‘అమ్మేస్తున్నాం అమ్మనిలా...’
- మీనాక్షీ శ్రీనివాస్
సుమారు పది సంవత్సరాల తర్వాత నేను పుట్టిన గడ్డ మీద అడుగుపెట్టాను... మీడియా ధర్మమా అని అన్ని సమాచారాలు తెలుస్తూనే ఉన్నా, చదవడం, వినడం వేరు - కళ్ళారా చూడడం వేరు....
విమానం దిగుతూనే ఆఘమేఘాలమీద ఇంటికైనా వెళ్ళకుండా గోదావరి ఒడ్డుకు పరిగెట్టుకు (కారులోనే అనుకోండి) వచ్చిన నాకు క్షణకాలం మతి పోయింది. తెల్లటి ఇసుక పర్రలూ, రాళ్ళూ రప్పలూ, పిచ్చిమొక్కలూ, తుప్పలతో ఉన్న గోదావరి చూస్తూనే హతాశుడైపోయాను. ... అక్కడున్నదే గోదారా? మరి నీళ్ళేవి?
నా తండ్రి ఊరు రాజమహేంద్రవరం అయితే, నా తల్లి పుట్టిల్లు మురమళ్ళ. నా చిన్నతనం అంతా గోదావరి ఒడ్డున ఆడుకుంటూ, ఆ చల్లని తల్లి అందాలను, పవిత్రతనూ ఆస్వాదిస్తూ గడచిపోయింది. అందుకేనేమో గోదావరి అంటే నాకు అంత మక్కువ.
తాత గారిల్లు గోదావరి ఒడ్డునే ... మా ఇంటి పై మేడ ఎక్కితే చాలు గోదావరి అలల తళతళలూ, మిలమిలలూ కనువిందుచేస్తూ ఉండేవి. ప్రభాత సమయంలో చేతిలో ఓ పుస్తకంతో గోదావరి గట్టున కూర్చుంటే ఎండ చురుక్కు మనే వరకూ తెలిసేదే కాదు. మిట్టమధ్యాహ్నం గోదావరి గట్టునున్న రావిచెట్టు క్రిందనే మకాం, ఆ ఆకుల గలగలారావాలు, ఆ చెట్టుపైనున్న పక్షుల కిలకిలారావాలు, ఆ అలల తరగలు చేసే జలతరంగిణీ నాదాలూ ... ఆ అలల మీదనుంచి వీచే చల్లని గాలుల ముందు ఇప్పటి ఈ ఏసీలు ఎందుకు పనికొస్తాయ్? ఇక సాయంత్రాలు చెప్పనే అఖ్ఖరలేదు...నా బాల్యానికి ప్రత్యక్ష సాక్షి గోదారమ్మే.
సెలవులు వస్తే చాలు అమ్మమ్మగారింటికి వెళ్ళాలంటే, ముందుగా కాకినాడలో ఉన్న మేనమామగారింటికి వెళ్ళి అక్కడ నుంచి యానాం, ఆ గోదావరి మహా ప్రమాదకరంగా ఉండేదట... అంతా భయపడినా నాకు మాత్రం భయమే తెలియని ఉత్సాహం...
మురమళ్ళ రేవు అనగానే 'సాంబడు ' కళ్ళముందు కదిలాడు. నేను మొట్టమొదటిసారి వాడిని చూసిన తీరు ఈనాటికీ సజీవమే నా జ్ఞాపకాలలో.
నాకు అమ్మమ్మగారింటికి వెళ్ళడమంటే చెప్పలేని ఆనందం, ఒకటి అమ్మమ్మ చేసే గారాబం అయితే రెండోది హద్దుల్లేని స్వేచ్ఛ, ఆడింది ఆట, పాడింది పాటగా గడపడంతో బాటు గోదావరిలో ఈతలు.
***
నేను ఓసారి సెలవులకు వెళ్ళినప్పుడు పడవ ఒడ్డుకు చేరుతోంది అనగా అక్కడ సుమారుగా తన ఈడువాడే ఓ పిల్లాడు డాల్ఫిన్ విన్యాసంలా నీటిలోంచి ఎగిరి ఆ నాణాలు అందుకోవడం ... గట్టుమీదనుంచి గాలిలో గుండ్రంగా తిరుగుతూ డైవ్ చెయ్యడం అద్భుతంలా అనిపించింది. అక్కడ చాలామంది పిల్లలు ఆ ప్రయాణీకులు గోదావరిలో వేసే చిల్లర డబ్బులు ఏరుకోడం ఎప్పుడూ జరిగేదే...
