ప్రేమతో నీ ఋషి – 3 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 3

Share This

ప్రేమతో నీ ఋషి – 3

- యనమండ్ర శ్రీనివాస్

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. కలతచెందిన రాజు, ఆ అద్భుత చిత్రాన్ని తునాతునకలు చెయ్యమనగా, మంత్రి దాన్ని అడవిలో వదిలివెయ్యమని భటులకు చెప్పగా, వారు దాన్ని అమ్మి సోమ్ముచేసుకుంటారు. అది అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కార్పొరేట్ ప్రపంచాన్ని కొన్నేళ్ళపాటు కుదిపెయ్యగల ఆ సందేశం గురించి తెలియాలంటే... మనం కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో ఏమి జరిగిందో తెలుసుకోవాలి... గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుంటాడు ఋషి... దారిలో అతను ఏమి చెప్పబోయినా, స్నిగ్ధ వినకపోవడంతో, అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...   ఇక చదవండి...)
జనవరి 2, 2009 లండన్ ఐ పరిసరాలు...
“లండన్ అంటే విసిగిన వాడు జీవితం అంటే కూడా విసిగి ఉంటాడు అంటుంటారు, ఇది తమాషాకి అన్నది కాదు,” అన్నాడు ఋషి, మిష్టర్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతినిధులతో లండన్ ఐ చూసేందుకు వెళ్తూ...
మిష్టర్ శర్మ బాంక్ ప్రైమ్ సూయిస్ కస్టమర్, ఋషి రిలేషన్ షిప్ మేనేజర్. మిష్టర్ శర్మ ప్రాక్టీసులో ఉన్న ఛార్టర్డ్ అకౌంటెంట్, హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రముఖ ఆడిట్ సంస్థలో భాగస్వామి. ఆయన ఇప్పుడు యు.కె.  ప్రొఫెషనల్ టూర్ కు, దక్షిణ భారతం నుంచి వచ్చిన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రతినిధులకు అధ్యక్షత వహిస్తున్నారు. CA ఇన్స్టిట్యూట్ ఎప్పటికప్పుడు నిర్వహించే నెట్వర్కింగ్ కార్యకలాపాల్లో ఈ టూర్ ఒక భాగం.
ఈ టూర్ లో మిష్టర్ శర్మ తో పాటు 30 మంది CA లు వచ్చారు. వీరంతా మొదట తక్కువ సంబంధబాంధవ్యాలు కలిగినవారిగా కనిపించినప్పటికీ, వారి ప్రొఫెషనల్ నెట్వర్క్ యెంత విస్త్రుతమైనది అంటే, వారు దక్షిణ భారతంలో ఉన్న వాపారవేత్తలు, సినీరంగంలోని వ్యక్తులు, రాజకీయవేత్తలు వంటివారు ఎందరితోనో పనిచేసారు.
మిష్టర్ శర్మ బ్యాంకు ప్రైమ్ సూయిస్ కు పాత కస్టమర్, రెండేళ్ళ క్రితమే ఋషికి పరిచయం అయ్యారు. ఋషి, మిష్టర్ శర్మ ను కేవలం ఒక కస్టమర్ గా మాత్రమే పరిగణించక, ఆయన పరపతిని కొత్త క్లైంట్స్ కోసం వాడుకున్నాడు. మిష్టర్. శర్మ కు ఆయన క్లైంట్స్ కోసం ఒక “ఇన్వెస్ట్మెంట్స్ కన్సల్టింగ్ బిజినెస్ (పెట్టుబడుల సంప్రదింపుల వ్యాపారం) “ ఉంది, వారి వివరాలను ఋషికి అందిస్తూ ఉండేవారు.
తన బ్యాంకు కొత్తగా ఆరంభించిన ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ను వృద్ధిపరిచేందుకు ఋషి CA ల కోసం ఒక టూర్ ను ఏర్పాటు చేసాడు. ఆ రోజు ఋషి టీం లోని అందరికోసం ప్లాన్ చేసిన అతిపెద్ద ఆకర్షణ, లండన్ ఐ.
