జానపదంతో జ్ఞానపథం చేరిన అన్నమయ్య - అచ్చంగా తెలుగు

జానపదంతో జ్ఞానపథం చేరిన అన్నమయ్య

Share This

  జానపదంతో జ్ఞానపథం చేరిన - అన్నమయ్య

- మధురిమ 

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । 
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्
 అని పరమాత్మ గీతలో ఉపదేశించినట్టుగా అధర్మము రాజ్యమేలిన ప్రతీసారీ తాను అవతరిస్తూ ధర్మస్థాపన చేస్తూనే ఉన్నాడు,ఎందుకంటే "ధర్మో రక్షతి రక్షితః".
ధర్మాన్ని మనం కాపాడితే అది మనలిని రక్షిస్తుంది కనుక. అలానే ఈ కలియుగంలో కలియొక్క అరాచకాలనుండీ  భక్తులను శ్రీ మహా విష్ణు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి అవతారంలో  భక్తులను రక్షిస్తూనే ఉన్నాడు. ఒక్కో అవతారంలో స్వామి అధర్మంపై యుద్ధం చెయ్యడానికి ఒక్కో ఆయుధం ధరిస్తే ఈకలియుగంలో స్వామి ఆయుధం తన నందకం(ఖడ్గం) అంశతో  జన్మించిన అన్నమాచార్యులవారు రచించిన సంకీర్తనలే అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
 తాను జీవించినంతకాలం వేల సంకీర్తనలతో ఆశ్రీహరిని నిత్యం అర్చించి, తరించి తన ముందు తరాలవారికి ఎనలేని సంకీర్తనా నిధిని అందించి వెళ్ళిన అన్నమయ్య ధన్యజీవే కాదు పుణ్య జీవి కూడా.
అన్నమయ్య వంశం గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలు:   10వ శతాబ్దంలో కాశీ పట్టణానికి చాలా పెద్ద కరువు వచ్చిందట.తినడానికి తిండి కూడా లేక పండితులంతా అల్లాడిపోయారట.  కొందరు పండితులు బతుకు తెరువు వెతుక్కుంటూ దక్షిణ భారతదేశం వలస వచ్చినారట. నేటి ఆంధ్ర రాష్ట్రంలో "నందవరం" అనే గ్రామాన్ని నందుడు అనే రాజు పాలించేవాడట. ఈ గ్రామానికి వలసవచ్చిన వారికి "నందవరీకులు" అన్న పేరు స్థిరపడిపోయింది. తాత ముత్తాతలు తాళ్ళపాక గ్రామంలో(నేటి ఆం.ప్ర) స్థిరపడినందున ఇంటిపేరు తాళ్ళపాకగా మారిపోయింది.అన్నమయ్య మనవడు చిన్నన్న రాసిన ద్విపద అనే గ్రంధంలో అన్నమయ్యయొక్క జీవితం గురించి,ఆయన రచనలగురించి అంతా వివరించి ఉన్నది.
ఆ గ్రంధం ప్రకారం అన్నమయ్య తాతగారైన నారాయణయ్య తన బాల్యంలో విద్యాభ్యాసంపై మక్కువ చూపేవారు కాదట.గురువులు వేసే కఠిన శిక్షలు తట్టుకోలేక మరణమే శరణ్యమని ఆ ఊరి గ్రామదేవత అయిన చింతలమ్మతల్లి దేవాలయంలో ఉన్న పాము పుట్టలో చెయ్యిపెట్టి పాముకాటువలన మరణించాలనుకున్నారట.కానీ ఇంతలో ఆ దేవత ప్రత్యక్షమై మరణించే ప్రయత్నం మానమని,మూడవతరంలో తన ఇంట హరి అంశ  సంభూతుడు జన్మించనున్నాడనీ చెప్పిందట.
