పుట్టినరోజు - అచ్చంగా తెలుగు

పుట్టినరోజు

Share This

పుట్టినరోజు

పోడూరి శ్రీనివాసరావు

ద్వారకాహోటల్ లో టిఫిన్ చేసి బయటకు వచ్చారు రఘు, శారద. వెనకనే రెండేళ్లబాబు శ్రీధర్ కూడా శారద వేనిటీబ్యాగ్ తీసుకుని బుడి బుడి నడకలతో బయటకు వచ్చాడు. పార్కింగ్ లో ఉన్న స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాడు రఘు. శ్రీధర్ అటూ ఇటూ పరుగులు తీయకుండా జాగ్రత్తగా చూస్తూ, రెస్టారెంట్ వెలుపలే ఉన్న పాన్ షాప్ లో వక్కపొడి పొట్లాలు కొనుక్కొని, బాబు నెత్తుకుని, స్కూటర్ దగ్గరకు వచ్చింది, శారద.
          తారురోడ్డుపై హుషారుగా డ్రైవ్ చేస్తున్నాడు రఘు. షాపింగ్ సెంటర్ వద్దకు వచ్చి ఆగారు. శ్రీధర్ కోసమని రెండుజతల రెడీమేడ్ డ్రస్ లు తీసుకున్నారు. ప్రక్కనే ఉన్న బేకరీలో బాబు పుట్టిన రోజుకి బర్త్ డే కేక్ ఆర్డరిచ్చి ఇంటికి బయలు దేరారు.
టూటౌన్ పోలీస్ స్టేషన్ దాటి, భానుగుడి వచ్చే లోపే, ఫ్లై ఓవర్ క్రిందనుంచి వెళ్తూ ఉండగానే, ఉన్నట్టుండి, గాలిదుమారం రేగడం మొదలయింది. ఈదురు గాలితో, ఆకాశం మేఘావృతమై అంతవరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణంతో, ఇంతెత్తున గాలి దుమ్ము రేగి కళ్లల్లోకి ఇసుక చిమ్మడం మొదలయింది. అప్పటిదాకా, క్రితంరోజు ఫ్రెండ్స్ తో చూసిన సినిమా విశేషాలు చెబుతూ డ్రైవ్ చేస్తున్న రఘుకి, దుమ్ము కళ్లల్లోకి ఎగిరి దారి కనపడడం మానేసింది. అతికష్టం మీద, ఓవర్ బ్రిడ్జ్ మధ్యలో పేవ్ మెంట్ ప్రక్కగా స్కూటర్ ఆపాడు.
*****
          పేవ్ మెంట్ మీద కుంటిమల్లిగాడు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. సుబ్బి, రాజిగాడు కుంటిమల్లిగాడి పిల్లలు .... తల్లిలేని పిల్లలు . సుబ్బి, రాజిగాడు కళ్ళు మండిపోతన్నాయని ఒకటే గొడవ. దుమ్ము ఎగిరెగిరి పడుతోంది. మనుషుల్ని  విసిరేసేటంతగాలి... రాజిగాడ్ని గట్టిగా అదిమి పట్టుకుని, మల్లిగాడి చేతిని ఆధారంగా పట్టుకుంది సుబ్బి. మల్లిగాడికి చాలా బాధగా ఉంది. తన బరువే తన ఒంటికాలిమీద, కర్ర సహాయంతో ఆన్చుకుంటున్నాడు. దానికి తోడీ సుబ్బి బరువు కూడా ... అయినా కాస్త బలమయిన వాడు కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు.
          వాడి మనసులో ఒకటే ఆలోచన – ఇందాకట్నుంచీ గాలిదుమారం రేగేవరకూ గూడా సుబ్బి తనతో ఆ విషయమే ముచ్చటిస్తోంది. రేపు రాజిగాడి పుట్టినరోజు .... సుబ్బికేమో తమ్ముడికో కొత్త గుడ్డైనా లేదే అని బాధగా ఉంది.
