'తారక' రాముడు మెచ్చిన ధృవతార - ఆర్టిస్ట్ శివప్రసాద్ - అచ్చంగా తెలుగు

'తారక' రాముడు మెచ్చిన ధృవతార - ఆర్టిస్ట్ శివప్రసాద్

Share This

'తారక' రాముడు మెచ్చిన ధృవతార - ఆర్టిస్ట్ శివప్రసాద్ 

- భావరాజు పద్మిని  


చిన్నప్పుడు ఆయన ఎన్.టి.ఆర్ వీరాభిమాని. అటువంటిది, తన చిత్రకళా పటిమతో ఎన్.టి.ఆర్ నే తన అభిమానిగా మార్చుకోగాలిగారు. ఇటువంటి చిత్రకళా ధృవతార ఆర్టిస్ట్ శివప్రసాద్ గారి పరిచయం... ఈ నెల తెలుగు బొమ్మలో ప్రత్యేకించి మీకోసం...
మీ బాల్యం, కుటుంబనేపధ్యం గురించి చెప్పండి.                             
మాది గుడివాడ. నాన్నగారి పేరు లక్ష్మణరావు గారు, అమ్మ చిన్నమ్మడు.
నాన్న బంగారప్పని చేసేవారు. నాకు అమ్మకంటె నాన్నంటే ఎక్కువ ఇష్టం. ఆయనకీ నేనంటే ప్రాణం, నాకూ అంతే. నాకు ఆరుగురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మేమంతా ప్రేమలో పుట్టి, ప్రేమలో పెరిగినట్టు ఉండేవాళ్ళం.
గుడివాడలోనే పదవతరగతి దాకా  ఎస్.పి.ఎస్. మున్సిపల్ హై స్కూల్ లో చదివాను. తర్వాత మేము కర్ణాటక వెళ్ళిపోయాము. ఇంటర్ తర్వాత నా చదువు . ఆ తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాము.
మా నాన్నగారి ఫ్రెండ్ బోసు బ్రహ్మం అనేవారి ద్వారా ఈనాడు పత్రికలో ఆర్టిస్ట్ లు కావాలని ప్రకటన ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ  లో సెలెక్ట్ అయ్యి, సెప్టెంబర్ 7, 1977 లో ఉద్యోగంలో చేరాను. ఆర్టిస్ట్ గా నా ప్రస్తానం అప్పుడే మొదలయ్యింది.
చిత్రకళ పట్ల మీకు మక్కువ ఎలా కలిగింది ? ఎవరివద్దనైనా నేర్చుకున్నారా ?
చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే ఇష్టం. నాన్నగారి ఫ్రెండ్స్ ని కూర్చోపెట్టి, పెన్సిల్ తో ‘ఇన్స్టంట్ పోర్త్రైట్స్ ‘ వేసేవాడిని. ఫోటో చూసి, బొమ్మలు వేసేవాడిని.
నాకు గురువులు ఎవరూ లేరు. దేవుడు, ప్రకృతే నాకు గురువులు. నాకు ఎన్.టి.ఆర్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. శ్రీకృష్ణ పాండవీయం సినిమా చూసినప్పటి నుంచి నేను ఆయన వీరాభిమానిని. ఆయన బొమ్మలు బాగా వేసే వాడిని.
సితార, విపుల, చతుర, అన్నదాత పత్రికలకు పనిచేసాను. అప్పట్లో కంప్యూటర్ లు లేవు. డిసైనింగ్  అంతా చేత్తోనే చెయ్యాల్సి వచ్చేది. టైటిల్స్ వంటివి చేత్తోనే రాసేవాడిని. సితార లో చీఫ్ ఆర్టిస్ట్ వెంకటేష్ గారు .నా తోటి ఆర్టిస్ట్ లు రవికిషోర్, రాజేంద్ర, రాజు, ప్రభాకర్, జీడిగుంట వెంకట్రావు, రావి వేంకటేశ్వర్లు, జి.వి.రమణ, పాప, ఆనంద్ జె.వి.పి.ఎస్, ఈ మధ్య స్వర్గస్థులైన కరుణాకర్, వీరంతా నాకు సహోద్యోగులు. ఈనాడు ఆర్టిస్ట్ శ్రీధర్ గారు నాకు జూనియర్. మేమంతా ఒకే కుటుంబ సభ్యుల్లా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ కలిసినప్పుడల్లా చాలా ఆనందంగా గడుపుతాము.