కానీ ఇలా ఓ మహా అద్భుతం సాక్షాత్కరించడం ఇదే మొదలు ... బహుశా నా వయసో, నాకన్నా ఒకటి రెండేళ్ళు పెద్దో అయి ఉంటాడు, ఒంటి మీద గోచీ పాతర తప్ప నూలు పోగు లేదు, ఉంగరాల జుట్టూ, నల్లగా నీటి తడికి నిగనిగ మెరుస్తున్న శరీరం, ముఖం అంతా పరచుకున్న వెన్నల లాంటి నవ్వు , చురుగ్గా కదిలే చిరు చేప పిల్లలాంటి కళ్ళు , తెల్లటి ముత్యాల సరంలాంటి పలువరసా ... ఇది అని చెప్పలేని ఏదో ప్రత్యేకతా, ఆకర్షణా వాడి ముఖంలో ...
దూరంగా వెళ్ళిపోతున్న బల్లకట్టు మీద నిలబడి గోదారిలోకి వలవిసురుతున్న ఓ ముసలతను ఆ కుర్రాడిని కేకేసాడు..." ఒరే సాంబా ..సాల్లే...ఇక రాయెసే .. "
ఆ కేక వింటూనే సంధించిన బాణంలా ఆ నీటిలో సర్రున వాడు దూసుకెళ్ళిన వైనం చూసే తీరాలి... నా పక్కన కూర్చున్న నాన్న మామయ్యని అడుగుతున్నాడు...
"ఎవరా కుర్రాడు? చాకులా ఉన్నాడు, వాడికి గానీ సరైన తర్ఫీదు ఇచ్చి ఈత పోటీలకు పంపితే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయంగా కూడా మనదేశానికి బోలెడన్ని మెడల్స్ తెస్తాడు, మాంఛి చలాకీగా ఉన్నాడు "
"వాడా... సాంబడు, మల్లి గాడి మనవడు.. పాపం తల్లీ, తండ్రీ ఈ మధ్య వచ్చిన వరదల్లో, సుడిలో చిక్కడి .. పోయారు.. వేలడంత లేడు కానీ గోదారి ఈ రేవు నుంచి ఆ రేవుకి ఈదేస్తాడు .. చెప్పడం కాదు బావా, ఆడు ఈదేటప్పుడు చూసి తీరాల్సిందే... " మెచ్చుకోలుగా అన్నాడు.
" అవును చూస్తుంటేనే తెలుస్తోంది .. " నాన్న సాలోచనగా అన్నాడు.
రేవు చేరిన మా కోసం చిన్న మామయ్య గుర్రపు బండ్లు కట్టించడం, నేను చక్రంలో కాలేసి పెద్ద మొగాడిలా ఎక్కబోయి కాలందక క్రింద పడి ఏడుస్తుంటే మామయ్య బండి అతనితో మాట్లాడి నన్ను ముందు కూర్చో బెట్టి గుర్రాన్ని అదిలించే అవకాశం ఇప్పించి నా ఏడుపు మరచిపోయేలా చెయ్యడం తనకు ఇంకా నిన్నో ... మొన్నో జరిగినట్లే ఉంది.
ఆ రోజు సాయంత్రం నాన్న, చిన్న మామయ్యా కలసి గోదావరి గట్టుకు షికారుకు వెడుతూ నన్నూ తీసికెళ్ళారు ... నాన్న అడిగిన మీదట మామయ్య సాంబడినీ, వాళ్ళ తాతనీ అక్కడున్న మస్తానయ్య టీ కొట్టుకి పిలిపించాడు. ఎవరిలోనైనా ఏదైనా ప్రత్యేకత ఉంటే భలేగా కనిపెట్టడం, దానికి చక్కటి ప్రోత్సాహం ఇవ్వడం ఎంతమందికి తెలుసూ? ఆ ప్రత్యేకత నాన్న సొంతం ... ఆయన సాంబడిలో ఉన్న ప్రత్యేకతనీ, నైపుణ్యాన్ని గుర్తించాడు , దానికి తగిన ప్రొత్సాహం ఇవ్వాలనీ, సాంబడిని ఓ మంచి ' స్విమ్మింగ్ ఛాంపియన్ ' గా తీర్చి దిద్దాలనీ అరాటపడ్డాడు.
