సత్యాన్వేషణ - అచ్చంగా తెలుగు

సత్యాన్వేషణ

Share This
సత్యాన్వేషణ 
 పెయ్యేటి శ్రీదేవి 

 మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటిలో పేరెన్నిక గన్న దేశం, గర్వించ దగ్గ దేశం. మన మతం గొప్పది. మన భాషలు గొప్పవి. మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించే దేశం మనది. దాన ధర్మాలు, మరెన్నో పుణ్య కార్యాలు చేసే దేశం మన దేశం. మానవుడు ఎలా సత్ప్రవర్తనతో ఉండాలో, ఎలా ఉండకూడదో, మానవుని ధర్మాలేమిటో తెలియజెప్పే ఎన్నో పురాణేతిహాసాలు మనకున్నాయి. అందుకే మన ధర్మాలు, సత్ర్ప్రవర్తన, సంప్రదాయాల వైపు ఇతర దేశాల వారు కూడా ఆకర్షితులవుతున్నారు. మన సంస్కృతి, సత్సంప్రదాయాలు, మన ధర్మాలు కాదని వాదించె వితండవాదులు కూడా ఉన్నారు. వాళ్ళు దేనికో, ఎందుకో అన్వేషణ మొదలు పెట్టి బొక్కబోర్లా పడతారు.లక్ష్మి, సరస్వతి, పార్వతి - ముగ్గురు దేవతామూర్తులతో మన దేశ స్త్రీలని కొలుస్తారు. నుదుట కుంకుమ, కళ్ళకు కాటుక, తలలో పూలచెండు, నిందుగా గాజులతో నవ్వుతూ కళకళలాడే స్త్రీలని చూస్తే, లక్ష్మీదేవిలా, పార్వతీదేవిలా, నిండు ముత్తైదువులా, చదువుతో పాటు పాండిత్యం కూడా వుంటే, సరస్వతీదేవి తోను పోలుస్తారు. పరాయి స్త్రీలని తల్లిగాను, సోదరిగాను భావించమని పురాణాలు చెప్పాయి, మన పూర్వీకులు కూడా చెప్పేవారు. నాటి రోజుల్లో స్త్రీలు కట్టు, బొట్టుతో, సంప్రదాయంగానూ వుండేవారు. అందరూ వాళ్ళ పట్ల ఎంతో పవిత్రంగాను, మర్యాదగాను వుండేవారు. ఆ రోజుల్లో రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదివేవారు. సంధ్యాసమయంలో అందరూ ఒకింట్లో చేరి పురాణశ్రవణం చేసేవారు. ఏవన్నా పనులుంటే చుట్టుపక్కలిళ్ళ వాళ్ళు కలిసి సాయం చేసేవారు. ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఆనాటి మనుషుల్లో పుష్కలంగా వుండేవి. ఆనాటి వాళ్ళు పురాణాలు విని, ఆకళింపు చేసుకుని, మంచిని తీసుకుని, చెడుని వదిలేసే వారు. ధర్మాన్ని ఎప్పుడూ విడలేదు. ఇప్పటివాళ్ళలా వితండవాదాలు చెయ్యలేదు. ఇప్పటి రోజుల్లో పురాణాల్లో మంచిని వదిలేసి, చెడుని మాత్రమే తీసుకుని, అడ్డదార్లు తొక్కుతూ, స్త్రీలపై అత్యాచారాలు చేసే నీచ, నికృష్ట జాతి వేగంగా తయారైపోతోంది. ఇది అంటురోగంలా దేశమంతా వ్యాపిస్తోంది. ఇది దేశానికే అరిష్టం. అలాంటి దుర్మార్గులకి పరంలోనే కాదు, ఇహంలో కూడా సుఖశాంతులుండవు. మనుషులు ఇంత నీచంగా దిగజారి పోవడానికి కారణాలేమిటి? మనుషుల్లో వివేకం నశించి, ఆలోచనా విధానం సక్రమంగా వుండటల్లేడు. ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ యుగం. డబ్బు లెక్కలు చూడాలంటే, పాలవాడికి, టైలరుకి ఎంత డబ్బివ్వాలో 30 + 3 = ఎంతో, 10 - 5 = ఎంతో - - ఇలా ప్రతి చిన్న లెక్కకి సమాధానం కావాలంటే కాలిక్యులేటర్ వాడుతున్నారు. అందువలన మెదడులో ఉన్న తెలివితేటలు మరుగున పడిపోతున్నాయి. ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు వుంది, నిజాయితీ అంటే హమామ్ సబ్బు అని నమ్మే రోజులు. ఇవన్నీ టి.వి.ల్లో వచ్చే వ్యాపార ప్రకటనలు. నేడు మానవ జీవితంలో టి.వి. ఛానెళ్ళు, సెల్ ఫోన్లు, ఇంటర్ నెట్లు, సినిమాలు, సీరియళ్ళు భాగమై పోయాయి. కాని వీటిల్లో మంచి వుంది, చెడు వుంది. కాని నేటి తరం ఎక్కువ చెడు మార్గాన్నే వెడుతోంది. ఆనాడు ఒక ఇంటి ఆవరణలో అందరూ కూచుని చెప్పుకునే పురాణ కాలక్షేపాలు ఇప్పుడు భక్తి ఛానెళ్ళలోనూ అద్భుతంగా వస్తున్నాయి. అవి చూసేవాళ్ళు, వినేవాళ్ళు చాలామందే వున్నారు. వాళ్ళ వల్ల సమాజానికి చెడేం జరగదు. ఇంకో వర్గం వారూ వున్నారు. వాళ్ళు అవి చూడరు. హింసాత్మక సీరియల్సు, పనికిమాలిన, పీలికల డ్రస్సులేసుకుని పిచ్చి గంతులతో చేసే డాంసు ప్రోగ్రాంలు, అస్యవ్యస్తమైన, అసభ్యకరమైన దుస్తులతో కనిపించే యాంకరమ్మలు, సినిమా నటీమణులు - ఇలాంటివన్నీ ఒక వర్గం వారు చూస్తారు. ఈ వర్గంలో మోసగాళ్ళున్నారు, దొంగలుంటారు, స్వార్థపరులుంటారు, అవినీతిపరులుంటారు, హంతకులుంటారు. వీళ్ళ జనాభా ఎక్కువే. వీళ్ళవల్లే దేశం నాశనమౌతుంది. వీళ్ళవల్లే దేశానికి నష్టం కలుగుతోంది. హింసాత్మక, అసభ్యకర సీరియల్సు, సినిమాల్లో వేసే నటీ నటులందరూ బాగానే వుంటారు. కాని ఆ ప్రభావం కాలేజి అమ్మాయిలు, పసిపిల్లలు, వృధ్ధ మహిళల మీద పడి అత్యాచారాలకు గురౌతున్నారు. ఇలాంటి నేరాలు చేసే దుర్మార్గులకి ప్రభుత్వపరంగా కాని, పోలీసుల వల్ల గాని కఠిన శిక్షలూ లేవు, ప్రజలకి ప్రభుత్వం నించి భరోసానూ లేదు. ఇక మరో వర్గం వుంది. వాళ్ళకి దేవుడితో పని లేదు. హేతువాదులు దేవుడే లేడంటారు. ప్రతి విషయం ఎందుకు, ఏమిటి, ఎలా.... అనే ఫక్కీలో అన్వేషించడం వీరి అలవాటు. మంగళగిరిలో పానకాల నరసింహస్వామికి నాలుగు బిందెలు పానకం పోస్తానని మొక్కుకుంటే, రెండు బిందెలు లోపలికి పోయి, రెండు బిందెలు బైటికొచ్చేస్తుంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటూ అన్వేషణ మొదలు పెడతారు. దేవుడుంటే మనకెందుకు కనబడడు? ఇలా వీళ్ళు అన్నిటికి వితండవాదం చేస్తుంటారు. ఈ దేవుడు లేడనేవాళ్ళు ఒక విషయం గమనించాలి. అమ్మ లేదని ఎవరూ అనలేరు. అమ్మ లేనిదే ఎవరూ వుండరు. మొదటి దైవం అమ్మ. తెలీని పసివయసులో అమ్మ పోయినంత మాత్రాన, అమ్మని చూడలేనంత మాత్రాన అమ్మ లేనట్లు కాదుగా? ఒక ఫొటో చూపించి, ఈవిడే మీ అమ్మ అంటే నమ్మి తీరాలి. అలాగే మన దేశంలో ఎందరో మహానుభావులున్నారు. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, పురందరదాసు, జయదేవుడు - వీరందరూ తమ ఇష్టదైవాల మీద భక్తి కీర్తనలు వ్రాసి, దైవానుగ్రహం పొంది తరించారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రం, అన్నమాచార్య కీర్తనలు గానం చేసి తరించారు. బమ్మెర పోతన భాగవత గ్రంథం రచించారు. వివేకానందుడు ఇతరదేశాలలో మన హిందూమత ప్రచారం చేసి, ఎంతో కీర్తి నార్జించారు. రామకృష్ణపరమహంస అమ్మవారి అనుగ్రహం పొందారు. నిత్యం పఠించే లలితా సహస్రం, కనకధారా స్తోత్రం - ఇల్లా అనేక స్తోత్రాలు శంకరాచార్యులవారు మనకు అందించారు. ఇల్లా ఎంతోమంది ధర్మాన్ని పాటిస్తూ, హిందూమతం గురించి చెబుతూ, ఎప్పుడూ దేవుని ధ్యాసలోనే వుండి, దైవసాన్నిధ్యం చేరుకున్నారు. వీళ్ళని చూడకపోయినంత మాత్రాన, అంతా అబధ్ధం, వాళ్ళు లేరని అనగలమా? ఏ దైవశక్తీ లేనిదే వాళ్ళు అంత గొప్పవాళ్ళు కాగలిగారా? వాళ్ళంత ఉన్నత స్థితికి చేరుకోడానికి దైవశక్తే కారణమైనప్పుడు, దేవుడు లేడని ఎలా అనగలం? దేవుడు లేడని నమ్మేవాళ్ళకి ఈ శక్తులన్నీ వుండవు కదా? అందుకే దైవతత్వం తెలుసుకో్వాలి. భగవంతుని సృష్టి పరమాద్భుతం. ఎన్నో రంగుల రకరకాల పుష్పాలు, ఎన్నో రంగు రంగుల రకరకాల రుచికరమైన ఫలాలు, మరెన్నో ఆహార ధాన్యాలు, తాగడానికి నీళ్ళ దగ్గర్నుంచీ అన్నీ ఆ భగవంతుడు సృష్టించినవే. ఈ అద్భుత సృష్టి మానవమాత్రులకు సాధ్యమా? నీ అన్వేషణలో ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకుంటే ఏ సమాధానమూ రాదు. మరి నీకేం తెలుసని అన్వేషణ సాగిస్తావు ఓ వెర్రిమానవా? అంతా నాకే తెలుసని విర్రవీగడం నీ మూర్ఖత్వం. నీకు తెలిసున్నది ఆవగింజలో వెయ్యోవంతు కూడా లేదు. పరిపూర్ణంగా అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఎన్ని జీవితకాలాలూ సరిపోవు. మరి దేని కొరకు ఈ వృధా అన్వేషణ? నువ్వెంత అందంగా వుంటావో నీకు తెలీదు. అద్దంలో చూసుకుంటేనేగా నీ ముఖారవిందం తెలిసేది? నీ మొహానికి మసి అంటుకున్నా ఎవరో చెబితే గాని తెలీదు. అప్పుడు అద్దంలో చూసుకుని తుడుచుకుంటావు. నీ ముత్తాత ఎవరో నీకు తెలీదు. నీ వంశానికి మూలపురుడెవడో నీకు తెలీదు. చివరివాడెవరో నీకు తెలీదు. అటేడు తరాలు, ఇటేడు తరాలు అంటారు. అది చెప్పుకోడం వరకే. నీకు తెలిసేది ఒకటి, రెండు తరాలే. మన గురించే మనకు తెలీనప్పుడు ఇక దేవుడి గురించేం తెలుసుకుంటాం? ఆది, అంతం తెలియరాని ఈ కాలం అనంతం. ' ఎంతో చిన్నది జీవితం, మరెంతో చిన్నది యవ్వనం ' అని ఒక కవిగారన్నట్లు, కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం. రెప్పపాటు ఈ జీవితంలో నువ్వు నేర్చుకున్నదెంత? ఎవరికీ అపకారం చెయ్యకుండా ఇతరులకు నువ్వు సహాయపడినదెంత? నువ్వు చేసిన పుణ్యకార్యాలేమిటి? కాని నువ్వు చేసిన చెడ్డపనులుంటే చివరి క్షణంలో నిన్ను బాధిస్తాయి. 