మీరు పెన్సిల్ వాడకుండా నేరుగా రంగులతో పోర్ట్రైట్ లు వెయ్యడంలో దిట్ట అని అంటారు. ఇదెలా సాధ్యం ?
దేవుడి దయవల్ల నేను స్కెచ్ వేసినప్పుడు పోలికలు బాగా వస్తాయి. నేరుగా వాటర్, ఆయిల్ కలర్స్ వాడి, వేస్తాను. ఇది నా ఘనత కాదు, దేవుడి వరం అని నేను భావిస్తాను. డిసెంబర్ 2002 లో మూడు రోజులు నేను ట్యాంక్ బండ్ బ్రహ్మం గారి బొమ్మ వద్ద కూర్చుని, పోర్త్రైట్స్ వేసి, ఒచ్చిన డబ్బును ఒరిస్సా తుఫాన్ బాధితులకు ఇచ్చాను.
ఒకసారి ఈనాడులో చేసేటపుడు, మా ఇంటిదగ్గర ఉన్న ఒక మాస్టర్ ఒక ఆయిల్ పెయింటింగ్ వెయ్యమని అడిగారు. నాకు రాకపోయినా, ఒప్పేసుకుని, అడ్వాన్సు తీసుకున్నాను. కుర్చీలో కూర్చున్న చిన్న మార్వాడీ పిల్లాడి బొమ్మ అది. వేస్తుంటే మొదట్లో కలర్ జారిపోయేది. ఆరటానికి చాలా టైం పట్టింది. తర్వాత నెమ్మదిగా అలవాటయ్యి, మెళకువలు తెలిసాయి.  
ఈనాడు నుంచి మీ ప్రస్థానం ఎలా సాగింది ?
అప్పట్లో ఈనాడులో నాకు 200 రూ. జీతం ఇచ్చేవారు. 82 వరకూ ఈనాడులో చేసాను. 83 లో నాకు పెళ్లి కుదిరింది. పెళ్ళికి మా అద్దూరి రామారావు గారిని 1000 రూ. అడ్వాన్సు అడిగితే, ఇవ్వనన్నారు. ఈనాడులో మాకు తెలిసిన పాప అనే కార్టూనిస్ట్, ఇతర రెడ్లు కలిసి, ‘ఈ వారం ‘ అనే
పత్రికపెడుతున్నాము. నువ్వోచ్చేస్తే, వెయ్యి రూపాయిల జీతం, వెయ్యి రూపాయిలు అడ్వాన్సు ఇస్తాము, అన్నారు. వెళ్ళిపోయాను.
 ఆ తర్వాత విపంచి పత్రిక అనే ఫోర్ట్ నైట్ పత్రిక, కె.ఎల్. రెడ్డి గారు అనే వారివద్ద పనిచేస్తూ, ఇలా కొన్నాళ్ళు గడిచాకా ‘ఉదయం’ లో చేరాను. శాతవాహన అనే ఆయన ఉదయం పత్రికకు రమ్మంటే వెళ్లాను. అక్కడ 4,5 ఏళ్ళు 2000 జీతానికి పనిచేసాను. ఉదయం వీక్లీ, శివరంజని, ఉదయం మెయిన్ పేపర్ కు బొమ్మలు వేసేవాడిని. డైలీ సీరియల్ కు బొమ్మలు వేసేవాడిని.
శివరంజని లో సెంటర్ స్ప్రెడ్ ‘బ్లో అప్’ వచ్చేది. దానికి తోటకూర రఘు గారు అనేవారు బొమ్మలు వేయించుకునేవారు.  ఎన్.టి.ఆర్ , ఎ.ఎన్.ఆర్ , మాయాబజార్ లో ఎస్.వి.ఆర్ పెయింటింగ్స్ వేసేవాడిని. ఉదయం లో ఆర్టిస్ట్స్ జి.వి.రమణ, భాస్కర్, లేపాక్షి, రాజు, పూర్ణ, అశోక్ , బాల్రెడ్డి, మోహన్, వాసు వంటివారు నాకు సహోద్యోగులు. మేము చాలా ప్రేమగా, స్నేహంగా ఉండేవాళ్ళం. అన్నదమ్ముల కంటే ప్రేమగా ఉంటూ, ‘ఆవారా’ అనే సభ పెట్టుకుని, 15 కుటుంబాలు కలిసి, ఒక రాత్రంతా వేడుకలు చేసుకునేవాళ్ళం.