మేము అక్కడ కూర్చున్న కాసేపటికే సాంబడూ, వాడి తాత మల్లన్న అక్కడకి వచ్చారు, ఇప్పుడు వాడు గోచీతో కాకుండా చక్కగా నిక్కరూ, పువ్వులపువ్వుల చొక్కాతో తీరువుగా ఉన్నాడు.
" దండాలు బాబూ ..." వస్తూనే మల్లన్న మామయ్యకూ, మా నాన్నకూ దండాలు పెట్టాడు.
"ఏటి బాబూ ... పండుగలకి అమ్మమ్మగారింటికి వచ్చేరా? అమ్మగారు బాగున్నారా? " నన్నూ పెద్ద తెలుసున్నవాడిలా ఆప్యాయంగా పలకరించాడు ... అదే పల్లెల్లో ప్రత్యేకత ... మా రాజమండ్రీలో అయితే అలా ఎవరూ తెలియకపోయినా పలకరించరు.
" మల్లన్నా, ఈ అబ్బాయి ..." ఎవరూ అన్నట్లు అడిగారు నాన్నగారు, ఎవరో తెలుసున్నా తన సంభాషణకు నాందిగా ..
" ఈడా బాబూ, నా మనవడు సాంబడు .. ఈడిని నాకప్పగించి ఈడి అమ్మా, బాబూ గోదారి తల్లిలో కలిసిపోనారు .. " డగుత్తికతో అన్నాడు.
" చదివిస్తున్నావా? లేకపోతే నీలా గోదారి మీద గడిపేస్తున్నాడా ? " నాన్నే అడిగాడు.
" మాకు సదువులేటి బాబూ? ఆడూ నానాగే ఆ గోదారిలో సేపలట్టడం , రేవు మీద నావ తిప్పడం నేర్సుకుంటన్నాడు " తేలికగా చెప్పేసాడు.
" చూడు మల్లన్నా .. మీ సాంబడిని నాతో పంపించు, వాడికి చక్కగా చదువు చెప్పించి, ఈతల పోటీల్లో మెలుకువలు నేర్పించి గజ ఈతగాడు అయ్యేలా తర్ఫీదు ఇప్పిస్తా ... వాడికి మంచి పేరు, డబ్బూ అన్నీ వస్తాయి " సూటిగా విషయం చెప్పేసేడు నాన్న.
" మాకు సదువులెందుకు బాబూ , ఏదో ఆ గోదారితల్లి సల్లగా సూత్తే అంతే సాలు ... ఆడిని ఇడసి నేనుండలేనయ్యా . " అయిష్టత వినిపించిందా గొంతులో.
" అది కాదు మల్లన్నా ...ఈ చాలీచాలని బ్రతుకులెందుకు, పిల్లాడిలో మంచి చురుకు, తెలివీ కనబడుతున్నాయి, రాజమండ్రీ ఎంత దూరమనీ, పోనీ నీకు మాత్రం ఇక్కడ ఎవరున్నారింక? అంతగా అయితే వాడితో బాటే నువ్వూ వచ్చేయ్...అక్కడే ఏదో పనీ, పాటా చేసుకు బతికెయ్యచ్చు .." నచ్చచెప్పే ధోరణిలో నాన్న అన్న మాటలకు ...
" లేదు బాబయ్యా .. నేను ఆడిని ఇడిసీ ఉండలేను అట్టాగే నా తల్లి గోదారినీ ఇడసి ఉండలేనయ్యా, మా బతుకులిట్టా ఎల్లి పోవాల్సిందే " మెల్లిగానే చెప్పినా ఖచ్చితంగా ఉన్నాయామాటలు.
" ప్చ్ .. ఏమిటో రోజులెంత మారినా .. మీరు మారరు " చిరుకోపంగా అన్నారు నాన్న.
" ఏదోలే బాబయ్యా .. తమసుంటోరు సల్లగా ఉంటే మాకు లోటేంటి? వస్తాం బాబయ్యా, అమ్మాయిగారిని అడిగానని సెప్పండి " చేతులు జోడించాడు ఇక వెళ్ళివస్తాం అన్నట్లు.
" సరే నీ ఇష్టం కానీ, ఈ సెలవలు పది రోజులూ మా అబ్బాయి ఇక్కడే ఉంటాడు వీడికి కాస్త ఈత నేర్పించమను నీ మనవడిని ..ఏరా నేర్పిస్తావా? " అడిగారు నాన్న.
' నేర్పిస్తా ' అన్నట్లు తలాడించి నా కేసి చూసి చల్లగా నవ్వాడు .. అమాయకంగా ఉన్న ఆ నవ్వు ఎంతో బాగుంది.
ఆ రోజు నుంచీ ఓ చిన్న చెడ్డీతో, నడుముకు టైరు చుట్టుకుని నీళ్ళలో దిగి ఈదడం నేర్చుకోడానికి ఎంతో ప్రయత్నించాను కానీ నాకు అంతంత మాత్రం గానే అబ్బింది..
నేను నేర్చుకోవడం కన్నా నాకు వాడు ఈత కొడితే చూడడమే బాగుండేది..
ఎప్పుడు అమ్మమ్మగారింటికి వెళ్ళినా వాడితో కాసేపు గడపడం నాకు అలవాటయిపోయింది. కాలంతో బాటు దూరం పెరిగిపోయింది నేను పెద్ద చదువుల్లోకి వచ్చాకా అక్కడకు వెళ్ళడమూ తగ్గిపోయింది...
***
నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాకా, ఉద్యోగరీత్యా ఎన్నో రాష్ట్రాలు తిరిగాను. కట్టడాలకన్నా నేను ఆనకట్టలే ఎక్కువగా కట్టాను .. తక్కువ వ్యయంతో ఎక్కువ వినియోగపడేలా నేను కట్టించిన ఆనకట్టలు నాకు డబ్బూ, పేరుప్రతిష్టలూ తెచ్చిపెట్టాయి.. ఒక మంచి ప్రాజెక్ట్ పని మీద హాంగ్ కాంగ్ వెళ్ళిన నేను సుమారు పది సంవత్సరాల తర్వాత నా జన్మభూమి ఇదే రావడం ... ఇన్ని ఏళ్ళలో ఎప్పుడూ కలగని ఒక భావం, అపరాధనా భావం నాకు ఇప్పుడు ఈ ఎడారిలా మారిన గోదారిని చూస్తుంటే కలుగుతోంది ... ఎక్కడో హిమాలయాల్లో పుట్టి మహారాష్ట్రా, తెలంగాణా లలోని ఎన్నో పవిత్ర ప్రదేశాల మీదుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించిన 'అఖండ గోదావరి ' ఇలా ఖండ ఖండాలుగా, ఎక్కడికక్కడ 'ఆనకట్టల ' పేరిట 'స్వార్ధమనే అడ్డుగోడలు కట్టి ' ఆవిరయ్యే పరిస్థితికి కారణం ఎవరు? ఆ కారణాలు ఏమిటి? దేశంలోనే అతిపెద్ద జీవనదిగా పేరొంది, రెండో స్థానం పొందిన అఖండ గోదావరికి పట్టిన ఈ దుర్దశకి ఎవరు కారణభూతులు? ఈ ప్రశ్నలు నన్ను నిలవనీయడం లేదు.
" ఆరి నీ ఇల్లు బంగారం గానూ .. ఇదేమిటిరా ఊళ్ళోకి వచ్చి ఇంటికి రాకుండా ఇంతసేపు ఇక్కడే నిలబడిపోయి ఏం చేస్తున్నావురా? అక్కడ విమానాశ్రయంలో నీ కోసం వెతికి, కనబడక సరే ఇంటికెళ్ళిపోయావనుకుని అక్కడా లేక, బహుశా ఇక్కడే ఉండి ఉంటావనుకుని ఇటొచ్చా .. భలేవాడివిరా నువ్వేం మారలేదు .." అంటూ భుజం మీద పడిన మామయ్య చేతులు నన్ను ఈ లోకంలోకి తెచ్చాయి.
" ఇదేమిటి మామయ్యా ... గోదావరి ఇలా ? " నా గొంతు నాకే పేలవంగా వినిపించింది.
