శ్రీదక్షారామ భీమేశ్వర శతకము
ఆచార్య వి.ఎల్.ఎస్ భీమశంకరం
పరిచయం - దేవరకొండ సుబ్రహ్మణ్యం
శ్రీదక్షారామ భీమేశ్వర శతక కర్త ఆచార్య వి.ఎల్.ఎస్ భీమశంకరం గారు (వేము లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్య భీమశంకరం) నవంబరు 16 , 1931 న జన్మించారు. శ్రీవ్యాసమూర్తి, లక్ష్మీకాంత గారలు వీరి జననీజనకులు. వీరు 20 సంవత్సరము నిండక మునుపే ఆంధ్రా విశ్వవిద్యాలయము నుండి భూభౌతికశాస్త్రంలో M.Sc పట్టాను తదుపరి D.Sc పట్టాను పొందారు. చిన్ననాటి నుండి కుశాగ్రబుద్ధియైన వీరు, వారు ఎంచుకొన్న భూభౌతిక శాస్త్రంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. దేశవిదేశాలలో అనేక విద్యాసంస్థలలో వీరు అనేకమంది విద్యార్ధులకు విద్యాదానం చేసారు. 1957-58 లో జర్మనీ దేశంలో, 1962-63లో లండన్లో నోబెల్ లారియెట్ లార్డ్ బ్లాకెట్ట్ గారివద్ద పరిశోధనలు జరిపారు. 35 సంవత్సరాల వయసులోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఎన్నికయ్యి, భూభౌతికశాస్త్ర విభాగానికి, భూభౌతిక కేంద్రానికి కూడా అధిపతులుగా వ్యవహరించారు. ఆంధ్రపదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధినేతగా (1987-89), ఉస్మానియా విశ్వవిద్యాల సైన్స్ విభాగానికి డీన్ గా (1989-91), CSIR, UGC, Scientist గా (1991-96) వ్యవహరించారు.
వీరు 5 విజ్ఞానశాస్త్ర గ్రంథాలు, 100కు పైగా శాస్త్ర వ్యాసాలు ప్రచురించారు. అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఉపన్యసించి తమ విజ్ఞానాన్ని పంచుకొన్నారు. 20 మందికిపైగా శాస్త్రవేత్తలు వీరి మార్గదర్శనంలో Ph.D పట్టాలను అందుకున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే వీరు విజయపరంపరకు అంతులేదు. వీరివద్ద విద్యాభిక్షను పొందిన అదృష్టవంతులలో నేనుకూడా ఒకడిని. 1979-82 సంవత్సరాలలో భూభౌతిక విభాగంలో నేను చదువుకున్నప్పుడు వీరు చూపిన మార్గదర్శకం మరపురానిది. అంతేకాక నాకు ఉద్యోగ విషయంలో వీరుచూపిన మార్గనిర్దేశమే ఈ రోజు నన్ను ఈ స్థానంలో నిలిపింది అనటంలో ఏమాత్రం సందేహంలేదు.
వీరు పదవివిరమణ తరువార సుమారు 65సంవత్సరాల వయసులో తెలుగుపద్య రచనపై ఆసక్తితో "రసస్రువు" అనే చంపూకావ్యాన్ని (1998) "శివానంద మందహాసం" అనే చిత్రబంధ (వారి మాటల్లో చెప్పాలంటే "సర్వ "ల"కార ప్రాస అంత్య ప్రాసాలంకృత సీసమాలికా బంధ చతుస్సహస్ర సంఖ్యా ద్విపద కావ్యం") ద్విపదకావ్యాన్ని (2004) "దక్షారామ భీమేశ్వర శతకా"న్నీ (2006) "శ్రీరామ! నీనామమేమిరుచిర!" అనే సాంఘీకపద్యకావ్యాన్ని రచించారు.
శతకపరిచయం:
గోదావరీ పరివాహకప్రాంతంలో దక్షారామంలో వెలసిన భీమేశ్వరునిపై "దక్షారామ భీమేశ్వరా" అనే మకుటంతో శార్ధుల, మత్తేభ వృత్తాలలో రచించించబడినది. భక్తిరస ప్రధానమైన శతకం. 2006 సంవత్సరంలో శ్రీపొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పద్మభూషణ్ ఆచార్య సి. నారాయణరెడ్డిగారిచే ఆవిష్కరించబడి, అనేక విద్వాంసులచే, కవిలచే ప్రశంసలందుకొన్నది. ఈకాలంలో అత్యంత ప్రజాదరణపొంది, అనేక ప్రముఖ పత్రికలలో సమీక్షలు వెలువడ్డాయి. క్లిష్ట తెలుగు సమాసప్రయోగాలతోపాటుగా కొన్నిచోట్ల సరళమైన భాషాప్రయోగం, మరికొన్నిచోట్ల అంగ్లభాషా పదప్రయోగాలను మనం ఈశతకంలో గమనించవచ్చు. శతక నియమాలను అనుసరిస్తూ ఈ శతకంలో మకుటనియమం, రసనియమం, వృత్త/చంధోనియమం పాటించబడ్డాయి. శతకాన్ని పదిభాగాలుగా విభజించినారు. 1. భీమేశ్వర ప్రార్థన, 2. ఈశ్వర ప్రశస్తి, 3. ఆత్మ నివేదన, 4. శరణాగతి, 5. ఈశ్వర భక్తపరాధీనత, 6. మూర్ఖమానవులు, 7. జ్యోతిర్లింగదర్శనం, 8. మహాశక్తికి కైమోడ్పులు, 9. అపలాప స్తుతి, 10. ముగింపు.
