బాపురమణల సీతారాముడు - అచ్చంగా తెలుగు

బాపురమణల సీతారాముడు

Share This

బాపురమణల సీతారాముడు 

పరిచయం : భావరాజు పద్మిని


అందాలరాముడు సినిమా కాన్సెప్ట్ ఆయనదే ! ఆ సినిమాకోసం చక్కటి బోటు ను అలంకరించి, అందులోని వివిధ పాత్రలను సృష్టించారు ఆయన. 19 సినిమాలకు బాపు రమణలకు వెన్నుదన్నుగా నిలిచిన బాపురమణ గార్ల బాల్యస్నేహితుడు – రమణ గారు ‘సీతారాముడు’ అంటూ చనువుగా పిలుచుకునే బి.వి.ఎస్.రామారావు గారు.
వృత్తి రీత్యా ఇంజనీర్ అయినా, ప్రవృత్తి రీత్యా రచయత, మంచి కళాదృష్టి ఉన్నవారు. గోదావరీ తీర ప్రాంతంలో వారు చేసిన సేవలకు ఈ మధ్యనే తూర్పు గోదావరికి చెందిన ‘ బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్ట్ వారు’ వారిని ఘనంగా సత్కరించారు. ఈ ‘గోదావరి ప్రత్యేక సంచిక’ సందర్భంగా వారితో భావరాజు పద్మిని జరిపిన ముఖాముఖి... ప్రత్యేకించి మీ కోసం...

మీ గురించి చెబుతారా ?
మా నాన్నగారు ప్రముఖ ఇంజనీర్ ‘రావు సాహెబ్’ భావరాజు సత్యనారాయణ గారు, అమ్మ సత్యవతి గారు. నా పూర్తి పేరు భావరాజు వేంకట సీతారామారావు. నేను రాజమండ్రి లో 1932 లో జన్మించాను. మా నాన్నగారి ఆరాధ్య దైవమైన భద్రాచలం రాములవారి పేరే నాకు పెట్టుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాకా నీటిపారుదల శాఖలో ఇంజనీర్ గా చేరాను.

గోదావరి ప్రాజెక్ట్ లో మీరు ఎన్నాళ్ళు పనిచేసారు ?
నేను మెకానికల్ ఇంజనీరింగ్ , సివిల్ లో గ్రాడ్యుయేషన్  లు రెండూ చేసాను. కాబట్టి, రెండు విభాగాల్లోనూ పనిచేసాను.  దాదాపు 15 ఏళ్ళు నేను అక్కడ పనిచేసాను. అక్కడ జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ , ఎక్షిక్యూటివ్ ఇంజనీర్ పనిచేసాను. అన్ని పనులూ గోదావరికి సంబంధించినవే ! ఆనకట్ట రిపైర్లు, కొత్త ఆనకట్టల నిర్మాణం, బారేజుల నిర్మాణంలో పనిచేసాను.
అనేక వర్క్ షాప్ లు నిర్వహించాను. దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డాం లు అన్నింటికీ, హైదరాబాద్ వర్క్ షాప్, ధవళేశ్వరం వర్క్ షాప్ ఛీఫ్ గా హైడ్రాలిక్ గేట్స్ మనుఫాక్చెర్ చేసాను. నా సేవలకు గానూ 1958, 1961, 1970, 1982, 1987 సం. లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్నాను.

గోదావరి ప్రాజెక్ట్ తర్వాత మీరు వేరెక్కడ పనిచేసారు ?
తర్వాత నేను హైదరాబాద్ కు బదిలీ అయ్యి వచ్చాను. ఇక్కడ 4 ఏళ్ళు పనిచేసి, తర్వాత రిటైర్ అయ్యాను. ఆ తర్వాత రోజునే NCL లో చేరాను. దాదాపు 25 ఏళ్ళనుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. MD నాకు మంచి మిత్రుడు. ఆయన నాకు బాపురమణ ల సినిమాల పని ఉన్నప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళండి, అని నాకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. అందుకే, ఇప్పటికీ వారితోనే పనిచేస్తున్నాను.

గోదావరితో మీకు అనుబంధం ఎలా కలిగింది ?
గోదారమ్మ ఒడిలోనే జన్మించా. అక్కడే ఉద్యోగం చేసాను. గోదావరి తీరాన రూపుదిద్దుకున్న నా ప్రాణమిత్రులు బాపు,
రమణ ల సినిమాలకు నావంతు అన్నివిధాలా సహాయసహకారాలు అందించాను. 4 ఏళ్ళు పోచంపాడులో పని చేసాను. అక్కడా గోదావరి ఉంది. అక్కడా పోచంపాడు డాం వద్ద పనిచేసాను. ఇక 15 ఏళ్ళు అక్కడి మనుషులు, మనస్తత్వాలను చూడడం వల్ల గోదావరిపై నా భావాలకు ‘గోదావరి కధలు’ గా అక్షర రూపం ఇచ్చే అవకాశం కలిగింది. ఆ పుస్తకంలోని ఒక కధనే మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదావరి’ సినిమాలో వాడుకున్నారు.