" విజ్ఞానం నాయనా .. ఎక్కువై ఇలా .. సరి సరి రా ఇంటికి పోదాం మీ నాన్న కంగారుపడుతున్నాడు, మంచంలో పడబట్టి కానీ నీ కోసం రెక్కలు కట్టుకు వాలేవాడు కాదూ "అన్నాడు మామయ్య.
నాన్న నా కోసం పాపం ఆత్రంగా చూస్తుంటే నేనెలా, అప్పుడనిపించింది గిల్టీగా కానీ ఆశ్చర్యంగా నాన్న కళ్ళలో ఓ మెరుపూ, ప్రశంసా మామయ్య నా గురించి, అదే నేను రాగానే గోదావరి ఒడ్డుకు వెళ్ళానని చెబుతుంటే ' నువ్వేం మారలేదురా ' అన్నట్లు చూసిన చూపూ.
అందరితో కబుర్లూ కాలక్షేపం అయ్యాకా నాన్నతో అన్నాను " నాన్నా ఓ సారి అమ్మమ్మగారి ఊరు వెళ్ళొస్తా " నాన్న మౌనంగా ఉండిపోయారు .. మామయ్య అన్నాడు " ఇప్పుడు ఎందుకురా విష్ణూ అక్కడ ఎవరున్నారనీ అమ్మమ్మా, తాతయ్యా పోగానే ఇల్లూ, తోటలూ అమ్మేసి ఇదిగో నేనూ ఇక్కడేస్థిరపడి పోయాను., పెద్ద మామయ్య ఎటూ కాకినాడలోనే ఉన్నాడు "
నేను మౌనంగా నాన్న కేసి చూశాను.
" పోనీ వెళ్ళనీ, అక్కడ వాడి చిన్ననాటి నేస్తం, ఆత్మబంధు ఉన్నారు... మామయ్యని తోడు తీసుకెళ్ళు విష్ణూ, ఇప్పుడు నువ్వెరిగిన ఊరు కాదు, దారి కాదు " ఆ మాత్రానికే రొప్పు వచ్చేసింది నాన్నకు.
***
తెల్లవారుఝామునే కారులో బయలుదేరాం, ఇప్పుడు రేవు లేదు, నావా లేదు యానాం వంతెన కట్టారు, కారు ఆపుకుని క్రిందకు చూసిన నాకు కన్నీళ్ళాగలేదు ఇక్కడా మళ్ళీ అదే .. ఇసకపర్రా, రాళ్ళూ, పిచ్చిమొక్కలూ, తుప్పలూ ఏదీ నా గోదావరి? నీళ్ళకోసం వంతెన కట్టారు, వంతెన ఉంది కానీ నీళ్ళే లేవు మామయ్య వద్దంటున్నా వినకుండా కారు వంతెనమీదనుంచి కిందకి తీసి దిగి ఆ ఇసుకపర్రలోంచి పోనిచ్చా ... నావ, పడవల్లో వెళ్ళిన ఆనాటి గోదావరిలో నేడు కారు ప్రయాణం...ప్చ్.
మామయ్య ఎవరికో ఫోన్ చేసాడు, మురమళ్ళ రేవు దగ్గరకు రమ్మని ... కారు అవతలి ఒడ్డు చేరింది నీళ్ళు లేని ఆ గోదారిలోనే .. కారు ఆగీ ఆగకుండా ఒకతను గబగబా అక్కడకి వచ్చేసాడు .. ఎవరు సాంబడిలా ఉన్నాడే? అవును వాడే.. కాయకష్టం చేసిన గుర్తులు అతని శరీరంలో .. కానీ అదే వెన్నెల నవ్వు, ప్రేమ నిండిన కళ్ళూ..
" బాగున్నారా చినబాబూ? ఎప్పుడు రావడం? " ఆప్యాయంగా అడిగాడు.
" బాగున్నా , నువ్వెలా ఉన్నావు? తాత బాగున్నాడా? నువ్వేం పని చేస్తున్నావ్? " అడగలేక అడిగా.
"బాగున్నాం బాబూ... ఇదిగో ఇక్కడ గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ఆ పనుల కాంట్రాక్ట్ ' భూషయ్య గారికి వచ్చింది, నేను ఆరి కమతంలోనే పని చేస్తున్నా కదా అందుకే ఆ పనులన్నీ నా కప్పగించారు " అదోలాంటి నవ్వు వాడి ముఖంలో.
