తాదాత్మ్యము - అచ్చంగా తెలుగు

తాదాత్మ్యము

Share This

:తాదాత్మ్యము:

- అందె మహేశ్వరి 


ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదుగాని, ఒక యాత్ర మాత్రం నా జీవితపు దృక్పథాన్ని, దృక్కోణాన్ని మార్చింది.  శ్రీ నరసింహజయంతి ఉత్సవాలు Jandelsbrunn(Germany) లో ఉన్నసింహాచలము కోవెలలో చాలా గొప్పగా జరుగుతాయని తోటి భారతీయులు అందరం కలసి ఒక యాత్రా పథకం వేస్తే మాశ్రీవారు, నేను కూడా బయల్దేరాము. మన దేశంలో ఉండంగా, తీర్థయాత్రకి వెళ్ళిన అవకాశము రాక, పదిమందితో కలసి వెళ్ళిన అనుభవం లేదు. 2 సంవత్సరాల పిల్లల నుండి 80 పైన వయోవృద్దులవరకూ, మొత్తం 40మందిమి కలిసి వెళ్ళాము.  పురాణాలు,ఇతిహాసాల్లో విషయాలన్నీ అవగాహన చేసుకుని,  మన సంస్కృతి, సాంప్రదాయాలను మనం గుర్తుపెట్టుకుని ముందు తరాల వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నంలో చాలా విషయాలు తెలిసిన గొప్పవాళ్ళు కూడా ఉండటంవల్ల, బోలెడు ఆధ్యాత్మిక ప్రశ్నలు, వాటి జవాబులతో మహా గొప్పగా మా ప్రయాణం సాగింది.
అందులో మచ్చుకగా మీకోసం కొన్ని..
  1. జంతుబలులు వేదాలు సమ్మతించినవేనా?
అవును.
సృష్టిలో ఏ ప్రాణికి హాని వేదాలు సమ్మతించినవి కావు.కానీ, కొన్ని ఫలితాలని ఆశించి.. అంటే, కోరికలు ఉన్నవారు గురువుల అనుమతితో, అర్హతను బట్టి, అవసరమైతే, జంతుబలులు ఇవ్వొచ్చు. కానీ, ఏ ప్రాణహాని జరగడం వేదాలు హర్షించడంలేదు కాబట్టి, కోరికలు లేకుండా ఉండటం మంచిది. మనిషి విఙ్ఞతకే, భగవంతుడు ఈ విషయాన్నివదిలేశాడు.
  1. మనం పాప కర్మలు చేసి గంగలో మునిగితే ,పరిహారం అవుతాయా?
పాప కర్మల స్థాయిని బట్టి పరిహారాలు ఉంటాయి. అన్ని పాపాలు పరిహారం అవుతాయనేది కాదు. చేసిన కర్మలకి ఫలితం ఎన్ని జన్మలైనా అనుభవించాల్సిందే!
3.జంతువులను చంపి తినడం తప్పైతే, మరి మొక్కలకు ప్రాణం ఉంటుంది కదా. వాటిని తినడం తప్పు కాదా?
పూర్వం ఋషులు చెట్టు నుండి రాలిన ఫలములు, ఆకులు మాత్రమే తిని బ్రతికే వారు. ఏ ప్రాణికైనా, హాని చేయడం లేక వాటిని తినడం తప్పు.  కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అలా రాలిన పండ్లు తిని అందరూ బ్రతకలేరు గనుక తక్కువ,ఎక్కువ హింస.. ఈ చట్రంలో మన స్థానం ఏంటో, మన అవగాహనని బట్టి నిర్ణయించుకోవడం మంచిది. అందులోనూ, మొక్కలను చంపి తినడం లేదు. మళ్ళీ పెరిగే అవకాశాన్ని ఇస్తున్నాము. కానీ,పక్షులు,మిగిలిన జంతువులు ఆ కోవకి రావు కదా! ఒకసారి చంపేసిన తర్వాత మళ్ళీ వాటికి ప్రాణం మనం పోయలేము కదా.
పైన ఉదహరించినవన్నీ మా సందేహాలు, సమాధానాలు మాత్రమే. ఇవే ప్రశ్నలు మీకు ఉంటే, ఈ సమాధానాలు సహకరిస్థాయనే ఉద్దేశ్యమే కానీ, ఎవరినీ తప్పు పట్టాలని కాదు.