సాహిత్యం వైపు ఆసక్తి ఎలా కలిగింది ?
బాపు, రమణ గార్లు ఏదో కధ రాయమంటే రాసాను. అలా నా రచనా ప్రస్థానం మొదలయ్యింది. కొన్ని కధలు రాసాను. తర్వాత గోదావరి కధల ఆవిర్భావానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు కారణం. ఆయన ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉండగా, కధ ఎప్పుడిస్తావ్, ఎప్పుడిస్తావ్ అంటూ వెంట పడేవారు. ఇదిగో, నేను స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను, అందులో నీ కధ రావాలి, అనేవారు. తర్వాత నా కధను కవర్ పేజి మీద హైలైట్ చేసేవారు. కధకు బొమ్మలు బాపు గారు  వేసేవారు.

బాపురమణ గార్లతో మీరు పనిచేసిన సినిమాల గురించి చెప్పండి.
మద్రాసు లోని కేసరి స్కూల్ లో చదివే రోజుల్లో నాకు రమణతో స్నేహం కుదిరింది. అది ప్రాణస్నేహంగా మారింది. అలా బాపు కూడా నా మిత్రుడయ్యాడు. నేను బాపురమణ లతో కలిసి, 19 సినిమాలకు అనధికార ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసాను. అందులో 9 సినిమాలకు నేను కధలో కూడా ఇన్వోల్వ్ అయ్యాను. ఉదాహరణకు అందాల రాముడు కాన్సెప్ట్, అందులోని పాత్రలు అన్నీ నేను సృష్టించినవే ! సాక్షి, బుద్ధిమంతుడు, బంగారు పిచ్చుక, అందాలరాముడు వంటి సినిమాలకు పనిచేసాను.
సినిమాల్లో సహజత్వం కోసం నేను గ్రామంలోకి వెళ్లి, పాత ద్వారబంధాలు, గుమ్మాలు, గడపలు కొనేవాడిని. పైకప్పు మీద చితికి ఉన్న పాత తాటాకులు, నాచు పట్టిన పాత పెంకులు, తాటి దూలాలు, వాసాలు జాగ్రత్తగా తెచ్చి, వాటి బదులు వాళ్లకు కొత్తవి చేయించి ఇచ్చేవాడిని. ఈ సంగతులన్నీ రమణ తన స్వీయ చరిత్ర ‘కోతి కొమ్మచ్చి’ లో రాసాడు.

సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడి పేరిట 2014 నవంబర్ లో మీరు గోదావరి పురస్కారం పొందినప్పుడు మీ అనుభూతిని చెప్పండి.
వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. గోదావరి మీద పంట్లు కట్టించి, ఒకటి రెండు కోట్లు ఖర్చు చేసి, చాలా ఘనమైన ఏర్పాట్లు చేసారు. గంగానదికి జరిగినట్టే, గోదావరికీ 2,3 రోజులు వైభవంగా అనేకరకాల హారతులు ఇచ్చారు. చూసేవారికి రెండు  చివరి రోజున ముగ్గురిని ఘనంగా సన్మానించారు. కాటన్ మహాశయుడి పేరిట అవార్డును అందుకోవడం ఒకెత్తు అయితే, వీరు ఉత్సవాలను అతిగొప్పగా నిర్వహించి, బహుమతిని అందించిన తీరు మరోకెత్తు. బ్రిటిష్ హై కమీషనర్ ఆండ్రూ నన్ను సత్కరించగా,
మురళీమోహన్ నగదు బహుమతిని, మండలి బుద్ధ ప్రసాద్ అభినందన పత్రాన్ని అందించారు. ఇది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అవార్డు.  ట్రస్ట్ నిర్వాహకులకు ఎన్ని కృతఙ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది.
తన తండ్రి భావరాజు సత్యనారాయణ గారి వారసత్వాన్ని నిలబెడుతూ గొప్ప ఇంజనీర్ గా ఖ్యాతి గడించిన రామారావు గారికి సతీమణి అన్నపూర్ణ గారు అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలిచారు. వీరికి ఇద్దరు కుమార్తెలు – విజయ, సత్యకళ, వారూ వివాహితులై హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. ఈయనకు సోదరులు 11 మంది, 4 గురు సోదరీమణులు ఉన్నారు. ఇందులో రచయత రమణారావు గారు, కార్టూనిస్ట్ సత్యమూర్తి గారు, మెజీషియన్ బి.వి.పట్టాభిరాం గారు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. తన విశ్రాంత జీవితాన్ని సాహిత్యానికి, సేవకు అంకితం చేసిన వీరి జీవితం ఎందరికో ఆదర్శనీయం !

1 comment:

Pages