గోదావరి పుష్కరాలు - అచ్చంగా తెలుగు

గోదావరి పుష్కరాలు

పెయ్యేటి రంగారావు


మొత్తం రాశులు పన్నెండు. నవగ్రహాలలో ఒకరైన గురుడు ఒక్కక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆ రకంగా బృహస్పతి (గురుడు కు మరోపేరు ) ఒక్కొక్క రాశిలో ఉన్న కాలంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆయన మేషరాశిలో ఉన్న కాలంలో గంగానదికి, వృషభరాశి లో వున్నప్పుడు నర్మదానదికి, మిథునరాశిలో వున్నప్పుడు సరస్వతీ నదికి, కర్కాటకంలో వున్నప్పుడు యమునానదికి, సింహరాశిలో వున్నప్పుడు గోదావరికి, కన్యారాశిలో వున్నప్పుడు కృష్ణానదికి, తులలో వున్నప్పుడు కావేరికి, వృశ్చికంలో వున్నప్పుడు తామ్రపర్ణికి, ధనుస్సులో వున్నప్పుడు పులిందినికి, మకరంలో వున్నప్పుదు తుంగభద్రకు, కుంభరాశిలో వున్నప్పుడు సింధునదికి, మీనరాశిలో వున్నప్పుడు ప్రాణహితకు పుష్కరాలు వస్తాయి.  పుష్కరకాలంలో ఆ యా నదుల్లో స్నానం చేసి, దాన ధర్మాదులు చెయ్యడం వలన పాప విముక్తి కలుగుతుంది.  అక్కడ తర్పణాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే పితృదేవతలకు ఊర్ధ్వగతి లభిస్తుంది.
          శ్రీరామ రామ రామ అని రామనామాన్ని ముమ్మారు స్మరించగానే విష్ణుసహస్రనామస్తోత్రం పఠించిన పుణ్యం లభిస్తుంది.  అలాగే గోదావరి, గోదావరి, గోదావరి అని మూడు సార్లు స్మరించగానే సర్వపాపాలు పరిహారమవుతాయి.  గంగ, గోదావరి నదులు వేరు వేరు నామాలతో వున్నప్పటికి, అవి ప్రవహించే ప్రదేశాలు వేరు వేరైనప్పటికీ, నిజానికి ఆ రెండు నదులు ఒక్కటే.           పూర్వము దేవతలందరికి కంటకంగా పరిణమించిన బలిచక్రవర్తిని సంహరించడానికి శ్రీమహా విష్ణువు వామనుడిగా అవతరించాడు.  ఆయన బలినుండి మూడు అడుగులు దానంగా పరిగ్రహించాడు.  మొదటి అడుగు భూమండాలన్నంతటినీ ఆక్రమించింది.  రెండవ అడుగు ఆకాశాన్ని ఆక్రమించుకుంది.  ఇక మూడవ అడుగు మోపడానికి స్థలం లేకపోయేసరికి బలిచక్రవర్తి తన శిరసుపై మోపమని విష్ణువుని ప్రార్థించాడు.  అంతట, విష్ణుమూర్తి తన పాదాన్ని ఆయన శిరసుపైనుంచి, ఆయనను అధ:పాతాళానికి తొక్కేసాడు.  అప్పుడు ఊర్ధ్వలోకాలలో వున్న బ్రహ్మ అన్ని నదుల జలాలను తన కమండలంలో నింపుకుని ఆ పాదాన్ని కడిగి తన శిరసుపైన చల్లుకున్నాడు.  అల్లాగే దేవతలందరూ ఆ పవిత్రజలాన్ని తమ తమ శిరసులపై చల్లుకున్నారు.  విష్ణుపాద ప్రక్షాళన చేసిన ఆ నీరు నాలుగు దిక్కులకు ప్రవహించింది.  తూర్పుదిక్కుగా ప్రవహించిన ఆ జలం మందాకిని నదియై దేవతల, గరుడ, గంధర్వ, కిన్నర, యక్ష, విద్యాధరాది దేవయోనుల వారల పూజలందుకొంటోంది.  ఇక పశ్చిమదిశగా ప్రవహించిన ఆ దివ్యజలం వైకుంఠంలో విరజానదిగా అయినది.  దక్షిణదిశగా ప్రవహిస్తున్న జలం మహోధ్ధృతంగా ప్రవహిస్తున్న గంగానది కాగా ఈశ్వరుడు ఆ వేగాన్ని నియంత్రించి తన శిరస్సునందు ధరించాడు.           