి సహకరించదని ఒక డాక్టర్ గా నాకూ తెలుసు.. కానీ ఆమె అక్కడ నుంచి రానని మొండి పట్టుపట్టింది.. ఏంచేయను చెప్పూ..! సరేలే ఏదో ఒకటి చెప్పి ఒప్పించి తెద్దాంలే బాధపడకు " అని కృష్ణను కాసేపు సముదాయించాడు తండ్రి డా. రావ్. కొద్ది రోజులు గడిచాయ్..!! లచ్చుమమ్మకు కు అనారోగ్యం గా ఉండటంతో దగ్గరలోని హాస్పటల్ లో చేర్చారు.. ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి అక్కడికి వచ్చిన డా.రావ్, అతని తోబుట్టువులు అందరూ సమావేశమయ్యారు. ఎత్తరుగుల ఇల్లు అమ్మేస్తే కానీ, లచ్చుమమ్మ ఆ ఇల్లు, ఆ ఊరు.. వదిలి పట్టణం రాదు.. వస్తే కానీ సరైన వైద్యం అందించలేం.. అందించకుంటే ఆమె దక్కదు అని అని తీర్మానించారు.. అదే ఇంటిలో అద్దెకుండే వెంకన్న పంతులుకి ఇల్లు అమ్మనికి డిసైడ్ అయ్యినట్లు..హాస్పటల్ లో ఉన్న లచ్చుమమ్మకి చెప్పారు. ఆమె మనసు వద్దంటున్నా.. ! కొడుకుల మాట కాదనలేక మాస్క్ లోని మనిషి తలూపింది.. కన్నీరు తుఫానై ఎగసిపడుతుండగా.. కొసలు జీవనదులైయ్యాయ్ .. కృష్ణ కూడా అక్కడే ఉండి అంతా చూస్తున్నాడు. బామ్మంటే వల్లమాలిన ప్రేమ కృష్ణకి. ఆమెని అలా చూడటం కృష్ణ వల్ల కావడంలేదు. .. లచ్చుమమ్మ మనసు.. లోలోన ఎంత ఘర్షణకు గురౌతోందో అక్కడ కృష్ణ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరనేది వాస్తవం. ఎత్తరుగుల ఇల్లు రిజిస్ట్రేషన్ పూర్తైంది.. "అందమైన ఎత్తరుగుల ఇల్లు .." "శీనయ్య పంతులు చిందులాడిన ఇల్లు.. " శ్రీలక్ష్మమ్మ సంగీతం ప్రతిధ్వనించిన ఇల్లు.. ఆ రోజు నుంచి వేరే వారి వశమైంది.. వంశాలు వృద్ధి చెందిన ఎత్తరుగుల ఇల్లు.. పిల్లలు పారాడిన ఎత్తరుగుల ఇల్లు, ఆనాటి నుంచి వేరే వారి సొత్తు.. ఆరోగ్యం కుదుటపడగానే లచ్చుమమ్మని , పట్టణంలోని తన ఇంటికి తెచ్చారు డా. రావ్. బెడ్ రూంలో ఆమెకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఆమెని పడుకోబెట్టారు. వచ్చిన గంటలోపే రావ్ ని దగ్గరకి రమ్మంది లచ్చువమ్మ. రావ్ ని పిలిచి, అతని ఒళ్ళో ఆమెకి పడుకోవాలనుందంటూ సైగ చేసింది.. డా. రావ్ తన తల్లి దగ్గరకు చేరుకుని, దగ్గరకు తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు.. లచ్చువమ్మ మాటలు కూడబలుక్కుని రావ్ కు చెబుతోంది.. "ఒరేయ్..మీ నాన్న గుర్తొస్తున్నాడయ్యా..! .. ఆ అందమైన ఇంటిలో, ఆ ఎత్తరుగుల మీద పంచెకట్టి, నీ పిల్లల వెంట పరిగెత్తుతూ.. గెంతుతూ.. చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తూ, నా చేత తిట్లు తిన్న మీ నాన్న గుర్తొస్తునాడర్రా.! మీ నాన్న పోయినా గానీ , ఇన్నాళ్ళు నేను బ్రతికానంటే అందుకు ఆ ఇల్లే కారణం. ఆ పిచ్చి పెంకుటిల్లు అనేది ఆస్థికాదు.. మీ నాన్న అస్థి.. నాలో సగమైన, మీనాన్నే నాకా ఇల్లురా నాన్నా...! సుఖం- దుఖం.. ఆటలు- పాటలు.. పిల్లల కేరింతలు .. ఎన్నో.. మరెన్నో ఊసులు నింపిన నా నందనవనం రా.. ఆ ఇల్లు. అది ఇప్పుడు లేదు కదా..! మరలా నా ఊరిలో, నా ఇంటి లో అడుగు పెట్టలేను కదా.., నా జ్ఞాపకాలు అక్కడే వదిలేయాలనుకున్ననర్రా.. కానీ.. ఇలా.." అంటూ లచ్చువమ్మ మాట్లాడుతూ మాట్లాడుతూ ఎత్తరుగుల ఇల్లుని ఎండిన కళ్ళు నిండా నింపుకుని అలాగే ఉండిపోయాయ్..! ఆమె భర్త శీనయ్య కన్నీళ్ళని తలపిస్తూ.. ఆకాశం భళ్ళున వర్షించడం మొదలెట్టింది.. ! 
 ************ 
 బస్ హారన్ పెద్దగా వినపడటంతో వర్తమానంలోకి వచ్చాడు కృష్ణ.. ! "ఒంగోల్.. ఒంగోల్.. అరుస్తున్నాడు కండక్టర్.. కానీ కృష్ణ అడుగులు ఎత్తరుగుల ఇల్లు వైపు నడిచాయ్... ఒక్కసారి ఆ ఇంటి సమీపంలోకి చేరుకోగానే.. అతన్నెత్తుకున్న తాతయ్య.. బుగ్గలు నిమురుతూ గోటి ముద్దలు తినిపించిన బామ్మ అతని కళ్ళ ముందు కదిలారు.. కృష్ణ కంటి నుండి నీటి చుక్కలు రాలి, అతని తాత బామ్మల కాళ్ళు కడిగినట్లు అక్కడి నేలను తడిపాయి..! అక్కడే ఉన్న 'శీనయ్య లక్ష్మమ్మ రోడ్డు' అనే బోర్డుకు పట్టిన దుమ్ముని చేత్తో తుడుస్తూ.. అలాగే కొద్దిసేపు కదలకుండా నిలబడిపోయాడు.. ఎత్తరుగుల ఇంటి తలుపు ని చూస్తూ తలపులు నింపుకుని అయిష్టంగా బస్సు వైపు అడుగులేశాడు కృష్ణ.
*****
  

No comments:

Post a Comment

Pages