తీయని విషం - అచ్చంగా తెలుగు

తీయని విషం

Share This
 తీయని విషం 
- ఆదూరి హైమవతి.
     

ఒకానొక సమయంలో దేవతలకు,రాక్షసులకు పెద్దయుధ్ధం జరిగింది.దేవతలు ముందుగా బ్రహ్మ ను ధ్యానించి" రాక్షసులను జయించే శక్తి యుక్తులు ప్రసాదించి, మా గౌరవం కాపాడండి సృష్టికర్తా! మీరేమాకు దిక్కు." అనిప్రార్ధించి వరాలు, ఆశీస్సులు పొందడంవల్ల ,ఆ యుధ్ధంలో జయించారు,దాంతో వారికి మహా ఆనందంతో పాటు గర్వం తలకెక్కింది. తాము రాక్షసులను జయించామన్నఅభిజాత్యంతో వారు మహాసంబరాలు చేసుకుంటూ అహంకరించారు .సంబరాలలో తేలియాడు తుండగా వారి ఎదుట ఒక వింత ఆకారం వెలసింది. ఆ ఆకారాన్ని చూసి దేవతలు దిగ్భ్రమ చెందారు.ఇంద్రుడు ఆ ఆకారాన్నిచూసి,అగ్నిదేవునితో " అగ్నిదేవా!వెంటనే వెళ్ళి ఈవింత ఆకారం ఎవరోతెల్సుకో!" అని ఆఙ్ఞాపించాడు.అగ్నిదేవుడు ఆ ఆకారాన్ని  సమీపించి, అధికార స్వరంతో "నీవెవరు?" అని అడుగగా,ఆ ఆకారం "నీవెవరో ముందుగా  చెప్పు" అనగానే" నేను అగ్నిని. నన్ను తెలీని వారేలేరు అని గర్వంగా చెప్తాడు. ఆ ఆకారం"ఐతే నీ ప్రత్యేక శక్తి సామర్ధ్యాలేంటో చెప్పు. "అని అడుగుతుంది. అగ్ని"నేనుదేన్నయినా క్షణాల్లో భస్మం చేయగలను." అని ధీమాగా చెప్తాడు.ఆవింత ఆకారం "ఓహో!అలాగా!ఐతే ఈ గడ్డి పోచను కాల్చగల వేమో ప్రయత్నించు" అంటూ ఒక గడ్డి పోచను అగ్ని ముందుంచింది. అగ్నితన శక్తినంతా ఉపయోగించి ఎంతో ప్రయత్నించినా ఆ గడ్డిపోచను మండించ లేకపోయాడు. అగ్నిసిగ్గుతో తలవంచు కెళ్ళి ,"దేవా!ఆ ఆకారం ఎవరో నేను తెల్సుకోలేక పోయాను"అని చెప్పాడు విచారంగా. వెంటనే ఇంద్రుడు, 'ఆ ఆకారం ఎవరో నీవైనా తెల్సుకునిరా!" అని చెప్పి వాయు దేవుని పంపుతాడు. వాయువువెళ్ళి,ఆవింత ఆకృతిని "నీవెవరు?"అని ఆఙ్ఞా పూర్వ కంగా ప్రశ్నించగా,ఆవింత ఆకారం "నీవెవరో ముందు చెప్పు." అంటుంది.
వాయువు"నేను వాయు దేవుడ్ని.నేను లేనిదే ఎవ్వరూ బ్రతకలేరు." అని చెప్తాడు అతిశయంగా. "ఐతేనీ ప్రత్యేక శక్తులేంటి?"అని ప్రశ్నించింది ఆవింత ఆకారం. "నేను ఎంతటి దాన్నైనా అతితేలికగా విసరి వేయగలను."అంటాడు. ఆ ఆకారం" మరి ఈగడ్డి పరకను విసిరేయగలవేమో చూడు.." అని గడ్డిపరకను చూపగా,వాయువు తన బలాన్నంతా ఉపయోగించి శ్రమించినా  లేశ మాత్రమైనా ఆ గడ్డి పరకను కదిలించలేక పోయాడు.వాయువు వెళ్ళి,ఇంద్రునితో"ఆ ఆకారం ఎవరో తెల్సుకోలేక పోయాను"  అని చెప్పగానే,ఇంద్రుడు మిగిలిన దేవతలకు చెప్పగా ఒక్కోరూ వెళ్ళి ప్రయత్నించి, విఫల మయ్యారు.ఇంద్రుడు ఆశ్చర్యంతో తానే వెళ్ళి ఆ ఆకారాన్నిసమీపించగానే ఆ ఆకృతి మాయమై 'పార్వతీ దేవీ ప్రత్యక్షమైంది.ఇంద్రుడు ఆ దేవికి ప్రణమిల్లి "ఓదేవీ!ఇంతవరకూ మాకు కనిపించిన ఆవింత ఆకృతి ఎవరుతల్లీ?" అని వినయంగా అడుగగా, పార్వతీదేవి "ఆవింత స్వరూపం 'బ్రహ్మ'. ఆ రక్కసులతో మీవిజయానికి కారకుడు అతడే! మీరు ఈ విషయం మరచి,మీశక్తి సామర్ధ్యాల వల్లనే గెలుపొందినట్లు విర్ర వీగు తున్నారు.మీ శక్తులేంటో మీకు తెలియపరచాలనే ,బ్రహ్మ ఆ వింత ఆకారంతో వచ్చాడు. అహంకారం అవమానాల పాలు చేస్తుంది. గర్వం తీయని విషం " అని తెలియ చెప్పి మాయమైంది పార్వతి.
                   ******************** 

No comments:

Post a Comment

Pages