ఐతే గంగను శివుడు తన తలపైకెత్తుకోగానే పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది.  వెంటనే శివుడిని, గంగను వేరు చెయ్యమని వినాయకుడిని నియమించింది.  గణపతి కూడా ఆ పనిని నిర్వర్తించడానికి తగిన సమయం కోసం వేచి చూడసాగాడు.           ఇది ఇలా వుండగా, గౌతమమహర్షి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆయనకు ఒక చక్కని వరాన్ని ప్రసాదించాడు.  ఆ వరప్రభావం వలన గౌతమమహర్షి తన చేతితో కొద్దిపాటి విత్తనాలు ఏ క్షేత్రంలో చల్లినా, ఆఖరికి అది చవిటి భూమి అయినప్పటికీ, అక్కడ కొద్ది నిముషాలలోనే పైరు ఏపుగా ఎదిగి, సమృధ్ధిగా ధాన్యం పండేది.  అందువలన ఆయన ఆశ్రమప్రాంతంలో కరువు కాటకాలు అసలు వుండేవి కావు.  ఇది గమనించిన విఘ్నేశ్వరుడు ఒక మాయాగోవును సృష్టించి ఆ పైరుమీదకు వదిలాడు.  ఆ ఆవు ఏపుగా పండిన పైరును నమిలేస్తుంటే గౌతమమహర్షి దానిని అదిలించడానికి ఒక దర్భను తీసుకొని, ' హరి హరీ ' అని దానిమీదకు విసిరాడు.  ఆ ఎండు గడ్డిపరక కాస్తా ఆగ్నేయాస్త్రమై ఆవుమీదకు వెళ్ళేసరికి, ఆ ఆవు ఆ తాపాన్ని భరించలేక విపరీతమైన వేదనతో ఆ ప్రాంతమంతా కలియదిరిగి తూర్పుదిశ వైపుకు పరిగెత్తిపోయింది.  అది వేదనతో కలయదిరిగిన ప్రాంతం పశువేద అన్న పేరుతో పిలవబడుతోంది.  ఆ విధంగా ఆ ఆవు విపరీతమైన వేదనను అనుభవించి ప్రాణాలు వదిలింది.  అప్పుడు దేవతల సలహా ప్రకారం ఆ గోవు మీదుగా గంగను ప్రవహింపజేసి తన పాపానికి పరిహారం చేసుకోదలిచి గౌతముడు శివుని అనుగ్రహం కోరి తపస్సు చేసాడు.  అప్పుడు శివుడు అనుగ్రహించి, తన జటలలో బంధింపబడిన గంగను, ఒక జట పెరికి, ఆ జటను పిండి, భూమిపైకి వదిలినాడు.  భగీరథునికి అనుగ్రహంగా వరమిచ్చి వదిలిన గంగ భాగీరథి అయింది.  అదే విధంగా గౌతముని అనుగ్రహించి విడువబడిన గంగ, ఆమె అభీష్టం మేరకు నాసిక్ అన్న ప్రదేశంలో,  ఆవు నోటినుండి వెలువడుతూ గౌతమిగా విరాజిల్లుతోంది.  గంగమ్మ కోరిక మేరకు పరమేశ్వరుడు అక్కడ త్ర్యంబకేశ్వరుడిగా వెలిసాడు.           గోవు కళేబరం మీదుగా ప్రవహించింది కనుక గౌతమి, గోదావరి అయింది.  గోదావరి ప్రవహిస్తున్న ఏ ప్రాంతంలో స్నానమాచరించినా పుణ్యం  లభిస్తుంది.  పుష్కరుడు మూడుకోట్ల యాభయి లక్షల తీర్థాలను కలుపుకుని పుష్కరాల సమయంలో ఆ యా నదులలో వుంటాడు.  ప్రత్యేకించి పుష్కరం ప్రారంభమయిన మొదటి పన్నెండు రోజులు, సంవత్సరాంతంలో చివరి పన్నెండు రోజులు ఆ నదులలో వుంటాడు కనుక మొదటి పన్నెండు రోజులు ఆది పుష్కరాలని, చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరాలని అంటారు.  ఐతే ఈ అంత్య పుష్కరోత్సవం ఒక్క గోదావరికి మాత్రమే వున్నది.  వారణాసికి వెళ్ళి వచ్చిన వారు అక్కడి గంగాజలాన్ని తీసుకు వచ్చి గోదావరిలో కలుపుతారు.  