వెన్నెల యానం - 3 - అచ్చంగా తెలుగు

వెన్నెల యానం - 3

Share This

వెన్నెల యానం - 3

భావరాజు పద్మిని

( జరిగిన కధ : వెన్నెల రాత్రి పాపికొండల నడుమ చక్కటి పూలపడవపై ప్రయాణిస్తూ ఉంటారు కొత్త జంట శరత్, చంద్రిక. తమ పరిచయం గురించి ముచ్చటించుకుంటూ ఉంటారు. శరత్ తండ్రి చిన్నప్పుడే పోవడంతో, తల్లి సంరక్షణలో పెరుగుతుంటాడు. తనకు ఎం.సి.ఎ లో సీట్ రాగా, దిల్సుక్ నగర్ బాబా గుడికి, సద్గురుదీవేనలకై వస్తాడు శరత్. గుడి బయట తన మెళ్ళో చైన్ లాగాబోయిన అబ్బాయిని బైక్ పై నుంచి లాగి పడేసి, కొడుతున్న చంద్రికను చూసి, ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతాడు... చంద్రికను తను రెండవసారి బస్సు లో చూసిన వైనం, సీతారామపురం మామిడి తోటలో ఆమె దొంగతనం చెయ్యబోయిన పాలేరును కొడుతూ, భయపడి చెట్టెక్కిన శరత్ తో ఆమె చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు శరత్... ఇక చదవండి...)
వెన్నెల్లో గోదావరి అందాలను తిలకిస్తూ, శరత్ చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్న చంద్రిక, “ఏం పాపగారు.... కొత్త జంట లాగున్నారు...” అంటూ ప్రక్కన వెళ్తున్న పడవలోని తాత పలకరింపుకు ఈ లోకంలోకి వచ్చింది.
“అవును తాతా, ఈ అబ్బాయి నచ్చాడని, ఎత్తుకొచ్చి, పెళ్లి చేసుకున్నా... ఎలా ఉన్నాడంటావ్ ... నీకు నచ్చకపోతే చెప్పు, ఇప్పుడే నీ పడవెక్కించి పంపేస్తా...” అంది కొంటెగా శరత్ నే చూస్తూ చంద్రిక.
“ తాతా, చూసావుగా ఈ పిల్ల అల్లరి. బుద్ధిమంతుడిని తీసుకొచ్చి, నట్టేట్లో పడేసింది... ఇక ఈవిడతో వేగలేను తాతా, నన్ను నీతో తీసుకుపో,” అంటూ అసమ్మతి ప్రకటించే నేత లాగా మొహం పెట్టి, తెడ్లు వదిలేసి, లేచి నిల్చున్నాడు శరత్.
“తీసుకునే పోదును కానీ మనవడా, తొందరపడబాక. ఆ మూల కూకుందే, మా ముసిల్ది, పేరు మల్లి లే ! మొదట్లో అది కూడా ఈలాగే కొరకరాని కొయ్యనాగే ఉండీది. తర్వాత మెత్తబడింది. అదీ నేనూ ఈ పున్నమేళ  వనీమూన్ కు వచ్చినాము. ఆ మాటకొస్తే, మా పెళ్ళైన కాడ్నుంచీ ప్రతి పున్నమికీ పడవలో తిప్పకపోతే,  నా మల్లి నాకు బువ్వెట్టదు. మా మజ్జ పానకంలో పుడక నాగా నువ్వెందుగ్గానీ, ఏదో ఆ పిల్లతోనే సర్దుకుపో...” బోసినవ్వులు నవ్వుతూ అన్నాడు తాత...
“ఓ పంచభూతాల్లారా ! నన్ను మీలో కలిపేసుకోండి, ఈ తాతకు కూడా నేను లోకువైపోయాను... ఇక ఈ లోకంలో నాకు స్థానం లేదు... “ అంటూ రెండు చేతులూ చాచి, గట్టిగా అరిచాడు శరత్.
