శివం – 12 - అచ్చంగా తెలుగు

శివం – 12

Share This

శివం – 12

(శివ భక్తుల కధలను చెబుతూ ఉంటాడు శివుడు...)

- రాజకార్తీక్

9290523901


అదొక చిన్న పట్టణం. ఆ ఊరిలో ఉంది శివాలయం. ఆ శివాలయంలో ఎందరో బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తుంటారు. ఎంతో మంది భక్తులు నా దర్శనం చేసుకుంటారు. ఎవరికీ తోచిన విధంగా వారి మనస్సును నాపైన నిశ్చలంగా (27) ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఆ గుడి బయట “దయచూపండి బాబు, ధర్మం చేయండి బాబు” అని కొంతమంది బిచ్చగాళ్ళు వేడుకుంటున్నారు. “దయకలిగిన దేవాలయం” అని కొందరూ,”ఆకలిబాబు”, అనాథలం బాబు ,”అవిటివాళ్ళంబాబు”, బిక్షబాబు” అని కొందరూ తమ చేతులను చాచి అడుగుతున్నారు. ఎవరుకి తోచిన ధర్మం వారు చేస్తున్నారు, కానీ వారి ఆత్రుత నా దర్శనం కోసమే కానీ వారి పరిస్థితి చూసి కాదు. కొంతమంది “ఏ జన్మలో ఏ పాపం చేశారో” అని వారి మీద జాలి పడుతున్నారు. మహాన్యాసభిషేకాలు మళ్లీ మొదలయ్యాయి, కానీ నాకు వినిపిస్తుంది ఒక భక్తుని తత్వగానం “మనుషులను ప్రాధేయపడే వారిని బిచ్చగాళ్ళు అంటారు, నిన్ను ప్రాధేయపడే వారిని భక్తులంటారు శివయ్యా” అని, ఇంతలో వచ్చారు ఆ భక్తుని దగ్గరికి వారు, ఆ భక్తునితో “చెప్పుల సాంబయ్య, ఎన్నో సంవత్సరాల నుండి ఈ శివాలయంలో పాదరక్షలను భద్రపరుస్తుంటావు, ఏ రోజు ఎవరిని డబ్బులు అడగవు, ఇచ్చినంత తీసుకుంటావు నీకే అవసరాలు ఉండవా?....దానికి సాంబయ్య “నా కంటూ ఎవరూ లేరు స్వామీ, నా కుటుంబం మొత్తం అంతం అయ్యారు, వారికి నాకు ఋణం తీరిపోయింది, ఒక ప్రమాదంలో నన్ను తప్ప ఆ శివయ్య అందర్నీ తీసుకుపోయాడు,,”. ఆ భక్తుడు “ఏదైనా ఆ శివయ్య ఎందుకు అలా చేశాడో? నీకు అలా జరగాల్సింది కాదు” ...సాంబయ్య “నాకేం తెలుసు, నా కన్నా ఆ శివయ్య నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు కదా, అందుకే వారందర్నీ తనదగ్గరికి తీసుకుపోయాడు”. అనేసరికి ఆ భక్తుడు మౌనం వహించి వెళ్ళిపోతూ “ఎంత తత్వాన్ని చెప్పాడు ఈ చెప్పులు కుట్టేవాడు,”అనుకున్నాడు.అభిషేకాలు మొదలయ్యాయి, మళ్లీ సాంబయ్య పాడటం మొదలెట్టాడు. “అందరూ జోలెతో భిక్ష అడిగితే, నేను ఈ శరీరాన్ని జోలేగా భిక్ష అడుగుతున్నా” మళ్లి మిగతా వారు చెప్పులు తీసుకుని ఇచ్చిన చిల్లర ఒక హుండిలో వేసుకున్నాడు, పాడుతూ “మట్టిలో కలిసిపోయే దేహం విభూదా? భూడిదా, వేరొకరు మనల్ని మోసం చేస్తే పగ పెంచుకుంటారు, నీవు ఏమి చేసిన, ఎవర్ని దూరం చేసిన, నీమీద భక్తి పెంచుకుంటారు, వేరొకరు చేస్తే తప్పు, నీవు చేస్తే లీల” అని పాడుతూ తన కుటుంబాన్ని తలచుకొని కన్నీరు కారుస్తున్నాడు. ఇంతలో ఎవరో ఇచ్చిన చిల్లర హుండీలో వేసుకున్నాడు. ఇంతలో పంతులుగారు వచ్చి “దూరం సాంబయ్య మడి మడి ‘ అంటూ వెళ్ళిపోయాడు “సాంబయ్య, నేను నీవు ఒకటేనా, సమశానంలో ఉండే నీకు మడి, మైల ఏందయ్యా, అవన్ని నీకే లేనప్పుడూ మాకు ఉంటాయా లేక మేము నీ అంతవారము కాదంటావా?” ఎవరో ప్రసాదం ఇస్తుంటే భద్రపరుస్తున్నాడు. అలా ఎంతో చిల్లర, ప్రసాదాలు భద్రపరుస్తున్నాడు. “ఈ సాంబయ్యకి కొంచెం పిచ్చి వచ్చింది, పరమేశ్వరుడ్ని వీడు తిడుతున్నాడా, పొగుడుతున్నాడా?” అంటూ అందరూ సాంబయ్య గూర్చి అనుకునేవాళ్లు. సాంబయ్య నిష్కల్మషమైన భక్తి నన్ను చేరుతుంది, అది పిచ్చికాడు వైరాగ్యం.