నాకు పాటలంటే చాలా ఇష్టం. లలిత సంగీతం గోపాలకృష్ణ గారి వద్ద
నేర్చుకున్నాను. అల్ ఇండియా రేడియో లో పాటలు పాడేవాడిని. ఏ కొత్తవారు ఉద్యోగానికి ఒచ్చినా, వాళ్ళతో పాటలు పాడించుకునే వాడిని. ఆర్టిస్ట్ అయ్యుండి, రేడియో లో పాటలు పాడకూడదని, నాకు మేనేజ్మెంట్ వారు ఒకసారి మేమో కూడా ఇచ్చారు.
మీరు అభిమానించే చిత్రకారులు ఎవరు ?
వడ్డాది పాపయ్య, బాపు, జి.వి.రమణ, అశోక్ వంటివారు నా అభిమాన చిత్రకారులు. నా మిత్రుల బొమ్మలన్నీ నాకు ఇష్టమే. ఒకరి బొమ్మలు ఒకరికి చూపి, అభినందించుకునేవాళ్ళం.
మీరు కార్టూన్లు కూడా వేస్తారా ?
వేస్తానమ్మా. కధలకు బొమ్మలు, పోర్త్రైట్స్, కారికేచర్లు, కార్టూన్స్
అన్నీ వేస్తాను. క్రియేటివిటీ అనే నాగేంద్రదేవ్ గారి సంస్థకి స్టొరీ బోర్డు వేసేవాడిని. కొన్ని ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు బొమ్మలు వేసాను.
ఉదయం నుంచి బయటకు వచ్చాకా, నాకొక బైబిల్ ప్రాజెక్ట్ వచ్చింది. బైబిల్ బొమ్మ నేను స్ప్రే పెయింట్ తో వెయ్యాల్సి వచ్చింది. అందుకుగానూ, మొదటిసారి మా తమ్ముడితో కలిసి, నా మిత్రుడైన రమణ  వద్దకు వెళ్లాను. మా తమ్ముడు ‘నాగమోహన్’ ఒక్కసారి చూసినా, వెంటనే స్ప్రే పెయింట్ వెయ్యడం నేర్చుని,  నాకు కుడిభుజంగా మారాడు.
ఆ తర్వాత 7 సం. రోజూ బైబిల్ చదవటం, బొమ్మలు వెయ్యటం, డబ్బులు తెచ్చుకోవడం ఇదే నాపని. ఇలా బైబిల్ మొత్తం వెయ్యి బొమ్మల్లో వేసాను. ఇంటర్నేషనల్ ‘బైబిల్ సొసైటీ ఆఫ్ సౌత్ ఆసియా ‘ అనేవారు ఈ బొమ్మలు వేయించుకునేవారు.
కె.వి.భూపాల్ గారు రాసిన రామాయణం కు బొమ్మలు వేసాను. ప్రఖ్యా ప్రెస్, నల్లకుంట వారికి క్యాలెండరు దగ్గరి నుంచి, చాలా బొమ్మలు వేసాను.
తెలుగు దేశం పార్టీ లోగో, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ , సాక్షి పత్రిక లోగో లు నేనే
డిజైన్ చేసాను. తర్వాత శ్రీరామ బుక్ డిపో వారికి బొమ్మలు వేసాను.
ఎన్.టి.ఆర్ గారితో మీ అనుబంధం గురించి చెప్పండి.
ఉదయం పత్రికలో చేస్తూ ఉండగా, ఎన్.టి.ఆర్ విశ్వామిత్రుడి గెట్ అప్ తో ఎలా ఉంటారో ఊహించి, సండే స్పెషల్ కు  బొమ్మ వేసాను. ఆయనకు అది బాగా నచ్చింది. ‘బాల్రెడ్డి గారు, మీ చీఫ్ ఆర్టిస్ట్ శివప్రసాద్ గారిని నేను రమ్మన్నానని చెప్పండి’ అని కబురు పెట్టారు. అప్పట్లో ఎన్.టి.ఆర్ డబ్బులు ఇవ్వరని ఒక రూమర్ ఉండేది. అందుకే నేను ఆ విషయం పట్టించుకోలేదు. అయినా వదలక, ఆయన 3 సార్లు ఫోన్ చేసారు.