అలానే నారాయణయ్య కుమారుడైన నారాయణ సూరి- లక్కమాంబ దంపతులకు చాలకాలం సంతానంలేక వారు తిరుపతి శ్రీ వేకటేశుని దర్సించుకున్న అనంతరం  ధ్వజ స్థంభానికి ప్రణమిల్లుతుండగా ఒక దివ్య శక్తి లక్కమాంబలో ప్రవేసించి, ఇదిజరిగిన కొన్నాళ్ళకే  స్వామి  వరప్రసాదంగా అన్నమయ్య 1408వ సం (సర్వధారి నామ సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు) జన్మించాడు.
అన్నమయ్య విద్యాభ్యాసం తల్లితండ్రుల పర్యవేక్షణలోనే జరిగింది.సకల విద్యలు ఆయనకు అనతికాలంలోనే సిద్ధించెను. సంగీత సాహిత్యములయందు అపారమైన పాండిత్యము సంపాదించుకొనెను. ఇతను కారణ జన్ముడనీ దైవాంశ సంభూతుడనీ అందరూ అనుకునేవారట.చిన్నతనం నుండీ వేంకటేశునిపై అపారమైన భక్తికలిగి యుండటంవలన ఇంటిపనులయందు ఆసక్తిలేక ఆ శ్రీహరిపై గేయములు రచించుతూ ఉండెడి వాడట. తాళ్ళపాక గ్రామమునందే తన రచనలను గానము చేసుకుంటూ ఉండగా ఒకనాటి రాత్రి స్వప్నములో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై  తిరుమలకు వచ్చి తన సన్నిధిలో గానము చెయ్యమని అడిగినారట.ఈవిధముగా వేంకటేశుని ఆనతిపై తిరుపతికి వెళ్ళినట్టు ఆధారములు కలవు.
మార్గమద్యమమున గల గ్రామదేవతలను,అలిపిరి నృశింహస్వామిని దర్శించి మోకాళ్ళ పర్వతము చేరెను.ఇక అలసట చెంది అడుగెయ్యలేక అచటనే రాతిపై పడెనట.అప్పుడు దయార్ద హృదయురాలైన ఆ అలమేలుమంగ ఒక వృద్ధ స్త్రీరూపమున దర్శనమిచ్చి ,పాదరక్షలువిడిచిన అలసటతొలగి ,స్వామిని దర్శించగలవని చెప్పి ప్రసాదము పెట్టి అంతర్ధానమయ్యెనట.ఆమె అమ్మలుగన్న అమ్మ అలమేలుమంగమ్మ అని గ్రహించి ఆశువుగా అన్నమయ్య ఒక శతకం ఆమెపై చెప్పినాడట.
తరువాత సునాయాసంగా కొండెక్కి వరాహస్వామిని దర్శించి,పుష్కరిణిపై,గరుడకదంబంబుపై, విష్వక్సేనునిపై అనేక కీర్తనలను ఆసువుగా రచించి శ్రీవేంకటేశుని దర్శించుటకు  వెళ్ళగా గుడిద్వారము యొక్క తలుపులకు తాళం వేసి ఉండెనట. స్వామి దర్శనము లభించనందుకు చింతించుచూ భక్తితో ఆ స్వామిని స్తుతించగా తాళములు వాటంతట అవేతీయబడి,తలుపులు తెరుచుకుని శంఖ,చక్రములతో వెలొగొందుతున్న స్వామిని చూసిన వెంటనే అన్నమయ్య పరమానంధభరితుడై ఒక శతకము చెప్పినాడట,అప్పుడు స్వామి  మెడలోనుంచి ఒక ముత్యాలహారము పాదాలపై పడెనట. అది చూసిన అర్చకులు అన్నమయ్య దైవాంశ సంభూతుడని గుర్తించినారట.