మొత్తానికి, ఎన్నో విషయాలు ముచ్చటించుకుంటూ, సింహాచలం గుడిని చేరుకున్నాము.40 నిమిషాల ముందే అభిషేకాలు(చేసేది ఎవరో కాదు.సాక్షాత్తు ఈ దేశస్థులే) ముగియడంతో, దేవుడి దర్శనానికి అనుమతి ఎవరికీ లేదు. కానీ, ఆ గుడి ISKCON వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి, లోపల హరే రామ,హరే కృష్ణ భజనలు జరుగుతున్నాయనడంతో..మేము కూడా లోపలకి వెళ్ళాము.ఆశ్చర్యం! సుమారు 100 మందికిపైగా, అందరూ ఐరోపా దేశస్థులే. మగవాళ్ళు పంచె కట్టుతో గాయత్రి(జంధ్యం) ధరించి, ఆడవాళ్ళు చీరల్లో ముస్తాబై ఎంతో భక్తిపారవశ్యంతో భజన చేస్తూ ఉంటే.. ఇంత భక్తిలో లీనమై ఉన్న వీరందరిని తరించడానికి, ‘’సిరికింజెప్పడు, శంఖచక్ర యుగముం సంధింపడు యన్నట్లుకృష్ణుడు,రాముడు వేషధారియై ప్రత్యక్షమవుతున్నాడో,లేదో గమనించే వ్యవధి లేనట్టివాడు ‘' వచ్చేసి, ఎంతమంది మనో నేత్రాలను తెరిపించి, దర్శనభాగ్యం కలిపించాడో కదా! అనే భావన నా మనసుని తాకి, ఒక్క నిమిషం ఒళ్ళు పులకరించిది. కళ్ళ వెంబడి అప్రయత్నంగా నీళ్ళు జలజలా రాలాయి.   ఆ చెమ్మ నా బుగ్గలని తాకితే, అది ఆనందం అని అర్థం అయింది. అలా ఒక గంట గడిచిన తర్వాత, మా 40మందిమి భోజనాల కోసం వెళ్ళాము. అక్కడకూడా, అందరూ పాశ్చాత్యులే. మనదేశపు వంటలతో వడ్డిస్తుంటే, నోరు వెళ్ళబెట్టటం నా వంతయింది. వాళ్ళెవరూ భోజనం చేయరట.అందరూ ఉపవాసం. ఎంతో ధీక్షగా ఉన్న వాళ్ళని చూడగానే, ‘’అడుగు వరముల నిచ్చెదను,అడుగడుగుకు నిన్నే దలచు చున్నాను,అద్భుతమైన భక్తికి సొక్కినాను ‘’ అని త్యాగరాజస్వామి ప్రహ్లాదుని భక్తివిజయాన్ని గురించి చెప్పినట్లు, వీరికి వరాలు ఇచ్చేయడానికే, ఇలా సేవ చేయించుకుంటున్నారా స్వామీ!! అని అడిగేంతలా ఉంది అక్కడి వాతావరణం.
సాయంత్రం 4గంటల సమయంలో ’’క్షీర సాగర విహార! అపరిమిత ఘోర పాతక విదారుడికి  ‘’ వీనుల విందుగా, శ్రవణానందంగా ’’హరినామమే కడు ఆనందకరము ’’ అన్నట్లు, హరే రామ,హరే కృష్ణ భజనతో, రంగ రంగ వైభవంగా ఊరేగింపు జరిగింది.. ఆ తర్వాత, మేము ఆలయప్రాంగణంలో పారాయణం చేయడం మొదలు పెట్టాము. మధ్యలో,ఎక్కడినుండో వచ్చిన ఒక జర్మను దేశస్థుడు(పంచెకట్టుతో ఉన్నారు) పుస్తక సాయం లేకుండా మాతో పాటుగా లీనమై, విష్ణు సహస్త్రనామ పారాయణం చేస్తుంటే, ఈసారి నోరెళ్ళబెట్టటం మావారి వంతు.