చివరికి ఏమైతేనేం, నా అభిమాన నటుడ్ని ఒకసారి చూడాలని, నేను, రమణ, భాస్కర్ కలిసి అబిడ్స్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళాము. నిజంగా రాచమర్యాద అంటే ఎన్.టి.ఆర్ దే ! నా జీవితంలో నన్ను అంతగా మర్యాద చేసినవారిని నేను చూడలేదు.
ముందుగా అందరికీ టీ ఇచ్చారు. నేను కాఫీ, టీ తాగను అంటే, వంటాయన్ని పిల్చి, మజ్జిగ పట్రా అన్నారు. అదేంటో, ఆ మజ్జిగ తేనె లా ఉంది.
తర్వాత నేనే, ‘మమ్మల్ని ఎందుకు పిలిపించారు ?” అని అడిగాను.

‘నాకు పని చేసి పెట్టాలి బ్రదర్ ‘ అన్నారు.
‘పని రెండు రకాలు కదా... మీకు ఏ రకం కావాలి ?’ అని అడిగాను. అంటే ఏంటని అడిగారు.
‘ఒకటి మీరు చెప్తే చేసేది, ఇంకోటి ఆర్టిస్ట్ గా నాకున్న సెన్స్ తో చేసేది... మీకు
ఎలా పనిచెయ్యాలి ?’ అని అడిగాను. మామూలుగా ఆయన ముందు ఎవరికీ నోరు పెగలదు. అటువంటిది నేను ఇలా నిర్మొహమాటంగా అడగడం ఆయనకు బాగా నచ్చింది. ‘బ్రదర్, మనిద్దరి ఆలోచనలు కలిపి ఒక మంచి ప్రోడక్ట్ ను బైటికి తీసుకువద్దాము,’ అన్నారు. అప్పుడే, అక్కడే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు పోస్టర్ డిసైనింగ్ చెయ్యమన్నారు. ముగ్గురం ఆయన ఇచ్చిన ఆల్బం నుంచి పేపర్స్ కట్ చెయ్యసాగాము.
సాయంత్రం వరకూ గీస్తూ ఉన్నాము. మాకు విడతలు విడతలుగా ఐస్ క్రీం, పకోడీలు, భోజనాలు అన్నీ వస్తూనే ఉన్నాయి. ఏం మర్యాదమ్మా ఆయనది, ఇంటల్లుడికి కూడా అంత మర్యాద చెయ్యరేమో. మాకు నమ్మశక్యంగా అనిపించలేదు. ఆయన నిద్రపోయి లేచేలోపు సిద్ధం చేసేసాము. స్కెచ్ పెన్ తో రాజు నుంచి బ్రహ్మర్షి దాకా విశ్వామిత్రుడి కధను ఫేసెస్ లో గీసాము. చుట్టూ ఆ దశలు, మధ్యలో ఆయన బ్రహ్మర్షి గెట్ అప్. ఆయనకు బాగా నచ్చింది.
ఈ బొమ్మతో ఆయన హృదయం గెల్చుకున్నాను. జనతా స్టూడియో జనతా కోటేశ్వరరావు గారు ఎన్.టి.ఆర్ పర్సనల్ ఫోటోగ్రాఫర్. బాబ్జి అనే ఫోటోగ్రాఫర్ ను పిల్చి, స్టిల్స్ కోసం ఫోటోలు తీయించాము.నాకు ముందు ఎన్.టి.ఆర్ కు పబ్లిసిటీ ఆర్టిస్ట్ గా గంగాధర్ పనిచేసేవారు.
ఇప్పుడు ఈ సినిమాకు నన్ను మొదటిసారి డిసైన్ తీసుకువెళ్ళాం. ఐవరీ షీట్ తో కవర్ డిసైన్ చేసి, అందులో బొమ్మలు పెట్టి తీసుకువెళ్ళాం. అదే మొదటిసారి ఆయన ఐవరీ షీట్ చూడడం. ఆయన బొమ్మలు చూసి, పొంగిపోయారు. ఆ కవర్ కూడా నాకు ఇస్తారా, అని అడిగారు. నాకు చాలా సంతోషం కలిగింది.