తిరుమలలో ఘనవిష్ణుడనే పేరుగల మునికి శ్రీవేంకటేశ్వర స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి "అన్నమయ్య అనేపేరుగల వ్యక్తి నీ దగ్గరికి రాగలడనీ అతనికి పంచముద్రలు ధరింపజేయమని" చెప్పినాడని చిన్నన్న చరిత్రలో రాసెను.ఆవిధంగా స్వామి చెప్పినట్టుగానే మరునాడు యాగశాల దగ్గర ఒక బాలుడు హరినామ సంకీర్తనం చేసుకునుచుండగా స్వామి చెప్పిన బాలుడు ఈతనే అని గ్రహించి అన్నమయకు పంచముద్రలు వేయిoచగా ఆనాటినుండీ అన్నమయ్య "అన్నమాచార్యులు"అయ్యెను .తరువాత అక్కడే ఉండి సర్వ విద్యలు నేర్చుకొనెను.పిదప గురువుగారి ఆజ్ఞపై  గృహస్తాశ్రమము స్వీకరించి భార్యా బిడ్డలతోనున్ననూ స్వామిపై గేయములు వ్రాయుటమాత్రము మానలేదు. వీరి భార్యలు తిమ్మక్క,అక్కమ్మ.కుమారులు నరసింహయ్య,పెదతిరుమలయ్య. ఆచార్యులవారి భార్య తిమ్మక్క రచించిన "సుభద్రా కల్యాణం" అను ద్విపద కావ్యం చాలా ప్రసిద్ధి చెందినది.తాళ్ళపాక తిమ్మక్క  తొలితెలుగు కవయిత్రి కూడా.
విజయనగరమును  పరిపాలించిన సాళువ  నృశింహరాయులు అన్నమయ్యను తన ఆస్థానమునకు ఆహ్వానించి స్వామిపై  శృంగార కీర్తన గానము చెయ్యమని కోరగా అందుకు అంగీకరించిన అన్నమయ్య "ఏమొకో చిగురుటధరమున ఎడనర కస్తూరి నిండెనో భామిని విభునకు రాసిన పత్రిక కాదుకదా" అను కీర్తన గానము చేసెనట. అందు కవితాభావానికి ఆనందించిన రాజు తనపై కూడా ఓ కీర్తన రచింపమని కోరగా "నరహరిని స్తుతించిన జిహ్వ ఒరులను నుతింపగనొప్పదు" అని నిరాకరించినెట.  అందుకు కోపించిన రాజు అన్నమయ్యను చెరసాలలో బంధింపగా "సంకెల లిడువేళ" అను కీర్తన గానం చేయగా సంకెళ్ళు అవే విడిపోయెనట. రాజు ఆశ్చర్యపడి స్వామివారికి అన్నమయ్యపై గల దయని కళ్ళారా చూసి శరణు వేడెనట.
పిదప  నవనారశింహ క్షేత్రములో ఒకటైన అహోబిలము,ఉదయగిరి మొదలగు క్షేత్రాలన్ని దర్శించి ఆయా దేవతలపై ఎన్నో సంకీర్తనలను రచించెను.అంతేగాక శృంగార మంజరి,సంస్కృతంలో వేంకటాచల మహత్యం,సంకీర్తన లక్షణము,12 శతకములు,ద్విపద రామాయణము మొదలగు రచనలను ఆ శ్రీనివాసుని చరణారవిందములకు అంకితమిచ్చెను.
అన్నమయ్య సంస్కృతంలో రచించిన వేంకటాచల మహత్యాన్ని వారి మనుమడు చినతిరుమలయ్య తెలుగులో అనువదించెను.
అన్నమయ్య సంకీర్తనలోని కొన్ని విశేషాంశములు: అన్నమయ్య రచించిన 32,000 సంకీర్తనలను 32,000  మంత్రాలని అతని మనుమడు చిన్నన్న తన ద్విపదలో పేర్కొన్నాడు.ఇది సత్యము.అన్నమాచార్యులకు గల భక్తి,వైరాగ్యము,భాషా,భావ పఠిమ అన్నీ సంకీర్తనలలో ప్రస్పుటముగా కనిపించును. భక్తి మార్గములో పరమాత్మ స్వరూపమును ధ్యానించి తరించిన పురుషోత్తముడు అన్నమయ్య.ఈ జగత్తు అంతయూ భగవంతునిమయమేనన్న వీరి విశ్వాసము వీరి కీర్తనలయందు గోచరించును. ఉదా: "హరి నీమయమే అంతాను"  అన్న కీర్తన.