" గోదావరి పుష్కరాలా? అసలు గోదావరేది .. పుష్కరాలు జరపడానికి? " ఆశ్చర్యంగా అడిగా నేను.
" అదంతే బాబూ .. కన్నోళ్ళకి బతికున్నప్పుడు బువ్వెట్టరు కానీ సచ్చాకా కర్మకాండలు మాత్తరం గొప్పగా సేత్తారట .. అట్టాగుంది యవ్వారం గోదారి ఎండిపోయి సుక్క నీరు నేకపోతే ఎవుడూ పట్టించుకోరు కానీ ఇప్పుడు పుస్కరాలట పుస్కరాలు " అదోలా నవ్వాడు వాడు.
ఎక్కడికక్కడ అనుబంధాలు తెంచుకోవడం, ఆత్మీయతలు, పరోపకారం అన్నవి లేకుండా దోచుకోవడం తరతరాలకూ దాచుకోవడమే నేర్చిన వాళ్ళకి ఏది ఎలా పోతేనేం? గోదావరి తల్లి ఇసుక గురించిన అక్కర నీళ్ళ గురించి లేదా? ఎన్నో గ్రామాలకు పచ్చని పైరుల సిరులనందించిన ఆ జీవధార గురించి పట్టించుకునే నాధులే కరువయ్యారా? కోట్ల రూపాయలు పుష్కరాలకు కేటాయించిన దాంట్లో పదోవంతు ఆ తల్లిని సజీవంగా నిలుపుకోడానికి ప్రయత్నించే నిబద్దత నేడు మన పాలకులకు కావాలి.అవునా కాదా ? జవాబు లేని ఆ ప్రశ్నలు నా మనసుని అతలాకుతలం చేస్తుంటే అలాగే సాంబడి ముఖంలోకి చూస్తూండిపోయాను.
" పోనీలేకానీ బాబూ, తాత మీరొస్తారని తెలిసినప్పటి నుంచీ ఓ తెగ ఎదురుసూత్తన్నాడు .. ఆడు నెగనేడు, మీరేటనుకోకపోతే ... " మొహమాటంగా అన్నాడు వాడు.
"భలే వాడివే మిమ్మల్ని చూడడానికే వాడు వస్త, లేకపోతే మాకిక్కడ ఎవరున్నారనీ? రా, కారెక్కు" మామయ్య అన్నాడు వాడితో.
వాడి ముఖం ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయింది. దారిపొడవునా ఏదో చెబుతూనే వున్నాడు నా కళ్ళముందు మాత్రం నిండు గోదావరిలో ' డాల్ఫిన్స్ లాగా విన్యాసం ' చేస్తున్న చిన్న్నాటి సాంబడే మెదులుతున్నాడు.
పూర్వపు గుడిసె స్థానంలో చిన్న డాబా ఇల్లు. లోపలికి వెళ్ళాం... మల్లన్న తాత ఎముకల గూడులా ఉన్నాడు .. నన్ను గుర్తుపట్టలేదు కానీ, ఫలానా అని చెప్పగానే ఆదరంతో నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నెమరువేసాడు.
" చినబాబూ అప్పుడు మీ నాన్నగోరు సాంబడిని సదివిత్తాననీ , పెద్ద ఈతగాడ్ని సేత్తాననీ అంటే మతిమాలినోడిని కాదన్నాను, ఆ గోదారి తల్లే మమ్మల్ని సల్లగా చూత్తదన్నాను, ఇప్పుడు సూడు ఆ తల్లి అన్నేయం సేసింది, ఈడు కూలిపనికి పోవాల్సిన కర్మ పట్టింది, బాబుగారి మాటే ఇనుంటే ఇలాగయ్యేదా? " ఒక్కో మాట కూడబలుక్కుంటూ అన్నాడు.
" ఎహే ..ఊరుకో తాతా .. ఎప్పుడూ అదే రందా? మనుషులు ఎండగడితే పాపం ఆ తల్లేం సేస్తదీ? "
చదువులేకపోయినా వాడిలో ఎంత లోకజ్ఞానం ... అంతే, ‘గోదారి సాక్షిగా ఆ తప్పెవరిదీ?’ ఆ ప్రశ్న నా మనసుని దొలుస్తూనే ఉంది.
***
No comments:
Post a Comment