బాబ్జి తో నేను , ‘ఎన్.టి.ఆర్ పని చేయించుకుని డబ్బులు ఇవ్వరటగా, ‘అని నా మనసులో ఉన్న సందేహం అడిగేశాను. ఆయన వెంటనే లోపలకు వెళ్లి ఈ సంగతి ఎన్.టి.ఆర్ కు చెప్పేశారు. వెంటనే ఆయన నన్ను పిలిచి బిల్ పెట్టమని, డబ్బు ఇచ్చేసారు. అప్పట్లో ఒక సినిమా పబ్లిసిటీ కి 25,000 ఇచ్చేవారు. నేను సగం సినిమానే చేసినా, ఆయన పాతికవేలు ఇచ్చారు.
తర్వాత నేను సామ్రాట్ అశోక సినిమాకు పనిచేసాను. అప్పట్లో నేను ఖైరతాబాద్ లో ఉండేవాడిని. నాకోసం కార్ వచ్చేది, తీసుకువెళ్ళి, మళ్ళీ ఇంటివద్ద దింపేది.
నేను చిన్నప్పటి నుంచి నేను ఎన్.టి.ఆర్ ఫ్యాన్ ని. తర్వాత ఆయన నా ఫ్యాన్ అయ్యారు. అంతగా నన్ను ఇష్ట  పడేవారు. సామ్రాట్ అశోక కి ఒక పోస్టర్ చెయ్యాల్సి వచ్చినప్పుడు,’ బ్రదర్, నీకు నెల రోజులు టైం ఇస్తున్నా, నీ ప్రాణం పెట్టాలి, ‘ అన్నారు. అది అప్పట్లో సూపర్ హిట్ పోస్టర్ అయ్యింది.
గెట్ అప్ లు వెయ్యడానికి మీరు ఎలా కష్టపడేవారు ?
నాకెందుకో గెట్ అప్ లు వేసే విద్య బాగా అబ్బింది. కిరీటాల వద్దనుంచి, పెయింటింగ్ మలిచేందుకు బాగా కష్టపడేవాడిని. చిరంజీవిది ఆపద్బాంధవుడు సినిమాలో శివుడి గెట్ అప్ వేసాను. అప్పటికి ఆ సినిమా విడుదల కాలేదు. అలాగే, ప్రభు అని, సినిమా పత్రిక పెట్టారు. ఆయనకు నాగార్జున రామదాసు గెట్ అప్ వేసి ఇచ్చాను. కొమరం భీం సినిమాకు నాకు ఎంతో ఆప్తులైన శ్రీధర్ గారు టైటిల్స్ కి పెయింటింగ్స్ వేయించుకున్నారు. డైరెక్టర్ క్రిష్ తీసిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో రాణా గెట్ అప్ వేసాను. ఆ సినిమా కోసం ఒక పోస్టర్ డిజైన్ చేయించుకున్నారు, అది కృష్ణుడి విశ్వరూపం చూపే పోస్టర్, ఆయనకీ బాగా నచ్చింది. బాలకృష్ణ కు కొమరం భీం గెట్ అప్ వేసాను. అలాగే చిలుకూరి బాలాజీ సినిమాలో సాయి కుమార్, ఇతర ఆర్టిస్ట్ ల గెట్ అప్ వేసాను.

సినిమాలకు కాకుండా మీరు వేసిన ఇతర బొమ్మల గురించి చెప్పండి.
క్లిప్ చార్ట్ అనే ప్రభుత్వ ప్రాజెక్ట్ కు, రామకృష్ణ మఠం వారి బొమ్మల కధలకు, వికాస మంత్రాలు అనే కడప స్వామీజీ  పుస్తకానికి, వివేకానంద రధయాత్ర కోసం రధం డిజైన్ చేసాను. తర్వాత వివేకానందుడి జీవిత ఘట్టాలకు సంబంధించిన బొమ్మలు వేసి, రధం వెనుక ఒచ్చే బస్సు లో ప్రదర్శించాము.
ఈ మధ్య అనగనగా ఆప్ కోసం వారు 12 బొమ్మలు వేయించుకున్నారు. హిందీ ఆప్ బొమ్మలేస్తున్నాను. రామకృష్ణ మఠం వారి మరొక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను.
మీ బొమ్మలకు మీ శ్రీమతి గారి ప్రోత్సాహం ఎలా ఉండేది ? 
