గల గలా గోదారి కదలిపోతుంటేను - అచ్చంగా తెలుగు

గల గలా గోదారి కదలిపోతుంటేను

Share This

గల గలా గోదారి కదలిపోతుంటేను

- అక్కిరాజు ప్రసాద్ 


గోదావరి...పేరు వింటేనే శంకరంబాడి సుందరాచారి గారి మా తెలుగు తల్లికి మల్లె పూదండ గుర్తుకు వస్తుంది. గల గలా గోదారి కదలిపోతుంటేను అని ఆయన రాసిన గీతం ఆంధ్రజాతిలో ప్రతినోట పలికింది.
పశ్చిమ కనుమలలో నాసిక్-త్రయంబకేశ్వర్ వద్ద జన్మించిన తల్లి వడి వడిగా అడుగులేస్తూ పాపికొండల వద్ద ఉద్ధృతంగా ప్రవహించి గౌతమి, వశిష్టలుగా చీలి, ఎన్నో పాయలుగా కలుస్తుంది. అంతర్వేది గోదావరి మాతకు ప్రముఖ సాగర సంగమ క్షేత్రం. అన్నా చెళ్లెళ్ల గట్టు అనబడే అంతర్వేది లక్ష్మీనృసింహుని సన్నిధి సమీపాన అమ్మ సాగరుడి హృదయాన ఒదిగిపోతుంది.
ఈ యానంలో ఎన్ని మలుపులు? ఎన్ని వలపులు? అమ్మ మనసు విప్పారి తరంగాల ఝరిగా మారిన ప్రతి చోట ఒక దివ్య క్షేత్రమే. జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వరుడు ఈ గోదావరి మాత నీటితో అభిషిక్తుడే. అది మొదలు అడుగడుగునా పుణ్యక్షేత్రాలే. దక్షిణవాహినిగా గోదావరి మాత ఈ మరాఠా-ఆంధ్ర ప్రాంతాలను పునీతం చేస్తోంది.
జీవనదులు సంస్కృతి మరియు నాగరికతకు పుట్టిళ్లు. ఇది మన తెలుగు జాతిలో అణువణువున ప్రతిబింబిస్తుంది. రేవుల ద్వారా వాణిజ్యం పెరిగి నాగరికత పరిఢవిల్లితే సామ్రాజ్యాలు నదుల ఒడ్డున వికసించి ప్రజ్జ్వలించాయి. ఈ అనంతమైన కాలగమనంలో నదులు వీటికి సాక్ష్యాలు. గోదావరి దీనికి అద్భుతమైన ఉదాహరణ. నీటితో పచ్చని పొలాలు కోనసీమను ఏర్పరిస్తే, ధర్మ పరాయణులైన రాజులు దివ్యధామాలను నిర్మించారు. స్వయంగా శ్రీరామచంద్రుడే గోదావరి ఒడ్డున పర్ణశాలలో నివసించి మనకు మార్గదర్శకుడైనాడు.  చాళుక్యులు, రెడ్డి రాజులు, గజపతులు ఈ నదుల ఒడ్డున క్షేత్రాలను వృద్ధి చేశారు.
గౌతమీ గంగ, త్ర్యంబక తనూజ, త్ర్యంబకాచల కన్యక, దక్షిణ గంగగా ప్రసిద్ధినొందిన ఈ గోదావరి నది గురించి బ్రహ్మ పురాణంలో వివరించబడినది. గౌతమ ముని లోక కల్యాణానికై ప్రజల పాప ప్రక్షాళనకై దివిజ గంగలో భాగాన్ని ఈ ప్రాంతంలో ప్రవహింపజేయాలని శివుని ప్రార్థిస్తాడు. శివుని అతని తపస్సుకు మెచ్చి గంగను త్ర్యంబకేశ్వర ప్రాంతంలో ప్రవహింపజేస్తాడు. గౌతమముని ఆ నీటితో త్ర్యంబకేశ్వరునికి అభిషేకం చేస్తాడు. అప్పటినుండి ఈ గోదావరి సర్వపాప ప్రనాశినిగా వర్ధిల్లుతోంది. ఈశ్వరుని అనుగ్రహంతో  గౌతముని తపోబలంతో అనేక తీర్థాలు ఈ నదీ పరీవాహక ప్రాంతంలో ఏర్పడ్డాయి. వీటి గురించి బ్రహ్మ నారదునికి బ్రహ్మపురాణం ద్వారా వివరించాడు.