లండన్ ఐ థేమ్స్ నది ఒడ్డున ఉన్న 443 అడుగుల ఎత్తున్న ఫెర్రిస్  వీల్ ఉంది. ఇది 32 కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఎయిర్ కండిషన్డ్ సీల్డ్ పాసెంజర్  కేప్సూల్స్ ను కలిగి ఉంటుంది. పది టన్నులుండే ఒక్కొక్క కేప్సూల్ 25 మంది పడతారు, వీరు ఇందులోనే హాయిగా నడుస్తూ తిరగగలుగుతారు.
ప్రతినిధులంతా లండన్ ఐ యొక్క గ్లాస్ విండో నుంచి లండన్ నగరపు అందాలను తిలంకించడంలో బిజీ గా ఉన్నారు.
ఋషి వారికి వీల్ గురించి మరిన్ని అంశాలను వివరించసాగాడు, “ పారిస్ లోని ఐఫిల్ టవర్ లాగా, లండన్ లో ఉన్న ఈ వీల్ ఐ , నగరపు వైభవానికి ప్రతీకగా నిలుస్తూనే, ప్రజలు నగరం పైకి వెళ్లి, అందాలను తిలకించే అవకాశం ఇస్తోంది. కేవలం ప్రముఖులు లేక ధనవంతులకే కాక, ఈ అవకాశం అందరికీ దక్కుతుంది. ఇదే దీని ప్రత్యేకత; ఇది అందరికీ అందుబాటులో ఉంది, అదీ లండన్ నగరం నడిమధ్యలో ఉంది.”
“మిష్టర్ శర్మ, హైదరాబాద్ జీవితం ఎలా ఉంది ? అంతా బాగుందని భావిస్తున్నాను. ఈ వీల్ నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యం మీకు నచ్చిందా ?” ఋషి నెమ్మదిగా సంభాషణ మొదలుపెట్టాడు.
“ఎస్ మిష్టర్ ఋషి, ఇటువంటి ఒక వీల్ ను హైదరాబాద్ లో ఎందుకు నిర్మించకూడదూ, అని నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయం గురించి పర్యాటక మంత్రాంగం తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది నగరానికి, దేశానికి కూడా గొప్ప ఆదాయాన్ని తెచ్చే అవకాశం అవుతుంది.”
“మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం మిష్టర్ శర్మ,” బదులిచ్చాడు ఋషి, “2000వ సం. నుంచి లండన్ ఐ పట్ల పర్యాటకుల ఆకర్షణ చూసిన చైనా వారు, 2006 లో ‘స్టార్ ఆఫ్ నాన్ చాంగ్ ‘ అనే వీల్ ను నిర్మించగా, అదేవిధమైన వీల్ ను సింగపూర్ లో 2008 లో ఏర్పరిచారు. ఒకసారి నేను ముంబై లో ఇటువంటిదే నిర్మించాలని అనుకోవడం విన్నాను, తర్వాత దాని గురించిన తాజా సమాచారం నాకు తెలీదు.”
“CA ఇన్స్టిట్యూట్ యొక్క హైదరాబాద్ బ్రాంచ్ లో నేను ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పై ఒక రెండు రోజుల ఆడిట్ ను నిర్వహించాబోతున్నాను. నేను దీనికి రాష్ట్ర పర్యాటక మంత్రిని, కొత్తతరం పెట్టుబడిదారులతో చర్చించేందుకు ఆహ్వానించాను. అప్పుడు వారు ఈ అంశంపై చొరవ తీసుకునేలా ఈ ఐడియా ను వారికి తెలియచేసేందుకు ప్రయత్నిస్తాను.”
“ఇది చాలా మంచి ఆలోచన, విశేషించి, పర్యాటక మంత్రాంగం బ్రాండ్ హైదరాబాద్ ను నిర్మించి, దాన్ని దక్షిణ భారతపు సాంస్కృతిక కేంద్రంగా మలచాలని కృషి చేస్తున్నప్పుడు, ఇది బాగా ఉపయోగిస్తుంది. స్థానిక వ్యాపారవేత్తలతో భాగస్వామ్యం ద్వారా, ఈ ప్రపంచస్థాయి ఆకర్షణలు మన స్వంత నగరాల్లో ఏర్పరచుకోవడం అనేది, ఎంతో దూరంలో లేదు, అని నేను భావిస్తున్నాను,” అన్నాడు ఋషి, మిష్టర్.శర్మ ప్రతిపాదనతో ఏకీభవిస్తూ.