నా భార్య ‘వరలక్ష్మి’ నాకు దేవుడిచ్చిన వరం. అటువంటి స్త్రీమూర్తి ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. అలాగే నా ఇద్దరు కుమార్తెలు కూడా ఇప్పుడు మాకు చాలా అండగా ఉన్నారు. వారికి మేనరికం చేసాను. కొడుకు ప్రభు, డిగ్రీ అయ్యి, MBA చెయ్యాలని అనుకుంటున్నాడు. అతనికి పాటలు, డాన్స్ ఇష్టం.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
నాకు ఇన్స్టంట్ పోర్ట్రైట్ అంటే బాగా ఇష్టం, నెలకు 2 సార్లు రోడ్డుమీద బొమ్మలు వేసి, సంతోషపెట్టి, వారి వద్ద డబ్బు కాకుండా ఒక్కటే అడుగుదాము అనుకుంటున్నాను.
“ స్వచ్చ మానవ్ “ అని దానికి పేరు పెడతాను. నెలకొక్కసారి వారు ఒక్కరోజు అన్నీ నిజాలే చెప్పాలి, అని అడుగుతాను. అబద్ధంలో బ్రతకడం అలవాటైన వారికి, మనం నిజంలో బ్రతకాలి అన్నది అలవాటు చెయ్యాలని నా సంకల్పం. అలా చెయ్యగలిగితే, ప్రపంచమే స్వర్గం అయిపోతుంది కదా. ఇలా బొమ్మ వేయించుకున్న వాళ్ళను కాళ్ళు మొక్కుతూ రిక్వెస్ట్ చెయ్యాలని, ఒక ఆశ.
భావి ఆర్టిస్ట్ లకు మీరిచ్చే సందేశం...
ఆర్టిస్ట్ లు అంతా ఒకటవ్వాలి. ఒక అసోసియేషన్ పెట్టుకుని, నిధులు ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వ సహాయ సహకారాలు అందరికీ అందేలా చూడాలి. అప్పట్లో బొమ్మకు ఒక పది రూపాయిలు ఇచ్చేవారు. ఇప్పటికి దానికి పది రెట్లు ఇమ్మన్నా ఇవ్వరు. ఆటో మీటర్ అప్పటికీ, ఇప్పటికీ పెరిగింది. కాని ఆర్టిస్ట్ విలువ పెరగలేదు. ఆటో వాళ్లకి ఉన్న యూనిటీ కూడా ఆర్టిస్ట్ లకు లేదు. చాలా మంది ఆర్టిస్ట్ లు తిండికి లేక బాధపడుతున్నారు. వీరంతా కలిసి రావాలి. ఇందుకు నేను ఒక ఐడియా చెప్తాను.
వీక్ ఎండ్ లో ఆర్టిస్ట్ లు ఒక్క రోజు పోర్ట్రైట్ లు గీసి, ఆ డబ్బును ఆర్టిస్ట్ ల ఫండ్ కి ఇవ్వాలి. నెలంతా మనకోసం మనం బ్రతుకుతాము. కాని, నెలకు ఒక్కరోజు తోటి ఆర్టిస్ట్ ల కోసం బ్రతుకుదాము. ప్రతి మతంలోనూ ఆదాయంలో పదొవ వంతు దానధర్మాలకు వినియోగించాలని, అంటారు.
నాదగ్గర డబ్బు లేదు కాని, నేను రోజుకు 30 పోర్ట్రైట్ లు గీస్తాను. అలా గీసినవి, ఇతర ఆర్టిస్ట్ లకు ఇచ్చేస్తాను. ఇలా అంతా ముందుకు వస్తే, యూనియన్ ఏర్పరచవచ్చు.
 చూసారా, యెంత చక్కటి సందేశం ఇచ్చారో శివప్రసాద్ గారు. సహృదయంతో వీరు తలపెట్టిన ఈ కార్యక్రమానికి, మనం కూడా మన తరఫు నుంచి సాయం చేసేందుకు ముందుకు రావాలి . ఆర్టిస్ట్ లు అంతా వివక్ష వదిలి, చెయ్యి, చెయ్యి కలపాలి. వీరు మరిన్ని మంచి పనులు చేపట్టి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మన  చదువరులు అందరి తరఫునా మనసారా ఆకాంక్షిస్తున్నాను. కృతఙ్ఞతలు శివప్రసాద్ గారు.
శివప్రసాద్ గారితో నా ముఖాముఖి ని, వారు ఆలపించిన ఒక చక్కటి గేయంతో సహా, క్రింది లింక్ లో వినండి.

No comments:

Post a Comment

Pages