“రేపు తమ్ముడి పుట్టినరోజు కదా, కొత్త బట్టలు కొనవా? అమ్మే ఉంటే ఇలాగే సేసేవాడివా అయ్యా!” అంటూ నిష్టూరంగా అననే అంది.
“దానిపిచ్చిగానీ! దానికి మాత్తరం తెల్దేమిటి? తన బతుకేంతో? తన సంపాదనేంతో!! ‘ఆ సంపాదనతోనే ఈ బక్కప్రాణాలు, ఎన్ని పూటలు, ఎంత వైబవంగా పంచబచ్చ పరమాన్నాలతో తిండి తింటన్నారో ... అయినా దాని బెమ దానిది ... “ అనుకుని...
 “మనలాంటి ముష్టోల్ల బతుకులకి పుట్టినరోజు లాంటి పండగలేయీ ఉండవే అని నచ్చజెప్పాడు. పాపం! ఎంత సిన్న బుచ్చుకుందో ... అది...
“అయ్యా, ఎలాగోలా సూడయ్యా, కావాలంటే రేతిరంతా నేను కార్లకు అడ్డం పడి, ఈ సిగ్నల్ కాడ అడుక్కుంటాను...” అంది సుబ్బి.
“ఒద్దె, అలా సేత్తే, ఎవుడన్నా సీకట్లో గుద్దేత్తే, నువ్వూ నాలాగా కుంటిదానివౌతావు. వాడికి ఎట్టా రాసుంటే అట్టా జరుగుద్ది...” అన్నాడు సుబ్బిని వారిస్తూ మల్లిగాడు.
అసహాయంగా తండ్రి వంక చూస్తూ , తమ్ముణ్ణి హత్తుకుని, కన్నీరు కార్చసాగింది సుబ్బి.
ఈ సంఘటన, దీనమైన వారి స్థితి, హృదయాన్ని ద్రవింపజేసే సుబ్బి మాటలు, అన్నింటినీ పేవ్మెంట్ ప్రక్కనే స్కూటర్ నిలిపిన రఘు కుటుంబం చూసింది.
******
          పదినిముషాలపాటు మహా ఉధృతంగా మనుష్యులను ఎగరగోట్టేసంత వేగంతో వీచినగాలి దుమారం మటుమాయమై పోయింది. అంతవరకు గాఢంధకారంగా కమ్ముకున్న మబ్బులు గాలి వాటుకు కొట్టుకు పోయాయి. అమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్న రఘు, శారద స్కూటరు స్టార్ట్ చేసి కదలబోయారు.
“అమ్మా, నాన్న ఆగండి...” అంటూ గట్టిగా అరిచాడు రెండేళ్ళ శ్రీధర్... అతని వంక ప్రశ్నార్ధకంగా చూస్తూ ఆగారు ఆ దంపతులు.
          అపుడే కర్ర పక్కకు పెట్టి, చతికిలపడదామనుకుంటున్న మల్లిగాడికి రఘు కుటుంబం కనిపించింది. దొరబాబులా ఉన్నాడాయన ఎవరోగాని, ఆయమ్మ కూడా లచ్చిందేవిలా సక్కగా ఉంది. మరి ఆళ్లపిల్లగాడో.... ఏం పేసన్లో ఏటోగాని అబ్బాయో! అమ్మాయో తెలీకుండా ఏషకాలు ఏత్తన్నారు. ఏటయితేనేం! బహుశా రెండేళ్ళుంటాయేమో.... ఆపిలగాడికి. శానా... ముద్దుగా ఉండాడు.... అనుకున్నాడు.
          ఇంతలో స్కూటరుపై, వెనుక కూర్చున్న అమ్మ చేతిలోంచి, పేకెట్ ఒకటి తీసుకుని, స్కూటర్ దిగాడు శ్రీధర్. అది తీసుకువెళ్ళి, రాజిగాడి చేతిలో పెట్టాడు... “రేపు నీ పుట్టినరోజా ? హ్యాపీ బర్త్డే. నీకు తెలుసా, రేపు నా పుట్టినరోజు కూడా ! ఇవిగో, కొత్తబట్టలు తీసుకో. నాకు ఇంకో జత ఉన్నాయిలే ! “ అంటూ ఇచ్చాడు. సుబ్బి, రాజిగాడి కళ్ళలో కోటి మెరుపులు మెరిసాయి.
