‘గోదావరి మాత’ - అచ్చంగా తెలుగు

‘గోదావరి మాత’

Share This

‘గోదావరి మాత’

 శ్రీమతి సుజాత తిమ్మన


అర్థ దేహమిచ్చిన పతి సవతిని (గంగను)

తెచ్చి తలమీద పెట్టుకున్నాడన్న అక్కసుతో...

పరమేశ్వరుని శిరసు నుండి ఆమెను భూలోకానికి

పంపేయాలన్న తలంపుతో, తనయులతో కలసి గౌరి

ఆడిన కుటిల నాటకమే మూలమైనది  గోదారమ్మ అవతరణకు!

శివుని సిగపాయల నుండి అలవోకగా జారి,

గౌతమ ముని వెంట ఆకాశ దేశము నుండి

పవిత్ర తపోభూమి యైన ‘బ్రహ్మగిరి’ని చేరి,

విగత గోమాతకు ప్రాణమొసగి,

త్ర్యంబకేశ్వర లింగాన్ని మనసారా కౌగలించుకొని,

జ్ఞానసరస్వతీదేవిని ముచ్చట తీరా పలుకరిస్తూ...

పాపికొండల నడుమ పరువాల ఒయ్యారాలు పోతూ...

సౌందర్యారాధకుల గుండెలు (కో)దోస్తూ...

భద్రాద్రి రాముని పాదాల చేరి భక్తిగా అలల తలలు వంచి మ్రొక్కి,

ఆ మహద్భాగ్యాన్ని దాచుకొని తల్లి గోదావరి...

అమందానందముతో రాజమహేంద్రవరం పరిసరాల

పరవళ్ళ ఒరవళ్ళ రత్నాకరుని చేరు సంబరాన

ఏడుపాయలుగా చీలి, సప్త ఋషుల నామాలను అలంకరించుకొని

శివకేశవ ఆలయ సముదాయాల పుణ్యఫలాన్ని తనలో ఇముడ్చుకొని,

‘తల్లీ మమ్ము కాపాడుమంటూ...’ తనలో  మూడు మునకలేసిన చాలు,

ఆ పుణ్యఫలాన్ని జనులకూ పంచుతూ వారి పాపాలను తనలో కలుపుకుంటూ...

అదే చిరుగలల రావాలతో, అవే సోయగాల సిరులను మోసుకుంటూ...

సముద్రునికి అంకితమౌతూ, అతనిలోనే లీనమౌతుంది,

పరమపావని ‘గోదావరి మాత!’

***

No comments:

Post a Comment

Pages