“నువ్వేమీ మగ సీతవు కాదు, ఇక్కడ నీకు అగ్ని పరీక్ష ఏమీ జరగట్లేదు... సినిమా డైలాగ్ లతో, హాయిగా గోదాట్లో కళ్ళు తెరుచుకు నిద్దరోతున్న చేపల్ని, ఇతర జీవాల్ని కంగారుపెట్టక బుద్ధిగా కూర్చో ! నాకు కరాటే లో బ్లాక్ బెల్ట్ ఉంది,నీకు తెల్సుగా “ ఒక కనుబొమ పైకెత్తి విలన్ లా అంది చంద్రిక. నిజంగా భయపడ్డట్టు నటిస్తూ, కూర్చుండిపోయాడు శరత్.
వాళ్ళనే చూసి నవ్వుకుంటున్న తాత...” మీ సరసాల కేంగానీ, ఇదిగో పాపగోరూ... పున్నమి కందా, ఎదర గోదారి మాంచి పోటు మీద ఉంది. ఏటికెదర గెడయ్యడం పడవలో పుట్టి పెరిగిన గోదారి కూనలం మావోల్లే కాలేదు. అటుగా పోమాకండి. కుడి చేతిపక్కగా ఎల్లారంటే, కాసేపటికి లంకలు తగులుతాయి. అక్కడ ఎవ్వరూ ఉండరు. అటేపు పడవ తిప్పండి...” అంటూ నెమ్మదిగా వాళ్ళను దాటుకుంటూ, చెయ్యూపుతూ పోయారు తాత, మల్లి.
బుంగమూతి పెట్టుకుని, పడవను అటుగా తిప్పుతున్న శరత్ ను చూసి, “హేయ్ , అలిగావా ? ఊరికే సరదాగా నిన్ను ఏడిపించాను. నిజంగా కొట్టనులే !” అంది చంద్రిక.
బెట్టు నటిస్తూ, ముఖం అవతలకి తిప్పుకున్నాడు శరత్.
“సరే, అయితే నీకు ఇష్టమైన పాట పాడనా... అప్పుడెప్పుడో గోదావరి ఒడ్డున నువ్వు రాసిస్తే నేను పాడిన పాట ..., మా మంచి శరత్ వు కదూ, నవ్వవూ...” అంటూ అతని గడ్డం పట్టుకు బ్రతిమాలింది చంద్రిక.
“నీమీద కోపం ఏమీ లేదు చంద్రా... నిజానికి నీ అల్లరంటే నాకూ ఇష్టమే !” అంటూ తేలిగ్గా నవ్వేసి, “ అయినా, పాట ఆఫర్ వదులుకోను. అన్నట్టు, ఏ పాట అది , నాకేం గుర్తులేదే... “ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి, అన్నాడు శరత్.
“ఇదిగో, మరీ అంత ఘజిని సినిమాలో సూర్య లాగా బిల్డ్ అప్ ఇవ్వకు... నా నోటితో చెప్పించాలనే కదూ, నీ ఉద్దేశం... సరే, చెప్తా విను...”
**************
ఈ దేశంలో కాలేజీ లో క్లాస్సులు ఎన్ని జరుగుతాయో అందుకు సరిసమానంగా బంద్ లు జరుగుతాయి. ఆ రోజు తీరా సీతారాంపురం నుంచి ఎండల్లో బస్సుల్లో పడి, కాలేజీ కి వచ్చాకా... బంద్ అని చెప్పారు. ఏం చెయ్యాలో తోచలేదు, వెంటనే వెనక్కి వెళ్లేందుకు మనస్కరించలేదు. సర్లే... వశిష్ట గోదావరి ఒడ్డున ఉన్న నర్సాపురం గ్రామదేవత ‘కొండాలమ్మ’ ను దర్శించుకుని వెళ్దామని అనుకున్నాను. ఆ అమ్మవారంటే, మా ఊరి వాళ్ళకే కాదు, చుట్టుప్రక్కల వాళ్లకి కూడా చాలా నమ్మకం ! ఈ అమ్మవారి కధ ఏమిటంటే...