ఇక పుణ్యక్షేత్రాల విషయానికి వస్తే,..మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిది అదిలాబాద్ జిల్లాలోని వాసర. సరస్వతీ అమ్మవారి క్షేత్రం అత్యంత మహిమాన్వితమై, విద్యారంభ కార్యక్రమాలకు, వేదవేదాంత జ్ఞాన లబ్ధికి ఆలవాలమై ఉన్నది. అటుపిమ్మట కరీం నగర్ జిల్లాలోని కాళేశ్వరం వద్ద ప్రాణహితను కలుపుకుని ముక్తేశ్వరుని దివ్యక్షేత్రానికి సాక్షీభూతమైనది. తరువాత అదే జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నృసింహుని క్షేత్రం. ఇక్కడ నది ఉత్తరమునుండి దక్షిణ దిశగా పారుతుంది. ధర్మపురి శేషప్ప కవి రచించిన అద్భుతమైన నరసింహ శతకం ఈ క్షేత్ర దేవతపైనే.
అటునుండి శబరి నదిని కలుపుకుంటూ పాపికొండల రమణీయ యానం భద్రాద్రి వద్ద మొదలిడుతుంది. భద్రగిరిపై వెలసిన సీతారాములకు ఒక దేవస్థానం ఏర్పరచిన మహనీయుడు కంచెర్ల గోపన్న. తన ఆధ్యాత్మిక సంకీర్తనలతో రామదాసుగా పేరొందిన ఈ వాగ్గేయకారుడు ఈ సీతారామలక్ష్మణుల పాదస్పర్శతో పునీతమైన క్షేత్రమాన్ని అద్భుతంగా అభివృద్ధి చెందేలా చేశారు. పర్ణశాలకు, భద్రాద్రి ధామానికి,పాపికొండల    సౌందర్యానికి గోదావరి మాత మరియు ఆమె తనయలు తమ దివ్యశక్తిని అందిస్తూనే ఉన్నాయి. పాపికొండలనుండి గోదారమ్మ పరిగిడుతూ పట్టిసీమ చేరి అక్కడ నది మధ్య గల వీరేశ్వరుని ఆలయాన్ని పునీతం చేస్తుంది. రాజమండ్రి వద్ద గౌతమి, వశిష్ఠ గోదావరులుగా చీలుతుంది. అటు తర్వాత వశిష్ఠ గోదావరీ తీరాన కోటిపల్లి దివ్యక్షేత్రం. కోటిపల్లి దిగువున వశిష్ఠ అంతర్వేది వద్ద సాగరంలో సంగమిస్తుంది. అలాగే, గౌతమీ గోదావరి పుదుచ్చేరిలోని యానం వద్ద సాగరంలో కలుస్తుంది. ఈ వశిష్ఠ, గౌతమీ గోదావరీ పాయల మధ్య కోనసీమ అందాలను మనకు అందిస్తుంది గోదావరీ మాత.
త్ర్యంబకేశ్వరం మొదలు సాగర సంగమం వరకూ హొయలొలికిస్తూ సాగే ఈ గోదావరి ఉరుకులు తెలుగుజాతి ఆధ్యాత్మిక సంపదకు, అపురూపమైన  పాడిపంటలకు, సస్యశ్యామలమైన భూమికి, ప్రకృతి సౌందర్యానికి కారకమై ఈ కర్మభూమిలో ఒక అద్భుతమైన సీమను సృష్టించింది.
గోదావరి పుష్కరాలు మన్మథనామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి 14-7-2015 నాడు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగా ఆరంభమవుతున్నాయి. ఈ పుష్కరాద్యము 25-7-2015 వరకు. ఈ సమయంలో సమస్త దేవతలు, సిద్ధులు, పితృదేవతలు ఈ నదిలో నివసిస్తారు కాబట్టి పుష్కర స్నానం, గోదావరి పూజ, పితృదేవతలకు పిండ ప్రదానం, తర్పణాలు విడుచుట బహు పుణ్యప్రదం. గోదావరి అంత్య పుష్కరాలు 31-7-2016 నుండి 11-8-2016 వరకు.

No comments:

Post a Comment

Pages