ఒక్క ఉదుటున లేచాడు, మల్లిగాడు. కర్రందుకుని, కాలీడ్చుకుంటూ ముందుకు వచ్చి... “ బాబూ, చిన్నవాడివైనా పెద్ద మనసున్న నువ్వు నిండు నూరేళ్ళూ చల్లగా ఉండాలి,” అంటూ ఆనందంగా దీవించాడు.
శ్రీధర్ నే గమనిస్తున్న రఘు దంపతులు, ఆ పసిమనసుకు ఉన్న ఉదారత, దయాగుణాన్ని చూసి, ఆశ్చర్యపోయారు. తమకు ఆ ఆలోచన రానందుకు, సిగ్గుపడ్డారు. మల్లిగాడి దీవెనలు చూసి, వాళ్లకు మనసు నిండిపోయింది. తమ బిడ్డకేసి, గర్వంగా చూడసాగారు. శ్రీధర్ తో పాటు స్కూటర్ వద్దకు వచ్చి, ఆ దంపతులతో  ‘దర్మ పెబువులు... దేవుడిలా వచ్చి గొప్ప ఉపకారం సేసారు... నా బాద తీర్చారు ,దండాలు బాబూ...  ‘అంటూ కన్నీటితో నమస్కరించాడు మల్లిగాడు.
‘ఇంద, ఈ డబ్బు తీసుకో, రేపు మీ బాబు పుట్టినరోజు ఘనంగా చెయ్యి. వాడికి కావలసినవి అన్నీ కొనిపెట్టు... ‘ అంటూ మల్లిగాడి చేతిలో కొన్ని నోట్లు ఉంచాడు రఘు. మల్లిగాడు వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టబోయాడు....
అతన్ని వారించి, ‘ ఈ రోజు మా బాబు మాకు కనువిప్పు కలిగించాడు. పుట్టినరోజంటే... మనకి మనం బట్టలు, కేకులు కొనుక్కుని, కడుపునిండిన గొప్పవారి పిల్లల్ని పిలిచి డాబుగా వేడుకలు చేసుకోవడం కాదు, దేవుడు మనకిచ్చిన దాంట్లో కడుపు కాలే పేదలకు కూడా కాస్తంత పంచే అవకాశం అని తెలుసుకున్నాము. ఉన్నంతలో ఇలా ఇవ్వడం వల్ల, మేము ఎన్నడూ చవిచూడని ఆనందాన్ని ఇవాళ పొందాము. ఇకపై మా బాబు పుట్టినరోజుకు మాత్రమే కాదు... మా కుటుంబసభ్యులు అందరి పుట్టినరోజు పండుగకు మాతోపాటు మరొకరికి కూడా బట్టలు, మిఠాయిలు కొని అవి ఇలా నీడలేక పేవ్మెంట్ మీద బ్రతికేవారికి ఇస్తాము. వారికి ఒక్కరోజైనా కడుపునిండా భోజనం పెట్టిస్తాము. ఇలా అందరూ చేస్తే , ఈ దేశంలో కూడూ గుడ్డా లేక అల్లాడే వారు ఉండరు కదా, అని మా బాబు చేసిన పని చూసి, ఈ క్షణం నాకు అనిపిస్తోంది. రేపు మా బాబు పుట్టినరోజు వేడుకలకు వచ్చేవారు అందరికీ ఈ సంఘటన చెప్పి, ఇదే సందేశం అందిస్తాము, వస్తాము...’ అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు రఘు.
వారి స్కూటర్ కనుమరుగయ్యే దాకా, కన్నీటితో మసకబారిన చూపుతో, గుండె నిండా కృతజ్ఞతాభావంతో వారివంకే చూస్తూ ఉండిపోయాడు మల్లిగాడు.
 ******

No comments:

Post a Comment

Pages