వాక్యం రసాత్మకం కావ్యమైతే  వీరి ఒక్కో సంకీర్తన ఒక్కో మహాకావ్యం అనుటలో అనుమానంలేదు.
మానవ జీవితాన్ని కాచి వడబోసిన సత్యాలన్ని నానాటి బతుకూ నాటకము అన్న కీర్తనలో చక్కగా వివరించారు అన్నమయ్య.పుట్టుట ఎంతనిజమో పోవటం కూడా అంతే నిజమని,జీవితమనే ఈనాటకంలో భగవంతుడు నీచేత ఏపాత్ర వేయిoపజేస్తున్నాడో ఆపాత్రలలో నీ పాత్ర ముగిసాక ఆయన పిలవగానే వెళ్ళిపోవాలిరా వెర్రివాడా.. అని మనలని హెచ్చరించి,కట్టకడపటిది కైవల్యం అని దానికై మాత్రమే తపించరా అని ఉపదేశం కూడా చేసారు.ఈ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకోగలిగితే ఈలోకంలో ఈర్ష్య,ద్వేషం,స్వార్థం,ఇలాంటి అరిషడ్వర్గాల బారిన మనిషి అసలు పడలేడేమో  అనిపిస్తుంది. హరిని పట్టుకున్నవాడిని అరిషడ్వర్గాలు ఏంచెయ్యగలవు? మనసుకి కాని ,శరీరానికి కాని ఏకల్మషం,రోగం రాకుండా ఉండాలంటే ఏపూజా ,పునస్కారాలు అవసరం లేదు,కేవలం ఈకీర్తనలు చేవులారా విని ,విన్నదాన్నిమనసారా అర్థం చేసుకుని,త్రికరణశుద్ధిగా ఆచరించగలిగితే  చాలేమో.
కలియుగంలో చాలామందికి ఒక అనుమానం ..అసలు దేవుడు ఉన్నాడా? వారందరికి సమాధానం"o మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు" అన్న కీర్తన .నీ మనసులో ఎంత భక్తి ఉంటే అంత దగ్గరగా భగవంతుడున్నాడని చెప్పకనే చెప్పారు అన్నమయ్య. భాగవతంలో పోతన కూడా "కలడను వాడికి కలడు,లేడను వాడికి లేడు,కలడో లేడో అనువాడికి కలడో లేడొ"అన్నా పద్యంలో ఇదే విషయాన్ని చెప్పియున్నారు. దైవాoశ సంభూతులందరి అలోచనా సారం ఒకటే కదామరి.
మనుషులంతా ఒక్కటే అన్నమాట 600సంవత్సరాల పూర్వమే చెప్పినాడు అన్నమయ్య. అందుకే" అందరికీ శ్రీహరే అంతరాత్మ"అన్నాడు ఈ విష్ణు భక్తుడు, తన బ్రహ్మమొక్కటే అన్న సంకీర్తనలో.  అంటే పుట్టుకతో మనం అందరం ఒక్కటే, మనం చేసే కర్మల ఆధారంగా మనం వేరు వేరు జాతులవారిగా కులాల వారిగా పరిగణింపబడుచున్నాము. కానీ సత్యం ఒక్కటే మన అందరికీ  ఆ హరే అంతరాత్మ. ఈ సత్యాన్ని మూలం నుంచీ అర్థం చేసుకోగలిగితే  ఈ జాతి,కుల ,మత, వర్ణ భేదం మనుషుల  మధ్య రాగలిగేవి కాదేమో.
