తొలిప్రేమ - అచ్చంగా తెలుగు

తొలిప్రేమ

Share This

తొలిప్రేమ

- హరికృష్ణ 


సరిగా లేని బాటలో ఎన్నో తంటాలు పడుతూ, ఎత్తు పెరిగే కొద్ది తక్కువయ్యే సత్తువతో, కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి ప్రకృతిలో మైమరచిపోతూ ముందుకు సాగిపోతూ.... ఇక ముందు ఏముందో నాకు కూడా తెలీదు. నేను కూడా తొలిసారిగా అడుగు పెడుతున్నాను. నేను, నాతో పాటు నా ఇద్దరు స్నేహితులు. ముందు ఒక పెద్ద కొండ ఐతే కనబడుతోంది కానీ దాని పైకి వెళ్ళే పథం ఆచూకి మాత్రం లేదు. యాత్ర మొదలుపెట్టటానికి ఒక చిన్న మార్గం కనిపెట్టేసరికి కొండ చుట్టూ ఓ అర ప్రదక్షిణం పూర్తయింది. అది శీతాకాలపు ఉదయం, భానుడు ఇంకా పరదేశం నుండి మన దేశపు వినువీధుల్లో ప్రభవించని సమయం. చీకటిలో కానరాని ఈ మంచు తెరలని చీలుస్తూ ఉదయించే ఆ రవి కిరణాలని ఈ కొండ పైన సేద తీరుతూ వీక్షించాలనే ఆశతో ఇంత ముందుగా బయలుదేరాం. ఇక్కడ దారి మొత్తం రెండు ప్రక్కల చెట్లతో నిండిపోయి మధ్యలో రాళ్ళమీద అడుగులు వేసుకుంటూ వెళ్ళటానికి సన్న మార్గం ఉంది. అన్నట్టు నా స్నేహితుల పేర్లు చెప్పలేదు కదూ...ఒకడి పేరు లవ్ కుమార్, ఇంకోడి పేరు ప్రేమ్ కుమార్. ఇద్దరి పేర్లలో ఉన్న ప్రేమ వాళ్ళ లైఫ్ లో మాత్రం లేదు. అది సరే కాని నా పేరు ప్రకాష్. తిండి తక్కువై అలసిపోయారో, నిద్రలేమితో సొలసిపోయారో కానీ నా మిత్ర రత్నములు ఒక మైలుకే కూలబడిపోయారు. మేము అక్కడ కూర్చుని నీళ్ళు తాగుతుండగా దూరంలో ఎవరో వస్తున్నట్టు అడుగులు వినబడ్డాయి. ఆగి వస్తున్న లో వోల్టేజ్ తో పనిచేస్తున్నట్టు వీధి దీపాలు వెలిగి ఆరుతున్నాయి.
ఇంతలో ఆ కాంతిలో క్షణం కనిపిస్తూ, మరు క్షణం చీకటిలో కనుమరుగు అవుతూ ఒక రూపం కదులుతోంది. ఒక క్షణం....నూలు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి... మరు క్షణం...కమ్ముకున్న చీకటి...
మరు క్షణం...మా ముందు నుండి పైకి ఎక్కుతూ ఉన్న అమ్మాయి...సందిగ్ధంలో తటపటాయిస్తున్న కొద్దిపాటి వెలుగులో చివరగా తన ముఖం చూసాను. ఆ క్షణం కలుసుకున్నాయి మా ఇద్దరి కనుచూపులు. ఆ కళ్ళని చూస్తూ కొన్ని క్షణాలు నా చుట్టూ ప్రపంచం స్తంభించిపోయింది.
ప్రకాష్ తన స్నేహితులతో ఇలా అన్నాడు..." మీరు మెల్లగా ఓపిక ఉన్నప్పుడు రండి, నేను పైన వెయిట్ చేస్తాను."
" ఏరా, అమ్మాయిల కోసమా... వాళ్ళు ముగ్గురున్నారు కాస్త మా గురించి కూడా ఆలోచించచ్చు కదరా!" , అన్నాడు కొంటెగా లవ్ కుమార్.
" ముగ్గురున్నారా, నేను ఒక అమ్మాయినే చూశా, అదీ తన కళ్ళు ఒకటే చూశా, అవి చూస్తున్నంత సేపు నాకింక ఏమి తెలియలేదు." అన్నాడు ప్రకాష్.
" ఆ అమ్మాయి మొహం మొత్తం కప్పెసుకుంది. తల చుట్టూ, ఒక్క కళ్ళకి తప్ప. అదైన గమనించారా తమరు." అడిగాడు ప్రేం కుమార్.
నేను వాళ్ళని వదిలేసి నడవటం మొదలుపెట్టా. కాస్త దూరం వెళ్ళేసరికి ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరు కూర్చున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం వెళ్తూనే ఉంది. తల చుట్టూ ఒక ఎరుపు రంగు చున్ని కట్టుకుని, మెడలో ఒక కెమెరా తగిలించుకుని ఒకే రకంగా పది ఫోటోలు తీస్తూ వెళ్తోంది. తనతో కలిసి నడవటానికి నా నడక వేగాన్ని పెంచాను. ఇంతలో ఆ అమ్మాయి ఫొటోలు తీస్తూ వెనక వైపుగా క్లిక్ చేసింది. అంతే చటుక్కున వెలిగిన కెమెరా ఫ్లాష్ లో దయ్యం వచ్చిందా అన్నట్టు ఉన్న నా ముఖం చూసి గట్టిగా అరిచింది. ఆ అరుపుతో ఖంగు తిన్న నేను భయంతో ఒక అడుగు వెనక వేసి రాయి మీద జర్రున జారి పడ్డాను. కొన్ని గంటల క్రితం ఆ ప్రాంతం మొత్తం వర్షంతో తడిసినట్టుంది.
అమ్మాయి: నన్ను క్షమించండి, ఒక్కసారిగా చూసేసరికి భయపడ్డాను.
ప్రకాష్: పర్లేదులెండి. కాని కాస్త మీ చెయ్యి అందిస్తే కొంచెం బాగుంటుంది. (లేచిన తర్వాత) నా పేరు ప్రకాష్.
అమ్మాయి: నా పేరు నీలు, నీలవేణి.
ప్రకాష్: మీకు మంచు పెద్దగా ఇష్టం ఉన్నట్టు లేదు, తల చుట్టు చున్ని, ఒంటి చుట్టు స్వెట్టర్ వేసుకున్నారు.
నీలు: వర్షంలో తడవాలని, మంచులో నడవాలని నాకు కూడ ఉంటుంది కాని మా అమ్మకి ఫోన్ చేసినపుడు నా గొంతులో తేడా కనిపిస్తే ఆవిడ మాటలో తేడా చూపిస్తుంది. అంత వరకు ఎందుకులే అని ఈ సేఫ్టి మెజర్స్.
ప్రకాష్: హ హ, అమ్మ ప్రేమ, నాన్న భాధ్యత, వాళ్ళు ఉన్నంత వరకు ఉంటాయి. మనం తిరిగి ఎంత ఇచ్చినా ట్రాన్స్ ఫార్మర్స్ కి బ్యాటరీస్ పెట్టినట్టే!
నీలు: వాళ్ళ అర్ధ జీవితం లోనే మన సగం జీవితానికి సరిపోయే ప్రేమని, మిగిలిన జీవితమంతా మర్చిపోలేని అనుబంధాలని అమర్చి వెళ్తారు.
ప్రకాష్: అవును. ఇంతకీ అడగటం మర్చిపోయాను, మీరు ఏం చేస్తుంటారు?
నీలు: నేనండి, మరి ఏంటంటేనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి.
ప్రకాష్: నన్ను అండి అనటం ఆపండి. ప్రకాష్ అని పిలవండి.
నీలు: మరి నువ్వు కూడా నా పేరు తెలుసుకున్నావ్ కదా, అలా పిలవకుండా అండి ఏంటి ఇందాకటినుంచి...(నవ్వుతూ)
ప్రకాష్: సరే సరే, ఇక నుండి మీరు వదిలేద్దాం.
నీలు: నువ్వేం చేస్తుంటావ్?
ప్రకాష్: సేం టు సేం, సాఫ్ట్వేర్.
నీలు: ఓ ఇంక సాఫ్ట్వేర్ లోనే సెట్టిల్?
ప్రకాష్: అంత ఓపిక లేదు తల్లి, ఓ పది పదిహేనేళ్ళు. ఆ తర్వాత మొత్తం ఇలాంటి యాత్రలే.
నీలు: నీకు ప్రకృతి అంటే ఇష్టం బాగా ఎక్కువలా ఉంది...
ప్రకాష్: చెట్టు ఆకుల మీద అద్దుకున్న నీటి చుక్కలు, వర్షంలో తడిసి ముద్దయిన మట్టి నుండి వచ్చే సువాసన, మేఘాలు తరలిపోతే వద్దామని వేచిచూస్తున్న సూర్యుడు...మనసుని మత్తెకించి పరిస్థితులని మర్చిపోయేలా చేసే పరిసరాలు. ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పటి నగరాల్లో ఈ అందమైన ఆకాశాన్ని దాచేసే భవనాలు, ఈ గాలిని కలుషితం చేసే టెక్నాలజీలు తప్ప అడగకుండానే మనశ్శాంతినిచ్చే ఇలాంటి కల్ప వృక్షాలు ఎక్కడ దొరుకుతాయ్. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ప్రకృతికి కొంచెం దగ్గరవుదామని. ఇదంతా చేయటం బాగుంటుంది కాని నా జీవితం పంచుకునే వాళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఈ లోపు నాకంటూ ఒకరు దొరికితే వాళ్ళతో… ఇలాంటి వాతావరణంలో… ఆ అనుభూతే వేరు కదా...
ఇంతలో దారి పక్కనే ఉన్న చెట్టుకి సన్నని కొమ్మ కనబడింది. అంతే నేను వెంటనే దాని దగ్గరకి పరిగెత్తి కొమ్మని ఊపటం మొదలుపెట్టాను. దానితో ఆకులని అంటిపెట్టుకున్న నీటి చుక్కలు నా మీద, వెనకాలే వస్తున్న నీలు మీద ఓ కనక వర్షంలా కురిసాయి.
ప్రకాష్: ఇంతకి నీ సంగతి ఏంటి...అందరి అమ్మాయిల్లాగా జాబ్ తర్వాత పెళ్ళి, అంతేనా?
నీలు: ఇంట్లో అమ్మ ఐతే అదే అంటుంది కాని నాన్న మాత్రం నీకేమైనా మనసులో ఉంటే చెప్పు, మీ అమ్మ లాగా కూర్చోకుండా ఏమన్నా చేస్తే బాగుంటుంది అంటారు. నాకైతే లైఫ్ లో ఎగ్జయిటింగ్ గా ఏమన్నా చేయాలని ఉంది. అబ్బాయిలకైతే వాళ్ళు ఏం చేయాలనుకున్నా పేరెంట్స్ ని ఒప్పిస్తే చాలు, అదే అమ్మాయిలకైతే చేసుకున్న మొగుడ్ని ఒప్పించాలి. 20 యేళ్ళుగా కలిసున్న అమ్మ నాన్నలని ఒప్పించటం కుదురుతుంది కాని కొత్తగా తగులుకున్న వాడిని ఎలా ఒప్పిస్తాం చెప్పు.
ప్రకాష్: లైఫ్ అనేది చాలా చిన్నది నీలు. జీవితంలో మనకు మనం బతకాలి అని తెలుసుకునే సరికి పావు వంతు అయిపోతుంది. ఏలా బతకాలి అని ఆలోచించటంలో ఇంకో పావు వంతు మనం వ్యర్ధం చేస్తాం. అనుకున్నది చేయకుండానే అర జీవితం అయిపోయిందని మిగిలిన సగం జీవితాన్ని గడిపేయటం. పక్క వాళ్ళకి చెప్పటానికి కారణాలు బానే దొరుకుతాయ్ కాని తర్వాత నిన్ను నువ్వు ప్రశ్నించుకునే క్షణాన ఆ కారణాలు ఎంత చిన్నవో నీకు తెలిసినప్పుడు జీవితంలో ఎంత ఓడిపోయాం అన్నది తెలుస్తుంది. ఇంతలో నేను, నీలు కొండ పైకి చేరుకున్నాం. మాటల్లో మునిగిపోయి నేను ఆ విషయమే గమనించలేదు. నీలు నా దగ్గరనుండి పరుగెత్తటం మొదలు పెట్టింది. నీలు ఎందుకు పరుగెడుతోందో నాకు అర్ధం కాలేదు. ఆ క్షణాన తల ఎత్తి ముందుకు చూశాను. అంతే...మొదటిసారిగా నా కళ్ళు నా మనసుకేదో చెప్పాలనుకుంటున్నాయి. ఈ క్షణాన అవి నాకు థాంక్స్ చెప్పటానికే ఆ దేవుడు నా దేహంలో పార్ట్ కి పార్ట్ కి మధ్య కనెక్షన్స్ పెట్టాడేమో అనిపించింది.
కళ్ళముందు మొత్తం తెల్లని మంచు కమ్ముకుంది. ఆ మంచులోంచి కొంచెం ముందుకి చూస్తే కనిపించి కనిపించనట్టు ఉన్న ఒక పెద్ద చెట్టు. నేలనుండి బారుగా పైకి వెళ్తున్న చెట్టుని ఆకులన్ని కలిసి తొక్కెస్తున్నట్టుగా అడ్డంగా, దట్టంగా ఉన్న చెట్టు. దాన్ని దాటి ఇంకొంచెం ముందుకి వెళ్తే శూన్యం...ఆ శూన్యం అంచుల దాకా వెళ్తే అక్కడ ఉన్నాడు ప్రపంచానికి వెలుగు పంచటానికి అడుగు అడుగుగా పైకి ఎదుగుతూ పోతున్న సూర్యుడు. నారింజ రంగుతో నిండి తన కిరణాలని అన్ని దిక్కులా విస్తరిస్తూ అప్పుడే పాతాళం దాటి భూమి మీద స్వారీకి సిద్ధమైన భానుడు. ఇది చాలదన్నట్టు పంచ భక్ష్య పర్వాన్నాలూ తిని కడుపు నిండిపోయిన వాడికి అమృతం అందించినట్టు ఆ భానుడికి, చెట్టుకి ముందు ఒక రూపం వెలిసింది. అది ఇప్పటివరకు నా పక్కనే పయనించిన ప్రాణం. మంచులో నుంచి కనబడుతున్న చెట్టు, దాని పక్కన నిలుచున్న నీలు రూపం, ఆ రూపానికి పైన ఉదయిస్తున్న రవి. ఇంతకన్నా మంచి దృశ్యం కలలోనైన తలపించేనా అన్నట్టు ఉంది.
నీలు చలిని అడ్డుకోవటానికి వేసుకున్న నూలు వస్త్రాన్ని తీసి, తన తలను చుట్టేసిన చున్నిని మెల్లగా తీయటం మొదలు పెట్టింది. నా గుండె వేగం పెరగటం ప్రారంభించింది. బహుశా సూపర్ ఫాస్ట్ రైళ్ళ వేగం నా గుండె కొట్టుకుంటున్న వేగంలో పది శాతం ఉంటుందేమో. నా గుండె వేగానికి నా శరీరం వణకడం నేను గమనించాను. నీలు ఇంక అటు వైపే తిరిగి ఉంది. తన జుట్టుని వదులు చేసుకుని నీలు నా వైపు తిరుగుతో...
ఆ(నొప్పితో)... ఎంత సేపు నుంచి కన్నార్పకుండా చూస్తున్నానో తెలీదు. ఎందుకంటే ఆ రెప్ప పాటు క్షణంలో ఎన్ని గొప్ప అనుభూతుల్ని వదులుకోవాలో అని. కానీ ఎగ్జాం హాల్లో ఇన్విజిలేటర్ పేపర్ లాక్కున్నాక సమాధానం గుర్తొచ్చినట్టు సరిగ్గా నీలు తిరిగే సమయానికే ఏదో ఎగిరివచ్చి కంట్లో పడింది. కనులని కమ్మేసిన ఒక్క కంటి చుక్క కూడ సముద్రమంత భారంగా తోచింది, కనులు తెరవలేని ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచింది. మొత్తానికి కళ్ళు చూడటం మొదలుపెట్టాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. చుట్టూ ఉన్న మంచు, ఛెట్టు, సూర్యుడు అన్ని కదలిక లేకుండా ఘనీభవించి పోయాయి. ఇప్పుడు ఈ ప్రపంచం లో నేను గుర్తించగలిగేది ఏమన్నా ఉంటే అది ఈ భూమ్మీదే ఎంతో అందమైన మోము, దానికి తోడు వీస్తున్న పిల్ల గాలికి ఎగసిపడుతూ, తన నాట్యంతో ఆ అందాన్ని దాగుడుమూతలు ఆడిస్తున్న నీలు జుట్టు.
ఇంతలో నా మనసు నాతో మాట్లడటం మొదలు పెట్టింది.
మై హార్ట్: చూడమంటే రాత్రి పగలు మర్చిపోయి, తిండి, నిద్ర మర్చిపోయి ఇలాగే నుంచుని చూసేలా ఉన్నావే. ఇకనైన తనని వదిల్తే మేము సేల్ఫీస్ తీసుకోవాలి.
ఏంటి ఇదేదో తేడాగా మాట్లాడుతోంది...నా బాడి కూడా రైల్లో ఊగినట్టు ఊగుతోంది...అప్పుడు రియాలిటికి వచ్చా. అది మాట్లాడింది నీలు ఫ్రెండ్...నేను మాట్లాడట్లేదని ఇందాకటి నుంచి తెగ ఊపుతోంది.
నీలు ఫ్రెండ్స్ నీలుతో కలిసి చుట్టు చూడటానికి వెళ్ళారు. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి తిరిగాను. ఇంతలో నా మెదడు నాకేదో చెప్తోంది. నేను నీలుని వెనక నుంచి చూస్తున్నంత సేపూ తనేదో చేస్తూ ఉంది. నేను నీలు నిలుచున్న చోటుకి వెళ్ళాను. నీలు పక్కనే తన మోకాళ్ళ ఎత్తులో ఓ బండరాయి ఉంది. దాని దగ్గరగా వెళ్ళాను. దాని మీద వైట్ చాక్ తో ఓ నంబర్ రాసి ఉంది.
నాకర్దమైంది నా ప్రేమ కథ మొదలైందని.
వరుణుడికి అనిపించింది నన్ను చేరుకోవాలని.
అందుకే నన్ను తడిపేశాడు, రాయి మీద రాసిన అంకెలను చెరిపేశాడు!
**************

No comments:

Post a Comment

Pages