మిష్టర్ శర్మ ఈ చర్చలో చాలా ఆసక్తికరంగా పాల్గొంటున్నట్లు కనిపించారు. “నిజమే, ఈ విధమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లు ,కార్పొరేట్ వారి సహకారంతోనే సాధ్యం. ఉదాహరణకు, ఈమధ్యనే ప్రభుత్వం “ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ” ప్రపంచస్థాయి మ్యూజియం ను నిర్మించి, భారతీయ చిత్రకళను ప్రదర్శించేందుకు గానూ ఒక మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నిర్వాణా ప్లస్ సాఫ్ట్వేర్ కంపెనీ CEO , మహేంద్ర దసపల్లా ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తున్నారు. “
ప్రద్యుమ్న ఆర్ట్ మ్యూజియం గురించి  వినగానే ఋషి కళ్ళు నిశ్శబ్దంగా వెలిగాయి. టూరిస్ట్ గైడ్ గా తాను ఎత్తిన ఈ కొత్త అవతారం తనకు గొప్ప లాభాలను ఆర్జించి పెడుతుందని అతను అనుకున్నాడు. ఇప్పుడు అతనికి  మిష్టర్ శర్మ ద్వారా  మహేంద్ర ను కలిసి, మరొక క్లైంట్ ను ఆర్జించుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికై అతడు కొంతకాలంగా వేచిఉన్నాడు.  కాని, అతడు తన మనోభావాలు వెంటనే మిష్టర్ శర్మ కు వెల్లడించదల్చుకోలేదు.
“ మిష్టర్ శర్మ, మనం ఇప్పుడు హోటల్ కు వెనక్కి వెళ్దాము. మీ టీం అంతా ఇవాళ ఆనందించారని, నేను భావిస్తున్నాను. రేపు మీకు మరిన్ని కార్యక్రామాలు ఉన్నాయని నాకు తెలుసు. అందుకే, మీ అందరికీ విశ్రాంతి అవసరం. నేను రేపు సాయంత్రం సమావేశంలో మిమ్మల్ని కలుస్తాను,” అంటూ ఋషి ప్రతినిధులను హోటల్ కు వెనక్కి తీసుకువచ్చాడు.
*****
మర్నాడు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఋషి ప్రతినిధులను హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ లో కలిసాడు. వారంతా సమావేశం అయ్యాకా, అతను వారిని మరొక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆ గదిలో రెండున్నర గంటల ‘వైన్ టేస్టింగ్ సెషన్’ కు అనువైన ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. ఆరోజు ఋషి లక్ష్యం వారికి కేవలం వినోదం కల్పించడం మాత్రమే కాదు. అతని మనసులో ఒక వ్యాపార ప్రతిపాదన ఉంది. కప్ కాఫీ తో మాత్రమే కాదు, మద్యం వల్ల కూడా ఎన్నో పనులు జరుగుతాయని అతనికి బాగా తెలుసు.
“హలో ఫ్రెండ్స్, రాబోయే రెండున్నర గంటలు మిమ్మల్ని వైన్ ప్రపంచంలోకి తీసుకువెళ్తాను. మీరంతా ఈ సెషన్ ను ఆస్వాదిస్తారని నా నమ్మకం. జీసస్ మొదట, ఒక వివాహ వేడుకలో వైన్ కొరత తీర్చేందుకు నీటిని వైన్ గా మార్చి, అద్భుతం చేసారు అంటారు. హిందూ దేవతలు కూడా సోమరసాన్ని(అమృతాన్ని) త్రాగుతారు. అందుకే, వైన్ తాగడం అన్న అంశానికి,  వేల శతాబ్దాల చరిత్ర ఉంది.
మనమంతా వైన్ త్రాగుతాము. కాని దానిలోని వెరైటీ ల గురించి, నాణ్యతను గుర్తించడం గురించి, గ్లాస్ చేతిలోకి తీసుకున్న దగ్గరనుంచి అనేకవిధాలుగా పరిశీలిస్తూ, త్రాగే పద్ధతిని గురించి మీరు తెలుసుకుంటే, వైన్ రుచిని నిజంగా ఆస్వాదించగలుగుతారు. ఈ సెషన్ లో మీకు మీ టేబుల్ పై ఉన్న 8 వైన్ రకాలలో ఐదింటిని ఎంచుకునే అవకాశం ఉంది. వాటిని మీరు రుచి చూస్తూ ఉండగా, నేను మీకు వైన్ నాణ్యతను తెలిపే అంశాలను వివరిస్తాను...” అన్నాడు ఋషి.