ఉన్నది ఒక్కటే ఆ పరబ్రహ్మము మనమందరమూ అందులోనుంచి వచ్చిన వారమే .వేదంలో చెప్పిన "ఏకం సత్ విప్రాహః  బహుదా వదంతి" అన్న మాటనే తన సంకీర్తన ద్వారా సరళంగా వివరించారు.ఉన్నది ఒక టే సత్యము అదే పరమేశ్వరుడు జ్ఞానులు వేరు వేరు రూపమూలో ఆ సత్యమును  చెప్పియున్నారు.
మనం అందరం ఆదైవము యొక్క దివ్య అoశతో పుట్టినవారమే మన చేష్టలు మన దివ్యత్వాన్ని పెంచే విధంగా ఉంటే సత్పురుషులం అవుతాము లేకుంటే దుష్టులమవుతాము. అంటే భగవత్ సృష్టిలో ప్రతీప్రాణియొక్క మనసులో చెడు అలోచన మొదలవనంతవరకూ ఉత్తముడే..ఆ చెడ్డ అలోచనలు రాకుండా అంటే కలి ప్రభావం మనపై ఉండకుండా మనలిని రక్షించేందుకు ఆ ఏడుకొండలవాడు ఉండనే ఉన్నాడు. కాబట్టి మనం చెయ్యవలసిందంతా ఒక్కటే ఈ సంకీర్తనాచార్యులవారు రచించిన సుమధుర భక్తిసంకీర్తనల శ్రవణం లేదా స్మరణంతో ఆ శ్రీహరిని అన్యధా శరణం నాస్తి అని శరణు వేడడమే. అప్పుడాయన "యొగ క్షేమం వహామ్యహం" అని మన భారాన్నంతా ఆయనే వహించి ఈ సంసర సాగరాన్ని మనచేత సునాయాసంగా దాటిస్తాడు.
ఆయన ప్రతీకీర్తన ఒకమంత్రం అని అతని మనవడన్నాడు,కానీ వేంకటేశ్వరుని నామమే ఎంతో మహిమాన్వితమైన మహా మంత్రం అని ఆయన ఇలా చెప్పాడు"అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు దొరికే వేంకటేశు మంత్రము" అంటే వెంకటేశా అంటే అన్నిమంత్రాలు జపించినట్టే.
అన్నమయ్య తన జీవితకాలంలో రచించిన ప్రతీకీర్తనని విశ్లేషించాలంటే ఈ కాలపు సాధారణ మానవునికి తన జీవితకాలం ఖచ్చితంగా సరిపోదు. వీరి సంకీర్తనలలో ఆ కాలము నాటి సాంఘిక,సాంస్కృతిక స్వరూపములు, ఆచారములు,సామెతలు,అలంకారములు అన్నీ కనిపిస్తాయి. అంతే కాక వీరి మధుర కవితా గానంలో జాజర,లాలి,సువ్వి,గొబ్బి,ఊయల,జోల,జోజో,అల్లోనేరెళ్ళు,చాంగుభళాలు,తందనానాలు,జయమంగళాలు మొదలగు పదములు సహజ రీతిలో అలరాడుచున్నవి.
అన్నమయ్య భగవంతునియందు నాయక భావము,తనయందు నాయిక భావము ఊహించుకుని మధురమైన శృంగార సంకీర్తనలను రచించెను.శ్రీవేంకటెశుని  నాయకుడిగా భావించి ఆయన లీలా విశేషములను కీర్తించుచూ రాసిన రచనలు కనుకనే వాటిని సంకీర్తనలని యందురు.వేల సంకీర్తనలను రచించిన కీర్తిని గణించిన అన్నమాచార్యులవారు సంకీర్తన అనే పద్ధతిని ప్రవేశ పెట్టిన ప్రప్రధములని నిస్సంసయముగా చెప్పవచ్చును. పల్లవి,అను పల్లవి,చరణములను వాటిని రూపకల్పన చేసిందికూడా  ఆచార్యులవారే.
అందుకే ఆయనకు పదకవితాపితామహుడనియూ, సంకీర్తనాచార్యుడనియూ, ద్రవిడాగమ సార్వభౌముడనియూ బిరుదులు ఒసంగబడినవి.