ఒకసారి వరద గోదారి ఉరవళ్ళు పరవళ్ళుగా ప్రవహిస్తోంది. వరదతో పాటు ఓ కొయ్య విగ్రహం కొట్టుకొచ్చింది. .'ఇది భద్రాచలం నుండి వరదలో కొట్టుకొచ్చింది. మన నరసాపురానికి వచ్చి ఆగింది, కాబట్టి మనం ఇక్కడే గుడి కట్టాలి.' అన్నారు ఊరిపెద్దలు. ఆవిధంగా గోదావరి ఒడ్డునే చిన్న గుడి కట్టి, పూజిస్తుంటే... కోరిన కోరికలు తీరి, రోగాలు తగ్గించి, ఆ తల్లి చూపిన మహిమకు అందరికీ కొండాలమ్మ పై బాగా గురి కుదిరింది. 97 లో వచ్చిన వరదల్లో, ఆ చిన్న గుడి దెబ్బతినటంతో, వెనుక పెద్ద గుడి కట్టి, విగ్రహాన్ని అందులోకి మార్చారు.
అమ్మవారి దర్శనం చేసుకుని, కుంకుమ పెట్టుకుని, పూజారిగారు అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం నుంచి తీసి ఇచ్చిన రెండు ఎర్ర గాజులు చేతికి వేసుకుని, అలా గోదారి గట్టున కాసేపు కూర్చుందామని వచ్చాను. ఇక్కడ పుట్టిపెరిగిన వాళ్లకు గోదావారంటే అమ్మంత ఇష్టం, మమకారం ! గట్టు మీద, ఎవరో యువకుడు, నీళ్ళలో కాళ్ళు పెట్టి ఆడుతూ, చేతిలో పుస్తకం, పెన్ను పెట్టుకుని, తదేకంగా గోదావరిలో సాగుతున్న నావను చూస్తూ ఉన్నాడు. ఇంకాస్త  దగ్గరకి వచ్చి చూద్దును కదా, అది ఎవరో కాదు, ప్రపంచంలోకే అతి ధైర్యవంతులైన నా సహపాఠి... శరత్ గారు. కాస్త ఏడిపిద్దాం... అనిపించింది.
“ఏవండోయ్ భూషణం గారు... నీళ్ళల్లో కాళ్ళు పెట్టి ఆడే కాపీ రైట్ కేవలం ఆడవాళ్లకే రాసిచ్చాడు దేవుడు, తెల్సా !” అన్నాను.
ఏదో తపోభంగం జరిగినట్టు వెనుదిరిగి, నన్ను చూసి, “నా పేరు భూషణం కాదు, శరత్... అలాంటి రూల్ ఏమీ లేదు.”
“అబ్బో, ఈ పాటికి నాకు భయపడి, ఏట్లో దూకేస్తారేమో... నాకు శరత్ హత్యాపాతకం చుట్టుకుంటుందేమో, అని భయపడ్డాను. పర్లేదు, చూడబోతే ,కాస్త ధైర్యం పెరిగినట్టే ఉంది. పుస్తకం హస్త - భూషణం అన్నారు కదండీ, అలాగ పుస్తకం చేతిలో పుచ్చుకుని, దిక్కులు చూస్తుంటేనూ... భూషణం అని పిలవాలని అనిపించింది. అన్నట్టు, అంతగా  గుడ్లు మిటకరించి చూడడానికి, ఈ గోదాట్లో ఏముందట ?”
“ఈ గోదావరిలో ఏముందో తెలీదు. మౌనంగానే మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలసటను అలలతో కడిగేస్తుందో, పైరగాలి వీవెనతో సేద తీరుస్తుందో గాని, మనసు కలతగా ఉన్నప్పుడు, కాసేపు ఈ నది ముంగిట మౌనంగా కూర్చుంటే కొత్త ఊపిరి పోసుకున్నట్లుగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు నదిఒడ్డున తచ్చాడుతుంటే, చిలిపి అలల సవ్వడితో కేరింతలు కొడుతూ మనతో ఆడుతున్నట్లుగా ఉంటుంది. బేధభావాలు చూపకుండా అందరినీ సమానంగా, అమ్మలా ఆదరిస్తుంది. ఆటుపోట్లకు తలొగ్గక, పాత నీటిని, కొత్త నీటిని కలుపుకుంటూ ముగ్ధంగా సాగిపోయే ఈ నది, మౌనంగా జీవన వేదాన్ని బోధిస్తున్నట్లుగా ఉంటుంది... “ మనసులోని ఆరాధననంతా కళ్ళలో నింపి, గోదావరినే తదేకంగా చూస్తూ అన్నాడు శరత్.
“బ్యూటిఫుల్... కవులకు తగిన భావగంభీరమైన భాషలో హృద్యంగా మాట్లాడావు. టన్నుల కొద్దీ భావుకత నీలో దాగుందని, ఇవాళే తెలిసింది. అయితే, ఇప్పుడు నీకో సవాల్... పండిత భాషలో చెప్పిన ఇదే భావాన్ని, పామర భాషలో చెప్పగలవా ? అంటే, చదువురాని పడవ వాడు, తన భాషలో ఇదే భావాన్ని పాటగా పాడితే ఎలా ఉంటుందో, నువ్వు ఇప్పుడే, ఇక్కడే పది నిముషాల్లో ఒక పాటగా రాయగాలవా ? చెప్పు ?” అడిగింది చంద్రిక.
“రాస్తాను... కాని, నువ్వు నన్ను సవాల్ చేసావు కనుక... నీకూ ఒక చిన్న సవాలు. నా గార్ధభ గాన మాధుర్యం ఆ రోజు బస్సు లో విన్నావుగా... నీకున్న సంగీత పరిజ్ఞానం గురించి నాకు తెలుసు. అందుకే, పది నిముషాల్లో నేను రాసిన పాటకి, పది నిముషాల్లో నువ్వు బాణీ కట్టి పాడగలవా ? చెప్పు... “ తిరిగి ప్రశ్నించాడు శరత్.
“తప్పకుండా ! రాసిచ్చి చూడు... నాకు ఇటువంటి సవాళ్లంటే భలే సరదా... “ అంటూ కాస్త దూరంగా కూర్చుని, నీళ్ళల్లో పట్టీల కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాను నేను. నా పాదాలకు ఉన్న పారాణి, నీళ్ళలో లయబద్ధంగా కదులుతున్న నా మువ్వల సవ్వడి వింటూ... కళ్ళు మూసుకున్నావు నువ్వు. అంతే ! ఒక అద్భుతమైన పాట నీ మనోనేత్రంలో క్షణాల్లో జీవంపోసుకుంది...
పల్లవి : గుండె గోదారితోన ఊసులాడతాంది
         మాట గొంతు దాటక మూగవోయింది
         గోదారి అమ్మలా కుశలమడుగుతాది
         చిలిపి అలల సడితోన ఆటలాడుతాది
         పైరగాలి పైటతో నిలువెల్లా నిమురుతాది
         నిండుమనసుతోన నన్ను సల్లగ దీవిత్తాది // గుండె //
         బతుకు పడవ ఆటుపోట్లు వాడుకేనంది
         కుంగకపొంగక సాగితె ఏడుకేనంది
         పాతనీరు కొత్తనీరు కలుపుకుపొమ్మంది
        నిండినా ఎండినా నిబ్బరంగ నవ్వమంది // గుండె //
పాట చదివి నేను ఆశ్చర్యపోయాను. అది ఎవరో మామూలు వ్యక్తి రాసిన పాటలా లేదు. ప్రకృతిలో తాదాత్మ్యం చెందిన ఒక మహర్షి, రాసిన కావ్యంలా ఉంది... ఇక ఈ పాటకు నేను నా గొంతుతో సంగీతంతో ప్రాణం పొయ్యాలి... అదీ పది నిముషాల్లో... పల్లె పడవ వాడి స్వరంలో... నాకు సాధ్యమేనా , సవాలు గెలవగాలనా ? మౌనంగా కళ్ళు మూసుకున్నాను...
(సశేషం...)

No comments:

Post a Comment

Pages