రాత్రి 9గంటల సమయంలో.. వాళ్ళలో కొంతమంది వడ్డిస్తుంటే, కొంతమంది మాతో పాటు నేలమీద కూర్చుని, చక్కగా దేవుడికి ధన్యాదాలు చెప్పి(నువ్వునాకు నచ్చావ్ సినిమాలో వెంకీలా కాదండోయ్) భోంచేస్తున్నారు. దాదాపు 500 మందికి, వంటలు వాళ్ళే చేసి వడ్డించడం కనువిందే. మాకు వేరెందులోనూ పోటి ఉండదు, ఒక్క భక్తిదక్క అని ఎవరికి తోచినంతలో వాళ్ళు ‘’ శ్రీమన్నారాయణ ,శ్రీమన్నారాయణ ,నీ శ్రీపాదమే శరణు!  ‘’ యని  సేవ చేసి తరిస్తున్నారు. అక్కడెవరూ, హలో! అని పలకరించరు. హరే కృష్ణ అని పలకరిస్తున్నారు. పొరపాటున చెయ్యి, కాలు తగిలినా కూడా, హరే కృష్ణ తప్ప మరో మాట ఉండదు. ఎంత పుణ్యం చేసుకున్నారో! నిత్యం కృష్ణా,రామా అని తరిస్తున్నారు.
ఆతర్వాత, దర్శనం సమయం దాటిపోయినా, కాసేపు గుళ్ళో కూర్చుందామని వెళ్ళాము. అక్కడ ఎంతో శ్రద్ధగా, భక్తితో చైతన్య ప్రభు మూర్తి పై ఉన్న పువ్వుల మాలలు తీసి, తడిబట్టతో తుడిచి, మళ్ళీ శాలువా కప్పి శుశ్రూష చేస్తుంటే, కాసేపు విశ్వామిత్రులవారిని కొలుస్తున్న రాములవారు తలపుకొచ్చారు.అంత శ్రద్దగా గురుసేవ చేయడం ఆహా! అనిపించింది. ఇక్కడందరూ,ఇహ,పరాలు మర్చిపోయి ఏమి చేస్తున్నారో.. పూర్తి అవగాహనతో ఉన్నారని నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. ‘‘చాలదా హరినామ సౌఖ్యామృతము ‘’యని అన్నమయ్య చెప్పినట్లు, ఏదో ఆశించి ఇవన్నీ చేయడం లేదు. ఆత్మసాక్షాత్కారం కోసం పడే తపనే ఇది. తపన కాదు, ఇదే తపస్సు అని అనిపిస్తుంది.
తర్వాత, ఎవరో ఒక ప్రభు(పాశ్చాత్యులే), వయసు 60 సంవత్సరాల పై చిలుకే. మీరు భారతదేశం నుండి వచ్చారా? అని ఎంతో ఆప్యాయంగా ఆంగ్లంలో పలకరించారు. సమాధానంగా ‘అవును‘ అని చెప్పి, ఉదయం నుండి మమ్మల్ని అబ్బురపరుస్తూ, ఆశ్చర్యచకితుల్ని చేస్తున్న వీరి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో, మా బుర్రలో ఉన్న ప్రశ్నావళిని విప్పాము. ‘‘ మీరు ఇంత సులువుగా వేరే మతాన్ని ఎలా ఒప్పుకోగలిగారు?ఇంత భక్తి మీకెలా అబ్బింది? ‘‘ అని. అందుకు వారు ''మేము క్యాథలిక్స్. నాకు 12 సంవత్సరాల వయసులో మా అన్నయకు brain tumor జబ్బు చేసినరక యాతన అనుభవించారు. అప్పుడు నాకు దేవుడి మీద చాల కోపం వచ్చింది.తప్పేమీ చేయని మా అన్నయ్యకు అంత పెద్ద శిక్ష ఎందుకు? అని చాలా మంది మత పెద్దలని అడిగాను.వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారు.అందుకే, నేను నాస్తికుడిగా మారిపోయాను. చాలా సంవత్సరాల తర్వాత,  భారతదేశంలో ఉన్న హిందూ సనాతన ధర్మం గురించి విన్నాను. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది మీ దేశంలోనే. మీ దేశ సంస్కృతి,సంప్రదాయాల పట్ల విపరీతమైన గౌరవం ఏర్పడింది. అందుకే, నా పిల్లల మీద మా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఏమాత్రం ఉండకూడదని ,8 సంవత్సరాల వయసులో భారతదేశంలో గురుకులానికి పంపించేశాను. 