అలల అలజడి
(నవంబర్ 2006, “పత్రిక” మాసపత్రిక)
- తమిరిశ జానకి
జయదేవుడి అష్టపదిలోని శృంగారమంతా ఆమె కన్నుల్లో కదలాడుతోంది. అన్నమయ్య పదంలోని అందమంతా ఆమె ముఖంలో తాండవిస్తోంది. కూచిపూడి భామాకలాపం ఆమె ఒంటి విరుపుల్లో చిందులేస్తోంది. ఆమె ఒక పాటలా, ఆమె ఒక నాట్యంలా గోచరిస్తోందినాకు. ఎవరీమె? వారం రోజులుగా రోజూ గొదావరొడ్డుకు వొచ్చి చీకటిపడే దాకా కూచునివెల్తున్నాను. రెండు రోజులుగా ఆ అమ్మాయి కూడా రావడం... అల్లంతదూరంలో కూచుని నా వంకే చూడడం గమనించాను. గోదావర్లో తెల్లని నురుగుల అలలు.... ఒడ్డున పరువాల అందాలు. కానీ.. ఇలా ఒక్కత్తే వస్తోందేమిటి? కూడా ఎవరూ స్నేహితురాళ్ళు లేరే! నాకు మల్లేనే ఆమె కూడా ఈ ఊరికి కొత్తేమో? అసలెవరి తాలుకో?... ఒకక్షణం నా మనసు తడబడింది. ఆమె ఎవరైతే నాకెందుకు? ఔను నాకెందుకు. మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఇదేమిటి? నా వైపేవోస్తొందమ్మాయి!
“నమస్కారమండీ”
పంచమస్వరంలో కోకిల గానం. ఎదురుగా కోకిల కాదు... కోమలాంగి కాదు కాదు.
అష్టపది.. అన్నమయ్య పదం.. కూచిపూడి భామ..
అప్రయత్నంగా ప్రతి నమస్కారం చేశాను.
ఎదురుగా కూచుంది. “మీరు రచయితగారట కదా?”
తెల్లబోయాను. ఎవరీ అమ్మాయి? నా గురించి వాకబు చెయ్యడానికి నన్నెరుగున్న వాళ్ళెవ్వరూ ఈ ఊళ్ళో లేరే?
హైదరాబాదులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నాకు... నా జీవితం మాత్రం సాఫ్ట్ గా లేదా అన్న అనవసరమైన దిగులు ముంచేస్తూ ఉంటుంది ఒక్కోసారి రాత్రంతా ఉద్యోగం... పగలింట్లో నిద్ర..
పెళ్ళి చేసుకుంటే కుటుంబానికి న్యాయం చెయ్యగలనో లేదోనన్న అనుమానం దడిపిస్తోంది నన్ను.
ఒక్కొక్కసారి డిప్రెషన్ లోకి వెళ్ళి పోతున్నాను.
“ఒక పని చెయ్యి...” హథాత్తుగా అయినా ఆత్మీయంగా ఒక సలహా ఇచ్చాడు.. స్నేహితుడు రామూర్తి పెళ్ళయిన వాడు.. భార్య.. పుత్రికారత్నంతో ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్నవాడు. ఇతనికి వాళ్ళ ఊళ్ళో సొంత ఇల్లుంది. ఒకసారెప్పుడో చాలా రోజుల కిందట నన్ను తీసికెళ్ళాడు కూడా తనతో.
“మా ఇల్లు తాళం వేసుంచాను అద్దెకివ్వలేదు. ఆ ఊళ్ళో అద్దెలెక్కువరావులే.. పైగా ఎప్పుడైనా వెళ్ళి నాల్రోజులుండాలనిపిస్తే అద్దెకిచ్చేస్తే కుదరదు కదా. అందుకని అక్కడి మంచాలు కుర్చీలు ఇంకా కొన్ని సామాన్లు అక్కడే ఉంచేశాను. మా పిచ్చికగూడు ఎపార్టు మెంట్లో అంతజాగాలేదు. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి కదా? అందుకే అవి అక్కడ ఉంచాను. నువ్వీ ఉద్యోగంలో జేరకముందు అడపా తడపా కథలు రాసేవాడిని కదా? ఇప్పుడు కూడా నీలో రచనలు చెయ్యాలన్న తపన ఉందన్నావు కదా?
“నీ సొంత ఇంటికీ నా తపనకీ సంబంధం ఏమిటో నాకర్ధం కావట్లేదు”
“చెప్తా చెప్తా...”
నాలో కుతూహలం పెరిగింది.