ఆ సెషన్ అందరికీ బాగా నచ్చింది. అతను చెప్పే ఒక్కొక్క అంశం వారికి ఎంత ఆసక్తికరంగా ఉందంటే, వారు పూర్తిగా దానిలో నిమగ్నమై ఆనందించసాగారు. అన్ని రకాల వైన్లు రుచి చూడడం పూర్తయ్యాకా, ఋషి తన సంభాషణను ఇలా కొనసాగించాడు.
“పాత చిత్రాల సేకరణ లాగానే, ఎంతోమంది తమ ప్రైవేట్ బార్స్ లో అరుదైన వైన్ బాటిల్స్ ను సేకరించి పెట్టుకోవడం ఒక హాబీగా భావిస్తారు. పెయింటింగ్స్ లాగానే, పాతబడే కొద్దీ వైన్ బాటిల్ విలువ కూడా పెరుగుతుంది. కనుక, వైన్ మీకు మ్యూట్యువల్ ఫండ్ లేక షేర్ తో సమానమైన లాభాలను ఆర్జించి పెట్టగలదు. కాని ఏ బాటిల్ కొనాలో, ఎంతకు కొనాలో, ఎలా దాచాలో, ఎప్పుడు అమ్మాలో మీకు తెలియాలి. అందుకే పెట్టుబడుల కోసం ప్రముఖుల ‘అసెట్ మేనేజర్’ మీద ఆధారపడుతూ ఉంటారు. అలాగే వైన్ పెట్టుబడులకై ‘వైన్ అసెట్ మేనేజర్ ‘ పై ఆధారపడవచ్చు. ఫ్రెండ్స్, ఈ సందర్భంలో నేను మీ ముందుకు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ను తీసుకువస్తున్నాను, దీన్ని మీరు మీ ఇండియన్ కస్టమర్స్ కు వివరించవచ్చు. ఇది స్కాట్లాండ్ లోని నెం. 2 వైన్ యార్డ్ ద్వారా నిర్వహించబడుతున్న వైన్ ఫండ్. వైన్ ఫండ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వివిధ పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను, అనేక ప్రాంతాల్లోని టాప్ వైన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వారి పెట్టుబడుల పురోగతిని గురించి వారికి ఎప్పటికప్పుడు తెలియచేస్తారు. ఫండ్ కాలపరిమితి పూర్తి కాగానే, వైన్ ను మార్కెట్ లో అమ్మి, కంపెనీ అధికారులు, లాభాలను అసలుతో సహా పెట్టుబడిదారులకు పంచేస్తారు. “ అంటూ ఋషి వారికి వైన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించిన ప్రేసేంటేషన్ ను చూపాడు. ఇది బ్యాంకు తన హై ఎండ్ క్లైంట్స్ కోసం అందించే ప్రోడక్ట్. ఋషి ఈ ప్రోడక్ట్ కు సేల్స్ మేనేజర్. CA ల ద్వారా భారత్ లోని పెట్టుబడిదారులను చేరి, తన బిజినెస్ టార్గెట్ ను పూర్తిచెయ్యాలని, అతని లక్ష్యం. ప్రముఖులంతా పెట్టుబడులకు తమ CA లపై ఆధారపడతారని అతనికి బాగా తెలుసు. సెషన్ రాత్రి 9 గం. దాకా కొనసాగింది, పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి క్లైంట్స్ ను ఒప్పించేందుకు తగిన మెటీరియల్ ఇవ్వబడింది. వారు తీసుకువచ్చే ప్రతి క్లైంట్ కు గానూ, వారికి అందే కమిషన్ గురించి కూడా ఋషి వారికి చెప్పాడు. చివరగా ఋషి వారిని ఫీడ్ బ్యాక్ అడిగి, ఈ విషయంగా వారిని తిరిగి సంప్రదించేందుకు CA ల వివరాలను తీసుకున్నాడు. CA లు అంతా ఋషికి, బ్యాంకు వారికి, తెలిపారు.