17 సంవత్సరాలు నిండిన తర్వాత, తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎంతో చక్కగా గంధర్వుల వలే పాడుతుంటే, నన్ను నేను మర్చిపోతాను.మా మనవళ్ళు కూడా భగవద్గీత శ్లోకాలు కంఠస్థంగా చెప్తుంటే నాకెంతో గర్వంగా ఉంటుంది. కానీ, ఇంత మంది పాశ్చాత్యులకి ఇదే భావన ఎలా? అని అడగగానే, పూర్వజన్మ సువాసనలు ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకే ఇది సాధ్యపడుతుందనుకోండీ !‘’ అని చెప్పి నవ్వేశారు. మాలో ఒకరు ఆయన్ని 'మానవ సేవే మాధవ సేవ కదా.మరి భగవుంతుడికి సేవ ఎందుకు చేస్తున్నారు?' అని అడిగితే, ఆయన చిరునవ్వుతో 'మనిషికి కడుపు నిండా భోజనం పెడితే తృప్తి శరీరానికి మాత్రమే! అదే భగవత్ సేవ చేస్తూ,భోజనం పెడితే, ఆ మంచిమాటలు వాళ్ళ చెవిన పడేలా చెప్తే, ఆత్మను కూడా తృప్తిపరిచిన వాళ్ళం అవుతాము. ఇదే ఉద్దేశ్యంతో, మీ దేశంలో బొలేడు గుళ్ళు, అన్నదానాలు చేస్తున్నారు.’ అని మనమేది ఎందుకు చేస్తున్నామో మనకు అవగాహన కలిపిస్తుంటే (కొన్ని తెలిసిన విషయాలే ఐనా వారి నోట వినడం) ఆ క్షణంలో ఆయన గొప్ప గురువులా అనిపిస్తే, ఆయన ఉన్న నేలను తాకి ఆశీర్వాదం పొందాను.
ఏకోరికలు లేకుండా, ఆత్మను తెలుసుకుని భగవత్ దర్శనం కోసం తపించి, హరే రామా!హరే కృష్ణ నామంతో,  భక్తిలో తాదాత్మ్యతనుపొందడం ఎంతో అద్భుతం. వారి ఆనందానికి కారణం తెలుసుకున్న మా హృదయాలలో, సాక్షాత్ సరస్వతి అమ్మవారే కూర్చుని వీణానాదం చేస్తున్నట్లుగా ఒక అనుభూతి.
ఏదో గాంధర్వలోకంలో విహరించి, తరించిన ఈ నరసింహజయంతి నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది.
భారతదేశంలో మన సంస్కృతిని మూలాలనుండి తెగనరికి, పశ్చిమ దేశాల సంస్కృతి కి పెద్దపీట వేసి ఆదరిస్తుంటే.. ఇక్కడ ,మన దేశపు విలువలని, సంస్కృతిని నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నారు. మన సనాతనధర్మాన్ని పాటించడానికి మనం సిగ్గు పడుతుంటే, వీళ్ళు అదే గొప్పదని మనసా,వాచా,కర్మణా పాటించి మనకి చూపిస్తున్నారు.  
కేవలం, సాంప్రదాయాలను మట్టుపెట్టడంద్వారానే, మనవైన విలువలు కోల్పోయి,మన పనులు హర్షించలేని స్థాయికి దిగజారిపోతున్నాయని గ్రహించి , పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం బహుమెండుగా ఉందని తెలియజెప్పే ప్రయత్నంలో.. ఈరోజు, మమ్మల్ని ఇక్కడికి రప్పించిన శ్రీనరసింహస్వామికి మరోసారి కృతఙ్ఞతలు చెప్పుకుంటూ, ‘ ఎందరో మహానుభావులు ’ అని వారందరికి నమస్కరించి, తిరుగు ప్రయాణానికి సిద్దమయ్యాము. అది తిరుగులేని మరో నూతన జీవనశైలి (మనదైన సనాతనశైలి)కి మరలా నాంది పలకాలనే సదుద్దేశ్యంతో, నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.

No comments:

Post a Comment

Pages