గోదావరీ నమోనమః
డా.బల్లూరి ఉమాదేవి
" గో "వుకు సద్గతి యొసగంగ "దా " క్షిణ్య భావాన గౌతముల కోర్కెపై "వ " డివడిగా పరవళ్ళు తొక్కుతూ తెలుగు వా "రి " గుండెల్లో ఒదిగి కథల్లో కావ్యాల్లో " న " వలల్లో మాటల్లో పాటల్లో ప " ది " లంగా స్థిరపడ్డ గౌతమీ గంగా నమోనమః.
"ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశానూ " అన్నట్టుగా ఈ నదీమతల్లి మహరాష్ట్రలోనిత్రయంబకేశ్వర్ వద్ద నాసిక్ లో పుట్టి తెలంగాణా ఆంధ్ర రాష్ట్రాలలో పయనించి తూర్పు బంగాళాఖాతంలో సంగమిస్తుంది.ఈ గోదావరి పుట్టుకను గురించి ఓ ఐతిహ్యముంది. కృతయుగంలో భగవంతుడు వామనుడిగా వచ్చి త్రివిక్రమావతారుడై బలిచక్రవర్తిని నిగ్రహించడానికి అవతరిస్తాడు. వరం కోరమన్న బలిని మూడడుగుల నేలను కోరతాడు.మొదటి అడుగుతో స్వర్గాన్ని రెండో అడుగుతో భూమిని కొలిచి మూడో అడుగు బలి తలపై నుంచి అతనిని పాతాళానికి తొక్కేస్తాడు. సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికి శ్రీహరి పాదం తప్ప భూమి కనిపించకపోవడంతో తన కమండలంలోని నీటిలో అన్ని నదులను ఆవాహన చేసి ఆ నీటితో విష్ణుపాదాన్ని అభిషేకిస్తాడు.అందుకే వాగ్గేయకారులు "బ్రహ్మ కడిగిన పాదమని" స్తుతించారు. విష్ణు పాదోద్భవగా గంగానది ప్రసిద్ధి చెందింది.అలా శ్రీహరి పాదాలనుండి పుట్టి ఉరవళ్ళతో పరుగులు తీస్తూ వస్తున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. ఆ తరువాత శాపగ్రస్తులైన సగరరాజు పుత్రులు అరవైవేలమందికి సద్గతి కల్గించడానికై భగీరథుడు తపస్సు చేసి శివుని మెప్పించి గంగను భూమికి తెస్తాడు. ఇది ఉత్తర భారతదేశంలో ఆతి పవిత్రకరమైన పుణ్యనదిగా "హరి(కి )ద్వారంగా "ప్రవహిస్తూ ప్రజలను పునీతులను చేస్తుంది. ఇదేగంగను గౌతమ మహర్షి గోహత్యాపాతక నివృత్తి కోసం మరోసారి భూమికి తెస్తాడు.అది 'దక్షణ గంగ' గా 'గోదావరి' 'గౌతమి' అనే పేర్లతో ప్రవహిస్తూ దేశాన్ని సస్యశ్యామలం చేస్తూవుంది. ఆ ఐతిహ్యం ఇలావుంది. పూర్వం ఒకానొకప్పుడు దేశంలో అనావృష్టి వల్ల కరువేర్పడి తిండిలేక విప్రులు ఋషులు మలమల మాడుతున్న సమయంలో గౌతమమహర్షి తన తపోబలంతో పంటలు పండించి వారికి అన్నపానాదులకు వీలు కల్పించాడు.కాని మానవుల్లో నాటినుండి నేటివరకు అణువణువున నిండిన అసూయాద్వేషాలు--ఎంతటివారినైనా లోబరుచుకొంటాయనే నగ్నసత్యాన్ని ఋషులు సైతం ఋజువు చేశారు.రాగద్వేషాలకతీతులైన ఋషుల అసూయే "గోదావరి నది "పుట్టుకకు మూలకారణ మైంది.ఆకలి తీర్చడానికి గౌతముడు పండించిన పంటను చూసి ఋషులు మాయాగోవును సృష్టించి పంటపొలాలపైకి పంపుతారు.గౌతముడు చిన్న దర్భతో అదలించగానే ఆ గోవు మరణిస్తుంది.