అన్నమయ్యయొక్క గొప్పదనము,రచనలనువిని శ్రీ పురందరదాసు అయనకంటే సుమారు 75సంవత్సరాలు చిన్న వారైనపట్టికీ వారిని దర్శించి ,సాక్షాత్తు వి ష్ణువుగా భావించి,కీర్తించి తరించెను. కలియుగంలో యజ్ఞ,యాగాదులు చేయలేని మనిషి కేవలం నామ స్మరణ చేసిన చాలు ముక్తిని ప్రసాదిస్తానని పరమాత్మ చెప్పియున్నాడు.అన్నమయ్య తన జీవితంలో ఇది ఆచరించి భావితరాలకి చూపించెను.
శరీరానికి జబ్బు చేస్తే ఔష ధాన్నిచి నయం చేస్తుంది వైద శాస్త్రం,కానీ వేంకటేశ్వర నామం సంసారంలో ఉండే అన్ని బాధలకు దివ్యౌషదం అని ఒక సంకీర్తనలో ఇలా వివరించాడు.
అన్నిటికీనిది పరమౌషదము  వెన్నుని నామమే విమలౌషదము
 చిత్తశాంతికిని శ్రీపతినామమే హత్తిన నిజదివ్యౌషదము
మొత్తపు బంధవిమోచనంబునకు హరిపాద జలమె ఔషదము
మురహరు పూజే ముఖ్యౌషదము
ఇల నిహపరంబుల ఇందిరావిభుని అలరి భజించుటె ఔషదము
కలిగిన శ్రీవేంకటపతి శరణయె నిలిచిన మాకిది నిత్యౌషదము.
అన్ని సమస్యలకు, రోగాలకు, బాధలకు ఈనామమే దివ్యౌషదమని చెప్పిన అన్నమయ్య ఆ శ్రీహరిని  సేవించి, సంపాదించుకున్న భక్తి అనే దివ్యౌషదాన్ని మనకి కూడా తన సంకీర్తనల ద్వార పంచిపెట్టాడు. దాన్ని మనం ఎంత సేవిస్తే అంత ధన్యులం.
తాళ్ళపాక వంశఖ్యాతికి మూలపురుషుడైన అన్నమయ్య 1503 దుందుభి నామ  సంవత్సర ఫాల్గున బహుళ ద్వాదశి దినమున ఆ వేంకటేశుని మనో ఆస్థాన గాయకుడిగా శాశ్వత స్థానమును పొందెను.
అన్నమయ్య స్వామి చరణారవిందాలకు సమర్పించిన  ఆ సంకీర్తనా నిధి తిరుమలలో స్వామివారి ఆలయమునకు ఎదురుగా ఉన్న అన్నమయ్య భాండాగారంలో సుమారు 400 సంవత్సరాలు నిఘూడంగా ఎవరికీ తెలియకుండా ఉండిపోయాయి.  1922వ సంవత్సరంలో కొన్ని శతకాలు,రాగిరేకులపై ఉన్న 14,000 కీర్తనలు మాత్రమే లభ్యం అయినాయి.ఈ రాగిరేకులపై ఉన్న సంకీర్తనలను  కుమారుడు తిరుమలయ్య రచింపజేసినట్లుగా కొన్ని ఆధారలు లభ్యం అయ్యాయి. అప్పటి నుండీ తి.తి.దే ఎందరో గాయకులచే వీటిని స్వరపరిచి,పాడిస్తూ,ప్రచారంగావిస్తూ జనులందరిని తరింపజేస్తున్నది.
తెలుగు భారతికి వెలుగు హారతై నీ ఎద లయలో శ్రీవేంకటేశునిపై పదకవితలు రచించిన ఓ అన్నమయ్య .....నీవు శ్రీవేంకటేశ భక్తి సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజు వయ్యా!

No comments:

Post a Comment

Pages