“నువ్వు కనీసం ఓ పదిహేను రోజులన్నా సెలవు పెట్టు”
ఇదింకా బావుంది. తన సొంత ఇంటికీ నా తపనకీ సంబంధం ఏమిటో అర్ధం కాక నేనుంటే మళ్ళీ ఇదేమిటి?
“నీ కర్ధం కాలేదు కదూ?”
“మహాప్రభో.. జుట్టు పీక్కోవాలన్నంతగా అనిపించినా చేతులు కూడా కడపలేనంత బిగుసుకు పోయాను... అర్ధమై ఉంటే కనీసం నీ జుట్టన్నా పీకేవాడిని. ఈ సొంతిల్లేమిటి? నా తపనేమిటి? కంపెనీ వాళ్ళు పదిహేను రోజులు సెలవిచ్చేసే కరుణామయు లేవిటి...”
పకపకా నవ్వాడు “చూశావా? రచనలనగానే నీలో నిద్రాణమై ఉన్న కవిత్వ ధోరణి కృష్ణా జలాల్లా వొచ్చెస్తా నంటోంది...”
“ఇదిగో నాయనా... క్రిష్ణా జలాలో గోదావరీ తరంగాలో...”
నా మాట కడ్డుపడ్డాడు...”ఆ.. అదే.. అదే.. గోదావరి ఒడ్డున కూచుని క్రిష్ణా జలాల్లా పొంగివొచ్చే రచనా ధార కురిపించు. నీ డిప్రెషన్ గిప్రెషన్ ఎగిరి పోతుంది. మళ్ళీ పావురంలా ఎగిరొచ్చి పని చేయగలుగుతా విక్కడ”
సీరియస్ గా ఆలోచించి తల ఊపాను సరేనన్నట్టుగా
అంతే... ఇక్కడున్నానీ ఊళ్ళో.. హోటల్నించి కాఫీ టిఫీనూ భోజనం అన్నీ టైముకి తీసుకొస్తున్నాడు పని కుర్రాడు. రోజూ పొద్దున్నే స్నానం అవగానే కొంచెం సేపు ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళిరావటం ఆ తర్వాత పెన్నూ కాగితాలు అందుకోడం... సాయంత్రాలు గోదారొడ్డుకి షికారు. హైదరాబాదులో హైవే మీద అపార్ట్మెంట్లో ఉండే నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఈ మార్పు నా మనసుకి ఉల్లాసంగా ఉంది. రామ్మూర్తి మంచి సలహానే ఇచ్చాడు.
కానీ ఈ అమ్మాయెవరో తనకి తెలియదు. తన గురించి ఎవరు చెప్పారీమెకి? అడగకుండానే సమాధానం వొచ్చింది.
“మీరు హైదరాబాదులో ఉన్న మీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి మీపని కుర్రాడికి అర్ధమై పోయింది. అతనే చెప్పాడు నాతో”.
ఆవులిస్తే పేగుల్లెక్కడతాడన్నమాట. ఊరు చిన్నదని ఊళ్ళో మనుషుల్ని చిన్నగా అంచనా వెయ్యకూడదు. ఓ పాఠం నేర్చుకున్నాను.
“నా మీదో కథ రాయండి” మొహం చాలా సీరియస్ గా పెట్టింది.
“మీ మీదా?”
“నా మీదంటే.. నా వీపుమీదో పోట్టమీదో కాదు లెండి”
ఛ...ఛ.. మరీ అలా మాట్లాడుతుందేమిటి? ఈ అందానికి ఆమాట తీరు బాగులేదు.
“నా గురించి రాయండి”
“మీ గురించి కథ రాసేంత జీవితం మీకింకా లేదు...”
నా మాట పూర్తికానివ్వకుండానే కస్సుమంది. “ఎందుకులేదు? మీకేం తెలుసనీ?” ఔను.. నాకేం తెలుసనీ?
“రాజకీయాలన్నీ తెల్సినదాన్ని.. వాళ్ళ భారతాలన్నీ చెప్పినదాన్ని... వాళ్ళ భాగవతాలన్నీ చూసిన దాన్ని...”
ఆ కళ్ళల్లో నాక్కనిపించిన అష్టపది మెల్లిగా కరిగి పోతున్నట్టనిపించింది.
ఆ ముఖంలో అందంగా పారాడిన అన్నమయ్య పదం అలుక్కుపోయినట్టనిపించింది.
“ఈ పిల్లకేవన్నా పిచ్చా అని చూస్తున్నారు కదూ?”
కూచిపూడి భామ కులుకులు కలికానిక్కూడా కనిపించలేదు.
“కాదు అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను” జవాబిచ్చాను.
“అబ్బో! మీ రచయితల భాష వేరు... అచ్చమైన రచయితల భాషలో జవాబు చెప్పారు.
“మీలాంటి వాళ్ళు కొందరు రాసిచ్చే కదా నాలాంటి వాళ్ళు తయారవుతున్నది..
ఏవంటోందో దేన్ని గురించి మాట్లాడుతోందో తెలియలేదు.
ఒక్కటి మాత్రం అర్ధమైంది.
కోకిల స్వరంతో కసినికక్కుతూ రగిలిపోతున్న ఓ జ్వాల ఈమె అని అర్ధమైంది.
“పదండి మీ ఇంటికి... నా కథ వినిపిస్తాను...”
నన్ను రక్షించేవాళ్ళెవరూ లేరు. నన్ను నేనే రక్షించు కోవాలి.
“ఇక్కడే చెప్పండి” వినను అంటే వోదిలేలా లేదు మరి.
“పూర్తిగా వింటారా వెళ్ళిపోకుండా మధ్యలో?”
“వింటాను” ఇబ్బందిగా ఉంది... ముక్కూ మొహం తెలియని అమ్మాయి.
******
కూతురు పుట్టిన ఏడాదికే భర్త పోవడం రంగమ్మకి పెద్ద దెబ్బే.
ఆ ఇంట్లో ఈ ఇంట్లో పన్లు చేస్తూ కూతుర్ని స్కూల్లో వేసింది. ఆ పిల్లమీద ఆశతోనే బతుకుతోంది. స్కూల్లో వెయ్యకముందునించీ కూడా పిల్ల సిసింద్రీయే.
ఏదైనా సరే... ఒక్కసారిచెప్తే చాలు... ఇట్టే పట్టేస్తుంది.. పద్యం అవనీ... పాట అవనీ... శ్లోకం అవనీ.. రెండోసారి నేర్పే అవసరం లేదు... పైగా మాటలో?” ఎంతెంత కష్టమైనా మాటలైనా... ఎంతెంత పొడుగు వాక్యాలైనా ఒక్కసారి చెప్తే చాలు...
ఒక్క తప్పులేకుండా టేపు రికార్దర్లా వినిపించగలదు. చదువులో ఎప్పుడూ ఫస్టే. మూడో తరగతిలోకి కూతురు నాగమణి రావడం.. మందులు వాడకుండా నిర్లక్ష్యం చేసుకోవడంతో అంతుపట్టని జ్వరంతో రంగమ్మ పోవడం జరిగాయి. పిల్ల బాగా గ్రహణశక్తి గలది కాబట్టి.. దాని మీద ఎక్కడలేని జాలీ ఒలక బోస్తూ తన ఇంటికి తీసుకుపోయాడు మేనమామ శంకరం.
అదివరకెప్పుడూ వాళ్ళ కష్టసుఖాలు పట్టించుకున్న వాడు కాదు.
రాజకీయ పార్టీల వాళ్లతో గుంపులో గోవిందలా తిరుగుతుంటాడు.
పెద్దప్లానే వేసి పార్టీలో కాస్తంత పలుకుబడున్నాయన దగ్గరికి పిల్లని తీసికెళ్ళాడు.
“ఊ.. అయితే ప్రచారానికిదో పెద్ద ఆకర్షణ అంటావ్?” పిల్ల బుగ్గ చిదుముతూ అదోలాచూశాడు.
చాలా మర్యాదగా చేతులు కట్టుకుని తల ఊపాడు శంకరం.
అలా..పార్టీ ప్రచారానికీ.. వేరే పార్టీల వాళ్ళని దుమ్మెత్తి పోయ్యడానికీ... పార్టీలో వాళ్ళు చెప్పే పన్లు అదనీ ఇదనీ లేకుండా చేసి పెట్టడానికి పదును పెట్టారు పసి పిల్లని.
దాని భవిష్యత్తు ఎవడిక్కావాలి?
రాస్తారోకోలు..ధర్నాలు...తగలబెట్టడాలు .. హత్యలు..నరకడాలు...
ఇవే ఆ పిల్ల చెవిలో మారుమోగుతుంటాయి.
తొడగొట్టి సవాల్ చేస్తాం...ఫలానా పార్టీ అంతుచూస్తాం.. ఫలానా వాడి పరువు తీస్తాం.. అక్కడ వాడిని తుంగలో తోక్కుతాం... ఇక్కడ వీడిని నెత్తిమీద గుడ్దేసుకుని పోయేలా చేస్తాం. ఇవే ఆపిల్ల నోట్లోంచి రాలేదండకాలు... దండిగా శంకరం చేతుల్లో కురిపిస్తున్నాయి డబ్బులు. మద్యం మత్తులో మునిగి తేలుతూ.. భార్యకానుపు కష్టమై కన్నుమూస్తే... ఇంట్లో పన్లన్నీ కూడా నాగమణికే అప్పజెప్పాడు.
పదేళ్లోచ్చేసరికి పదిహేనేళ్ళ పిల్లలా బాగా ఎత్తరిగా బొద్దుగా తయారయింది పిల్ల. అందరి చూపుల్నీ ఆకట్టుకునే అందం దాని సొత్తయింది.
రాజకీయ ఉపన్యాసంలో తను కసిగా పలికే నరుకుతాం అన్నమాట వాళ్ళ చేతుల మీద ప్రయోగించాలనిపించేది. ఇంత గొంతు చేసుకుని తుంగలో తోక్కుతాం అంటూ ప్రతీకార వాంఛతో రగిలి పోతున్నట్టుగా ఉపన్యాసంలో తానరిచే అరుపుని వల్ల పట్ల చూపించి... వాళ్ళని పడేసి తుంగలో తొక్కాలని పించేది... అన్నీ అనిపించడం వరకే... అనుసరించడానికి లేదు.. కీ ఇచ్చిన బొమ్మల్లే.. బ్యాటరీలేసి పలికించే బొమ్మల్లే.. తనని బజార్నపడేశాడు మామయ్య... తన నోటి నుంచి వొచ్చే వ్యర్ధప్రేలాపనలకే తప్ప... ఆలోచనారహిత ఆవేశపూరిత తిట్లకే తప్ప... తన మనసుకి విలువలేదు... గుంపులో గోవిందాలా పార్టీలో తిరుగుతూ రాజకీయాల్లో ముందుకి దూసుకు పోవాలన్న వాడి కోరికకి తనని బలిపశువుని చేశాడు. వాడు పైకొచ్చింది లేదు... బాగుపడ్డది లేదు. తన బతుకు తనని బతకనిచ్చింది లేదు.
అంతమంది పరిచయస్తుల్లో బాలరాజొక్కడే తన కళ్ళల్లోకి చూసి తన మనసుని చదివిన వాడు. ఎనిమిదవ తరగతి వరకూ చదువుకున్నాడు. సొంతంగా స్కూటర్లు రిపేర్ చేసే షాపు పెట్టుకున్నాడు నీతిగా బతకాలన్న నియమం ఉన్నవాడు. తనంటే మనస్పూర్తిగా ఇష్టం నిజమైన జాలీ ఉన్నవాడు. అతని గురించీ తనకి బాగా తెలుసు... అలాంటప్పుడు... పెళ్ళి చేసుకొని తనకొక మంచి జీవితాన్ని ఇవ్వడానికి మనస్పూర్తిగా అతను ముందుకొస్తే కాదని తనెందుకంటుంది? సంతోషంగా వెళ్ళి మామయ్యతో చెప్తే ఎంత ఎగిరాడు? ప్రేమా... పెళ్ళీ ఇలాంటి మాటలు నోట్లోంచి రావడానికి వీల్లెదట...
ఇంకోసారి పెళ్ళి అన్నమాట మాటాడితే ప్రాణం తీస్తానన్నాడు.
నువ్వు పెళ్ళి చేసుకుని పోయేందుకా మీ అమ్మ చచ్చిపోతే నిన్నిక్కడికి తీసుకొచ్చాను అంటూ కొట్టినంత పని చేశాడు. వారం తిరక్కుండా బాలరాజు శవం గోదావరొడ్డున కనబడింది.
ఎవరు చంపించారో ఆ మాత్రం ఊహించలేదా తను? తన మూలంగానే కదా వాడికాచావు? రాజకీయాల్లో తిరిగే వాళ్ళల్లో మాత్రం మంచివాళ్ళు లేరా? కానీ ఎవరికెళ్ళి మొరపెట్టుకోవాలి తను? వెళ్లినట్టు తెలిస్తే ఎవరితోనైనా చెప్పుకున్నట్టు తెలిస్తే అసలింక బతకనిస్తాడా? వెంటనే పీకపిసికి చంపెయ్యడూ?
ఓసారి బాలరాజేవని మెచ్చుకున్నాడూ?... గులాబీ పువ్వంత అందమైన దానివి నువ్వు అన్నాడు.
ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా తెంపుకోవచ్చు మొక్కనున్న గులాబీని.
..కానీ... ఈ గులాబీ సంగతి వేరు. మామయ్య అనే ముల్లునించి తప్పించి తెంపుకోలే రెవ్వరూ ఈ గులాబీని.
*****
“బాగా చీకటి పడిపోయింది... నేనెళ్తున్నా” చటుక్కున ముగించేసి లేచెళ్ళిపోయింది. ఆమె దూరానికి సాగిపోతున్న అష్టపదిలా.. అన్నమయ్య పదంలా... అలవోకగా కదుల్తున్న కూచిపూడి భామలా.
“ఏవంటుంది సార్ ఆ పిచ్చిది?” మాటతో చిన్న నువ్వు కూడా వినపడితే పక్కకి తిరిగి చూశాను. పని కుర్రాడు రమేష్,,,
“అదో పిచ్చిపిల్ల సార్... వెర్రి బాగుల్ది”
“అన్నవాళ్ళు పిచ్చివాళ్ళు”
వింతగా చూశాడు నావైపు.
“తన గురించి చెప్పుకుందా సార్?”
“ఔను”
“పాపం! ఎవరితోనూ చెప్పుకోదు... మీరు రచయితని నేనే చెప్పాను. అందుకే మీతో చెప్పుకుని ఉంటుంది.”
“కావచ్చు. కానీ చూడు రమేష్... ఎవరిదగ్గిరా ఇంక నేను రచయితనని చెప్పకు. నేనేం పెద్దపేరున్న రచయితని కాదు”
“సరేసార్.. చెప్పను... కానీ మీరు రాస్తూ ఉండండి సార్. పేరదేవొస్తుంది”
“చిన్నవాడివైనా భలే చెప్పావు” నవ్వుతూ లేచి ఇంటిదారి పట్టాను.
ఎనిమిది గంటలకి భోజనం క్యారియర్ తీసుకొచ్చిన రమేష్ వెంటనే వెళ్ళిపోలేదు.ఏమిటన్నట్టుగా చూశాను. చిన్నగా నసిగాడు. “నాగమణి తన కథ మీకు చెప్పుకుంది కదా! మా ఇద్దరీ సంగతీ చెప్పిందో లేదో మరి... మా ఇద్దరికీ ఒకళ్లంటే ఒకళ్ళకి ఇష్టం... పెళ్ళి చేసుకోవాలని కూడా ఉంది. కానీ బాలరాజుని చంపించినట్టే నన్ను కూడా వాళ్ళ మావయ్య చంపుతాడేమోనన్న ఆలోచనతో భయంతో వెనకాడుతున్నాను...”
“భయపడద్దు రమేష్.. ఎన్నాళ్ళని ఎంతమందినని చంపుతాడు? చెప్పకుండా చేసేసుకోండి పెళ్ళి... అప్పుడింకేం చేస్తాడు” ధైర్యం చెప్పాను.
*****
హఠాత్తుగా మెళ్ళో దండలతో వొచ్చి జంటగా కాళ్ళకి నమస్కరించారు నాగమణి రమేష్ లు. “మీరన్న మాటలు సరైనవే అనిపించి మీరిచ్చిన ధైర్యంతో పెళ్ళి చేసుకున్నాను సార్”.
జేబులో రెండొందలుంటే తీసి పెళ్ళి బహుమతిగా రమేష్ చేతిలో పెట్టాను. వాళ్ళువెళ్ళాక నా మెదడు నన్ను నిలదీసింది... “వాడి ప్రాణానికి ముప్పు అయినా కూడా పెళ్ళిచేసుకోమని ధైర్యం చెప్పావు వాడికి. పెళ్ళి నీ ప్రాణానికి ముప్పుకాక పోయినా.. చదువు.. డబ్బు.. తిండి.. బట్ట.. దేనికి నీకు లోటు లేక పోయినా పెళ్ళి గురించి అంత భయపడతా వెందుకు నువ్వు? ఎందుకంత డిప్రెషన్ కి లోనవుతావు? జీవితమన్నాక సమస్యలుంటాయి. ముళ్ళు గుచ్చు కోకుండా ఒడుపుగా పువ్వుకోసుకున్నట్లే సమస్యల్ని నేర్పుగా పరిష్కరించుకుంటూ వైవాహిక జీవితంలోని అందాల్ని అందుకోడానికి అడుగు వెయ్యి.. అంతేగానీ మరో రకంగా సుఖాలు కొనుక్కుందామని చూసి కోరి కోరి కొత్తకొత్త రోగాలు కొని తెచ్చుకోకు...
కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది నాలో గోదావరి తరంగాల్లా...
నిజమే.. గోదావరి నాకు మంచిపాఠం నేర్పించి.
ఇన్నాళ్ళుగా మనసుని కుదిపిన అలల అలజడి ప్రశాంతమై పన్నీటి జల్లు కురిపించింది.
******
No comments:
Post a Comment