గోహత్య చేశాడని నిందిస్తూ ఋషులు ఆప్రాంతం వీడి వెళ్ళిపోతారు. మనోవేదనతో గౌతముడు శివుని గూర్చి తపస్సు చేసి శివుని మెప్పించి గంగను రప్పిస్తాడు.ఆ గంగే గోదావరి పేరుతో ప్రవహించి మరణించిన గోవుకు సద్గతి కల్గించింది.ఆస్థలం "గోష్పాదక్షేత్రం "గా ఆంధ్రదేశంలో ప్రసిద్ధి చెందింది.ఈ గోదావరీనది దక్షణగంగగా ఖ్యాతినంది ఆంధ్రదేశాన్ని సస్యశ్యామలం చేస్తూ " అన్నపూర్ణగా "దేశంలో ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టింది.ఈ నది ధవళేశ్వరం వద్ద" 7 "పాయలుగా చీలుతుంది.అవి: 1 .గౌతమి. 2 వశిష్ట. 3.వైనతేయ. 4 .ఆత్రేయ. 5 .భరద్వాజ. 6 .తుల్యభాగ. 7. కశ్యప . ఇందులో మొదటిమూడు ముఖ్యమైన నదులు కాగా మిగిలినవి అంతర్వాహినులు. పవిత్ర గోదావరికి పుష్కరాలు జరగబోతున్నాయి.పుష్కరమంటే 12సంవత్సరాల కాలం.పుష్కరుడనే మహానుభావుని వలన ఈపేరు వ్యాప్తిలో వచ్చింది.పూర్వం తుందిలుడనే వ్యక్తి ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ వుండేవాడు.ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి అతని అనుగ్రహం పొంది శివునిలో స్థానం కావాలని వరం కోరుతాడు.శివుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన " జల"మూర్తిలో స్థానమిచ్చాడు.దీనితో మూడున్నర కోట్ల పుణ్యనదులకు అధికారి అయ్యాడు.సకలజీవరాశిని పోషించే శక్తిని పొందాడు.ఇటువంటి శక్తిని సంస్కృతంలో"పుష్కరం "అంటారు.ఇలా తుందిలుడు పుష్కరుడైనాడు. తరువాత సృష్టికార్యంలో భాగంగా బ్రహ్మదేవుడు శివుని ప్రార్థించి పుష్కరుని ఇవ్వమంటాడు.పుష్కరుడు అంగీకరించడం వల్ల బ్రహ్మ తన కమండలంలో వుంచుకొంటాడు.ఆ తరువాత దేవగురువైన బృహస్పతి జలం కోసం బ్రహ్మను ప్రార్థిస్తాడు.కాని పుష్కరుడు బ్రహ్మను వదలడానికిష్ట పడడు.ఈ ముగ్గురూ ఓ అవగాహన కొస్తారు.గ్రహరూపంలో గురువు( బృహస్పతి )మేషాది 12 రాశులలో వున్నప్పుడు 12 రోజులు మిగిలిన కాలమంతా మధ్యాహ్న సమయంలో '2'ముహూర్తాల కాలం పుష్కరుడు బృహస్పతిలో వుండాలని నిర్ణయిస్తారు.ఆ సమయంలో దేవతలందరూ బృహస్పతి అధిపతిగా వున్న నదికి పుష్కరునితో వస్తారు.కావున పుష్కరకాలంలో నదీస్నానం పుణ్యకరం.ఇది ఈ ఏడు అధిక ఆషాఢ బహుళ త్రయోదశిన ఆరంభమౌతుంది.గురువు( బృహస్పతి )సింహరాశిలో వున్నప్పడు గోదావరీనదికి పుష్కరాలు వస్తాయి.14-6-15 నుండి 25-6-15 వరకు వుంటుంది.మొదటి పన్నెండు రోజులు ఆదిపుష్కరమని చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. గోదావరీనదికి పుష్కరాలు జరిగే సందర్భంలో నదీమతల్లికి నమస్కరిస్తూ ... సినీకవి వ్రాసిన " వేదంలా ఘోషించే గోదావరీ "అంటూ అ నదీమ తల్లికి శతకోటి వందనాలు సమర్పిద్దామా.!
No comments:
Post a Comment