“సెషన్ చాలా ఆసక్తికరంగా నడిచింది, అందరూ ఈ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ కొరకు వారి క్లైంట్స్ ను ఒప్పించాగలరన్న నమ్మకం నాకుంది, కృతఙ్ఞతలు ఋషి,” అన్నారు మిష్టర్ శర్మ.
“ ప్లెషర్ ఇస్ అల్ మైన్... మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మిష్టర్ శర్మ. మహేంద్ర దసపల్లా ను నాకు పరిచయం చెయ్యమని, మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఆయన మా బ్యాంకు క్లైంట్ అవగలరేమో ప్రయత్నించాలి. ఆయనతో మీకు మంచి సంబంధం ఉందని, నాకు తెలుసు “ అన్నాడు ఋషి.
ఋషి పరిచయాన్ని నెట్వర్క్ గా మార్చుకునే అవకాశాన్ని అతను ఎప్పుడూ వదులుకోడు. , అతను కలిసిన ప్రతి ప్రొఫెషనల్ ను కేవలం ఒక వ్యక్తిగా కాక, అతనికున్న నెట్వర్క్ కు ప్రతినిధిగా భావిస్తాడు. ఒక వ్యక్తితో పరిచయం చేసుకుంటే, వారి నెట్వర్క్ అంతా నీదే – అనే సిద్ధాంతాన్ని అతను బలంగా నమ్ముతాడు.
మిష్టర్ శర్మ మహేంద్రను పరిచయం చేస్తానని చెప్తూ, మనసులో తాన క్లైంట్స్ ను వైన్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టేలా చేసినందుకు, తనకు రాబోయే కమిషన్ ను అంచనా వేసుకోసాగాడు. ఋషి ఆయనకు కృతఙ్ఞతలు చెప్పి, అందరికీ వీడ్కోలు పలికి, హోటల్ నుంచి వెళ్ళిపోయాడు.
*********
ఋషి CA లను UK స్టడీ టూర్ లో కలిసి, రెండు నెలలు కావస్తోంది.
అతను ఇప్పుడు సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా లండన్ ఆఫీస్ నుంచి మాంచెస్టర్ శాఖకు మారాడు.
“ఋషి, నీవు పది నిముషాల్లో నా కాబిన్ కు రాగలవా ?” అంటూ కాల్ చేసాడు విలియం స్కాట్, ఋషి బాస్.
“ఋషి, ఈ నెల టార్గెట్ కు గాను నీవు చేసిన అద్భుతమైన కృషిని మెచ్చుకునేందుకు నేను నిన్ను పిలిచాను. నీ వైన్ ఫండ్ టార్గెట్ ను అధిగమించావు, కంగ్రాట్స్, “ అన్నాడు విలియం స్కాట్, తన కళ్ళు సీనియర్ క్లైంట్ బ్యాంకర్స్ నెలవారీ సేల్స్ ను పరిశీలిస్తుండగా. మాంచెస్టర్ శాఖ సాధించిన విజయాల్లో ఋషి పాత్ర ఒక మైలురాయి వంటిది అయినందుకు ఆయన ఆనందంగా ఉన్నారు.
మిష్టర్ స్కాట్ ను హెడ్ ఆఫీస్ వారు గత రెండు నెలలుగా వైన్ ఫండ్ ప్రోడక్ట్ ను వృద్ధిపరచమని పదేపదే వెంటాడుతున్నారు. రెసిషన్ సమయం కావడంవల్ల, అతనికి హై ఎండ్ క్లైంట్స్ ను వ్యాపార నిమిత్తం కలిసేందుకు చాలా కష్టమయ్యింది.
కాని, ఋషి, CA ల తో గత కొన్ని వారాలుగా వృత్తిపరమైన సంబంధాలు పెంచుకుని, వారి  రిఫెరల్స్ ద్వారా ఇండియన్ క్లైంట్స్ ను సంపాదించగలిగాడు. ప్రతి CA తన క్లైంట్ ను వైన్ ఫండ్ లో పెట్టుబడులకు ఒప్పించడంతో ఋషి తన బిజినెస్ టార్గెట్ ను సాధించగలిగాడు.
