అమ్మ గోదావరి
ఝాన్సీ మంతెన
త్రయంబకుని జఠాజూటంలో ఠీవిగా ఉండే గంగ,
నేలకు జారి వచ్చింది గౌతమియై.
గౌతముని పాపాలు కడిగే నెపంతో
గోవుపై నుండి పారుతూ గోదావరైంది.
ఆకాశాన్నంటే కొండల నుండి నేలపైకి పరుగున వచ్చింది,
బిడ్డల కల్పవల్లిగా కన్నతల్లి వురుకుల పరుగుల గోదారమ్మ.
బంజరు భూములకు పచ్చని పంటచేల రంగులద్దుతూ,
జాలర్ల వలలో చేపల కాసులు రాసులు పోస్తూ,
ప్రవహించే మేరంతా ప్రాణం పోస్తూ,
వరదలై వాగులై వంకల్లో డొంకల్లో,
పరుగులు పెడుతూ అలుపెరుగని అమ్మ.
తొలిసంధ్య వెలుగులో తామ్రవర్ణపు తళతళ,
మధ్యాహ్నభానుడి పసిడివన్నె గొలుసుల ధగధగ,
మలిసంధ్యలో సప్తాశ్వాధూళితో ధూమ్రవర్ణపు మిలమిల,
వెన్నెల్లో వెదజల్లే వెండిపూలతో రజత వర్ణపు కళకళ,
నీటి అద్దంలో ఎన్నెన్ని రంగుల రంగావల్లులో...
గోదారమ్మ అందాలు ...
ఎన్ని తరాలు పొగిడినా తరగని అనంత రాగాలు
తెల్లని తెరచాపల నావలు నగలై మెరుస్తూ వుంటే
నావికుల హైలెస్సా పాటలకు పరవశించి అలలూగుతుంటే
కనుచూపుమేరలో గోదారమ్మ అందాల జోరు,
పసిబిడ్డల మాటలకు మురిసి పులకించే కన్నతల్లి తీరు.
పిల్లల ఆటలు చూసి ఆనందించటమే కాదు,
తప్పులకు దండించే క్రమశిక్షణ కూడా అమ్మకు తెలుసు
వరదల చెంప పెట్టుతో ఉప్పొంగే గోదారమ్మ
కొట్టినా పెట్టినా అమ్మ ప్రేమ అంతులేనిది,
మా అమ్మ గోదారమ్మ ప్రేమ అంతులేనిది.
No comments:
Post a Comment