తీసుకున్న ప్రసాదాలు సాంబయ్య అందరికి బయట ఉన్నవారికి పంచుతున్నాడు. వారు “చెప్పులసాంబ, నీ పుణ్యమా అని ఒక పూటైన భోజనం చేస్తున్నాం” అంటున్నారు. సాంబయ్య “నాదేముంది, ఇది నాకు ఇచ్చిన వారు పుణ్యాత్ములు “ అంటూ, మళ్ళి గానం చేస్తూ “నిన్ను చేరక, ఎన్ని జన్మలు, ఇలాంటివి, ఎందుకు ఈ అవిటివారి కష్టాలు, నా కుటుంబాన్ని తీసుకుపోయినట్టు వీరిని నీ దగ్గరికి తీసుకోవయ్యా, నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకిన నాకు ఎక్కడి పాపాలు” అంటూ ప్రసాదాలు పంచారు అంతలో ఒక అవిటివాడు పెట్టింది తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు “చేతనైన సాయం చేయనివార్నిదుర్మార్గుడు అంటారు, అన్ని తెలిసిన నీవు ఏమి చేయకపోయినా నిన్ను మహాదేవుడు అంటారు అంటూ కన్నీరు కారుస్తూ ఆ అవిటివాడికి అన్నం పెట్టపోతే, అతడు మరణించాడు. ఆ అవిటివాడి మరణం చూసి అందరూ ఎంతో ఆనందపడ్డారు, “కానీ శివయ్యా, పిలిచినా వెంటనే అతనికి ముక్తి ఇచ్చావు, ఇక నేనే “అంటూ ఆ కన్నీరుని ఆ అవిటివాడి మీద కార్చాడు. ఆ కన్నీరు వచ్చి నా పాదాలపై పడింది. ఆ శవం కళ్ళు మూస్తూ సాంబయ్య “వెళ్లిరా మిత్రమా” అంటూ వీడ్కోలు పలికారు. అ అవిటివాడ్ని చూసి సాటి ముష్టివారు బాధపడుతున్నారు. “అనాథగా ఉండి, ఇంతమంది నీకోసం కన్నీరు కార్చేవార్ని సంపాదించుకున్నావు అంటూ శ్రద్దాంజలి ఘటించాడు. ఇంతలో గుడి నిర్వహణ బృందం వచ్చి ఆలయం మూసివేయాలి “మైల మైల అశూచి” అంటూ గుడి మూశారు. “సంప్రోక్షణ చేయాలి” అంటున్నారు. “స్మశానంలో శవాలు ఉండక, ఏముంటాయి, శివాలయం అంటే (28) స్మశానమే కదా శివయ్యా” అంటూ వేసిన తలుపుల ముందు ఆ అవిటివాడ్ని స్మశానానికి తరలిస్తూ పాడాడు. స్మశానంలో ఆ శవదహనం ఖర్చుకోసం తన హుండిలో డబ్బులు తీసుకున్నాడు. “శివయ్యా ఇది నీకోసం, నీ పని కోసం దాచిపెట్టిన డబ్బు, ఈ అవిటి శవం కోసం వాడుతున్నా ఏమి అనుకోకయ్యా” అంటూ ఆ అవిటివాడికి దహన కార్యక్రమాలు చేశాడు. ఆ అవిటివాడి చితిలో “దయలేని, దయామయుడు, జాలి చూపని ఓ కరుణామూర్తి నీ దయా జాలికి ఎంతో నేర్పు, నీ భక్తులను ఎవరు అవమానిస్తున్నా, నీవు మాత్రం అన్నీ లెక్కలు వేసుకొని చేస్తావయ కదయ్యా” అంటూ తన కుటుంబాన్ని తలచుకొని, గుక్కపట్టుకొని ఏడుస్తున్నాడు, అతని బాధ ఎందుకో నాకు తెలుసు, అతని అసంతృప్తి ఏమిటో నాకు తెలుసు, అతనికి కావలసింది ఏంటో నాకు తెలుసు, సాంబయ్య కోసం ఈ శివయ్య వెళ్ళవలసిన సమయం వచ్చింది. రోజులు గడిచాయి, మళ్ళి సాంబయ్య గుడి దగ్గర చెప్పులు తీసుకుంటూ “తెలిసోతెలియకో, ఎన్నో సార్లు నిన్ను దూషిస్తే నన్ను క్షమించు శివా! నా మొరని,బాధని, నీకు తప్ప ఎవరికీ చెప్పాలి “ అంటూ పాడుతున్నాడు. ఇచ్చిన చిల్లర తీసుకొని భద్రపరుస్తున్నాడు. ఈ చిల్లర ఎందుకు భధ్రపరుస్తున్నావు అన్న ప్రశ్నకు “మన ఊరిలో ఆచారం తెలుసు కదా స్వామి, శివరాత్రి రోజున స్వామికి విగ్రహానికి జరిగే ఊరేగింపులో స్వామి యొక్క పెద్ద విగ్రహానికి చెప్పులు వేస్తారని, ఈ సారికి మన పంతులుగారి దయవల్ల ఆ చెప్పులు నేను స్వయంగా తయారుచేసి, మంచి లోహాలతో స్వామికి సమర్పించాలి” అందుకే ఈ పొడుపు.....
 సాంబయ్య కోసం ఎవరు ఊహించని లీల ఒకటి చేశాను.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages