వజ్రసంకల్పం - అచ్చంగా తెలుగు

వజ్రసంకల్పం

Share This
వజ్రసంకల్పం 
 బి.వి.సత్యనాగేష్ 

వినోద్, వికాస్ చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో కలుసుకున్నారు. క్షేమసమాచారాలు పరస్పరం తెలుసుకున్నారు. “ఏ పనిమీద వచ్చేవు హైదరాబాద్ కి” అన్నాడు వినోద్, “సెక్రటేరియేట్ లో ఒక పనుంది. అన్నట్లు.... నీకో విషయం చెప్పాలి. మనం స్కూల్లో చదివే రోజుల్లో ప్రసాద్ అని మనకొక క్లాస్ మేట్ వుండేవాడు. చాలా సగటు విద్యార్థిలా వుండేవాడు. ప్రసాద్ I.A.S ఆఫీసర్ అయ్యేడు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. అతడిని కలవటానికి వెళ్తున్నాను.” అన్నాడు వికాస్. “అంత సగటు విద్యార్ధి.... ఎలా I.A.S అయ్యాడు అని ప్రశ్నించేడు వినోద్. దేశంలోనే మొదటి ర్యాంకును సంపాదించుకుంది. “డాక్టర్ అవుదామనుకున్నాడు. సీటు రాలేదు. బై.పి.సి ఎందుకు తీసుకున్నావంటూ మేనమామ క్లాస్ తీసుకున్నాడట. అప్పటి నుంచి పౌరుషం తో చదివి మొత్తానికి I.A.S పరీక్ష పాసయ్యాడట” అన్నాడు వికాస్. మన సమాజంలో ప్రసాద్ లాంటి వ్యక్తులు మనకు కనబడుతూ వుంటారు. తనలోని వజ్రం లాంటి శక్తిని తెలుసుకున్న తర్వాత అద్భుతాలు సృష్టించిన వారెందరో వున్నారు. ప్రతీ మనిషిలోనూ అఖండమైన శక్తి వుంటుంది. వజ్రంలాంటి ఈ శక్తికి సంకల్పం తోడైతే ఏదైనా సాధించవచ్చు. మన దగ్గర ఒక కంప్యూటర్ వుందనుకుందాం. దానిని వాడుకోక పొతే అదొక ప్లాస్టిక్ డబ్బాతో సమానం. ఆ కంప్యూటర్ ను ఎలా వాడాలో తెలుసుకుని వాడితే మనకెన్నో లాభాలుంటాయి. అలాగే మన మెదడు లోని శక్తిని కొంతమేరకు నైనా వాడుకుంటే ఎన్నో లాభాలు పొందవచ్చు. మన శక్తిని కేవలం 3% మాత్రమే వాడుకుంటామనేది నిపుణుల అభిప్రాయం. అవసరమైనపుడు శక్తిని వజ్రసంకల్పంతో మేల్కొలిపి ఊహించిన ఫలితాలు పొందిన వారెందరో వున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలను చూద్దాం. ‘ఈ మధ్యకాలంలో ప్రేమా జయకుమార్ అనే ఒక అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలో ఉత్తీర్ణురాలై దేశంలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఆమెలో ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఆమె తండ్రి బొంబాయి మహానగరంలో ఒక ఆటో డ్రైవర్. అంతంత మాత్రమే సంపాదన వున్న తండ్రి ఒక చిన్నగదిలో సంసారాన్ని నడిపించేడు. ఎటువంటి ప్రత్యేకసౌకర్యాలు లేని, చదువులేని తల్లిదండ్రుల ప్రేమతో ఆ అమ్మాయి తన శక్తిని మేల్కొలిపింది. 
 బెంగుళూరుకు చెందిన శివకుమార్ ఒక పేపర్ బాయ్,... పేద కుటుంబంలో పుట్టిన శివకుమార్ చాలా పట్టుదలతో తన శక్తిని మేల్కొలిపాడు. ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు న్యూస్ పేపర్లను తీసుకోవడం, వాటిని ఇంటింటికి చేర్చడం. ఇంజనీరింగ్ చదువుతూ ఉదయం పేపర్ బాయ్ గా, సాయంత్రం పార్ట్ టైం ఉద్యోగిగా గడుపుతూ ఆల్ ఇండియా ‘CAT’ పరీక్షలో ఉత్తీర్ణుడై IIM, కలకత్తాలో MBAలో సీటు సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. సుదర్శన్ గౌతమ్ అనే 32 సంవత్సరాల యువకునికి రెండు చేతులు లేవు. ఒకప్పుడు మానవాతీతమైన పని అనుకున్న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి 20-5-2013 తేదినాడు రికార్డు సృష్టించేడు. రెండు చేతులు వున్నా, పట్టుకోల్పోయే అతిక్లిష్టమైన పనిని అతడు వజ్రసంకల్పంతో ఆ మంచుకొండలలో సాధించాడు. మరి IAS అయిన ప్రసాద్ లో వచ్చిన మార్పు, తద్వారా కలిగిన వజ్రసంకల్పం గురించి చూద్దాం.... అగ్నికి గాలి తోడైనట్లు.... లక్ష్యానికి కృషి తోడైతే ఏదైనా సాధించవచ్చు. మేనమామ అన్న మాటలకు ప్రసాద్ మనసులో పౌరుషం చోటు చేసుకుంది. తన శక్తిని మేల్కొలిపి కసితో కృషి చేసేడు. తోటివారు కూడా ఊహించని స్థాయికి ఎదిగేడు. మన శక్తిని మేల్కొలపాలి అంటే మనలో ఉద్వేగ ప్రజ్ఞ (EMOTIONAL INTELLIGENCE) ఉండాలి. మన ఉద్వేగాలను, ఎదుటివారి ఉద్వేగాలను అర్ధం చేసుకుంటూ తెలివిగా ఉండటాన్ని EMOTIONAL INTELLIGENCE అంటారు. దీని ద్వారా మనలో రగిలే కోరిక (BURNING DESIRE) ను పెంపొందించుకోవాలి. లక్ష్యాన్ని చేరే వరకు ఆ కోరిక ప్రజ్వరిల్లుతూనే వుండాలి. ఒలింపిక్ కాగడాతో మొదలుపెట్టిన మారతాన్ రన్నింగ్ లో కాగడా వెలిగినట్లు, మనలో రగిలే కోరిక లక్ష్యం చేరేంతవరకు ఆరకుండా వెలుగుతో వుండాలి. వజ్రసంకల్పం అంటే ఒక రగిలే కోరిక లాంటిది. ‘ప్రతీక్షణం లోనూ లక్ష్యం గుర్తుకొస్తూ వుండాలి. ప్రతిఫలాన్ని ఆశిస్తూ కృషి చేస్తూనే వుండాలి. మనసుకు, సమయాన్ని (MIND & TIME MANAGEMENT) సరియైన పద్ధతిలో నిర్వహించుకుంటే మన లక్ష్యాన్ని చేరవచ్చు. గొంగళిపురుగులో సీతాకోకచిలుక కన్పించదు. విత్తనంలో మహావృక్షం కన్పించదు. కోడిగ్రుడ్డులో కోడిపిల్ల కన్పించదు. ఈ రూపాంతరం చెందాలంటే మార్పుకోసం తపన కావాలి. కొన్ని గొంగళిపురుగులు గానే, కొన్ని విత్తనాలుగానే, కొన్ని కోడిగ్రుడ్డు గానే వాటి జీవితాలను పూర్తి చేసుకుంటాయి. బస్తాలో ధాన్యం మొలకెత్తదు, భూమిపై జల్లిన ప్రతీ విత్తనం మొలకగా మారదు. ఏవైతే ఆటుపోట్లకు తట్టుకుంటాయో అవి మాత్రమే మహా వృక్షాలుగా మారతాయి. మనిషికి ఆలోచనలే విత్తనాలు. ఈ ఆలోచనలను వజ్రసంకల్పంతో సాగుబడి చేస్తే మంచి పంట లాంటి ఫలితాలొస్తాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది. మంచి సంకల్పంతో జీవితాన్ని సానబెట్టి సంతోషమయంగా చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్..

No comments:

Post a Comment

Pages