భీమేశ్వరస్తుతి విభాగము నుండి ఈ చక్కని పద్యాలను చూడండి.
శా. శ్రీకాలేశ్వర, మల్లికార్జునులతో శ్రీమీఱ చెన్నొంది హే
వాక ప్రౌఢిమ నాంధ్రదేశమున మువ్వంకల్ త్రిలింగంబులై
వీకన్ పొల్చితి - తెల్గు వారికొక నీవృత్తున్ నిరూపించినా
వైకాత్మ్యంబు ఘటింప సంస్కృతికి - దక్షారామ భీమేశ్వరా!
(శ్రీకాళేశ్వరమునందున(తెలంగాణా) , శ్రీశైలమునందున (రాయలసీమ), ద్రాక్షారామమందున పరమశివుడు తెలుగు సంస్కృతికి ఏకాత్మతభావామ్మి సంతర్రించేవిధంగా త్రిలింగదేశమనే పేరు సార్ధకమయేట్లుగా కాలేశ్వర, మల్లికార్జున, భీమేశ్వరనామలతో వెలినాడు అని భావము)
శా. ఆకారంబులు లేని వాడవట, ఆద్యంతం లేదంత, ప్ర
త్యేకంబై ఒక పేరు కల్గదట, రక్తిన్ సర్వ భూతంబులం
దైకాత్మ్యంబుగ దాగి యుందువట, మా యందర్లుతో భీమలిం
గాకారంబున పొల్చినాడవట! దక్షారామ భీమేశ్వరా!
(అర్థం సులభము)
మ. అమరారామము, సోమతీర్థము, కుమారారామమున్, క్షీర లిం
గ మహాక్షేత్రము, భీమశంకరుని దక్ష క్షేత్ర మీ యైదునున్
సమవేతంబుగ పృథ్విపై వెలయు పంచారామ తీర్థంబు లిం
దమృత ప్రాప్తము భీమలింగ మట! దక్షారామ భీమేశ్వరా!
ఈ శతకములోని మరిన్ని పద్యాలను చూద్దాం
శా. వామాంకంబున గౌరి, మస్తకమున బాలేందు బింబంబుతో
శ్రీమందాకిని, ప్రక్కలందున మహాసేనుండు, విఘ్నేశుడున్,
సామీప్యంబున నంది, పార్షదులతో సమ్రాట్టువై యొప్పు ఓ
స్వామీ, నిన్ గను జన్మ సార్ధకము - దక్షారామ భీమేశ్వరా!
(ఈశ్వరప్రశస్తి విభాగము నుండి)
శా. భూతత్వంబును తెల్పు శాస్త్రమగు ఆ భూభౌతికం బందు నే
ఖ్యాతిన్ బొందితి, శాస్త్రశోధన పురస్కారంబులన్ గొంటి, సం
ప్రీతిన్ నేర్పితి శాస్త్ర సూక్షముల నా విధ్యార్థి లోకంబుకున్,
ఆ తోషంబది చాలునయ్య శివ! దక్షారామ భీమేశ్వరా!
(ఆత్మనివేదన నుండి)
మ. అకటా! పిల్లల పొందబోక మది చింతాక్రాంతులై దిక్కు తో
చక నా తల్లియు తండ్రియున్ కుమిలి పూజల్ సేయ నిన్నెంచి, తా
వక కారుణ్యము మూలమై కలిగితిన్ వర్ధిష్ణువై, కాన నా
సకలంబున్ భవదీయమే యగును - దక్షారామ భీమేశ్వరా!
(శరణాగతి నుండి)
శా. "కార్లం"గోర, విమానయాన మడుగన్, కాంక్షింప నే స్తీల వా
తెఱ్లందించెడు మాధ్వి, ఇచ్చగొన నే తీపారు భోగంబులన్,
బోర్ల సాగిలి భక్తితో తన పదాంభోజంబులన్ మ్రొక్కి నీ
అర్లుంగోరితి నిమ్ము పొమ్మనక - దక్షారామ భీమేశ్వరా!
(శరణాగతి నుండి)
మ. తలుపన్ నీకహితుల్ హితుల్ గలరె! సద్ధర్మవ్రతుల్ నీకు మి
త్రులు, భక్తిన్ నిను గొల్చు వారలు జుమీ రూఢైన చుట్టాలు, వా
రల తల్లిన్ వలె రక్ష సేయుదువు - మర్కండేయ మౌనింద్రుడే
అలరున్ చక్కని సాక్షిగా భువిని - దక్షారామ భీమేశ్వరా!
(ఈశ్వరభక్తి పరాధీనత)
ఇటువంటి అమూల్యమైన పద్యరత్నాలతో అలరారే ఈశతకం ప్రతిఒక్కరూ చదివి ఆనందించవలసినదే. మీరు చదవండి ప్రతిఒక్కరిచే చదివించండి.
(ప్రతులకు సంప్రదించవలసిన చిరునామా
వి.ఎల్.ఎస్. విజ్ఞాన, సారస్వత పీఠము
తార్నాకా హౌస్, 12-13-75, 4 వ వీధి
తార్నాక, హైదరాబాదు - 500 017
ఫోను (040) -27018500
సెల్: 9849563500)
No comments:
Post a Comment