అప్పుడు గోదావరి గంగను పవిత్రం చేస్తుంది అన్న భావన.  అంటే గంగను కూడా పవిత్రం చెయ్యగల శక్తి గోదావరికి వుంది.  గోదావరి కన్న గొప్ప నది, గోదావరి పుష్కరాల కన్న పుణ్యకాలం వేరే ఏవీ లేవు.            గోదావరి మహారాష్ట్రలో ఉద్భవించి, నిజామాబాద్ గుండా తెలంగాణలో ప్రవేశించి, బాసర, వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం మీదుగా ప్రవహించి, పాపికొండల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది.   రాజమండ్రి నుంచి ధవళేశ్వరం వరకు ప్రవహించిన గోదావరి అక్కడ ఏడు పాయలుగా విడిపోతుంది.  ఆ సప్త గోదావరులు, తుల్య, ఆత్రేయ, భరద్వాజ, గౌతమి, వృధ్ధగౌతమి, కౌశిక, వశిష్ట.  సఖినేటిపల్లి రేవు దగ్గర గోదావరి అవతలి గట్టు నరసాపురంలో వుంది.  నరసాపురంలో ప్రవహించే గోదావరిని వశిష్ట గోదావరి అంటారు.  అక్కడినించి గోదావరి అంతర్వేది వరకు ప్రయాణం చేసి అక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది.  అంతర్వేదిలో గోదావరి సముద్రంలో కలిసే చోటును అన్నా చెల్లెళ్ళ గట్టు అంటారు.  అక్కడ భక్తులు స్నానమాచరించి పునీతులవుతూ వుంటారు.  సముద్రానికి చేరువలో గోదావరి వుండటం చేత నరసాపురంలో గోదావరి నీరు చాలా ఉప్పగా వుంటుంది.  ఒక్క వరదల సమయంలో మాత్రం రాజమండ్రి, అమలాపురం ల మీదుగా నీరు నరసాపురం వైపుకు ప్రవహిస్తుంది కనుక అప్పుడు నరసాపురంలో గోదావరి నీళ్ళు తియ్యగా మారతాయి.           బాపుగారు పుట్టింది నరసాపురంలోనే.  ఆయనకు గోదావరి అంటే అమితమైన ప్రీతి.  అందుకనే గోదావరి అందాలను, సోయగాలను, వైభవాలను ఆయన తన అందాలరాముడు చిత్రంలో అత్యంత కమనీయంగా చూపించారు.  గోదావరీ తీరప్రాంత రమణీయకతకు అబ్బురపడే, ఉయ్యాల-జంపాల, మూగమనసులు, మిలన్, జాతర వంటి చిత్రాలను నరసాపురం ప్రాంతాలలో చిత్రీకరించారు.  నరసాపురం నించి సఖినేటిపల్లికి, సఖినేటిపల్లి నుంచి నరసాపురానికి రోజూ వందలకొద్దీ జనం నాటుపడవల మీద రేవు దాటుతూ వుంటారు.  సాయంత్రాలు నాటు పడవల మీద సరదాగా వ్యాహ్యాళికి కూడా వెడుతూ వుంటారు.           ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు అధికాషాఢ బహుళ త్రయోదశి, మంగళవారం అనగా ది.14-07-2015 న ఉదయం గం.06-26 ని.లకు మొదలవుతాయి.  ది.25-07-2015 నాడు ఆదిపుష్కరాలు ముగుస్తాయి.  ఇక అంత్యపుష్కరాలు ది.31-07-2016 న మొదలై, ది.11-08-2016 న ముగుస్తాయి.  పుష్కరాలలో గోదావరిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుంది.  అందువల్ల అందరూ ఈ పుష్కరాలలో గోదావరీ స్నానమాచరించి, దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వర్తించి, పితృదేవతలకు తిలతర్పణాలు వదిలి తరిస్తారని తలుస్తాను.
సర్వేజనాస్సుఖినోభవంతు.
__________________

No comments:

Post a Comment

Pages