“ఇందుకై మనం ఘనంగా వేడుకలు చేసుకోవాలి కదూ, ఋషి ?” అన్నాడు స్కాట్.
ఋషి వైన్ ఫండ్ కమిట్మెంట్ గురించి తెలుసుకుని, తన బాస్ ఆశించినదాన్ని పూర్తిచెయ్యగలిగినందుకు చాలా సంతోషించాడు. సేల్స్ టార్గెట్ ను చేరేలా క్రింది ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చే విషయంలో స్కాట్ చాలా కఠినంగా ఉంటాడు.
“వైన్ ఫండ్ లక్ష్యాన్ని సాధించినందుకు వేడుకలు చేసుకునేందుకు నాకేమీ అభ్యంతరం లేదు స్కాట్. కాని, మన శాఖ కోసం వైన్ ఫండ్ ను సాధిస్తే, మీరు నాకు చేసిన ప్రమాణం మీకు గుర్తుందని అనుకుంటున్నాను.”
“ గుర్తుంది ! ఈ విషయంలో నువ్వేమీ చింతించకు. నేను ప్రోడక్ట్ టీం లో ఉన్న చార్లెస్ తో మాట్లాడి, నీకు ఆర్ట్ ఫండ్స్ ను కూడా అమ్మే టార్గెట్ నీకు దక్కేలా చూస్తాను.” బదులిచ్చాడు స్కాట్.
వైన్ ఫండ్స్ లాగానే ఆర్ట్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్. ఇందులోని పెట్టుబడులు ఆర్ట్ లోని మాస్టర్ పీసెస్ పై ఉండి, ప్రొఫెషనల్ ఆర్ట్ గేలరీ లు, ఆర్ట్ డీలర్ల ద్వారా నిర్వహించబడుతూ, బ్యాంకుల వంటి ఆర్ధిక సంస్థల ద్వారా పంపిణీ చెయ్యబడతాయి. విశ్వవ్యాప్తంగా వైన్ ఫండ్  మార్కెట్ లాగానే, ఆర్ట్ ఫండ్ మార్కెట్ కూడా నెమ్మదిగా పెంపొందుతోంది.
ఋషి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహేంద్ర దసపల్లా ద్వారా ఏర్పాటు చెయ్యబోతున్న ఆర్ట్ మ్యూజియం గురించి తెలిసినప్పటి నుంచి, ఆర్ట్ ఫండ్ మార్కెట్ లో స్థానం పొందేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడు. అతను స్కాట్ ను ఆర్ట్ ఫండ్ పంపిణీ తనకు ఇప్పించమని కోరుతున్నాడు.
అతనికి మహేంద్ర ను కలవాలని, అతని తన బ్యాంకు క్లైంట్ గా మార్చాలని ఉంది. అది తన అమ్ములపొదిలో ఒక అస్త్రం అవుతుందని అతనికి తెలుసు. అందుకే అతను ఓపిగ్గా పావులు కదుపుతున్నాడు. మొదట అతను వైన్ ఫండ్ పంపిణీ ద్వారా స్కాట్  నమ్మకాన్ని గెల్చుకున్నాడు, మిష్టర్ శర్మ తో సంబంధాలు పెంపొందించుకున్నాడు, చివరికి మహేంద్ర సామ్రాజ్యాన్ని చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.
“ఆర్ట్ ఫండ్ అనేది, పూర్తిగా వేరే ఆట ఋషి. మనం ప్రోడక్ట్ ను మరింత నిశితమైన పద్ధతిలో చేరాలి, ఇందుకోసం నువ్వు మొదట ఆర్ట్ మార్కెట్ స్పేస్ కు సంబంధించిన శిక్షణ పొందాలి. కాబట్టి, ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించిన కనీస జ్ఞానం పొందడం కోసం మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ వంటి ఆర్ట్ గేలరీ లను సందర్శించడంపై దృష్టి పెట్టు,” అంటూ ఋషికి సలహా ఇచ్చాడు స్కాట్.
ఋషి ఇది విని ఆనందించాడు. స్కాట్ కు కృతఙ్ఞతలు చెప్పి, వెళ్ళిపోయాడు.
(సశేషం )

No comments:

Post a Comment

Pages