'ఏ దిక్కూ లేకపోతే మనకి దేవుడే దిక్కు ' అన్నది బాధలో వున్నప్పుదు మనసుకు ఊరట కలిగించే అద్భుత వాక్కు. అందుకు ఆ దేవుడ్ని నిందించడం ఎంతవరకు సమంజసం? పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన? భారతదేశంలో పుట్టి కూడా నువ్వు భగవద్గీత చదవలేదు కదూ? రామరాజ్యం పేరు చెబుతావు. రామయణం ఎప్పుడైనా చదివావా? అదీ చదవలేదు కదూ/ భారతీయుడ నేనే అంటావు. నీవు భారతం సగమైనా చూసావా? భారతీయుడవై వుండి భారతం కూడా వినలేదు, చదవలేదు. ఇవన్నీ భక్తి ఛానెళ్ళలో రోజూ మహాత్ముల ప్రవచనాల రూపంలో వస్తున్నాయి. అవి కూడా వినవు. పైగా అవి నిజంగా జరిగాయా అని అన్వేషణ మొడతావు. ఈ పనికిమాలిన అన్వేషణ మానెయ్యి. సరే, నువ్వు భగవద్గీత చదవద్దు. రామాయణమూ వినవద్దు. భారతమూ వినవద్దు. నీకు సమయం లేదంటావా? Work is worship అన్నారు కదా? అదీ మంచిదే. ఇది సమయం లేని వాళ్ళకి, సమయం వృధా చెయ్యని వాళ్ళకీ వర్తిస్తుంది. నువ్వు ధర్మంగా వుండు. సత్ప్రవర్తన కలిగి వుండు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా? అలాగేనా వుండు. ఇతరులను చూసి అసూయ చెందకు. ఎవరికీ ఉపకారం చెయ్యకపోయినా పరవాలేదు. కాని అపకారం మాత్రం చెయ్యకు. దేనికీ ఆశ పడకు. స్త్రీలను గౌరవించు. చెడుపనులు చెయ్యకు. ఇలా ఐనా వుండగలవు కదా? భక్తి లేక పోయినా పరవాలేదు. సన్మార్గంలో నడు. రంధ్రాన్వేషణ చేస్తూ వృథాగా కాలయాపన చెయ్యకు. సరేనా? ఇక కొంతమంది సాధువులు, దొంగ సన్యాసులు వుంటారు. వాళ్ళు ప్రజల కష్టాలని, బాధలని ఆసరాగా తీసుకుని, ప్రజలని మోసగిస్తూ వుంటారు. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ కష్టాలు ఎలా తీరతాయో పరిష్కార మార్గం తెలుసుకోకుండా, వీళ్ళ మాయలో పడి, వీళ్ళ చుట్టూ తిరుగుతూ, డబ్బుని, మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. వాళ్ళనెవరూ మార్చలేరు. అన్నట్టు ఇంకో భక్తివర్గం కూడా వుంది. వీళ్ళు అన్వేషించే వర్గం కాదు. వీళ్ళు మామూలు భక్తులూ కాదు, మూఢ భక్తులు. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగుండక పోతే, ఎవరో కీడు చేసారనో, చేతబడి చేసారనో నమ్మేసి, ఎవరినో అనుమానించి, వారిని చెట్టుకి కట్టేసి, నానా చిత్రహిం సలూ పెడతారు. మరింకేదో కారణానికి ఎవరినైనా బలి ఇస్తే మంచి జరుగుతుందని ఎవరైనా చెబుతే గుడ్డిగా నమ్మేసి, బలి ఇవ్వడానికైనా సిధ్ధపడతారు. కొంతమంది అమ్మవారు పూనిందనో మరేవో కారణాలు చెబుతూ, వేపమండలు పట్టుకు చిందులు వేస్తూ, అనేకమందితో ఊరంతా డప్పు వాయిద్యాలతో ఊరేగుతారు. అసలే వీళ్ళు మూఢ భక్తులు. ఈ మూర్ఖుల మనసుని రంజింప చేసి, మార్చడమూ కష్టమే. అందుకే దేవుడి గురించి అన్వేషణలు మాని, దేవుడిచ్చిన ఎంతో ఉత్కృష్టమైన ఈ మానవ జన్మని సమాజశ్రేయస్సు కొరకు వినియోగించి తరిద్దాం.

No comments:

Post a Comment

Pages